అవార్డులు

ఎన్‌హెచ్‌ఆర్సీ పోటీల్లో ‘స్ట్రీట్‌ స్టూడెంట్‌’కు మొదటి బహుమతి

మానవ హక్కుల పరిరక్షణ, ప్రచారానికి సృజనాత్మక దృక్పథం పెంపొందించే లక్ష్యంతో జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) నిర్వహించిన ఏడో షార్ట్‌ ఫిల్మ్‌ల పోటీల్లో తెలుగు లఘు చిత్రం ‘స్ట్రీట్‌ స్టూడెంట్‌’ మొదటి బహుమతి గెలుచుకుంది. వీధి బాలలకు విద్యా హక్కు అందుకు సమాజం మద్దతు ఇవ్వాల్సిన అవసరంపై ఓ వీధి బాలుడు ఇచ్చిన సందేశమే ఈ షార్ట్‌ ఫిల్మ్‌. ఈ చిత్రాన్ని ఆకుల సందీప్‌ రూపొందించారు.

దేశం నలుమూలల నుంచి వచ్చిన 190 లఘు చిత్రాలు అవార్డు కోసం పోటీ పడ్డాయి. తొలి స్థానంలో నిలిచిన ‘స్ట్రీట్‌ స్టూడెంట్‌’కు రూ.2 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రకటించింది.

తెలుగులో సాగే ఈ లఘు చిత్రానికి ఆంగ్లంలో సబ్‌టైటిల్స్‌ ఉన్నాయి.


తెలంగాణ నుంచి ముగ్గురికి, ఏపీ నుంచి ముగ్గురికి పద్మశ్రీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది.

ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన మాజీ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌లు సహా నలుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించింది.

కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ రూపకర్తలైన భారత్‌ బయోటెక్‌ అధినేతలు కృష్ణ ఎల్ల - సుచిత్ర ఎల్ల దంపతులకూ, కొవిషీల్డ్‌ తయారీదారైన సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా, టెక్‌ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్‌లకు నేతృత్వం వహిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్, రాజకీయ కురువృద్ధులు గులాం నబీ ఆజాద్, బుద్ధదేవ్‌ భట్టాచార్యలతో పాటు మొత్తం 17 మందికి పద్మభూషణ్‌ను ప్రకటించింది. 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మొత్తం 128 పద్మ పురస్కారాల్లో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 3 దక్కాయి.


గరికపాటి, మొగులయ్యలకు పద్మశ్రీ..

పద్మశ్రీకి ఎంపికైనవారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు, భద్రాచల సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్‌ హుస్సేన్‌ (మరణానంతరం) ఉన్నారు. తెలంగాణ నుంచి భీమ్లానాయక్‌ సినిమా పాట ద్వారా విశేష జనాదరణ పొందిన నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన గాయకుడు రామచంద్రయ్య, కాకతీయ నృత్యకళకు పునరుజ్జీవం పోస్తున్న కూచిపూడి నృత్యకారిణి, గురువు పద్మజారెడ్డి ఉన్నారు.

‣ ప్రముఖ సినీనటి షావుకారు జానకికి తమిళనాడు కోటాలో పద్మశ్రీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణలు అభినందనలు తెలిపారు.

34 మంది మహిళలకు..
మొత్తం పద్మ అవార్డుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు 13, మహారాష్ట్రకు 10 దక్కింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో విడతల వారీగా జరిగే కార్యక్రమంలో విజేతలకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పౌరపురస్కారాలకు ఎంపికైన వారిలో 34 మంది మహిళలు, 10 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 13 మందికి మరణానంతరం వీటిని ప్రకటించారు.


దేశంలో నలుగురు వాణిజ్య ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు

ప్రహ్లాద్‌ రాయ్‌ అగర్వాల: ప్రముఖ లోదుస్తుల సంస్థ రూపా అండ్‌ కోను 1968లో స్థాపించారు. అనంతరం ఇతర రకాల దుస్తుల విభాగాలకు విస్తరించారు. జాన్, ఫ్రంట్‌లైన్, యూరో, మ్యాక్రోమన్‌ వంటి బ్రాండ్లు ఈ కంపెనీవే.

జగ్జీత్‌ సింగ్‌ దర్ది: చార్దిక్లా గ్రూప్‌ సంస్థలను 1977లో స్థాపించి, మీడియా దిగ్గజంగా ఎదిగారు. 1970లో మాసపత్రికను ప్రారంభించిన ఆయన 1977లో దినపత్రికగా మార్చారు. అనంతరం కాలంలో టైమ్‌ టీవీతో మరింత దూసుకెళ్లారు. స్వతహాగా ఇంజినీర్‌ అయిన దర్ది.. 12 ఏళ్ల వయసులోనే వార్తలు రాయడం మొదలుపెట్టారు.

ముక్తమణి దేవి: 1990లో ముక్తా షూస్‌ను ప్రారంభించి ప్రాచుర్యం పొందారు. వేల మందికి బూట్లు, చెప్పులను చేతితో తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు.

ర్యూకో హిరా: జపాన్‌ కేంద్రంగా పనిచేసే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ హెచ్‌ఎంఐ హోటల్‌ గ్రూప్‌ అధిపతి ర్యూకో హిరా. జపాన్‌లో దాదాపు 60 శాతం రిసార్ట్‌లు, బిజినెస్‌ హోటళ్లు ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి. 1948లో రాజస్థాన్‌లో ర్యూకో హిరా జన్మించారు. టోక్యోలో రత్నాల వ్యాపారం చేసిన తర్వాత, జపాన్‌ మహిళను పెళ్లి చేసుకుని ఆ దేశంలోనే స్థిరపడ్డారు. 1991లో హోటల్‌ పెర్ల్‌ సిటీ కోబ్‌ను నెలకొల్పి అంచెలంచెలుగా ఎదిగారు.


నీరజ్‌కు ‘పరమ విశిష్ట సేవా పురస్కారం

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్, సుబేదార్‌ నీరజ్‌ చోప్రా మరో గౌరవాన్ని అందుకోనున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నీరజ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘పరమ విశిష్ట సేవా పురస్కారం’తో సత్కరించనున్నారు.

ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో క్రీడాకారులకూ మంచి ప్రాధాన్యమే దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడల్లో ఎవరూ పురస్కారం అందుకోకున్నా, దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది మంది క్రీడాకారులు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. పారా జావెలిన్‌లో రాణిస్తూ గొప్ప విజయాలు సాధించిన ప్రముఖ అథ్లెట్‌ దేవేంద్ర జజారియాను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ వరించింది. జావెలిన్‌ క్రీడాకారుడైన 40 ఏళ్ల దేవేంద్ర మూడుసార్లు పారాలింపిక్స్‌లో పోటీ పడి మూడుసార్లూ పతకాలు గెలిచాడు. 2004లో తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీ పడి స్వర్ణం సాధించిన అతను 2016లోనూ పసిడి అందుకున్నాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు.

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నను అందుకున్న సంగతి తెలిసిందే. షూటర్‌ అభినవ్‌ బింద్రా తర్వాత భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం అందుకున్న క్రీడాకారుడు అతనే. టోక్యో పారాలింపిక్స్‌లో సత్తా చాటిన షూటర్‌ అవని లేఖరా, షట్లర్‌ ప్రమోద్‌ భగత్, జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌లకు కూడా పద్మశ్రీ దక్కింది. టోక్యోలో అవని స్వర్ణం, కాంస్యం నెగ్గగా ప్రమోద్, సుమిత్‌ పసిడి పతకాలు గెలిచారు. వీరితో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో గొప్ప ప్రదర్శన చేసిన భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలైన వందన కఠారియా, భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బ్రహ్మానంద్‌ శంఖ్వాల్కర్, కేరళలో ప్రసిద్ధి చెందిన యుద్ధ క్రీడ కలరియపట్టులో నిపుణుడైన 93 ఏళ్ల శంకరనారాయణ మీనన్, మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారుడు ఫైజల్‌ అలీ దర్‌ కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.


939 మందికి పోలీసు సేవా పతకాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ కేంద్ర, రాష్ట్ర విభాగాలకు చెందిన 939 మందికి కేంద్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. వీరిలో 189 మంది సాహస (గ్యాలంట్రీ) పతకాలకు ఎంపికయ్యారు. 88 మందికి విశిష్ట సేవా పతకాలను, ప్రతిభావంతమైన సేవలకు గాను మరో 662 మందికి పతకాలను ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ జాబితాను విడుదల చేసింది. గ్యాలంట్రీ పురస్కారాలకు ఎంపికైన 189 మందిలో 134 మంది జమ్మూ-కశ్మీర్‌ ప్రాంతంలో సాహసోపేతమైన సేవలందించిన వారున్నారు. 47 మంది వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించారు. కాగా అగ్నిమాపక సేవలకు సంబంధించి 42 మందికి, జైళ్లు తదితర విభాగాలకు చెందిన 37 మందికి సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రజల ప్రాణాలను కాపాడటంలో ముందంజలో నిలిచిన 51 మందిని ‘జీవన్‌ రక్షక్‌ పాదక్‌’ పతకాలకు ఎంపిక చేసింది.

సరిహద్దు భద్రత దళానికి (బీఎస్‌ఎఫ్‌) చెందిన మొత్తం 53 మంది ఎంపికయ్యారు. వీరిలో ఇద్దరికి గ్యాలంట్రీ, ఐదుగురికి రాష్ట్రపతి పోలీసు పతకాలను, ప్రతిభావంతమైన సేవలకు గాను మరో 46 మందికి పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)లో 29 మంది పురస్కారాలకు ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల కేసులను దర్యాప్తు చేసిన అధికారులు కూడా వీరిలో ఉన్నారు. వివిధ కీలక కేసులను దర్యాప్తు చేసిన జాయింట్‌ డైరెక్టర్‌ రామ్‌నీశ్‌ గీర్‌ సహా ఆరుగురు రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికయ్యారు. ప్రతిభావంతమైన సేవలకు గాను మరో 23 మందికి పోలీసు పతకాలను ప్రకటించారు.

పతకాలకు ఎంపికైనవారిలో ఇండో-టిబెటెన్‌ సరిహద్దు భద్రతదళం (ఐటీబీపీ)కి చెందిన 18 మంది ఉన్నారు. భారత్‌-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వర్తిస్తున్న వీరిలో ముగ్గురు చొప్పున గ్యాలంట్రీ, రాష్ట్రపతి పతకాలకు ఎంపిక కాగా.. మరో 12 మంది ప్రతిభావంతమైన సేవలకు గాను పురస్కారాలను దక్కించుకున్నారు.

దేశంలో శాంతికాలంలో ఇచ్చే మూడో అత్యున్నత పురస్కారం శౌర్యచక్రకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఉగ్రవాదులపై సాహసోపేతంగా పోరాడిన ఐదుగురు సైనికులు (మరణానంతరం) ఉన్నారు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన మరొకరికి కూడా శౌర్యచక్ర పురస్కారం లభించింది. ఈమేరకు భారత సైన్యం ఓ ప్రకటనలో పురస్కారాలను ప్రకటించింది. 19 మంది పరమ విశిష్ట, 33 మంది అతి విశిష్ట, 77 మంది విశిష్ట సేవా పతకాలకు ఎంపికైనట్లు తెలిపింది. నలుగురికి ఉత్తమ యుద్ధ సేవా పతకం, 10 మందికి యుద్ధ సేవా పతకం, 84 మందికి సేన మెడల్‌ (గ్యాలంట్రీ), 40 మందికి సేన మెడల్‌ (నిరుపమాన సేవలు)లను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్‌ మారుప్రోలు జస్వంత్‌కుమార్‌రెడ్డికి శౌర్యచక్ర పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సైన్యం, పోలీసు, ఇతర శాఖల్లో ఉత్తమ సేవలందించిన వారికి వివిధ పురస్కారాలను ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద గతేడాది జులై 8న ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో జస్వంత్‌రెడ్డి వీరమరణం పొందారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం. 2016లో మద్రాస్‌ రెజిమెంట్‌లో జవాన్‌గా ఆయన చేరారు. రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించి 15 మంది ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు.


తెలుగువారికి రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సేవలందిస్తున్న తెలుగు అధికారులు రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు గెలుచుకున్నారు. ఇందులో జాతీయ విపత్తుల స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)లో కమాండెంట్‌గా పనిచేస్తున్న వీవీఎన్‌ ప్రసన్నకుమార్, సీబీఐలో అదనపు న్యాయసలహాదారు సుబ్రహ్మణ్యం దేవేంద్రన్‌ ఉన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన వీవీఎన్‌ ప్రసన్నకుమార్‌ 1997లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాలో సీఆర్‌పీఎఫ్‌లో చేరి మణిపుర్, అస్సాం, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ హోదాల్లో అంతర్గత భద్రతా విభాగాల్లో పనిచేశారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దిల్లీ కేంద్ర కార్యాలయంలో సేవలందిస్తున్నారు. ఇక్కడికి రావడానికి ముందు సీఆర్‌పీఎఫ్‌ 39వ బెటాలియన్‌లో కమాండెంట్‌గా విజయవాడలో పనిచేశారు.

సీబీఐ న్యాయసలహాదారు దేవేంద్రన్‌కు ప్రతిభా పురస్కారం

దిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో అదనపు న్యాయసలహాదారుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం దేవేంద్రన్‌కు రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం దక్కింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం ఎట్టేరి గ్రామానికి చెందిన ఈయన 28 ఏళ్లుగా సీబీఐలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. లోగడ చెన్నై, మదురై, కోయంబత్తూరు, పుదుచ్చేరి, కొచ్చిన్, విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లోని సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వాదనలు వినిపించారు. ఇండియన్‌ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ తరఫున వాదనలు వినిపించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ 2007లో బంగారుపతకం ప్రదానం చేసింది. 2016లో సీబీఐ డైరెక్టర్‌ నుంచి ప్రొఫెషనల్‌ ఎక్స్‌లెన్స్, 2020లో కేంద్ర హోంశాఖనుంచి అతిఉత్కృష్ట్‌ సేవా పతకం అందుకున్నారు.

భావనా సక్సేనాకు విశిష్ట సేవా పురస్కారం

దిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న 1996 బ్యాచ్‌ ఏపీకేడర్‌ ఐపీఎస్‌ అధికారి భావనా సక్సేనాకు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం లభించింది. 2012లో రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం పొందిన ఆమె ఇప్పుడు విశిష్టసేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ప్రకాశ్‌ సతీమణి అయిన ఈమె లోగడ పశ్చిమగోదావరి, ఖమ్మం, విజయనగరం జిల్లాల ఎస్పీగా సేవలందించారు. యాంటీ నక్సల్‌ యూనిట్లలోనూ సేవలందించారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్, ఏసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేస్తున్నప్పుడు అందించిన ఉత్తమసేవలకుగాను 2015లో కమెండేషన్‌ లెటర్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ గౌరవాన్ని పొందారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ స్పెషల్‌ కమిషనర్‌గా దిల్లీ నుంచి పనిచేశారు.


సమర్థ సేవలకు సమున్నత పురస్కారాలు

తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రతిభ చాటుతున్న పోలీస్‌ బలగాలకు పలు పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ వాటిని ప్రకటించింది. తెలంగాణ నుంచి పోలీస్‌ శౌర్య పతకం (పీఎంజీ) ఎవరికీ దక్కలేదు. విశిష్ట సేవల విభాగంలో టీఎస్‌ ఎస్పీ మూడో బెటాలియన్‌(ఇబ్రహీంపట్నం) కమాండెంట్‌ చాకో సన్నీ, పోలీస్‌ రవాణా సంస్థ (పీటీవో) హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరాజుకు రాష్ట్రపతి పోలీస్‌ పతకాలు (పీపీఎం) దక్కాయి.

సన్నీ 1984లో అప్పటి ఏపీఎస్‌పీ మొదటి పటాలం (యూసుఫ్‌గూడ)లో ఆర్‌ఎస్సైగా విధుల్లో చేరారు. ప్రతిష్ఠాత్మక గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. గ్రేహౌండ్స్‌లో 5వేల మందికి ‘జంగిల్‌ వార్‌ఫేర్‌ టాక్టిక్స్‌’లో శిక్షణ ఇచ్చారు. బోస్నియా, హెర్జెగోవ్నియా, సైప్రస్‌ల్లో ఐక్యరాజ్యసమితి శాంతిదళాల్లో పనిచేశారు. ‘కౌంటర్‌ టెర్రరిజం టాక్టిక్స్‌’లో లండన్, అమెరికాల్లో శిక్షణ పొందారు. విశిష్ట సేవల విభాగంలోనే అగ్నిమాపక అధికారి కాళహస్తి వెంకట కృష్ణకుమార్‌కూ పురస్కారం లభించింది. 1993లో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. పలు అగ్నిప్రమాద ఘటనల్ని సమర్థంగా నియంత్రించినందుకు పురస్కారం దక్కింది. ప్రస్తుతం రాష్ట్ర ఫైర్‌ సర్వీసెస్‌ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నారు.

ప్రతిభావంతమైన సేవల విభాగంలో మైనారిటీ సంక్షేమశాఖ సంచాలకుడు(ఐపీఎస్‌ అధికారి) షానవాజ్‌ ఖాసిం, సైబరాబాద్‌ అదనపు డీసీపీ సంక్రాంతి రవికుమార్, భూపాలపల్లి అదనపు ఎస్పీ పుల్ల శోభన్‌కుమార్, ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ సుదర్శన్, ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ పొలగాని శ్రీనివాసరావు, ఐటీ సెల్‌ డీఎస్పీ గుడ్డేటి శ్రీనివాసులు, వనపర్తి డీఎస్పీ కేఎం కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్‌ ఆర్‌ఎస్‌ఐ మహ్మద్‌ యాకూబ్‌ఖాన్, ఏడో బెటాలియన్‌(డిచ్‌పల్లి) ఏఆర్‌ ఎస్‌ఐ బెండి సత్యం, గ్రేహౌండ్స్‌ ఏఆర్‌ ఎస్‌ఐ ఎం. వెంకటరమణారెడ్డి, ఎనిమిదో బెటాలియన్‌(కొండాపూర్‌) హెడ్‌కానిస్టేబుల్‌ ఇలపండ కోటేశ్వరరావు, ఎన్‌పీఏ అసిస్టెంట్‌ కమాండెంట్‌ భూపేందర్‌కుమార్, ఎన్‌పీఏ కానిస్టేబుల్‌ అజయ్‌కు పోలీస్‌ పతకాలు దక్కాయి.

జైళ్లశాఖలోని చీఫ్‌ హెడ్‌వార్డర్‌ పంతు, హెడ్‌వార్డర్లు రత్నారావు, నర్సింగ్‌రావులకు కరెక్షనల్‌ సర్వీసెస్‌ మెడల్‌ దక్కింది.


షింజో అబెకు నేతాజీ పురస్కారం

నేతాజీ రీసెర్చ్‌ బ్యూరో 2022 సంవత్సరానికి నేతాజీ పురస్కారాన్ని జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెకు ప్రదానం చేసింది. కోల్‌కతాలో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ నకమురా యుటక ఆయన తరఫున దీన్ని స్వీకరించారు. భారత్‌ - జపాన్‌ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అబె తన సందేశంలో పేర్కొన్నారు.

రాష్ట్రీయ బాల పురస్కార్‌ 2022 ప్రదానం

‘రాష్ట్రీయ బాల పురస్కార్‌’ నెగ్గిన చిన్నారులకు ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్‌చైన్‌ సాంకేతికత ద్వారా ధ్రువపత్రాలను అందజేశారు.

ఈ పురస్కారానికి 29 మంది చిన్నారులు ఎంపిక కాగా, అందులో 14 మంది బాలికలు ఉన్నారు. వీరిందరికీ ఆయన ధ్రువపత్రంతో పాటు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులతో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయించాలని దేశంలోని చిన్నారులకు మోదీ పిలుపునిచ్చారు.

స్థానిక ఉత్పత్తులకు ఊతమిచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రారంభించిన ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ కార్యక్రమానికి చిన్నారులు మద్దతు అందించాలని కోరారు.


గుజరాత్, సిక్కింలకు ఆపద ప్రబంధన్‌ పురస్కారాలు

విపత్తు యాజమాన్యంలో విశేష కృషి చేసేవారికి ఇచ్చే ‘నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కార్‌ - 2022’ కోసం గుజరాత్‌ విపత్తు యాజమాన్య సంస్థ (జీఐడీఎం)ను, సిక్కిం రాష్ట్ర విపత్తు యాజమాన్య సంస్థ ఉపాధ్యక్షుడు వినోద్‌శర్మను కేంద్రం ఎంపిక చేసింది.

ఉత్తమ రిటర్నింగ్‌ అధికారిగా నెల్లూరు కలెక్టర్‌కు అవార్డు

తిరుపతి పార్లమెంటరీ (ఎస్సీ) నియోజకవర్గ ఉపఎన్నికల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రిటర్నింగ్‌ అధికారిగా ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డ్స్‌ - 2021 కింద నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబును ఉత్తమ రిటర్నింగ్‌ అధికారిగా అవార్డుకు ఎంపిక చేసింది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు.

ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ జీవిత సాఫల్య పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, ఇండ్లాస్‌ విమ్‌హాన్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డిని 2022 సంవత్సరానికి ఇండియన్‌ సైకియాట్రిక్‌సొసైటీ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ ఏటా ‘డాక్టర్‌ జె.కె.త్రివేది జీవన సాఫల్య పురస్కారం’ నిమిత్తం దేశవ్యాప్తంగా 10వేలకు పైగా ఉన్న మానసిక వైద్యుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. ‣ జాతీయస్థాయిలో మానసిక వైద్యరంగానికి డాక్టర్‌ ఇండ్ల చేసిన సేవలు, పరిశోధనలు, జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన ప్రచురించిన పరిశోధనాపత్రాలు, నిర్వహించిన సదస్సులను గుర్తించి, ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో భువనేశ్వర్‌లో జరిగే జాతీయ సైకియాట్రిక్‌ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డు అందచేస్తారు.

న్యాక్‌కు అసోచాం జాతీయ పురస్కారం

ఉపాధి కల్పనలో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచినందుకుగాను తెలంగాణలోని జాతీయ నిర్మాణ సంస్థ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌)కు అసోచాం జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఈ పురస్కారాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ రమేష్‌ బేస్, శాసనసభాపతి రవీంద్రనాథ్‌లు.. న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ బిక్షపతికి అందజేశారు.

సాంకేతికత తోడుగా నీటి వృథాకు అడ్డుకట్ట

ఆధునిక సాంకేతికత తోడుగా నీటి వృథాకు అడ్డుకç్ట వేసే సరికొత్త ఆలోచనలు అంకురించాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలో స్మార్ట్‌ సిటీ లివింగ్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నీటి సవాల్‌ (వాటర్‌ ఛాలెంజ్‌)లో ముగ్గురు విజేతలుగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం, జాతీయ పట్టణ యాజమాన్య సంస్థ (ఎన్‌ఐయూఎం) భాగస్వామ్యంతో ఆరు నెలల కిందట ఈ పోటీలు ప్రారంభించారు. దేశంలోని వివిధ నగరాలకు చెందిన అంకురసంస్థలు దరఖాస్తు చేశాయి. వివిధ దశల్లో వడపోత తర్వాత నీటి ఆదా, వృథా అడ్డుకట్టకు వినూత్న పరిష్కార మార్గాలు సూచించిన మూడు సంస్థలను ఎంపిక చేశారు. ఓషియో వాటర్‌ కంపెనీ, ట్రిపుల్‌ఐటీహెచ్‌-స్మార్ట్‌ వాటర్‌ మీటర్‌ సొల్యూషన్స్, క్రిస్నం టెక్నాలజీ కంపెనీలు విజేతలుగా నిలిచాయి. ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (మైటీ), జలమండలి, ఎన్‌ఐయూఎం, ప్రపంచ వనరుల సంస్థ (డబ్ల్యూఆర్‌ఐ), యూరోపియన్‌ బిజినెస్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఈబీటీసీ)కి చెందిన నిపుణులు విజేతలను ఎంపిక చేశారు. వారికి ట్రిపుల్‌ఐటీ తరఫున మెంటారింగ్‌ ఇవ్వనున్నారు. ఎన్‌ఐయూఎం, హెచ్‌ఎండీఏ సహకారంతో తెలంగాణలోని ఏదైనా ఒక జిల్లాలో మీటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

ఓషియో వాటర్‌ కంపెనీ: అంతరిక్షం నుంచి పైపులైను లీకేజీలు గుర్తించడం. సిబ్బంది ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాల్సిన అవసరం లేకుండా శాటిలైట్‌ నుంచి సేకరించిన ఫొటోల ఆధారంగా కృత్రిమ మేధ సాయంతో గణించి లీకేజీలను తెలుసుకోవడం.

ట్రిపుల్‌ఐటీహెచ్‌ - స్మార్ట్‌ వాటర్‌ మీటర్‌ సొల్యూషన్స్‌: డిజిటల్‌ వాటర్‌ మీటర్ల స్థానంలో అనలాగ్‌ మీటర్లను రెట్రో ఫిట్టింగ్‌తో డిజిటలైజేషన్‌ చేయడం.

క్రిస్నమ్‌ టెక్నాలజీస్‌: పైపుల్లో అల్ట్రాసోనిక్‌ మీటర్లను ఏర్పాటు చేసి నీటి సరఫరాను లెక్కించడం. పైపుల్లో నీటి సరఫరా రియల్‌టైమ్‌లో లెక్కింపు.


‘స్ట్రీట్స్‌ 4 పీపుల్‌ ఛాలెంజ్‌’ అవార్డులు

నగరాల్లోని వీధులను ప్రజావసరాలకు తగ్గట్టు అందంగా తీర్చిదిద్దడంలో విజయవాడ జాతీయ స్థాయిలో తొలి 11 స్థానాల్లో నిలిచింది. నగరాల్లో వీధులను సురక్షితంగా, ఆరోగ్యకరమైన బహిరంగ ప్రదేశాలుగా తీర్చిదిద్దే అంశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలించింది. దేశంలోని 100 నగరాల మధ్య నిర్వహించిన ‘స్ట్రీట్స్‌ 4 పీపుల్‌ ఛాలెంజ్‌’లో విజయవాడ తొలి 11 స్థానాల్లో నిలిచింది. వీధులను వాహన కేంద్రాలుగానే కాకుండా ప్రజా కేంద్రాలుగా మార్చాలన్న 2006 నేషనల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు పాలసీని దృష్టిలో ఉంచుకొని కేంద్రం 2020లో ఈ పోటీకి శ్రీకారం చుట్టింది. పోటీలో పాల్గొన్న నగరాల ప్రజలతో పాటు, క్రౌడ్‌సోర్సింగ్‌ ద్వారా వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వీధులను నడకకు అనుకూలమైన కేంద్రాలుగా మలిచారు. ఇందులో ఔరంగాబాద్, బెంగళూరు, గుర్‌గ్రాం, కోచి, కోహిమా, నాగ్‌పుర్, పింప్రీ చించిన్‌వాడ్, పుణె, ఉదయ్‌పుర్, ఉజ్జయిన్, విజయవాడలు తొలి 11 స్థానాల్లో నిలవగా ఇంఫాల్, కార్నాల్, సిల్వాసా, వడోదరాలు జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌ అవార్డుకు ఎంపికయ్యాయి. విజయవాడలో ప్రజానుకూలంగా తీర్చిదిద్దాలనుకున్న వీధులను ఆన్‌లైన్‌ పోలింగ్‌ ద్వారా ఎంపిక చేశారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పేర్కొంది. పాతకారు టైర్లు, రంగురంగుల పెయింట్లు ఉపయోగించి నగరంలోని 3 ప్రాంతాలను అందంగా మలిచినట్లు తెలిపింది. ఈ వీధులను నడక, సైక్లింగ్, ప్రజారవాణాకు అనువుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ఒక్కోదానికి రూ.50 లక్షల నిధి సమకూర్చనుంది. ఇక్కడ పార్కింగ్‌ పాలసీ, పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌ అమలుచేయాల్సి ఉంటుంది.

ఇరుగు పొరుగు ప్రాంతాలను చిన్నారులకు అనువుగా తీర్చిదిద్దే పోటీలో కాకినాడ తొలి ఐదు స్థానాల్లో, వరంగల్‌ తొలి పదో స్థానాల్లో నిలిచాయి. నగరంలోని నిరుపయోగమైన వీధి స్థలాలను సురక్షితమైన కాలిబాటలుగా, చిన్నారులు ఆడుకునే ప్రాంతాలుగా తీర్చిదిద్దినందుకు కాకినాడకు ఈ గుర్తింపు లభించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు ఆడుకునే స్థలాలను మెరుగుపరచడంతోపాటు నగరంలోని వీధులు, కూడళ్ల వెంట కాలినడకన వెళ్లేలా మౌలిక వసతులు కల్పించినందుకు వరంగల్‌కు తొలి పది స్థానాల్లో అవకాశం లభించింది.


దక్షిణ డిస్కంకు 6 పురస్కారాలు

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థకు జాతీయ స్థాయిలో ఆరు ఉత్తమ పురస్కారాలు లభించాయి. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో 15వ ఇండియా ఇంధన సదస్సు నిర్వహించారు. ‘విద్యుత్‌ పంపిణీ - సంస్కరణలు - సమర్థత’ అనే అంశంపై చర్చ జరిగింది. వివిధ విభాగాలలో విశిష్ట ప్రగతి కనబరిచిన డిస్కంలకు అవార్డులు ప్రదానం చేశారు. వీటిలో దక్షిణ డిస్కంకు ఆరు లభించాయి. సమష్టి ప్రతిభ కనబరిచినందుకు దక్షిణ తెలంగాణ డిస్కంకు మొదటి ర్యాంక్, దిల్లీ డిస్కంకు రెండో ర్యాంకు, ఆంధ్రప్రదేశ్‌ డిస్కంకు మూడో ర్యాంకు లభించింది. తెలంగాణకు ఇంకా సామర్థ్య నిర్వహణలో, వినియోగదారుల సేవలో, నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలులో, పనితీరు సామర్థ్యంలో మొదటి ర్యాంకులు దక్కాయి. హరిత ఇంధన విభాగంలో మూడో పురస్కారం లభించింది.

న్యాయ విభాగానికి ‘నేషనల్‌ ఈ - గవర్నెన్స్‌’ అవార్డు

కేంద్ర న్యాయ విభాగం ఆధ్వర్యంలోని ఈ - కోర్ట్స్‌ ప్రాజెక్టుకు ‘నేషనల్‌ ఈ - గవర్నెన్స్‌’ పురస్కారం లభించింది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో భాగంగా రీ - ఇంజినీరింగ్‌లో అత్యుద్భుత ప్రతిభ కనబరిచినందుకు తమ ‘ఈ - కోర్ట్స్‌ మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టు’కు గోల్డ్‌ కేటగిరీ-1 అవార్డు లభించినట్టు న్యాయ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ఈ అవార్డును న్యాయ శాఖ కార్యదర్శి బరుణ్‌ మిత్ర, ఈ - కోర్ట్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌లకు ప్రదానం చేసినట్టు తెలిపింది. ఈ - గవర్నెన్స్‌ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు, అందులో ప్రతిభను పెంపొందించేందుకు కేంద్ర సిబ్బంది శాఖ ఏటా ఈ పురస్కారాలను ఇస్తోంది.

నాట్కో ఫార్మాకు ‘కార్పొరేట్‌ గవర్నెన్స్‌’ అవార్డు

నాట్కో ఫార్మాకు, మనీలైఫ్‌ ఫౌండేషన్, 2021 సంవత్సరం కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అవార్డు అందించింది. ఇన్వెస్టర్లు, అనలిస్టులు, ఫండ్‌ మేనేజరు, బ్యాంకర్లు, విద్యావేత్తలు, పరిశోధకుల నుంచి వచ్చిన నామినేషన్లను పరిశీలించి ఈ అవార్డును మనీలైఫ్‌ ఫౌండేషన్‌ ఖరారు చేసింది. సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా) మాజీ ఛైర్మన్‌ ఎం.దామోదరన్‌ ఈ అవార్డును ఒక కార్యక్రమంలో నాట్కో ఫార్మాకు బహూకరించారు.

కడపకు జాతీయ జల అవార్డు

కడప జిల్లాకు జాతీయ జల అవార్డు (నేషనల్‌ వాటర్‌ అవార్డ్స్‌ - 2020)ల్లో చోటు దక్కింది. 2020 సంవత్సరానికి సంబంధించి మొత్తం 11 విభిన్న విభాగాల్లో 57 అవార్డులు ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఒక్క జిల్లాకే అవార్డు వచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రకటించిన అవార్డుల్లో జల సంరక్షణలో దక్షిణాది నుంచి కేరళలోని తిరువనంతపురం జిల్లా మొదటిది స్థానం దక్కించుకోగా రెండో ‘ఉత్తమ జిల్లా’గా కడప బహుమతి గెలుచుకొంది. రాష్ట్రాల విభాగంలో ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు మొదటి మూడు అవార్డులు సొంతం చేసుకున్నాయి.

నీటి సంరక్షణకు కృషి చేసిన జిల్లాలు, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పాఠశాలలు, గృహ సంక్షేమ సంఘాలు, మతపరమైన సంఘాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, నీటి వినియోగ సంఘాలకు ఈ అవార్డులు ఇస్తున్నారు.

ఈ సారి ఒక్క కేటగిరీలో మినహా మిగిలిన ఏ విభాగంలోనూ తెలుగు రాష్ట్రాలకు స్థానం దక్కలేదు. ఉత్తమ మీడియా విభాగంలో ‘నెట్‌వర్క్‌ 18’ ప్రసారం చేసిన ‘మిషన్‌ పానీ’ నిలిచింది. నీటి సంరక్షణకు అసాధారణ రీతిలో పనిచేసే సంస్థలను ప్రోత్సహించేందుకు 2018 నుంచి జాతీయ అవార్డులు ఇస్తున్నారు. దక్షిణాదిలో తమిళనాడుకు 6, కేరళ, కర్ణాటకకు రెండేసి అవార్డులు దక్కాయి.


అజయ్‌కుమార్‌ కక్కర్‌కు బ్రిటన్‌ నూతన సంవత్సర పురస్కారం

భారత సంతతికి చెందిన బ్రిటన్‌ విద్యావేత్త, బ్రిటన్‌ ఎగువ సభ సభ్యుడు అజయ్‌కుమార్‌ కక్కర్‌కు నైట్‌ కమాండర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌ (కేబీఈ) పురస్కారం లభించింది.

బ్రిటన్‌లో వార్షిక నూతన సంవత్సర పురస్కారాల జాబితాలో ఇది రెండో అత్యున్నత పురస్కారం. ఈ మేరకు విడుదల చేసిన జాబితాల్లో సుమారు 1,278 మంది ఉండగా, వారిలో 50 మంది వరకు భారత సంతతి వృత్తి నిపుణలు ఉన్నారు. లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాలలో శస్త్రచికిత్స ఆచార్యుడిగా పనిచేస్తున్న 57 ఏళ్ల కక్కర్‌కు ఆరోగ్య రంగంలో చేసిన సేవలకుగాను ఈ గుర్తింపు లభించింది. ఈ దఫా జాబితాలో చోటు దక్కినవారిలో ఎక్కువ మంది కొవిడ్‌ సంబంధిత అంశాలతో సంబంధం ఉన్నవారే కావడం విశేషం. వారితోపాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులూ ఎక్కువగా ఉన్నారు.