రాష్ట్రీయం -ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా ఖాదర్‌బాషా
రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా ఖాదర్‌బాషా ఎన్నికయ్యారు. విజయవాడ వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలోని సంస్థ కార్యాలయంలో 9మంది సభ్యులు సమావేశమయ్యారు. వారిలో ముగ్గురు గత ప్రభుత్వ హయాంలోనే సభ్యులు కాగా మరో ఆరుగురిని గత నెల 14న నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చిత్తూరు నివాసి ఖాదర్‌బాషా పేరును బోర్డు సభ్యుడు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రతిపాదించగా మిగిలినవారు మద్దతు తెలిపారు.
మార్చి 4న మహిళా పార్లమెంట్
జాతీయ మహిళా కమిషన్ భాగస్వామ్యంతో మార్చి 4న రాష్ట్రంలో మహిళా పార్లమెంట్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఆమె కమిషన్ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, క్రీడలు, మీడియా, పారిశ్రామిక, సినిమా, కళలు తదితర రంగాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున మహిళా పార్లమెంట్‌కు హాజరై చర్చల్లో పాల్గొనాలని ఛైర్‌పర్సన్ సూచించారు. వివిధ ప్రభుత్వశాఖల నుంచి మహిళా ప్రతినిధులు, మహిళా సమస్యలపై పని చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డీజీపీ హోదాలో సవాంగ్ పదవీ విరమణ చేశారు.
ఏపీ కొత్త డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ కొత్త డీజీపీకి బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అలుబండ గ్లోబల్‌తో ఎంవోయూ
అల్యూమినియం కాయిల్స్, ప్యానెళ్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు దుబాయ్‌కి చెందిన అలుబండ గ్లోబల్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దుబాయ్ ఎక్స్‌పో - 2020లో భాగంగా అవగాహన ఒప్పంద పత్రాలపై (ఎంవోయూ) సంస్థ ఛైర్మన్ షాజి ఎల్ ముల్క్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) సీఈవో సుబ్రమణ్యం ఫిబ్రవరి 17న సంతకాలు చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి అబుదాబిలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ, జీ42, ముబదల గ్రూప్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్, స్మార్ట్‌సిటీ, హెల్త్‌కేర్, నైపుణ్యం, విద్య, డిజిటల్ గవర్నెన్స్, ఐటీ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులకు అవకాశముందని వివరించారు. ఈ సమావేశంలో జీ42 కంపెనీ ముఖ్య అభివృద్ధి అధికారి రఫేల్ బ్రెస్పి, గ్రూప్ సీఈవో మన్సూర్‌అల్ మన్సూరి పాల్గొన్నారు.
ఏపీలో ఫుడ్‌పార్కులు, ఆహారశుద్ధి పరిశ్రమల అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని అలానా గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ అలానాను మంత్రి కోరారు. గల్‌్్ఫఫుడ్ ఫెస్టివల్‌లో అలానా ఫుడ్ పరిశ్రమ ఏర్పాటు చేసిన స్టాల్‌ను మంత్రి పరిశీలించారు. రంజాన్ తర్వాత రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశంపై చర్చిస్తామని అలానా గ్రూప్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
రాష్ట్రంలో రెండు లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం దుబాయ్‌కి చెందిన షరాఫ్ గ్రూప్ రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుందని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ మొత్తంతో గిడ్డంగులు, ప్యాకేజింగ్ యూనిట్లు, డిస్‌ప్లే యూనిట్లు ఏర్పాటు చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడుల వల్ల 700 మందికి ప్రత్యక్షంగా, 1300 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. పోర్టులు, పారిశ్రామిక, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతమని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు.
కేవీ రాజేంద్రనాథరెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు
కొత్త డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులైన కేవీ రాజేంద్రనాథరెడ్డిది కడప జిల్లా. ఆయన 1992 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ ఏఎస్పీగా 1994లో తొలి పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.
వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అదనపు ఎస్పీగా పనిచేశారు. విశాఖపట్నం రూరల్, నెల్లూరు జిల్లాల ఎస్పీగా, సీఐడీ, గుంతకల్లు, విజయవాడ రైల్వే యూనిట్ల ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో సిటీ సెక్యూరిటీ, తూర్పు జోన్ డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2008 నుంచి 2010 మధ్య విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. విశాఖపట్నం జోన్ ఐజీగా, హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. పోలీసు గృహనిర్మాణ సంస్థ ఎండీ, డ్రగ్ కంట్రోల్ డీజీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ తదితర పోస్టుల్లో కొనసాగారు. 2020 ఆగస్టు 12 నుంచి నిఘా విభాగం అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో డీజీపీగా కొనసాగనున్నారు. 2026 ఏప్రిల్ మాసాంతం వరకూ ఆయనకు సర్వీసు ఉంది.
దుబాయ్ ఎక్స్‌పోలో 3 సంస్థలతో ఎంవోయూలు
దుబాయ్ ఎక్స్‌పో - 2020లో ప్రభుత్వం మూడు కీలక అవగాహన ఒప్పందాలను (ఎంవోయూ) కుదుర్చుకుందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. ‘లండన్‌కు చెందిన కాజస్ ఈ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టేలా ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రజారవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్పు చేసే పరిశ్రమను కడప మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. రీజెన్సీ గ్రూప్ రూ.150 కోట్ల పెట్టుబడులతో 25 రిటైల్ ఔట్‌లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అనంతపురం, కడప, కర్నూలు, మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, హిందూపురం ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలు, సుగంధ ద్రవ్యాల ప్యాకింగ్ యూనిట్లను సంస్థ ఏర్పాటు చేస్తుంది. కృత్రిమ మేథకు సంబంధించి ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ విశాఖలో 300 హైఎండ్ ఐటీ ఉద్యోగాలు కల్పించే దిశగా ఒప్పందం కుదుర్చుకుంది’ అని తెలిపారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి ప్రమాణం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి జారీచేసిన నియామక ఉత్తర్వుల పత్రాలను ప్రధాన న్యాయమూర్తి కొత్తగా నియమితులైన జడ్జిలకు అందించారు.
ఏపీలో వైద్యశాలల నిర్మాణానికి రూ.560 కోట్ల కేటాయింపు
విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. ఇందులో 350 సాధారణ పడకలు, 50 సూపర్ స్పెషాలిటీ పడకలు ఉంటాయని చెప్పారు. రూ.384.26 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ ఆసుపత్రి పనులను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించామన్నారు. మొత్తంగా ఏపీలో ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.560.63 కోట్లు ఖర్చు చేయడానికి అనుమతిని ఇచ్చినట్లు చెప్పారు.
తిరుపతి ఐసీఐ నిర్మాణం పూర్తి
తిరుపతిలో రూ.97.49 కోట్ల వ్యయంతో ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ (ఐసీఐ) నిర్మాణం పూర్తి చేసినట్లు కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 2016-17 నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభమైనట్లు చెప్పారు. ఇక్కడ బీబీఏ, ఎంబీఏ కోర్సులకు ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మహమ్మారి కారణంగా 2020, 2021ల్లో యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ప్రవేశపరీక్షలు నిర్వహించలేదని చెప్పారు. అయితే ప్రాథమిక అర్హత నిబంధనల ఆధారంగా ప్రవేశాలు కల్పించినట్లు వెల్లడించారు.
ఏపీలో మూడు జిల్లాల్లో యురేనియం అన్వేషణ
ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్‌లోని కడప, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో యురేనియం అన్వేషణ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
కోనసీమ ముఖద్వారం వద్ద 40 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పరిధిలోని కోనసీమ ముఖద్వారం వద్ద 40 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రూ.1.3 కోట్లతో నిర్మాణానికి పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 సెప్టెంబరు 30వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
రూ.26 వేల కోట్లతో విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ
విశాఖపట్నంలోని రిఫైనరీని రూ.26,264 కోట్లతో ఆధునికీకరణ, విస్తరణ చేయాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందన్నారు.
కేంద్ర రక్షణశాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సంస్థలున్నట్లు రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, విశాఖపట్నంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లు పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు బీఈఎల్ రూ.190.20 కోట్లు, బీడీఎల్ రూ.95.40 కోట్లు, హెచ్‌ఎస్‌ఎల్ రూ.211.88 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. బీఈఎల్ సంస్థ కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మలూరులో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళా కమిషన్‌కు ముగ్గురు సభ్యుల నియామకం
రాష్ట్ర మహిళా కమిషన్‌కు ముగ్గురు సభ్యుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖకు చెందిన గెడ్డం ఉమ, తణుకు చెందిన వినీత, గుంతకల్లుకు చెందిన రొఖయా బేగంను నామినేట్ చేసింది. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు.