గణతంత్ర కవాతులో యూపీ శకటానికి అవార్డు
-దేశ రాజధానిలో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్న 73వ గణతంత్ర దిన కవాతులో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర శకటానికి ఉత్తమ అవార్డు లభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘కాశీ విశ్వనాథ్ ధామ్’ పేరిట ఈ శకటాన్ని రూపొందించారు. సంప్రదాయ చేనేత ఉత్పత్తుల ఇతివృత్తంతో రూపొందిన కర్ణాటక శకటం ద్వితీయ స్థానం దక్కించుకోగా, మేఘాలయ మూడో స్థానంలో నిలిచినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రంగా ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ ఈశాన్య రాష్ట్రం మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఇతివృత్తంతో శకటాన్ని తీర్చిదిద్దింది.
- కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగంలో విద్య, పౌర విమానయాన శాఖల శకటాలు సంయుక్త విజేతలుగా నిలిచాయి. మొత్తం తొమ్మిది శాఖలు ఈ విభాగంలో పోటీపడగా ప్రజల ఎంపికలో సమాచార మంత్రిత్వ శాఖ విజేతగా నిలిచింది. పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ శకటం ప్రత్యేక బహుమతి దక్కించుకొంది.
- త్రివిధ దళాల కవాతులో నౌకాదళం ప్రథమ బహుమతి గెలుచుకొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
డ్రూ వైస్మాన్‌కు జీనోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారం
వివిధ రకాల టీకాల అభివృద్ధికి విశిష్ట కృషి చేసిన అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పిరల్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డ్రూ వైస్మాన్ జీనోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారం - 2022కి ఎంపికయ్యారు. ఆయనకు ఫైజర్, మోడెర్నా కరోనా టీకాల తయారీలోనూ భాగస్వామ్యం ఉంది. 2022లో ఆయన టైమ్ మ్యాగజీన్ నుంచి హీరోస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం పొందారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ బయో ఆసియా సదస్సును పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం, ఆసియా బయోటెక్ సంఘాల సమాఖ్య డ్రూ వైస్మాన్‌ను జీనోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేశాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రగతిభవన్‌లో ఈ వివరాలను వెల్లడించారు. ఏటా సదస్సు సందర్భంగా ప్రపంచంలో బయోటెక్, ఔషధ, జీవశాస్త్ర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
ఆరుగురు తెలుగు ఉపాధ్యాయులకు పురస్కారాలు
బోధనలో వినూత్న పద్ధతులను అనుసరిస్తున్న 49 మంది ఉపాధ్యాయులకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి జాతీయ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) అవార్డులను ప్రదానం చేశారు. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తంగా ఆరుగురు ఉపాధ్యాయులు ఈ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సురేశ్ కునాటి(జడ్పీ హైస్కూల్, ఉరందూర్, చిత్తూరు జిల్లా), మంజుల కిరిమంజేశ్వర్(జడ్పీ హైస్కూల్, పాలసముద్రం, అనంతపురం), తెలంగాణ నుంచి అమరవాజు లక్ష్మీనాథం(జడ్పీహెచ్‌ఎస్, ఇందల్వాయి, నిజామాబాద్), డాక్టర్ రవికుమార్ కోల(జడ్పీహెచ్‌ఎస్, శాయిపేట్, వరంగల్), గోపాల్ వీర్నాల(జడ్పీహెచ్, ఆరుట్ల, రంగారెడ్డి), ఎం.ఎస్.కుమారస్వామి (కేంద్రీయ విద్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాద్) వారిలో ఉన్నారు.
సాంకేతికత వినియోగంలో ఏపీ పోలీసులు ఫస్ట్
జాతీయస్థాయి సాంకేతికత వినియోగం టెక్నాలజీ సభ - 2022 ప్రకటించిన పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. వివిధ విభాగాల్లో ఏపీ పోలీసులు 15 అవార్డులు సొంతం చేసుకొని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. సాంకేతికత వినియోగంలో ఇప్పటివరకు మొత్తం 165 అవార్డులు గెలుచుకున్నట్లు వివరించింది. పోలీసు యూనిట్ల విభాగంలో అనంతపురం, చిత్తూరు, తిరుపతి అర్బన్, కడప, ప్రకాశం, విజయవాడ సిటీలు అవార్డులు దక్కించుకున్నాయి.
టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్) సింపోజియం - 2022
మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కొల్పూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు లింగప్ప ‘తెలంగాణ నిక్’ పురస్కారం అందుకున్నారు. టీహబ్‌లో జరిగిన టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్) సింపోజియం - 2022లో టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాల పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, ‘ఆస్ట్రేలియాలో జన్మించిన నికోలస్ జేమ్స్ బాల్యంలోనే రెండు చేతులు కోల్పోయాడు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒక్కో మెట్టు ఎదుగుతూ మోటివేషనల్ స్పీకర్‌గా ఖ్యాతి గడించారు. అందుకే నిక్ పేరుమీద టీటా ఏటా పురస్కారాలు అందజేస్తోంది’’ అని వెల్లడించారు.
‣ లింగప్పది కూడా స్ఫూర్తిదాయక ప్రస్థానమే. ఈయన అయిదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వైద్యులు రెండు చేతులు తొలగించారు. ఆ కుర్రాడు తన పనులు తానే చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. చదువులోనూ ఆసక్తి కనబరిచాడు. నోటితో పెన్ను పట్టుకుని రాయడం సాధన చేశాడు. పదో తరగతి పరీక్షలు నోటితోనే రాసి 82% మార్కులు సాధించాడు. ప్రస్తుతం ఇంటర్ చదువుతూ క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ ఆటల్లో ప్రతిభ చూపుతున్నాడు.
11 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు
-అత్యుత్తమ పనితీరు కనబరిచే పార్లమెంటు సభ్యులకు వివిధ విభాగాల్లో అందించే సంసద్ రత్న అవార్డులకు ఈ ఏడాది మొత్తం 11 మంది ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు ఎంపీలకు సంసద్ విశిష్ట రత్న, ఎనిమిది మందికి సంసద్ రత్న అవార్డులను అందించనున్నారు. దిల్లీలో ఫిబ్రవరి 26న జరిగే కార్యక్రమంలో వీటిని ప్రదానం చేయనున్నట్టు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ తెలిపింది.
- అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్.కె.ప్రేమచంద్రన్, శివసేన సభ్యుడు శ్రీరంగ్ అప్పా బర్నేలు ‘సంసద్ విశిష్ట రత్న’ అవార్డులకు ఎంపికయ్యారు.
- లోక్‌సభకు సంబంధించి తృణమూల్ ఎంపీ సౌగతారాయ్, కాంగ్రెస్ సభ్యుడు కుల్దీప్‌రాయ్ శర్మ, భాజపా ఎంపీలు బిద్యుత్ బారన్ మహతో, హీనా విజయ్‌కుమార్, సుధీర్‌గుప్తాలు ‘సంసద్ రత్న’ పురస్కారాలు అందుకోనున్నారు.
- రాజ్యసభ సిటింగ్ సభ్యుల విభాగంలో బిజూ జనతాదళ్ ఎంపీ అమర్ పట్నాయక్, ఎన్సీపీ ఎంపీ ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్‌లను; 2021లో విశ్రాంతి పొందిన సభ్యుల కోటాలో సీపీఎం సభ్యుడు కె.కె.రాగేశ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
- 17వ లోక్‌సభ ప్రారంభమైనప్పటి నుంచి 2021 పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకూ ఎంపీలు కనబరిచిన పనితీరు ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టినట్టు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ కె.శ్రీనివాసన్ తెలిపారు. అవార్డుల కమిటీకి పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అధ్యక్షులుగా, మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) టి.ఎస్.కృష్ణమూర్తి సహాధ్యక్షులుగా ఉన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీకి డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు
ఏపీఎస్‌ఆర్టీసీకి ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ విభాగంలో వరుసగా నాలుగోసారి డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డులు దక్కించుకుందని చీఫ్ ఇంజినీర్ (ఐటీ) సుధాకర్ తెలిపారు. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగితరహిత టికెట్ల జారీని ప్రవేశపెట్టినందుకు ఈ అవార్డు వచ్చిందని పేర్కొన్నారు. వర్చువల్ సెమినార్ ద్వారా ఈ అవార్డును సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు అందుకున్నట్లు తెలిపారు.
సింగరేణికి సీఎస్‌ఆర్ అవార్డు
సింగరేణి సంస్థకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద అంతర్జాతీయ అవార్డు లభించింది. ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ (ఈఈఎఫ్) సింగరేణిని అంతర్జాతీయ సీఎస్‌ఆర్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ పెట్రోకోల్ సదస్సులో సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్.బలరామ్‌కు ప్లాటినం విభాగంలో మొదటి బహుమతి లభించింది. దక్షిణ భారత ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రధాన పాత్ర పోషిస్తోందని, సీఎస్‌ఆర్ కింద 150కి పైగా గ్రామాల ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిందని ఈ సందర్భంగా బలరామ్ వివరించారు.
అనంత్ టెక్నాలజీస్‌కు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఇండిజినైజేషన్’ అవార్డు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అనంత్ టెక్నాలజీస్‌కు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఇండిజినైజేషన్’ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీస్ (ఎస్‌ఐఏటీఐ) ఈ అవార్డు బహూకరించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె.శివన్, ఎస్‌ఐఏటీఐ అధ్యక్షుడు డాక్టర్ సి.జి. కృష్ణదాస్ నాయర్, హెచ్‌ఏఎల్ సీఎండీ ఆర్.మాధవన్ చేతుల మీదుగా అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డాక్టర్ సుబ్బారావు పావులూరి ఈ అవార్డు అందుకున్నారు. యుద్ధ విమానాల్లో వినియోగించే వి/యూహెచ్‌ఎఫ్ రేడియో కోసం వీహెచ్‌ఎఫ్/యూహెచ్‌ఎఫ్ మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసినందుకు అనంత్ టెక్నాలజీస్‌కు ఈ అవార్డు దక్కింది. దీనివల్ల ఎంతో ముఖ్యమైన ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయిందని డాక్టర్ సుబ్బారావు తెలిపారు.
సునీల్ కుమార్‌కు అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా పతకాలు
అదనపు డీజీపీ, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా పతకాలు లభించాయి. పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా ఆయన పతకాలు అందుకున్నారు. ఉత్తమ సేవలకుగాను కేంద్ర హోంశాఖ ఈ పతకాలను అందిస్తుంది.
తెలంగాణ కవికి ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం
ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ పురస్కారానికి యార్లగడ్డ రాఘవేంద్రరావు ఎంపికయ్యారు. అనంతపురానికి చెందిన ప్రముఖ కవి ఉమ్మడిశెట్టి రాధేయ, సాహితీవేత్తలను ప్రోత్సహించేందుకు తన భార్య పేరిట ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ పురస్కారాలను 34 ఏళ్లుగా ఏటా అందజేస్తున్నారు. 2021 సంవత్సరానికిగాను సీనియర్ సాహితీవేత్త యార్లగడ్డ రాఘవేంద్రరావు రచించిన ‘పచ్చి కడుపు వాసన’ కవితా సంకలనానికి పురస్కారం దక్కింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన యార్లగడ్డ రాఘవేంద్రరావు సాహితీలోకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. త్వరలో అనంతపురంలో జరిగే సాహితీసభలో రాఘవేంద్రరావుకు పురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డికి అవార్డు ప్రదానం
జాతీయ విద్య ప్రణాళిక, పరిపాలన సంస్థ ఇటీవల సృజనాత్మక కార్యక్రమాలకు ప్రకటించిన అవార్డులను వర్చువల్‌లో కేంద్ర సహాయ మంత్రి సుభాష్ సర్కార్ ప్రదానం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి కేంద్రమంత్రి నుంచి అవార్డును అందుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాకినాడ జిల్లా విద్యాధికారిగా పని చేసిన సమయంలో ‘చిట్టి చేతులు-చక్కని రాతలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అవార్డుకు ఎంపికైంది.
తెలుగు భాషా పురస్కారం ప్రదానం
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ గాంధీనగర్‌లో నిర్వహించారు. ఈ ఏడాది మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కారాన్ని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సమాచార హక్కు చట్టం కమిషనర్ ఐలాపురం రాజా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ చేతుల మీదుగా ‘ఈనాడు’ తెలుగు దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిటర్, ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్ ఎం.నాగేశ్వరరావుకు అందజేశారు. తెలుగు వ్యవహారిక భాషలో వినూత్న మార్పులు తీసుకువచ్చి, మాతృభాషను సామాన్య ప్రజలకు చేరువ చేస్తున్నందుకు ఈ పురస్కారం దక్కింది.