ఆర్ధిక రంగం

2022 - 23లో వృద్ధి 8.5 శాతమే

వచ్చే ఆర్థిక సంవత్సరం (2022 - 23)లో భారత వృద్ధిరేటు అంచనాలను 10.3 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గిస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ ప్రకటించింది. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పరుగులు తీయడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇందుకు కారణాలుగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 - 22) వృద్ధి అంచనాలను మాత్రం గతం కంటే 0.6 శాతం పెంచి 8.7 శాతం చేసింది. 2023 - 24లో వృద్ధిరేటు 7 శాతంగా ఉండొచ్చని ‘గ్లోబల్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ - మార్చి 2022’లో ఫిచ్‌ వెల్లడించింది. కొవిడ్‌-19 పరిణామాల నుంచి రికవరీకి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ రూపంలో ఎదురుదెబ్బ తగిలిందని, వృద్ధి తగ్గి, ద్రవ్యోల్బణం పెరగడానికి ఇది దారితీయొచ్చని తెలిపింది. అంతర్జాతీయ జీడీపీ 0.7 శాతం తగ్గి 3.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. డిసెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ బలంగా ఉంది. అయితే కొవిడ్‌ మునుపటి ధోరణి కంటే తక్కువగానే ఉంది. డిసెంబరు త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 7 శాతం దాటొచ్చని ఫిచ్‌ వివరించింది.

4.86 మిలియన్‌ బ్యారెళ్లకు చేరిన చమురు దిగుమతి

దేశ చమురు దిగుమతులు ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 5% పెరిగి రోజుకు 4.86 మిలియన్‌ బ్యారెళ్లకు చేరాయి. 2021 ఫిబ్రవరిలో తక్కువగా దిగుమతి చేసుకున్నందున, అప్పటితో పోలిస్తే ఈసారి 24 శాతం పెరిగాయి. 2020 డిసెంబరు తర్వాత దిగుమతులపరంగా గత నెలలోనే గరిష్ఠంగా చమురు వచ్చిందని వాణిజ్య వర్గాల సమాచారం. దేశ ముడి చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే భారత్‌ తీర్చుకుంటోంది. అది కూడా మధ్య ప్రాచ్య దేశాలపైనా ఎక్కువగా ఆధారపడుతూ వస్తోంది.

భవిష్య నిధిపై వడ్డీరేటు తగ్గింపు

వేతన జీవులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిల్వలపై ఏటా ఇచ్చే వడ్డీని 0.4 శాతం తగ్గించింది. గువాహటిలో సమావేశమైన ఈపీఎఫ్‌వో ట్రస్టీ బోర్డు 2021-22 ఏడాదికి వడ్డీ రేటుని 8.1 శాతంగా నిర్ణయించింది. గత ఏడాది ఇది 5 శాతంగా ఉంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మంది చందాదారులపై ప్రభావం చూపనుంది. దాదాపు 44 ఏళ్ల తరువాత ఇదే అత్యంత తక్కువ వడ్డీరేటు కావడం గమనార్హం.

ఈపీఎఫ్‌ పథకం 1952లో అమల్లోకి వచ్చింది. ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తిచేసుకోనుంది. ఈపీఎఫ్‌వోకు వచ్చిన చందా సొమ్మును షేర్లు (ఈక్విటీ), బ్యాంకుల్లో పెట్టుబడిగా పెట్టి, ఆ మొత్తంపై వచ్చే లాభాన్ని వడ్డీగా చందాదారుల ఖాతాల్లో జమచేస్తోంది. గతంలో ఈపీఎఫ్‌వో బోర్డు సొంతంగా నిర్ణయాలు తీసుకుని వడ్డీ ఇచ్చేది. గత పదేళ్లుగా ఆర్థికశాఖ సూచన మేరకు వడ్డీరేట్లు ఖరారవుతున్నాయి. చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్లతో పోలిస్తే ఈపీఎఫ్‌వో ఇచ్చే వడ్డీ రేటు ఎక్కువగా ఉండటంతో వేతన జీవులు పీఎఫ్‌ ఖాతాల్లో స్వచ్ఛంద భవిష్యనిధి (వీపీఎఫ్‌) కింద అదనంగా జమ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని నియంత్రించేందుకు అదనపు పెట్టుబడులు (ఈపీఎఫ్, వీపీఎఫ్‌ కలిపి) రూ.2.5 లక్షలు దాటితే ఆ మొత్తంపై వడ్డీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. 1977-78లో 8 శాతం వడ్డీ ఉంది.


2022 - 23లో భారత వృద్ధి 7 - 7.2 శాతమే

వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022 - 23) భారత జీడీపీ వృద్ధి రేటు 7 - 7.2 శాతానికి పరిమితం కావొచ్చని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది.

గతంలో అంచనా వేసిన 7.6 శాతాన్ని సంస్థ తగ్గించింది. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలో వినియోగదారు సెంటిమెంట్‌ ప్రతికూలంగా మారడంతో వృద్ధి తగ్గొచ్చని పేర్కొంది.

ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, ఒకవేళ ఈ ధరలు 3 నెలల పాటు అధికంగా ఉంటే జీడీపీ వృద్ధి 7.2 శాతంగా, చాలా కాలం అలాగే కొనసాగితే వృద్ధి 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర పంత్, ప్రధాన ఆర్థికవేత్త సునీల్‌ కుమార్‌ సిన్హా వెల్లడించారు.


భారత్‌లో వచ్చే 20 ఏళ్ల పాటు 8% వృద్ధి

వచ్చే 20 ఏళ్ల పాటు భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా 8% వృద్ధిని నమోదు చేయగలదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. తద్వారా 1.5 కోట్ల కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు ఏటా 3.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వస్తారని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ మూలధన పెట్టుబడుల వ్యూహం వల్ల ఇది సాధ్యమవుతుందన్నారు. అసోచామ్‌ వార్షిక సాధారణ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘వచ్చే కొన్నేళ్లలో బడ్జెట్‌లో మూలధన పెట్టుబడుల స్థాయిని జీడీపీలో 27% నుంచి 35 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 5-6 ఏళ్లకు పైగా మూలధన పెట్టుబడుల వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు.

‘జర్మనీ, అమెరికా, జపాన్, చైనా, దక్షిణ కొరియాలు పలు సంవత్సరాల పాటు మూలధన పెట్టుబడుల మార్గాన్నే అనుసరించాయి. 2021 ఆర్థిక సంవత్సరం చివరి కల్లా దేశ సాధారణ జీడీపీ రూ.198 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో రూ.116 లక్షల కోట్లు వినియోగం ద్వారా వచ్చాయి. జీడీపీలో 59 శాతం వాటాకు ఇది సమానం. పెట్టుబడుల ద్వారా వచ్చిన రూ.53 లక్షల కోట్లు జీడీపీలో కేవలం 27 శాతానికే సమానం. కాబట్టి మరిన్ని మూలధన పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింద’ని పేర్కొన్నారు.

కేంద్రానికి స్థూల పన్నుల ఆదాయం రూ.20 లక్షల కోట్లుగా ఉండగా.. ఇందులో రాష్ట్రాల వాటా మినహాయిస్తే నికరంగా రూ.15 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుంది. పన్నేతర ఆదాయం రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుంది. మొత్తం మీద భారత ప్రభుత్వానికి రూ.18 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. గతేడాది బడ్జెట్‌లో రూ.5.5 లక్షల కోట్ల మేర మూలధన పెట్టుబడులు పెట్టాం. జీడీపీ లక్ష్యమైన రూ.225 లక్షల కోట్లను అధిగమించి రూ.232 లక్షల కోట్లకు చేరింది. రూ.5.5 లక్షల కోట్ల మూలధన ఫలితం ఇపుడు మనకు కనిపించింది. అందుకే వీటిని రూ.7.5 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించాం. అపుడు ఆర్థిక వ్యవస్థకు రూ.22.5 లక్షల కోట్లు జత చేరుతుందని అంచనా’ అని అన్నారు.


మారుతీ సుజుకీకి కొత్త ఎండీ, సీఈఓగా హిసాషి టకూచి

దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) నూతన ఎండీ, సీఈఓగా హిసాషి టకూచిని నియమించినట్లు కంపెనీ తెలిపింది. ఈ నియామకం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎండీ, సీఈఓగా ఉన్న కెనిచి అయుకవా పదవీ కాలం మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో కొత్త సారథిని బోర్డు ఎంపిక చేసిందని కంపెనీ తెలిపింది. కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అయుకవాను పూర్తి కాల డైరెక్టరుగా కొనసాగించనున్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ హోదాలో ఆయన సెప్టెంబరు 30 వరకు ఉండటంతో పాటు కంపెనీకి మార్గదర్శనం చేయనున్నారని మారుతీ వెల్లడించింది. వాటాదార్ల ఆమోదం తర్వాత ఈ నియామకాలు అమల్లోకి వస్తాయి.

‣ టకూచి 1986లో సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌లో (ఎస్‌ఎంసీ) చేరారు. అంతర్జాతీయ కార్యకలాపాలు చూసుకునే ఈయన 2019 జులై నుంచి మారుతీ సుజుకీ బోర్డులో కొనసాగుతున్నారు. 2021 ఏప్రిల్‌ నుంచి జాయింట్‌ ఎండీగా (కమర్షియల్‌) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


భారీగా తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు మార్చి 11తో ముగిసిన వారానికి 9.646 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.73000 కోట్లు) తగ్గి 622.275 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.46.67 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తుల తగ్గుదలే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు 394 మిలియన్‌ డాలర్లు పెరిగి 631.92 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 11.108 బిలియన్‌ డాలర్లు తగ్గి 554.359 బిలియన్‌ డాలర్లకు చేరాయి. బంగారు నిల్వలు 1.522 బిలియన్‌ డాలర్లు పెరిగి 43.842 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) వద్ద దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌) 53 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.928 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశీయ నిల్వలు 7 మిలియన్‌ డాలర్లు తగ్గి 5.146 బిలియన్‌ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. 2021 సెప్టెంబరు 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు జీవనకాల గరిష్ఠమైన 642.453 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.48.18 లక్షల కోట్ల)కు చేరింది.


ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలు

సూక్ష్మరుణ సంస్థలు ఇష్టం వచ్చినట్లు వడ్డీ, రుసుములు వసూలు చేయకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశాలు జారీచేసింది. రుణాలపై వడ్డీ, ఇతర ఫీజులకు సంబంధించి పరిమితిని విధించింది. ‘రూ.3 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఇచ్చే పూచీకత్తు రహిత రుణాన్నే’ సూక్ష్మ రుణంగా ఆర్‌బీఐ నిర్వచించింది. ఒక రైడర్‌తో వడ్డీ రేట్లను సంస్థలు నిర్ణయించుకోవచ్చని తెలిపింది. గతంలో మూడు నెలలకోసారి ఆర్‌బీఐనే రేట్లు ప్రకటించేది. ‘మాస్టర్‌ డైరెక్షన్‌-రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్షన్స్‌-2022’ పేరిట జారీ అయిన ఈ మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

‣ సూక్ష్మరుణాల వడ్డీలు, ఇతరత్రా ఛార్జీలపై పరిమితి ఉంటుంది. అధిక వడ్డీలు, ఫీజులు, ఛార్జీలు వసూలు చేయరాదు.

‣ అన్ని నియంత్రిత సంస్థ(ఆర్‌ఈ)లు రుణస్వీకర్తలకు, తాము వసూలు చేసే ఛార్జీల సమాచారాన్ని ప్రామాణీకరించిన సరళ పత్రం(ఫాక్ట్‌షీట్‌)లో అందించాలి. అంతకంటే అధికంగా వసూలు చేయరాదు.

‣ సూక్ష్మ రుణాలను ముందస్తుగా చెల్లిస్తే.. అపరాధ రుసుము విధించరాదు. చెల్లింపులు ఆలస్యమైతే మిగిలిన రుణ మొత్తంపైనే పెనాల్టీని లెక్కగట్టాలి.

‣ సూక్ష్మ రుణాలన్నీ.. పూచీకత్తు లేనివి కాబట్టి వీటిని రుణ స్వీకర్తల డిపాజిట్‌ ఖాతాతో అనుసంధానించరాదు.

‣ వ్యక్తుల నెలవారీ ఆదాయంలో గరిష్ఠంగా 50 శాతం వరకే అన్ని ప్రస్తుత రుణాల చెల్లింపులు ఉండాలి. ఆ పరిమితిని సాధించే వరకు కొత్త రుణాలివ్వరాదు.

‣ రుణస్వీకర్తకు అర్థమయ్యే భాషలోనే రుణ ఒప్పందం ఉండాలి.

‣ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థలు ఇచ్చే అన్ని సూక్ష్మ రుణాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.


ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 13.11%

టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 13.11 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గినా.. ముడి చమురు, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు కారణం. 2021 ఏప్రిల్‌ నుంచి వరుసగా 11వ నెలలోనూ ఇది రెండంకెల స్థాయిలో నమోదైంది. 2022 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 12.96 శాతంగా నమోదు కాగా, 2021 ఫిబ్రవరిలో 4.83 శాతంగా నమోదైంది.

ఫిబ్రవరిలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.07 శాతానికి చేరింది. ఇది 8 నెలల గరిష్ఠం. గత జనవరిలో ఇది 6.01 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది.


విమాన మరమ్మతు సేవలపై జీఎస్‌టీ 5 శాతానికి తగ్గింపు

విమానాలకు దేశీయంగా నిర్వహణ, మరమ్మతు (ఎమ్‌ఆర్‌ఓ) సేవలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను 18% నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విమానాల ఎమ్‌ఆర్‌ఓ సేవలపై జీఎస్‌టీ రేటును తగ్గించాలని పరిశ్రమ వర్గాలు ఎంతో కాలంగా కోరుతున్నాయి. జీఎస్‌టీ రేటు భారీగా తగ్గడం వల్ల దేశీయంగా ఎమ్‌ఆర్‌ఓ సేవల కేంద్రాలు ఏర్పాటు వేగవంతం అవుతుందని అంచనా. దేశీయంగా 8 విమానాశ్రయాల్లో ఎంఆర్‌ఓ సేవల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నట్లు గత సెప్టెంబరులో పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల ఎత్తివేత

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై అన్ని రకాల ఆంక్షలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఎత్తివేసింది. అలాగే కొత్త డిజిటల్‌ సేవలను ప్రారంభించేందుకు అనుమతినిచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘డిజిటల్‌ 2.0 ప్రోగ్రామ్‌ కింద చేపట్టాలని భావించిన వ్యాపార కార్యకలాపాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసినట్లు 2022 మార్చి 11న పంపిన లేఖ ద్వారా ఆర్‌బీఐ తెలియజేసింద’ని వివరించింది. రుణాల మంజూరు, పెట్టుబడులు, చెల్లింపులు లాంటి సేవలను మరింత సులభతరం చేసేందుకు డిజిటల్‌ 2.0 ప్రోగ్రామ్‌ కింద పలు ఉత్పత్తులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూపొందించింది. అయితే పలు మార్లు సాంకేతిక లోపాల సంఘటనలు చోటుచేసుకోవడంతో కొత్త కార్డుల జారీ, డిజిటల్‌ సేవలను ప్రారంభించడంపై బ్యాంకుపై 2020 డిసెంబరులో ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. సాంకేతిక లోపాల పరిష్కారానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చర్యలు చేపట్టడంతో గతేడాది ఆగస్టులో కార్డుల జారీపై నిషేధాన్ని ఎత్తివేసింది. కొత్త డిజిటల్‌ సేవల ప్రారంభంపై నిషేధాన్ని మాత్రం కొనసాగించింది.

జీఎస్‌టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లు

దేశీయంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇవి 2020 ఫిబ్రవరి (రూ.1,05,366 కోట్ల)తో పోలిస్తే 26%, 2021 ఫిబ్రవరి (రూ.1,13,143 కోట్ల)తో పోలిస్తే 18% అధికం. ఈ ఏడాది జనవరి వసూళ్లయిన రూ.1,40,986 కోట్లతో పోలిస్తే 5.64% తగ్గాయి. ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి జనవరి కంటే ఆదాయం తగ్గినట్లు విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించడం ఇది తొమ్మిదోసారి కాగా, రూ.1.30 లక్షల కోట్లను మించడం 5వ సారి.

ఫిబ్రవరి వసూళ్లలో సీజీఎస్‌టీ వాటా రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ వాటా రూ.30,779 కోట్లు, ఐజీఎస్‌టీ వాటా రూ.67,471 కోట్లు (దిగుమతులపై లభించిన రూ.33,837 కోట్లు సహా), సెస్‌ రూ.10,340 కోట్లు (దిగుమతులపై లభించిన రూ.638 కోట్లు కలిపి) ఉంది. సర్దుబాట్ల తర్వాత ఫిబ్రవరి ఆదాయంలో కేంద్ర జీఎస్‌టీకి రూ.50,782 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీకి రూ.52,688 కోట్లు చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో 19%, తెలంగాణలో 13% వృద్ధి: ఫిబ్రవరి జీఎస్‌టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 19%, తెలంగాణలో 13% వృద్ధి నమోదైంది. 2021 ఫిబ్రవరిలో ఏపీకి రూ.2,653 కోట్ల ఆదాయం రాగా ఈసారి రూ.3,157 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ ఆదాయం రూ.3,636 కోట్ల నుంచి రూ.4,113 కోట్లకు చేరింది. జాతీయస్థాయిలో రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం ఈనెలలో సగటున 12% పెరగ్గా, తెలుగు రాష్ట్రాలు రెండూ అంతకంటే ఎక్కువే సాధించాయి.