జాతీయం

కేంద్ర బడ్జెట్‌ 2022-23

2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.39.45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 35% వృద్ధితో రూ.7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం సమకూర్చనున్నట్లు భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ఖర్చుచేయబోయే మొత్తంలో దాదాపు 42% మొత్తాన్ని అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి రావడంతో ఆచితూచి అడుగులేశారు. రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రూ.5.25 లక్షల కోట్లు (పింఛన్లతో కలిపి) కేటాయించారు. గత సంవత్సరం కేటాయింపు కంటే ఇది దాదాపు 10% అదనం.

ఇదీ పద్దు: రూ.కోట్లలో మొత్తం 39,44,909
రెవెన్యూ వసూళ్లు: 22,04,422
మూలధన వసూళ్లు: 17,40,487
రెవెన్యూ వ్యయం: 31,94,663
మూలధన వ్యయం: 7,50,246
‣ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2% ఉంటుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది కొంత తగ్గి 8-8.5% మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ద్రవ్యలోటు జీడీపీలో 6.9% ఉంది. దాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4%కు, 2025 - 26 నాటికి 4.5%కు తెస్తామని చెప్పారు. మొత్తమ్మీద ద్రవ్య స్థిరీకరణ కంటే ఆర్థికవ్యవస్థ విస్తరణకే ఈ బడ్జెట్‌ ప్రాధాన్యం ఇచ్చిందన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ.

ప్రధానాంశాలు:-
‣ కేంద్ర బడ్జెట్‌ మొత్తం అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు. ఇందులో ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు

‣ మేకిన్‌ ఇండియాలో భాగంగా దేశంలోని 14 రంగాలకు ఉత్పాదకతో ముడిపడిన ఆర్థిక ప్రోత్సాహకాలు. తద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యం

‣ స్థానిక సంస్థలకు నష్టం కలగకుండా కస్టమ్స్‌ సంకాల హేతుబద్ధీకరణ

‣ దేశీయంగానే తగినంత ఉత్పత్తి సాధించడానికి అవకాశమున్న... వ్యవసాయ, రసాయన, వస్త్ర, వైద్య పరికరాలు, ఔషధ పరిశ్రమలకు ఇస్తున్న 350 రకాల పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపు

‣ నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక. నిర్మాణ రంగంలో సంస్కరణలు

‣ కొత్తగా 400 వందేభారత్‌ రైళ్లు, ఇతర రవాణా సదుపాయాలను రైల్వేలతో అనుసంధానిస్తూ రానున్న మూడేళ్లలో 100 గతిశక్తి లాజిస్టిక్‌ టర్మినళ్ల ఏర్పాటు

‣ 25 వేల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల విస్తరణ

‣ అన్ని రకాల దీర్ఘకాలిక మూలధన ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను 15 శాతానికి తగ్గింపు. ఇప్పటివరకు అది 37% ఉండేది

‣ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పిన్షన్‌ స్కీం)లో 14% డిడక్షన్‌ వర్తింపు

‣ వ్యక్తులు, సంస్థల వద్ద బయటపెట్టని ఆదాయం దొరికినప్పుడు చట్టాల నుంచి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తిగా స్వాధీనం


తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,78,833 కోట్లు

2021-22 గణాంకాలను విడుదల చేసిన కేంద్రం తెలంగాణ రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయంలో రికార్డు స్థాయి వృద్ధిరేటు నమోదు చేసింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొట్టమొదటిసారిగా జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో భారీగా వృద్ధిరేటు నమోదైంది. జీఎస్‌డీపీలో 19.46 శాతం నమోదు చేయగా తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19.10 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్‌డీపీని ప్రస్తుత ధరల్లో రూ. 1,154,860 కోట్లుగా, తలసరి ఆదాయాన్ని రూ. 2,78,833గా కేంద్రం ధ్రువీకరించింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) ఈ లెక్కలను అధికారికంగా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 2.25 శాతం మాత్రమే కాగా ఈసారి గణనీయంగా పెరిగింది. జీఎస్‌డీపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 16.85 శాతం అధిక వృద్ధిరేటును సాధించింది. తలసరి ఆదాయంలో వృద్ధిరేటు గత ఏడాది కంటే 17.14 శాతం ఎక్కువ సాధించింది.


దిల్లీ హైకోర్టు జడ్జిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి

కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్‌ కుమార్‌ మెందీరత్తా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జ్యుడీషియల్‌ అధికారిగా ఆయనకున్న సీనియారిటీని ఆధారంగా చేసుకొని అనూప్‌ను ఆ పదవిలో నియమించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

ఆయన పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన సంగతి గమనార్హం. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని ఓ హైకోర్టు జడ్జిగా నియమించడం ఇదే తొలిసారి.

అనూప్‌ 2019 అక్టోబరులో న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన దిల్లీలో డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.

డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జిగా ఉన్న వ్యక్తిని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా నియమించడం అదే తొలిసారి.

ప్రస్తుతం అనూప్‌తో పాటు మరో ముగ్గురు జ్యుడీషియల్‌ అధికారులు - నీనా బన్సల్‌ కృష్ణ, దినేశ్‌ కుమార్‌ శర్మ, సుధీర్‌ కుమార్‌ జైన్‌ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.

‘ప్రసాద్‌’ పథకంలోకి రామప్ప

కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీక, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం (ప్రసాద్‌)లో చేర్చింది. ఆ శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి దీనికి ఆమోదం తెలిపారు.

ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పంపాలని కేంద్ర పర్యాటక శాఖ రాష్ట్రాన్ని కోరనుంది.

ఈ పనుల్ని రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భద్రాచలం ఆలయాన్ని కూడా రామాయణ సర్క్యూట్‌ కింద ప్రసాద్‌ పథకంలో చేర్చారు.

ములుగు జిల్లాలోని రామప్ప (రుద్రేశ్వర) ఆలయం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. జులైలో దీనికి యునెస్కో గుర్తింపు లభించింది.


మిలాన్‌-22 ప్రారంభోత్సవం

విశాఖలోని తూర్పునౌకాదళ సాముద్రిక ఆడిటోరియంలో మిలాన్‌-22ను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ ప్రారంభించారు. అంతర్జాతీయ సముద్ర జలాలను అన్ని దేశాలు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితులు ఉండాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆకాంక్షించారు. భారత నౌకాదళం నిర్వహిస్తున్న ‘మిలాన్‌-22’ కార్యక్రమం మహోజ్వల ఘట్టమని, 1995లో నాలుగు దేశాలతోనే ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం 39 దేశాల నౌకాదళాల ప్రతినిధులు, 13 విదేశీ యుద్ధనౌకలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి ‘స్పెషల్‌ డే కవర్‌’, మిలాన్‌పై లఘు చిత్రాలను విడుదల చేశారు.

సైనిక సత్తా చాటిన మిలాన్‌

విశాఖ నౌకాదళంలోని నావల్‌డాక్‌యార్డ్‌లో ఏర్పాటుచేసిన ‘మిలాన్‌’ (బహుళదేశాల నౌకాదళ విన్యాసాలు)లో భాగంగా నిర్వహించిన యుద్ధ విన్యాసాలు, అంతర్జాతీయ నగర కవాతు వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యి జాతికి అంకితం చేశారు.

వేడుకను నిర్వహించిన తూర్పు నౌకాదళానికి, 39 దేశాల నుంచి వచ్చిన నౌకాదళ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం పేరుతో ఒక యుద్ధనౌకను ఇటీవలే ప్రారంభించారని, ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని కూడా నౌకాదళంలో ప్రవేశపెట్టారని, ఫలితంగా రక్షణరంగ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు.


దేశవ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌

ఆయుష్మాన్‌భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వ పథకంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర వేశారు. అయిదేళ్ల కాలానికి ఈ పథకం కోసం రూ.1,600 కోట్ల బడ్జెట్‌ కేటాయించడానికి అంగీకరించారు.

నేషనల్‌ హెల్త్‌ అథారిటీ దీన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ప్రజలు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ నంబర్‌ సృష్టించుకోవచ్చు. దాంతో వారి వైద్యఆరోగ్య రికార్డులన్నీ అనుసంధానమవుతాయి. విభిన్న డాక్టర్లు, ఆసుపత్రుల (హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌)వద్ద ఉన్న వ్యక్తుల ఆరోగ్య వివరాలన్నీ ఈ నంబర్‌తో అనుసంధానమవుతాయని, దీనివల్ల డాక్టర్లు చికిత్స అందించే సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

కేంద్రప్రభుత్వం ఈ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను పైలెట్‌ ప్రాజెక్టు కింద లద్దాఖ్, చండీగఢ్, దాద్రానాగర్‌ హవేలి, దమణ్‌Â-దీవ్, పుదుచ్చేరి, అండమాన్‌ నిరోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లో విజయవంతంగా అమలుచేసింది. ఈ పైలెట్‌ ప్రాజెక్టు అమలు సమయంలో డిజిటల్‌ శాండ్‌బాక్స్‌ ఏర్పాటుచేసి, 774 అంశాలను దాంతో సమీకృతం చేశారు. 2022 ఫిబ్రవరి 24 నాటికి దేశవ్యాప్తంగా 17,33,69,087 ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్లు సృష్టించి, 10,114 మంది డాక్టర్లను ఇందులో నమోదు చేసినట్లు పేర్కొంది.


ఏక గవాక్షం ద్వారా బొగ్గు వేలం

బొగ్గు ఉత్పత్తి సంస్థలైన కోల్‌ ఇండియా, సింగరేణి ఆధ్వర్యంలో ఏకగవాక్ష విధానంలో బొగ్గు ఇ-వేలం నిర్వహించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది.

ఇందువల్ల అన్నిరంగాల బొగ్గు అవసరాలు తీరతాయని కేంద్రం పేర్కొంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న రంగాలవారీ వేలం విధానం స్థానంలో ప్రవేశపెట్టే ఏకగవాక్ష విధానంతో విద్యుత్తుతో పాటు, ఇతర అనియంత్రిత రంగాలు, ట్రేడర్ల అవసరాలు తీరతాయని పేర్కొంది.

ఈ కొత్త విధానం కోల్‌ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు ఇప్పుడున్న కోల్‌ లింకేజెస్‌కు వర్తించదని, అందువల్ల ప్రస్తుత లింకేజీలపై ఎలాంటి ప్రభావం పడదని తెలిపింది.


విశాఖ తీరంలో యుద్ధనౌకల సమీక్ష

విశాఖ తీరంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్‌ఆర్‌)ను నిర్వహించారు. పీఎఫ్‌ఆర్‌లో భాగంగా 44 యుద్ధనౌకలను రాష్ట్రపతి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో నిర్మాణంలో ఉన్న యుద్ధనౌకలు, జలాంతర్గాములకు ఉపయోగిస్తున్న 70 శాతం పరికరాలు దేశీయంగా తయారైనవి కావడం ప్రశంసనీయమన్నారు.

పలుదేశాల నౌకాదళాలతో ఫిబ్రవరి 25 నుంచి విశాఖలో నిర్వహించబోతున్న ‘మిలాన్‌’ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష సందర్భంగా ప్రదర్శించిన విన్యాసాల్లో ఐఎన్‌ఎస్‌ సుమిత్ర, చేతక్, సీకింగ్, యూహెచ్‌3హెచ్, ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్లు, డోర్నియర్, పీ8ఐ నిఘా విమానాలు, ఐఎల్‌ 38, మిగ్‌ 29కె యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

స్మారక స్టాంపు, ఫస్ట్‌డే కవర్‌లను రాష్ట్రపతి విడుదల చేశారు.


ఇకపై దేశవ్యాప్తంగా ‘భారత్‌ యూరియా’

ఇకపై దేశవ్యాప్తంగా యూరియాను ‘భారత్‌ యూరియా’ అనే ఒకే పేరుతో అన్ని కంపెనీలు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇందుకోసం ఆయా కంపెనీల ప్రతినిధులతో త్వరలో దిల్లీలో సమావేశం నిర్వహించనుంది. ఈ పేరుతో పాటు కేంద్రం ఇస్తున్న రాయితీ, ఒక ట్యాగ్‌పై బార్‌కోడ్‌ను కంపెనీలు ముద్రించాలి.

డీలర్ల వద్ద ఉన్న ఈపాస్‌ యంత్రాలకు, డీబీటీ సిస్టంతో బార్‌కోడ్‌ రీడింగ్‌ మిషన్లను అధికారులు అనుసంధానిస్తారు.

బార్‌కోడ్‌ను గుర్తించి యూరియా రైతులకు అమ్మిన తర్వాతనే రాయితీ సొమ్మును కంపెనీలకు ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఎరువుల నియంత్రణ చట్టంలోని 21 క్లాజ్‌కి లోబడి వినియోగదారులకు అవసరమైన వివరాలను, ఎరువులోని పోషకాల స్థాయిని బస్తాపై తప్పనిసరిగా ముద్రించాలి.

తొలిగా ప్రధానమంత్రి భారతీయ జన యూరియా పరియోజన పథకం కింద యూరియాను ఎంపిక చేసింది.

పది రకాల సవరణలను ఈ ఎరువు సరఫరాకు వర్తింపజేసి, సరైన ఫలితాలు వచ్చాక ఇతర కాంప్లెక్స్‌ ఎరువులకూ ఒకే దేశం, ఒకే ఎరువు పేరుతో పలు సంస్కరణలు తేవాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.


‘గోబర్‌-ధన్‌’ బయో-సీఎన్‌జీ ప్లాంటు ప్రారంభం

‘చెత్త నుంచి సంపద సృష్టి’ విధానంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రూ.150 కోట్లతో ఏర్పాటుచేసిన ‘గోబర్‌-ధన్‌’ బయో-సీఎన్‌జీ ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

ఆసియాలోనే ఇది అతిపెద్ద బయో-సీఎన్‌జీ ప్లాంటు. నిత్యం 550 టన్నుల తడి సేంద్రీయ వ్యర్థాలను శుద్ధిచేయడం ద్వారా, 17,000 కిలోల సీఎన్‌జీని, 100 టన్నుల సేంద్రీయ ఎరువులను ఇది ఉత్పత్తి చేస్తుంది.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి చెత్తకుప్పలు పోగవుతున్న భూములను వచ్చే రెండేళ్లలో హరిత ప్రాంతాలుగా మారుస్తామని వెల్లడించారు.

దేశంలోని 75 పెద్ద మున్సిపాలిటీల్లో వచ్చే రెండేళ్లలో గోబర్‌-ధన్‌ బయో-సీఎన్‌జీ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.

ప్రభుత్వం విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమివ్వడంతో, ఈ రంగంలో ముందున్న తొలి ఐదు దేశాల్లో భారత్‌ చోటు సంపాదించింది అని ఆయన పేర్కొన్నారు.


అందుబాటులోకి 100 కిసాన్‌ డ్రోన్లు

ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేసే వంద కిసాన్‌ డ్రోన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. డ్రోన్ల రంగంలో పెరుగుతున్న భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి కొత్త నాయకత్వం అందించగలదని ప్రధాని అన్నారు.

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా మిశ్ర ఎన్నిక

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) ఛైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది మనన్‌ కుమార్‌ మిశ్ర ఆరోసారి ఎన్నికయ్యారు.

మరో సీనియర్‌ లాయర్‌ ఎస్‌.ప్రభాకరన్‌ను ఉపాధ్యక్ష పదవి వరించింది. బీసీఐ ఎన్నికలు ఫిబ్రవరి 6న జరిగాయి.

అయితే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం మిశ్ర, ప్రభాకరన్‌ల తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలైనట్లు బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్‌ తెలిపారు.

కొత్తగా ఎన్నికైన కార్యవర్గ పదవీ కాలం ఏప్రిల్‌ 17న ప్రారంభమవుతుందని, 2025 ఏప్రిల్‌ వరకూ కొనసాగుతుందని వివరించారు.


అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. సుదీర్ఘ కాలం విచారణ అనంతరం ఈ సంచలన తీర్పును వెలువరించింది. దేశంలో ఒక న్యాయస్థానం ఒకేసారి ఇంతమందికి మరణ దండన విధించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 1998లో తమిళనాడులోని టాడా కోర్టు రాజీవ్‌గాంధీ హత్యకేసులో గరిష్ఠంగా 26 మందికి మరణశిక్ష విధించింది.

2008, జులై 26న అహ్మదాబాద్‌లో ఉగ్రవాదులు 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనల్లో మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. యావత్‌ దేశాన్ని తీవ్రంగా కలచివేసిన ఈ పేలుళ్లపై అహ్మదాబాద్, సూరత్‌లలో మొత్తం 35 కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక న్యాయస్థానం వీటన్నింటినీ కలిపి విచారణ ప్రారంభించింది. మొత్తం 78 మందిపై అభియోగాలు నమోదుకాగా, వీరిలో ఓ వ్యక్తి అప్రూవర్‌గా మారాడు. మిగతా 77 మందిపై 2009లో విచారణ ఆరంభమైంది. మొత్తం 1,171 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను నమోదు చేసిన న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 8న 49 మందిని దోషులుగా తేల్చింది. మరో 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్‌.పటేల్‌ ఫిబ్రవరి 18న దోషులకు శిక్షను ఖరారుచేస్తూ తీర్పు వెలువరించారు. 38 మందికి మరణ దండన, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, ఒకరికి రూ.2.88 లక్షల చొప్పున జరిమానా విధించారు. హత్య, నేరపూరిత కుట్ర, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లాంటి అభియోగాల కింద ఈ శిక్షలను ఖరారు చేశారు.

2002లో గోద్రా రైలు దుర్ఘటన అనంతరం చెలరేగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా మృతిచెందారు. దీనికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) రగిలిపోయింది. అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లకు ప్రణాళిక రూపొందించింది. దీన్ని అమలు చేయడంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సఫ్దర్‌ నగోరి, కుమరుద్దీన్‌ నగోరిలతో పాటు గుజరాత్‌కు చెందిన ఖయూముద్దీన్‌ కపాడియా, జాహిద్‌ షేక్, షంషుద్దీన్‌ షేక్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. సఫ్దర్, జాహిద్‌లు పేలుడు పదార్థాల కొనుగోలు, ఐఎం అనుబంధ నిషేధిత ‘స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా’ (సిమి)కు నిధులు సేకరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.


థానే - దివా ప్రాంతాలను కలుపుతూ 5, 6 అదనపు రైల్వేలైన్ల ప్రారంభం

దేశ ఆర్థిక రాజధాని ముంబయి నుంచి అహ్మదాబాద్‌ నడుమ హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

21వ శతాబ్దానికి తగ్గట్టు ముంబయిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు.

ఎంతో ఆసక్తిదాయకమైన బుల్లెట్‌ రైలు ప్రారంభం ద్వారా ‘కలల నగరం’గా ముంబయికి ఉన్న గుర్తింపు బలపడుతుందని చెప్పారు.

మహారాష్ట్రలోని ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ పరిధిలోకి వచ్చే థానే - దివా ప్రాంతాలను కలుపుతూ 5, 6 అదనపు రైల్వే లైన్లను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి వీడియో లింకు ద్వారా మాట్లాడారు.

ఇదే సందర్భంగా రెండు సబర్బన్‌ రైళ్లకు కూడా పచ్చజెండా ఊపారు. రూ.1,10,000 కోట్ల అంచనా బడ్జెటుతో 508 కి.మీ.ల మేర హైస్పీడ్‌ కారిడార్‌ ఏర్పాటుకు జపాన్‌ సహకారంతో చేపట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు భూసేకరణ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రధాని తెలిపారు.

థానే - దివా మధ్య ఏర్పాటు చేసిన కొత్త రైల్వే లైన్లతో ముంబయి నగరవాసుల జీవనం మరింత సులభతరం అవుతుందని ఆకాంక్షింస్తున్నట్లు తెలిపారు.


వందేళ్ల తర్వాత నిజాం - మైసూర్‌ వారసుల భేటీ

దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్‌ నిజాం, మైసూర్‌ వడయార్‌ రాజ కుటుంబీకుల వారసులు సమావేశమయ్యారు.

ఈ మేరకు ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మనుమడు నవాబ్‌ మీర్‌ నజాఫ్‌ అలీఖాన్, యదువీర్‌ క్రిష్ణదత్త చామరాజ వడయార్‌లు మైసూర్‌ ప్యాలెస్‌లో భేటీ అయ్యారు.

మాజీ పాలకుల వారసుల కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసే విషయమై ఇరువురూ ఆసక్తి చూపించారు.

ఈ సందర్భంగా అసఫ్‌ జాహీలు, మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ల గొప్పదనాన్ని వడయార్‌ వివరించారు. మైసూర్‌ ప్యాలెస్‌లో ఓ ముఖ్యమైన భాగం నిర్మాణానికి నిజాం తోడ్పాటు అందించినట్లు చెప్పారు.


టీకాల్లో 100 శాతం లక్ష్యం చేరుకున్న గోవా

కరోనా టీకాల కార్యక్రమంలో గోవా 100 శాతం లక్ష్యం చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర జనాభాలో అర్హులైన 11.66 లక్షల మందికి రెండు డోసుల టీకా వేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

‘కరోనా టీకాల రెండో డోసుకు సంబంధించి రాష్ట్రం 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కరోనా టీకా కేంద్రాలను మూసివేసి సాధారణ టీకాల కార్యక్రమంలో కలిపేస్తాం’ అని గోవా ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి డాక్టర్‌ ఇరా అల్మిడా తెలిపారు.

కొవిడ్‌ - 19 టీకాల కార్యక్రమం కొనసాగుతుందని, అయితే అది సాధారణ టీకాల కార్యక్రమం షెడ్యూల్‌తో కలిసి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

అంతర్గాం పసుపు యూనిట్‌కు జాతీయ గుర్తింపు

మహిళా సంఘాల ఉత్పత్తుల తయారీలో తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలో ఉన్న పసుపు, కారం పొడి తయారీ యూనిట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా నాలుగు యూనిట్లను గుర్తించగా దక్షిణాది నుంచి తెలంగాణలోని అంతర్గాం పసుపు తయారీ యూనిట్‌ ఎంపికైనట్లు జగిత్యాల జిల్లా సెర్ప్‌ అధికారులకు సమాచారం అందింది.

2021 ఫిబ్రవరిలో బ్యాంకు నుంచి రూ.2 లక్షల రుణం తీసుకుని ఈ యూనిట్‌ను నెలకొల్పారు.

రైతుల నుంచి పసుపు, మిర్చి తీసుకుని పసుపు పొడి, కారం పొడి తయారు చేసి స్ఫూర్తి ప్రొడక్ట్‌ పేరుతో నాణ్యమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.


‘జీ20’ సెక్రటేరియట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

జీ20 కూటమి అధ్యక్ష స్థానాన్ని భారత్‌ స్వీకరించడానికి అవసరమైన సన్నాహాలు చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దీనికింద ఒక సెక్రటేరియట్, ఇతర వ్యవస్థల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది నవంబర్‌ 30 వరకూ జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నిర్వహిస్తుంది.

కొత్తగా ఏర్పాటు కాబోయే సెక్రటేరియట్‌కు ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఒక అత్యున్నత కమిటీ దిశానిర్దేశం చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

కమిటీలో కేంద్ర ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల మంత్రులు, జీ20 కూటమిలో భారత షెర్పా సభ్యులుగా ఉంటారని వివరించింది. జీ20 కూటమిలో ప్రధాన దేశాలకు భాగస్వామ్యం ఉంది.


తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు

పుంగనూరు జాతి ఆవు బొమ్మతో కూడిన ప్రత్యేక తపాలా కవర్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు సిద్ధం చేయించారు.

కవరు వెనుక ఈ ఆవు విశిష్టతను తెలియజేసే అంశాలను ముద్రించారు. ఫిబ్రవరి 16న చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ కవర్‌ను ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.


పోలీసు దళాల ఆధునికీకరణకు రూ. 26,275 కోట్లు

పోలీసు దళాల ఆధునికీకరణ బృహత్తర పథకాన్ని (ఎంపీఎఫ్‌) రూ.26,275 కోట్లతో మరో ఐదేళ్ల పాటు (2021-22 నుంచి 2025-26 వరకూ) కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

జమ్మూ-కశ్మీర్, తిరుగుబాటు దళాల ప్రభావిత ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రత సంబంధిత కార్యకలాపాలకు ఈ నిధులను వ్యయం చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

నూతన బెటాలియన్లు, అత్యాధునిక ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల ఏర్పాటు, ఇతర పరిశోధన సాధనాల అభివృద్ధి తదితర చర్యలను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నట్లు వెల్లడించింది.


రామానుజుల సువర్ణమూర్తిని ఆవిష్కరించిన రాష్ట్రపతి

తెలంగాణ‌లోని ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు 12వ రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు.

120 కిలోల రామానుజుల బంగారు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సామాజిక అసమానతలను వ్యతిరేకిస్తూ, సమానత్వ భావనను చాటిచెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రస్తుతించారు.


పర్యావరణహిత సేద్యానికి ప్రోత్సాహం

దేశవ్యాప్తంగా పర్యావరణహిత సేద్యాన్ని కేంద్రం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణా సంస్థ’ (మేనేజ్‌) డైరక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర చెప్పారు. ‘బయో అగ్రి ఉత్పత్తిదారుల సంఘం (బిపా)తో మేనేజ్, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వేర్వేరుగా పరస్పర అవగాహన ఒప్పందాలను మేనేజ్‌ ప్రధాన కార్యాలయంలో చేసుకున్నాయి.

విభజన సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ

తెలుగు రాష్ట్రాల విభజనకు సంబంధించిన వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్‌కుమార్‌ నేతృత్వంలో తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దీనిపై ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు హోంశాఖ వర్తమానం పంపింది. ఈ కమిటీ మొదటి సమావేశం ఫిబ్రవరి 17న దృశ్యమాధ్యమంలో జరుగుతుంది.

తృణమూల్‌ జాతీయ ‘ఆఫీస్‌ బేరర్ల’ కమిటీ రద్దు

తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీని ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రద్దు చేశారు. పార్టీలో విభేదాలను పరిష్కరించడమే లక్ష్యంగా 20 మంది సభ్యులతో కొత్తగా కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటుచేశారు. మమత త్వరలోనే కొత్త ఆఫీస్‌ బేరర్ల కమిటీని ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ‘‘జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీలోని పదవులన్నీ రద్దయ్యాయి. ఆ కమిటీ విషయమై పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం పార్టీలో ఆమె ఒక్కరే నాయకురాలు’’ అని వెల్లడించారు.

బ్యాంకులకు రూ. 22,842 కోట్ల టోకరా

భారీ మొత్తంలో.. ఏకంగా రూ. 22,842 కోట్ల మేర బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ఇలాంటి తరహా మోసాలకు సంబంధించి ఇంతవరకు సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఇదే అతిపెద్దది. ఈ వ్యవహారంలో ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (ఏబీజీఎస్‌ఎల్‌), ఆ సంస్థ మాజీ ఛైర్మన్, ఎండీ రిషీ కమలేశ్‌ అగర్వాల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. వారంతా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంను భారీ మొత్తంలో మోసగించినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రపంచ పులుల్లో 75 శాతం పైగా భారత్‌లోనే

ప్రపంచ పులుల్లో 75 శాతానికి పైగా ఒక్క భారతదేశంలోనే ఉన్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ రాజ్యసభకు తెలిపారు. వయోభారం, పులుల మధ్య అంతర్గత కొట్లాట, విద్యుదాఘాతాలు, వేట తదితర కారణాల రీత్యా గత రెండేళ్లుగా మరణాల సంఖ్య కూడా పెరిగిందని గణాంకాలను సభలో వెల్లడించారు. ‣ రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు 2021లో మొత్తం 127 పులులు మృతిచెందగా.. ఇందులో గరిష్ఠంగా మధ్యప్రదేశ్‌లో 42 మరణాలు నమోదైనట్లు తెలిపారు. మహారాష్ట్రలో 27, కర్ణాటకలో 15, ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 పులులు మరణించాయి. 2018 నాటి అంచనాల మేరకు దేశంలో పులుల సంఖ్య 2,967గా ఉంది. 2014లో ఈ సంఖ్య దాదాపు 2,226 మాత్రమే. అటవీ జంతువుల సంరక్షణ చట్టం అమలుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి.

తెలంగాణ విత్తన ప్రయోగశాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు

రాజేంద్రనగర్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాని (టిస్టా)కి స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస ్థ(ఇస్టా) గుర్తింపు దక్కింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగంలో 130, ప్రైవేటురంగంలో 50 నోటిఫైడ్‌ విత్తన పరీక్ష ల్యాబ్‌లున్నాయి. వీటిలో 26 మాత్రమే ఇస్టా భాగస్వామ్యంలో ఉన్నాయి. వీటిలో 8 మాత్రమే ఇస్టా గుర్తింపు పొందాయి. వీటిలో ఆరు ప్రైవేటు రంగంలోనివి. ప్రభుత్వ రంగం పరంగా ఇస్టా గుర్తింపు పొందిన రెండో ల్యాబ్‌ తెలంగాణదే కావడం విశేషం.

ఎన్‌ఐఆర్‌డీపీఆర్, ఆస్కిల అవగాహన ఒప్పందం

గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధికి సంబంధించిన శిక్షణ, పరిశోధనలపై పనిచేసేందుకు జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌), అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కి) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్, ఆస్కి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నిర్మాల్య బాగ్చి ఒప్పందంపై సంతకాలు చేశారు.

మణిపుర్‌ ఎన్నికల తేదీల్లో మార్పులు

మణిపుర్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీల్లో ఈసీ మార్పులు చేసింది. ఈమేరకు రెండు దశల్లో జరిగే పోలింగ్‌ను ఫిబ్రవరి 28, మార్చి 5 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటివరకు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో జరగాల్సి ఉంది. వివిధ కారణాల రీత్యా తేదీలు మార్చాల్సిందిగా వచ్చిన విజ్ఞప్తులతో పాటు, గత దృష్టాంతాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటూ మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

భారీగా తగ్గిన విదేశీ పర్యాటకులు

కరోనా కారణంగా దేశానికి విదేశీ పర్యాటకుల సంఖ్య రెండేళ్లలో భారీగా తగ్గింది. ఈ-టూరిస్ట్‌ వీసాల మీద 2019 జనవరి-డిసెంబరు మధ్యకాలంలో దేశంలోకి 1.09 కోట్లమంది విదేశీ పర్యాటకులు రాగా, 2020లో ఆ సంఖ్య 27.44 లక్షలకు (75% తగ్గుదల), 2021లో 14.12 లక్షలకు (87% తగ్గుదల) పడిపోయినట్లు కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు.

ఓంకారేశ్వర్‌లో ‘స్టాచ్యూ ఆఫ్‌ వన్‌నెస్‌’ఏర్పాటుకు మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదం

దేశంలో హిందువులందరూ ఐక్యంగా నిలిచి సమాజ హితమే నినాదంగా ముందుకు సాగాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ఎనిమిదో రోజైన ధర్మాచార్య సదస్సు రెండో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవగా మోహన్‌ భాగవత్‌ పాల్గొని ప్రసంగించారు. ‣ సమతామూర్తి కేంద్రం స్ఫూర్తితో మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో స్టాచ్యూ ఆఫ్‌ వన్‌నెస్‌ పేరిట శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. సమతామూర్తి కేంద్రంతో భాగ్యనగర ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని అయోధ్య ట్రస్టు కోశాధికారి గోవింద్‌దేవ్‌ మహారాజ్‌ అన్నారు. అయోధ్య కంటే ముందుగా రామానుజాచార్యుల మందిర నిర్మాణం గొప్ప విషయమన్నారు.

‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు’ లావాదేవీల్లో ఏపీకి రెండో స్థానం

‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు’ కింద ఇప్పటివరకు అత్యధిక లావాదేవీలు నిర్వహించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. 2019 ఆగస్టు నుంచి రాష్ట్రంలో ఈ సౌకర్యం ప్రారంభం కాగా 2022 జనవరి 31వ తేదీ వరకు 8,62,33,519 లావాదేవీలు జరిగినట్లు కేంద్ర వినియోగ వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బిహార్‌ (15.90 కోట్లు) తర్వాత ఏపీలోనే అత్యధిక లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ (6.67కోట్లు), తెలంగాణ (5.16 కోట్లు) ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు కింద అన్ని రాష్ట్రాల్లో కలిపి 55.75 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వివరించారు. ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రేషన్‌ కార్డును మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ ద్వారా ఎక్కడి నుంచైనా రేషన్‌ సరకులు తీసుకోవచ్చని చెప్పారు.

చెల్లుబాటులో ఉన్న రూ.10 నాణేలు

దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఆర్‌బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. రూ.10 నాణేలు నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడంలేదా? వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటోందా? అని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే సభ్యుడు ఎ.విజయకుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్‌బీఐ రూ.10 నాణేలు వివిధ సైజులు, ఇతివృత్తాలు, డిజైన్లలో ముద్రిస్తోంది. అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయి. అన్నిరకాల లావాదేవీలకు వాటిని వాడుకోవచ్చు. అయితే రూ.10 నాణేలను తీసుకోవడంలేదని సాధారణ ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అందువల్ల వారిలో అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయడానికి ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తోంది.

జాతీయ ప్రాజెక్టుకూ 60 శాతం నిధులే

దేశంలో ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం నిధులు మాత్రమే వస్తాయి. మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. దీంతోపాటు నిబంధనల ప్రకారం.. రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదలవుతాయి. ఇలా పలు నిబంధనలతో జాతీయ ప్రాజెక్టులకు, సత్వర సాగునీటి ప్రయోజనం (ఏఐబీపీ), ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంఎస్‌కేవై) కింద ప్రాజెక్టుల గుర్తింపు, నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పంపింది. ఆ మేరకు...

‣ ఇప్పటి వరకు జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం 90 శాతం, రాష్ట్రం పది శాతం నిధులు సమకూర్చేవి. ఇకపై కేంద్రం వాటా 60 శాతానికి తగ్గిపోవడమే కాదు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు పొందే ప్రక్రియ సైతం మరింత క్లిష్టంగా మారనుంది.

‣ ప్రతిపాదిత గోదావరి - కృష్ణా - కావేరి నదుల అనుసంధానాన్ని కేంద్రం చేపట్టినా, 40 శాతం నిధులను రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు భరించాల్సి ఉంటుంది.

‣ ఇప్పటివరకు దేశంలో 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించగా, ఇందులో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు ఒక్కదానికే ఈ హోదా ఉంది. ఈ ‘పోలవరం’తో పాటు హుషికుర్ద్, సరయు నహర్‌ పరియోజన, షాపూర్‌కండి ప్రాజెక్టులకు మాత్రం ఇప్పటివరకు ఉన్న పద్ధతిలోనే నిధులు విడుదలవుతాయి.

‣ నిర్మాణ వ్యయం, పునరావాసం, విద్యుత్తు వినియోగం తదితర సమస్యల వల్ల పెండింగ్‌లో ఉన్న అంతర్‌ రాష్ట్ర ప్రాజెక్టులను, నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టే ప్రాజెక్టులను జాతీయ హోదాతో చేపట్టనున్నట్లు కొత్త మార్గదర్శకాలు పేర్కొన్నాయి.

‣ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి పూర్తి అర్హత ఉన్నా ఆ సమయంలో నిధుల అందుబాటు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తప్ప, అర్హత ఉందని జాతీయహోదా కల్పించరు.

‣ 8 ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, లద్ధాఖ్‌లలోనే జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం నిధులిస్తుంది.

‣ నిర్మాణంలో భాగంగా వ్యయం పెరిగితే ఆమోదం పొందిన దాని కంటే 20 శాతం వరకే కేంద్రం భరిస్తోంది. అంతకు మించితే ఆయా రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది.

‣ జాతీయ హోదా లభించిన ప్రాజెక్టులకూ కేంద్ర ప్రాయోజిత పథకాల తరహాలోనే నిధులు విడుదలవుతాయి. రాష్ట్రం తన వాటాను జమ చేసి 75 శాతం నిధులను ఖర్చు చేయకపోతే తదుపరి వాటా నిధులు అందవు. లేదా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఖర్చుచేసి ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఆ నిధులను తిరిగి పొందవచ్చు.

‣ దేశంలో నీటి వినియోగం, ఆయకట్టు ఉన్న అంతర్జాతీయ ప్రాజెక్టులనూ జాతీయ హోదా కింద చేపడతారు.

‣ నీటి పంపిణీ, లభ్యత సమస్య లేకుండా ఒకే రాష్ట్రంలో ఉపయోగపడే ప్రాజెక్టయినా 2లక్షల హెక్టార్లకంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తారు.



ఏఐబీపీ, పీఎంఎస్‌కేవై కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకు నిబంధనలు:- ‣ సాగునీటి ప్రాజెక్టు నుంచి తాగునీటి మళ్లింపు, పంపిణీకి నిధులు ఇవ్వరు. మిగిలిన ఖర్చును మాత్రమే భరిస్తారు.

‣ ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో మాత్రం 90 శాతం కేంద్ర నిధులిస్తారు.

‣ డీపీఏపీ, డీడీపీ, గిరిజన ప్రాంతాలు, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు, బుందేల్‌ఖండ్, విదర్భ, ఒడిశాలోని కేబీఓ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కేంద్రం 60 శాతం నిధులను ఇస్తుంది. మిగిలిన ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు 25 శాతమే ఇస్తుంది.

‣ ఇప్పటికే ఏఐబీపీ, పీఎంఎస్‌కేవై పథకాల కింద కొనసాగుతున్న 99 ప్రాజెక్టులను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.


దేశంలో అత్యధిక అరటి దిగుబడి ఏపీలోనే

దేశంలో అరటి దిగుబడి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచే వస్తోంది. 2020-21 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలో 1.08 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగుకాగా, దిగుబడి 64.85 లక్షల టన్నులమేర వస్తుందని 3వ ముందస్తు అంచనాల ప్రకారం లెక్కించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.

లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్‌తో సమానమైన భూభాగంలో అరటి సాగవుతున్నా అక్కడ దిగుబడి మాత్రం ఏపీకంటే 57% తక్కువగా రానున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.


ఏపీకి ట్రాన్స్‌జెండర్లలో దేశంలో రెండో స్థానం

ఆంధ్రప్రదేశ్‌లో 43,769 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు.

లోక్‌సభలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లు ఏపీలో ఎక్కువున్నారు.


లత స్వస్థలం ఇందోర్‌లో సంగీత అకాడమీ, మ్యూజియం

దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ జన్మస్థలమైన ఇందోర్‌లో ఆమె పేరిట ఓ సంగీత అకాడమీ, తను పాడిన అన్ని పాటలను ప్రతిబింబిస్తూ ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

లత జ్ఞాపకార్థం భోపాల్‌లో మొక్క నాటిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఇందోర్‌లో విగ్రహం ఏర్పాటు చేసి, ఓ కళాశాలకు ఆమె పేరు పెడతామని కూడా వెల్లడించారు.

ఏటా లతా జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డు అందజేస్తామన్నారు. ముంబయిలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ‘లతా జ్ఞాపకార్థం ఓ మ్యూజియం వంటిది ఏర్పాటు చేయడంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది’ అని తెలిపారు.


దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రైల్వే కోచ్‌ల కర్మాగారం

మేధా సర్వో డ్రైవ్స్‌ సంస్థ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రైల్వే కోచ్‌ల కర్మాగారం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇది త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేధా రైల్వే కోచ్‌ల కర్మాగారానికి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. సుమారు రూ.800 కోట్లతో నిర్మించారు. ఇక్కడ ఏటా 500 రైల్వే, మెట్రో కోచ్‌లు, 50 లోకోమోటివ్‌లతో పాటు మోనో రైలు తదితరాలు తయారవుతాయి. మేధా సంస్థ గత 17 ఏళ్ల కాలంలో నాలుగు ఖండాల్లో 12 రైల్వేకోచ్‌ల కర్మాగారాలను నెలకొల్పింది. భారతదేశంలో తన తొలి కర్మాగారాన్ని కొండకల్‌లో నిర్మిస్తోంది.

ఆదర్శ గ్రామ యోజనలో తెలంగాణకు ఉత్తమ ర్యాంకులు

కేంద్ర ప్రభుత్వ సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై)లో తెలంగాణలోని గ్రామాలు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. దేశంలోని తొలి పది గ్రామాల్లో ఏడు తెలంగాణ గ్రామాలే ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లోని ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలు 1, 2, 4, 5, 6, 9, 10 ర్యాంకులు సాధించాయని తెలిపారు. ‘‘పల్లెప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలతో తెలంగాణ గ్రామాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మిషన్‌ భగీరథ ద్వారా వంద శాతం గ్రామాలకు తాగునీటి సరఫరా, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటు, మొక్కల పెంపకం, ఇంటింటి నుంచి చెత్తసేకరణ, పల్లెప్రకృతి వనాలు తదితర కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయి. వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి గ్రామం దేశానికే ఆదర్శంగా నిలవడంతో గతంలో దేశ, విదేశాల నుంచి సందర్శకులు వచ్చేవారు. ఇప్పుడు పల్లెప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లిగా మారుతోందని పేర్కొన్నారు.

సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ

వెయ్యేళ్ల కిందట అవతరించిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఆవిష్కరించి, ప్రపంచానికి అంకితం చేశారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. దేశ ఐక్యత, సమగ్రతకు జగద్గురువు రామానుజాచార్య ప్రేరణ అని, ఆయన బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌’ మంత్రంతో కొత్త భవిష్యత్తుకు పునాదులు పడతాయని చెప్పారు.

విగ్రహ నిర్మాణంలో ప్రత్యేకతలు :-
‣ 2013లో మొదలైన ఆలోచనల అనంతరం 2014 మేలో విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చినజీయర్‌స్వామి సంప్రదాయ, శాస్త్ర, కొలతలకు సంబంధించిన సూచనలిస్తూ, సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ తయారు చేయించారు. ఈ ఫైల్‌ను చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు పంపి, క్యాస్టింగ్, అసెంబ్లింగ్‌ పనులు అప్పగించారు.

‣ థర్మోకోల్‌ను 1:1 మోడల్‌గా కత్తిరించి 20 అడుగుల విగ్రహం తయారు చేశారు. ప్రధాన స్థపతి బృందం వెళ్లి సవరణలు చేసి క్యాస్టింగ్‌కు అనుమతించారు. అలా 1600 ముక్కలుగా తయారు చేసి.. తీసుకొచ్చి ముచ్చింతల్‌లో తయారైన స్టీల్‌ నిర్మాణంపై లేయర్ల వారీగా అతికించారు. ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు చెందిన 70 మంది నిపుణుల బృందం విగ్రహానికి రూపునిచ్చింది. మొత్తం ఈ ప్రక్రియకు 15 నెలలు పట్టింది.

‣ విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83 శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలను వినియోగించి తయారు చేశారు.


ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలు

పటాన్‌చెరులోని ‘అంతర్జాతీయ సమశీతోష్ణ మండల ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ’ (ఇక్రిశాట్‌) స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

‣ వ్యవసాయాన్ని సులభతరం చేయడంలో ఇక్రిశాట్‌ అయిదు దశాబ్దాల అనుభవంతో భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి సహాయం చేసింది.

‣ ఇక్రిశాట్‌ సంస్థ లోగోను, స్వర్ణోత్సవాల తపాలా స్టాంపును మోదీ ఆవిష్కరించారు. వాతావరణ మార్పులపై పరిశోధనలకు సంస్థ ఏర్పాటు చేసిన ఫెసిలిటేట్‌ విభాగాన్ని, ర్యాపిడ్‌ జెన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు.


సమానతను కాపాడే వస్త్రాలే ధరించాలి: కర్ణాటక సర్కారు ఆదేశం

కర్ణాటకలో హిజాబ్‌- కాషాయ వస్త్ర వివాదానికి ముగింపు పలికే దిశగా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సమానత్వం, ఐక్యతను కాపాడే సమ వస్త్రాలను మాత్రమే విద్యార్థులు ధరించాలని ఆదేశించింది. కళాశాల అభివృద్ధి సమితి, పాలక మండలి సూచనల ప్రకారం సమవస్త్ర (యూనిఫామ్‌) నిబంధనలు అమలు చేయాలి. విద్యార్థుల వస్త్రధారణ సమాజంలోని ఏ సముదాయానికి మద్దతుగా, వ్యతిరేకంగా ఉండరాదని ఈ ఆదేశంలో స్పష్టం చేసింది.

ఐఐటీహెచ్‌లో సాంకేతిక పరిశోధన పార్కు ప్రారంభం

ఐఐటీ హైదరాబాద్‌లో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిశోధన పార్కు(టీఆర్‌పీ)ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఇందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు ఉంటాయి. జైకా ముఖ్య ప్రతినిధి సైతో మిత్సునోరి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతికరంగాల్లో ఐఐటీహెచ్, జైకా (జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ) సహకరించుకుంటున్నాయని తెలిపారు.

హరిత క్షేత్రంలో నిర్మాణాలు చట్టవిరుద్ధం: ఎన్జీటీ స్పష్టీకరణ

హరిత క్షేత్రం కోసం కేటాయించిన భూమిలో ప్రభుత్వం కానీ, ప్రైవేటు యజమానులు కానీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణంలో లక్ష్మీ చెరువుతో పాటు దాని సమీపంలోనే హరిత క్షేత్రం/హరిత వనంగా ప్రకటించిన భూమి అన్యాక్రాంతమవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలైంది. విచారించిన జడ్జి సుధీర్‌ అగర్వాల్, నిపుణ సభ్యులు డాక్టర్‌ నాగిన్‌ నందాలు లక్ష్మీ చెరువును కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఝాన్సీ పట్టణాభివృద్ధికి ఉద్దేశించిన 2021 మాస్టర్‌ప్లాన్‌లో హరిత క్షేత్రంగా ప్రకటించిన భూమిలో వాణిజ్య లేక గృహవసతి అవసరాలకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని స్పష్టంగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు కేంద్ర పర్యావరణ, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులు, ఝాన్సీ డివిజనల్‌ కమిషనర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒక సంఘాన్ని ఎన్జీటీ నియమించింది. హరిత క్షేత్రాన్ని పరిశీలించి, అక్కడి స్థితిగతులపై రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

బొగ్గుశాఖ సంచాలకుడిగా వెంకటేశ్వర్లు ఎంపిక

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సంచాలకుడి(సాంకేతిక విభాగం)గా మారపల్లి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన సింగరేణి సంస్థ మార్కెటింగ్‌ విభాగంలో ఉప జనరల్‌మేనేజర్‌(డీజీఎం)గా పనిచేస్తున్నారు. ఇటీవల యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన మౌఖిక పరీక్షలో ఆయన విజయం సాధించడంతో ఈ పోస్టుకు ఎంపికయ్యారు. దీనికి సంబంధించి బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన నియామక ఉత్తర్వులను జీఎం కె.రవిశంకర్‌ సింగరేణి భవన్‌లో వెంకటేశ్వర్లుకి అందజేశారు.

కృష్ణా జలాల్లో ఏపీకి 66%, తెలంగాణకు 34%

కృష్ణా ట్రైబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో 2017 - 18 నుంచి 2021 - 22 వరకు ఆంధ్రప్రదేశ్‌కు 66%, తెలంగాణకు 34% అందినట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌టుడు తెలిపారు. లోక్‌సభలో తెరాస సభ్యులు రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అంతర్రాష్ట్ర జల వివాద పరిష్కార చట్టం 1956 ప్రకారం ఏపీ, తెలంగాణల మధ్య నీటిని కేంద్రం విభజించకపోవడానికి కారణాలేంటి? కృష్ణా ట్రైబ్యునల్‌ జలాల పంపిణీని ఖరారు చేసేంతవరకు కృష్ణా నీటిని రెండు రాష్ట్రాల మధ్య సగం సగం పంచే ప్రతిపాదన ఉందా? అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

అధునాతన చిప్‌తో ఈ - పాస్‌పోర్టులు

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) చిప్‌ వంటి అధునాతన భద్రతపరమైన సాంకేతిక సౌకర్యాలతో 2022 నుంచి ఈ - పాస్‌పోర్టుల జారీకి యోచన చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ ఈ పాస్‌పోర్టులపై ఓ ప్రశ్నకు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ.. దరఖాస్తుదారు వ్యక్తిగత వివరాలు పాస్‌పోర్టు పుస్తకంలోని చిప్‌లో డిజిటల్‌ రూపంలో భద్రంగా ఉంటాయన్నారు. ప్రయాణ పత్రాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి తరఫున అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) సూచించిన ప్రామాణికతలకు తగ్గట్టు చిప్‌ విధి విధానాలు ఉంటాయన్నారు. ఈ చిప్‌ను మార్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తక్షణం గుర్తించవచ్చని తెలిపారు. ప్రస్తుతమున్న పాస్‌పోర్టులను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

ద.మ.రైల్వేకు రూ.9,125 కోట్లు

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకు ప్రాధాన్యం లభించిందని జోన్‌ ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిశోర్‌ వెల్లడించారు. వందేభారత్‌ రైళ్లలో ఈ జోన్‌కు ఎన్ని వస్తాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే అవకాశం ఉందని, హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఉండొచ్చని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపుల పింక్‌బుక్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అందులో ద.మ.రైల్వేకు కేటాయింపుల వివరాలను జీఎం వర్చువల్‌గా వెెల్లడించారు. జోన్‌ పరిధిలో నిర్మాణంలో ఉన్న కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ తదితర పనులకు 2022 - 23లో రూ.9,125 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో క్యాపిటల్‌ ఫండ్స్‌తో పాటు రాష్ట్రాలు, భాగస్వామ్య సంస్థల వాటా, ఇతర మొత్తాలు కలిసి ఉన్నాయి. జోన్‌కు గత ఏడాది కేటాయించిన రూ.7,049 కోట్లతో పోలిస్తే 30 శాతం నిధులు పెరిగాయి. మార్చి నెలాఖరుకు 71 కి.మీ. కొత్త లైన్లు, 177 కి.మీ. డబ్లింగ్‌ లైన్ల నిర్మాణం పూర్తిచేస్తాం’ అని ఆయన వివరించారు. రైల్వే లైన్లతో పాటు ఇతర అన్ని రకాల కేటాయింపులు కలిపి తెలంగాణకు రూ.3,048 కోట్లు (గత ఏడాది రూ. 2,420 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,032 కోట్లు (గత ఏడాది రూ.5,812 కోట్లు) కేటాయించినట్లు తెలిపారు.

తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సిఫార్సు చేసింది. దిల్లీలో సమావేశమైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం మొత్తం దేశంలోని 7 హైకోర్టులకు 27 మంది పేర్లను సిఫార్సు చేయగా వారిలో ఎక్కువ మందిని తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఏడుగురు న్యాయవాదులను, ఐదుగురు జ్యుడీషియల్‌ ఆఫీసర్లను న్యాయమూర్తులుగా నియమించడానికి కొలీజియం పచ్చజెండా ఊపింది. మిగిలిన ఆరు హైకోర్టులకు నలుగురు న్యాయవాదులు, 11 మంది జ్యుడీషియల్‌ అధికారుల పేర్లను ప్రతిపాదించింది. తెలంగాణ నుంచి ప్రతిపాదించిన పేర్లలో న్యాయవాదుల నుంచి కాసోజు సురేందర్, చాడ విజయ భాస్కర్‌రెడ్డి, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫుల్లా బేగ్, ఎన్‌.వి. శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు. న్యాయాధికారుల నుంచి జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్‌ దేవరాజ్‌ నాగార్జున్‌ ఉన్నారు.

కేంద్ర న్యాయశాఖ ఈ పేర్లను ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపి ఆమోదముద్ర వేసిన అనంతరం నియామక ఉత్తర్వులు వెలువడతాయి.

తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు పనిచేయడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 12 మంది నియామకమైతే ఖాళీలు 11కి తగ్గుతాయి. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది ఆగస్టు 17న రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు జ్యుడీషియల్‌ ఆఫీసర్ల పేర్లను సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. తాజా నిర్ణయంతో దాదాపు ఆరునెలల్లో తెలంగాణ హైకోర్టులో 19 న్యాయమూర్తి పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నట్లయింది. కొలీజియం సిఫార్సు చేసిన 12 మందిలో నలుగురు మహిళలున్నారు. ఇద్దరు న్యాయవాదుల కోటాలో, ఇద్దరు జిల్లా న్యాయాధికారుల కోటాలో ఎంపికయ్యారు. వీరితో కలిపి మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10 కానుంది. కొలీజియం తాజా భేటీలో దిల్లీ, పట్నా, బాంబే, కోల్‌కతా, ఝార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకూ నూతన న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సిఫార్సు చేసింది. ఇందులో ఇంతక్రితం సిఫార్సు చేసిన 8 పేర్లను మళ్లీ ఇప్పుడు ప్రతిపాదించింది.


రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను ప్రారంభించిన మహిళా ఎంపీ

దాదాపు దశాబ్ద కాలం తర్వాత రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా మహిళా ఎంపీ గీత అలియాస్‌ చంద్రప్రభ ప్రారంభించారు. 2013లో రేణుకాచౌదరి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు శ్రీకారం చుట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆమెకు ఈ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు భాజపా నాయకత్వం అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్‌ల నుంచి ఆ రాష్ట్ర ఎంపీలు గీత, శ్వేత్‌మాలిక్‌లకు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మాట్లాడే అవకాశం కల్పించింది.

భారత్‌మాల పరియోజన కింద ఏపీలో 36, తెలంగాణలో 17 ప్రాజెక్టులు

భారత్‌మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

‘‘దీనికింద ఆంధ్రప్రదేశ్‌లో 1,409.13 కిలోమీటర్ల పొడవైన 36 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటివరకు 879.15 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది’’ అని తెలిపారు.

భారత్‌మాల ఫేజ్‌-1 కింద బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని బంగారుపాలెం - గుడిపాల మధ్య రూ.1,138 కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు వైకాపా సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ అడిగిన మరో ప్రశ్నలకు గడ్కరీ సమాధానమిచ్చారు.