చైనా లాంగ్ మార్చ్-8 ప్రయోగం విజయవంతం
చైనా అధునాతన లాంగ్ మార్చ్-8 రాకెట్ 22 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఒక అంతరిక్ష నౌక ద్వారా ఇన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం చైనాలో ఇదే తొలిసారి. ఈ మేరకు వెంచాంగ్ అంతరిక్ష నౌక ప్రయోగ కేంద్రం నుంచి బీజింగ్ కాలమానం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిందని చైనా వార్తాసంస్థ జిన్హువా తెలిపింది.
ఎన్‌ఐఎన్‌లో జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన
రక్షణరంగం, సైనిక అవసరాల కోసం పరిశోధనలు చేసే డీఆర్‌డీవో సామాన్యులకు ఉపయోగపడేలా పలు ఆవిష్కరణలు చేసింది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘శాస్త్ర విజ్ఞానం సర్వత్రా శ్లాఘనీయం’ పేరిట హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో డీఆర్‌డీవోకు చెందిన డీఎంఆర్‌ఎల్ అభివృద్ధి చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించారు.
5జీ ఓరాన్ సాంకేతికతతో విజయవంతంగా డేటా కాల్
స్వదేశీ పరిజ్ఞానంతో 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిన ఐఐటీ హైదరాబాద్ - వైసిగ్ సంస్థలు మరో ముందడుగు వేశాయి. దేశీయ 5జీ ఓరాన్ సాంకేతికతను వాడుతూ తొలిసారి డేటా కాల్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపాయి. స్వదేశీ ‘బేస్‌స్టేషన్ సెల్ టెక్నాలజీ’తో దీని సాధించినట్లు వెల్లడించాయి. దీని ద్వారా వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ని అధిక వేగంతో అందించడమే కాకుండా ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్) సేవలనూ నిర్వహించవచ్చని పేర్కొన్నాయి.
వైసిగ్ నెట్‌వర్క్స్ అంకుర సంస్థను 2016లో ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలోని రీసెర్చ్ పార్కులో ప్రారంభించారు. 5జీ సాంకేతికతపై అప్పటి నుంచి ఇక్కడ విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఈ సంస్థ 5జీ సాంకేతికతలో ఇప్పటివరకు 100కు పైగా పేటెంట్లను అభివృద్ధి చేసింది. ఇందులో 15 పేటెంట్లు 5జీ సాంకేతికతను వినియోగించడానికి అత్యవసరమైనవి. మన దేశం 5జీ రంగంలో ఒక ఉన్నతస్థాయికి చేరుకోవడానికి తాము అభివృద్ధి చేసిన సాంకేతికత దోహదం చేస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి, పరిశోధన-అభివృద్ధి విభాగం డీన్ ఆచార్య కిరణ్ వివరించారు.
గుండె జబ్బుకు కారణమైన జన్యుమూలాల గుర్తింపు
గుండె జబ్బుకు కొత్త చికిత్సలను కనిపెట్టే దిశగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఈ రుగ్మతకు చాలావరకూ కారణమయ్యే అత్యంత కీలకమైన జన్యువులను వీరు కనుగొన్నారు. గుండె రక్తనాళాల వ్యాధి (కరోనరీ హార్డ్ డిసీజ్) వల్ల గుండె పోటు తలెత్తుతుంది. ఎక్కువ మరణాలకు ఇదే కారణమవుతోంది. ఈ రుగ్మతకు మూలమైన జన్యువులను గుర్తించడానికి అమెరికా, ఐరోపాలోని పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా వారు.. గుండె రక్తనాళాల వ్యాధి ఉన్న 600 మందిని, ఆ సమస్య లేని 150 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరు కరోనరీ హార్ట్ బైపాస్ శస్త్రచికిత్స లేదా ఇతర సమస్యలతో ఓపెన్ చెస్ట్ సర్జరీని ఎదుర్కొన్నారు. వీరికి సంబంధించిన డేటాను విశ్లేషించడానికి, వేల జన్యువుల నుంచి సేకరించిన సమాచారాన్ని పోల్చి చూడటానికి ‘మినెర్వా’ అనే సూపర్ కంప్యూటర్ ఉపయోగించారు.
మూలకణ మార్పిడితో హెచ్‌ఐవీ నుంచి విముక్తి!
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనకు జరుగుతున్న పరిశోధనల్లో మరో ఆశావహ ముందడుగు పడింది. అమెరికాలో ల్యుకేమియా బాధిత మహిళ ఒకరు మూలకణ మార్పిడి ద్వారా హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందారు. ఇలా స్వస్థత పొందినవారిలో ఆమె మూడో వ్యక్తి కాగా, మహిళల్లో మొదటివారు. ‘రెట్రోవైరస్‌లు - అంటువ్యాధులు’పై నిర్వహించిన సదస్సులో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. కార్డ్ స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందవచ్చని నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, మెటర్నల్ పీడియాట్రిక్ అడోల్సెంట్ ఎయిడ్స్ క్లినికల్ ట్రయల్ నెట్‌వర్క్ (ఇంపాక్ట్), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కేసులో పరిశోధన సాగించారు. ఇంపాక్ట్ సంస్థ 2015 నుంచి మొత్తం 25 మంది హెచ్‌ఐవీ బాధితులపై పరిశోధనలు సాగిస్తోంది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా హెచ్‌ఐవీతో బాధపడుతూ, యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) తీసుకుంటున్న మహిళకు శాస్త్రవేత్తలు 2017లో కార్డ్ బ్లడ్ మూలకణ మార్పిడి చికిత్స అందించారు. వంద రోజుల తర్వాత అనేక సార్లు పరీక్షించగా ఆమెలో హెచ్‌ఐవీ జాడ కనిపించలేదు. దీంతో 37వ నెలలో ఏఆర్‌టీని నిలిపివేశారు. కీమోథెరపీ ద్వారా తీవ్రమైన మైలోయిడ్ ల్యుకేమియా నుంచి కూడా ఆమెకు ఉపశమనం లభించింది.
సరికొత్త ఆర్గానిక్ పాలిమర్లతో మరింత మెరుగ్గా జలశుద్ధి
జలశుద్ధి పరిశోధనల్లో మేలి మలుపు! నీటిలో ఉండే ప్రమాదకర సేంద్రీయ సూక్ష్మ కాలుష్య కారకాలను మరింత సమర్థంగా తొలగించేందుకు భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు సరికొత్త ఆర్గానిక్ పాలిమర్లను రూపొందించారు. వీటిని ‘హైపర్ క్రాస్‌లింక్డ్ పోరస్ ఆర్గానిక్ పాలిమర్స్ (హెచ్‌పీవోపీ)గా పిలుస్తున్నారు. లోహ ఆధార ఉత్ప్రేరకాలు, అధిక ఉష్ణోగ్రతలతో పనిలేకుండానే తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధి చేసేందుకు ఈ పాలిమర్లు ఉపయోగపడతాయని నిపుణులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ పరిశోధనకు తోడ్పాటు అందించింది.
పీఎస్‌ఎల్‌వీ-సి52 విజయవంతం
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి52 ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక ద్వారా భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-04, మరో రెండు చిన్న ఉపగ్రహాలు ఐఎన్‌ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్-1 నిర్ణీత కక్ష్యలోకి దూసుకెళ్లాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి వీటిని ప్రయోగించింది. ప్రయోగం విజయవంతమైందని ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు. ఈవోఎస్-04 భూపరిశీలనతోపాటు అన్ని వాతావరణాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా చిత్రీకరణకు (ఇమేజింగ్) దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహమని శాటిలైట్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. వ్యవసాయం, నేల తేమ, విపత్తులపై పరిశీలన సాగిస్తుందని వివరించారు.
ఉపగ్రహాల వివరాలివి:-
ఈవోఎస్-04:-
జీవితకాలం పదేళ్లు. బరువు 1710 కిలోలు. వ్యవసాయం, అటవీ, తోటల పెంపకం, వరద మ్యాపింగ్, నేల తేమ, హైడ్రాలజీవంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నాణ్యమైన చిత్రాలను అందించడానికి రూపొందించారు. సీబ్యాండ్‌లో భూపరిశీలన వివరాలను సేకరిస్తుంది. ఇది రిసోర్స్‌శాట్, కార్టోశాట్ సిరీస్, ఆర్‌ఐశాట్-2బీ సిరీస్‌ల నుంచి డేటాను సేకరించి అనుసంధానిస్తుంది.
ఐఎన్‌ఎస్-2టీడీ:-
జీవితకాలం 6 నెలలు. భారతదేశం-భూటాన్ ఉమ్మడి ఉపగ్రహానికి (ఐఎన్‌ఎస్-2బీ) పూర్వగామి. థర్మల్ ఇమేజింగ్ కెమెరాను పేలోడ్‌గా కలిగి ఉంది. భూఉపరితల ఉష్ణోగ్రత, చిత్తడి నేలలు, సరస్సుల నీటి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష సంపద (పంటలు, అడవులు), ఉష్ణ జడత్వం (పగలు, రాత్రి) అంచనా వేస్తుంది.
ఇన్‌స్పైర్‌శాట్-1:-
యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోతో కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) అభివృద్ధి చేసిన ఉపగ్రహం. జీవితకాలం ఏడాది. దీనికి ఎన్‌టీయూ సింగపూర్, ఎన్‌సీయూ తైవాన్ సహకరించాయి. ఇందులో రెండు శాస్త్రీయ పెలోడ్‌లు ఉన్నాయి. అయనోస్పియర్ డైనమిక్స్, సూర్యుని కక్ష్య తాపన ప్రక్రియపై ఇవి అవగాహన పెంచుతాయి.
ఇన్‌స్పైర్‌శాట్-1 రూపకర్తల్లో తెలుగు విద్యార్థులు:-
ఇన్‌స్పైర్ శాట్-1 ఉపగ్రహం రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ఆరుగురు విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ధ్రువ అనంత దత్తా, అమన్ నవీన్ ఉన్నారు. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో వీరు బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. సహచర విద్యార్థులతో కలిసి శ్రీహరికోటలో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో రాకెట్‌పై వారు ఉపగ్రహాన్ని అమర్చారు. విశ్వవిద్యాలయాల కన్సార్షియం ఈ ఉపగ్రహాన్ని తీర్చిదిద్దింది. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) ప్రొఫెసర్ ప్రియదర్శన్ నేతృత్వంలో మన విద్యార్థులు భాగస్వాములయ్యారు.
పీఎస్‌ఎల్‌వీ-సి52 రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ క్రియాశీల పాత్ర పోషించింది. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)తో ఈ సంస్థకున్న ఒప్పందం ప్రకారం పీఎస్‌ఎల్‌వీ-సి52 వేర్వేరు దశలను సమీకృతం (ఇంటిగ్రేషన్) చేయడంతోపాటు టెస్టింగ్, క్వాలిఫయింగ్ బాధ్యతలను నిర్వర్తించింది.
రికార్డులు సృష్టించిన ‘రోల్స్ రాయిస్’ లోహవిహంగం
పెట్రోలు, డీజిల్ వాహనాల తాకిడితో నానాటికీ పెరిగిపోతున్న హానికారక కర్బన ఉద్గారాలకు కళ్లెం వేయడానికి విద్యుత్ కార్లు, ద్విచక్ర వాహనాలు వచ్చేశాయి. ఆకాశంలో ఎగిరే విమానాల విషయంలో మాత్రం ఇంకా ఈ మార్పు రాలేదు. పూర్తిస్థాయి విద్యుత్ విమానం రూపకల్పన దిశగా ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తున్నారు. తాజాగా బ్రిటన్ కంపెనీ రోల్స్ రాయిస్ కీలక ముందడుగు వేసింది. ఈ సంస్థ రూపొందించిన ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ అనే పూర్తిస్థాయి విద్యుత్ విమానం ఇటీవల గగన విహారం చేసి పలు ఘనతలు సాధించింది.
విద్యుత్ విమానాలను సాకారం చేసేందుకు 1970ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా చిన్న విమానాలు సిద్ధమయ్యాయి. చాలావరకూ ఒక్క పైలట్‌తో కొన్ని నిమిషాలపాటు మాత్రమే అవి గగనవిహారం చేశాయి. ఇటీవల విద్యుత్ విమాన ప్రాజెక్టులు పెరుగుతున్నాయి.
మానవ కణాలతో రోబో చేప
మానవ హృదయ కండర కణాలతో రోబో చేపను అమెరికాలోని కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్లాస్టిక్‌తో రెక్కలు, పేపర్‌తో వెన్నెముక తయారు చేసి, శరీరాన్ని కణాలతో రూపొందించారు. అసలైన చేపలా ఈ రోబో ఈదగలుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఇరువైపులా ఉండే కణాల్లో ఒక వైపు కణాలు సంకోచించినప్పుడు, మరోవైపు కణాలు వ్యాకోచిస్తాయి.
3 నిమిషాల్లో ఛార్జింగ్.. 500 కి.మీ. ప్రయాణం
కారు బ్యాటరీని ఒకసారి రీఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుంటే, రీఛార్జ్ ప్రక్రియ మూడు నిమిషాల్లోనే పూర్తయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని, మరికొన్ని నెలల్లోనే ఆ ఊహ నిజం కాబోతోందంటున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధిపతి ఆర్ శ్రావణ్ ఎస్ రావు. భారతదేశంలో పుష్కలంగా ఉన్న అల్యూమినియం నిల్వలతో అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని ఇజ్రాయెల్ సంస్థతో కలిసి ఇప్పటికే రూపొందించామని, ప్రస్తుతం ఇజ్రాయెల్ రహదారులపై ప్రయోగాత్మకంగా నడుపుతున్నామని, త్వరలోనే ఇక్కడి రోడ్లపై నడపబోతున్నామని ఆయన వెల్లడించారు.
ముఖ్యాంశాలు:-
- విద్యుత్తు వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రతి 20 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్టు శ్రావణ్ ఎస్ రావు వెల్లడించారు. దశలవారీగా ప్రణాళిక అమలుచేస్తామన్నారు.
- ఒడిశాలోని పారదీప్ నుంచి విశాఖపట్నం, విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు చమురు నిల్వలు తీసుకువచ్చే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. పారదీప్ నుంచి విజయవాడ వరకు పైప్‌లైన్ నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. 1,212 కిలోమీటర్ల ఈ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3,338 కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఏడాదిన్నరలో టెర్మినల్ సిద్ధం కానుంది.
- ప్రత్యామ్నాయ ఇంధనాల అభివృద్ధిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 108 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.
సింగపూర్ వైమానిక ప్రదర్శనలో ‘తేజస్’
దేశీయ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ ఫిబ్రవరి 15 నుంచి 18 మధ్య సింగపూర్‌లో జరిగే వైమానిక ప్రదర్శనలో మెరవనుంది. ఈ సందర్భంగా గగనతలంలో అద్భుత విన్యాసాలను నిర్వహించబోతోంది. 2021 నవంబరులో దుబాయ్ ఎయిర్‌షోలో తేజస్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సింగపూర్ వైమానిక ప్రదర్శనలో పలు దేశాల వైమానిక దళాలు, వాణిజ్య కంపెనీల విమానాలు గగనతల విన్యాసాలు ఉండబోతోన్నాయి. తేజస్‌ను ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (‘హెచ్‌ఏఎల్) ఉత్పత్తి చేస్తోంది. ఒకే ఇంజిన్ కలిగిన ఈ సూపర్‌సోనిక్ యుద్ధవిమానం బహుముఖ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
సముద్ర నీటిని తాగడానికి అనువుగా మార్చే విధానం అభివృద్ధి
- సముద్ర నీటిని తాగడానికి అనువుగా మార్చే చౌకైన, పర్యావరణ అనుకూల విధానాన్ని ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా 99 శాతం మేర లవణాలు, ఇతర వ్యర్థాలను తొలగించవచ్చు. ‘క్యాపిలరీ ఎఫెక్ట్’ ద్వారా చెట్లు సహజసిద్ధ పద్ధతిలో నీటిని సేకరించే విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. వాయువుల శుద్ధికి అవసరమైన ఫిల్టర్ల రూపకల్పనకు, ఫ్యూయెల్ సెల్‌లో ప్రొటాన్ మార్పిడి, వ్యర్థాల నుంచి విలువైన పదార్థాల సేకరణ వంటి అవసరాలకూ ఇది అక్కరకొస్తుంది.
- తాజా విధానంలో గ్రాఫైట్ స్ఫటికాల్లో నియంత్రిత పద్ధతిలో నీటి రవాణా మార్గాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ క్షేత్రం, పొటాషియం క్లోరైడ్ అయాన్ల సాయంతో వీటిని సృష్టించారు. ఈ మార్గాలు స్ఫటికాల గుండా మంచినీటిని మాత్రమే అనుమతిస్తాయి. ఉప్పు అయాన్లను అడ్డుకుంటాయి. ఈ విధానం కోసం విద్యుత్ అవసరం ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు.
అన్ని వేరియంట్లకూ ఒకే టీకాను అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు
కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేసే సార్వత్రిక టీకాను అభివృద్ధి చేసినట్లు భారత శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది పెప్టైడ్ వ్యాక్సిన్. పశ్చిమ బెంగాల్‌లోని కాజీ నజ్రుల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఈ టీకాకు ‘అభిఎస్‌సీవో వ్యాక్’ అని పేరు పెట్టారు. దీని తయారీ కోసం ఇమ్యునోఇన్ఫర్మేటిక్ విధానాలను అనుసరించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2తో పాటు ఆ తరగతికి చెందిన ఆరు వైరస్‌లపై సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనా తరగతిలోని అన్ని వైరస్‌లను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకునే టీకా మరొకటి ప్రపంచంలో ఎక్కడా లేదని వారు పేర్కొన్నారు.
వైరస్‌ను సంహరించే కొత్త నానో మాస్క్
కొవిడ్ నుంచి రక్షణ కల్పించే సరికొత్త నానో మాస్క్‌లను హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి స్వీయ క్రిమిసంహారకంగా పనిచేయడంతో పాటు భూమిలో సులువుగా కలిసిపోయే బయో డిగ్రేడబుల్ నూలు (కాటన్) మాస్క్‌లు. రాగి ఆధారిత నానో పార్టికల్ కోటెడ్ ఫ్యాబ్రిక్‌తో యాంటీ వైరల్ మాస్క్‌ను శాస్త్రవేత్తలు డాక్టర్ టి.నర్సింగరావు, డాక్టర్ కల్యాణ్ హెబ్రమ్, డాక్టర్ బి.వి.శారద బృందం తయారు చేశారు. సీసీఎంబీలో పరీక్షించగా 99.9 శాతం వైరస్, బ్యాక్టీరియా నుంచి స్వీయ క్రిమిసంహారకంగా పనిచేశాయని ఏఆర్‌సీఐ ఇన్‌ఛార్జి డైరెక్టర్ టి.నర్సింగరావు తెలిపారు.
భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను గుర్తించడంలో భారత్‌కు ప్రపంచ గుర్తింపు
-భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను గుర్తించడంలో, తీర ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి ప్రాణనష్టం తగ్గించే విధానాల రూపకల్పనలో భారత్ ప్రపంచ గుర్తింపు సాధించింది. అగ్నిపర్వతాలతో తలెత్తే రాకాసి సునామీలను మాత్రం పసిగట్టలేకపోతోంది. తరచుగా సునామీలను ఎదుర్కొనే జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఇతరత్రా దేశాలదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రగతినగర్‌లోని ఇన్‌కాయిస్ శాస్త్రవేత్తలు సమస్యపై దృష్టిపెట్టారు. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని బారెన్ దీవిపై పరిశోధనకు సిద్ధమైనట్లు డైరెక్టర్ తుమ్మల శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు.
- గడచిన 250 సంవత్సరాల్లో అగ్నిపర్వతాల కారణంగా చోటుచేసుకున్న మరణాల్లో 20-25 శాతం సునామీలతోనే సంభవించాయి. చరిత్రలోనే భారీ విధ్వంసం.. ఆగస్టు, 1883లో ఇండోనేసియాలోని క్రకటోవా దీవిలో అగ్నిపర్వతం బద్ధలైంది. భారీ ధ్వనులతో ఎగసిపడ్డ లావా సముద్రాన్ని కుదిపేసింది. అలలు 40 మీటర్లకుపైగా ఎత్తున ప్రయాణించి తీరప్రాంతాల్లోని దేశాల్లో 36 వేలమందిని మింగాయి. లావా పెల్లుబికినప్పుడు వెలువడిన శబ్ద తరంగాలు భూగోళాన్ని ఏడుసార్లు చుట్టాయి. సముద్రంలో వారం పాటు అలజడి తగ్గలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఐఐఎస్‌సీలో సూపర్ కంప్యూటర్లు
బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ)లో శక్తిమంతమైన ‘పరమ్ ప్రవేగ’ అనే సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్‌ఎస్‌ఎం)లో భాగంగా రూపొందించిన ఈ కంప్యూటర్లు అత్యంత శక్తిమంతమైనవి. ఏ ఇతర భారతీయ విద్యా సంస్థల్లోనూ ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయలేదని ఐఐఎస్‌సీ ప్రకటించింది. 3.3 పెటాఫ్లాప్స్ సామర్థ్యం కలిగిన ఈ సూపర్ కంప్యూటర్‌లో వినియోగించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యవస్థలన్నీ దేశీయమైనవే. భారత్‌లో తయారీ కార్యక్రమంలో భాగంగా ఐఐఎస్‌సీలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ దీన్ని రూపొందించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు సంయుక్తంగా ఎన్‌ఎస్‌ఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశోధనలు మరింత వేగంగా చేపట్టేందుకు ఈ సూపర్ కంప్యూటర్లు ఉపయోగపడతాయని ఐఐఎస్‌సీ ప్రకటించింది.
2022లో ఇస్రో నుంచి 19 రాకెట్ ప్రయోగాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2022లో 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు, 4 టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్-3 కూడా ఉంది. 2022 తొలి రాకెట్ ప్రయోగం (పీఎస్‌ఎల్‌వీ-సి52) ఫిబ్రవరి 14న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టనుంది. ఇది భూ పరిశీలన ఉపగ్రహం (ఆర్‌ఐశాట్-1ఎ)తో పాటు ఐఎన్‌ఎస్-2డి ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. చంద్రయాన్-3 ప్రయోగం ఆగస్టులో చేపట్టేలా ప్రణాళికలు రచించారు.
ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగం
చంద్రుడిపైన ల్యాండర్, రోవర్‌ను దించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-3ని ఈ ఏడాది ఆగస్టులో ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సమాయత్తమవుతోంది. చంద్రయాన్-2లో నేర్చుకున్న పాఠాలు, జాతీయ స్థాయి నిపుణుల సూచనల ఆధారంగా ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్రయాన్-3కి సంబంధించిన హార్డ్‌వేర్ రూపకల్పన పూర్తయ్యిందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. వాటిపై ప్రత్యేక పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తయినట్లు వివరించారు. హార్డ్‌వేర్‌ను అనుసంధానం చేశాక తుది పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుపై అనేక సమీక్షలు చేస్తామని చెప్పారు. అవసరమైన చోట మరిన్ని మెరుగులు దిద్దుతున్నామని వివరించారు.