ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ
ఆసియా కుబేరుల్లో అగ్రస్థానాన్ని అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ అధిరోహించారని బ్లూమ్‌బర్గ్ కుబేరుల సూచీ వెల్లడించింది. గత రెండేళ్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 600 శాతానికి పైగా రాణించడమే ఇందుకు కారణం. గౌతమ్ అదానీ నికర సంపద 88.5 బిలియన్ డాలర్లకు (రూ.6,65,000 కోట్లకు) చేరింది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ సంపద 87.9 బి.డాలర్లుగా (రూ.6,50,000 కోట్లు) ఉంది. ఒక్క ఏడాది కాలంలోనే అదానీ నికర సంపద 12 బి.డాలర్లు (సుమారు రూ.90,000 కోట్లు) పెరగడం గమనార్హం. ఆసియాలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక ఏడాదిలో అత్యధిక సంపదను వెనకేసుకుందీ అదానీయేనని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. జాబితాలో అదానీ 10, అంబానీ 11వ స్థానాల్లో నిలిచారు.
ఎలిజబెత్ రాణి-2 పాలనకు ప్లాటినం జూబ్లీ
ఎలిజబెత్ రాణి-2 బ్రిటిష్ సింహాసనాన్ని అధిరోహించి ఫిబ్రవరి 6వ తేదీతో 70 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా బ్రిటన్ అంతటా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరగనున్నాయి. ఇంత సుదీర్ఘ కాలం బ్రిటన్‌ను పాలించిన తొలి రాజవంశీకురాలు ఆవిడే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే సంబరాలు జూన్ 2-5 మధ్య నాలుగురోజుల సెలవుదినాలతో ముగుస్తాయి.
95 ఏళ్ల ఎలిజబెత్ రాణి-2 దేశానికి అందించిన సేవలను గౌరవిస్తూ ఈ నాలుగు రోజుల్లో విందు వినోదాలు, ప్లాటినం పుడ్డింగ్ తయారీ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో అయిదుగురిని తుది పోటీలకు ఎంపిక చేస్తారు. విజేతను బకింగ్‌హాం ప్యాలెస్ ప్రధాన చెఫ్ మార్క్ ఫ్లానగన్‌తో పాటు టీవీ వంటల కార్యక్రమ జడ్జీలు మోనికా గాలెట్టి, మేరీ బెర్రీ నిర్ణయిస్తారు. పోటీలో నెగ్గిన వంటకాన్ని ప్రజలకు ప్రదర్శిస్తారు. జూన్‌లో రెండో శనివారం రాణి జన్మదిన వేడుకలో భాగంగా సైనిక కవాతు జరుగుతుంది. బ్రిటిష్ వాయుసేన విమానాల ప్రదర్శనతో ఈ కవాతు ముగుస్తుంది.
ఐసీఎస్‌సీ 4వ తరగతి ఆంగ్ల పుస్తకంలో ‘నెస్ట్ మ్యాన్’ జీవిత చరిత్ర
ఆయనో పక్షి ప్రేమికుడు. తిండీ, గూడు లేక ఆకలితో అలమటిస్తూ నేలరాలిపోతున్న విహంగాలను చూసి చలించిపోయారు. వాటికి తనవంతు సాయం చేయాలని తలచారు. అనుకున్నది మొదలు పక్షి గూళ్లను నిర్మిస్తూ వాటికంటూ ఓ గూడు కల్పిస్తున్నారు. తన జీవితకాలంలో ఇప్పటివరకూ సుమారు రెండున్నర లక్షల పక్షి గూళ్లను నిర్మించి ‘నెస్ట్ మ్యాన్’గా పేరు గడించారు దిల్లీకి చెందిన రాకేశ్ ఖాత్రి. అశోక్ విహార్ ప్రాంతానికి చెందిన రాకేశ్ దేశ రాజధానిలో ఉన్న పక్షులను రక్షించాలనే లక్ష్యంతో ఈ మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. చిన్నప్పటి నుంచి పక్షులతో ఆడుకోవటం అంటే తనకు ఎంతో ఇష్టమన్న ఆయన అప్పటి నుంచే గూళ్లు నిర్మించడం మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. పక్షి గూళ్లను రూపొందించడమే కాకుండా వాటిని ఎలా తయారు చేయాలో ప్రజలకు వివరిస్తుంటారు. ఇప్పటివరకూ లక్షల మంది విద్యార్థులకు పక్షి గూళ్లను ఎలా నిర్మించాలనే దానిపై ఆయన పాఠాలు బోధించారు. ఆయన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు వరించాయి. సంప్రదాయ విధానాలతో పిల్లలో అత్యుత్తమ పనితీరును కనపరించినందుకు జాతీయ అవార్డును అందుకున్నారు. జనపనారతో 1,25,000 గూళ్లు కట్టినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది. 2022 నుంచి రాకేశ్ జీవిత చరిత్రను ఐసీఎస్‌సీ 4వ తరగతి ఆంగ్ల పుస్తకంలో ప్రవేశపెట్టనున్నారు.
11 సార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు సీఎంగా ప్రతాప్‌సింగ్ సేవలు
గోవా కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్‌సింగ్ 11 సార్లు ఎమ్మెల్యేగా, ఆరుమార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు స్పీకర్‌గా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా పని చేశారు. ఆయన సేవలను గుర్తించిన భాజపా నాయకత్వంలోని ప్రమోద్ సావంత్ ప్రభుత్వం రాణేను ‘జీవితకాల కేబినెట్ హోదా’తో సత్కరించింది. దేశంలో ఇప్పటివరకు ఇటువంటి పురస్కారం ఏ రాష్ట్రంలోనూ లేదు. రాజకీయ అస్థిరతకు మారుపేరుగా నిలిచిన గోవా రాష్ట్రంలో ఒక నాయకుడు దశాబ్దాల పాటు ఒకే పార్టీ(కాంగ్రెస్)లో కొనసాగడం, సుదీర్ఘ కాలం (50 ఏళ్లు) ప్రజాప్రతినిధిగా పనిచేయడం అరుదైన విషయం. 83 ఏళ్ల రాణే రాజకీయ ప్రస్థానం సమకాలీన నాయకులకు స్ఫూర్తిదాయకం.
‣ మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) అభ్యర్థిగా రాణే తొలిసారి 1972లో చట్టసభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆయనను విజయలక్ష్మి వరించింది. దయానంద్ బందోద్కర్ నాయకత్వంలోని ఎంజీపీ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. తరవాత రోజుల్లో కాంగ్రెస్‌లో చేరారు. చివరగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ‘పొరియం’ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
‣ 1989, 94, 99, 2002, 2007, 2012, 2017, 2022ల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. అంతకుముందు గోవా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు ‘సత్తారి’ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. రాణే మొత్తం ఆరుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషం. 15 సంవత్సరాలకు పైగా సీఎంగా చక్రం తిప్పారు. గోవా రాష్ట్ర చరిత్రలో ఎక్కువసార్లు, సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన నేతగా ఆయన రికార్డు తిరుగులేనిది. అయితే ఏ ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఇందుకు అస్థిర రాజకీయాలే కారణం. రెండుసార్లు శాసనసభలో ప్రతిపక్ష నేతగా, రెండుసార్లు స్పీకర్‌గానూ వ్యవహరించారు.
ప్రపంచ కుబేరుల్లో 10, 11 స్థానాల్లో ముకేశ్, గౌతమ్
నికర సంపద విలువపరంగా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ను అదానీ గ్రూపు అధిపతి గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మించిపోయారు. మెటా (ఇంతకు మునుపు ఫేస్‌బుక్) షేర్ల పతనం ఇందుకు కారణమైంది. మెటా షేరు 26% పతనమై 240 డాలర్లకు చేరువ కావడంతో, ఆ కంపెనీ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15 లక్షల కోట్ల)కు పైగా కరిగిపోయింది. ఒక రోజులో ఒక అమెరికా కంపెనీ ఈ స్థాయిలో సంపదను కోల్పోవడం ఇదే మొదటిసారి. మెటా షేరు మరో 2% నష్టపోయి 233 డాలర్ల వద్ద కదలాడుతోంది.ఈ కంపెనీలో 12.8% వాటా కలిగి ఉన్న జుకర్‌బర్గ్ నికర సంపద విలువ 29 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.18 లక్షల కోట్ల) మేర తగ్గి 84.8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.6,36,000 కోట్లు) పరిమితమైందని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా వెల్లడిస్తోంది. ఈ జాబితా ప్రకారం భారత కుబేరుడు అదానీ నికర సంపద విలువ 90.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6,81,000 కోట్లు) కాగా.. ముకేశ్ అంబానీ సంపద విలువ 89.2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.6,70,000 కోట్లు) ఉంది. ఫలితంగా జుకర్‌బర్గ్ 12వ స్థానానికి చేరగా, అదానీ 10, ముకేశ్ 11వ స్థానాల్లో ఉన్నారు. గత నవంబరులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక్క రోజులోనే అత్యధికంగా 35 బి.డాలర్ల (సుమారు రూ.2.63 లక్షల కోట్ల) మేర నికర సంపదను పోగొట్టుకున్నారు.
ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆకర్షణీయ ఫలితాల కారణంగా ఆ సంస్థ ఛైర్మన్ జెఫ్ బెజోస్ సంపద విలువ 20 బి.డాలర్లు పెరిగింది. రెఫినిటివ్ డేటా ప్రకారం అమెజాన్‌లో బెజోస్‌కు 9.9% వాటా ఉంది. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం 164.8 బి.డాలర్ల (సుమారు రూ.12,35,000 కోట్ల) నికర సంపదతో ప్రపంచ కుబేరుల్లో మూడోస్థానంలో బెజోస్ ఉన్నారు.
అంటార్కిటికా ఖండంపై జగిత్యాల శాస్త్రవేత్త పరిశోధన
అంటార్కిటికా ఖండంలో దేశం తరఫున శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో జగిత్యాల జిల్లాకు చెందిన తాటిపాముల సురేశ్ పాల్గొన్నారు. ఆ మంచు ఖండంలోని భారతి స్టేషన్ వద్ద సైస్మిక్ అండ్ జియోమాగ్నటిక్ అబ్జర్వేటరీ ఆవిష్కరణలో భాగంగా అక్కడి ప్రస్తుత (వేసవి కాలం) పరిస్థితులపై శాస్త్రవేత్తల బృందం గత నెల 16 నుంచి అధ్యయనం చేస్తోంది. శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడైన సురేశ్‌ది మల్యాల మండలం పోతారం గ్రామం. స్థానిక సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో 2000లో పదో తరగతి, కరీంనగర్‌లో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, మహారాష్ట్రలోని ధన్‌బాద్‌లో మైనింగ్ విభాగంలో పీజీ పూర్తి చేశారు.
టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్
టాటా సన్స్ ఛైర్మన్‌గా మరోసారి ఎన్.చంద్రశేఖరన్‌కే నియమితులయ్యారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీకి అధిపతిగా రెండో సారి, అయిదేళ్ల కాలానికి ఆయన్ను పునర్నియమిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 11న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశానికి రతన్ టాటా ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. గత అయిదేళ్లలో చంద్రశేఖరన్ పనితీరును సమీక్షించడంతో పాటు, వచ్చే అయిదేళ్లకు తిరిగి నియమించే అంశమే ఈ సమావేశ అజెండా. ‘చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూప్ పనితీరుపై టాటా సంతృప్తి వ్యక్తం చేశారు. మరో అయిదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను పునర్నియమించడానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింద’ని కంపెనీ వివరించింది.
‣ 154 ఏళ్ల చరిత్ర గల టాటా గ్రూప్ చంద్ర నేతృత్వంలోనే ఆల్-ఇన్-వన్ ఇ-కామర్స్ సూపర్ యాప్‌ను తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకుంది. గత అయిదేళ్లలో గ్రూప్ మార్కెట్ విలువ మూడింతలు పెరిగింది కూడా.
అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా కెటాన్జీ బ్రౌన్ జాక్సన్
అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిగా కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ (51)ను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయనున్నట్లు శ్వేతసౌధం నుంచి ఓ ప్రకటన వెలువడింది. తొలి నల్ల జాతీయురాలు దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించనుండటం చారిత్రక పరిణామం. గత రెండు శతాబ్దాలుగా శ్వేత జడ్జీలతోనే కొనసాగుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కూర్పులో వైవిధ్యాన్ని తీసుకువస్తామని బైడెన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు జాక్సన్‌తో కలిసి అధ్యక్షుడు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ వేసవికాలం చివర పదవీ విరమణ పొందనున్న జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ (83) స్థానంలో జాక్సన్ నియామకం జరగనుంది. ఈమె తన కెరియర్ ప్రారంభంలో స్టీఫెన్ బ్రేయర్ వద్ద న్యాయ గుమాస్తాల్లో ఒకరిగా పనిచేశారు.
ఐకియాకు తొలిసారిగా మహిళా సీఈఓ
స్వీడన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే గృహోపకరణాల సంస్థ ఐకియా, భారత కార్యకలాపాలకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సుసానే పుల్వరర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. మహిళా సీఈఓను నియమించడం ఇదే తొలిసారిగా సంస్థ పేర్కొంది. ఆమె చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇప్పటివరకు ఐకియా సీఈఓగా ఉన్న పీటర్ బెజెల్ స్థానంలో ఆమె నియమితులయ్యారు.
యూకే పార్లమెంటులో తెలంగాణ యువ వైద్య విద్యార్థి ప్రసంగం
యూకేలోని లాంక్‌షైర్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన పి.సాయిరాంకు అక్కడి పార్లమెంటులో ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. యునిసెఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న నిర్వహించిన సమావేశంలో యూకేలో నలుగురు ‘హెల్త్ హీరో’లను ఎంపిక చేయగా వారిలో వైద్య విద్యార్థుల కేటగిరీలో సాయిరాం ఎంపికయ్యారు.
ప్రకృతి సాగులో ఆంధ్రప్రదేశ్ రైతు విజయగాథ
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తున్న టి.సూర్యనారాయణరాజు అనే రైతు విజయగాథను నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల ఆధారంగా ప్రజలు వారి నిత్య జీవితాల్లో మార్పులను చవిచూడటమే వాటి విజయవంతానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఖర్చులేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న టి.సూర్యనారాయణరాజు ఉదంతమే ఇందుకు ఓ ఉదాహరణ. ఆయన 2011లోనే రసాయన సాగు నుంచి సహజ సాగువైపు మళ్లారు. ఆయన ప్రయాణం నెమ్మదిగా ఉన్నా స్థిరంగా సాగింది. ఏళ్ల ప్రయత్నంలో దిగుబడులు పెరిగాయి. ఆదాయం పెరిగింది. అవగాహన పెరగడంతో చుట్టుపక్కల ఉన్న రైతులూ ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లారు’ అని రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు.
కొత్త ఔషధ సమ్మేళనాలకు పేటెంట్లు
గుంటూరు జిల్లా బాపట్ల ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ తలశిల గోపాలకృష్ణమూర్తి రెండు కొత్త ఔషధ సమ్మేళనాలు రూపొందించి కేంద్ర పేటెంట్ కార్యాలయం నుంచి పేటెంట్ హక్కులు సాధించారు. సాధారణంగా రక్తపోటు (బీపీ) సమస్యతో బాధపడేవారు టెల్మీసార్టాన్ ఔషధాన్ని మాత్రల రూపంలో తీసుకుంటారు. ఇది రక్తంలో పూర్తిగా కరగపోవటంతో ఆలస్యంగా పనిచేస్తుంది. గోపాలకృష్ణమూర్తి నానో సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఔషధం పూర్తిగా రక్తంలో కరిగి తక్కువ సమయంలో సమర్థంగా పనిచేసేలా గుళికల రూపంలో రూపొందించారు. గాయాలు త్వరగా మానేందుకు కొల్లాజెన్, స్టాటిన్, ఆవు మూత్రం కలిపి మరో సమ్మేళనాన్ని తయారు చేశారు. ఫిల్మ్ రూపంలో ఉండే ఈ ఔషధాన్ని గాయాలపై ఉంచితే ఇన్‌ఫెక్షన్ల సమస్య తగ్గి త్వరగా మానతాయని ఆయన తెలిపారు. గతంలోనూ ఆయన ఐదు ఔషధ సమ్మేళనాలు తయారు చేసి పేటెంట్లు పొందారు.
దేశంలో తొలిసారిగా పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్‌జెండర్ల జంట
కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రేమికుల రోజునే ఈ పెళ్లి జరగడం విశేషం. ట్రాన్స్‌జెండర్లైన శ్యామ ఎస్ ప్రభ, మను కార్తిక పదేళ్లుగా స్నేహితులు. కార్తిక ఓ ప్రైవేటు సంస్థ మానవ వనరుల విభాగంలో ఉద్యోగి. కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్‌జెండర్ విభాగం సమన్వయకర్త. ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లింగమార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ రకమైన వివాహం చట్టబద్ధం కాదు. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తమ పెళ్లి ట్రాన్స్‌జెండర్ వివాహాల్లో సరికొత్త మైలురాయి కానుందని ఈ సందర్భంగా ప్రభ, మను తెలిపారు.
చరిత్ర లిఖించిన పదేళ్ల కుర్రాడు
బెంగళూరులోని హెడ్ స్టార్ట్ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల కుర్రాడు జాక్ సంగీత్ చరిత్రలోని ప్రతి అంశాన్ని మూడు పాయింట్లలో క్లుప్తంగా వివరిస్తూ ‘వరల్డ్ హిస్టరీ ఇన్ త్రీ పాయింట్స్’ అనే పుస్తకాన్ని రాశాడు. ప్రాచీన ఈజిప్టు నుంచి చైనా రాచరిక విశేషాల వరకూ, చాణక్యుడి నుంచి మాక్స్ వెబర్, అలెగ్జాండర్, అశోకుడి వరకూ ఇలా 101 అంశాలను పొందుపరిచాడు.
‣ అతి తక్కువ పదాలతో సందేశాలను పోస్టు చేసే ట్విటర్ లాంటి వేదికలపై మక్కువ చూపుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు సంగీత్ చెప్పాడు. ఈ పుస్తకాన్ని హచెట్ ఇండియా సంస్థ ముద్రించి విడుదల చేసింది. నాన్-ఫిక్షన్ రచనలకు పారితోషికం అందుకుంటున్న రచయితల్లో సంగీత్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడు కావడం విశేషం.
తేయాకు వ్యర్థాలతో 365 సంస్థల చిహ్నాలు
తేయాకే కాదు దాన్ని శుద్ధి చేయగా మిగిలిపోయిన వ్యర్థాలతోనూ అద్భుతాలు చేయవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన రోష్నియాదవ్ నిరూపించింది. తేయాకు వ్యర్థాలతో వివిధ మీడియా సంస్థలు, బ్రాండ్లకు చెందిన 365 లోగోలు తయారు చేసి యురేసియా వరల్డ్ రికార్డు నెలకొలి్పంది. కరోనా సమయంలో మీడియా సంస్థలు చేసిన సేవలకు గౌరవంగా వాటి లోగోలను రూపొందించినట్లు రోష్ని తెలిపింది. దేశంలో వివిధ ప్రజలు, సంస్కృతులు ఉన్నా మనమందరం భారతీయులమనే భావనను తెలియజేస్తూ ఈ చిహ్నాల తయారీలో ఒకే రంగును ఉపయోగించినట్లు పేర్కొంది. ఈ లోగోలను భాదైని ఆదర్శ్ శిక్షా మందిర్‌లో ప్రదర్శనకు ఉంచింది. దీన్ని అంతర్జాతీయ కళాకారిణి నేహా సింగ్ ప్రారంభించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, మహాత్మ గాంధీ కాశీ విద్యాపీఠ్ సహా పలు పాఠశాలల విద్యార్థులు హాజరై ఈ ప్రదర్శనను తిలకించారు. యురేసియా వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరై ధ్రువీకరణ పత్రం అందజేశారు. లాక్‌డౌన్ సమయంలోనే 101 దేశాలతో కూడిన రంగోలి వేసి రికార్డు సృష్టించింది.