వార్తల్లో వ్యక్తులు

టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ 2022 సంవత్సరానికి గాను టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన చిత్రాన్ని టైమ్స్‌ తన మేగజీన్‌ ముఖచిత్రంగా ప్రచురించింది. ‘‘ఉక్రెయిన్‌లో, విదేశాల్లో చాలా మంది జెలెన్‌స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారు. గత ఏడాదిగా ధిక్కారం, ప్రజాస్వామ్యానికి ఓ చిహ్నంగా తనను తాను నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు లేకుండా రష్యా చేస్తున్న దాడులకు ఎదురొడ్డి మరీ దేశాన్ని నడిపిస్తున్నారు’’ అని 44 ఏళ్ల జెలెన్‌స్కీని కొనియాడుతూ ‘టైమ్స్‌’ ట్వీట్‌ చేసింది.

భారత సంతతి వ్యక్తికి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’

భారత సంతతికి చెందిన మోహన్‌ మాన్సిగాని, బ్రిటన్‌ రాజకుటుంబం నుంచి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)’ పురస్కారం అందుకున్నారు. ఉత్తర లండన్‌కు చెందిన మోహన్, సెయింట్‌ జాన్‌ అంబులెన్స్‌ ఛారిటీకి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. సంస్థలో ఆయన సేవలకు గుర్తింపుగా గతేడాది బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 జన్మదిన వేడుకల్లో ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. తాజాగా ఎలిజబెత్‌ కుమార్తె ప్రిన్సెస్‌ అన్నే చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన మోహన్‌.. క్యాజువల్‌ డైనింగ్‌ గ్రూప్‌లో క్రియేటివ్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతరం తన వ్యాపారాలను విక్రయించి స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్నారు.

దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా సానియా మీర్జా

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సానియా మీర్జా తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించనున్నారు. సానియాది మీర్జాపుర్‌లో ఓ కుగ్రామం. నాన్న టీవీ మెకానిక్‌. చిన్నతనం నుంచి ఆమెకు ఫైటర్‌ పైలట్‌ కావాలని కల. తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌ అవని చతుర్వేది ఆమెకు ఆదర్శం. అప్పటికే మన దేశంలో ఎంతో మంది వనితలు యుద్ధ విమానాలతో ఆకాశంలో అవలీలగా విన్యాసాలు చేస్తున్నారు. వీటన్నింటినీ చూసిన సానియా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లాలోని ఓ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత ఎన్డీఏ పరీక్షలకు హాజరై 149వ ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించారు. అలా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌ కానున్న సానియా మీర్జా దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్రకెక్కనున్నారు. 27న పుణెలోని ఎన్డీఏ కంద్వాస్‌లో చేరనున్నారు.

అమెరికా విదేశాంగ శాఖ ఉప కార్యదర్శిగా రిచర్డ్‌ వర్మ

భారత సంతతి న్యాయవాది, మాజీ దౌత్యవేత్త రిచర్డ్‌ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ శాఖలో అత్యున్నత పదవికి నామినేట్‌ చేశారు. భారత్‌లో 2015 - 17 మధ్య అమెరికా దౌత్యవేత్తగా పనిచేసిన వర్మ (54)ను విదేశాంగ శాఖలో డిప్యూటీ కార్యదర్శి (నిర్వహణ, వనరుల విభాగం)గా బైడెన్‌ నామినేట్‌ చేసినట్టు శ్వేతసౌధం ప్రకటన జారీ చేసింది. దీనికి సెనేట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. వర్మ, ఒబామా హయాంలోనూ విదేశాంగ శాఖలో ఉప కార్యదర్శి (న్యాయ వ్యవహారాలు)గా పనిచేశారు.

2500 ఏళ్ల నాటి వ్యాకరణ సమస్యకు పరిష్కారం

క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం (2500 ఏళ్ల) నుంచి అనేక మంది సంస్కృత పండితులకు కొరకరాని కొయ్యగా మారిన ఓ వ్యాకరణ సమస్యను కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న భారత విద్యార్థి రిషి రాజ్‌పోపట్‌ పరిష్కరించాడు. దీనికి సంబంధించిన పరిశోధనా పత్రం ‘ఇన్‌ పాణిని, వియ్‌ ట్రస్ట్‌: డిస్కవరింగ్‌ ది అల్గోరిథమ్‌ ఫర్‌ రూల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ రిజల్యూషన్‌ ఇన్‌ ద అష్టాధ్యాయి’ పేరుతో ప్రచురితమయింది. భాషాశాస్త్ర పితామహుడుగా పేరుగాంచిన పాణిని బోధించిన ఓ నియమానికి పరిష్కారం చూపడం ద్వారా రిషి ఈ ఘనత సాధించాడు. ఈ ఆవిష్కరణ విప్లవాత్మకమని సంస్కృత నిపుణులు భావిస్తున్నారని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పేర్కొంది. ఈ ప్రకారం పాణిని వ్యాకరణాన్ని కూడా కంప్యూటర్‌లో ఉపయోగించవచ్చని తెలిపింది.

ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం కోల్పోయిన మస్క్‌

విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా, స్సేస్‌ ఎక్స్‌ - ట్విటర్‌ అధిపతి సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఆయన నికర సంపద విలువ డిసెంబరు 14న 175.50 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఫ్రెంచ్‌ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ నికర సంపద 190.90 బి.డాలర్లకు చేరడంతో, రియల్‌-టైమ్‌ బిలియనీర్ల జాబితాలో ఆయన అగ్ర స్థానం దక్కించుకున్నారని ఫోర్బ్స్‌ తెలిపింది. 133.70 బి.డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితా మూడో స్థానంలో భారత వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ కొనసాగుతున్నారు.

‘బీబీసీ’ ప్రభావశీల మహిళల్లో నలుగురు భారతీయులు

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళలతో ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ప్రముఖ నటి-నిర్మాత ప్రియాంకా చోప్రా జోనాస్, ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ శిరీష బండ్ల, బుకర్‌ ప్రైజ్‌ విజేత గీతాంజలి శ్రీ, సామాజిక ఉద్యమకారిణి స్నేహ జవాలేలు ఇందులో స్థానం సంపాదించారు. వీరంతా తమ తమ రంగాల్లో స్ఫూర్తిదాయక విజయాలు సాధించినట్లు బీబీసీ తెలిపింది.

వర్సిటీ పాఠ్యాంశంగా ‘బల్దేర్‌ బండి’

పట్టుమని వంద ఇళ్లు కూడా లేని గిరిజన తండా అది. కూరగాయలు పండించి సమీప పట్టణాలకు వెళ్లి అమ్మితేనే అక్కడి వారికి పూట గడిచేది. అలాంటి కుటుంబంలోనే జన్మించిన రమేష్‌ కార్తీక్‌ గిరిజన సాహిత్యంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 24 ఏళ్ల ఈ యువకుడు తన 20వ ఏట రాసిన కవితా సంపుటి ‘బల్దేర్‌ బండి’లోని జారేర్‌బాటి కవితను కాకతీయ విశ్వవిద్యాలయం అటానమస్‌ కళాశాల డిగ్రీ 5వ సెమిస్టర్‌ సిలబస్‌లో రెండేళ్ల కిందటే పెట్టారు. తాజాగా ఈ సంపుటికి మరో గుర్తింపు లభించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో ఎంఏ తెలుగు 4వ సెమిస్టర్‌ సిలబస్‌లో దాన్ని పొందుపరిచారు. రెండో యూనిట్‌లోని మూడో పాఠ్యాంశంగా దీనిని చేర్చినట్లు వర్సిటీ తెలుగు విభాగం అధిపతి జె.అప్పారావు తెలిపారు.

చిత్రలేఖనం నుంచి సాహిత్యం దిశగా:-
రమేష్‌ కార్తీక్‌ది నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్‌ తండా. ఈ కుటుంబానికి తల్లిదండ్రులు చేసే వ్యవసాయమే ఆధారం. పాఠశాల స్థాయి నుంచి చిత్రాలు గీస్తూ, చిత్ర వ్యాఖ్యలు రాసే అలవాటు కాస్తా ఆయనను సాహిత్యం వైపు నడిపించింది. చిన్నతనంలో తాను రాసిన కవితలతో కూడిన సంపుటి 2018 డిసెంబరులో పుస్తకంగా వెలువడింది. గిరిజన సాహిత్యంలో ఈయన రాసిన విషాద గీతం (ఢావ్లో) కథా సంపుటి కూడా గత ఏడాది ఆగస్టులో విడుదలైంది. పేదరికంలో పుట్టిన రమేష్‌ టీటీసీ పూర్తయ్యాక దూరవిద్య ద్వారా బీఏ, ఆంగ్లంలో ఎంఏ కోర్సులు పూర్తిచేశారు. చదువుకునే రోజుల్లో పార్ట్‌టైంగా క్యాటరింగ్‌ పనులకు వెళ్తూ పుస్తకాల ఖర్చులు సంపాదించుకొన్నారు.

బ్రిటన్‌ ఔన్నత్యాన్ని చాటిన జాబితాలో భారతీయ మూలాలున్న వారు 30 మంది

దేశ, విదేశాల్లో విశిష్ట సేవలందించి, బ్రిటన్‌ ఔన్నత్యాన్ని చాటిన ప్రముఖులను రాజు ఛార్లెస్‌-3 కొత్త సంవత్సరం సందర్భంగా సన్మానించనున్నారు. సత్కారం అందుకోనున్న వారిలో 30 మంది భారతీయ మూలాలున్న వారు ఉండడం విశేషం. వాతావరణ మార్పులపై 2021లో గ్లాస్గోలో నిర్వహించిన కాప్‌-26 సదస్సుకు నేతృత్వం వహించిన నాటి బ్రిటన్‌ కేబినెట్‌ మంత్రి ఆలోక్‌ శర్మ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఆయనతో పాటు వ్యాపారం, వాణిజ్యం, వైద్యం, ఫార్మా, విద్యా, పరిశోధన, సాంకేతికత, జీవవైవిధ్యం, సేవా రంగాల్లో తమదైన ముద్రవేసిన పలువురికి ఈ జాబితాలో చోటు లభించింది.

2022 దాతల జాబితాలో బిల్‌గేట్స్‌కు అగ్రస్థానం

సేవా కార్యక్రమాలకు 2022లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మంది వ్యక్తులు లేదా సంస్థల జాబితాలో బిల్‌గేట్స్‌ మొదటి స్థానంలో నిలిచారు. ‘ద క్రానికల్‌ ఆఫ్‌ ఫిలాంత్రపీ’ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ 10 మంది ఇచ్చిన విరాళాల మొత్తం 9.3 బిలియన్‌ డాలర్లు. ఇందులో బిల్‌గేట్స్‌ ఒక్కరే 5 బిలియన్‌ డాలర్‌లను బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌కు విరాళమిచ్చారు. ఆయన ప్రధానంగా ప్రపంచ ఆరోగ్యం, యూఎస్‌ విద్యాభివృద్ధి మొదలైన వాటికి దన్నుగా నిలిచారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడైన జెఫ్‌ బెజోస్‌ తల్లి, అతడి సవతి తండ్రి అయిన జాకీ బెజోస్, మైక్‌ బెజోస్‌లు 710.5 మిలియన్‌ డాలర్లు విరాళం ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈ మొత్తాన్ని వారు క్యాన్సర్‌ ఔషధాల పరిశోధన, క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం కేటాయించారు. 474.3 మిలియన్‌ డాలర్లు దానం చేసి వారెన్‌ బఫెట్‌ తర్వాతి స్థానంలో ఉన్నారు.

బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ విశ్వజీత్‌ భాటియా అరుదైన రికార్డు

దిల్లీలోని గోలాధర్‌ మైదానంలో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అద్వితీయ రికార్డు సృష్టించారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ విశ్వజీత్‌ భాటియా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350 సీసీ మోటార్‌సైకిల్‌ను ఫుట్‌రెస్ట్‌పై నిలబడి నడిపించారు. ఏకంగా 100 కిలోమీటర్ల పాటు ఆగకుండా చక్కర్లు కొట్టారు. మొత్తం 2 గంటల 38 నిమిషాల 23 సెకన్ల పాటు ఈ ఫీట్‌ సాగింది.

అమెరికాలోని లోడీ నగర మేయర్‌గా మైకీ హోథీ ఘనత

భారత సంతతికి చెందిన మైకీ హోథీ అమెరికాలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లోడీ నగర మేయర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నగరానికి తొలి సిక్కు మేయర్‌ ఆయనే. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ నగర మేయర్‌ పీఠాన్ని సిక్కు వ్యక్తి దక్కించుకోవడమూ ఇదే మొదటిసారి. మైకీ తల్లిదండ్రులిద్దరూ పంజాబ్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

బ్యాక్‌ పోల్‌ రైడింగ్‌లో జవాన్‌ ప్రపంచ రికార్డు

బ్యాక్‌ పోల్‌ రైడింగ్‌లో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ మరోసారి ప్రపంచ రికార్డును సృష్టించింది. దిల్లీ ఛావ్లాలోని బీఎస్‌ఎఫ్‌ క్యాంపులో జరిగిన ఈ పోటీల్లో బీఎస్‌ఎఫ్‌ జట్టు కెప్టెన్‌ అవధేశ్‌ కుమార్‌ 174.1 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 26 నిమిషాల్లో పూర్తిచేశారు. అంతకుముందు 128 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 29 నిమిషాల్లో రైడింగ్‌ చేసి భారత సైన్యం రికార్డు సృష్టించింది. ఈ రికార్డును అవధేశ్‌ బద్దలు కొట్టారు. విజయ్‌ దివస్‌ సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ అవధేశ్‌ కుమార్‌ సింగ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350 సీసీ బైక్‌ను దానిపై 12 అడుగుల 10 అంగుళాల స్తంభంపై నిలబడి 5 గంటల 26 నిమిషాల సమయంలో నిరాటంకంగా 174.1 కిలోమీటర్ల దూరం నడిపి ప్రపంచ రికార్డు సృష్టించారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన వీర మోటార్‌ సైకిల్‌ టీమ్‌ పేరిట ఇప్పటి వరకు మొత్తం 20 ప్రపంచ రికార్డులు ఉన్నాయి.

‘గౌరవ ఫెలో’గా న్యాయవాది రవితేజ నియామకం

ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత డైకిన్‌ యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఇంటిలిజెంట్‌ సిస్టమ్స్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ విభాగంలో హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజను మూడేళ్ల పాటు గౌరవ ఫెలోగా నియమించింది. ఈ పోస్టు డిప్యూటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ హోదా కలిగి ఉంటుంది. లా, పబ్లిక్‌ పాలసీ, రాజకీయాలపై విస్తృత అనుభవం వర్సిటీ అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నట్లు డైరెక్టర్‌ (అప్లైడ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌) కోన్‌ మౌజాకీస్‌ పేర్కొన్నారు.

‘మిసెస్‌ వరల్డ్‌’గా 21 ఏళ్ల తర్వాత భారత సంతతి వ్యక్తి సర్గమ్‌ కౌశల్‌

మిసెస్‌ వరల్డ్‌ కిరీటం మన దేశాన్ని వరించి 21 ఏళ్లైంది. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ‘మిసెస్‌ వరల్డ్‌’ పోటీలది. ఇప్పటివరకూ దేశానికి ఆ కిరీటాన్ని తీసుకొచ్చింది డాక్టర్‌ అదితి గోవిత్రికర్‌ మాత్రమే. అదీ 21 ఏళ్ల క్రితం. ఈ ఏడాది ‘మిసెస్‌ ఇండియా వరల్డ్‌’గా నిలిచిన తర్వాత 32 ఏళ్ల సర్గమ్‌ కౌశల్‌ ‘మిసెస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని దేశానికి తేవడమే తన లక్ష్యమంది. అన్నట్టుగానే సాధించిందీ జమ్మూ అమ్మాయి. భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి. ఆయన వృత్తిరీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేసిన ఈమె టీచర్‌గానూ పనిచేసింది. క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో మిసెస్‌ ఇండియా వరల్డ్‌ గెలిచి ప్రపంచ వేదికపై పోటీ పడే అర్హత సాధించింది. అమెరికాలోని వెస్ట్‌గేట్‌ లాస్‌ వెగాస్‌ రిసార్ట్‌ - కాసినోలో పోటీ. 63 దేశాలకు చెందిన సౌందర్యరాశులు పాల్గొంటే వారందరినీ వెనక్కి నెట్టి మన సర్గమ్‌ కిరీటాన్ని దక్కించుకుంది. పాలినేసియా, కెనడా దేశాల భామలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

4,200 అడుగుల ఎత్తులో కవితా పఠనంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

ఓ వ్యక్తి ఆకాశంలో 4,200 అడుగుల ఎత్తులో 40 కవితలను చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. మధ్యప్రదేశ్‌ భోపాల్‌కు చెందిన అటల్‌ కశ్యప్‌ సిక్కింలో ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. గత ఏడు సంవత్సరాలుగా కవితలు రాసి ప్రచురిస్తున్నాడు. తాజాగా 40 కవితలతో తన ఏడో కవితా సంకలనాన్ని ప్రచురించాడు. దానికి ‘బాతేన్‌ హమారీ తుమ్హారీ’ అని పేరు పెట్టాడు. అందరూ కవితలు భూమిపై ఉండి పాడతారు. కానీ దానికి భిన్నంగా చేయాలని ఆకాశాన్ని ఎంచుకున్నాడు. పారాగ్లైడింగ్‌ ఇందుకు సరైన మార్గం అని నిర్ణయించుకున్నాడు. అనంతరం టేకాఫ్, ల్యాండింగ్‌తో కలిపి 40 నిమిషాల్లో 4200 అడుగుల ఎత్తులో 40 కవితలను పూర్తి చేశాడు.

భూమ్మీద అత్యంత పురాతన శునకంగా గిన్నిస్‌ రికార్డు

అలెక్స్‌ వూల్ఫ్‌ (40) అనే వ్యక్తి పెంచుకుంటున్న శునకానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరం సెప్టెంబరు 24న పుట్టిన ఈ శునకరాజం ‘భూమీ మీద ఉన్న అత్యంత పురాతన కుక్క’గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు గుర్తింపు పొందింది. కొలరాడో విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో అలెక్స్‌ ఇద్దరు సహచర విద్యార్థులతో కలిసి గదిలో ఉండేవాడు. ఓ కుక్కను పెంచుకుంటే కాలక్షేపంగా ఉంటుందని అతనికి తోచింది. అనిమల్‌ షెల్టర్‌ సొసైటీలో ఉన్న చివావా మిశ్రమ జాతి కుక్క ‘జినొ’ (అప్పటికి రెండేళ్లు) అలెక్స్‌ దృష్టిని ఆకర్షించింది. చదువు పూర్తయ్యాక అలెక్స్‌ ‘జినొ’తో పాటు తన తల్లిదండ్రులు ఉంటున్న లాస్‌ ఏంజెలెస్‌కు వచ్చేశాడు. గత అక్టోబరులో అప్పటికి 22 ఏళ్ల 76 రోజుల వయసున్న జినొను గిన్నిస్‌ రికార్డు వరించింది. మొదట్లో ఉత్సాహంగా అందరితో కలిసి వ్యాహ్యాళికి వెళుతూ వచ్చిన జినొ ఇపుడు వయసు మీదపడటంతో ఇంటి పట్టునే ఉంటోందని అలెక్స్‌ తెలిపారు.

అమెరికా ఫెడ్‌ ఉపాధ్యక్షురాలిగా సుస్మితా శుక్లా

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు ఉపాధ్యక్షురాలిగా తొలిసారి భారత సంతతికి చెందిన సుస్మితా శుక్లా నియమితులయ్యారు. సహ కార్యనిర్వాహక అధికారిణిగానూ ఆమెను బ్యాంకు బోర్డు నియమించింది. 2023 మార్చిలో శుక్లా పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందిన శుక్లా, న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

అంతర్జాతీయ సదస్సుకు ఆద్య కళాబృందం

వందల ఏళ్లుగా నిరాదరణకు గురవుతున్న చరిత్ర తాలూకు పురాతన ఆనవాళ్లను ఆద్య కళ ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన ఆచార్య జయధీర్‌ తిరుమలరావు, ఆచార్య గూడూరు మనోజకు అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు హాజరవ్వాలని ఈ ఆద్య కళాబృందానికి ఆహ్వానం అందింది. డిసెంబరు 13 నుంచి 16వ తేదీ వరకు జరిగే సదస్సులో తాము పాల్గొననున్నట్లు జయధీర్‌ తిరుమలరావు తెలిపారు. ఇండో-యూరోపియన్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో ఫ్రాన్స్‌లో ‘నాంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌’ వేదికగా ‘భారత్‌-ఆఫ్రికా మానవీయ శాస్త్రాల సంభాషణ’ అంశంపై ఈ సదస్సు జరగనుంది. ఆద్య కళ బృంద పరిశోధన కృషి, కళాఖండాల చారిత్రక విశేషాలు, ప్రదర్శనశాల ఏర్పాటు అంశాలపై జయధీర్‌ తిరుమలరావు పత్రసమర్పణ చేయనున్నారు. భారతీయ, తెలంగాణ, ఆదివాసీ, గిరిజన జానపద, సంచార సమూహాల సంగీతవాద్యాలు, లోహ కళలు రాత ప్రతులు, పనిముట్లు తదితర విశేషాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించనున్నట్లు ఆద్య కళ సమన్వయకర్త, పాలమూరు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు గూడూరు మనోజ తెలిపారు. అంతకుముందు డిసెంబరు 6న పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సాంస్కృతిక రాయబారి వి.శర్మతో వారు సమావేశం కానున్నారు.