రాష్ట్రీయం -తెలంగాణ

రాష్ట్ర రహదారులకు రూ.91,511 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి (పీఎం సడక్‌ యోజన కాకుండా) కేంద్రం రూ.91,511 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో జరిగిన సమీక్షలో తెలిపారు.
32 జిల్లా కేంద్రాలకు ఎన్‌హెచ్‌ల అనుసంధానం
సమీక్షలోని ముఖ్యాంశాలు:-
‣ పీఎం గతిశక్తితో తెలంగాణకు ఐదు రోడ్‌ కారిడార్లు రానున్నాయి.
‣ రాష్ట్ర పరిధిలో 898 కి.మీ. దూరం ఉండే ఈ రోడ్లకు రూ. 22,706 కోట్ల ఖర్చవుతుంది.
‣ హైదరాబాద్‌-విశాఖపట్నం: సూర్యాపేట-ఖమ్మం, ఖమ్మం-దేవరపల్లి సెక్షన్లు 59+105 కి.మీ.
‣ హైదరాబాద్‌-రాయపుర్‌: రాంసానపల్లె-తెలంగాణ/మహారాష్ట్ర సరిహద్దు 96+40 కి.మీ.
‣ నాగ్‌పుర్‌-విజయవాడ: రేపల్లెవాడ-మంచిర్యాల, మంచిర్యాల-విజయవాడ సెక్షన్లు 94.60+310 కి.మీ.

టి-డయాగ్నొస్టిక్స్‌ ద్వారా 2.77 కోట్ల పరీక్షలు

రాష్ట్రంలోని తెలంగాణ (టి) డయాగ్నొస్టిక్స్‌ పథకం కింద ప్రభుత్వ వైద్యంలో ఇప్పటి వరకూ 18.17 లక్షల మంది బాధితులకు 2.77 కోట్ల ఉచిత నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. వీటి విలువ రూ.277 కోట్లు ఉంటుందని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేసింది. దీనికి సంబంధించిన నివేదికను ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి అందజేసింది. నాలుగేళ్ల కిందట తొలిసారిగా హైదరాబాద్‌ నారాయణగూడలో టి-డయాగ్నొస్టిక్స్‌ ప్రయోగశాలను ఏర్పాటు చేసి 1.82 కోట్ల పరీక్షలు నిర్వహించారు. ఇది విజయవంతమవడంతో సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, గద్వాల, ములుగు తదితర ప్రాంతాల్లో ఇదే రీతిలో ప్రయోగశాలలను ప్రభుత్వం నెలకొల్పింది.

అటవీశాఖ నూతన సారథిగా డోబ్రియాల్‌

రాష్ట్ర అటవీశాఖకు నూతన సారథి(అటవీ సంరక్షణ ప్రధాన అధికారి/పీసీసీఎఫ్‌)గా సీనియర్‌ ఐ.ఎఫ్‌.ఎస్‌ అధికారి ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్‌గా ఉన్న ఆర్‌.శోభ సోమవారం పదవీ విరమణ పొందారు. దీంతో డోబ్రియాల్‌కు పీసీసీఎఫ్‌గా, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఏప్రిల్‌ వరకు ఆయన సర్వీసులో కొనసాగుతారు. అలాగే ఆర్‌.శోభను ప్రభుత్వ సలహాదారు(అటవీ వ్యవహారాలు)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో ఆమె రెండేళ్లు కొనసాగనున్నారు. డోబ్రియాల్‌ ప్రస్తుతం సోషల్‌ ఫారెస్ట్రీకి పీసీసీఎఫ్‌గా, తెలంగాణ హరితహారం కార్యక్రమానికి నోడల్‌ అధికారిగా పనిచేస్తున్నారు.

ఇక డయల్‌ 100కే ఎస్‌వోఎస్‌ సందేశం

ఎస్‌వోఎస్‌ (సేవ్‌ అవర్‌ సోల్స్‌).. అత్యవసర సమయాల్లో తక్షణ సాయం పొందేందుకు సెల్‌ఫోన్‌లో అందుబాటులో ఉండే మీట ఇది. తెలంగాణ పోలీసుల ‘హాక్‌ ఐ’ అప్లికేషన్‌ ద్వారా ఇది ప్రజలకు మరింత చేరువైంది. ఈ మీట నొక్కితే వెంటనే ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందేలా ఈ యాప్‌లో సదుపాయం ఉండేది. ఇప్పటికే 29 లక్షల మంది వినియోగిస్తున్న హాక్‌ ఐ యాప్‌లో త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. నేరుగా డయల్‌ 100 కేంద్రానికే సమాచారం చేరేలా మార్పు చేస్తున్నారు. దీనివల్ల బాధితులకు వేగంగా సహాయం అందే అవకాశం రానుంది. దిల్లీ పోలీసుల ‘లాస్ట్‌ రిపోర్ట్‌’ యాప్‌ తర్వాత దేశంలోనే ఎక్కువ మంది వినియోగిస్తున్న పోలీస్‌ యాప్‌ ‘హాక్‌ ఐ’.

ఉద్యోగుల సంక్షేమ నిధికి రూ.2.5 కోట్లు

రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమ నిధికి రూ.2.5 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల కార్పస్‌ఫండ్‌ వడ్డీకి సమానమైన మొత్తంగా ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలను ఈ సంక్షేమ నిధి నుంచే అందిస్తారు.

హైదరాబాద్‌లో కగూల్‌ డేటా కార్యాలయం

యూకే కేంద్రంగా పనిచేస్తున్న డేటా అనలిటిక్స్, ఈఆర్‌పీ సేవల సంస్థ కగూల్‌ డేటా హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ప్రారôభించింది. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంపై రానున్న మూడేళ్లలో దాదాపు రూ.37 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. భారత్‌లో విస్తరించేందుకు ఈ కొత్త కార్యాలయం ఉపయోగపడుతుందని కగూల్‌ డేటా ఇండియా హెడ్‌ కల్యాణ్‌ గుప్తా బ్రహ్మండ్లపల్లి తెలిపారు. 2025 నాటికి దేశంలో తమ ఉద్యోగుల సంఖ్య 2,000 కు చేరుకుంటుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఉత్పత్తి, రిటైల్, ప్రభుత్వ రంగ కంపెనీలకు సేవలను విస్తరిస్తామని చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

సిరిసిల్లలో టెక్స్‌పోర్ట్‌ దుస్తుల తయారీ పరిశ్రమ

బెంగళూరుకు చెందిన జౌళి పారిశ్రామిక సంస్థ టెక్స్‌పోర్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (టీఐపీఎల్‌) తెలంగాణలో భారీ దుస్తుల తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. సిరిసిల్ల మెగా అపెరెల్‌ పార్కులోని 7.42 ఎకరాల స్థలంలో రూ.60 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్, టెక్స్‌పోర్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నరేంద్ర డి.గొయెంకా ఒప్పందంపై సంతకాలు చేశారు.

మల్లన్నసాగర్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌ నగరానికి శాశ్వతంగా మంచినీటి గోసను దూరం చేసే జలభాండాగారం మల్లన్నసాగర్‌ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. 557 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ జలాశయం 20 లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్‌ జలాశయాన్ని మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఏడేళ్లలోనే అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమైందని, మత్స్య, పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయని, తాగునీటి గోస పోయిందని వివరించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని వాళ్లు తాగే స్వచ్ఛమైన మంచినీళ్లను ఆదిలాబాద్‌లోని అడవి బిడ్డలకూ అందిస్తున్నామన్నారు. దీన్ని జాతికి అంకితమిస్తున్నానని పేర్కొన్నారు.

సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా ఆవిర్భావం

సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీతో తెలంగాణ రాష్ట్ర కమిటీ తెగతెంపులు చేసుకొని సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథాగా ఆవిర్భవించింది. హైదరాబాద్‌లో ఆవిర్భావ జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీవీకృష్ణ మాట్లాడారు. కాలం తీరిన అతివాద విధానాలు మార్చుకోవడానికి కేంద్ర కమిటీ మొండిగా వ్యవహరించిందని, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుటిల ప్రయత్నాలు సాగించిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాము సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా పేరుతో పార్టీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటు జాతీయ కమిటీని ప్రకటిస్తామన్నారు.

70 రకాల కొత్త పక్షుల గుర్తింపు

వరంగల్‌ జిల్లాలోని పాకాల అభయారణ్యంలో 70 రకాల కొత్త పక్షులను గుర్తించినట్లు డీఎఫ్‌వో అర్పణశ్యాల్‌ వెల్లడించారు. రెండు రోజులుగా నిర్వహించిన బర్డ్‌ వాక్, పక్షుల గుర్తింపు ప్రక్రియ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక, వలస పక్షుల్లో కొత్తవి 70 రకాలున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 250 నుంచి 300 రకాలు ఉన్నాయన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల్లోనూ 95% ఉద్యోగాలు స్థానికులకే

తెలంగాణలో అమలుచేస్తున్న కొత్త జోనల్‌ విధానాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకూ వర్తింపజేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీచేసింది. సేవా నిబంధనలనూ అమలు చేయాలని నిర్దేశించింది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టి ఈ నెల 23 నాటికి సాధారణ పరిపాలనా శాఖకు నివేదిక పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఆ ప్రకారం ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలైన వివిధ కార్పొరేషన్లు, కంపెనీలు (సింగరేణి కాలరీస్, ట్రైబల్‌ మైనింగ్‌ వంటివి), బోర్డులు (హౌసింగ్, పారామెడికల్, వక్ఫ్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి తదితరాలు), అథారిటీలు, సమాఖ్యలు, సొసైటీలు (సెర్ప్, గురుకుల విద్యాలయాలు, టెస్కో తదితరాలు), అకాడమీలలో జరిగే కొత్త ఉద్యోగ నియామకాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ స్థాయి వరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు లభిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు వందలకు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, బోర్డులు, కమిషన్లలో దాదాపు 41 వేల మంది ఉద్యోగులున్నారు.

సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్‌గా శ్రీహరి

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్‌గా పొన్నూరు వెంకట శ్రీహరిని రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఆయన్ను డైరెక్టర్‌గా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.

గద్దెను అధిష్ఠించిన సమ్మక్క తల్లి

ఆసియాలోనే అతిపెద్ద మేడారం మహా జారతలో పూజారులు చిలకల గుట్ట నుంచి పెద్దమ్మ సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూరల మధ్య జరిగిన ఈ క్రతువు ఆద్యంతం కోలాహలంగా సాగింది. సరిగ్గా రాత్రి 9.16 గంటలకు సమ్మక్క తల్లిని పూజారులు గద్దెపై ప్రతిష్ఠించారు. ఫిబ్రవరి 16న చిన్నమ్మ సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, భర్త గోవిందరాజు గద్దెలపై కొలువుతీరగా సమ్మక్క సైతం విచ్చేయడంతో మేడారం జాతరకు పరిపూర్ణ శోభవచ్చింది.

గద్దెలపై కొలువైన సారలమ్మ

ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం జాతరలో తొలి ఘట్టం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శివసత్తుల పూనకాలు, ఆదివాసీల ఆచారాలతో నిండు పున్నమి వేళ రాత్రి 10.47 గంటలకు సారలమ్మ తల్లి గద్దెపై కొలువైంది. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి బయలుదేరిన సారలమ్మ తండ్రి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి వచ్చిన సారలమ్మ భర్త గోవిందరాజు సైతం అదే సమయంలో గద్దెపై కొలువుదీరారు. ఈ ముగ్గురూ గద్దెలను అధిష్ఠించడంతో మహాజాతరకు అంకురార్పణ జరిగింది. గత రెండు దశాబ్దాల్లో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి. ఆ రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. ‘అదే రోజు జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదు. ప్రతిసారి బుధవారం జాతర ప్రారంభించడం ఆనవాయితీ. మాఘశుద్ధ పౌర్ణమి, బుధవారం ఒకే రోజు రావడం చాలా అరుదు. క్రితంసారి జాతర ముగిసే రోజున పౌర్ణమి వచ్చింది’ అని సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్‌ తెలిపారు.

ఆసియాలోనే అతిపెద్ద మేడారం మహాజాతర

అభయారణ్యం, అక్కడ వెదురు కర్రలు, కుంకుమభరిణలే వన దేవతల రూపాలు, పసుపుకుంకుమలు వజ్రాభరణాలు, బెల్లమే బంగారం, ఖండాంతర ఖ్యాతి పొందిన సమ్మక్క, సారలమ్మల మహాజాతర ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది. హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా మేడారంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 16న జాతర ప్రారంభమై ఫిబ్రవరి 19 వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18న వనదేవతలను దర్శిస్తారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మేడారం సమీపంలోని కన్నెపల్లె నుంచి పూజారులు సమ్మక్క కుమారుడు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కొలువుదీర్చారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాలతో సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని పాదయాత్రగా పూజారులు మేడారానికి బయలుదేరారు.

వాహన్‌లో తెలంగాణ రవాణా శాఖ

కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ 2019లో వాహన్‌ (వాహనాల రిజిస్ట్రేషన్‌), సారథి (డ్రైవింగ్‌ లైసెన్స్‌) పేర్లతో రూపొందించిన రవాణా పోర్టల్‌లో తెలంగాణ చేరింది. దీంతో ఇప్పటివరకు ఉన్న వాటికి భిన్నమైన రంగు కార్డులను రవాణాశాఖ అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ కార్డులు ఒకే తీరుగా ఉండనున్నాయి. కేంద్ర పోర్టల్‌ ద్వారా వాహనం ఏ రాష్ట్రానిది...లైసెన్స్‌ పొందిన వ్యక్తి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనాల దొంగతనం జరిగినా, విధ్వంసకర సంఘటనల్లో ఉపయోగించినా, ప్రమాదాలప్పుడు క్షణాల్లో సమాచారం తెలుసుకోవడానికి ‘ఒకే దేశం.. ఒకే కార్డు’ నినాదంతో ఈ పోర్టల్‌ను రూపొందించామని కేంద్రం చెబుతోంది.

పోలీస్‌స్టేషన్లకు మార్కులు

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులకు 73.73 శాతం, నల్గొండ జిల్లా తిప్పర్తికి 70.50 శాతం, ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌కు 66.88 శాతం, ములుగు జిల్లా ఏటూరునాగారానికి 66.71 శాతం, ఇవన్నీ ఆయా పోలీస్‌స్టేషన్లకు కేటాయించిన మార్కులు. 2021 సంవత్సరంలో ఠాణాల్లోని పోలీస్‌ సిబ్బంది పనితీరుకు 90 మార్కులను పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేశారు. ఠాణాల్లో ఫిర్యాదుదారులతో సిబ్బంది వ్యవహారశైలి మొదలుకొని నేర దర్యాప్తు వరకు పనితీరును 17 ఫంక్షనల్‌ వర్టికల్స్‌గా విభజించారు. ఠాణాకు వచ్చే వారికి కల్పిస్తున్న వసతులు, రికార్డుల నిర్వహణ, స్టేషన్లల్లోని పచ్చదనం తదితర అంశాలకు 10 మార్కుల్ని లెక్క కట్టారు. ఆయా అంశాల మదింపు ఆధారంగా ఠాణాలకు మార్కుల్ని కేటాయించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 741 శాంతి భద్రతల పోలీస్‌స్టేషన్లను ఇలా తొలిసారిగా పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రమంతటా ఒకేరీతిన నేరాలు జరగవు కాబట్టి నమోదైన కేసుల సంఖ్యను బట్టి ఠాణాలను నాలుగు విభాగాలుగా విభజించి మార్కుల్ని లెక్కగట్టారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) కేంద్రంగానే ఈ పరిశీలన జరిగింది. ఇలా మొత్తం పోలీస్‌స్టేషన్ల నుంచి తొలుత 240 ఠాణాలను ఎంపిక చేశారు. అనంతరం ఆయా స్టేషన్లలోని వసతులకు సంబంధించి ఒకేరోజు చిత్రాలను తెప్పించారు. వాటిని పరిశీలించి తుది మార్కుల్ని కేటాయించారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బుద్ధప్రకాశ్‌కు అదనపు బాధ్యతలు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా జ్యోతిబుద్ధప్రకాశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి నుంచి ఇటీవల కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా బదిలీ అయిన శశాంక్‌ గోయల్‌ రిలీవ్‌కు అనుమతించింది. బుద్ధ ప్రకాశ్‌ ప్రస్తుతం అదనపు సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గోయల్‌ రిలీవ్‌ అయ్యాక ఇన్‌ఛార్జిగా ఆయన బాధ్యతలు చేపడతారు.

తెలంగాణ ప్రభుత్వంతో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఒప్పందం

నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, సాంస్కృతిక మార్పిడిపై పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో బ్రిటిష్‌ కౌన్సిల్‌ హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, బ్రిటిష్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనక పుష్పనాథన్‌లు దీనిపై సంతకాలు చేశారు. హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, హైదరాబాద్‌ ఆవిష్కరణ, పరిశోధన మండలి (రిచ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ రంగ్నేకర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ యువత, ఆవిష్కర్తలు, విద్యార్థులు, నిపుణులు, వ్యవస్థాపకులు, కళాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా బ్రిటిష్‌ కౌన్సిల్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు.

గోదావరిఖని కోల్‌మైన్‌ ప్రారంభం

అవాంతరాలను అధిగమించి పెద్దపల్లి జిల్లాలోని ‘గోదావరిఖని కోల్‌మైన్‌’ అందుబాటులోకి వచ్చింది. గోదావరిఖని సమీపంలో ఈ కోల్‌మైన్‌(జీడీకే-2, 2-ఎ, 5) శిలాఫలకాన్ని సింగరేణి సంచాలకులు ఆవిష్కరించారు. కోల్‌మైన్‌లో సింగరేణి సంచాలకులు ఎస్‌.చంద్రశేఖర్, ఎన్‌.బలరాం, సత్యనారాయణరావు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు.

రూ.150 కోట్లతో ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ గ్రావ్టన్‌ మోటార్స్‌ తెలంగాణలో రూ.150 కోట్లతో విద్యుత్‌ వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. ఇప్పటికే హైదరాబాద్‌ చర్లపల్లిలో వాహనాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న గ్రావ్టన్, అక్కడ ఏటా 48 వేల క్వాంటా ద్విచక్రవాహనాలను తయారు చేస్తోంది. ‘విస్తరణలో భాగంగా సంవత్సరానికి మూడు లక్షల ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యంతో మరో యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయించామని’ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురామ్‌ పాకా వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి విస్తరణ ప్రణాళికను వివరించారు. క్వాంటా ద్విచక్ర వాహనం కేవలం 164 గంటల 30 నిమిషాల (6.5 రోజులు)లో కన్యాకుమారి నుంచి ఖార్దుంగ్‌ లా (లద్దాఖ్‌) వరకు 4,011 కిలోమీటర్లు ప్రయాణించి ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌లో చోటు సంపాదించింది.