రాష్ట్రీయం -ఆంధ్ర ప్రదేశ్
11 బిల్లులకు శాసనసభ ఆమోదం
మార్చి 8న మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మొత్తం 12 రోజుల్లో 61.45 గంటలపాటు సమావేశాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా ఇందుకు సంబంధించిన వివరాలను సభాపతి తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 11 బిల్లులను శాసనసభ ఆమోదించింది. చివరి రోజు కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదికను సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు అడిగిన 96 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. 36 స్టార్ ప్రశ్నలు, మరో మూడు స్టార్ రహిత ప్రశ్నలు సభలో ప్రస్తావనకు వచ్చాయి. 103 మంది సభ్యులు సభలో మాట్లాడారు. ఐదు అంశాలపై లఘు చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లులకు ఆమోదం
రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లు - 2022, రాష్ట్ర ద్రవ్య వినిమయ నం-2 బిల్ - 2022ను మండలి ఆమోదించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ.. మొత్తం 12 రోజుల్లో 33 గంటల పాటు సభ జరిగిందన్నారు. స్టార్ ప్రశ్నలు 98, లఘు ప్రశ్నలు 17, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు 4, మొత్తం 8 బిల్లులను సభ ఆమోదించిందని పేర్కొన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లు - 2022కు శాసనసభ ఆమోదం తెలిపిందని సభాపతి సీతారాం ప్రకటించారు.
రెండు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం
మంత్రులు ప్రవేశపెట్టిన రెండు బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించే బిల్లు, ఏపీ మైనారిటీ కో - ఆపరేటివ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ బిల్లును మంత్రి అంజాద్ బాషా సభలో ప్రవేశపెట్టారు. వీటిని సభ్యులు ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్ట సవరణ బిల్లులకు ఆమోదం
ఏపీ కార్మిక సంక్షేమ నిధి చట్ట సవరణ, ఏపీ పరస్పర సహాయ సహకార సంఘాల చట్ట సవరణ బిల్లులను మంత్రులు గుమ్మనూరు జయరాం, కన్నబాబు శాసనసభలో ప్రవేశ పెట్టారు. వీటికి సభ ఆమోదం తెలిపింది. ఏపీ కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యుడిగా వైస్ ఛైర్మన్‌ను ఉంచేందుకు కార్మిక సంక్షేమ నిధి చట్టాన్ని సవరించారు. మ్యాక్స్ చట్టం కింద పని చేస్తున్న ఉద్యోగుల నుంచి వృత్తి పన్ను వసూలు, మ్యాక్స్ చట్టం నుంచి సహకార చట్టంలోకి వచ్చేందుకు వీలు కల్పించేలా ఏపీ పరస్పర సహాయ సహకార సంఘాల చట్ట సవరణ తీసుకొచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టిన ఏపీ వ్యాట్‌కు సంబంధించిన బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల బడ్జెట్ డిమాండ్లకు సభ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మూడు బిల్లులకు ఆమోదం లభించింది. తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించిన ఏపీ ఛారిటబుల్, హిందూ మతపరమైన, దేవాదాయ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపారు.
రోటరీ వొకేషనల్ మంత్ ఎక్స్‌లెన్స్ విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం
గిరిజన ప్రాంతాలకు రోటరీ సేవలను విస్తరించి పేదలకు అండగా నిలవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కోరారు. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో రోటరీ వొకేషనల్ మంత్ ఎక్స్‌లెన్స్ విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోటరీ పురస్కార్ - 2022ను అందుకున్నారు. తన సొంత జిల్లా నుంచి ఈ పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఎక్కువగా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నారని వెల్లడించారు.
సంగం బ్యారేజికి గౌతమ్‌రెడ్డి పేరు
కాంగ్రెస్ పార్టీతో విభేదించి తాను బయటకొచ్చినప్పుడు తనతో పాటు ఉండటానికి అతి కొద్దిమందే సాహసించారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. తనకు మొదటి నుంచి వెన్నంటి ఉన్న కొద్దిమందిలో దివంగత గౌతమ్‌రెడ్డి ఒకరని సీఎం వివరించారు. అలాంటి గొప్ప స్నేహితుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై శాసనసభ సంతాపం తెలిపింది. సీఎం జగన్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజి ప్రాజెక్టుకు గౌతమ్‌రెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు.
ప్యానల్ ఛైర్మన్లుగా డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, అంగర రామ్మోహనరావు, పోతుల సునీతలను నియమిస్తున్నట్లు ఛైర్మన్ మోషేను రాజు ప్రకటించారు.
ఏపీలో ఉగాది నుంచి కొత్త జిల్లాలు
ఏపీలో గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలనకు తన ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించిందన్నారు. రానున్న ఉగాది (ఏప్రిల్ 2న) నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ముఖ్యాంశాలు:-
- వివిధ సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానంలో ఇప్పటివరకు రూ.1,32,126 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసినట్లు వివరించారు.
- రాష్ట్రంలో 54 సాగునీటి ప్రాజెక్టుల్లో 14 మొత్తంగా, 2 పాక్షికంగా పూర్తయ్యాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు 77.92% పూర్తయింది. 2023 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం వేగంగా పనులు చేస్తోంది.
- సౌర విద్యుత్తు ప్రాజెక్టు నుంచి ఏడాదికి 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు సేకరణలో భాగంగా ప్రతి యూనిట్‌కు రూ.2.49 రేటు చొప్పున 25 ఏళ్ల కాలానికి ఎన్‌ఈసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ప్రతి యూనిట్‌కు రూ.2.50 ఆదా అవుతుంది.
- 2021 - 22 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలతో 16.82% సమగ్ర వృద్ధిని చూపిస్తున్నాయి. తలసరి ఆదాయం గతేడాది 1,76,707గా ఉండగా.. 15.87% వృద్ధి రేటుతో ఇప్పుడు 2,04,758కి పెరిగింది.
- ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. 5 విడతల కరవు భత్యం ఒకేసారి విడుదల చేశాం. 23% ఫిట్‌మెంట్‌తో 11వ వేతన సవరణ అమలు చేశాం. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం.
- ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 16 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది.
-రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణానికి రూ.8,741 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వ పూచీ ఇచ్చేందుకు ఏపీ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రూ.1,234 కోట్లతో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులిచ్చేందుకు అంగీకారం తెలిపింది.
- రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూను రెండో భాషగా ఎంపిక చేసుకున్నవారు చదువుకునేందుకు వీలు కల్పించే చట్ట సవరణను మంత్రివర్గం ఆమోదించింది.
- ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న తితిదే ప్రత్యేక ఆహ్వానితుల బిల్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు బిల్లు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.