జైపుర్‌లో మూడో అతి పెద్ద క్రికెట్ స్టేడియం
జైపుర్‌లో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సీఏ) అధికారులు ఈ స్టేడియం భూమి పూజ చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. మూడేళ్లలో స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్‌సీఏ అధ్యక్షుడు వైభవ్ గహ్లోత్ చెప్పాడు. స్టేడియంలో 75 వేల మంది ప్రేక్షకులు కూర్చోవచ్చని తెలిపాడు.
పెద్దపల్లి జిల్లాలో ‘శాతవాహన’ ఆనవాళ్లు
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో శాతవాహనుల కాలం నాటి ఇటుక గోడలు, పురావస్తు అవశేషాల్ని గుర్తించినట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, చరిత్ర పరిశోధన సంస్థ ‘పిహ్రా’ ప్రతినిధుల బృందం వెల్లడించింది. స్థానిక సమ్మక్క, సారలమ్మ గుట్టపై పెద్ద ఇటుకలతో నిర్మితమైన రెండు గోడల వరుసల్ని వెలికితీయడంతో శాతవాహనుల కాలం నాటి అవశేషాలు బయటపడ్డాయని పురావస్తు పరిశోధనకర్త డా. ఎం.ఎ.శ్రీనివాసన్ తెలిపారు. ఇటుకలతో కూడిన నిర్మాణం పక్కనే చెరువు ఉండటంతో దీన్ని ఆ కాలంలో నీటివనరుగా వినియోగించి ఉండవచ్చని తెలుస్తోంది. పరిసరాల్లో గూనలు, మట్టి కుండల ముక్కలు పెద్దఎత్తున లభ్యమయ్యాయి. ఇదే గ్రామంలో గతంలో 5వ శతాబ్దానికి చెందిన విష్ణుకుండి నాణెం దొరికింది అని ఆయన తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ఇనుప ఖనిజం
నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల గ్రామం వద్ద గల ఏడువారాల గుహల్లో ఇనుప ఖనిజం ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. జీఎస్‌ఐ కూడా దీన్ని ఇనుప ఖనిజంగా నిర్ధారించినట్టు తెలిపింది. గుట్ట ఏర్పడేటప్పుడు మాగ్మాటిక్ ఫార్మేషన్‌లోని వైవిధ్యం, వాతావరణ ప్రభావం వల్ల గుహలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. సుమారు అరకిలోమీటర్ వైశాల్యంలో విస్తరించివున్న ఇక్కడి గుట్టల్లో పొరలు పొరలుగా ఇనుప ఖనిజం తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బలగం రామ్మోహన్ తెలిపారు. అక్కడి రాతి ముక్కలను జీఎస్‌ఐ విభాగానికి పంపగా, సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్‌రావు వాటిని పరిశీలించి బీఐఎఫ్ (బ్యాండెడ్ ఐరన్ ఫార్మేషన్0కు చెందిన ఇనుప ఖనిజం ఉన్నట్టు తెలిపారు. ఇవి 25 నుంచి 17 కోట్ల సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పడినట్టు అంచనా వేశారు. గుట్టపై ఏడు గుహలు ఉండి, పూర్వకాలంలో రుషులు ఇక్కడ తపస్సు చేసుకొనేవారని స్థానికులు తెలిపారు.
బాసరలో పదో శతాబ్దం నాటి చాళుక్యుల శాసనం
నిర్మల్ జిల్లా బాసరలో పదో శతాబ్దం నాటి కళ్యాణి చాళుక్యుల శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు. ఈ శాసనంలో కళ్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయ పేరు కనిపిస్తుందన్నారు. బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ బాసర సమీపంలో ఉన్న దస్తగిరి గుట్ట మీద దీన్ని గుర్తించార[ని పేర్కొన్నారు.
ఆర్జీఐఏకి ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వరుసగా రెండోసారి ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్స్ ప్రతిష్ఠాత్మక ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపును పొందింది. గతేడాది కరోనా సమయంలో ప్రయాణీకుల రక్షణ, అవసరాలు, అభిప్రాయాలకు జీఎమ్మార్ ఆధ్వర్యంలోని ఈ ఎయిర్‌పోర్టు పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే ఈ ఘనత మరోమారు దక్కింది. కరోనా సమయంలో విమాన ప్రయాణీకుల స్థైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే దిశగా ముందుకెళ్లామని, ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని మరువలేమని ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పనిక్కర్ అన్నారు.
కచ్ తెల్ల ఎడారికి నాసా శాస్త్రవేత్తలు
గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న తెల్ల ఎడారి ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలకు అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. అచ్చం అంగారకుడిపై లభ్యమైన ఉప్పు స్ఫటికాల మాదిరే ఇక్కడి స్ఫటికాలు కూడా ఉండటం ఇందుకు కారణం, అందుకే నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారు. ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి? రెండూ స్ఫటికాలు ఒకటేనా? వీటి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి? అన్న విషయాలను కనుగొనేందుకు వారు మార్చి నెలలో గుజరాత్‌లో పర్యటించనున్నారు. అమిటీ, కచ్ యూనివర్సిటీల నేతృత్వాన జరిగే ఈ డీఎన్‌ఏ పరిశోధనలో నాసాతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకోనున్నట్టు కచ్ యూనివర్సిటీ భూ, వాతావరణశాస్త్ర విభాగాధిపతి డా.మహేశ్ ఠాక్రే తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షలు చేపట్టడం ద్వారా రెండు స్ఫటికాలను తులనాత్మకంగా పోల్చి చూడనున్నట్లు ఆయన వివరించారు.