యూనికార్న్‌గా లివ్‌స్పేస్
హోమ్ ఇంటీరియర్, రెనొవేషన్ ప్లాట్‌ఫాం అయిన ‘లివ్‌స్పేస్’ యూనికార్న్ (100 కోట్ల డాలర్లు - రూ.7500 కోట్ల సంస్థ)గా అవతరించింది. పెట్టుబడుల కంపెనీ కేకేఆర్ నుంచి 180 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.1350 కోట్లు)ను సమీకరించడంతో సంస్థ విలువ 1 బిలియన్ డాలర్లకు పైగా చేరింది. ప్రస్తుత పెట్టుబడుదార్లయిన ఇంగ్‌కా గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్స్, జంగిల్ వెంచర్స్, వెంచురి పార్టనర్స్, ప్యూజియో ఇన్వెస్ట్‌మెంట్స్‌లు కూడా ఈ సిరీస్ ఇ ఫండింగ్‌లో పాల్గొన్నారు. భారత్‌తో పాటు విదేశాల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించడం కోసం తాజా మూలధన నిధులను కంపెనీ వినియోగించనుంది.
2023 ప్రారంభంలో ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అధికారికంగా తీసుకురానున్న డిజిటల్ కరెన్సీ 2023 ప్రారంభంలో అరంగేట్రం చేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు కంపెనీల ఎలక్ట్రానిక్ వాలెట్‌లను ఇది పోలి ఉంటుందని, అయితే ప్రభుత్వ సార్వభౌమత్వం దీనికి ప్రత్యేకమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022 - 23లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పేరుతో ఆర్‌బీఐ సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రతి కరెన్సీ నోటుకు ప్రత్యేక సంఖ్య ఉన్నట్లే ఆర్‌బీఐ జారీ చేసే డిజిటల్ కరెన్సీ యూనిట్ల రూపంలో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చెలామణిలో ఉన్న నగదులో భాగంగానే ఇవీ ఉంటాయి.
జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద బీమా సంస్థగా ఎల్‌ఐసీ
జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద బీమా సంస్థగా నిలిచిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ), ఈక్విటీపై 82% ప్రతిఫలాన్ని (ఆర్‌ఓఈ) అందిస్తోందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరానికి ముందు ఎల్‌ఐసీ మార్కెట్ వాటా 100 శాతం ఉండగా, 2016కు క్రమంగా తగ్గి 71.8 శాతానికి వచ్చిందని, 2020కి 64.1 శాతానికి దిగిందని నివేదిక తెలిపింది. దేశంలో రెండో అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎస్‌బీఐ లైఫ్ మార్కెట్ వాటా 8 శాతమేనని 2021 నవంబరులో తయారు చేసిన నివేదికలో క్రిసిల్ వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం:-
‣ 5,640.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.23 లక్షల కోట్లు) స్థూల రిటెన్ ప్రీమియంతో (జీడబ్ల్యూపీ) ఎల్‌ఐసీ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.
‣ 2021 మార్చి నాటికి ఈ సంస్థకు 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు.
‣ అత్యధిక ఆర్‌ఓఈ అందిస్తున్న సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ఐసీ 82 శాతంతో అగ్ర స్థానంలో ఉంది.
‣ ఆస్తుల పరంగా చూస్తే ఎల్‌ఐసీ 52,200 కోట్ల డాలర్లతో (సుమారు రూ.39.15 లక్షల కోట్లు) అతి పెద్ద ఆరో సంస్థగా ఉంది.
ఎల్‌ఐసీ బోర్డులోకి ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు:-
పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న ఎల్‌ఐసీ, సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసేందుకు అనువుగా ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకుంది. ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్, సెబీ మాజీ సభ్యులు జి.మహాలింగం, ఎస్‌బీఐ లైఫ్ మాజీ ఎండీ సంజీవ్ నౌతియాల్, ఛార్టర్డ్ అకౌంటెంట్ ఎంపీ విజయ్ కుమార్, రాజ్ కమల్, వీఎస్ పార్థసారథిలను నియమించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీరితో కలిపి మొత్తం స్వతంత్ర డైరెక్టర్ల సంఖ్య 9కి చేరింది.
ఎస్‌బీఐకి రికార్డు లాభం
అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్టాండలోన్ నికర లాభం 62.27 శాతం పెరిగి రూ.8,432 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో ఎస్‌బీఐకి ఇదే అత్యధిక లాభం కావడం గమనార్హం. ఏడాదిక్రితం ఇదే సమయంలో నికర లాభం రూ.5,197 కోట్లుగా ఉంది. కేటాయింపులు తగ్గడం లాభంలో వృద్ధికి తోడ్పడింది. వడ్డీ ఆదాయం ఆకర్షణీయ రీతిలో నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 6.48 శాతం పెరిగి రూ.30,687 కోట్లకు చేరింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్ 3.34 శాతం నుంచి పెరిగి 3.4 శాతానికి చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 4.77 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 1.34 శాతం నుంచి తగ్గి 1.23 శాతానికి పరిమితమయ్యాయని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా అన్నారు.
రద్దయిన పాలసీలకు జీవం
సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడంతో రద్దయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తెలిపింది. ప్రీమియం చెల్లింపు కాలం, పాలసీ వ్యవధి ఇంకా అమల్లో ఉన్న పాలసీలకు ఇది వర్తిస్తుంది. 2022 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25 వరకూ ఈ అవకాశం ఉండనుంది. చివరగా ప్రీమియం చెల్లించి, ఇప్పటికి అయిదేళ్లు మించకపోతే ఆ పాలసీలకు కొన్ని నిబంధనల మేరకు పునరుద్ధరణకు అర్హత లభిస్తుంది.
మూడో త్రైమాసిక వృద్ధిరేటు 5.4%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో (అక్టోబరు- డిసెంబరు) త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగు నెమ్మదించింది. జీడీపీ వృద్ధి 5.4 శాతానికి పరిమితమైంది. (2020-21 ఇదేకాలంలో ఇది 0.7 శాతమే). ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.3%, రెండో త్రైమాసికంలో 8.5 శాతంగా వృద్ధి రేటు నమోదైన సంగతి తెలిసిందే. కొవిడ్-19 మూడో దశ వ్యాప్తి నియంత్రణకు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇదే ఎక్కువ. 2021-22లో వృద్ధిరేటు 8.9 శాతమే ఉంది. తయారీ, వ్యవసాయ రంగాల్లో వృద్ధి నెమ్మదించడం వల్ల మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గింది. అయితే ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతే కొనసాగుతోంది. అక్టోబరు- డిసెంబరులో చైనా వృద్ధిరేటు 4 శాతమే కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొత్తంమీద వృద్ధిరేటు 8.9 శాతంగా నమోదు కావచ్చని రెండో ముందస్తు అంచనాను జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా 9.2 శాతం కంటే ఇది తక్కువ.
బీఓబీ ఛైర్మన్‌గా మరో రెండేళ్లు హస్ముఖ్ అధియా
ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి హస్ముఖ్ అధియాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఛైర్మన్‌గా మరోసారి ఎంపిక చేశారు. ఆర్థిక సేవల విభాగం ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేయగా, నియామకాల మంత్రి వర్గ కమిటీ ఆమోద ముద్ర వేసింది. 2022 మార్చి 1 నుంచి మరో రెండేళ్లు ఈయన పదవీ కాలం పొడిగించారు.
ఎల్‌ఐసీలో 20% వరకు ఎఫ్‌డీఐ
త్వరలో పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)లో ఆటోమేటిక్ మార్గంలో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీ షేర్లను ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో నమోదు చేయడానికి ప్రభుత్వం ఇది వరకే అనుమతి ఇచ్చింది.
‣ ఈ మెగా ఐపీఓలో ఆసక్తి ఉన్న విదేశీ మదుపర్లు కూడా పాల్గొనవచ్చు. అయితే ఎల్‌ఐసీ చట్టం-1956 ద్వారా ఏర్పాటైన ఎల్‌ఐసీ ఒక చట్టబద్ధ కార్పొరేషన్. అటు బీమా కంపెనీ కిందకు కానీ.. బీమా ఇంటర్మీడియటరీ కిందకు కానీ రాదు. ఇందులో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానంలో ఎటువంటి నిర్దిష్ట నియమావళి లేదు.
‣ ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం ప్రకారం.. ప్రభుత్వ అనుమతి మార్గంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులకు 20 శాతం వరకు పరిమితి ఉంది. ఇపుడు ఎల్‌ఐసీ, తదితర చట్టబద్ధ కార్పొరేట్ సంస్థల్లోనూ 20 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతికి వీలు కల్పించినట్లయింది. మూలధన సమీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, బీమా రంగంలోని ఇతర సంస్థల మాదిరే ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐని ఎల్‌ఐసీలోకి కొంతమేర అనుమతిస్తున్నట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి.
ఇవీ ప్రయోజనాలు..
ఎఫ్‌డీఐ విధానంలో ఈ సంస్కరణ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎల్‌ఐసీ, ఇతర చట్టబద్ధ కార్పొరేట్ సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యానికి చేరువ కావడానికి ఉపయోగపడుతుంది. ఎఫ్‌డీఐ నిధులు మరింతగా రావడానికి, సులభతరంగా వ్యాపారం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
రూ.20 కోట్ల వ్యాపారాలకూ ఇ-రశీదు
రూ.20 కోట్లకు పైగా టర్నోవరు ఉన్న వ్యాపార సంస్థలు తమ బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) లావాదేవీలకు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్(ఇ-రశీదు) తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు పేర్కొంది. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) చట్టం కింద రూ.500 కోట్లకు పైబడిన కంపెనీలు 2020 అక్టోబరు 1 నుంచి ఇ-రశీదులను పొందుతున్నాయి. ఈ నిబంధనను 2021 జనవరి 1 నుంచి రూ.100 కోట్ల పైబడిన టర్నోవరు సంస్థలకూ పొడిగించారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి రూ.50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవరు ఉన్న సంస్థలకూ అమలు చేశారు. తాజాగా అది మరింత విస్తృతమైనట్లయింది. మరింత మంది సరఫరాదార్లు 2022 ఏప్రిల్ 1 నుంచి ఇ-ఇన్‌వాయిస్‌లను సృష్టించాల్సి ఉంటుంది. ఒక వేళ ఇన్‌వాయిస్ చెల్లకపోతే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను తీసుకోలేకపోగా అపరాధ రుసుములు సైతం చెల్లించాల్సి ఉంటుంది.
కియా అనంతపురం యూనిట్ రికార్డు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా ఇండియా యూనిట్ రెండున్నరేళ్లలోనే 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. ఇందులో 4 లక్షల కార్లను దేశీయంగా విక్రయించగా, ఇతర దేశాలకు లక్ష కార్లు ఎగుమతి చేసింది. 2019 సెప్టెంబరులో కియా సెల్టోస్ మోడల్‌తో ఎగుమతులు ప్రారంభించి, ఇప్పటి వరకు 91 దేశాలకు ఇక్కడి నుంచి కియా కార్లను ఎగుమతి చేసినట్లు కియా ఇండియా వివరించింది. గత ఏడాది కార్ల ఎగుమతుల్లో 25 శాతం కియా ఇండియావే కావడం మరొక ప్రత్యేకత. కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తే-జిన్ పార్క్.
అంకురాలకో ఈక్విటీ ఫండ్
అంకుర సంస్థ(స్టార్టప్)లకు అదనపు మూలధన మద్దతును అందించడం కోసం ఒక కొత్త ఈక్విటీ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మూలధనాన్ని ప్రైవేటు ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసినట్లు ఆయన తెలిపారు.
‣ ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం.. ఈ ఫండ్‌లో ప్రభుత్వం 20 శాతంతో పరిమిత భాగస్వామి(లిమిటెడ్ పార్టనర్)గా ఉంటుంది. ఫండ్ ఏర్పాటు, ప్రాయోజితం కేంద్రమే చేసినా.. ప్రైవేటు ఫండ్ మేనేజర్ల ద్వారా నిర్వహిస్తారని చంద్రశేఖరన్ తెలిపారు. పర్యావరణ ప్రణాళిక, డీప్-టెక్, డిజిటల్ ఎకానమీ, ఔషధ, వ్యవసాయ-సాంకేతిక వంటి కొత్త తరం రంగాలను ప్రోత్సాహించడం కోసం ప్రభుత్వం ఈ నిధులను ఏర్పాటు చేయనుంది.
ఐపీఓకు ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ
పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించే నిమిత్తం ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఫెడ్‌ఫినా) సంబంధిత ప్రాథమిక పత్రాలను మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీకి సమర్పించింది. రూ.900 కోట్ల విలువైన తాజా షేర్లను; ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు, పెట్టుబడుదార్లు 4,57,14,286 షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌లో ఫెడరల్ బ్యాంక్ నుంచి 1,64,97,973 వరకు షేర్లు; ట్రూ నార్త్ ఫండ్-6 ఎల్‌ఎల్‌పీ నుంచి 2,92,16,313 వరకు షేర్లు ఉంటాయి. ఈ ఐపీఓ తర్వాత కూడా ఫెడరల్ బ్యాంక్‌కు ఈ కంపెనీలో 51 శాతం వాటా కొనసాగుతుంది.
హోండా కార్స్ ఇండియాకు ప్రెసిడెంట్‌గా టకుయా సుమురా
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) కొత్త ప్రెసిడెంట్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సీఈఓ) టకుయా సుమురాను హోండా నియమించింది. ఆయన నియామకం 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. హోండా మోటార్స్ ఏటా ఉన్నతస్థాయి పదవుల్లో చేసే మార్పుల్లో భాగంగా ఈ నియామకాన్ని చేపట్టింది. గకు నకనిషి నుంచి సుమురా ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. సుమురా 30 ఏళ్లకు పైగా హోండా మోటార్‌లో పనిచేస్తున్నారు. థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, టర్కీ, ఐరోపా, ఆసియా లాంటి పలు అంతర్జాతీయ విపణుల్లో ఆయన విధులు నిర్వహించారు. 1997- 2000 మధ్య భారత్ సహా దక్షిణాసియా దేశాలకు ఇన్‌ఛార్జ్‌గానూ ఆయన వ్యవహరించారు.
కన్సాయ్ నెరోలాక్ ఎండీగా అనుజ్ జైన్
కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ లిమిటెడ్ (కేఎన్‌పీఎల్) మేనేజింగ్ డైరెక్టరుగా అనుజ్ జైన్ నియమితులయ్యారు. 2022 ఏప్రిల్ నుంచి ఆయన నియామకం వర్తించనుంది. అయితే అంతకంటే ముందు వాటాదారులు ఈ నియామకానికి ఆమోదం తెలపాల్సి ఉంది. కాగా... ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టరు, వైస్ ఛైర్మన్‌గా ఉన్న హెచ్.ఎం.భరుకా మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. 1990లో కేఎన్‌పీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా అడుగుపెట్టిన జైన్.. 30 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. 2018 ఏప్రిల్ 1 నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు హోదాలో కేఎన్‌బీఎల్ బోర్డు సభ్యుడిగానూ జైన్ ఉన్నారు.
2022లో సగటు వేతన పెంపు 9%
కొవిడ్ మహమ్మారి ప్రభావంతో 2020 నుంచి అనేక సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ప్రస్తుతం ఆయా కంపెనీలు కొవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటున్నాయని మెర్సెర్ సర్వే వెల్లడించింది. ఈ ఏడాది పరిశ్రమ సగటు వేతన పెంపు 9 శాతం ఉండొచ్చని టోటల్ రెమ్యునరేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో పేర్కొంది. 5,700 ఉద్యోగ విధులు, 14 లక్షల సంచిత ఉద్యోగులు కలిగిన 988 కంపెనీలను సర్వే చేసి మెర్సెర్ ఈ నివేదిక రూపొందించింది.
‣ వినియోగదారు ఆధారిత, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ తదితర రంగాల్లో పరిశ్రమ సగటు కంటే వేతన పెంపు అధికంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. సానుకూల ఆర్థిక, వ్యాపార సెంటిమెంట్‌తో 2022లో వేతన పెంపు 9 శాతం ఉండొచ్చని, 2020లో ఇది 7.7 శాతంగా ఉందని పేర్కొంది.
‣ టెక్ రంగంలో అన్ని విభాగాల ఉద్యోగుల వేతన ఇంక్రిమెంట్లు 2019 స్థాయికి (9 శాతం) చేరాయని వివరించింది. 2021లో పరిశ్రమ సగటు వేతన పెంపు 8 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
‣ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్‌అండ్‌డీ, ప్రీ-సేల్స్ ప్రోడక్ట్ కన్సల్టింగ్, డేటా సైన్సెస్ లాంటి ఉద్యోగాల్లో వేతన పెంపు 12 శాతం వరకు ఉందని వెల్లడించింది.
‣ టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలున్న ఉద్యోగులకు ప్రస్తుత, వచ్చే కొన్ని సంవత్సరాల్లో వేతన పెంపులో అధిక ప్రీమియం లభిస్తుందని తెలిపింది.
5 ఏళ్ల గరిష్ఠానికి చేరొచ్చు: అయాన్ సర్వే
భారత్‌లో వేతన పెంపు ఈ ఏడాది 5 ఏళ్ల గరిష్ఠమైన 9.9 శాతానికి చేరొచ్చని అయాన్ సర్వే వెల్లడించింది. ఆర్థిక రికవరీ బలంగా ఉండటం, సానుకూల వ్యాపార సెంటిమెంటుతో కంపెనీలు కొత్త తరం సామర్థ్యాలను నిర్మించేందుకు సిద్ధమై, అధిక పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తుండటంతోనే వేతన పెంపు ఈ స్థాయిలో ఉండొచ్చని అయాన్ అభిప్రాయపడింది. 2021లో ఈ పెంపు 9.3 శాతంగా ఉందని పేర్కొంది. అంతర్జాతీయంగా వృత్తిపరమైన సేవలు అందిస్తున్న దిగ్గజ సంస్థ అయాన్ తమ 26వ వేతన పెంపు సర్వేను భారత్‌లో నిర్వహించింది. ఈ అధ్యయనంలో 40 రంగాల్లోని 1,500 కంపెనీల వద్ద సమాచారాన్ని సమీకరించి విశ్లేషించింది.
‣ ఇ - కామర్స్, వెంచర్ క్యాపిటల్, హైటెక్/ఐటీ, ఐటీఈఎస్, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే 2021లో అత్యధిక వలసల రేటు (21 శాతం) నమోదైనట్లు తెలిపింది.
ఆర్‌బీఐ పరపతి విధాన సమావేశ నిర్ణయాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా పదో ద్వైమాసిక సమీక్షలోనూ కీలక రుణ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా రికార్డు కనిష్ఠ స్థాయిల్లోనే ఉంచింది. కొవిడ్ పరిణామాల నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు ఇచ్చిన రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ (రెపో) రేటును 4 శాతం వద్ద, ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులకు ఇచ్చే వడ్డీ (రివర్స్ రెపో) రేటును 3.35 శాతం వద్దే ఉంచాలని పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. 2020 ఆగస్టు నుంచి రేట్లను యథాతథంగా ఉంచుతూ వచ్చిన ఎమ్‌పీసీ.. అవసరమైనంత కాలం ‘సర్దుబాటు’ ధోరణినే కొనసాగించాలని 5-1 మెజారిటీతో నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
ముఖ్యాంశాలు:-
‣ వృద్ధి అంచనాలు : రాబోయే ఆర్థిక సంవత్సరం(2022-23)లో జీడీపీ అంచనాను 7.8 శాతంగా ఆర్‌బీఐ ప్రకటించింది. జాతీయ గణాంకాల కార్యాలయం ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన 9.2 శాతం కంటే ఇది తక్కువే. 2022-23 ఏప్రిల్-జూన్‌లో 17.2 శాతం, జులై-సెప్టెంబరులో 7.0 శాతం, అక్టోబరు-డిసెంబరులో 4.3%; జనవరి-మార్చిలో 4.5 శాతం జీడీపీ వృద్ధి లభిస్తుందనే అంచనాలను ఆర్‌బీఐ ప్రకటించింది.
‣ ద్రవ్యోల్బణం 4.5% : వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా నమోదుకావొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. (త్రైమాసికాల వారీగా 4.9%; 5%; 4%; 4.2 శాతం చొప్పున అంచనాలిచ్చింది.) ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనా అయిన 5.3 శాతంతో పోలిస్తే ఇది తక్కువ.
‣ ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ.50,000 కోట్ల రుణాలను రెపో రేటు వద్ద మూడేళ్ల గడువుకు అందించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
బిలియన్ డాలర్ బ్రాండ్‌గా థమ్స్‌అప్
శీతల పానీయమైన థమ్స్‌అప్ భారత్‌లో బిలియన్ డాలర్ (100 కోట్ల డాలర్లు-రూ.7500 కోట్ల) బ్రాండ్‌గా 2021లో అవతరించిందని ఈ బ్రాండ్‌ను కలిగి ఉన్న కోకకోలా కంపెనీ వెల్లడించింది. 1993లో దేశీయ విపణిలోకి మళ్లీ ప్రవేశించిన కోకకోలా కంపెనీ థమ్స్‌అప్‌ను పార్లే బిస్లరీ యజమాని రమేశ్ చౌహాన్ నుంచి స్వాధీనం చేసుకుంది. దీనితో పాటు గోల్డ్‌స్పాట్, లింకా కూడా కోకకోలా ఆధీనంలోకి వెళ్లాయి. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు, దేశీయ కార్యకలాపాల్లో వాటా తగ్గించుకోవాలని సూచించడంతో, దేశీయ విపణి నుంచి కోకకోలా వైదొలగింది. అప్పుడే 1977లో దేశీయంగా థమ్స్‌అప్ ప్రారంభమైంది. దేశీయ శీతల పానీయం బ్రాండ్ బి.డాలర్ విలువను పొందడం ఇదే తొలిసారి.