అరుదైన వ్యాధుల దినోత్సవం
జన్యు పరీక్షలు, పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్‌లోని జీనోమ్ ఫౌండేషన్ మూడేళ్లలో 23 రకాల అరుదైన జబ్బులను గుర్తించింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బయటపడిన వ్యాధి కూడా ఇందులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7 వేల అరుదైన వ్యాధులు ఉన్నట్లు వైద్యులు, పరిశోధకులు గుర్తించారు. వీటిలో భారత్‌లో ఎన్ని ఉన్నాయన్న కచ్చితమైన లెక్కలు లేకపోయినా జన్యు పరీక్షలతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఒక్కో అరుదైన వ్యాధి బయటపడుతోంది. జన్యుసంబంధ అరుదైన వ్యాధులు తీవ్రమైనవని, ఇవి రోగులను బాధిస్తూ ప్రాణాంతకంగా మారుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.
హైదరాబాద్ జీనోమ్ ఫౌండేషన్ గుర్తించిన కొన్ని అరుదైన వ్యాధులు, వాటి లక్షణాలు:
కాట్ 6ఏ సిండ్రోమ్:
దేశంలోనే ‘కాట్ 6ఏ సిండ్రోమ్’ తొలికేసును ఇటీవల హైదరాబాద్‌లో గుర్తించారు. మెదడులో లోపాల కారణంగా ఈ వ్యాధి వస్తుంది. దీని ప్రభావంతో పిల్లలు నెమ్మదిగా ఎదుగుతారు. తల చిన్నగా ఉంటుంది. మాటలు త్వరగా రావు. పిండం అభివృద్ధి దశలో డి నోవా మ్యుటేషన్ కారణంగా ఈ లోపం తలెత్తుతుంది.
ఊలీ హెయిర్ సిండ్రోమ్:
తలపై వెంట్రుకలు ఊలు మాదిరి పలుచగా ఉంటాయి. అరికాళ్లలో పొలుసులు ఏర్పడతాయి. మోచేతులపైనా వెంట్రుకలు పెరుగుతుంటాయి. కడుపులో ఉన్నప్పుడు జేయూపీ, డీఎస్‌పీ, డీఎస్‌సీ 2, కాంక్ 2 జన్యులోపాలతో పిల్లలు దీని బారిన పడుతుంటారు. కరీంనగర్‌లో ఓ చిన్నారిలో ఈ కేసు బయటపడింది.
మాల్‌డి మెలెడా:
చర్మ సంబంధిత జబ్బు ఇది. స్లర్ప్ 1 జన్యులోపం వల్ల ఇది వస్తుంది. ఈ వ్యాధి ప్రభావంతో అరచేతులు ఎర్రగా మారుతుంటాయి. వేళ్లు బిగుసుకుపోయి రాయి మాదిరి గట్టిగా ఉంటాయి. ప్రతీ లక్ష మందిలో ఒక్కరు దీని బారిన పడుతుంటారు. నిజామాబాద్‌లో ఓ మధ్య వయసు మహిళలో ఈ వ్యాధి వెలుగుచూసింది.
లామెల్లర్ ఇచ్చియోసిస్:
ఇది కూడా చర్మ సంబంధిత వ్యాధే. ఎలోక్సి 3, పీఎన్‌పీఎల్‌ఏ 1 మ్యుటేషన్ల కారణంగా వస్తుంది. చర్మం ఎండిపోయి పాము కుబుసం, చేపల పొలుసుల మాదిరి కనిపిస్తుంది. కాళ్లు, చేతులు, అరికాళ్లపై మందపాటి చర్మం ఉంటుంది. పెద్దపల్లిలో ఈ కేసును గుర్తించారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ వ్యవస్థాపక దినోత్సవం
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశం పంపారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఆగ్నేయ ఆసియాకు ఘనమైన ముఖద్వారంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాల రాజధానులను ఇటానగర్‌తో రైల్వేపరంగా అనుసంధానం చేయడం తమ ప్రాధాన్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్థానికంగా కొత్తగా నిర్మించిన గోల్డెన్ జూబిలీ ఔట్‌డోర్ స్టేడియం రాష్ట్రావతరణ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘అరుణాచల్ రత్న’ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ కె.ఎ.ఎ.రాజాకు ప్రకటించగా, ఆయన కుమార్తె విజయలక్ష్మి దాన్ని స్వీకరించారు.
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ 1987లో రాష్ట్రంగా అవతరించింది.