రాష్ట్రీయం-తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అమరరాజా ఒప్పందం

ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొదటి అత్యాధునిక విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్‌ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి పారిశ్రామిక పార్కులో రూ.9,500 కోట్ల పెట్టుబడులతో దీనిని స్థాపించనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ సంస్థ తరఫున ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) గల్లా జయదేవ్, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, అమరరాజా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేనిలు ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామని, రెండేళ్లలో మొదటి దశ పూర్తిచేసి ఉత్పత్తులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ వెల్లడించారు.

రూ.6,200 కోట్లతో డేటా కేంద్రం

సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్యాండ్‌ తెలంగాణలో రూ.6,200 కోట్ల పెట్టుబడులతో డేటా కేంద్రం నెలకొల్పనుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో క్యాపిటల్యాండ్‌ ఇండియా ట్రస్టు (క్లింట్‌) తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, క్యాపిటల్యాండ్‌ భారత విభాగం సీఈఓ సంజీవ్‌ దాస్‌గుప్తా సంతకాలు చేశారు.

దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రం :-
ఈ సందర్భంగా సంజీవ్‌ దాస్‌గుప్తా మాట్లాడారు. ‘‘సింగపూర్‌ కేంద్రంగా 22 ఏళ్ల క్రితం ఏర్పాటైన క్యాపిటల్యాండ్‌ సంస్థ ద్వారా 30 దేశాల్లోని 260 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. ఆసియా, యూరప్‌లలో 25 డేటా కేంద్రాల ద్వారా కొన్నేళ్లుగా డేటా సెంటర్‌ డిజైన్, అభివృద్ధి, నిర్వహణలో మిగతావారి కంటే ముందున్నాం. ఇప్పటికే దేశంలో ఒక డేటా కేంద్రం నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరణ ప్రణాళికలో భాగంగా భారత్‌లోనే అతిపెద్ద డేటా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం. పదేళ్ల క్రితం హైదరాబాద్‌ మార్కెట్‌లో అడుగుపెట్టాం. సైబర్‌ పెర్ల్, ఎవాన్స్, ఐటీపీహెచ్‌ పార్కుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాం.


ఐటీలో అగ్రస్థానమే లక్ష్యం

సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో తెలంగాణ త్వరలోనే కర్ణాటకను అధిగమించి దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందని, దీని కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని ప్రసిద్ధ సంస్థ బోష్‌ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సమర్థ నాయకత్వం, ప్రగతిశీల విధానాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ప్రసిద్ధ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యంగా మారింది. సాంకేతికంగా దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో 2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. గత ఏడాదిన్నరలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించి, అత్యధిక వృద్ధి రేటు, ఉపాధి గల రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌

డీజీపీగా మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవర్ని నియమిస్తారనే చర్చకు సర్కారు తెరదించింది. అంజనీకుమార్‌ను డీజీí ˆ(సమన్వయం)గా బదిలీ చేయడంతో పాటు ఆ హోదాలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నారు. ఏడేళ్లుగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్‌ భగవత్‌ను సీఐడీ చీఫ్‌ (అదనపు డీజీ)గా నియమించింది. సీఐడీ చీఫ్‌గా పనిచేసిన గోవింద్‌ సింగ్‌ నవంబరులో పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఈ విభాగం అదనపు బాధ్యతలను గతంలో ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డికి అప్పగించారు. ఆయన పదవీ విరమణ చేస్తుండటంతో ఆ స్థానంలో మహేశ్‌ భగవత్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌ శాంతి భద్రతల అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా నియమించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను అవినీతి నిరోధక శాఖ (అనిశా) డీజీగా నియమించడంతో పాటు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం శాంతి భద్రతల అదనపు డీజీగా ఉన్న జితేందర్‌ను హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అదనపు డీజీగా పనిచేస్తూ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగం అదనపు బాధ్యతలు చూస్తున్న సంజయ్‌కుమార్‌ జైన్‌ను, జితేందర్‌ స్థానంలో శాంతి భద్రతల అదనపు డీజీగా నియమించారు.

మూడేళ్లు తెలంగాణ తొలి సీఎస్‌గా సోమేశ్‌కుమార్‌ ఘనత

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. 2019 డిసెంబరు 31న ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి సీఎస్‌ సోమేశ్‌కుమారే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజీవ్‌శర్మ రెండు సంవత్సరాల అయిదు నెలలు, ప్రదీప్‌చంద్ర నెల రోజులు, ఎస్పీ సింగ్‌ 13 నెలలు, ఎస్‌కే జోషి 23 నెలల పాటు సీఎస్‌లుగా పనిచేశారు. దేశంలో ప్రస్తుతం సుదీర్ఘంగా కొనసాగుతున్న సీఎస్‌లలో సోమేశ్‌కుమార్‌ కూడా ఒకరు. రెవెన్యూ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, భూపరిపాలన కమిషనర్‌ వంటి కీలక పోస్టులనూ ఆయనే నిర్వహిస్తున్నారు. భూ రికార్డుల కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ధరణి వెబ్‌సైట్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. కరోనా సమయంలో టీకాలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ వంటి కార్యక్రమాల రూపకల్పనలోనూ కీలకంగా వ్యవహరించారు. దస్త్రాల సత్వర పరిష్కారానికి కృషి చేశారు. సోమేశ్‌కుమార్‌ పదవీకాలం 2023 డిసెంబరు 31 వరకు ఉంది.

అన్ని నేరాలకు శిక్షల ఖరారులో ఆరు శాతం పెరుగుదల

తెలంగాణలో నేరాల శాతం గత ఏడాదితో పోల్చితే 2022లో 4.4 శాతం పెరిగింది. మిగిలిన నేరాలు తగ్గినా సైబర్‌ నేరాలు జోరందుకోవడం దీనికి కారణం. గత ఏడాది నమోదైన సైబర్‌ నేరాల (8,839) కంటే ఈసారి ఏకంగా 57 శాతం (13,895 కేసులు) పెరుగుదల నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది నేర నివేదికను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు.

‣ గత ఏడాది 50 శాతంగా ఉన్న శిక్షలు, ఈసారి 56 శాతానికి పెరిగాయి. గత ఏడాది 110 మందికి యావజ్జీవ శిక్షలు పడగా ఈసారి ఆ సంఖ్య 152కు పెరిగింది. మావోయిస్టులపై పోరులో పోలీసులు పైచేయి సాధించారు. ఈ ఏడాది మావోయిస్టులు రెండు హత్యలు, మూడు పేలుళ్లు, ఒక దహనం, మరో బెదిరింపు ఘటనలకు పాల్పడ్డారు. 120 మంది సాయుధుల్ని పోలీసులు అరెస్టు చేయగా మరో 32 మంది లొంగిపోయారు. మావోయిస్టులకు చెందిన 14 ఆయుధాలతోపాటు రూ.12,65,560 నగదును పోలీసులు జప్తు చేశారు.

‣ ఈ ఏడాది నమోదైన హత్యలకు కారణాల్లో కుటుంబ కలహాలే ప్రథమ స్థానంలో నిలిచాయి. మొత్తం హత్యల్లో 200 (26 శాతం) కేసులు ఈ కోవలోనివే. లైంగికపరమైన ఈర్ష్య కారణంగా 125 (17 శాతం), ఆస్తి, భూ తగాదాలతో 87 (11 శాతం), పాతకక్షలతో 84 (11 శాతం) హత్యలు జరిగాయి. 72 హత్య కేసుల్లో 96 మందికి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. ‣ ఈ ఏడాది నమోదైన 2939 కిడ్నాప్‌ కేసుల్లో 80 శాతానికి పైగా ప్రేమ, పెళ్లి కారణాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోయిన కేసులే ఉన్నాయి. కేవలం 8 కేసులు మాత్రమే డబ్బు కోసం కిడ్నాప్‌ చేసినట్లు నమోదయ్యాయి.

‣ మహిళలపై గత ఏడాది 17253 నేరాలు జరగ్గా ఈసారి 17908కి పెరిగాయి. వీటిలో 9071 వరకట్న వేధింపుల కేసులే. మహిళల ప్రతిష్ఠకు భంగం కలిగించిన కేసులు 4964. మొత్తం కేసుల్లో 70 మందికి న్యాయస్థానాలు యావజ్జీవ శిక్షలు విధించాయి. చిన్నారులపై జరిగిన 45 నేరాల్లో 15 మందికి యావజ్జీవ శిక్ష ఖరారైంది.

‣ తెలంగాణ పోలీసులు ఈసారి ఆరు అంతర్జాతీయ, 50 జాతీయ, 4 రాష్ట్రస్థాయి పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు.


రఘు అరికపూడికి బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డు

గడిచిన పది సంవత్సరాలుగా దివ్యాంగులకు అందిస్తున్న సేవలకు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి గాను రఘు అరికపూడికి బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డు ప్రకటించింది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేస్తారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ పటాన్‌చెరు ప్రాంతంలోని బీడీఎల్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఆయన ప్రజాసేవను ప్రవృత్తిగా మలుచుకున్నారు.