వార్తల్లో ప్రాంతాలు

8వ శతాబ్దం నాటి తెలుగు శాసనం గుర్తింపు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట వేములమ్మ దేవాలయంలో 8వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం వెలుగులోకి వచ్చింది. దేవాలయం రాతిపై ఉన్న శాసనాన్ని, అక్కడి విగ్రహాలను గ్రామానికి చెందిన జి.వి.నారాయణరెడ్డి అచ్చులు తీసి పురావస్తు శాఖకు పంపారు. వీటిని పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మునిరత్నంరెడ్డి ఇవి పురాతనమైన తెలుగు శాసనాలని తెలియజేశారు. ఈ శాసనంలో రేచన అనే వ్యక్తి, గుండి అనే నది పేరు ప్రస్తావన ఉందని చెప్పారు. ఇక్కడి సమీపంలో గుండ్లకమ్మ నది ఉందని, పూర్వం గుండి నదిగా దీన్ని పిలిచే వారని తెలిపారు. దేవాలయంలో గోడపై కుడి చేతిలో కత్తి ధరించి ఉన్న వీరుడి శిల్పం ఉందని, దీనిపై శింగరాజుపట్ట అని రాసి ఉందని చెప్పారు. రాజ్య రక్షణలో భాగంగా మరణించిన వీరుల జ్ఞాపకార్థం ఇటువంటి శాసనాలను వేయించేవారని ఆయన పేర్కొన్నారు.

మొహిద్దీన్‌పురంలో ఆదిమానవుడి గుహ గుర్తింపు

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని మొహిద్దీన్‌పురంలో మరో ఆదిమానవుడి గుహ వెలుగులోకి వచ్చింది. కంభం మండలం లింగాపురానికి చెందిన చరిత్ర అధ్యాపకురాలు కందుల సావిత్రి మొహిద్దీన్‌పురం గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉన్న జంపలేరు వాగు సమీపంలో మరో ఆదిమానవుడి గుహను కనుగొన్నారు. ఆమె గ్రామస్థులతో కలిసి ఆ ప్రాంతంలో వెతకడంతో ఈ గుహ కనిపించినట్లు చెప్పారు. గతంలో భైరవకొండ సమీపంలో బయటపడ్డ గుహకు ఇక్కడి నుంచి దారి ఉందని తెలిపారు. గుహ లోపలి భాగం బూడిద రంగులో ఉందన్నారు.

హుగ్లీ తీరంలో ఐదు ఫిరంగులు గుర్తింపు

భారత నౌకాదళం మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటి ఐదు ఫిరంగులను గుర్తించింది. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది ఎడమ గట్టుపై ఇవి బయటపడ్డాయి. వీటిలో రెండింటిని అధికారులు పునరుద్ధరించి నలుపు రంగు వేశారు. ముందు భాగంలో ఎరుపు రంగు అంచుతో పాటు తెలుపు రంగు వేశారు. మోటిఫ్‌ని ముద్రించారు. అనంతరం వీటిని భారత నౌకాదళం పశ్చిమబెంగాల్‌ కేంద్ర కార్యాలయమైన ఐఎన్‌ఎస్‌ నేతాజీ సుభాష్‌ వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఫిరంగులు మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటివి కావొచ్చు. నౌకలపై ఏర్పాటు చేసేందుకు తయారు చేసి ఉండొచ్చని కెప్టెన్‌ చక్రవర్తి తెలిపారు. అయిదు ఫిరంగుల్లో నాలుగింటిని గతేడాది ద్వితీయార్థంలో గుర్తించామని, ఈ ఏడాది భూమి నుంచి బయటకు తీశామని చెప్పారు. ఈ ప్రాంతం గతంలో నది గట్టులో భాగంగా ఉండేదని చెప్పారు. చివరి దానిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. నేలపై పిచ్చిమొక్కలను తొలగించే సమయంలో పరికరానికి ఫిరంగి తాకడంతో శబ్దం వచ్చిందని, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించగా ఫిరంగులు బయటపడ్డాయని చక్రవర్తి వివరించారు. ఇవి ఎక్కడ తయారయ్యాయన్న సంగతి తెలుసుకునేందుకు వాటిపై ఎలాంటి గుర్తులు లేవని చెప్పారు.

బాసరలో 9వ శతాబ్దం నాటి జైన శాసన దేవత శిల్పం గుర్తింపు

బాసరలోని అతి పురాతనమైన కుక్కుటేశ్వర ఆలయంలో ఉన్న జైన శాసన దేవత విగ్రహం 9, 10వ శతాబ్దం నాటిదిగా గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. విగ్రహ శైలిని బట్టి ఇది రాష్ట్ర కూటుల కాలం నాటిదని బృంద కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. ‘బృంద సభ్యుడు బలగం రామ్మోహన్‌రావు ఈ శిల్పాన్ని గుర్తించారు. ప్రతిమ లక్షణాలను బట్టి శాసన దేవత చక్రేశ్వరి. అప్రతిచక్ర, విద్యేశ్వరి అనే పేర్లు కూడా ఉన్నాయి. అందుకే బాసర జైనుల సరస్వతిగచ్ఛగా, విద్యా కేంద్రంగా ఉంది’ అని హరగోపాల్‌ పేర్కొన్నారు.

తొలిసారిగా గాజు కప్ప పారదర్శకత గుట్టు గుర్తింపు

-దక్షిణ, మధ్య అమెరికాల్లో ఎక్కువగా కనిపించే గాజు కప్ప (గ్లాస్‌ ఫ్రాగ్‌) పారదర్శకత గుట్టును అమెరికా శాస్త్రవేత్తలు తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. నిద్రించే సమయంలో ఇది తన ఎర్రరక్త కణాలను ఎక్కడ దాస్తుందన్నది గుర్తించారు.

- ఈ గ్లాస్‌ ఫ్రాగ్‌ రాత్రివేళ చురుగ్గా ఉంటుంది. ఆ సమయంలో పచ్చగా ఉండే దాని శరీరం, పరిసరాల్లోని ఆకులు, పొదల్లో కలిసిపోతుంటుంది. పగటివేళ నిద్రించే సమయంలో దాని కండరాలు, చర్మం పారదర్శకంగా మారిపోతాయి. వాటి ఎముకలు, కళ్లు, అంతర్గత అవయవాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ కప్పలు భారీ ఆకుల కింద విశ్రమిస్తాయి. అవి పారదర్శకంగా మారినప్పుడు చుట్టుపక్కల ఉన్న పచ్చదనంలో బాగా కలిసిపోతాయి. నేలమీద నివసించే వెన్నెముక జీవుల్లో గ్లాస్‌ ఫ్రాగ్‌లకే ఈ సామర్థ్యం ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థలోని ఎర్రరక్త కణాల ఉనికి దృష్ట్యా ఇది కష్టమైన అంశం. ఇవి మొక్కల నుంచి పరావర్తనం చెందే పచ్చ కాంతిని శోషించుకొని, ప్రతిగా ఎర్రకాంతిని వెదజల్లుతాయి. ఫలితంగా రక్తం, ప్రసరణ వ్యవస్థ, ప్రకాశవంతమైన పచ్చ ఆకుల మధ్య విస్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఈ కప్ప దీన్ని అధిగమించి పూర్తి పారదర్శకతను ఎలా సాధిస్తోందన్నది ఆసక్తికరంగా మారింది.

- ఈ కప్పలు పారదర్శకంగా మారినప్పుడు ఎర్రరక్త కణాలు, రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి అదృశ్యం కావడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మెలకువగా ఉన్నప్పుడు మాత్రం తిరిగి ప్రత్యక్షమవుతున్నాయని తేల్చారు. మత్తుమందుతో వాటిని నిద్రలోకి తీసుకెళ్లినా ఎర్ర రక్త కణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కప్పలు తమంతట తాము నిద్రలోకి జారిపోయినప్పుడే ఆ కణాలు అదృశ్యమవుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫొటోఅకౌస్టిక్‌ మైక్రోస్కొపీ (పామ్‌) విధానాన్ని ఉపయోగించి ఈ గుట్టును విప్పారు. నిద్రించే సమయంలో ఈ కప్పలు తమ ఎర్రరక్త కణాలను కాలేయాల్లో దాచుకుంటున్నట్లు గమనించారు. వేరే జీవులు తమను వేటాడకుండా అవి ఈ జాగ్రత్తను పాటిస్తున్నట్లు తేల్చారు.


ఇజ్రాయెల్‌లో 2 వేల ఏళ్ల పూర్వం నాటి ప్రమిదలు గుర్తింపు

ఇజ్రాయెల్‌లోని లఛిష్‌ అడవిలో ఓ పురాతన గుహ బయటపడింది. దానిని ఇస్లామిక్‌ శకం ప్రారంభంలోని సలోమె గుహగా గుర్తించారు. అందులో ప్రమిదలు కూడా లభించాయి. ఇవి దాదాపు 2 వేల ఏళ్ల పూర్వం నాటివని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.