‘జాతీయ ఇంధన గణాంకాల నివేదిక - 2022’
దేశంలో అన్ని రకాల ఇంధనాల ఉత్పత్తి, వినియోగం గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది. విద్యుత్, బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, లిగ్నైట్...ఇలా అన్ని రకాల ఇంధన వనరుల వినియోగం ఆకాశమే హద్దుగా పెరుగుతున్నట్లు ‘జాతీయ ఇంధన గణాంకాల నివేదిక-2022’లో కేంద్రం వెల్లడించింది. 2011-21 మధ్య దేశంలో వివిధ ఇంధనాల ఉత్పత్తి, వినియోగం, దిగుమతులు తదితర అంశాలపై సమగ్ర గణాంకాలను ఇందులో వివరించింది. పర్యావరణాన్ని నాశనం చేసే బొగ్గుపులుసు వాయువు (సీఓ2)ను అత్యధికంగా విడుదలచేసి కాలుష్యం సృష్టిస్తున్న రంగాల్లో విద్యుదుత్పత్తి కేంద్రాలే అగ్రస్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాల నుంచి సీఓ2 అధికంగా వెలువడటం వల్ల పర్యావరణం కలుషితమవుతోందనీ విశ్లేషించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు:-
- దేశవ్యాప్తంగా 2020-21లో అన్ని రంగాల నుంచి గాలిలోకి 21,29,428 ‘గిగా గ్రాముల సీఓ2 విడుదలైంది. ఇందులో బొగ్గు ఆధారంగా నడిచే విద్యుత్కేంద్రాల నుంచి వచ్చిందే 12,06,587 గిగా గ్రాములు.
- దేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి, వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. 2020 - 21లో దేశంలో 956.14 మిలియన్ టన్నుల (మి.ట) బొగ్గు వినియోగించారు. ఇందులో 580.56 మి.ట.లు విద్యుదుత్పత్తికే వినియోగమైంది.
- దేశంలో 2011 - 12లో ముడిచమురు లభ్యత 209.82 మి.టన్నులు. 2020 - 21 నాటికి అది 228.61 మి.ట.లకు పెరిగింది. ఇందులో 198.11 మి.ట.లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు.
- దేశంలో సహజ వాయువు (నాచురల్ గ్యాస్) ఉత్పత్తి పదేళ్లలో తొలిసారి 2020 - 21లో 22.06 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం)కు పడిపోయింది.
సంప్రదాయ ఇంధన ఉత్పత్తిలో 7, 8 స్థానాల్లో ఏపీ, తెలంగాణ:-
-బొగ్గు వినియోగం వల్ల థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి అధికంగా కాలుష్యం వెలువడుతున్నందున సౌర, పవన, జలవిద్యుత్ వంటి ‘సంప్రదాయేతర ఇంధన’ (ఆర్‌ఈ) ఉత్పత్తి పెంచాలని, 2022కల్లా లక్షా 75 వేల మెగావాట్ల ఆర్‌ఈ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లు స్థాపించాలని 2015లో కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2021 మార్చి నాటికి 94,433 మెగావాట్ల ఆర్‌ఈ ప్లాంట్లే ఏర్పాటయ్యాయి.
- అత్యధికంగా కర్ణాటక 15,462 మెగావాట్ల ఆర్‌ఈ ప్లాంట్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దానిని ఆనుకుని ఉన్న ఏపీ 8,968, తెలంగాణ 4,378 మెగావాట్లతో 7, 8 స్థానాల్లో ఉన్నాయి.
- ఏపీలో 1,14,756, తెలంగాణలో 45,347 మెగావాట్ల ఆర్‌ఈ ఉత్పత్తికి అవకాశాలున్నా, అందులో కనీసం 10 శాతం చొప్పున కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు.
దేశంలో ఓటర్లు 95,24,81,459
దేశంలో ఓటర్ల సంఖ్య 95,24,81,459కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం 2022 ఓటర్ల జాబితాను విడుదల చేసింది. గత జాబితా (2020)తో పోలిస్తే తాజాగా ఓటర్ల సంఖ్య 3,26,96,445 మేర పెరిగింది. ఓటర్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య 6.79% అధికంగా ఉంది. రాష్ట్రాలకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండగా సిక్కింలో అతి తక్కువగా ఉన్నారు.
తాజా జాబితా విశేషాలివి:-
- దేశంలో 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీలు) పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అవి పుదుచ్చేరి, కేరళ, మణిపుర్, మిజోరం, గోవా, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్. మిగిలిన అన్ని రాష్ట్రాలు, యూటీల్లోనూ పురుష ఓటర్లే అధికం.
- మొత్తంగా ప్రవాస ఓటర్లు 1,22,200; సర్వీసు ఓటర్లు 19,12,708 మంది ఉన్నారు.
- తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 15,05,83,879కి చేరింది. సిక్కింలో 4,46,262 మంది ఓటర్లున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఓటర్ల సంఖ్య 56,269 మాత్రమే.
- ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉంది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా కేరళలో (92,486) నమోదయ్యారు. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (7,065), ఆంధ్రప్రదేశ్ (7,033)లు ఉన్నాయి. అత్యధిక సర్వీసు ఓటర్లున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ (2,98,746) తొలిస్థానాన్ని ఆక్రమించింది.
హరిత భవనాల్లో భారత్‌కు 3వ స్థానం
లీడ్ (లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్) ధ్రువీకరించిన హరిత భవనాల్లో గత సంవత్సరానికి గాను (2021) భారత్‌కు మూడో స్థానం లభించింది. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్‌జీబీసీ) రూపొందించిన జాబితా ప్రకారం తొలి రెండు స్థానాల్లో చైనా, కెనడా ఉన్నాయి. అమెరికాను ఈ జాబితాలో చేర్చనప్పటికీ.. లీడ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద విపణిగా ఆ దేశం కొనసాగుతోంది. ప్రపంచంలో హరిత భవనాల రేటింగ్‌కు లీడ్ ధ్రువీకరణను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 2021 డిసెంబరు 31 నాటికి లీడ్- ధ్రువీకరణ ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు.
కొత్త వ్యాపారాలకు అగ్రగామి అయిదు దేశాల్లో భారత్‌కు స్థానం
కొత్త వ్యాపారాన్ని అత్యంత సులువుగా ప్రారంభించడానికి వీలున్న అయిదు అగ్రగామి దేశాల్లో భారత్‌కు చోటుదక్కింది. 500 మందికి పైగా పరిశోధకుల అంతర్జాతీయ కన్సార్షియం తాజా నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వ్యాపారాన్ని భారత్‌లో ప్రారంభించడానికి సులువుగా ఉందని 82 శాతం మంది పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయంగా మన దేశం నాలుగో స్థానంలో చేరింది.
భారత్‌లో వ్యాపారం ప్రారంభించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి తమకు నైపుణ్యం, విషయ పరిజ్ఞానం ఉందని 86 శాతం తెలిపారు. ఈ అంశంలో భారత్ నాలుగో స్థానం పొందింది. పారిశ్రామికవేత్తలకు కావాల్సిన ధనం; రుణాలకు సులభ సౌకర్యాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ మద్దతు వంటి విషయాల్లో అల్పాదాయ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
ప్రపంచ భూతాపంపై ఐపీసీసీ నివేదిక
భూగోళంపైన, మానవాళిపైనా భూతాపం విషమ ప్రభావం చూపుతోందని ‘వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వ బృందం’ (ఐపీసీసీ) హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఐపీసీసీ వెల్లడించిన తన నివేదికలో వాతావరణ మార్పులతో జరుగుతున్న అనర్ధాలను పూసగుచ్చినట్లు వివరించింది. ప్రపంచ నాయకులు తక్షణం కార్యాచరణకు దిగితేనే తీవ్ర ప్రభావాన్ని తగ్గించవచ్చని, ఉపద్రవాల నుంచి కొంతవరకైనా తప్పించుకోవచ్చని సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా వందలాది శాస్త్రజ్ఞులు సభ్యులుగా ఉన్న ఐపీసీసీ అయిదేళ్లకు, ఏడేళ్లకూ నివేదికలు వెలువరిస్తుంది. గత ఆగస్టులో ప్రకటించిన మొదటి నివేదిక వాతావరణ మార్పులకు కారణాలను, భావి భూతాప అంచనాలనూ వివరించింది. వెలువడిన నివేదిక వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం ఎలాంటి ప్రభావం కనబడుతోంది, మున్ముందు ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో వెల్లడించింది. సముద్ర మట్టాల పెరుగుదల, వరదలు, కార్చిచ్చులు, అనావృష్టి, కొన్ని జంతు, వృక్షజాతులు అంతరించిపోవడం, కోట్ల మంది నిర్వాసితులు కావడం వంటి ప్రభావాలను ఆ నివేదిక ఏకరవు పెట్టింది.
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక
బ్యాంకుల నుంచి తీవ్రమైన పోటీ వస్తున్న నేపథ్యంలో, పసిడి రుణాలు జారీ చేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆయా ఎన్‌బీఎఫ్‌సీలు తమ పసిడి రుణ ఫ్రాంఛైజీని నిర్వహించేందుకు, విస్తరించేందుకు దూకుడు వ్యూహాలను అనుసరించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని చాలా బ్యాంకులు పసిడి రుణ విభాగంలో ఉన్న అధిక ప్రతిఫలం, లిక్విడ్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగంలో అధికంగా రుణాలు ఇస్తున్నాయి.
ముఖ్యాంశాలు:-
- బ్యాంకుల్లో పసిడి రుణ పోర్ట్‌ఫోలియో వార్షిక ప్రాతిపదికన 2020-21లో 89 శాతం పెరిగి రూ.60,700 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లోనే (ఏప్రిల్-డిసెంబరు) రూ.70,900 కోట్ల పసిడి రుణాలను బ్యాంకులు జారీ చేశాయి.
- బ్యాంకుల నుంచి వస్తున్న తీవ్ర పోటీ, పసిడి ధరలు గతంలో మాదిరి ఎక్కువగా పెరగకపోవడంతో ఈ రంగంలోని ఎన్‌బీఎఫ్‌సీలు మార్జిన్ల విషయంలో రాజీ పడుతున్నాయి. తక్కువ ప్రతిఫలంతో రుణాలు ఇస్తున్నాయి. ఖాతాదార్లను నిలుపుకొనేందుకు ఎక్కువ మొత్తం రుణాలు జారీ చేస్తున్నాయి. నిర్వహణ వ్యయం అధికమవుతున్నా, ఫ్లెక్సిబుల్ రుణ నిబంధనలతో ముందుకెళుతున్నాయి.
- పసిడి రుణాల వేలం విషయానికొస్తే ఏప్రిల్-డిసెంబరు మధ్య ఎన్‌బీఎఫ్‌సీలు నిర్వహించిన వేలం మొత్తం బాగా పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో వేలం నిర్వహించడం మళ్లీ ఇదే.
జీఎస్‌డీపీ వృద్ధిలో మూడో స్థానం
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ - జీఎస్‌డీపీ) వృద్ధిరేటులో (స్థిర ధరల్లో) దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని రాష్ట్ర అర్థ గణాంక శాఖ రూపొందించిన గణాంకాల నివేదిక స్పష్టం చేసింది. మిజోరం, గుజరాత్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత ధరల్లో అయితే రాష్ట్రానికి నాలుగో స్థానమని.. సిక్కిం, మధ్యప్రదేశ్, త్రిపుర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయంది. జీఎస్‌డీపీ రూ.9,80,407 కోట్లని తెలిపింది. 2020 - 21లో దేశ జీడీపీ మైనస్ 3గా ఉండగా.. రాష్ట్ర జీఎస్‌డీపీ 2.4గా నమోదైందని పేర్కొంది. తలసరి ఆదాయ జాతీయ సగటు రూ.1,28,829 కాగా తెలంగాణది రూ.2,37,632గా ఉందని పేర్కొంది. ఈ నివేదికలో రాష్ట్ర పరిపాలన, భౌగోళిక స్వరూపం, జనాభా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, పాఠశాల విద్య, వ్యవసాయం, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్యం, గ్రామీణ తాగునీరు, పల్లె, పట్టణ ప్రగతి, సామాజిక భద్రత అంశాలను విశ్లేషించారు.
‣ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 60,06,344 మంది ఉండగా ఒక్కో పాఠశాలలో సరాసరి సంఖ్య 147. తక్కువ స్కూళ్లున్న జిల్లా జయశంకర్ భూపాలపల్లి కాగా అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో పాఠశాలకు 71 మంది విద్యార్థులుండగా.. హైదరాబాద్‌లో ఈ సంఖ్య 301. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్న జిల్లాలు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, జనగాం, సూర్యాపేట.
‣ ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్లు లేవు. ప్రాథమికోన్నత పాఠశాలలో 0.06 శాతం డ్రాపౌట్‌లు ఉండగా 9, 10 తరగతుల్లో ఇది 12.29 శాతం. భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 29.40 శాతం మంది డ్రాపౌట్లున్నారు. తర్వాతి స్థానాల్లో గద్వాల (25.69), సంగారెడ్డి (23.42), మహబూబాబాద్ (23.09).
‣ 2020 - 21లో ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటు 13 శాతం, ఐటీ నిపుణులు, ఉద్యోగ నియామకాల్లో 8 శాతం.
‣ రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య 1,38,11,466 కాగా 2019 - 20లో కొత్తవి 12,39,778 రిజిస్ట్రేషన్ కాగా 2020 - 21లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,22,416. వాహనాల రిజిస్ట్రేషన్‌లలో మొదటి స్థానంలో హైదరాబాద్ జిల్లా ఉండగా తర్వాత స్థానాల్లో మేడ్చల్ - మల్కాజిగిరి, రంగారెడ్డి ఉన్నాయి.
‣ 2011లో రాష్ట్ర జనాభా 3,50,02,674 మంది కాగా.. 2021లో ఆ సంఖ్య 3,77,25,000 మంది.. 2031 నాటికి 3,92,07000 మంది ఉంటారని అంచనా.
‣ రాష్ట్రంలో మధ్యతరహా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు 1,04,307మంది కాగా.. తీవ్ర లోపం ఉన్నవారు 54,160 మంది.
‣ 2020 - 21లో 1,04,23,177 ఎకరాల్లో సాగు కాగా దిగుబడి 2,18,51,471 టన్నులు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగుభూమి 147.56 లక్షల ఎకరాలు. రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఇప్పటి వరకు కొత్తగా 21 లక్షల ఎకరాలకు, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరందించారు.
‣ వరిసాగు విస్తీర్ణం, దిగుబడిలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉంది. మక్కలులో వరంగల్ గ్రామీణ, కందిలో వికారాబాద్, వేరుశనగ - నాగర్‌కర్నూల్, పత్తి - నల్గొండ, సోయాబీన్ - కామారెడ్డి, టమాటా - రంగారెడ్డి, ఉల్లి - గద్వాల, జామ - రంగారెడ్డి, పసుపు - నిజామాబాద్, మామిడి - జగిత్యాల, బత్తాయి - నల్గొండ, పుచ్చసాగులో వరంగల్ గ్రామీణ జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి.
‣ రైతుబంధు లబ్ధిదారుల్లో బీసీ రైతులు 53 శాతం మంది, ఎస్సీలు 13, ఎస్టీలు 13, ఇతరులు 21 శాతం మంది ఉన్నారు.
‣ భూములు కలిగిన వారిలో బీసీలు 48 శాతం, ఎస్సీలు 9, ఎస్టీలు 13, ఇతరులు 30 శాతం మంది.
‣ రైతుబీమా కోసం 2018 - 19లో 30.72 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా క్లెయిమ్‌లు 17,979. 2020 - 21లో 31.25 లక్షల మంది రైతులు నమోదు కాగా క్లెయిమ్‌లు 28,287. 2020 - 21లో క్లెయిమ్‌లు పొందిన వారిలో బీసీలు 51 శాతం, ఎస్సీ 18, ఎస్టీ 15, మైనార్టీలు 1, ఇతరులు 15 శాతం మంది ఉన్నారు. బీమా పొందిన రైతులు అత్యధికం ఉన్న జిల్లా నల్గొండ, తర్వాత స్థానాల్లో సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ రంగారెడ్డి ఉన్నాయి.
‣ భూగర్భజల మట్టాలు అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో పెరగ్గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.8 మీటర్ల మేర తగ్గాయి.
‣ 2018 - 19 నుంచి 2020 - 21 మధ్య రాష్ట్రంలో మత్స్య సంపద 19 శాతం, పాల ఉత్పత్తిలో 6 శాతం, మాంసం, చికెన్‌లో 22 శాతం, గుడ్లలో 16 శాతం పెరిగింది.
దేశవ్యాప్తంగా 9.78 కోట్ల హెక్టార్ల భూమి నిస్సారం
దేశవ్యాప్తంగా 2011 - 13 నుంచి 2018 - 19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే సమయంలో 39,652 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి ఎడారీకరణ/క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. 2011 - 13తో పోలిస్తే 2018 - 19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డీగ్రెడేషన్ అట్లాస్’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఎడారీకరణ/భూక్షీణతకు నీటి కోత, అటవీ సంపద తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77%) భూమి క్షీణతకు గురైంది. తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం 1,14,84,000 హెక్టార్లు కాగా అందులో 36,38,508 హెక్టార్లు (31.68%) ఎడారీకరణకు గురైంది. ఆంధ్రప్రదేశ్‌లో 14.84% భూమి క్షీణతకు గురైంది. ఇప్పటివరకు అత్యధిక క్షీణతకు గురైన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వరుస స్థానాలను ఆక్రమించాయి.
తెలంగాణ రాష్ట్రంలో 2003 - 05 వరకు భూక్షీణతకు గురైన ప్రాంతం 31.86% కాగా 2011 - 13 నాటికి ఆ మొత్తం 31.34%కి తగ్గింది. అంటే ఆ పదేళ్లలో భూక్షీణతలో 0.52% తగ్గుదల (59,626 హెక్టార్లు) నమోదైంది. 2011 - 13 నుంచి 2018 - 19 మధ్యకాలంలో మాత్రం భూక్షీణత 0.34% (39,652 హెక్టార్లు) మేర పెరిగింది. ఇదే కాలంలో నీటికోతకు గురయ్యే వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గింది. అయితే మానవ చర్యలు, లవణీకరణ కారణంగా క్షీణతకు గురైన భూమి ఎక్కువైంది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్లు, తెలంగాణ రాష్ట్రంలో 39,652 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. 2011 - 13తో పోలిస్తే 2018 - 19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కున్న 1,60,20,500 హెక్టార్ల భూభాగంలో 14.84% (2.37 మిలియన్ హెక్టార్లు) భూమి ఎడారీకరణకు గురైంది. ఇప్పటివరకు అత్యధిక క్షీణతకు గురైన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వరుస స్థానాలను ఆక్రమించాయి.
60 ఏళ్లు దాటాక సృజనాత్మకత పెరుగుదల
యువతతో పోల్చితే.. 60 ఏళ్లు దాటిన వ్యక్తులు సంక్లిష్ట సమయాల్లోనూ కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకుంటారని నిపుణులు స్పష్టం చేశారు. వీరిలో మెదడు కుడి, ఎడమ భాగాలను ఒకేసారి వినియోగించుకోగలిగే సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు. యుక్తవయస్కులతో పోల్చితే 60 ఏళ్లు దాటిన వారిలో మెదడు ప్రభావశీలతపై ‘వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయన పత్రం ఇటీవల ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైంది.
అధ్యయనం ఏం చెబుతోంది?
సాధారణంగా మనం కుడిచేతి వాటం వార మైతే మన మెదడు ఎడమ భాగం చురుగ్గా పనిచేస్తుంది. మెదడు కుడి, ఎడమ భాగాల మధ్య సమన్వయం 60 ఏళ్ల నుంచి పెరుగుతూ.. పెరుగుతూ 70 ఏళ్లకొచ్చేసరికి గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని అధ్యయనం వివరించింది. మనిషి పరిపూర్ణంగా మెదడును వినియోగించుకోగలిగే సామర్థ్యం ఈ వయసులోనే వస్తుందని పేర్కొంది.
సృజన ఎందుకు ఎక్కువంటే..
మెదడులో తెల్ల (వైట్), బూడిద రంగు (గ్రే) పదార్థాలుంటాయి. తెల్ల పదార్థంలో ‘మైలిన్ (కొవ్వు)’ ఉంటుంది. ఇది వయసు పెరుగుతున్న కొద్దీ మరింత పెరుగుతుంది. తద్వారా ఒక అంశానికి, మరో అంశానికి మధ్య సమన్వయం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మెదడులో న్యూరాన్ల మధ్య అనుసంధానాన్ని ఈ తెల్లపదార్థం మరింత పెంచుతుంది. ఇలా పెరగడం వల్ల 60-70 ఏళ్ల వయసులో మెదడులో సమన్వయ సామర్థ్యం 300 శాతం వరకూ పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. విషయ పరిజ్ఞానం పెరగడం వల్ల ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలనే అవగాహన ఏర్పడుతుందని తెలిపింది.
మూడో విడత పోటీలో 39% కోటీశ్వరులు
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోరులో తలపడుతున్న అభ్యర్థుల్లో 245 మంది (39%) కోటీశ్వరులున్నారు. 135 మందిపై (22%) క్రిమినల్ కేసులుండగా ఇందులో 103 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు అభ్యర్థులు సమర్పించిన ప్రమాణ పత్రాలను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికను విడుదల చేసింది.
‣ యూపీలోని 16 జిల్లాల పరిధిలో 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 20న జరిగే (మూడో దశ) ఎన్నికల్లో మొత్తం 627 మంది తలపడుతుండగా వీరిలో 623 మంది అభ్యర్థులపై ఏడీఆర్ విశ్లేషణ జరిపింది. ఈ అభ్యర్థుల్లో 88 మందికి రూ.5 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ.2.82 కోట్లు. అత్యధికంగా ఎస్పీకి చెందిన యశ్‌పాల్ సింగ్ యాదవ్ (బాబినా నియోజకవర్గం)కు రూ.70 కోట్ల ఆస్తులుండగా జలేసార్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు రాజాబాబు, రాహుల్ ప్రతాప్‌లు తమకు ఆస్తులేమీ లేవని ప్రకటించారు.
‣ తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారు ఎస్పీలో 21, భాజపాలో 20, బీఎస్పీలో 18, కాంగ్రెస్‌లో 10, ఆప్‌లో 11 మంది ఉన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఎదుర్కొంటున్నవారు 11 మంది కాగా వారిలో ఇద్దరిపై అత్యాచారం కేసులున్నాయి. మరో ఇద్దరు హత్య కేసులు ఎదుర్కొంటున్నారు. 18 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి.
‣ అభ్యర్థుల్లో వయసుల వారీగా 41 - 50 ఏళ్ల లోపు వారు (175 మంది) ఎక్కువగా ఉన్నారు. 31 - 40 ఏళ్లవారు 174 మంది ఉన్నారు. 25 - 30 ఏళ్లవారు 67 మంది పోటీ చేస్తున్నారు. 81 ఏళ్లు పైబడినవారు ఒక్కరున్నారు. విశ్లేషించిన అభ్యర్థుల్లో 139 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కాగా నిరక్షరాస్యులు అయిదుగురు ఉన్నారు.
2021లో కోటీశ్వరులు 4.58 లక్షల మంది: హురూన్ సర్వే
కొవిడ్ పరిణామాలున్నా, గతేడాది (2021)లోనూ కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. రూ.7 కోట్లకు పైగా వ్యక్తిగత సంపద కలిగిన కుటుంబాల సంఖ్య గత డిసెంబరు ఆఖరుకు 4.58 లక్షలకు చేరిందని హురూన్ సర్వే వెల్లడించింది. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 11 శాతం అధికం. 2026కు ఈ సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షలకు చేరొచ్చని నివేదిక అంచనా వేసింది. రాబోయే దశాబ్ద కాలంలో విలాసవంత బ్రాండ్లకు అధిక గిరాకీ ఉంటుంది. ఈ విభాగంలో అడుగుపెట్టడం లేదా తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టాలని హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య పరిశోధకుడు అనస్ రెహమాన్ చెప్పారు.
ఈ నివేదిక ప్రకారం..
‣ కోటీశ్వరులు ముంబయిలో అధికంగా (20,300 మంది) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో దిల్లీ (17400 మంది), కోల్‌కతా (10,500 మంది) ఉన్నాయి.
‣ సామాజిక బాధ్యత కిందే తాము పన్నులు చెల్లిస్తున్నట్లు మూడింట ఒక వంతు మంది (33%) తెలిపారు. తాము సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి సమాజానికి ఇస్తున్నామని 19 శాతం మంది తెలిపారు.
‣ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు మూడింట రెండొంతుల మంది (66%) ప్రాధాన్యమిస్తున్నారు. తొలి ప్రాధాన్యం అమెరికా కాగా, తర్వాతి స్థానాల్లో బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ ఉన్నాయి.
‣ నాలుగోవంతు మంది ప్రతి మూడేళ్లకోసారి కారును మారుస్తామని తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు.
‣ చేతి గడియారాల సేకరణ అత్యంత ఇష్టమైన అభిరుచిగా అనేక మంది కోటీశ్వరులు తెలిపారు. రోలెక్స్ ఇష్టమైన బ్రాండ్ అని తెలిపారు.
‣ హోటళ్లలో ఇండియన్ హోటల్స్‌కు చెందిన ‘తాజ్’ను, ఆభరణాల్లో టాటా గ్రూపునకే చెందిన తనిష్క్‌ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.
‣ విలాస వస్తువుల బ్రాండులో లూయీవిటన్, ప్రైవేట్ జెట్ బ్రాండులో గల్ఫ్ స్ట్రీమ్‌కు ఎక్కువ మంది ఓటేశారు.
పిల్లల్లో తగ్గిన మధుమేహ ముప్పు
భారత్‌లో మధుమేహం (డయాబెటిస్) మరణాలు గత 30 ఏళ్లలో గణనీయంగా తగ్గాయి. 1990కి ముందు చిన్నారుల్లో మధుమేహం (టైప్-1 డయాబెటిస్) వస్తే.. 25 ఏళ్లు నిండకుండానే వారిలో అత్యధికులు చనిపోయేవారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల కారణంగా పిల్లల్లో ఈ వ్యాధి ముప్పు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 1990 - 2019 మధ్యకాలంలో 25 ఏళ్లలోపు వయసు వారిలో మధుమేహ మరణాల రేటు 24.2 శాతం తగ్గింది. 2019 గణాంకాల ప్రకారం.. భారత్‌లో పాతికేళ్లలోపు సంభవించిన మొత్తం మరణాల్లో మధుమేహం కారణంగా మృతి చెందినవారు 0.2 శాతం మాత్రమే. ఈ వయసు వారిలో 99.8 శాతం మంది మరణాలకు కారణాలను విశ్లేషిస్తే.. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్య, ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ, గుండె జబ్బులు, క్యాన్సర్ ముందు వరుసలో నిలుస్తున్నాయి.
‣ 25 ఏళ్లలోపు వారిలో మధుమేహ కారక మరణాలపై నిర్వహించిన అధ్యయనం వివరాలు తాజాగా లాన్సెట్ వైద్య విజ్ఞాన పత్రికలో ప్రచురితమయ్యాయి. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2019’ గణాంకాలను ప్రాతిపదికగా చేసుకొని ప్రపంచంలోని అన్ని దేశాల్లో మధుమేహ మరణాలను ఈ అధ్యయనం విశ్లేషించింది. భారత్‌లో టైప్-1 మధుమేహంతో 1990లో 25 ఏళ్లలోపు వారు.. ప్రతి కోటి మందికి 43 మంది చనిపోగా.. 2019కి వచ్చేసరికి మరణాల సంఖ్య 32కి తగ్గింది. 2019లో 25 ఏళ్లలోపు వారిలో సంభవించిన మొత్తం మరణాల్లో టైప్-1 మధుమేహం కారణంగా కన్నుమూసినవారు 2,214 మందిగా వెల్లడైంది. భారత్‌లో ప్రస్తుతం 25 ఏళ్లలోపు వారు 63 కోట్లకుపైనే ఉన్నారు. మధుమేహంతో పాటు అధిక రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యం కూడా తోడవడంతో పాతికేళ్లలోపు వారు మృతి చెందుతున్నట్లుగా అధ్యయనం పేర్కొంది.
ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితా - 2022
ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితా - 2022లో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ డొనేట్‌కార్ట్ వ్యవస్థాపకులకు చోటు దక్కింది. కోదాడకు చెందిన సందీప్ శర్మ, చిత్తూరు కొత్తకోటకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి ఈ సంస్థను ప్రారంభించారు. ఇద్దరూ ఎన్‌ఐటీ నాగ్‌పుర్‌లో చదువుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన సారంగ్ బోబాడే ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఫోర్బ్స్ ‘ఎన్‌జీఓలు - సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ విభాగంలో వీరు ఎంపికయ్యారు. ఈ ముగ్గురి వయసూ 26 ఏళ్లే. స్వచ్ఛంద సంస్థలు, వస్తు రూపంలో విరాళాలు ఇవ్వాలనుకునే దాతలకూ మధ్య ఈ సంస్థ వారధిలాగా పనిచేస్తుంది. ఎవరైనా ఒక సమస్యతో ఎన్‌జీఓలను ఆశ్రయించినప్పుడు, వారి అభ్యర్థన మేరకు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపడుతుంది. ఈ సంస్థను 2017 మార్చిలో ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.150 కోట్ల విలువైన విరాళాలను సేకరించి, ఎన్‌జీఓలకు అందించింది.
నాణ్యత కోల్పోతున్న నదీ జలాలు
కృష్ణా నది.. లక్షల మందికి తాగునీరు అందించే జల తరంగిణి. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రైతుల జీవనాడి. తెలంగాణలో తంగడి వద్ద ప్రవేశించి వాడపల్లి వరకు పరుగులు పెట్టే ఈ నదిలో నీటి నాణ్యత ప్రమాదంలో పడింది. మూడు ప్రాంతాల్లోని పది పాయింట్లలో తనిఖీచేస్తే కాలుష్యం బారిన పడినట్లు తేలింది. కాపర్, జింక్, కాడ్మియం, నికెల్, క్రోమియం వంటి భార లోహాలు కూడా నీళ్లలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సేకరించిన నీటి నమూనాల విశ్లేషణలో వెల్లడైంది. మూసీ, కృష్ణా నదిలో కలిసేచోట కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్టు పీసీబీ తేల్చింది. ఆ నివేదికను పీసీబీ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు ఇటీవల సమర్పించింది.
మూసీ అంత తీవ్రస్థాయిలో, గోదావరిలా అధికంగా కాకపోయినా ఈ నది కూడా క్రమంగా కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుండటం కలవరం కలిగిస్తోంది.
నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాల నుంచి మురుగు, పరిశ్రమల వ్యర్థాలు నేరుగా వచ్చి నదిలో కలుస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దులోని ఓ పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు అలంపూర్ వద్ద నదిలో కలుస్తుండటంతో నీళ్లు నల్లగా మారుతున్నాయి. కర్ణాటకలోని పరిశ్రమల వ్యర్థాలతో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోనూ నది ఎక్కువగా కలుషితమవుతోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ కాలుష్యం ఉండటం ఊరటనిచ్చే అంశమని, పరీవాహక ప్రాంతాల నుంచి మురుగు, పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవకుండా చూడాల్సి ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి.