అంతర్జాతీయం

జర్మనీ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన స్టాన్‌మార్‌

జర్మనీ అధ్యక్షుడిగా ఫ్రాంక్‌ ఓల్టర్‌ స్టాన్‌మార్‌ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో దిగువసభ సభ్యులు, జర్మనీలోని 16 రాష్ట్రాల ప్రతినిధులు భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా స్టాన్‌మార్‌ను ఎన్నుకున్నారు.

ఎన్నికలకు ముందు స్టాన్‌మార్‌ అభ్యర్థిత్వానికి పలు ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి.


భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు (యూఏఈ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు చేశాయి. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌ టౌఖ్‌ ఏఐ మర్రి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ ఏఐ నహ్వాన్‌ కూడా పాల్గొన్నారు. ఒప్పందం అనంతరం మంత్రి గోయల్‌ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య మరిన్ని వ్యాపార అవకాశాలకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని చెప్పారు. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. 2020 - 21లో భారత్, యూఏఈల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 43.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఇది 60 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, రాబోయే అయిదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందనే అంచనాలున్నాయి.

కోబ్రా వారియర్‌ విన్యాసాలకు భారత్‌ దూరం

కోబ్రా వారియర్‌ పేరిట 2022 మార్చి నెలలో బ్రిటన్‌లో జరగనున్న బహుళ దేశీయ వైమానిక విన్యాసాల నుంచి భారత్‌ వైదొలగింది. మార్చి 6 నుంచి 27 వరకు వేడింగ్టన్‌లో జరగనున్న ఈ విన్యాసాలకు ఐదు తేలికపాటి తేజస్‌ యుద్ధ విమానాలు పంపాలని భారతీయ వాయుసేన ఫిబ్రవరి 24న ప్రకటన కూడా చేసింది. అయితే ఉక్రెయిన్‌ సంక్షోభం దృష్ట్యా ఇందులో పాల్గొనకూడదని ఫిబ్రవరి 26న నిర్ణయించింది.

‘మ్యూజియం ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ ప్రారంభం

దుబాయిలో నిర్మించిన ‘మ్యూజియం ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ ఏడంతస్తుల భవనాన్ని పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషిద్‌ ప్రారంభించారు. ఇందులో భవిష్యత్తుకు సంబంధించిన వినూత్న పరిశోధనల ప్రదర్శనను అందుబాటులో ఉంచనున్నారు. 50 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులో ఉంటుందో ఊహిస్తూ ఈ మ్యూజియాన్ని రూపొందించారు.

అందుబాటులోకి ట్రూత్‌ సోషల్‌

- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ట్విటర్‌కు పోటీగా ‘టూత్‌ సోషల్‌’ను అందుబాటులోకి తెచ్చారు.

- గత ఏడాది క్యాపిటల్‌ భవనంపైకి తన మద్దతుదారులను ఉసిగొల్పి హింసాత్మక ఘటనలకు కారణమవ్వడంతో ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. ఇది రాజకీయ వివక్ష అంటూ అప్పట్లో ధ్వజమెత్తిన ట్రంప్‌ ఇప్పుడు ట్విటర్, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలకు పోటీగా సామాజిక మాధ్యమ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని పేరు ‘ట్రూత్‌ సోషల్‌’.

- ఇది యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో విడుదలైంది. ఇందులో రాజకీయ వివక్ష ఉండదని యాప్‌ను రూపకల్పన చేసిన ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ తెలిపింది. ట్విటర్‌ను పోలి ఉండే ఈ యాప్‌లోనూ ఒకరినొకరు అనుసరించొచ్చు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. ట్విటర్‌లో పోస్ట్‌ చేసేవాటిని ట్వీట్‌ అంటాం. ట్రూత్‌ సోషల్‌ మీడియా యాప్‌లో మాత్రం ‘ట్రూత్‌’ అని సంబోధిస్తారు.


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. ముందస్తు వ్యూహం ప్రకారం బెలారస్‌ వైపు నుంచి సైనిక బలగాలతో ఉక్రెయిన్‌లో ప్రవేశించింది. కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక వైమానిక స్థావరాలు, రక్షణ శాఖ ఆయుధాగారాలపై క్షిపణులు, బాంబులతో దాడులు చేసింది. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి సురక్షితంగా తరలించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. కీవ్, ఖార్కీవ్, ఒడెసా, ద్నిప్రో తదితర 13 నగరాల్లోని స్థావరాలు లక్ష్యంగా రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది.

కీవ్‌కు 130 కి.మీ. దూరంలోని చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కర్మాగారాన్ని రష్యా బలగాలు గుప్పిట్లో తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ కూడా ధ్రువీకరించింది.

ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరిన్ని ఆంక్షలు విధించారు. రష్యాకు చెందిన ఏరోఫ్లోట్‌ విమానయాన సంస్థ కార్యకలాపాలపై నిషేధం విధించారు. దీంతోపాటు రష్యా ప్రభుత్వ బ్యాంకు ‘వీటీబీ’కి బ్రిటన్‌లో ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు రష్యాపై విస్తృస్థాయి ఆంక్షలకు సంబంధించి పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఓ ప్యాకేజీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం బ్రిటన్‌లో కార్యకలాపాలు నిర్వహించకుండా రష్యా బ్యాంకులను పూర్తిగా నిషేధించొచ్చు.

ఉక్రెయిన్‌పై రష్యా ‘అప్రేరేపిత, అన్యాయమైన’ దాడికి వ్యతిరేకంగా తమ ఉమ్మడి స్పందన, కార్యాచరణ గురించి చర్చించడానికి జీ7 దేశాల అధినేతలు సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నేతృత్వంలో జరిగిన ఈ వర్చువల్‌ భేటీలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్‌ దేశాల అధినేతలు, ఐరోపా సమాఖ్య(ఈయూ) అధ్యక్షురాలు, నాటో సెక్రటరీ జనరల్‌ పాల్గొన్నట్లు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

అంతర్జాతీయ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై కఠిన ఆంక్షలు విధించేందుకు ఐరోపా సమాఖ్య (ఈయూ) సిద్ధమైంది. అత్యంత తీవ్రమైన ఆంక్షలు విధించేందుకు ప్రణాళికను ప్రతిపాదిస్తున్నట్టు యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌ డైర్‌ లియాన్‌ తెలిపారు.


కిమ్‌ గ్రీన్‌హౌస్‌ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన దేశ ప్రజల ఆహారపు ప్రమాణాలు మెరుగు పరిచే దిశగా తొలి అడుగు వేశారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన హమ్‌హంగ్‌ సమీపంలో అతిపెద్ద గ్రీన్‌ హౌస్‌ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. భారీగా వచ్చిన సైనికుల మధ్య మంచుతో పేరుకుపోయిన మట్టిని బాంబులతో పేల్చి పనులకు శ్రీకారం చుట్టారు. శీతాకాలంతో తాజా కూరగాయలు లభించక ఉత్తర కొరియన్లు తీవ్ర ఇబ్బందులు పడతారు. కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య కూరగాయల సాగు సాధ్యం కాదు. దీన్ని అధిగమించేందుకు ఎలాంటి వాతావరణంలోనైనా ఏడాదంతా పండే కూరగాయల సాగుకు కిమ్‌ సంకల్పించారు. కొన్నేళ్ల నుంచి దీనికి ప్రణాళికలు రచిస్తున్న ఆయన.. అంతర్జాతీయ, స్థానిక సంస్థల సహకారంతో ఏడాది పొడవునా కూరగాయలు పండించే గ్రీన్‌హౌస్‌ వ్యవసాయ క్షేత్రం నిర్మాణానికి పూనుకున్నారు. మామూలుగా ప్రధాన నిర్మాణ ప్రాజెక్టుల కోసం మాత్రమే ఉపయోగించే సైన్యాన్ని ఈ వ్యవసాయ క్షేత్రం పనికి కిమ్‌ ఉపయోగిస్తున్నారు.

సింగపూర్‌లో ఎల్‌ఎన్‌జీతో నడిచే నౌక ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరణ

ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)తో నడిచే నౌకను ప్రపంచంలోనే తొలిసారిగా బీహెచ్‌పీ గ్రూప్‌ సింగపూర్‌లో ఆవిష్కరించింది. సరఫరా వ్యవస్థలో ఉద్గారాలను భారీగా తగ్గించుకునేందుకు కంపెనీ తీసుకొస్తున్న అయిదింటిలో ఇదీ ఒకటి. 299 మీటర్ల (981 అడుగులు) పొడవుండే ‘మౌంట్‌ టూర్‌మలైన్‌ న్యూకాసిల్‌మాక్స్‌’ను ఈస్టర్న్‌ పసిఫిక్‌ షిప్పింగ్‌ సంస్థ చైనాలో తయారు చేసింది. సింగపూర్‌లో ఎల్‌ఎన్‌జీ కోసం ఆగిన ఈ నౌక పశ్చిమ ఆస్ట్రేలియాలోని పోర్ట్‌ హెడ్లాండ్‌కు వెళుతుంది. అక్కడ ముడి ఇనుమును ఎక్కించుకుని చైనాలోని వినియోగదార్లకు అందజేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గనుల తవ్వకదారు అయిన బీహెచ్‌పీ 2050 కల్లా తన సరఫరా వ్యవస్థలో సున్నా శాతం కర్బన ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఎన్‌జీ నౌకల ద్వారా ఒక్కో ప్రయాణానికి 30% మేర ఉద్గారాలను తగ్గించుకోవచ్చని బీహెచ్‌పీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వందిత పంత్‌ పేర్కొన్నారు.

న్యూయార్క్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 8 అడుగుల గాంధీజీ కంచు విగ్రహాన్ని ఆగంతుకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అమెరికాలోని భారత కాన్సులేట్‌ తీవ్రంగా ఖండించింది. మన్‌హట్టన్‌ యూనియన్‌ స్క్వేర్‌ పార్కులో 1986లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. గాంధీజీ 117వ జయంతి సందర్భంగా గాంధీ మెమోరియల్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఈ ప్రతిమను బహూకరించింది. శాంతి, అహింసా మార్గాలను ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్ముడి విగ్రహాన్ని దుండగులు లక్ష్యం చేసుకోవడం విచారకరమని అమెరికాలోని భారతీయ సంఘాల సమాఖ్య ఛైర్మన్‌ అంకుర్‌ వైద్య పేర్కొన్నారు.

గాలి, నీరు, నేలపై నడిచే కారు

ప్రపంచంలోనే మొదటి లగ్జరీ హోవర్‌క్రాఫ్ట్‌ పేరు అరోసాను అమ్మ‌కానికి సిద్ధం చేశారు. వాన్‌ మెర్సీర్‌ సంస్థ దీన్ని తయారు చేసింది. ఇది నీళ్లపై పడవలాగా నడుస్తుంది. గాల్లో ఎగురుతుంది. రోడ్డుపై కారులాగా దూసుకెళ్తుంది. ఇది గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. పూర్తిగా విద్యుత్తుతో నడవడం దీని ప్రత్యేకత.

భారీస్థాయిలో రష్యా అణ్వాయుధ విన్యాసాలు

ఉక్రెయిన్‌ సరిహద్దులో ఓ వైపు రష్యా వేర్పాటువాదులు ఫిరంగులతో విరుచుకుపడుతుంటే.. మరోవైపు పుతిన్‌ సేనలు ‘అణు’ విన్యాసాలు చేస్తూ.. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేశాయి. రష్యా దాడిచేస్తే తీవ్రమైన ఆంక్షలు తప్పవని అమెరికా, నాటోకూటమి హెచ్చరికలు జారీచేస్తున్నా.. రష్యా అణుమాత్రం తగ్గట్లేదు. వేర్పాటువాదులు ఉక్రెయిన్‌ సైనికాధికారులపైన ఫిరంగులతో దాడులు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో వివాదం మరింత జటిలంగా మారింది. ఉద్రిక్తతల్ని చల్లార్చే యత్నాల్లో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సంక్షోభ నివారణ కోసం చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. దీనిపై రష్యా నుంచి ఎటువంటి స్పందన లేదు.

భారత్‌లో 60 పాక్‌ సామాజిక మాధ్యమ ఖాతాలు బంద్‌

భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నందుగాను గత రెండు నెలల్లో కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు, ట్విటర్, ఫేస్‌బుక్‌ ఇన్‌స్టాగ్రాం పేజీలతో కలిపి మొత్తం 60 సామాజిక మాధ్యమ ఖాతాలు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో కొన్ని అనుబంధ ప్రశ్నలకు సమాచార, ప్రసారశాఖ సహాయమంత్రి ఎల్‌.మురుగన్‌ సమాధానమిస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వెళుతోందన్నారు. తాము ఖాతాలు బందు చేయించిన యూట్యూబ్‌ ఛానళ్లు పాకిస్థాన్‌ నుంచి నడుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం సెక్షన్‌ 14 కింద 150 కేసుల్లో తాము చర్యలు తీసుకొన్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ మీడియా విషయంలో అన్ని ఛానళ్లు కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ చట్టం-1995 నియమాలను అనుసరించాలని మంత్రి తెలిపారు. డిజటల్‌ న్యూస్‌ మాటకొస్తే.. గతేడాది రూపొందిన ఐటీ యాక్ట్‌ నిబంధనలు వర్తిస్తాయన్నారు.

తైవాన్‌ క్షిపణి రక్షణ వ్యవస్థకు అమెరికా సహాయం

చైనా నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న తైవాన్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అమెరికా 10 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టుకు ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్, నిర్వహణ పనులకు సంబంధించిన ఈ ఒప్పందంపై చైనా మండిపడింది. దీనివల్ల తమ సార్వభౌమ, భద్రతా ప్రయోజనాలు దెబ్బతింటాయని, తైవాన్‌ జలసంధి ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. అందువల్ల కాంట్రాక్టును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. తాజా కాంట్రాక్టు కింద తైవాన్‌ వద్ద ప్రస్తుతం ఉన్న గగనతల రక్షణ క్షిపణులు, అమెరికా నుంచి సమకూర్చుకోనున్న అధునాతన పేట్రియాట్‌ క్షిపణుల నిర్వహణకు అగ్రరాజ్యం నుంచి తోడ్పాటు అందుతుంది. తైవాన్‌ను తన అంతర్భాగంగా చైనా పరిగణిస్తోంది. బలప్రయోగం ద్వారానైనా దాన్ని తమ దేశంలో విలీనం చేసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇటీవల తైవాన్‌ గగనతలంలోకి తరచూ యుద్ధవిమానాలను పంపుతోంది.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఎత్తివేత

ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే దిశగా అమెరికా చర్యలు ప్రారంభించింది. ఈ నిర్ణయం వల్ల ఇరాన్‌ అణు కార్యక్రమాలకు సహకరించే దేశాలు, కంపెనీలకు అమెరికా విధించే జరిమానాల నుంచి మినహాయింపు లభించనుంది. ఇరాన్‌ అణు కార్యక్రమానికి ఆటంకంగా ఉన్న పలు ఆంక్షలను బైడెన్‌ సర్కారు ఎత్తివేసింది. 2018లో ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన అనంతరం అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఆంక్షలు విధించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌ అణు కార్యకలాపాలకు సంబంధించి విధించిన అనేక ఆంక్షలను మినహాయిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇటీవలే సంతకం చేశారు.

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో..భారత మూలాలున్న వ్యక్తికి మరణశిక్ష

మాదకద్రవ్యాల అక్రమరవాణా కేసులో భారత మూలాలున్న వ్యక్తికి సింగపూర్‌ కోర్టు మరణశిక్ష విధించింది. మలేసియా పౌరుడైన కిషోర్‌ కుమార్‌ రఘువాన్‌(41).. 2016లో సింగపూర్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తూ దొరికిపోయాడు. మోటారుసైకిల్‌పై సింగపూర్‌లోకి ప్రవేశించిన అతని బ్యాగులోని నాలుగు ప్యాకెట్లలో 36.5 గ్రాముల హెరాయిన్‌ పట్టుబడింది. సింగపూర్‌ చట్టాల ప్రకారం.. 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌తో పట్టుబడితే మరణశిక్ష విధిస్తారు. కిషోర్‌ నుంచి డ్రగ్స్‌ ప్యాకెట్లు తీసుకొనేందుకు వచ్చిన చైనా మూలాలున్న పంగ్‌ అహ్‌ కియాంగ్‌ (61) అనే వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

క్యాన్సర్‌పై శ్వేతపత్రం వెలువరించిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)

భారత్‌లో 1990 నుంచి క్యాన్సర్‌ కేసులు 60 శాతం పెరిగాయనీ, క్యాన్సర్‌ చికిత్సను రూపాంతరం చెందించడంలో కృత్రిమ మేధ, బ్లాక్‌ చెయిన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కీలక పాత్ర వహిస్తాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వెలువరించిన శ్వేతపత్రం పేర్కొంది. భారత్‌లో ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్‌ బారిన పడతారనీ, వారిలో మూడో వంతుకన్నా తక్కువ మందే క్యాన్సర్‌ నిర్ధారణ అయిన తర్వాత 5 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జీవిస్తారని అమెరికన్‌ సైన్స్‌ పత్రిక జేసీఓ గ్లోబల్‌ ఆంకాలజీ అంచనా. భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ఆంకాలజీ (క్యాన్సర్‌) డేటా మోడల్‌ను చేపట్టాలని డబ్ల్యూఈఎఫ్‌ శ్వేతపత్రం సిఫార్సు చేసింది. రోగిలో క్యాన్సర్‌ బయటపడిన నాటి నుంచి వ్యాధి నివారణ, చికిత్స వరకు ప్రతి అంచెలో అతడి సమాచారాన్ని ఆంకాలజీ డేటా మోడల్‌లో నిక్షిప్తం చేయాలంది.

సమాచారాన్ని వేగంగా విశ్లేషించి, రోగ నిర్ధారణ చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) ఉపకరిస్తుంది. ఒంటి మీద ధరించే వైద్య సాధనాలు రోగి శారీరక స్థితిని ఎప్పటికప్పుడు నమోదు చేస్తాయి. ఏఐ ఈ సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి చికిత్స ప్రారంభించడానికి వైద్యులకు చేయూతనిస్తుంది. చికిత్సను దూరం నుంచే పర్యవేక్షించడానికి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) సహకరిస్తుంది. ఆంకాలజీ డేటా మోడల్‌ ద్వారా సేకరించిన సమాచారం ఆంకాలజీ మాస్టర్‌ రికార్డులో నిక్షిప్తమై రోగికీ, చికిత్సచేసే వైద్యులకు తోడ్పడుతుంది. ఈ సాంకేతికతలను రెండుమూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టాలనీ, ఆ పైలట్‌ ప్రాజెక్టులు సఫలమయ్యాక దేశమంతటికీ విస్తరించవచ్చునని శ్వేత పత్రం సూచించింది.


పొడవైన పెద్ద మెరుపు ప్రపంచ రికార్డు

2020 ఏప్రిల్‌ 29న అమెరికాలో కనిపించిన ఒక మెరుపు ప్రపంచ రికార్డు అయి మెరిసింది. ఇదే ఇంతవరకు అతి పొడవైనదిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తేల్చింది. ఈ మెరుపు పొడవు దాదాపు 770 కి.మీ. అంటే రైలు మార్గంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం (సుమారు 710 కి.మీ.) కంటే ఎక్కువ దూరం. అమెరికా దక్షిణ ప్రాంతంలోని మిసిసిపీ, లూసియానా, టెక్సాస్‌ల మీదుగా ఈ మెరుపు మెరిసినట్లు డబ్ల్యూఎంఓ తెలిపింది. అంతకుముందు అతి పొడవైన మెరుపు బ్రెజిల్‌ దక్షిణ ప్రాంతంలో కనిపించింది. 2018 అక్టోబరు 31న అది 709 కి.మీ. మేర విస్తరించింది.

అత్యంత ఎక్కువ సమయం మెరిసిన మెరుపు కూడా 2020లోనే కనిపించినట్లు డబ్ల్యూఎంఓ తెలిపింది. ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనా మీదుగా జూన్‌ 18న 17.102 సెకెన్ల పాటు (0.002 సెకెన్లు అటు ఇటుగా) ఈ మెరుపు మెరిసింది.


‘సోమాలీ’లో తీవ్ర కరవు

తూర్పు ఆఫ్రికాలోని సోమాలీ ద్వీపకల్ప ప్రాంతం క్రమేపీ తీవ్ర కరవు కోరల్లోకి వెళ్లిపోతోంది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా.. లక్షల మంది ప్రజలు దుర్భర జీవనాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఎదురుచూపులు, తిండిలేక చనిపోతున్న జంతువుల కళేబరాల మధ్య పిల్లలు తిరుగాడే దృశ్యాలు. సోమాలీ ద్వీపకల్ప ప్రాంతంలో వరుసగా మూడు వర్షాకాలాల్లో వైఫల్యాల ప్రభావాన్ని ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇథియోపియాలో 60 లక్షల మందికి పైగా ప్రజలకు మార్చి మధ్యనాటికి సాయం అవసరమవుతుందని యూనిసెఫ్‌ తెలిపింది. ఈ ప్రాంతంలో 1.50 లక్షల మంది పిల్లలు బడులు మానేసినట్లు వెల్లడించింది. నెలనెలకూ పశు సంపదను కోల్పోతుండటంతో చాలామేర పిల్లలు, కుటుంబాలకు కూడా ఆహారం కరవవుతోందని ఇథియోపియా యూనిసెఫ్‌ ప్రతినిధి గియాన్‌ఫ్రాంకో రోటిగ్లియానో ఐక్యరాజ్యసమితికి నివేదించారు. పొరుగున ఉన్న సోమాలియాలో 70 లక్షల మందికి తక్షణ సాయం అవసరమని సోమాలీ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థల కన్సార్షియమ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.