ఫిఫా ప్రపంచకప్ విజేత అర్జెంటీనా
→అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. అర్జెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది. అర్జెంటీనా తరఫున మెస్సి రెండు గోల్స్ (23 పెనాల్టీ, 108 పెనాల్టీ) గోల్స్ కొట్టగా, డిమారియా (36వ) ఓ గోల్ సాధించాడు. ఫ్రాన్స్ తరఫున స్టార్ ఆటగాడు ఎంబాపె సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ మొత్తం మూడు గోల్సూ (80 పెనాల్టీ, 81వ, 118 పెనాల్టీ) అతడే కొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. అర్జెంటీనా చివరిసారి 1986లో మారడోనా నేతృత్వంలో ప్రపంచకప్ సాధించింది. మొత్తంగా ఆ జట్టు మూడోసారి జగజ్జేతగా నిలిచింది.
ముఖ్యాంశాలు:-
→ ఓ ప్రపంచ కప్‌లో గ్రూప్ దశ, ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌లో గోల్ చేసిన తొలి ఆటగాడు మెస్సి.
→ పెనాల్టీ షూటౌట్లో ఫలితం తేలిన మూడో ఫైనల్ ఇది. గతంలో 1994 (బ్రెజిల్ × ఇటలీ), 2006 (ఇటలీ × ఫ్రాన్స్)లో ఇలాగే జరిగింది.
→ ఫిఫా ప్రపంచకప్‌ల్లో మెస్సి గోల్స్ 13. అత్యధిక గోల్స్ జాబితాలో ఫాంటైన్‌తో కలిసి నాలుగో స్థానంలో ఉన్నాడు. మిరోస్లావ్ (జర్మనీ - 16), రొనాల్డో (బ్రెజిల్ - 15), గెర్డ్ ముల్లర్ (జర్మనీ - 14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
→ ప్రపంచకప్ చరిత్రలో మెస్సి ఆడిన మ్యాచ్‌లు 26. అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లాడిన ఆటగాడిగా అతను, జర్మనీ మాజీ ఆటగాడు లోథర్ (25)ను వెనక్కినెట్టాడు. అందులో అత్యధిక విజయాల్లో (17) మిరోస్లావ్ (జర్మనీ) సరసన చేరాడు.
→ అర్జెంటీనాకిది మూడో ప్రపంచకప్. 1978, 1986లోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది.
→ పీలే, బ్రెటినర్, వావా, జిదానె తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫైనల్స్‌లో గోల్స్ చేసిన అయిదో ఆటగాడు ఎంబాపె. 2018లో క్రొయేషియాపై అతను ఓ గోల్ చేశాడు.
→ ప్రపంచకప్‌ల్లో అర్జెంటీనా గెలిచిన పెనాల్టీ షూటౌట్ల్లు 6. ఆ జట్టుదే రికార్డు.
అంధుల టీ20 ప్రపంచకప్ భారత్ సొంతం
→అంధుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. బంగ్లాదేశ్‌ను 120 పరుగుల తేడాతో చిత్తు చేసి వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది.
→ఫైనల్లో మొదట భారత్ 20 ఓవర్లలో 277 పరుగుల భారీ స్కోరు చేసింది. సునీల్ రమేశ్ (136; 63 బంతుల్లో 24×4, 1×6), కెప్టెన్ అజయ్‌కుమార్ రెడ్డి (100; 50 బంతుల్లో 18×4) సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 248 పరుగులు జత చేసింది.
→రమేశ్‌కు ఈ కప్‌లో ఇది మూడో శతకం. ఛేదనలో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 157/3కే పరిమితమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.
→2012, 2017 టోర్నీల్లోనూ మన జట్టు విజేతగా నిలిచింది.
జైపుర్‌దే ప్రొ కబడ్డీ-9 టైటిల్
ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభ సీజన్లో విజేతగా నిలిచిన జైపుర్ పింక్ పాంథర్స్ మళ్లీ ఇంత కాలానికి రెండో టైటిల్ సాధించింది.
తొమ్మిదో సీజన్ ఫైనల్లో జైపుర్ 33-29తో పుణెరి పల్టాన్‌పై విజయం సాధించింది.
ప్రథమార్ధంలో 14-12తో స్వల్ప ఆధిక్యం సాధించిన జైపుర్, చివరి వరకు దాన్ని కాపాడుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
జైపుర్ జట్టులో రైడర్లు అర్జున్, అజిత్, డిఫెండర్ సునీల్ తలో 6 పాయింట్లతో జట్టును గెలిపించారు.
భారత్‌దే నేషన్స్ కప్
నేషన్స్ కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో 1-0తో ఆతిథ్య స్పెయిన్‌ను ఓడించింది. పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేస్తూ గుర్జీత్ సింగ్ (6వ ని) భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. ఆ తర్వాత ఆధిక్యాన్ని ఆఖరిదాకా కాపాడుకున్న భారత్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో మన జట్టు వరుసగా అయిదు విజయాలతో అజేయంగా కప్ నెగ్గింది. నేషన్స్ కప్ ట్రోఫీ గెలవడం ద్వారా 2023 - 24 ప్రొ హాకీ లీగ్ బెర్తును కూడా భారత్ సొంతం చేసుకుంది.
ప్రపంచ ఛాంపియన్లుగా రఫా, స్వైటెక్
ఈ ఏడాది రెండేసి గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన రఫెల్ నాదల్ (స్పెయిన్), ఇగా స్వైటెక్ (పోలెండ్) ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌కు ఎంపికయ్యారు. గ్రాండ్‌స్లామ్, బిల్లీ జీన్ కింగ్ కప్, డేవిస్ కప్ తదితర ప్రధాన టోర్నీలను ప్రతిపాదికగా తీసుకుని ఐటీఎఫ్ ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డు గెలుచుకోవడం నాదల్‌కు ఇది అయిదోసారి. 2008, 10, 17, 19 సీజన్లలోనూ నెగ్గాడు. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలిచాడు. స్వైటెక్ ఈ సీజన్లో ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్ ట్రోఫీలు నెగ్గింది.
అంధుల జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సంజయ్, పల్లవిలకు పతకాలు
అంధుల జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో నీలం సంజయ్ రెడ్డి, నీలం పల్లవి సత్తాచాటారు. పురుషుల ఎఫ్11 విభాగంలో పోటీపడ్డ సంజయ్, డిస్కస్ త్రోలో స్వర్ణం, షాట్‌పుట్‌లో రజతం సొంతం చేసుకున్నాడు. మహిళల షాట్‌పుట్‌లో వెండి పతకం దక్కించుకున్న పల్లవి, 100 మీ. పరుగులో రజతం ఖాతాలో వేసుకుంది.
టెస్టు సారథ్యానికి కేన్ వీడ్కోలు
ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్‌కు అందించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్టు సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. అతడు ఇక పూర్తిగా వన్డే, టీ20లపైనే దృష్టిసారించనున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కేన్ వైదొలిగినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో పేసర్ టిమ్ సౌథీకి బాధ్యతలు అప్పగించింది. 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 వరల్డ్‌కప్‌లలో కేన్ సారథ్యంలోనే కివీస్ బరిలో దిగుతుంది. మూడు ఫార్మాట్లలో టామ్ లేథమ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 40 మ్యాచ్‌ల్లో 22 విజయాలు, 8 డ్రాలు, కేవలం 10 పరాజయాలతో కివీస్ చరిత్రలో అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా కేన్ రికార్డు నెలకొల్పాడు. అతని నాయకత్వంలోనే టెస్టుల్లో కివీన్ నంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. నిరుడు జూన్‌లో జరిగిన ఫైనల్లో టీమ్‌ఇండియాపై గెలుపుతో డబ్ల్యూటీసీ టైటిల్ సాధించింది.
జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇషాకు రజతం
జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజతం గెలుచుకుంది. జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా 13-17తో స్టార్ షూటర్ మను బాకర్ చేతిలో ఓడింది. క్వాలిఫికేషన్‌లో మను (583) అగ్రస్థానంలో నిలవగా, ఇషా (576) అయిదో స్థానం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో దివ్య (కర్ణాటక) టైటిల్ సొంతం చేసుకుంది. తుది సమరంలో ఆమె 16-14తో సంస్కృతి (ఉత్తర్‌ప్రదేశ్)పై విజయం సాధించింది. రిథమ్ సాంగ్వాన్ (హరియాణా) కాంస్యం నెగ్గింది. క్వాలిఫికేషన్‌లో దివ్య (254.2), సంస్కృతి (251.6) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయికి రజతం
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అదరగొట్టింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సత్తాచాటింది. టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ హౌ జిహువా (చైనా)ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. మహిళల 49 కేజీల విభాగంలో 200 కిలోల బరువులెత్తిన చాను ద్వితీయ స్థానంతో రజతం సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీల బరువులెత్తింది. చైనా క్రీడాకారిణులు జియాంగ్ హ్యూహువా (93+113=206 కేజీలు) స్వర్ణం, జిహువా (89+109=198 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య
యువ చెస్ ఆటగాడు ఆదిత్య మిట్టల్ (ముంబయి) గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. జీఎం టైటిల్ సాధించిన 77వ భారత క్రీడాకారుడిగా ఆదిత్య ఘనత అందుకున్నాడు. స్పెయిన్‌లో జరుగుతున్న టోర్నీలో 16 ఏళ్ల ఆదిత్య 2500 ఎలో రేటింగ్ అధిగమించాడు. 2500 ఎలో రేటింగ్, మూడు జీఎం నార్మ్‌లు సాధిస్తే గ్రాండ్‌మాస్టర్ టైటిల్ లభిస్తుంది. 2021 సెర్బియా మాస్టర్స్‌లో తొలి జీఎం నార్మ్ అందుకున్న ఆదిత్య అదే ఏడాది ఎలొబ్రెగాట్ ఓపెన్‌లో రెండో నార్మ్ దక్కించుకున్నాడు. 2022 సెర్బియా మాస్టర్స్‌లో మూడో నార్మ్ సొంతం చేసుకున్నాడు.
మనీషాకు బీడబ్ల్యూఎఫ్ అవార్డు
భారత యువ షట్లర్ మనీషా రామదాస్ బీడబ్ల్యూఎఫ్ అవార్డు దక్కించుకుంది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనకు గాను బీడబ్ల్యూఎఫ్ మహిళా పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ - 2022 అవార్డును గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎస్‌యూ5 విభాగంలో 17 ఏళ్ల మనీషా స్వర్ణంతో మెరిసింది. ఈ ఏడాది మనీషా 11 స్వర్ణాలు, 5 కాంస్య పతకాలతో సత్తాచాటింది.
1000 మ్యాచ్‌ల ప్రొఫెషనల్ ఆటగాడిగా మెస్సి
-ప్రొఫెషనల్ ఆటగాడిగా మెస్సి ఆడిన మ్యాచ్‌లు 1000. అందులో అర్జెంటీనా తరపున 169 (94 గోల్స్), బార్సిలోనా తరపున 778 (672 గోల్స్), పారిస్ సెయింట్ జర్మైన్ తరపున 53 (23 గోల్స్) మ్యాచ్‌లాడాడు. మొత్తం 789 గోల్స్ సాధించాడు. మరో 338 గోల్స్ చేయడంలో సాయపడ్డాడు.
- అయిదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీకి నాకౌట్లో ఇదే తొలి గోల్.
- ఈ ప్రపంచకప్‌లో మెస్సి గోల్స్ 3. ఎంబాపె (ఫ్రాన్స్) 5 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. వాలెన్సియా (ఈక్వెడార్), గాక్‌పో (నెదర్లాండ్స్), మొరాటా (స్పెయిన్), రష్‌ఫోర్డ్ (ఇంగ్లాండ్)తో కలిసి మెస్సి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
- ప్రపంచకప్ చరిత్రలో మెస్సి చేసిన గోల్స్ 9. అర్జెంటీనా తరపున మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో గాబ్రియల్ (10) తర్వాత అతను రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో గోల్ చేసిన అతి పెద్ద వయస్సు అర్జెంటీనా ఆటగాడిగా మెస్సి (35 ఏళ్ల 162 రోజులు) నిలిచాడు. గతంలో ఈ రికార్డు రాబర్టో అయాలా (2006లో 33 ఏళ్ల 77 రోజులు) పేరు మీద ఉంది.
అర్జున్‌కు బ్లిట్జ్ టైటిల్
తెలంగాణ యువ చెస్ సంచలనం అర్జున్ ఇరిగేశి మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ బ్లిట్జ్ ఓపెన్‌లో ఈ గ్రాండ్‌మాస్టర్ విజేతగా నిలిచాడు. మొత్తం 18 రౌండ్లు ముగిసే సరికి 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టోర్నీలో దూకుడు కొనసాగించిన అర్జున్ చివరి రౌండ్ ఫలితంతో సంబంధం లేకుండా 17 రౌండ్లు పూర్తయ్యే సరికే 12 పాయింట్లతో టైటిల్ ఖాయం చేసుకున్నాడు. చివరి రౌండ్లో మరో భారత గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్‌తో గేమ్ డ్రా చేసుకుని తిరుగులేని ఆధిక్యంతో ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. 10 విజయాలు, 5 డ్రాలు నమోదు చేసిన అతను 3 గేమ్‌ల్లో ఓడాడు. విదిత్ (9), ప్రజ్ఞానంద (8.5) నిహాల్ (8) వరుసగా 5, 6, 7 స్థానాల్లో నిలిచారు. అంతకుముందు ఈ టోర్నీలో ర్యాపిడ్ విభాగంలో అర్జున్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బ్లిట్జ్ మహిళల్లో వైశాలి (13.5) టైటిల్ దక్కించుకుంది. ఆమె 11 విజయాలు, 5 డ్రాలు, రెండు ఓటములు నమోదు చేసింది. హారిక (11) మూడు, హంపి (9.5) అయిదో స్థానాల్లో నిలిచారు.
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా ఉన్నతి
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఉన్నతి హుడా రన్నరప్‌గా నిలిచింది. మహిళల అండర్-17 సింగిల్స్ ఫైనల్లో ఆమె 18-21, 21-9, 14-21తో సరున్‌రాక్ చేతిలో పోరాడి ఓడింది. ఈ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచిన ఉన్నతి బాగానే ఆడినా మూడో గేమ్‌లో కీలక సమయాల్లో తడబడి టైటిల్ చేజార్చుకుంది.
ప్రెసిడెంట్స్ కప్ షూటింగ్ టోర్నీలో అంజుమ్‌కు రజతం
ప్రెసిడెంట్స్ కప్ షూటింగ్ టోర్నీ (కైరో)లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో అంజుమ్ మౌద్గిల్ రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ఈ భారత షూటర్ 14-16తో అనా జాన్సెన్ (జర్మనీ) చేతిలో ఓడింది. క్వాలిఫికేషన్‌లో జాతీయ రికార్డు (591 పాయింట్లు)తో నాలుగో స్థానంలో నిలిచిన అంజుమ్, ర్యాంకింగ్ రౌండ్లో 412.9తో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్ ఛాంపియన్ నీనా క్రిస్టెన్ (స్విట్జర్లాండ్, 354.3) అయిదో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో పతకం. ఇంతకుముందు రుద్రాంక్ష్ (10 మీ. ఎయిర్ రైఫిల్) స్వర్ణం నెగ్గాడు.
ఐపీఎల్‌కు బ్రావో వీడ్కోలు
ఐపీఎల్‌కు ఆకర్షణ తెచ్చిన మరో వెస్టిండీస్ స్టార్ నిష్క్రమించాడు. పొలార్డ్ బాటలోనే నడుస్తూ 39 ఏళ్ల డ్వేన్ బ్రావో ఈ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. ఆటగాడిగా ప్రయాణాన్ని ఆపినా కోచ్‌గా కొత్త పాత్రలో సీఎస్కేకు సేవలందించబోతున్నాడు. ఈ నెలలో జరిగే ఐపీఎల్ వేలానికి దూరంగా ఉన్న బ్రావో, ఇకపై ఆటగాడిగా కనబడనని ప్రకటించాడు. దశాబ్దానికి పైగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్ 2023 సీజన్లో లక్ష్మీపతి బాలాజీ స్థానంలో బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి బ్రావోకు ఈ టోర్నీతో బంధం ఉంది. తొలి మూడు సీజన్లలో ముంబయి ఇండియన్స్‌కు ఆడిన అతడు 2011 నుంచి చెన్నైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2016, 17 సీజన్లలో చెన్నైపై నిషేధం పడడంతో ఆ రెండేళ్లు గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. 2011, 2018, 2021లో సీఎస్కే టైటిల్ గెలవడంలో డ్వేన్‌ది కీలకపాత్ర. 2014 ఛాంపియన్స్ లీగ్ విజయంలోనూ అతడి భాగస్వామ్యం ఉంది. రెండుసార్లు పర్పుల్ క్యాప్ (2013, 15) అందుకున్న తొలి బౌలర్ అతడే. మొత్తం 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీసిన బ్రావో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఒక్క చెన్నై తరఫునే 168 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద 1560 పరుగులు కూడా చేసిన అతడు 80 క్యాచ్‌లు పట్టాడు. 17-20 ఓవర్ల మధ్య 1115 బంతుల్లో 102 వికెట్లు పడగొట్టాడు. అతడిలా చివరి నాలుగు ఓవర్లలో ఇన్ని బంతులు ఎవరూ వేయలేదు. తనకే సొంతమైన టిపికల్ బ్యాటింగ్‌తో లోయర్‌ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన బ్రావో ఫీల్డర్‌గానూ ఎన్నో మెరుపు క్యాచ్‌లు పట్టాడు.
సౌరాష్ట్రదే విజయ్‌హజారె ట్రోఫీ
అద్భుత ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మరో శతకం సాధించాడు. అయినా విజయ్ హజారె ఫైనల్లో మహారాష్ట్రకు నిరాశ తప్పలేదు. గైక్వాడ్‌ను మించి పోరాడిన షెల్డన్ జాక్సన్ (133 నాటౌట్; 136 బంతుల్లో 12×4, 5×6) సౌరాష్ట్రకు టైటిల్ అందించాడు. ఫైనల్లో జాక్సన్ అసాధారణంగా ఆడటంతో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో మహారాష్ట్రను ఓడించింది. 249 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి ఛేదించింది. సౌరాష్ట్ర ఈ ట్రోఫీ సాధించడం ఇది రెండోసారి. 2007 - 08 సీజన్‌లో ఆ జట్టు విజేతగా నిలిచింది.
1986 తర్వాత తొలిసారిగా ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరిన మొరాకో
మొరాకో అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-ఎఫ్ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 గోల్స్‌తో కెనడాను ఓడించి గ్రూప్‌లో అగ్రస్థానంతో (7 పాయింట్లు) ప్రిక్వార్టర్స్ చేరింది. ఈ మ్యాచ్‌లో నాలుగో నిమిషంలోనే గోల్ కొట్టిన మొరాకో ప్రత్యర్థికి షాకిచ్చింది. కెనడా ఆటగాడు కొట్టిన షాట్‌ను అడ్డుకోబోయిన మొరాకో డిఫెండర్ నయీమ్ (40వ) సెల్ఫ్‌గోల్ కొట్టేశాడు. 1986 తర్వాత ప్రపంచకప్‌లో నాకౌట్ చేరడం మొరాకోకు ఇదే తొలిసారి. 1998లో నైజీరియా తర్వాత గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆఫ్రికా జట్టుగా మొరాకో ఘనత సాధించింది.
జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మేఘనకు మూడు పతకాలు
జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్ మేఘన సత్తాచాటింది. రెండు కాంస్యాలతో పాటు ఓ రజతం సొంతం చేసుకుంది. 25 మీ. పిస్టల్ జూనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె కంచు పతకం ఖాతాలో వేసుకుంది. సివిలియన్ వ్యక్తిగత విభాగంలోనూ ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళల టీమ్‌లో మేఘన, ఇషా సింగ్, మాలబికాతో కూడిన రాష్ట్ర జట్టు రజతం దక్కించుకుంది.
ఉత్తమ టెస్టు బ్యాటర్‌గా పంత్
రిషబ్ పంత్‌ను 2022 సంవత్సరానికి భారత ఉత్తమ టెస్టు బ్యాటర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఆ ఏడాదిలో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్, బౌలర్ల జాబితాను బోర్డు ప్రకటించింది. నిరుడు పంత్ 7 టెస్టుల్లో 680 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఉత్తమ బౌలర్‌గా బుమ్రా ఎంపికయ్యాడు. వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఉత్తమ బ్యాటర్‌గా, సిరాజ్ ఉత్తమ బౌలర్‌గా నిలిచారు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. భువనేశ్వర్ బెస్ట్ టీ20 బౌలర్.
చరిత్ర సృష్టించిన కోనేరు హంపి
-భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి కోనేరు హంపి మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ మహిళల ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గింది. 17 రౌండ్లలో 12.5 పాయింట్లతో హంపి ద్వితీయ స్థానంలో నిలిచింది. తొలి అయిదు గేముల్లో మూడు ఓటములు చవిచూసిన ఆమె, తన చివరి 12 రౌండ్లలో ఒక్క పరాజయం లేకుండా పోడియం ఎక్కడం విశేషం. అసుబెయెవా (కజకిస్థాన్) పసిడి గెలిచింది. దిగ్గజ ఆటగాడు ఆనంద్ (2017) తర్వాత ఈ టోర్నీలో పతకం సాధించిన ఘనత హంపిదే.
- అటు ర్యాపిడ్, ఇటు బ్లిట్జ్‌లో ప్రపంచ పతకాలు గెలిచిన తొలి భారత అమ్మాయి హంపినే. 2019లో ఈ ఆమె ర్యాపిడ్‌లో స్వర్ణం నెగ్గింది.
- ప్రపంచ బ్లిట్జ్ చెస్ టోర్నీలో పతకం గెలిచిన భారత రెండో ప్లేయర్ హంపి. గతంలో విశ్వనాథన్ ఆనంద్ (2017) కాంస్యం సాధించాడు.
అఫ్గాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్
అఫ్గానిస్థాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్‌ఖాన్ నియమితుడయ్యాడు. మహ్మద్ నబి స్థానంలో ఈ లెగ్ స్పిన్నర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు రషీద్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, తనను సంప్రదించకుండానే జట్టును ఎంపిక చేశారని ఆరోపిస్తూ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. దీంతో నబి కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ ఆడింది అఫ్గాన్. ఈసారి ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత నబి కెప్టెన్‌గా తప్పుకోవడంతో 24 ఏళ్ల రషీద్‌కు అవకాశం వచ్చింది.
సబ్ జూనియర్, జూనియర్ సౌత్‌జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆదిత్యకు స్వర్ణం
సబ్ జూనియర్, జూనియర్ సౌత్‌జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో తెలుగు రాష్ట్రాల స్విమ్మర్ల జోరు కొనసాగుతోంది. బాలుర గ్రూప్-3 50 మీ. ఫ్రీస్టైల్‌లో ఆదిత్య (తెలంగాణ) పసిడితో మెరిశాడు. 30.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తమిళనాడు స్విమ్మర్లు మితేష్ (30.97 సె), జాసిమ్ (31.04 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ఇదే విభాగం బాలికల పోటీల్లో తెలంగాణకు చెందిన అనిక (31.62 సె), దిత్య (32.77 సె) వరుసగా ప్రథమ, తృతీయ స్థానాల్లో నిలిచారు. క్రిస్టీన్ (కేరళ - 31.85 సె) రెండో స్థానాన్ని అందుకుంది. బాలికల 50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో తెలంగాణ స్విమ్మర్లు శివాని రజతం, అనిక కాంస్యం గెలిచారు. బాలికల 100 మీ. ఫ్రీస్టైల్‌లో ఏపీ అమ్మాయి లాస్యశ్రీ స్వర్ణం కైవసం చేసుకుంది. ఆమె 1 నిమిషం 08.29 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది. తెలంగాణ బాలిక మేఘన (1:09.89 సె) కాంస్యం ఖాతాలో వేసుకుంది. మీరా (కర్ణాటక - 1:09.31 సె) రజతం గెలిచింది. బాలుర గ్రూప్-2 400 మీ. వ్యక్తిగత మెడ్లీలో వర్షిత్ (తెలంగాణ) రజతం గెలిచాడు. 4 నిమిషాల 57.31 సెకన్లలో అతను రేసు ముగించాడు.
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో సవితశ్రీకి కాంస్యం
ప్రపంచ చెస్‌లో మరో భారత తార తళుక్కుమంది. 15 ఏళ్ల సవితశ్రీ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ మహిళ విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఆమె 11 రౌండ్ల నుంచి ఎనిమిది పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. తొమ్మిదో రౌండ్లో జన్సాయా (కజకిస్థాన్) చేతిలో ఓడకపోయుంటే సవితశ్రీ మరింత మెరుగైన ఫలితం సాధించేదే. అయితే పుంజుకున్న ఆమె, పదో రౌండ్లో కియాన్యున్ గాంగ్ (సింగపూర్)పై నెగ్గింది. ఆఖరి రౌండ్లో దినారా (కజకిస్థాన్)తో గేమ్‌ను డ్రాగా ముగించింది. సవితతో పాటు హంపి, మరో ఇద్దరు ఎనిమిది పాయింట్లతో పోటీని ముగించారు. కానీ సూపర్ టైబ్రేక్ స్కోరు ఆధారంగా సవిత మూడో స్థానం దక్కించుకుంది. హంపి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో 39వ స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జోంగ్యి 8.5 పాయింట్లతో టైటిల్ గెలుచుకుంది. కజకిస్థాన్ అమ్మాయి దినారా (8.5) రన్నరప్‌గా నిలిచింది.
- విశ్వనాథన్ ఆనంద్, హంపి తర్వాత ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో పతకం సాధించిన మూడో భారత ప్లేయర్‌గా సవితశ్రీ ఘనత సాధించింది.
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఓపెన్ విభాగంలో కార్ల్‌సన్‌కు టైటిల్
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఓపెన్ విభాగంలో అర్జున్ ఇరిగేశి అయిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అతడు 13 రౌండ్ల నుంచి 9 పాయింట్లు సంపాదించాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 10 పాయింట్లతో టైటిల్ గెలిచాడు. విన్సెంట్ (జర్మనీ) 9.5 పాయింట్లతో రెండో స్థానం సాధించాడు. అమెరికాకు చెందిన కరువానా (9.5) మూడో స్థానంలో నిలిచాడు.
సౌత్‌జోన్ సబ్ జూనియర్, జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో రిత్వికకు స్వర్ణం
సబ్ జూనియర్, జూనియర్ సౌత్‌జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు మెరిశారు. బాలికల గ్రూప్-1 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రిత్విక స్వర్ణం దక్కించుకుంది. 35.91 సెకన్ల టైమింగ్‌తో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు స్విమ్మర్లు ప్రేషేత (37.13 సె), జాయ్ శ్రీ (37.51 సె) వరుసగా రెండు, మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు. మరోవైపు బాలికల 4×50 మీ. ఫ్రీస్టైల్ రిలే గ్రూప్-3 లో తెలంగాణ పసిడి కైవసం చేసుకుంది. శివాని, దిత్య, మేఘన, అనికతో కూడిన రాష్ట్ర జట్టు 2 నిమిషాల 8.98 సెకన్లలో రేసు ముగించింది. కర్ణాటక (2:09.61 సె), తమిళనాడు (2:10.15 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.
ఈస్పోర్ట్స్‌కు ప్రభుత్వ గుర్తింపు
భారత్‌లో ఈస్పోర్ట్స్‌కు గొప్ప ఊతం. ఈస్పోర్ట్స్‌ను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు నిబంధనలను సవరించింది. ఇకపై బహుళ క్రీడల ఈవెంట్లలో ఈస్పోర్ట్స్ కూడా ఉంటాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఈస్పోర్ట్స్ ప్రదర్శన క్రీడగా (పతకాలను లెక్కలోకి తీసుకోరు) ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత్‌లో కూడా అనేక క్రీడాంశాల్లో పోటీలుండే ఈవెంట్లలో ఈస్పోర్ట్స్‌ను చేర్చాలన్న డిమాండ్ పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కూడా ఈస్పోర్ట్స్‌ను వ్యాప్తి చేయడంపై దృష్టిపెట్టింది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే మొదటి ఈస్పోర్ట్స్ వీక్‌కు సింగపూర్ వేదిక కానుంది.
సౌత్‌జోన్ సబ్ జూనియర్, జూనియర్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో శివానికి రెండు స్వర్ణాలు
సౌత్‌జోన్ సబ్ జూనియర్, జూనియర్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి కర్రా శివాని మెరిసింది. తొలి రోజు పోటీల్లో రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ను శివాని ఒక్క నిమిషం 14.04 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానం సాధించింది. తెలంగాణకే చెందిన అనిక దెబోరా (1 ని 15.75 సె) మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. 100 మీటర్ల బటర్‌ఫ్లై రేసును శివాని 1 ని 14.47 సె ముగించి బంగారు పతకం సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి లాస్యశ్రీ (1 ని 17.58 సె) మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలిచింది.
వార్న్‌కు అరుదైన గౌరవం
ప్రతి ఏడాది ‘అత్యుత్తమ టెస్టు ఆటగాడు’ అవార్డును దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ పేరిట ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది. వార్న్ గౌరవార్థం ఈ అవార్డుకు అతని పేరు పెట్టింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం సందర్భంగా వార్న్‌కు నివాళిగా అవార్డుకు అతని పేరు పెడుతున్నట్లు సీఏ సీఈఓ నిక్ హాక్లే, ఆసీస్ క్రికెటర్ల సంఘం సీఈఓ టాడ్ గ్రీన్‌బెర్ ప్రకటించారు. ఈ ఏడాది ఆరంభంలో థాయ్‌లాండ్‌లో అనుమానాస్పద రీతిలో గుండెపోటుతో వార్న్ మరణించాడు. 2005లో 40 వికెట్లు తీసిన వార్న్‌కు 2006లో ఈ అవార్డు లభించింది.
పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా మాజీ స్టార్ షాహిద్ అఫ్రిది నియమితుడయ్యాడు. 2020 డిసెంబర్ నుంచి ఈ పదవిలో ఉన్న మహ్మద్ వసీమ్ స్థానంలో అఫ్రిది బాధ్యతలు చేపట్టాడు. ఈ తాత్కాలిక సెలక్షన్ కమిటీలో అబ్దుల్ రజాక్, ఇఫ్తికార్ అహ్మద్, హరూన్ రషీద్ కూడా ఉన్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం మాత్రమే ఈ సెలక్షన్ కమిటీని ఎంపిక చేశారు.
ఐపీఎల్ చరిత్రలో సామ్‌కు అత్యధిక ధర
ఐపీఎల్ 2023కు ముందు నిర్వహించిన మినీ వేలంలో రూ.కోట్ల వరద పారింది. సంచలనాలకు వేదికైన ఈ వేలం ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టింది. ఊహించినట్లుగానే ఆల్‌రౌండర్లు కరన్, గ్రీన్, స్టోక్స్‌ల పంట పండింది. కనీస ధర రూ.2 కోట్లు చొప్పున వేలం బరిలో దిగిన వీళ్లకు అనూహ్యమైన ధర పలికింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’గా, ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సామ్ కరన్ ఏకంగా రూ.18.5 కోట్లు కొల్లగొట్టాడు. ఈ 24 ఏళ్ల పేస్ ఆల్‌రౌండర్ కోసం ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. మొదట ముంబయి, రాజస్థాన్ అతని ధరను పెంచుతూ పోయాయి. మధ్యలో చెన్నై చేరింది. రాజస్థాన్ దగ్గర రూ.13.20 కోట్లే ఉండడంతో రేసు నుంచి నిష్క్రమించక తప్పలేదు. హైదరాబాద్, చెన్నై, పంజాబ్ తగ్గేదేలే అన్నట్లు సాగాయి. చివరకు మిగతా రెండు తప్పుకున్నా పంజాబ్‌తో ముంబయి పోటీపడింది. కానీ పంజాబ్ పట్టు వదలకుండా అతణ్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ అరంగేట్రం చేసిన జట్టులోకే తిరిగి కరన్ చేరాడు. 2019లో రూ.7.2 కోట్లకు పంజాబ్ అతణ్ని దక్కించుకుంది. ఆ సీజన్ తర్వాత పంజాబ్ వదిలేయడంతో 2020 వేలంలో చెన్నై రూ.5.5 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా యువ పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను మాత్రం ముంబయి వదల్లేదు. దిల్లీతో చివరి వరకూ పోటీపడి ఈ 23 ఏళ్ల ఆటగాణ్ని కొనుగోలు చేసింది. భారత్‌లో టీ20 సిరీస్‌లో సత్తాచాటిన అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. మంచి వేగంతో బౌలింగ్ చేయడమే కాకుండా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ఈ సామర్థ్యంతోనే ఇప్పుడు తొలిసారి ఐపీఎల్ వేలంలోనే రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా క్రిస్ మోరిస్ (2021లో రూ.16.25 కోట్లు)ను అధిగమించిన కరన్, గ్రీన్, కేఎల్ రాహుల్, కోహ్లి (రూ.17 కోట్లు)లను వెనక్కినెట్టి లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగానూ నిలిచారు.
ఫిఫా ర్యాంకుల్లో అర్జెంటీనాకు 2వ స్థానం
సంచలన ఆటతో ఫ్రాన్స్‌ను ఓడించి 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న అర్జెంటీనా ర్యాంకుల్లోనూ మెరుగైంది. ఫిఫా ప్రకటించిన జాబితాలో మెస్సి బృందం రెండో స్థానం సాధించింది. ఈ కప్ క్వార్టర్స్‌లో ఓడినా బ్రెజిల్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ ఒక స్థానం మెరుగై మూడో ర్యాంకులో నిలవగా, బెల్జియం 4, ఇంగ్లాండ్, 5, నెదర్లాండ్స్ 6 స్థానాలు సాధించాయి. ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా 7వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఇటలీ 8వ ర్యాంకులో ఉండగా, పోర్చుగల్, స్పెయిన్ వరుసగా 9, 10 స్థానాల్లో ఉన్నాయి.
జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో వ్రితికి మరో స్వర్ణం
జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సంచలనం వ్రితి అగర్వాల్ పసిడి జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మహిళల 200 మీ. బటర్‌ఫ్లై, 800 మీ. ఫ్రీస్టైల్‌లో స్వర్ణాలు నెగ్గిన ఆమె తాజాగా 1500 మీ. ఫ్రీస్టైల్‌లోనూ బంగారు పతకాన్ని సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అమ్మాయిల 1500 మీ. ఫ్రీస్టైల్ ఫైనల్‌లో ఆమె 18 నిమిషాల 14.39 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అశ్మిత (కర్ణాటక - 18:46.96 ని), రిచా (దిల్లీ - 18:59.11 ని) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మరో తెలంగాణ స్విమ్మర్ సాయి నిహార్ పురుషుల 200 మీ. మెడ్లీలో కాంస్యం గెలిచాడు. అతను 2 నిమిషాల 12.94 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.