కమిటీలు

వ్యవసాయ గణాంకాలపై ప్రత్యేక కార్యాచరణ

వ్యవసాయ గణాంకాల సమాచారాన్ని పటిష్ఠపరిచేందుకు అత్యున్నత స్థాయి సమన్వయ కమిటీ (హెచ్‌ఎల్‌సీసీ)ని ఏర్పాటు చేస్తూ ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పంటల సాగు, సాగునీటి వసతి, మెట్ట పంటల ఉత్పత్తి, ఉత్పాదకత తదితర అంశాల్లో ఏకరూప విధానం అనుసరించేందుకు చేపట్టాల్సిన మార్పులు, అనుసరించాల్సిన మార్గదర్శకాలు తదితర అంశాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉండే ఈ కమిటీకి అర్థ, గణాంక శాఖ డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో వ్యవసాయ, సాగునీటి, అటవీ శాఖల ప్రతినిధులు, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ, సీసీఎల్‌ఏ ప్రతినిధి సహా మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు.

14 మందితో డ్యాం సేఫ్టీ జాతీయ కమిటీ

భారీ, మధ్య తరహా డ్యామ్‌ల సంరక్షణకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసిన కేంద్రం దీనికోసం 14 మందితో జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఆనకట్టల సంరక్షణపై అథారిటీకి అధికారాలు కట్టబెడుతూ కేంద్రం డ్యామ్‌ సేఫ్టీ చట్టాన్ని తెచ్చింది. పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత ఫిబ్రవరి 17న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేషనల్‌ కమిటీ ఆన్‌ డ్యాం సేఫ్టీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ నేతృత్వం వహించే ఈ కమిటీ బాధ్యతలు, అధికారాలను కూడా గెజిట్‌లో పేర్కొంది. కేంద్ర జల సంఘం డ్యాం సేఫ్టీ అథారిటీ విభాగం, కేంద్ర విద్యుత్తు అథారిటీ, ఐఎండీ, ఎన్‌ఆర్‌ఎస్‌ఐ, జీఎస్‌ఐ తదితర సంస్థల డైరెక్టర్‌లతో పాటు రాష్ట్రాల నుంచి ఏడుగురు సభ్యులు ఇందులో ఉంటారు. రాష్ట్రాలను ఏడు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపు నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. రొటేషన్‌ పద్ధతిలో కొనసాగుతారు. ఈ కమిటీ కాలపరిమితి మూడేళ్లు. డ్యామ్‌ భద్రత రంగంలో అనుభవం ఉన్న ముగ్గురు నిపుణులు కూడా సభ్యులుగా ఉంటారు. కమిటీ నేరుగా నిపుణులను డ్యామ్‌ పరిశీలనకు పంపడానికి ఈ చట్టం ద్వారా అవకాశం ఏర్పడింది. అవసరమైనప్పుడు రాష్ట్రాల్లో ఆనకట్టల వ్యవహారాలను చూసే అధికారులను వారు సంప్రదిస్తారు. ఎలాంటి సంరక్షణా కార్యక్రమాలు చేపట్టాలో సూచిస్తారు. వరద ప్రవాహ అంచనాను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటారు. ప్రధాన ఆనకట్టల వైఫల్యానికి సంబంధించిన రికార్డును నిర్వహిస్తారు. డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టే సంస్థల అర్హతలను నిర్ధారిస్తారు. ఇలా చట్టం ద్వారా ఈ కమిటీకి విస్తృతాధికారాలను కల్పించారు. రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఆనకట్టలు, ఒక రాష్ట్రంలో డ్యామ్‌ ఉండి ఆయకట్టు ఇంకో రాష్ట్రంలో ఉన్నవాటిని నేరుగా ఈ కమిటీనే పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ డ్యామ్‌ల సంరక్షణ ఈ కమిటీ చేతుల్లోకి వెళ్లనుంది.