క్రీడలు

డరిల్‌ మిచెల్‌కు ఐసీసీ ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అవార్డు

న్యూజిలాండ్‌ ఆటగాడు డరిల్‌ మిచెల్‌ 2021 సంవత్సరానికి ఐసీసీ ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అవార్డును గెలుచుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ సందర్భంగా క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి, తేలిగ్గా వచ్చే ఓ సింగిల్‌ను తీయడానికి నిరాకరించినందుకు అతడు ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.

కివీస్‌ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో (రషీద్‌) జరిగింది ఆ సంఘటన. నీషమ్‌ బంతిని కొట్టి సింగిల్‌ తీయాలనుకున్నాడు. అది తేలిగ్గా వచ్చేది కూడా.

కానీ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న మిచెల్‌ పరుగు తీయడానికి నిరాకరించాడు. బంతిని పట్టుకోవాలనుకున్న రషీద్‌కు తాను అడ్డుగా వచ్చానని భావించడమే అందుకు కారణం.


హాకీ ప్రొ లీగ్‌లో భారత్‌ విజయం

-హాకీ ప్రొ లీగ్‌లో భారత అమ్మాయిలు, అబ్బాయిల జట్లు అద్భుత విజయాలను అందుకున్నాయి. పురుషుల జట్టు ఓటమి మ్యాచ్‌లో అసాధారణంగా పోరాడి 5-4తో గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ (4వ స్థానం) కంటే ర్యాంకింగ్స్‌లో వెనకున్న స్పెయిన్‌ (9వ) ఒక దశలో 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ జట్టు కెప్టెన్‌ మార్క్‌ మిరాల్స్‌ (20వ, 23వ, 40వ నిమిషం) హ్యాట్రిక్‌ సాధించాడు. శిలానంద్‌ లక్రా (41వ), షంషేర్‌ సింగ్‌ (43వ) గోల్స్‌తో స్పెయిన్‌ ఆధిక్యాన్ని తగ్గించిన భారత్‌.. ఆఖరి క్వార్టర్‌లో వరుణ్‌ కుమార్‌ (55వ నిమిషం) గోల్‌తో స్కోరును 4-4తో సమం చేసింది. మరో 4 సెకన్లలో మ్యాచ్‌ ముగుస్తుందనగా లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌ కొట్టి హర్మన్‌ప్రీత్‌ జట్టును గెలిపించాడు.

- మహిళల జట్టు 2-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. భారత్‌ తరపున జ్యోతి (20వ నిమిషంలో), నేహ గోయల్‌ (52వ) చెరో ఫీల్డ్‌ గోల్‌ కొట్టారు. ప్రత్యర్థి జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను మార్టా సెగు (18వ నిమిషంలో) చేసింది.


ప్రొ కబడ్డీ సీజన్‌-8 టైటిల్‌ దబంగ్‌ దిల్లీ సొంతం

దబంగ్‌ దిల్లీ బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి ప్రొ కబడ్డీ సీజన్‌-8లో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో దిల్లీ 37-36తో పట్నాను ఓడించింది. ఈ సీజన్లో దిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన నవీన్‌ కుమార్‌ (13) ఫైనల్లోనూ సత్తా చాటగా.. అతడితో పాటు విజయ్‌ (14) మెరిశాడు. పట్నా జట్టులో సచిన్‌ (10), గమన్‌ సింగ్‌ (9), రెజా (5) రాణించారు.

ప్రొ కబడ్డీ టైటిల్‌ గెలిచిన ఆరో జట్టు దిల్లీ. ఇంతకుముందు జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ (2014), యు ముంబా (2015), పట్నా పైరేట్స్‌ (2016లో రెండుసార్లు, 2017లో ఒకసారి), బెంగళూరు బుల్స్‌ (2018), బెంగాల్‌ వారియర్స్‌ (2019) టైటిళ్లు గెలిచాయి. పట్నా ఖాతాలో మూడు టైటిళ్లు ఉన్నాయి.

ఈ సీజన్‌లో అత్యధికంగా పవన్‌ షెహ్రావత్‌ (బెంగళూరు బుల్స్‌) సాధించిన మొత్తం పాయింట్లు 320.


అండర్‌-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన భారత మూడో కెప్టెన్‌గా యశ్‌ ధుల్‌

అండర్‌-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన భారత మూడో కెప్టెన్‌గా యశ్‌ ధుల్‌ నిలిచాడు. గతంలో కోహ్లి (2008), ఉన్ముక్త్‌ చంద్‌ (2012) ఆ ఘనత సాధించారు. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం భారత్‌కిది ఎనిమిదోసారి. ఫిబ్రవరి 5న తుదిపోరులో ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడనుంది.

24 ఏళ్లలో తొలిసారి పాక్‌ పర్యటనకు ఆసీస్‌ సిద్ధం

పాకిస్థాన్‌లో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమ జట్టు పర్యటించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారికంగా ఆమోదం తెలిపింది. సాంకేతిక కారణాలతో ముందుగా అనుకున్న షెడ్యూల్‌లో కొన్ని సవరణలు చేసినట్లు రెండు దేశాల బోర్డులు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా రావల్పిండి, కరాచి, లాహోర్‌లో కంగారూ జట్టు మూడు టెస్టుల సిరీస్‌ ఆడబోతోంది. మార్చి 4న రావల్పిండిలో మొదలయ్యే తొలి టెస్టుతో సిరీస్‌ ఆరంభం కానుంది. మార్చి 12న రెండో టెస్టు కరాచిలో, మార్చి 21న లాహోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, ఏకైక టీ20లో కూడా ఆసీస్‌-పాక్‌ తలపడనున్నాయి.

మెద్వెదెవ్‌ ప్రపంచ నంబర్‌వన్‌

రష్యా టెన్నిస్‌ ఆటగాడు డానియల్‌ మెద్వెదెవ్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అతడికి అగ్రస్థానం దక్కింది. పురుషుల టెన్నిస్‌లో నంబర్‌వన్‌ అయిన 27వ ఆటగాడతడు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత జకోవిచ్‌ను మెద్వెదెవ్‌ వెనక్కి నెట్టాడు. ఫెదరర్, నాదల్, జకోవిచ్, ముర్రే కాకుండా.. గత 18 ఏళ్లలో నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకున్న తొలి ఆటగాడిగా మెద్వెదెవ్‌ నిలిచాడు. కఫెల్నికోవ్, సఫిన్‌ తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌ అయిన రష్యా మూడో టెన్నిస్‌ ఆటగాడు మెద్వెదెవ్‌.

ఉషూ స్టార్స్‌ ఛాంపియన్‌షిప్‌: రెండు పతకాలు గెలిచిన అమాన్‌

అంతర్జాతీయ ఉషూ స్టార్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌ జిల్లా క్రీడాకారుడు షేక్‌ అమాన్‌పాషా సత్తా చాటాడు. మాస్కోలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో అతడు రెండు పతకాలు గెలిచాడు. సీనియర్‌ విభాగంలో బరిలో దిగిన అమాన్‌ వింగ్‌చూన్‌ విభాగంలో రజతం, లాంగ్‌ వెపన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించాడు.

పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్‌ పూజ రజతం గెలుచుకుంది. ఫైనల్లో ఆమె 3-7తో ఇటలీకి పెట్రిలి విన్సెంజా (ఇటలీ) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో 6-2తో హేజెల్‌ చైస్టీ (ఇంగ్లండ్‌)పై గెలిచిన పూజ పారా ప్రపంచ ఆర్చరీ వ్యక్తిగత ఈవెంట్లో ఫైనల్‌ చేరిన భారత తొలి ఆర్చర్‌గా ఘనత సాధించింది. టీమ్‌ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగే పోరులో మంగోలియా జోడీతో పూజ - పూజ ఖన్నా జంట పోటీపడనుంది. మరోవైపు కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ జోడీ శ్యాంసుందర్‌ స్వామి - జ్యోతి బలియాన్‌ జంట రజత పతకం గెలుచుకుంది. ఈ పతకమే పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం. 2017 బీజింగ్, 2019 డెన్‌ బాష్‌ (నెదర్లాండ్స్‌) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారత్‌ బరిలో దిగింది. 2019లో రాకేశ్‌ కాంస్యానికి దగ్గరగా వచ్చినా పతకం సాధించలేకపోయాడు.

స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో నిఖత్‌కు పసిడి

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పంచ్‌ పసిడిని సాధించింది. స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆమె మరోసారి స్వర్ణాన్ని అందుకుంది. 2019లో ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన ఈ 25 ఏళ్ల అమ్మాయి మరోసారి ఆ ప్రదర్శన పునరావృతం చేసింది. మహిళల 52 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్‌ 4-1 తేడాతో టెటియానా (ఉక్రెయిన్‌)ను ఓడించింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించిన నిఖత్‌ ముష్టిఘాతాలతో విరుచుకుపడింది. మరో భారత బాక్సర్‌ నీతూ కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది. 48 కేజీల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. హరియాణాకు చెందిన 21 ఏళ్ల నీతూ తుదిపోరులో 5-0తో ఎరిక (ఇటలీ)ని చిత్తుచేసింది. ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగిన నీతూ ధాటికి ప్రత్యర్థి నిలవలేకపోయింది. తన కెరీర్‌ కోసం మూడేళ్ల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టిన తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఆమె గొప్పగా రాణించింది. నందిని (81+ కేజీలు) ఇప్పటికే కాంస్యం నెగ్గడంతో భారత్‌ మొత్తం మూడు పతకాలతో పోటీలను ముగించింది. గత టోర్నీ (దీపక్‌కు రజతం, నవీన్‌కు కాంస్యం) కంటే ఈ సారి భారత్‌ (రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం) మెరుగైన ప్రదర్శన చేసింది.

టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌కు మెక్సికన్‌ ఓపెన్‌ టైటిల్‌ సొంతం

స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ మెక్సికన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. సింగిల్స్‌ ఫైనల్లో నాదల్‌ 6-4, 6-4తో కామెరూన్‌ నోరి (బ్రిటన్‌)ని ఓడించాడు. తొలి సెట్లో అయిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నాదల్‌ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరుతో 51 నిమిషాల్లో తొలి సెట్‌ దక్కించుకున్నాడు. రెండో సెట్లోనూ రఫాదే జోరు. తొలి గేమ్‌లోనే అతడు బ్రేక్‌ సాధించాడు. అయితే ఆ తర్వాత నోరి పుంజుకున్నా అయిదో గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నాదల్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. 35 ఏళ్ల నాదల్‌కు కెరీర్‌లో ఇది 91వ ఏటీపీ టైటిల్‌. ఈ సీజన్లో మూడోది.

స్ట్రాంజా స్మారక టోర్నీ: నందినికి కాంస్యం

జా స్మారక టోర్నీని భారత బాక్సర్‌ నందిని (81+ కేజీలు) కాంస్యంతో ముగించింది. సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసిన ఆమె.. మరో అడుగు ముందుకు వేయలేకపోయింది. సెమీస్‌లో నందిని 0-5 తేడాతో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ లజ్జత్‌ (కజకిస్థాన్‌) చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఆదివారం ఫైనల్లో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (52 కేజీలు).. టెటియానా (ఉక్రెయిన్‌)తో తలపడుతుంది.

ప్రపంచ పారా ఆర్చరీలో శ్యామ్‌ - జ్యోతి జోడీకి రజతం

ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత జోడీ శ్యామ్‌ సుందర్‌ స్వామి - జ్యోతి బలియాన్‌ రజతం గెలుచుకున్నారు. మిక్స్‌డ్‌ పెయిర్‌ విభాగం ఫైనల్లో శ్యామ్‌ - జ్యోతి 148-150తో బెయిర్‌ షిగయెవ్‌ - తతియానా (రష్యా) చేతిలో పోరాడి ఓడారు. అంతకుముందు సెమీస్‌లో శ్యామ్‌ - జ్యోతి 151-145తో జూలీ - థియరీ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. గతేడాది ఇదే వేదికలో విద్యతో కలిసి శ్యామ్‌ పారా ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్‌ టోర్నీలో రజతం గెలిచాడు.

ప్రజ్ఞానందకు 11వ స్థానం

ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద పోరాటం ముగిసింది. ఈ టోర్నీ ఎనిమిదో రౌండ్లో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)ను ఓడించి సంచలనం సృష్టించిన ఈ 16 ఏళ్ల కుర్రాడు క్వార్టర్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. ప్రాథమిక దశ పోటీల్లో అతను 11వ స్థానంలో నిలిచాడు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు క్వార్టర్స్‌ చేరారు. మొత్తం 15 రౌండ్లు పూర్తయ్యేసరికి ప్రజ్ఞానంద 19 పాయింట్లు సాధించాడు. ఫిబ్రవరి 23న 13వ రౌండ్లో విన్సెంట్‌ (జర్మనీ)తో డ్రా చేసుకున్న అతడు.. 14వ రౌండ్లో నీమన్‌ (అమెరికా) చేతిలో ఓడాడు. ఇక చివరిదైన 15వ రౌండ్లో రష్యా గ్రాండ్‌మాస్టర్‌ వ్లాదిస్లావ్‌ను ఓడించి టోర్నీని గెలుపుతో ముగించాడు. రష్యా ఆటగాడు నెపోమ్నియాచి అగ్రస్థానంతో, కార్ల్‌సన్‌ రెండో స్థానంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

ఎయిర్‌థింగ్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌

ఎయిర్‌థింగ్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)పై సంచలన విజయం సాధించిన భారత యువ కెరటం ప్రజ్ఞానంద జోరు కొనసాగిస్తున్నాడు. అతడు ఈ టోర్నీలో మరో రెండు విజయాలు సాధించాడు. పదో రౌండ్లో ఆండ్రీ సిపెంకో (రష్యా)ను 42 ఎత్తుల్లో ఓడించిన ఈ 16 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ పన్నెండో రౌండ్లో అలెగ్జాండ్రా కొస్తునిక్‌ (రష్యా)పై 63 ఎత్తుల్లో విజయం సాధించాడు. తొమ్మిదో రౌండ్లో నొడిర్‌బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో పాయింట్లు పంచుకున్న ప్రజ్ఞానంద పదకొండో రౌండ్లో నెపొమ్‌నియాచి (రష్యా) చేతిలో ఓటమి చవిచూశాడు. దీంతో మొత్తం పన్నెండు రౌండ్లలో 15 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌

భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద (16 ఏళ్ల), ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ను ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో ఓడించి సంచలనం సృష్టించాడు. ఎనిమిదో రౌండ్లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద హ్యాట్రిక్‌ విజయాలతో ముందుకి దూసుకుపోతున్న కార్ల్‌సన్‌ ఆట కట్టించాడు. ‣ ప్రజ్ఞానంద ఈ మ్యాచ్‌ను 39 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. భారత్‌ నుంచి ఇప్పటిదాకా విశ్వనాథన్‌ ఆనంద్, పెంటేల హరికృష్ణ మాత్రమే కార్ల్‌సన్‌ను ఓడించగలిగారు. తాజా విజయంతో ఈ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద 8 పాయింట్లతో (2 విజయాలు, 4 ఓటములు, 2 డ్రాలు) 12వ స్థానంలో ఉన్నాడు. ‣ 2018లో 12 సంవత్సరాల 10 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ అయిన ప్రజ్ఞానంద.. ప్రపంచ చెస్‌లో ఈ హోదా సాధించిన అయిదో పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతడు సీనియర్‌ సర్క్యూట్‌లోనూ తన ముద్ర వేస్తున్నాడు. 2019లో ఎక్స్‌ట్రాకాన్‌ చెస్‌ టైటిల్‌ గెలిచిన ఈ టీనేజర్‌.. అదే ఏడాది ప్రపంచ యూత్‌ చెస్‌లో అండర్‌-18 టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ‣ 2020లో జరిగిన మెల్ట్‌వాటర్‌ చెస్‌ టూర్‌లో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద, సెర్గీ కర్జాకిన్, రద్జబోవ్‌ లాంటి సీనియర్లపై విజయాలు నమోదు చేశాడు. ప్రస్తుతం 2612 ఫిడే రేటింగ్‌తో ఉన్న అతడు గత ఏడాది ప్రపంచకప్‌లో నాలుగో రౌండ్‌ వరకు వెళ్లాడు.

హాకీ జట్టు కెప్టెన్‌గా సవిత

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ప్రొ లీగ్‌ పోరులో పాల్గొనే భారత జట్టుకు గోల్‌కీపర్‌ సవిత సారథ్యం వహించనుంది. గాయం నుంచి కోలుకుంటున్న కెప్టెన్‌ రాణి రాంపాల్‌ స్థానంలో సవితకు పగ్గాలు అప్పగించారు. దీప్‌ గ్రేస్‌ ఎక్కా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. తెలుగమ్మాయి ఎతిమరపు రజని (గోల్‌కీపర్‌)కి జట్టులో చోటు లభించింది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో భువనేశ్వర్‌లో జరిగే రెండు మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో భారత్‌ తలపడనుంది. భారత హాకీ జట్టు గోల్‌కీపర్లు: సవిత (కెప్టెన్‌), బిచు దేవి, రజని, డిఫెండర్లు: దీప్‌ గ్రేస్‌ ఎక్కా (వైస్‌ కెప్టెన్‌), గుర్జిత్‌ కౌర్, నిక్కి ప్రధాన్, ఉదిత, ఇషిక చౌదరి, మిడ్‌ఫీల్డర్లు: నిష, సలీమా, సుశీల చాను, జ్యోతి, మోనిక, నేహా, నవజ్యోత్‌ కౌర్, నమిత. ఫార్వర్డ్‌లు: వందన కటారియా, షర్మిల దేవి, నవనీత్‌ కౌర్, లాల్రెమ్సియామి, సంగీత కుమారి, రజ్విందర్‌ కౌర్‌. స్టాండ్‌బైలు: రష్మిత, అక్షత, సోనిక, మరియానా, ఐశ్వర్య

స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నమెంట్లో సుమిత్‌ కుందు విజయం

స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నమెంట్లో సుమిత్‌ కుందు స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించాడు. 75 కేజీల విభాగం రెండో రౌండ్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రజత పతక విజేత బిజ్‌హమోవ్‌ (రష్యా)ను ఓడించాడు. కేవలం రెండో అంతర్జాతీయ టోర్నీ ఆడుతున్న సుమిత్‌ ఈ పోరులో 5-0తో ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. ‣ నరేందర్‌ బెర్‌వాల్‌ (92 కేజీల పైన), వీరేందర్‌ సింగ్‌ (60 కేజీలు), లక్ష్య చాహర్‌ (86 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. నరేందర్‌ 2-3తో ఆయూబ్‌ (స్పెయిన్‌) చేతిలో వీరేందర్‌ 0-5తో ఆర్థర్‌ (రష్యా) చేతిలో, చాహర్‌ 1-4తో అటాయెవ్‌ (రష్యా) చేతిలో పరాజయం చవిచూశారు. ఈ టోర్నీలో భారత్‌ నుంచి 17 మంది బాక్సర్లు (ఏడుగురు పురుషులు, పది మంది మహిళలు) పోటీపడుతున్నారు.

యశ్‌ ధుల్‌ అరుదైన ఘనత

భారత అండర్‌-19 కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ తన రంజీ కెరీర్‌ను గొప్పగా ప్రారంభించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో హోరెత్తించి అరుదైన ఘనత అందుకున్నాడు. భారత దేశవాళీ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. దిల్లీ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ యశ్‌ ధుల్‌ (113 నాటౌట్‌; 202 బంతుల్లో 14×4, 1×6) శతకంతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ యశ్‌ సరిగ్గా 113 పరుగులే చేశాడు. గతంలో నారి కాంట్రాక్టర్‌ (గుజరాత్‌), విరాట్‌ స్వాతె (మహారాష్ట్ర)లు రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో రెండేసి సెంచరీలు సాధించారు.

శీతాకాల ఒలింపిక్స్‌ ముగింపు

2022 శీతాకాల ఒలింపిక్స్‌ ముగిసింది. ఈ క్రీడల్లో నార్వే 16 స్వర్ణాలు సహా 37 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. జర్మనీ 12 స్వర్ణాలు సహా 27 పతకాలతో రెండో స్థానం సాధించగా ఆతిథ్య చైనా 15 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి ఈసారి శీతాకాల ఒలింపిక్స్‌లో పోటీ పడ్డ ఏకైక అథ్లెట్‌ ఆరిఫ్‌ ఖాన్‌ (ఆల్పైన్‌ స్కీయర్‌) పతకం గెలవలేకపోయాడు. తర్వాతి క్రీడలు 2024లో పారిస్‌ వేదికగా జరుగుతాయి.

శ్రీవల్లి-హుమేరా జోడీకి టైటిల్‌

హైదరాబాద్‌ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక-హుమేరా బహర్మాస్‌ జోడీకి తొలి ఐటీఎఫ్‌ మహిళల టైటిల్‌ సాధించారు. ఐటీఎఫ్‌ మహిళల 15000 డాలర్ల టెన్నిస్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో ఈ ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో అన్‌సీడెడ్‌ రష్మిక-హుమేరా జంట 6-3, 6-1, 10-3 తేడాతో టాప్‌సీడ్‌ పునిన్‌ (థాయ్‌లాండ్‌)-అన్నా ఉరెకె (రష్యా)పై విజయం సాధించింది.

సకిబుల్‌ ప్రపంచ రికార్డు

బిహార్‌ కుర్రాడు సకిబుల్‌ గని అరంగేట్ర మ్యాచ్‌లో 341 పరుగులు (405 బంతుల్లో 56 × 4, 2 × 6) చరిత్ర సృష్టించాడు. తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో త్రిశతకం బాది ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్ర మ్యాచ్‌లో ఆ ఘనత అందుకున్న మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ప్లేట్‌ గ్రూప్‌లో మిజోరాం జట్టుతో మ్యాచ్‌లో అతడు చెలరేగిపోయాడు. మ్యాచ్‌ తొలి రోజే శతకం సాధించిన 22 ఏళ్ల సకిబుల్‌ మరింతగా చెలరేగాడు. 136 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన అతడు.. బౌండరీల వేటలో దూసుకెళ్లాడు. మొత్తం 56 ఫోర్లు బాది రికార్డులు బద్దలు కొట్టాడు. మరో వైపు బాబుల్‌ కుమార్‌ (229 నాటౌట్‌; 398 బంతుల్లో 27 × 4, 1 × 6) అజేయ ద్విశతకంతో సత్తాచాటడంతో బిహార్‌ తొలి ఇన్నింగ్స్‌ను 686/5 వద్ద డిక్లేర్‌ చేసింది. సకిబుల్, బాబుల్‌ కలిసి నాలుగో వికెట్‌కు 538 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన మిజోరాం 40/3తో రెండో రోజు ఆట ముగించింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా గత రికార్డు కూడా భారత క్రికెటర్‌ పేరు మీదే ఉంది. 2018లో మధ్యప్రదేశ్‌ ఆటగాడు అజయ్‌ రొతేరా హైదరాబాద్‌పై 267 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును సకిబుల్‌ తిరగరాశాడు. 2019లో లిస్ట్‌- ఎ క్రికెట్లో అడుగుపెట్టిన సకిబుల్‌ ఈ ఏడాది దేశవాళీ టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

క్రికెట్‌ ఆస్ట్రేలియా ఛైర్మన్‌గా హెండర్సన్‌

లచ్లాన్‌ హెండర్సన్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. తాత్కాలిక ఛైర్మన్‌ రిచర్డ్‌ స్థానంలో అతడు బాధ్యతలు స్వీకరించాడు. హెండర్సన్‌ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని సీఏ ఓ ప్రకటనలో తెలిపింది. హెండర్సన్‌ 1980ల్లో ఆస్ట్రేలియా తరఫున వివిధ వియో విభాగాల్లో క్రికెట్‌ ఆడాడు. 2018 నుంచి క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు సభ్యుడిగా ఉంటున్నాడు.

మహిళల ప్రపంచకప్‌ విజేత నగదు బహుమతి రెట్టింపు

మహిళల ప్రపంచకప్‌ విజేతకిచ్చే నగదు బహుమతిని ఐసీసీ రెట్టింపు చేసింది. న్యూజిలాండ్‌లో జరగబోయే ప్రపంచకప్‌ విజేత 1.32 మిలియన్‌ డాలర్లు అందుకోనుంది. 2017 ప్రపంచకప్‌తో పోలిస్తే టోర్నీ మొత్తం నగదు బహుమతి కూడా 75 శాతం పెరిగింది. ఎనిమిది జట్లు మొత్తం 3.5 మిలియన్‌ డాలర్లు అందుకుంటాయని ఐసీసీ తెలిపింది. టోర్నీ రన్నరప్‌నకు 6 లక్షల డాలర్లు లభిస్తాయి. 2017 రన్నరప్‌ భారత్‌ అందుకున్న మొత్తం కన్నా ఇది 2,70,000 డాలర్లు ఎక్కువ. అప్పుడు ఫైనల్లో గెలిచి ట్రోఫీ చేజిక్కించుకున్న ఇంగ్లాండ్‌కు 6,60,000 డాలర్ల నగదు బహుమతి దక్కింది. న్యూజిలాండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ (మార్చి 4)లో వెస్టిండీస్‌ను ఆతిథ్య జట్టు ఢీకొంటుంది.

స్వర్ణంతో ఎరిన్‌ చరిత్ర

శీతాకాల ఒలింపిక్స్‌లో 29 ఏళ్ల అమెరికా అథ్లెట్‌ ఎరిన్‌ జాక్సన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల 500మీ. స్పీడ్‌ స్కేటింగ్‌లో స్వర్ణం సాధించిన ఆమె.. ఈ క్రీడలో ఒలింపిక్‌ పతకం అందుకున్న తొలి నల్లజాతీయురాలిగా నిలిచింది. 1994 తర్వాత ఈ విభాగంలో ఆ దేశానికి దక్కిన మొదటి పతకమిదే. ఎరిన్‌ 37.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తకాగి (జపాన్‌ - 37.12సె), గొలికోవా (ఆర్ఓసీ - 37.21సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ‣ 2018 ప్యాంగ్‌చాంగ్‌ శీతాకాల క్రీడలకు ముందే ఇన్‌లైన్‌ నుంచి మంచు స్పీడ్‌స్కేటింగ్‌కు మారిన ఎరిన్‌.. - ఈ ప్రపంచకప్‌ సీజన్‌లో ఎనిమిది 500మీ.రేసులకు గాను నాలుగు గెలిచింది. ఇప్పుడు ఈ ఒలింపిక్స్‌లో పసిడి సాధించింది.

ఐస్‌ డ్యాన్స్‌లో సిజెరాన్‌ జోడీకి పసిడి

ఐస్‌ డ్యాన్స్‌లో పపడాకిస్‌ - సిజెరాన్‌ జోడీ సత్తాచాటింది. ఈ ఫ్రాన్స్‌ ద్వయం ప్రపంచ రికార్డుతో పసిడి సొంతం చేసుకుంది. 226.98 పాయింట్లు సాధించి స్వర్ణం గెలిచిన ఈ జంట.. తమ పేరిటే (2019లో 226.61) ఉన్న రికార్డును తిరగరాసింది. విక్టోరియా - కత్సలపోవ్‌ (ఆర్‌ఓú ˆ- 220.51), మాడిసన్‌ - డొనోహ్యూ (అమెరికా - 218.02) జోడీలు వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.

45వ స్థానంలో ఆరిఫ్‌

ప్రతిష్ఠాత్మక బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారత స్కీయర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ జెయింట్‌ స్లాలమ్‌ ఈవెంట్‌లో 45వ స్థానంలో నిలిచాడు. ఈ పోటీలో ఆరిఫ్‌ ఓవరాల్‌గా 2 నిమిషాల 47.24 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. 62 దేశాలకు చెందిన 89 మంది స్కీయర్లు పాల్గొన్న తొలి రేస్‌లో ఆరిఫ్‌ 53వ స్థానంలో నిలిచాడు.

రూ.11.5 కోట్లతో పంజాబ్‌కు లివింగ్‌స్టోన్‌

ఐపీఎల్‌ వేలం ఆటగాళ్లకు మిశ్రమానుభూతులను మిగిల్చింది. కొందరికి ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువ ధర పలికితే కొందరు అమ్ముడే పోలేదు. కొందరు తక్కువతో సరిపెట్టుకున్నారు. రెండో రోజు వేలానికి హైలైట్‌ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోనే. రూ.1 కోటి కనీస ధర కలిగిన లివింగ్‌స్టోన్‌ను పంజాబ్‌ రూ.11.5 కోట్లకు కొనుక్కుంది. 2022 వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడు అతనే.

సాకేత్‌ జోడీకి టైటిల్‌

సాకేత్‌ మైనేని-రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సత్తా చాటింది. బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాకేత్‌ జంట 6-3, 6-2తో హ్యూగో గ్రెనియర్‌-అలెగ్జాండ్రె ముల్లర్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది. తొలి సెట్లో ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జోడీ..úట్‌ గెలుచుకుంది. రెండో సెట్లో మరింత ధాటిగా ఆడిన సాకేత్‌ ద్వయం సర్వీస్‌లో అదరగొట్టి 6-2తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సాకేత్‌కు ఇది తొమ్మిదో ఛాలెంజర్‌ టైటిల్‌ కాగా.. రామ్‌కుమార్‌కు మూడోది.

ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌ ట్రోఫీ ఛాంపియన్‌గా తస్నీమ్‌

భారత యువ షట్లర్‌ తస్నీమ్‌ మీర్‌ ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. మహిళల జూనియర్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన ఏకైక భారత ప్లేయర్‌గా రికార్డుల్లో కెక్కిన తస్నీమ్‌ స్థాయికి తగ్గ ఆటతో విజృంభించింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 16 ఏళ్ల తస్నీమ్‌ 21-11, 11-21, 21-7తో యూలియా సుసాంటోను చిత్తు చేసింది. సీనియర్‌ విభాగంలో ప్రస్తుతం ప్రపంచ 404వ ర్యాంక్‌లో ఉన్న తస్నీమ్‌ ఛాంపియన్‌గా నిలిచే క్రమంలో మార్టీనా రెపికా, పన్వర్, ఫాలిమాపై విజయాలు సాధించింది.

పంత్‌కు టెస్టు బ్యాటింగ్‌ అవార్డు

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ క్రిక్‌ఇన్ఫో అవార్డు సొంతం చేసుకున్నాడు. 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఛేదనలో అజేయంగా 89 పరుగులు చేసి జట్టును గెలిపించిన అతను.. ‘టెస్టు బ్యాటింగ్‌ అవార్డు’కు ఎంపికయ్యాడు. క్రిక్‌ఇన్ఫో 15వ వార్షిక అవార్డులను ప్రకటించారు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌ 1-1తో సమమైన దశలో చివరి మ్యాచ్‌లో భారత్‌ వీరోచితంగా పోరాడింది. ముఖ్యంగా ఛేదనలో పంత్‌ సంచలన ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందుకున్న జట్టు.. 2-1తో సిరీస్‌ దక్కించుకుంది. మరోవైపు న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ గతేడాదికి గాను మేటి కెప్టెన్‌గా నిలిచాడు. జట్టును ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా, టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిపినందుకు అతణ్ని ఈ అవార్డు వరించింది.

టాటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్

టాటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో రోహన్‌ బోపన్న - రామ్‌కుమార్‌ రామనాథన్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. డబుల్స్‌ ఫైనల్లో బోపన్న-రామ్‌కుమార్‌ 6-7 (10-12), 6-3, 10-6తో ల్యూక్‌ సావిల్లె-జాక్‌ ప్యాట్రిక్‌ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచారు. టైబ్రేకర్‌కు మళ్లిన తొలి సెట్లో బోపన్న జోడీ గట్టిగానే పోరాడినా సెట్‌ కోల్పోయింది. అయితే రెండో సెట్లో బలంగా పుంజుకున్న భారత జంట మూడో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి, ఆపై సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. సూపర్‌ టై బ్రేకర్‌లో కూడా పోటీ నువ్వానేనా అన్నట్లే నడిచింది. అయితే తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన బోపన్న జోడీ ఆపై సెట్‌తో పాటు ట్రోఫీని గెలుచుకుంది. బోపన్నకు ఇది 21వ ఏటీపీ డబుల్స్‌ టైటిల్‌ కాగా.. రామ్‌కుమార్‌కు రెండోది. జనవరిలో అడిలైడ్‌ ఓపెన్‌లో బోపన్న - రామ్‌కుమార్‌ తొలిసారి జోడీ కట్టారు. ఆ టోర్నీలో ఫైనల్‌ చేరినా రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. టాటా ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సౌసా (పోర్చుగల్‌) గెలుచుకున్నాడు. ఫైనల్లో అతడు 7-6 (11-9), 4-6, 6-1తో ఎమిల్‌ (ఫిన్లాండ్‌)పై నెగ్గాడు.

ప్రపంచ క్రికెట్‌ వెయ్యో వన్డే ఆడిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా

ప్రపంచ క్రికెట్లో వెయ్యో వన్డే ఆడిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పిన టీమ్‌ఇండియా ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో అన్ని రంగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో అలవోకగా ప్రత్యర్థిని ఓడించింది. చాహల్‌ (4/49), వాషింగ్టన్‌ సుందర్‌ (3/30), ప్రసిద్ధ్‌ కృష్ణ (2/29) ధాటికి విండీస్‌ మొదట 43.5 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. జేసన్‌ హోల్డర్‌ (57; 71 బంతుల్లో 4×6) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (60; 51 బంతుల్లో 10×4, 1×6) ధనాధన్‌ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని భారత్‌ కేవలం 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (34 నాటౌట్‌; 36 బంతుల్లో 5×4), దీపక్‌ హుడా (26 నాటౌట్‌; 32 బంతుల్లో 2×4) రాణించారు. చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఒక్కో ఆటగాడికి రూ.40 లక్షలు నజరానా ప్రకటించిన బీసీసీఐ

రికార్డు స్థాయిలో భారత్‌కు అయిదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ను అందించిన కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.40 లక్షల చొప్పున అందించనుంది. సహాయ సిబ్బంది ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఇవ్వనుంది. ‣ అయిదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌లో మరోసారి భారత్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రికార్డు స్థాయిలో అయిదో సారి కప్పును ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో యువ భారత్‌ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టులో జేమ్స్‌ ర్యూ (95) పోరాడాడు. భారత బౌలర్లలో రాజ్‌ బవా (5/31), రవి కుమార్‌ (4/34) విజృంభించారు. వాళ్ల ధాటికి ఆ జట్టు ఓ దశలో 91/7తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో సేల్స్‌ (34 నాటౌట్‌)తో కలిసి జేమ్స్‌ ఎనిమిదో వికెట్‌కు 93 పరుగులు జతచేశాడు. ఛేదనలో భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ (50), నిశాంత్‌ (50 నాటౌట్‌), రాజ్‌ బవా (35) రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి బౌలర్లలో బోడెన్, సేల్స్, అస్పిన్‌వాల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ‣ రషీద్, రిషిత్‌లకు చెరో రూ.10 లక్షలు: అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యులైన గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌కు ఆంధ్రా క్రికెట్‌ సంఘం, హైదరాబాద్‌ క్రికెటర్‌ రిషిత్‌ రెడ్డికి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం చెరో రూ.10 లక్షల చొప్పున నజరానాలు ప్రకటించాయి. రషీద్‌ సెమీస్, ఫైనల్స్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు ప్రపంచకప్‌ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. రిషిత్‌ రిజర్వ్‌ ఆటగాడిగా జట్టులో ఉన్నాడు.

భారత్‌కు అయిదో అండర్‌-19 ప్రపంచకప్‌

అండర్‌-19 ప్రపంచకప్‌ మళ్లీ భారత్‌ ఖాతాలో చేరింది. వెస్టిండీస్‌ ఆతిథ్యమిచ్చిన 2022 టోర్నీలో జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లిష్‌ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కిది అయిదో అండర్‌-19 ప్రపంచకప్‌. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది.

వింటర్‌ ఒలింపిక్స్‌లో నార్వేదే తొలి స్వర్ణం

వింటర్‌ ఒలింపిక్స్‌లో తొలి పసిడి పతకాన్ని నార్వే సొంతం చేసుకుంది. మహిళల స్కైథాన్‌ క్రాస్‌కంట్రీ రేసులో థ్రెస్‌ జోహాగ్‌ స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ విభాగంలో నటాలియా (రష్యా) రజతం, స్టాడ్‌లోబెర్‌ (ఆస్ట్రియా) కాంస్యం గెలుచుకున్నారు. బైథ్లాన్‌లో మరో స్వర్ణం నార్వే సొంతమైంది. మిక్స్‌డ్‌ రిలేలో ఆ జట్టు పసిడి గెలవగా.. ఫ్రాన్స్, రష్యా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. ఆతిథ్య చైనా కూడా బోణీ కొట్టింది. షార్ట్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌లో చైనా స్వర్ణం గెలవగా, ఇటలీ రజతం, హంగేరి కాంస్యం దక్కించుకున్నాయి.

టాటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో బోపన్న జోడీ

టాటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో రోహన్‌ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ ఫైనల్లో ప్రవేశించింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో రెండో సీడ్‌ బోపన్న జంట 6-4, 4-6, 12-10తో రెబౌల్‌-దంబియా (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు. తొలి సెట్‌ గెలిచి రెండో సెట్‌ కోల్పోయిన బోపన్న జోడీకి మూడో సెట్లో గట్టిపోటీ ఎదురైంది. అయితే ఒత్తిడికి తట్టుకుంటూ నిలిచిన బోపన్న ద్వయం విజయాన్ని అందుకుంది. పురుషుల సింగిల్స్‌లో సౌసా (పోర్చుగల్‌), ఎమిల్‌ (గ్రీస్‌) ఫైనల్‌ చేరారు. సెమీస్‌లో సౌసా 5-7, 7-6 (7-4), 7-5తో యెమెర్‌ (స్వీడన్‌)పై విజయం సాధించగా, ఎమిల్‌ 6-3, 7-6 (7-0)తో మచ్‌జాక్‌ (పోలెండ్‌)పై నెగ్గాడు.

అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు మూడో స్థానం

రెండుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా అండర్‌-19 ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచింది. వర్గీకరణ పోరులో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 49.2 ఓవర్లలో 201 పరుగులకే పరిమితమైంది.

ఆసీస్‌ కోచ్‌ పదవికి లాంగర్‌ రాజీనామా సరళత లేని కోచింగ్‌ శైలితో ఇబ్బందిపడుతున్నామని గత కొంత కాలంగా సీనియర్‌ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న జస్టిన్‌ లాంగర్‌.. ఆస్ట్రేలియా కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుతో చర్చించిన తర్వాత అతడు తన రాజీనామాను సమర్పించాడు. కోచ్‌గా 51 ఏళ్ల లాంగర్‌ నాలుగేళ్ల పదవి కాలం ఈ జూన్‌తో ముగియనుంది. యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా టైటిల్‌ గెలిచిన ఆసీస్‌..స్వదేశంలో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 4-0తో చిత్తు చేసి విజేతగా నిలిచింది.

ప్రపంచ క్రికెట్‌లో 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా

ప్రపంచ క్రికెట్‌లో వెయ్యి వన్డేలు ఆడిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌తో తొలి వన్డేతో టీమ్‌ఇండియా ఆ ఘనత అందుకుంటుంది. 1974లో తొలి వన్డే ఆడిన భారత్‌ 47 ఏళ్ల తర్వాత ఇప్పుడు 1000వ వన్డే బరిలో దిగుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (1971), పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్‌ (1973) మనకంటే ముందే తమ తొలి వన్డే మ్యాచ్‌లాడినప్పటికీ వెయ్యి మైలురాయిని మొదట భారత్‌ చేరుకోబోతోంది. ఆస్ట్రేలియా (958), పాకిస్థాన్‌ (936) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకూ టీమ్‌ఇండియా 999 వన్డేల్లో 518 విజయాలు సాధించింది. 431 మ్యాచ్‌లు ఓడింది. 9 టై అయ్యాయి. 41 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. తొలి వన్డే నుంచి ఇప్పటివరకూ దేశాన్ని ఉర్రూతలూగించిన విజయాలెన్నో. ముఖ్యంగా 1983, 2011 వన్డే ప్రపంచకప్‌ టైటిళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ‣ 1974 జులై 13న భారత్‌ తన మొట్టమొదటి వన్డేలో ఇంగ్లండ్‌తో తలపడింది. ప్రత్యర్థి గడ్డపై రెండు వన్డేల సిరీస్‌లో భాగంగా అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో జట్టు తొలి మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడినా.. నవశకానికి అప్పుడే నాంది పడింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 53.5 ఓవర్లలో (మొత్తం 55 ఓవర్లు) 265 పరుగులకు ఆలౌటైంది. బ్రిజేష్‌ పటేల్‌ (82), అజిత్‌ (67) చెరో అర్ధశతకం చేశారు. ఛేదనలో ఇంగ్లాండ్‌ 6 వికెట్లు కోల్పోయి 51.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ప్రత్యర్థి జట్టులో జాన్‌ ఎడ్రిచ్‌ (90) రాణించాడు. భారత్‌ తన 50వ (పాకిస్థాన్‌పై), 100వ (ఆస్ట్రేలియా) వన్డేలను కపిల్‌దేవ్‌ సారథ్యంలో ఆడింది. సౌరభ్‌ గంగూలీ నాయకత్వంలో 2002లో 500వ వన్డే రికార్డు అందుకుంది. ఇప్పుడు రోహిత్‌ కెప్టెన్సీలో జట్టు 1000వ వన్డేకు సిద్ధమైంది.

వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం

వింటర్‌ ఒలింపిక్స్‌ బీజింగ్‌లోని బర్డ్‌నెస్ట్‌ స్టేడియంలో ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ ఆటలు ఆరంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు తదితర ప్రపంచ నాయకులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. వేసవి (2008లో), వింటర్‌ రెండు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఘనతను బీజింగ్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని ఈవెంట్లలో పోటీలు మొదలు కాగా ఫిబ్రవరి 5 నుంచి పతక ఈవెంట్లు ప్రారంభం కానున్నాయి. హైతీ, సౌదీ అరేబియా తొలిసారి వింటర్‌ ఒలింపిక్స్‌ బరిలో దిగబోతున్నాయి. సౌదీ తరఫున ఫయిక్‌ అబ్ది (స్కీయింగ్‌), హైతీ తరఫున రిచర్డ్‌ వియానో (స్కీయింగ్‌) పోటీపడబోతున్నారు. ఈ క్రీడల్లో 91 దేశాల నుంచి దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. ‣ ఈ క్రీడల్లో భారత్‌ తరఫున పోటీపడుతున్న ఏకైక ఆటగాడు ఆరిఫ్‌ ఖాన్‌ ప్రారంభోత్సవంలో ఆకర్షణగా నిలిచాడు. జాతీయ జెండా చేతబూని స్టేడియంలోకి వచ్చిన ఈ స్కీయింగ్‌ ఆటగాడు భారత బృందానికి ముందుగా నడిచాడు. ఈ క్రీడల్లో స్లాలోమ్, జెయింట్‌ స్లాలోమ్‌ రెండు విభాగాల్లో ఆరిఫ్‌ పోటీపడనున్నాడు.

సుహాన సైనికి కాంస్యం

డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి సుహాన సైని కాంస్య పతకం గెలుచుకుంది. అండర్‌-19 బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో 11-9, 9-11, 10-12, 11-13తో ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో సుహాన పోరాడి ఓడిపోయింది. అంతకుముందు క్వార్టర్స్‌లో సుహాన 11-9, 11-4, 11-8తో ఫరీదా (ఈజిప్ట్‌)పై నెగ్గింది.