భారతరత్న లతా మంగేష్కర్ మరణం
ఏడు దశాబ్దాల పాటు ఆబాలగోపాలాన్ని గాన మాధుర్యంతో ఓలలాడించిన ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ (92) కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతూ మరణించారు.
‣ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1929 సెప్టెంబరు 28న జన్మించిన మంగేష్కర్‌కు మీనా, ఆశా భోంస్లే, ఉష, హృదయనాథ్‌లు తోబుట్టువులు. శాస్త్రీయ సంగీతకారుడైన తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత.. ఐదో ఏట నుంచే పాడడం మొదలుపెట్టారు. తండ్రి మరణానంతరం నటనా రంగంలో ఆమె అడుగుపెట్టినా పాటల ప్రస్థానాన్ని మాత్రం కొనసాగించారు. మొట్టమొదటగా ఓ మరాఠీ చిత్రంతో ఆమె నేపథ్య గాయని అయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. చివరిసారిగా ఆమె ఆలపించిన పాట గత అక్టోబరులో విడుదలైంది. ‘చల్తే చల్తే’, ‘సత్యం శివం సుందరం’, ‘ప్యార్ కియాతో డర్నా క్యా’, ‘లగ్ జా గలే’ వంటి ఎన్నో చిరస్మరణీయ గీతాలు ఆమె గాత్రం నుంచి జాలువారాయి. ఆమెను వరించని పురస్కారం లేదు. 1999-2005 మధ్య ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. కళాకారుల కోటాలో కేంద్ర ప్రభుత్వం ఆమెను నియమించింది. భారతరత్నకు అదనంగా పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో పాటు జాతీయ చలన చిత్రోత్సవాల్లో అనేక అవార్డులను ఆమె పొందారు.
‣ 1960 నాటి చారిత్రక చిత్రం ‘మొగల్ ఏ ఆజం’లో అక్బర్ జహాపనా ఎదుట అనార్కలి పాడిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ దేశంలో ప్రేమికులకు ఓ నినాదమే ఇచ్చింది. ఇంకా ‘అజీబ్ దాస్తాన్ హై యే’ (దిల్ అప్నా ప్రీత్ పరాయా), ‘కహీ దీప్ జలే కహీ దిల్’ (బీస్ సాల్ బాద్), ‘ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై’ (గైడ్), ‘లగ్‌జా గలే’, ‘నైనా బర్సే రిమ్ ఝిమ్’ (వో కౌన్ థీ?), ‘తూ జహా జహా చలేగా’ (మేరా సాయా) పాటలు ఈ దేశంలో నిత్యం ఏదో ఒక లోగిలిలో వినిపిస్తూనే ఉంటాయి. మీనాకుమారి చివరిరోజుల్లో వచ్చి గొప్ప క్లాసికల్ చిత్రంగా నిలిచిన ‘పాకీజా’ కోసం లత పాడిన ‘చల్తే చల్తే యుహీ కోయీ మిల్‌గయా’ పాట రస హృదయాలను వెంటాడుతుంది.
‣ ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా..’ అనేది లత పాడిన తొలి పాట. అయితే రికార్డుల్లో ఆ పేరు కనిపించదు. నటీమణి ‘కామిని’ పేరు తెరపై కనిపిస్తుంది. 1942లో మరాఠీ చిత్రం ‘కిటీ హసాల్’ కోసం లతా మంగేష్కర్ పాడిన పాట ఎడిటింగ్‌లో కత్తిరించాల్సి వచ్చింది. ఈ పాటలకు ఆమెకు పారితోషికం అందనే లేదు.
నటిగా 8 చిత్రాల్లో :-
1942 నుంచి 1948 వరకూ ఎనిమిది చిత్రాల్లో లత నటించారు. తండ్రి హృదయనాథ్ మంగేష్కర్ చనిపోయి, కుటుంబ భారం తనమీద పడినప్పుడు, ఆమె నటిగానే స్థిరపడాలనుకున్నారు. తమ కుటుంబానికి బాగా తెలిసిన మాస్టర్ వినాయక్ సిఫార్సుతో ఆమె 1942లో ‘పహెలీ మంగళాగౌర్’ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఓ పాటా పాడారు. 1945లో వచ్చిన మరాఠీ చిత్రం ‘బడీ మా’లో ఆమె తన చెల్లెలు ఆశా భోంస్లేతో కలిసి నటించారు. ‘గజభావూ’ అనే మరాఠీ చిత్రంలో ‘మాతా ఏక్ సపూట్‌కీ దునియా బదల్ దే తూ’ అనే ఓ హిందీ పాట పాడారు. లెక్క ప్రకారమైతే, అదే ఆమె పాడిన తొలి హిందీ గీతం. ‘ఆప్ కీ సేవా మే’ తన తొలి హిందీ చిత్రం.
1944లో తొలిసారి నూర్జహాన్‌తో భేటీ
‣ ప్రఖ్యాత గాయనీమణులైన లతా మంగేష్కర్, నూర్జహాన్ (పాకిస్థాన్) 1944లో కొల్హాపుర్‌లో ‘బడీ మా’ సినిమా సెట్‌లో తొలిసారి కలుసుకున్నారు. ఆ సందర్భంగా నూర్జహాన్ కోరిక మేరకు లతా మంగేష్కర్ పలు శాస్త్రీయ గీతాలు, కొన్ని సినిమా పాటలను ఆలపించారు. ఆ చలన చిత్రంలో మంగేష్కర్ చిన్న పాత్ర కూడా పోషించారు.
‣ భోజ్‌పురి భాషలో వచ్చిన మొట్టమొదటి చిత్రం ‘గంగా మైయ్యా తోహే పియారి ఛధైబో’ (1963)లో లతాజీ నేపథ్య గాయకురాలు. ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీ కూడా తన గాత్రాన్ని అందించారు.
‣ ‘మొఘల్-ఎ-ఆజం’ సినిమాలో నౌషాద్ స్వరపరచిన ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ అని ఆమె గళం సవరించుకుంటే యావద్దేశంలోని యువత ఆమె అభిమానులైపోయారు.
‣ మదన్ మోహన్ ‘అపరాధ్’ చిత్రంలో స్వరపరచిన ‘ఆప్ కి నజరోం మే సమఝా’ పాటను అమృత గుళికగా సంగీతప్రియులు ఆదరించారు. అప్పుడే అడుగిడిన లక్ష్మీకాంత్ ప్యారేలాల్ 700కు పైగా పాటలు పాడించారు. యువ సంగీత దర్శకులు ఆనంద్ మిలింద్, నదీమ్ శ్రావణ్, జతిన్ లలిత్, ఉత్తమ సింగ్, అను మాలిక్, ఎ.ఆర్.రెహమాన్ వంటి వారి సారథ్యంలో కొత్త తరం గాయకులతో గళం పంచుకున్నారు. యశ్ చోప్రా నిర్మించిన అన్ని సినిమాలలో ఆమె పాటలు పాడి రికార్డు సృష్టించారు. గాయకులకు కష్టసాధ్యమైన మూడో స్వరంలో ఆమె సునాయాసంగా పాడేవారు.
‣ 1948 - 87 మధ్యకాలంలో 36 భాషల్లో దాదాపు ముప్పైవేల పాటలు పాడారు. ప్రపంచంలోనే అత్యధిక గీతాలు ఆలపించిన గాయనిగా గిన్నిస్ రికార్డు ఘనత సాధించారు.
‣ రాహుల్ దేవ్ బర్మన్ ‘పరిచయ్’ సినిమా కోసం స్వరపరచిన ‘బీతీ న బితా ఏ రెహనా’ పాట ఆలపించిన లతాజీకి జాతీయ పురస్కారం లభించింది. ‘కోరా కాగజ్’ చిత్రంలో కల్యాణ్‌జీ - ఆనంద్‌జీ స్వరపరచిన ‘రూటే రూటే పియా’ పాటకూ మరో జాతీయ అవార్డు అందుకున్నారు. 1974లో ప్రఖ్యాత లండన్ ఆల్బర్ట్ హాలులో సంగీత విభావరి నిర్వహించి మన్ననలందుకున్నారు. 1985లో గ్రేటర్ టొరంటోలోని మ్యాపుల్ లీఫ్ గార్డన్‌లో సంగీత కచేరీ నిర్వహించారు.
‣ భారత ప్రభుత్వం లతాజీని పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలు ప్రదానం చేసి గౌరవించింది. వీటితో పాటు మహారాష్ట్ర భూషణ్, ఎన్.టి.ఆర్, ఏఎన్‌ఆర్ జాతీయ పురస్కారాలు, ఫ్రెంచ్ ప్రభుత్వ లెజియన్ అవార్డు వరించాయి. 1993లో ఫిల్మ్‌ఫేర్ సంస్థ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు లతా మంగేష్కర్ పేరుతో అవార్డును నెలకొల్పాయి. డాక్టరేట్లతో పాటు మరెన్నో పురస్కారాలు వరించాయి.
‣ 1999లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యాక ఒక్క రూపాయీ జీతం తీసుకోకుండా ఆదర్శంగా నిలిచారు. 1997లో ‘సారేజహాసే అచ్ఛా’ అని ఆమె పార్లమెంటులో గళం విప్పితే మొత్తం ఎంపీలు గొంతు కలిపారు. తన తండ్రి దీనానాథ్ పేరిట ఓ ఆసుపత్రిని కట్టించారు.
‣ 1990లో లత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ‘లేకిన్...’ అనే సినిమా నిర్మించారు. ఇందులో ‘యార్ సిలి సిలి’ అని ఆమె ఆలపించిన పాటకు జాతీయ బహుమతి లభించింది. ఆమె మరాఠీలో ‘వాదల్’, హిందీలో ‘జాంజిహార్’, ‘కాంచన్ గంగ’ సినిమాలూ నిర్మించారు. ఎనిమిది చిత్రాల్లో నటించి మెప్పించారు.
‣ ‘శ్రద్ధాంజలి...మై ట్రిబ్యూట్ టు ది ఇమ్మోర్టల్స్’ పేరుతో అలనాటి గాయకులు సైగల్, రఫీ, హేమంతకుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జోహరాబాయ్, కానన్ దేవి ఆలపించిన పాటల్ని తన గళంలో రికార్డు చేసి ఆల్బంలుగా విడుదల చేశారు.
రాహుల్ బజాజ్ మరణం
ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రపంచ పారిశ్రామిక పటంలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ బజాజ్ (83) మరణించారు.
కోట్ల మంది భారతీయులు ‘హమారా బజాజ్’ అనుకునేలా చేసిన ఈ దిగ్గజం వయసు సంబంధిత అనారోగ్యం కారణంగా మరణించినట్లు గ్రూప్ అధికారి ఒకరు ప్రకటించారు.
2021 ఏప్రిల్ 30న యన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఛైర్మన్ పదవి నుంచి వైదొలగి.. గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
‣ 1938 జూన్ 10న రాహుల్ బజాజ్ జన్మించారు. 1965లో బజాజ్ గ్రూప్ వ్యాపార పగ్గాలు చేపట్టారు.
ఆయన సారథ్యంలో బజాజ్ ఆటో రూ.7.2 కోట్ల టర్నోవరు నుంచి రూ.12,000 కోట్లకు చేరుకుంది.
ముఖ్యంగా రాణా ప్రతాప్‌సింగ్ యుద్ధంలో అధిరోహించిన గుర్రం పేరు (చేతక్)తో తీసుకొచ్చిన బజాజ్ చేతక్ స్కూటర్లు భారత్‌లోని మధ్యతరగతి కుటుంబంలో ఒక భాగంగా మారాయి.
‘హమారా బజాజ్’ అనే మాట అంతటా వినిపించింది.
ఎన్నో అవార్డులు, పదవులు :-
‣ పద్మభూషణ్
‣ ఎన్నో యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్లు
‣ ఇండియన్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్
‣ ఐఐటీ బాంబే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మాజీ ఛైర్మన్.
‣ ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లకు మాజీ ఛైర్మన్
‣ ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు వ్యవస్థాపక సభ్యులు.
‣ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సౌత్ ఏషియా అడ్వైజరీ బోర్డు మాజీ సభ్యులు.
‣ జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్‌తో పాటు బజాజ్ గ్రూప్ కంపెనీలు, ఛారిటబుల్ ట్రస్టుల ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కార్యకలాపాలను రాహుల్ బజాజ్ నిర్వహించారు.
భాజపా సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి మరణం
-సీనియర్ భాజపా నేత, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా సేవలందించిన చందుపట్ల జంగారెడ్డి (87) మరణించారు. తెలంగాణ రాష్ట్రం, హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయన ఊపిరితిత్తుల సమస్యతో తుదిశ్వాస విడిచారు. హనుమకొండ జిల్లా పరకాలలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జంగారెడ్డి 1935లో జన్మించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 1967లో జనసంఘ్ తరఫున పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి పింగిళి ధర్మారెడ్డిపై గెలుపొందారు.
- ఆ రోజుల్లో పరకాల నియోజకవర్గంలో కరెంట్ సౌకర్యం లేని గ్రామాలుండేవి. ఆయన ఆయా ప్రాంతాలకు కరెంటు సౌకర్యం కల్పించారు. అప్పట్నుంచి కరెంట్ జంగారెడ్డిగా ఆయన ఖ్యాతి గడించారు. పరకాల స్థానం ఎస్సీకి రిజర్వు కావడంతో అప్పటి శాయంపేట నియోజకవర్గం నుంచి భాజపా తరఫున 1978, 1983లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్‌గా తెలంగాణ ప్రాంతంలో 40 కళాశాలలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.
- 1984 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భాజపా తరఫున తొలి ఎంపీగా ఎన్నికై జంగారెడ్డి రికార్డు సృష్టించారు. అప్పటి హనుమకొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పీవీ.నరసింహారావుపై.. 54 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో భాజపాకు దేశవ్యాప్తంగా ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. పార్లమెంటులో జాతీయ వాదాన్ని బలంగా వినిపించడంతో పార్టీ అగ్రనేతలైన వాజ్‌పేయీ, ఆడ్వాణీ లాంటివారితో సాన్నిహిత్యం ఏర్పడింది.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గురుప్రసాదరావు మరణం
కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత నాగళ్ల గురుప్రసాదరావు (88) విజయవాడలో మరణించారు. గురుప్రసాదరావు గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో 1933లో జన్మించారు. 1978లో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, శాఖాధిపతిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగ విరమణ అనంతరం సిద్ధార్థ కళాపీఠం కార్యదర్శిగా (1990 - 2013) సేవలందించారు. శాలివాహనుడు పేరుతో ఆయన రచించిన చారిత్రక గ్రంథాన్ని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పాఠ్యాంశంగా పరిచయం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం 2017లో గురుప్రసాదరావును వరించింది. 2006లో సాహిత్య అకాడమీ సాంస్కృతిక ప్రతినిధిగా పనిచేశారు.
ఒడిశా మాజీ సీఎం హేమానంద బిశ్వాల్ మరణం
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ (83) భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. పశ్చిమ ఒడిశా జిల్లాల్లో ప్రముఖ ఆదివాసి నేత అయిన బిశ్వాల్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించారు. ఝార్సుగుడ జిల్లా ఠాకూర్‌పడలో జన్మించిన ఆయన సుందర్‌గఢ్ జిల్లా నుంచి రాజకీయాలు నడిపారు. 1974లో తొలిసారిగా లైకిడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా అయిదుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన ఆయన జేబీ పట్నాయక్ మంత్రివర్గంలో పలు శాఖల మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2000 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2009 నుంచి 2014 వరకు సుందర్‌గఢ్ ఎంపీగా సమర్థ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యి మరణించారు. రాజకీయాల్లోనూ వివాదరహితుడిగానే పేరొందిన ఆయన తన నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
‣ విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగివచ్చి 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ సారథిగా ప్రొఫెషనల్ జీవితాన్ని ఆరంభించారు. 2012 వరకు సుమారు 15ఏళ్ల పాటు సివిల్ కాంట్రాక్టర్‌గా, పారిశ్రామికవేత్తగా కొనసాగారు. కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్, రాజమోహన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంస్ రోడ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంసీ పవర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, త్రిశూర్ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్, ఏబీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్, పీచ్ ట్రీ డెవలపర్స్ తదితర 13 కంపెనీల్లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడిగా గౌతమ్‌రెడ్డి 2012లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ ఏడాది నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో తండ్రి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. 2013లో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమై, ఆ ప్రాంతంపై అవగాహన కోసం 42 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 2014లో వైకాపా తరఫున తొలిసారి ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీచేసి 31,438 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2019లో రెండోసారి 22,276 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదే ఏడాది జూన్ 8న రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్రంలో ప్రస్తుత మంత్రి మండలిలో అయిదు శాఖల బాధ్యతలను నిర్వర్తించిన ఏకైక మంత్రిగా గౌతమ్‌రెడ్డి గుర్తింపు పొందారు. ఐటీ, పరిశ్రమలు - వాణిజ్యం, పెట్టుబడులు - మౌలిక సదుపాయాలు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి - శిక్షణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. మంత్రిగా చురుకైన పనితీరును కనబరిచారు. తన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం స్వయంగా దిల్లీకి వెళ్లి ఆయా కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఆ మంత్రిత్వ శాఖల్లోనూ అనుశీలన చేయడం ఆయన అలవాటు.
గౌతమ్‌రెడ్డి వ్యక్తిగతం:-
స్వస్థలం: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి
జననం: 2-11-1971
విద్యాభ్యాసం: ఊటీలోని గుడ్‌షెపర్డ్‌లో పాఠశాల విద్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్లస్ టూ, భద్రుకా కళాశాలలో డిగ్రీ, మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో ఎమ్మెస్సీ (టెక్స్‌టైల్స్) పూర్తి చేశారు.
సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు మరణం
అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన అష్టావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆశావాది ప్రకాశరావు (77) గుండెపోటుతో స్వగృహంలో మరణించారు. శింగనమల మండలం కొరివిపల్లి గ్రామానికి చెందిన ప్రకాశరావు 1944 ఆగస్టు 2న జన్మించారు. ప్రకాశరావు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివే రోజుల్లోనే మొదటి అష్టావధానం చేసి సాహితీ ప్రక్రియలో తనదైన ముద్ర వేశారు. తెలుగు నేలతో పాటు వివిధ రాష్ట్రాల్లో 171 అష్టావధానాలు చేశారు. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1978 - 83 మధ్య ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగారు. పుష్పాంజలి, వరదరాజ శతకం, విద్యాభూషణ, మెరుపు తీగలు తదితర పుస్తకాలను రచించారు. 40కిపైగా పురస్కారాలు అందుకున్నారు. 2020 - 21కుగాను భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని 2021 నవంబరులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ సంగీత కెరటం బప్పీ లహిరీ మరణం
బాలీవుడ్ సంగీత కెరటం బప్పీ లహిరీ (69) మరణించారు. 1970 - 80లలో సినీ సంగీతంలో ఆయన ఓ ఊపు తెచ్చారు. ఆయన స్వరాలు అందించిన పాటలు, ఆలపించిన గీతాలు శ్రోతల గుండెల్లో నిలిచిపోయాయి. బప్పీ ‘డిస్కోకింగ్’గా పేరు తెచ్చుకున్నారు.
‣ ‘చల్తేచల్తే’, ‘డిస్కో డ్యాన్సర్’, ‘షరాబీ’ లాంటి చిత్రాలతో సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఆయన స్వరపరిచిన ‘ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్’ గీతం భారతీయ సంగీత అభిమానుల్ని అలరించింది. హిందీ, బెంగాలీతో పాటు తమిళ, కన్నడ, గుజరాతీ భాషా చిత్రాలకు కూడా స్వరాలు అందించారు.
జితేంద్ర, శ్రీదేవి జంటగా 1983లో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘హిమ్మత్‌వాలా’ సినిమా విజయంలో ఆయన పాటలు కీలకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత 1983 - 85 మధ్య కాలంలో జితేంద్ర నటించిన 12 సిల్వర్ జూబ్లీ చిత్రాలకు సంగీతం అందించి రికార్డు సృష్టించారు బప్పీ. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ వరుస చిత్రాలతో క్షణం తీరిక లేని బప్పి 1986లో ఏకంగా 33 సినిమాలకు స్వరాలు అందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.
రాక్, డిస్కో పాటలే కాదు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, కిషోర్ కుమార్ పాడిన ఎన్నో మధురమైన గీతాలకు ఆయన స్వరాలు అందించారు. హిందీలో ఆయన చివరిసారిగా స్వరాలు అందించి, ఆలపించిన చిత్రం ‘బాఘి 3’. 2014లో పశ్చిమ్ బంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
బెంగాలీ దిగ్గజ గాయని సంధ్య ముఖర్జీ మరణం
బెంగాలీ దిగ్గజ గాయని సంధ్య ముఖర్జీ (91) మరణించారు. ఎస్.డి.బర్మన్, నౌషాద్, సలీల్ చౌధురీ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు. ఎన్నో బెంగాలీ, హిందీ చిత్రాల్లో పాటలు పాడిన సంధ్య ముఖర్జీ బంగ బిభూషణ్, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు.
పంజాబీ నటుడు దీప్ సిద్ధూ దుర్మరణం
రైతుల ఆందోళనల సమయంలో హింసను ప్రేరేపించారన్న ఆరోపణలను ఎదుర్కొన్న పంజాబీ నటుడు దీప్ సిద్ధూ (37) రోడ్డు ప్రమాదంలో మరణించారు. హరియాణా సోనీపత్ జిల్లాలోని ఖర్‌ఖౌదా సమీపంలో కుండలీ - మానేసర్ - పలవాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆయన నడుపుతున్న స్కార్పియో వాహనం ఓ ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి నటుడిగా మారిన దీప్ సిద్ధూకు పంజాబీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు రమేశ్ దేవ్ మరణం
బాలీవుడ్, మరాఠీ చిత్రాల పాతతరం నటుడు రమేశ్ దేవ్ (93) ముంబయిలో గుండెపోటుతో మరణించారు. సినీ దర్శకుడైన కుమారుడు అభినయ్ దేవ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 250కు పైగా హిందీ, సుమారు 200 మరాఠీ చిత్రాల్లో రమేశ్ దేవ్ నటించారు. అరవై ఏళ్ల కెరియర్‌లో ‘ఆనంద్’, ‘ఆప్ కీ కసమ్’ వంటి పలు హిందీ చిత్రాల్లో చక్కటి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’, సన్నీ దేవోల్ చిత్రం ‘ఘాయల్ వన్స్ అగైన్’ చివరిరోజుల్లో ఈయన నటించిన చిత్రాలు. భార్య సీమా దేవ్ కూడా ఒకప్పటి నటే. మరో కుమారుడు అజింక్య దేవ్ మరాఠీ చిత్రాల నటుడు.