నవరస నట శిఖరం కైకాల మరణం

అరవయ్యేళ్ల నట ప్రయాణం.. 870కి పైగా సినిమాలు.. నిలువెత్తు రూపంతో గంభీరమైన వాచకాభినయాలతో నవరసాలు పలికించిన తెలుగుతెర దిగ్గజం.. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన విశిష్ట నటుడు కైకాల సత్యనారాయణ (87) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని స్వగృహంలో మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు 1935 జులై 25న సత్యనారాయణ జన్మించారు.

1994లో ‘బంగారు కుటుంబం’ చిత్ర నిర్మాతగా కైకాల నంది పురస్కారం అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

‘కళాప్రపూర్ణ’, ‘నవరస నటనా సార్వభౌమ’ లాంటి బిరుదుల్ని పొందారు. 2011లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది.

1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై మూడేళ్లు పనిచేశారు.


గౌరవ పోప్‌ బెనెడిక్ట్‌ మరణం

-పోప్‌ ఎమిరిటస్‌ (గౌరవ పోప్‌) బెనెడిక్ట్‌ (95) మరణించారు. ప్రపంచంలోని 120 కోట్లమంది కేథలిక్కులకు సారథ్యం వహించడానికి కావాల్సిన శక్తి తనలో క్షీణించిందంటూ 2013 ఫిబ్రవరి 11న పోప్‌ పదవికి రాజీనామా చేసి ప్రపంచాన్ని ఆయన నివ్వెరపరచారు. ఒక పోప్‌ తన పదవికి రాజీనామా చేయడం 600 ఏళ్ల తరవాత అదే ప్రథమం. బెనెడిక్ట్‌ తరవాత పోప్‌గా పగ్గాలు చేపట్టిన ఫ్రాన్సిస్‌ ఆయన గౌరవ పోప్‌గా కొనసాగడానికీ, వాటికన్‌లోనే నివసించడానికీ ఏర్పాటు చేశారు. బెనెడిక్ట్‌ అంత్యక్రియల సందర్భంగా సెయింట్‌ ఫ్రాన్సిస్‌ చౌకీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రార్థన చేస్తారు. మాజీ పోప్‌ కోసం ఒక పోప్‌ ఇలా ప్రార్థనలు నిర్వహించడం ఇదే తొలిసారి.

- జర్మనీలోని బవేరియాలో పుట్టిన పోప్‌ బెనెడిక్ట్‌ అసలు పేరు జోసెఫ్‌ రాట్జింగర్‌. 78 ఏళ్ల వయసులో ఆయన మతపరమైన కార్డినల్‌ పదవికి రాజీనామా చేసి తన జీవితంలో చివరి భాగాన్ని స్వస్థలమైన బవేరియాలో ప్రశాంతంగా గడపాలనుకున్నారు. కానీ అప్పటి పోప్, రెండవ జాన్‌ పాల్‌ 2005లో అస్తమించడంతో పోప్‌ పదవిని బెనెడిక్ట్‌ చేపట్టాల్సి వచ్చింది. అమెరికాపై ఉగ్రదాడి తర్వాత అయిదేళ్లకు ఒక ప్రసంగంలో బెనెడిక్ట్‌ ముస్లింల పట్ల ప్రతికూల వ్యాఖ్యలు చేశారు.


సాకర్‌ దిగ్గజం పీలే మరణం

-ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన పీలే కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సావోపాలోలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రిలో మరణించారు. బ్రెజిల్‌కు చెందిన పీలే వయసు 82 ఏళ్లు. ఫుట్‌బాల్‌లో మూడు ప్రపంచకప్‌ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు పీలేనే. తన తరంలోనే కాక మొత్తంగా ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

- పీలే నాలుగు ప్రపంచకప్‌ల్లో బ్రెజిల్‌ దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లు అందుకున్నాడు. ఫార్వర్డ్‌గా, అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌గా మైదానంలో అతని విన్యాసాలు అసాధారణం.1970 ప్రపంచకప్‌లో రొమేనియాతో పోరులో దాదాపు 25 గజాల దూరం నుంచి ఫ్రీకిక్‌ను డిఫెండర్ల మధ్యలో నుంచి గోల్‌పోస్టులోకి అతను పంపించిన తీరు అమోఘం. 1958 ప్రపంచకప్‌ ఫైనల్లో స్వీడన్‌పై పెనాల్టీ ప్రదేశంలో సహచర ఆటగాడి నుంచి బంతి అందుకున్న అతను, ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి, గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించిన వైనం అసాధారణం. గోల్‌కీపర్‌ డైవ్‌ చేసినా ఆ బంతిని ఆపలేకపోయాడు. ఇలాంటి గోల్స్‌ మరెన్నో. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగా బ్రెజిల్‌ ఓ వెలుగు వెలిగిందంటే అందుకు ప్రధాన కారణం పీలే. 1958 ప్రపంచకప్‌లో మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా రాణించి ఉత్తమ యువ ఆటగాడి అవార్డు అందుకున్నాడు. 1962, 1966 ప్రపంచకప్‌లో గాయం కారణంగా ప్రభావం చూపలేకపోయాడు. 1966లో జట్టు నిరాశాజనక ప్రదర్శనతో అతను ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. కానీ మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి సొంతం చేసుకున్నాడు. 1971 జులైలో యుగోస్లేవియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ప్రపంచకప్‌ల్లో 14 మ్యాచ్‌ల్లో 12 గోల్స్‌ సాధించాడు.


పద్మశ్రీ పురస్కార గ్రహీత విజయసారథి మరణం

సంస్కృత పండితులు, పద్మశ్రీ పురస్కారగ్రహీత శ్రీభాష్యం విజయసారథి (91) కరీంనగర్‌లోని స్వగృహంలో మరణించారు. శ్రీభాష్యం విజయసారథి కరీంనగర్‌ మండలం చేగుర్తి గ్రామంలో శ్రీభాష్యం నరసింహాచార్యులు, గోపమాంబ దంపతులకు జన్మించారు. పాలకుర్తి సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన విజయసారథి సంస్కృత భాషతో పాటు వేదాధ్యయనం చేశారు. 16వ ఏటనే శారదా పదకింకిణి, విషాదలహరి, శబరీ పరిదేవనమ్‌ వంటి ఖండ కావ్యాలు రాశారు. అనంతరం వరంగల్‌లోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో చదివిన ఆయన అక్కడే అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా 36 సంవత్సరాలు పనిచేశారు. ఉద్యోగ విరమణ తరవాత కరీంనగర్‌లో స్థిరపడిన విజయసారథి కరీంనగర్‌ బొమ్మకల్‌ రోడ్డులో యజ్ఞవరాహ క్షేత్రాన్ని నిర్మించి వేదాల్లోని మౌలిక జ్ఞానంపై సదస్సులు, పండిత సత్కారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సంస్కృతంలో మందాకిని, రాసకేళి, భారత భారతి, క్రాంతి గీతమ్, సంగీత మాధవమ్, రోచిష్మతి తదితర గ్రంథాలు రాశారు. భారత ప్రభుత్వం ఆయనకు 2019లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. కరోనా కారణంగా ఈ అవార్డును 2021 నవంబరు 8న అందుకున్నారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ‘మహామహోపాధ్యాయ’ పురస్కారంతో సత్కరించింది. బిర్లా ఫౌండేషన్‌ ‘వాచస్పతి’ పురస్కారాన్నివ్వగా, తెలంగాణ ప్రభుత్వం 2017లో ‘విశిష్ట సాహితీమూర్తి’ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. దీంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘ప్రతిభా’ పురస్కారం అందుకున్నారు. అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్‌ 2021 ఏప్రిల్‌లో ‘ప్రతిభామూర్తి జీవితకాల సాధన’ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. బాసర సరస్వతి ఆలయం, వరంగల్‌ భద్రకాళీ ఆలయం, ఇల్లందకుంట రామాలయం, హైదరాబాద్‌ చిలుకూరు బాలాజీ అలయంలో శ్రీభాష్యం రాసిన సుప్రభాతాలు వినిపిస్తాయి.

కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి మరణం

కాళ్లతోనే కవితలు రాసి ఎన్నో ప్రశంసలు అందుకున్న సిరిసిల్ల రాజేశ్వరి (44) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇంటర్మీడియట్‌ చదివిన ఆమె ఓ టీవీ కార్యక్రమంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ మాటలు విని, ఆ ప్రభావంతో కాళ్లతోనే కవితలు రాయడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఆమె మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దాశరథి, నేత కార్మికులు, కరోనా, వరకట్న వేధింపులపై కవితలు రాసి కవిత్వానికి వైకల్యం అడ్డురాదని నిరూపించారు. ఆమె సాహిత్యం, కృషిని మెచ్చిన సుద్దాల అశోక్‌ తేజ సిరిసిల్ల రాజేశ్వరి అని పేరు పెట్టారు. ఆమె కవితలతో ఒక పుస్తకాన్ని అచ్చువేయించారు. ఆయన చొరవతోనే మహారాష్ట్ర ప్రభుత్వం రాజేశ్వరి జీవిత చరిత్రను తెలుగు పాఠ్య పుస్తకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చి గుర్తింపునిచ్చింది.

సీనియర్‌ నటుడు చలపతిరావు మరణం

సీనియర్‌ నటుడు, నిర్మాత చలపతిరావు (78) హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా 1500కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, బాలకృష్ణ సహా పలువురు కథానాయకులతో సినిమాలు కూడా నిర్మించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికుడు రావూరి అర్జునరావు మరణం

స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికుడు, సంఘ సంస్కర్త, గోరా పెద్దల్లుడు రావూరి అర్జునరావు (105) అనారోగ్యంతో హైదరాబాద్‌లో మరణించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాములలో 1917లో రావూరి గరటయ్య, వెంకాయమ్మ దంపతులకు అర్జునరావు జన్మించారు. మహాత్మాగాంధీ, గోరా సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వాతంత్య్ర ఉద్యమంలోకి ప్రవేశించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, జైలు జీవితం గడిపారు. కుల, మతరహిత వివాహం చేసుకోవాలన్న మహాత్మాగాంధీ పిలుపుతో గోరా పెద్దకుమార్తె మనోరమను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1948 మార్చి 13న ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలో గాంధీ సేవాగ్రామంలో పెళ్లి జరిగింది. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు అనేక సాంఘిక ఉద్యమాల్లోనూ గోరాతో కలిసి అర్జునరావు పనిచేశారు. సామాజిక పరివర్తనకు, అంటరానితనం, అసమానతల నిర్మూలనకు కృషి చేశారు. 2018లో వానపాములలో ‘మార్పు’ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి అప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రముఖ నవలా రచయిత చావా శివకోటి మరణం

సుప్రసిద్ధ నవలా రచయిత, ఖమ్మం నగరానికి చెందిన చావా శివకోటి (82) అనారోగ్యంతో మరణించారు. ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో 1940 డిసెంబరు 14న జన్మించిన ఆయన ఖమ్మం మామిళ్లగూడెంలో స్థిరపడ్డారు. శివకోటి తన సాహితీ జీవితంలో 27 నవలలు, 120కి పైగా కథలు రాయగా, పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 82 ఏళ్ల వయసులోనూ ‘అనుబంధ బంధాలు’, ‘గతించిన గతం’ నవలలను విడుదల చేశారు. సంచిక అనే పత్రికలో నేటికీ ఆయన నవల సీరియల్‌గా ప్రచురితమవుతోంది. ‘సాహితీ-హారతి’ పేరుతో మిత్రుడు డాక్టర్‌ హరీశ్‌తో కలిసి సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసి ఎందరో సాహితీవేత్తలను సత్కరించారు. యువ రచయితలను ప్రోత్సహించారు. రావిశాస్త్రి, రచన మాస పత్రిక విశిష్టకథా పురస్కారం, త్రిపురనేని గోపీచంద్‌ స్మారక పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. శివకోటి నవలలపై మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు శీలం ఇందిర పరిశోధన చేసి కృష్ణా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందారు.

బోర్డర్‌ వీరుడు భైరాన్‌సింగ్‌ మరణం

సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్‌) చెందిన విశ్రాంత సైనికుడు, 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో లోంగెవాలా పోస్ట్‌ వద్ద శత్రుసేనలతో పోరాడిన భైరాన్‌సింగ్‌ రాఠోడ్‌ (81) రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మరణించారు. ఈ పోరాటానికి సంబంధించి ‘బోర్డర్‌’ పేరుతో 1997లో బాలీవుడ్‌లో చిత్రం సైతం విడుదలైంది. జోధ్‌పుర్‌కు 120కి.మీ. దూరంలోని సోలాంకియాటాలా గ్రామంలో భైరాన్‌సింగ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. యుద్ధంలో చూపిన ధైర్య సాహసాలకు భైరాన్‌సింగ్‌కు 1972లో సేనా పతకం లభించింది. 1987లో ఆయన ఉద్యోగ విరమణ పొందారు.

ఫిలిప్పీన్స్‌ గెరిల్లా యోధుడు సిసోన్‌ మరణం

ఫిలిప్పీన్స్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు హోసె మరియా సిసోన్‌ (83) నెదర్లాండ్స్‌లోని ఒక ఆస్పత్రిలో మరణించారు. 1986లో సిసోన్‌ నాయకత్వంలో జరిగిన ప్రజా తిరుగుబాటు ప్రస్తుత దేశాధ్యక్షుడు మార్కోస్‌ తండ్రి ఫెర్డినాండ్‌ మార్కోస్‌ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. ఫెర్డినాండ్‌ తరవాత అధ్యక్ష పదవి చేపట్టిన కొరజాన్‌ అకీనో జైలు నుంచి సిసోన్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన స్వచ్ఛందంగా నెదర్లాండ్స్‌కు వెళ్లి ప్రవాస జీవితం గడుపుతున్నారు. 1969లో సిసోన్‌ కమ్యూనిస్టు పార్టీకి సాయుధ విభాగంగా 60 మంది మావోయిస్టు గెరిల్లాలతో న్యూ పీపుల్స్‌ ఆర్మీని ప్రారంభించారు. తర్వాత అది 25,000 మంది సభ్యుల దళంగా ఎదిగింది. ఈ సంస్థ చేపట్టిన సాయుధ తిరుగుబాటులో 40,000మంది గెరిల్లాలు, భద్రతా సిబ్బంది, పౌరులు మరణించారు. వేలాదిమంది మరణాలకు కారకుడైన సిసోన్‌ మరణంతో ఆయన్ను దేశ చట్టాల ప్రకారం శిక్షించే అవకాశం లేకుండా పోయిందని ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖ వ్యాఖ్యానించింది. సిసోన్‌ పూర్వాశ్రమంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

సుప్రసిద్ధ వయొలిన్‌ కళాకారిణి ద్వారం మంగతాయారు మరణం

సుప్రసిద్ధ వాయులీన కళాకారిణి ద్వారం మంగతాయారు (92) వయోభారం కారణంతో చెన్నైలో మరణించారు. ఆమె ప్రముఖ వయొలినిస్ట్‌ ద్వారం వెంకటస్వామినాయుడు కుమార్తె. ఆమె విజయనగరంలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం అక్కడి మహారాజా ప్రభుత్వ సంగీత, న్యత్య కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. ఇక్కడి ఆలిండియా రేడియోలో ఎన్నో ఏళ్ల పాటు విశేష సేవలందించారు. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, డీకే పట్టమ్మాళ్‌ వంటి హేమాహేమీల కచేరీలకు కూడా వాద్య సహకారం అందించారు. చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో ప్రొఫెసర్‌గా అద్వితీయమైన సేవలందించారు. అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లి ప్రముఖ సంగీత కళాశాలల్లో శిక్షణ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’ సహా అనేక సంస్థల నుంచి పురస్కారాలను అందుకున్నారు. అలనాటి ప్రముఖ సంగీత కళాకారులు టీఆర్‌ మహాలింగం, ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మిలతో ఆల్బంలు రూపొందించారు.

శ్రీ శారదా మఠ్, రామకృష్ణ శారద మిషన్‌ అధ్యక్షురాలి మరణం

శ్రీ శారదా మఠ్, రామకృష్ణ శారద మిషన్‌ అధ్యక్షురాలు ప్రవ్‌రాజికా భక్తిప్రాణ (102) వృద్ధాప్య సమస్యలతో కోల్‌కతాలో మరణించారు. ప్రవ్‌రాజికా అసలు పేరు కల్యాణి బెనర్జీ. 1920లో జన్మించిన ఆమె విద్యాభ్యాసం అనంతరం మఠ సంస్థలలోనే నర్సుగా పనిచేశారు. 1959లో సన్యాసం స్వీకరించి, శ్రీ శారదా మఠ్, రామకృష్ణ శారద మిషన్‌కు 1998లో ఉపాధ్యక్షురాలిగా, 2009లో అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.

కేంద్ర మాజీ మంత్రి వై.కె.అలగ్‌ మరణం

ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ సహాయ మంత్రి యోగీందర్‌ కె.అలగ్‌ (83) మరణించారు. ప్రస్తుత పాకిస్థాన్‌లోని చక్వాల్‌లో 1939లో జన్మించిన వై.కె.అలగ్, రాజస్థాన్‌ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పొందారు. 1996లో గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996 నుంచి 1998 వరకు కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ, శాస్త్రసాంకేతిక, విద్యుత్తు శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.