సెబీకి తొలి మహిళాఛైర్‌పర్సన్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కొత్త ఛైర్‌పర్సన్‌గా మాధవి పురి బచ్(57) నియమితులయ్యారు. మార్కెట్ నియంత్రణాధికార సంస్థ పగ్గాలు చేపట్టబోతున్న తొలి మహిళ ఈమే. సెబీలో తొలి పూర్తికాల సభ్యురాలిగా చేరిన బచ్.. ప్రైవేటు రంగం నుంచి సెబీలో పనిచేస్తున్న తొలి వ్యక్తి కూడా. ఛైర్‌పర్సన్‌గా మూడేళ్ల కాలానికి మాధవి నియమితులైనట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నియామకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది. సెబీ ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలం (ఫిబ్రవరి 28)తో ముగిసింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి త్యాగి(63) 2017 మార్చి 1న మూడేళ్ల కాలానికి సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
‣ దిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చదివిన మాధవి; ఐఐఎమ్ అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆర్థిక మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆమె తన వృత్తి జీవితాన్ని ఐసీఐసీఐ బ్యాంక్‌లో 1989లో ప్రారంభించారు. 12 ఏళ్ల పాటు అందులో పనిచేశారు. అందులో మూడేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ ఉన్నారు. ఆ తర్వాత 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. 2011లో ప్రైవేటు ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్‌లో చేరేందుకు సింగపూర్ వెళ్లి, 2013 వరకు అందులో పనిచేశారు. 2011 నుంచి 2017 మధ్య ఐడియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ చేశారు. 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబరు 4 వరకు సెబీ పూర్తికాల సభ్యురాలిగా త్యాగితో కలిసి పనిచేశారు.
హెచ్‌యూఎల్ నాన్ - ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నితిన్
ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ యునిలీవర్ (హెచ్‌యూఎల్) నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నితిన్ పరాంజపేను నియమిస్తున్నట్లు ప్రకటించింది. 2022 మార్చి 31 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బోర్డు ఛైర్మన్, సీఈఓ-ఎండీ పదవుల్ని విడదీసే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, సంజీవ్ మెహతా ఎండీ, సీఈఓగా కొనసాగుతారని సంస్థ తెలిపింది.
కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ సంయుక్త కార్యదర్శిగా నాగులాపల్లి శ్రీకాంత్
కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ సంయుక్త కార్యదర్శిగా 1998వ బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి నాగులాపల్లి శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు.. లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఇందులో ఏది తక్కువైతే అంతకాలం ఈ పదవిలో కొనసాగుతారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రభుత్వంలో ఇంధనశాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ అఖిలభారత సర్వీసులకు చెందిన 45 మంది సంయుక్త కార్యదర్శిస్థాయి అధికారులను బదిలీచేసింది. అందులో ప్రస్తుతం కేంద్ర క్రీడాశాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న 1995వ బ్యాచ్ ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి అతుల్ సింగ్‌ను తిరిగి ఏపీ కేడర్‌కు పంపుతున్నట్లు తెలిపింది.
ఏపీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్‌రెడ్డిని నియమించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు తితిదే ఈవో పోస్టులోనూ ఆయన కొనసాగుతారని స్పష్టం చేసింది. రాష్ట్ర నిఘా విభాగం చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజనేయుల్ని నియమించింది. ప్రస్తుతం నిఘా విభాగం చీఫ్‌గా ఉన్న కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డిని అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) చీఫ్‌గా బదిలీ చేసింది. ఆయనే ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా (పూర్తి అదనపు బాధ్యత) ఉన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న శంఖబ్రత బాగ్చీని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా నియమించింది.
‣ సాధారణ పరిపాలన శాఖ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శి పోస్టుని సైతం పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ పోస్టునీ పూర్తి అదనపు బాధ్యతగా ఆయనే నిర్వహిస్తారని తెలిపింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ల్యాండ్ అండ్ డీఎం)గా ఉన్న నీరబ్‌కుమార్ ప్రసాద్‌ని పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న జీఎస్సార్‌కేఆర్ విజయకుమార్‌ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా నియమించింది. రాష్ట్ర అభివృద్ధి, ప్లానింగ్ సొసైటీ సీఈఓ, ప్రణాళికా విభాగం ఎక్స్‌అఫీషియో కార్యదర్శి పోస్టులనూ పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న విజయకుమార్, ఇకపైనా ఆయా పోస్టుల్లో కొనసాగుతారు.
ఎన్‌ఎల్‌సీఐఎల్ డైరెక్టర్‌గా కలసాని మోహన్‌రెడ్డి
ఎన్‌ఎల్‌సీఐఎల్ (నైవేలీ లిగ్నైట్) డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్)గా కలసాని మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ సంస్థ సీఈఓగా పనిచేస్తున్న ఆయన్ను డైరెక్టర్‌గా నియమించడానికి కేంద్ర నియామకాల మంత్రివర్గ సంఘం ఆమోదముద్ర వేసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2024 మే 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత ఈడీగా నరేష్ ఆనంద్
ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్‌ఈడీ)గా నరేష్ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సభ్యుడిగా ఉన్నారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందిన నరేష్ ఆనంద్, ఎన్టీపీసీలో 1984లో ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా చేరారు. ఎన్టీపీసీలోని వివిధ విభాగాల్లో దిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లోని ఎన్టీపీసీ యూనిట్లలో పనిచేశారు. ఎన్టీపీసీ దులంగా కోల్‌మైన్ ప్రాజెక్టు అధిపతిగా నూతన మైనింగ్ విధానాలు (ఎస్‌ఓపీస్) ఆవిష్కరించారు. తాజాగా సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వచ్చారు.
నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌గా అశోక్‌కుమార్
భారత మొదటి ‘జాతీయ సముద్ర తీర భద్రతా సమన్వయకర్త’ (నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్)గా నేవీ మాజీ వైస్ అడ్మిరల్ జి.అశోక్‌కుమార్‌ను కేంద్రం నియమించింది. ఈ పోస్టు ఏర్పాటుకు గతేడాదే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఏర్పరచడమే కోఆర్డినేటర్ ప్రధాన విధి.
ఎయిరిండియా ఎండీగా ఇల్కర్ ఐచీ
టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఐచీ (51)ని ఎయిరిండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ)గా నియమించినట్లు టాటా సన్స్ ప్రకటించింది. ‘ఐచీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి ఎయిరిండియా బోర్డు సమావేశమైంది. విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ నియామకం జరిగింద’ని టాటా సన్స్ పేర్కొంది. బోర్డు సమావేశానికి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న లేదా అంతకంటే ముందే ఐచీ బాధ్యతలు స్వీకరిస్తారని వివరించింది. ఐచీ నియామకానికి నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.
ఐసీఏఐ ప్రెసిడెంట్‌గా దేవాశీష్ మిత్రా
2022-23 సంవత్సరానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్‌గా దేవాశీష్ మిత్రా ఎన్నికయ్యారు. అనికేత్ సునీల్ తలాటి వైస్ ప్రెసిడెంట్‌గావ్యవహరించనున్నారు. వాణిజ్య శాస్త్రంలో (కామర్స్) మాస్టర్ డిగ్రీను పూర్తి చేసిన మిత్రాకు అకౌంటింగ్ విభాగంలో 34 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఛార్టర్డ్ అకౌంటెంట్‌గానే కాకుండా.. కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీగానూ ఉన్నారు. తలాటి కామర్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 2014-15 సంవత్సరానికి ఐసీఏఐ అహ్మదాబాద్ శాఖకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2017-18 సంవత్సరానికి డబ్ల్యూఐఆర్‌సీకి సెక్రటరీగా వ్యవహరించారు. అకౌంటింగ్ విభాగానికి సంబంధించి ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన ఐసీఏఐలో 3.4 లక్షల మంది సభ్యులు, ఏడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.
సీఐఐ విజయవాడ జోన్ ఛైర్‌పర్సన్‌గా నీలిమ
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విజయవాడ జోన్ ఛైర్‌పర్సన్‌గా ఇన్‌క్యాప్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ చల్లగుళ్ల నీలిమను, వైస్ ఛైర్మన్‌గా అవెరా (విద్యుత్ వాహనాల) సంస్థ సీఈవో ఆకుల వెంకటరమణను నియమించింది. వర్చువల్‌గా నిర్వహించిన సీఐఐ విజయవాడ జోన్ వార్షిక సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ‘ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ అనే అంశంపై సీసీఎల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ గ్రూప్ సీఈవో ప్రవీణ్ మాట్లాడుతూ సరైన ఆలోచనా విధానాలే వ్యాపారాన్ని విజయవంతం చేయడంలో కీలకం; వ్యాపారాభివృద్ధి, కొనసాగింపు కోసం బలమైన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఐఓసీ మొదటి మహిళా డైరెక్టర్‌గా శుక్లా మిస్త్రీ
దేశంలో అతిపెద్ద చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) బోర్డులో మొదటి మహిళా డైరెక్టర్‌గా శుక్లా మిస్త్రీ చేరారు. ఐఓసీ డైరెక్టర్ (రిఫైనరీస్)గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్), రత్నగిరి రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ బోర్డుల్లో కూడా ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు.
అమృత్ 2.0 పథకం తెలుగు రాష్ట్రాల బాధ్యులు, సమన్వయకర్తగా బుద్ద చంద్రశేఖర్
తెలుగు రాష్ట్రాల్లో అమృత్ పథకం అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)లో చీఫ్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బుద్ద చంద్రశేఖర్‌ను సమన్వయకర్త (కో-ఆర్టినేటర్)గా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నియమించింది. పట్టణాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. విశాఖకు చెందిన చంద్రశేఖర్ అమృత్ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు.
పీఎన్‌జీఆర్‌బీ అధిపతిగా తరుణ్ కపూర్
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్‌జీఆర్‌బీ) కొత్త ఛైర్మన్‌గా చమురు శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ ఎంపికైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021 నవంబరు 30న పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కపూర్ పదవీ విరమణ చేశారు. డజనుకు పైగా అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేసిన తర్వాత కపూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ నియామకాల సంఘం, కపూర్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపితే, ఆయన పగ్గాలు చేపట్టనున్నారు.
ఐబీబీఐ ఛైర్‌పర్సన్‌గా రవి మిత్తల్
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) ఛైర్‌పర్సన్‌గా రవి మిత్తల్‌ను ప్రభుత్వం నియమించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానంలో పనిచేసిన ఎమ్.ఎస్. సాహూ తన అయిదేళ్ల పదవీ కాలాన్ని 2021 సెప్టెంబరు 30న పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ సీటు భర్తీ కాలేదు. 2021 అక్టోబరులో ఐబీబీఐ పూర్తి కాల సభ్యుడు నవరంగ్ సైనీకి ఛైర్‌పర్సన్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. గతంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌క్యాస్టింగ్ (ఐ అండ్ బీ) కార్యదర్శిగా పనిచేసిన మిత్తల్‌ను తాజాగా ఐబీబీఐ ఛైర్‌పర్సన్‌గా నియమించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఎన్టీపీసీ దక్షిణప్రాంత ఈడీగా మునీష్ జవహరి
ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్‌ఈడీ)గా మునీష్ జవహరి అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఎన్టీపీసీ పశ్చిమ ప్రాంత ఆర్‌ఈడీగా వ్యవహరిస్తున్నారు. జబల్పూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అభ్యసించిన ఆయన 1984లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఎన్టీపీసీలో చేరారు. ఉత్తర భారతదేశంలోని పలు ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో వివిధ విభాగాల్లో ఆయన పనిచేశారు.
ఎయిరిండియా కొత్త సీఈఓగా అలెక్స్ క్రూజ్
బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు ఛైర్మన్, సీఈఓగా, అంతకు ముందు స్పెయిన్‌కు చెందిన చౌకధరల విమానయాన సంస్థ వ్యూలింగ్‌కు సీఈఓగా చేసిన అలెక్స్ క్రూజ్ (55), ఎయిరిండియా సీఈఓ బాధ్యతలు చేపట్టనున్నారు. 2020 కొవిడ్ సమయంలో ఆయన బ్రిటిష్ ఎయిర్‌వేస్ నుంచి తప్పుకున్నారు. ఎయిరిండియా కొత్త బోర్డుకు టాటా గ్రూపు ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నేతృత్వం వహించే అవకాశం ఉంది. పూర్తిస్థాయి - చౌకధరల విమానయాన సంస్థలకు నేతృత్వం వహించిన అలెక్స్ క్రూజ్ ఎయిరిండియాను సమర్థంగా నిర్వహించగలరని భావిస్తున్నారు.
డీఆర్‌డీఎల్ డైరెక్టర్‌గా శ్రీనివాసమూర్తి
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధనశాల డీఆర్‌డీఎల్ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ) నూతన డైరెక్టర్‌గా జి.ఎ.శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. కంచన్‌బాగ్‌లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ దశరథ్ రామ్ జనవరి 30న పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో మూర్తిని నియమించారు. ఈయన ఇప్పటివరకు అడ్వాన్స్‌డ్ నావల్ సిస్టమ్స్‌కు ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు. శ్రీనివాసమూర్తి స్వస్థలం విశాఖపట్నం. 1986లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఈ ఎలక్ట్రానిక్స్ చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిజిటల్ సిస్టమ్స్‌లో ఎంఈ చేశారు. 1987లో డీఆర్‌డీఎల్‌లో చేరారు. వేర్వేరు ప్రాజెక్టుల్లో స్ట్రక్చరల్ డైనమిక్స్, గ్రౌండ్ రెసొనెన్స్ టెస్టింగ్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్‌లో కీలక భూమిక పోషించారు. అధునాతన క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో సాంకేతికతంగా మూర్తి తోడ్పాటు ఎంతో ఉంది.