జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా హన్స్‌రాజ్
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మహారాష్ట్రకు చెందిన భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ (68) బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని చంద్రాపుర్ లోక్‌సభ స్థానం నుంచి 1996లో ఒకసారి, మళ్లీ 2004 నుంచి 2019 వరకు ఈయన ప్రాతినిధ్యం వహించారు.
జాతీయ జీవవైవిధ్య మండలి ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ
జాతీయ జీవవైవిధ్య మండలి (ఎన్‌బీఏ) ఛైర్మన్‌గా సి.అచలేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 1986 భారత అటవీ సర్వీసుల (ఐఎఫ్‌ఎస్) బ్యాచ్‌కు చెందిన ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అచలేందర్‌రెడ్డి స్వస్థలం జనగామ.
దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్‌లో ప్రారంభం
దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. అశోక్ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్ ఏటీఎం ఒక ఉదాహరణని ఆమె అభివర్ణించారు. ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ తెలిపారు. బంగారు నాణేలతో పాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలూ జారీ అవుతాయని వెల్లడించారు. అలాగే బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయని వెల్లడించారు.
దేశంలో మొదటి ప్రైవేటు ప్రయోగ వేదిక
దేశంలో మొదటగా ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్లను నింగిలోకి పంపేందుకు ప్రయోగ వేదికను సిద్ధం చేశారు. దీనికి అనుబంధంగా మిషన్ కంట్రోల్ సెంటర్ (ఎంసీసీ)ను నెలకొల్పారు. త్వరలో రాకెట్ ప్రయోగానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఇప్పటికే 3 ప్రయోగ వేదికలు ఉన్నాయి. వీటి నుంచి తరచూ రాకెట్ ప్రయోగాలను ఇస్రో చేపడుతోంది. సమీపంలోనే ప్రైవేటు లాంచ్ వెహికల్ కోసం తొలి ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని చెన్నైకు చెందిన అగ్నికుల్ స్టార్టప్ ఏర్పాటు చేయగా ఇస్రో, ఇన్‌స్పేస్‌లు ప్రోత్సాహం అందించాయి.
‣ ఐఐటీ మద్రాస్‌కు చెందిన శ్రీనాథ్ రవిచంద్రన్, మొయిన్ ఎస్‌పీఎం, ప్రొఫెసర్ ఆర్.చక్రవర్తిల ఆధ్వర్యంలో 2017లో ‘అగ్నికుల్’ పేరుతో స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు. సంస్థ సీఈవోగా శ్రీనాథ్ రవిచంద్రన్ వ్యవహరిస్తున్నారు. 2020 డిసెంబరులో ఇస్రోతో ఒప్పందం చేసుకోవడంతో ప్రయోగ వేదికలను నిర్మించడానికి నైపుణ్యం, వసతులను వాడుకోవడానికి అగ్నికుల్‌కు అనుమతి మంజూరు చేశారు. ఈ సంస్థ ఉపయోగించే అగ్నిబాన్ రాకెట్ రెండు దశల ప్రయోగ వాహనం. 700 కి.మీ. ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలకు వంద కిలోల పేలోడ్‌ను తీసుకెళ్తుంది. ఇందులోని అగ్నిలెట్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి సింగిల్-పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్. దీనిని దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు.
ఈ-సంజీవనిలో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్
ఈ-సంజీవనిని (ఉచిత టెలిమెడిసిన్ సర్వీస్) దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 కోట్ల మంది వినియోగించుకోగా 2.82 కోట్ల కాలర్లతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఏపీ తర్వాత స్థానాల్లో వరుసగా పశ్చిమ బెంగాల్ (1 కోటి), కర్ణాటక (94.46 లక్షలు), తమిళనాడు (87.23 లక్షలు), మహారాష్ట్ర (40.70 లక్షలు), ఉత్తరప్రదేశ్ (37.63 లక్షలు), మధ్యప్రదేశ్ (32.83 లక్షలు), బిహార్ (26.24 లక్షలు), తెలంగాణ (24.52 లక్షలు), గుజరాత్ (16.73 లక్షలు) ఉన్నాయని పేర్కొంది.
నేవీలోకి అధునాతన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ మోర్ముగావ్’
భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ మోర్ముగావ్’ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐఎన్‌ఎస్ మోర్ముగావ్‌ను భారత్‌లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా అభివర్ణించారు. హిందు మహాసముద్ర ప్రాంతంలో భారత ప్రయోజనాలను మన నౌకాదళం విజయవంతంగా పరిరక్షిస్తోందని తెలిపారు.
యుద్ధనౌక విశేషాలివే..
‣ ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ పొడవు 163 మీటర్లు కాగా, వెడల్పు 17 మీటర్లు. బరువు 7400 టన్నులు. గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట దీనికి నామకరణం చేశారు. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు.
‣ భారత నౌకాదళం ‘వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ రూపొందించిన నాలుగు ‘విశాఖపట్నం’ తరగతి డిస్ట్రాయర్ యుద్ధనౌకల్లో ఇది రెండోది. దీన్ని ముంబయిలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ నిర్మించింది.
‣ నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్‌లతో నడిచే ఈ యుద్ధనౌక గంటకు 30 నాట్‌లకు పైగా వేగాన్ని అందుకోగలదు.
‣ ఐఎన్‌ఎస్ మోర్ముగావ్‌లో అధునాతన ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి, ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులు ప్రయోగించవచ్చు.
‣ పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తి పొంది 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 19న ఈ యుద్ధనౌక మొదటిసారి సముద్ర పరీక్షలకు బయలుదేరింది.
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణం
పర్వతప్రాంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్, ఉపముఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య మూడుకు చేరింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో హస్తం పార్ట్లీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం
భాజపా నేత భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పదవీ బాధ్యతలు ఆయన చేపట్టడం వరసగా ఇది రెండోసారి. భూపేంద్రతో పాటు 16 మంది మంత్రులు కూడా ప్రమాణం స్వీకరించారు.
తాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు
దేశంలో పేరుగాంచిన తాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పంటల పరంగా మొదట జీఐ పొందింది తాండూరు కంది పప్పే. ఉద్యాన పంటల పరంగా ఆంధ్రప్రదేశ్‌లోని బనగానపల్లె మామిడికి ఈ గుర్తింపు ఉంది.
‣ దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కందులను సాగు చేసి పప్పుగా మారుస్తున్నా తాండూరు కంది పప్పును పోలిన రుచి, వాసన ఉండదు. ఇక్కడి నేలల స్వభావంతో పండించే కందులు నాణ్యంగా ఉండడడమే కాకుండా పప్పు కూడా అలాగే ఉంటుంది. పోషకాలూ ఎక్కువే. దీనికి భౌగోళిక గుర్తింపు సాధించడంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల ఆదేశాలతో తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు. 2019 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. వరంగల్, మహబూబ్‌నగర్, పాలెం రకాలతో పోలిస్తే తాండూరు రకం ప్రత్యేకతల గురించి నివేదిక పంపారు.
తమిళనాడు క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉదయనిధి బాధ్యతల స్వీకరణ
తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, చెన్నైలోని చేపాక్ - ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గిండీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రవి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. సచివాలయంలో ఆయనకు కేటాయించిన ఛాంబర్‌లో 3 దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉదయనిధి రాకతో మంత్రుల సంఖ్య 35కు చేరింది. ఆయనకు కేటాయించిన శాఖలకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను కార్యదర్శులుగా ప్రభుత్వం నియమించింది.
చర్మ క్యాన్సర్‌కు మొడెర్నా వ్యాక్సిన్
చర్మ క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు జరుగుతున్న పరిశోధనల్లో ఫార్మాస్యూటికల్ దిగ్గజం మొడెర్నా కీలక పురోగతి సాధించింది. క్లినికల్ ట్రయల్స్‌లో తమ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలు సాధించినట్లు వెల్లడించింది. ఈ ట్రయల్స్ కోసం మొడెర్నా, మెర్క్ సంస్థలు జట్టుకట్టాయి. చర్మ క్యాన్సర్ నుంచి బయటపడిన వారిని ఈ ట్రయల్స్‌కు ఎంచుకున్నారు. వారికి మొడెర్నా వ్యాక్సిన్‌ను ఇస్తూ మెర్క్ సంస్థకు చెందిన కీట్రూడా ఔషధాన్నీ అందించారు. దీని ద్వారా వారు తిరిగి క్యాన్సర్ బారిన పడకుండా చేయగలిగారు. అంతే కాకుండా మరణించే ప్రమాదాన్ని తగ్గించారు. మరో సంవత్సరం పాటు ఈ ట్రయల్స్ కొనసాగుతాయని, అలాగే 3వ దశ ట్రయల్స్‌నూ త్వరలోనే ప్రారంభిస్తామని ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తాతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. ఆయన రాకతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జస్టిస్ దత్తా ఇన్నాళ్లూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు.
శిలాజేతర ఇంధనాల వాడుక బిల్లుకు పార్లమెంటు ఆమోదం
ఇథనాల్, బయోమాస్, గ్రీన్ హైడ్రోజన్ వంటి శిలాజేతర ఇంధనాల వాడుకను తప్పనిసరి చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. కార్బన్ క్రెడిట్ల వాణిజ్యానికీ దీనిలో వీలు కల్పించారు. ‘ఇంధన పరిరక్షణ సవరణ బిల్లు-2022’కు ఆగస్టులోనే లోక్‌సభ ఆమోదం తెలపగా, రాజ్యసభ డిసెంబరు 12న ఆమోదించింది. ఇంధన వినియోగ నిబంధనలకు కట్టుబడని పరిశ్రమలు, నౌకలు, తయారీదారులకు జరిమానాలు విధించడానికి ఇకపై వీలుంటుంది. కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసే లక్ష్యాలను చేరుకోవడంలో ఈ బిల్లు దోహదకారిగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
తలసరి ఆదాయంలో రెండో స్థానంలో తెలంగాణ
తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది. తొలి స్థానంలో కర్ణాటక నిలవగా, తెలంగాణ రెండో స్థానం పొందింది. పుదుచ్చేరి వంటి చిన్న రాష్ట్రంతో పోల్చినా ఏపీ అట్టడుగునే ఉంది. ఏపీలో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేశామని, ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ప్రజల తలసరి ఆదాయంలో పెరుగుదల అంతంతమాత్రమే. 2021 - 22 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం (2011 - 12 స్థిర ధరల ప్రకారం) రూ.1,26,587 చొప్పున ఉందని ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
వన్యప్రాణుల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
రక్షిత ప్రాంతాలను మెరుగ్గా నిర్వహించడం, పశువులను మేపడం, తరలించడం తదితర కొన్ని కార్యకలాపాలను అనుమతించే లక్ష్యంతో రూపొందించిన వన్యప్రాణుల (సంరక్షణ) సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు మూజువాణి ఓటుతో అంగీకారం తెలిపారు. ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
‣ శిలాజేతర ఇంధనాలను ప్రోత్సహించే ఇంధన పరిరక్షణ (సవరణ) బిల్లు - 2022ను కూడా గురువారం కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందింది. వాతావరణ మార్పులపై భారత్ కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఈ బిల్లులో సవరణలు చేశారు.
గిన్నిస్ రికార్డు సాధించిన నాగ్‌పుర్ మెట్రో
మహారాష్ట్రలోని నాగ్‌పుర్ మెట్రో గిన్నిస్ రికార్డు సాధించింది. ఇక్కడి 3.14 కిలోమీటర్ల డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఇది వార్ధా రోడ్ ప్రాంతంలో ఉంది. ఈ డబుల్ డెకర్ వయాడక్ట్ ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా గుర్తింపు పొందింది. దీని పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో హైవే ఫ్లైఓవర్ ఉన్నాయని మహా మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు.
బల్క్ ఉత్పత్తికి సాంకేతికత, డ్రాయింగ్స్‌ను ఏజెన్సీకి బదలాయించిన డీఆర్‌డీవో
పెద్దఎత్తున ఆకాశ్ క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) క్షిపణికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, డ్రాయింగ్స్, ఇతర సమాచారాన్ని మిసైల్ సిస్టమ్స్ క్వాలిటీ అష్యూరెన్స్ ఏజెన్సీకి బదలాయించింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (డీఆర్‌డీఎల్)లో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీవో ఛైర్మన్ సమీర్ వి.కామత్, డైరెక్టర్ జనరల్ (మిసైల్స్, వ్యూహత్మక వ్యవస్థలు) నారాయణమూర్తి, డీఆర్‌డీఎల్ డైరెక్టర్ జి.ఏ.శ్రీనివాసమూర్తి చేతుల మీదుగా సాంకేతికతను ఏజెన్సీకి అందజేశారు. భారత సైన్యం కోసం ఆకాశ్ క్షిపణులను డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. డీఆర్‌డీఎల్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మొదటి స్వదేశీ అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఆకాశ్. భారత సైన్యం అమ్ములపొదిలో చేరి దశాబ్దకాలంగా భారత గగనతల రక్షణ వ్యవస్థలో కీలకంగా మారింది. దీనికి భారత సైన్యం, వాయుసేన నుంచి రూ.30 వేల కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. స్వదేశీ క్షిపణి వ్యవస్థ కోసం ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఆర్డర్ కావడం విశేషం. తాజాగా సాంకేతికత బదలాయింపుతో పెద్దసంఖ్యలో ఉత్పత్తికి అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, బీడీఎల్‌తో పాటు పలు మరిన్ని సంస్థలు క్షిపణి అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. ఆకాశ్ క్షిపణికి సంబంధించి అథారిటీ హోల్డింగ్ సీల్డ్ పర్టిక్యులర్స్ (ఏహెచ్‌ఎస్‌పీ)ను భారత సైన్యానికి బదిలీ చేయడాన్ని కీలక మైలురాయిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభివర్ణించారు.
కర్బన తటస్థీకరణ సాధించిన కేరళ విత్తన ఉత్పత్తి పొలం
కర్బన ఉద్గారాల వెల్లువతో పర్యావరణంలో చోటు చేసుకుంటున్న ప్రతికూల మార్పులు మానవాళికి పెనుశాపంగా మారుతున్నాయి. భవిష్యత్తు తరం మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి బెడదను తీర్చేలా సరికొత్త సాగు విధానాన్ని ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది కేరళ విత్తన అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఈ సంస్థ పరిధిలో సాగవుతున్న ఓ పొలంలో ప్రస్తుతం కర్బన ఉద్గారాల తటస్థీకరణ జరుగుతోంది. దేశంలోకెల్లా ఈ ఘనతను అందుకున్న తొలి పొలం ఇదే. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిసెంబరు 10న ఈ మేరకు ప్రకటన చేయనున్నారు.
ఎక్కడుందీ పొలం?
ఎర్నాకుళం జిల్లాలోని అలువాలో కేరళ రాష్ట్ర విత్తన తయారీ పొలం (కేఎస్‌ఎస్‌ఎఫ్) ఉంది. విస్తీర్ణం 14 ఎకరాలు. నిజానికి వ్యవసాయ శిక్షణ కేంద్రంగా (ప్రధానంగా చెరకు రైతుల కోసం) ఉపయోగించుకునేందుకు 1919లో దీన్ని ఏర్పాటుచేశారు. కాలక్రమంలో విత్తన ఉత్పత్తి పొలంగా మార్చారు. అధిక దిగుబడులనిచ్చే విత్తనాల ఉత్పత్తి కోసం కేఎస్‌ఎస్‌ఎఫ్‌లో వరిని పండిస్తుంటారు. అదనంగా టమాటా, బొప్పాయి, క్యాబేజీ తదితర పంటలపైనా ప్రస్తుతం దృష్టిపెడుతున్నారు. పదేళ్లుగా ఇక్కడ రసాయనిక ఎరువులు, పురుగుల మందులను వినియోగించడం లేదు.
కర్బన తటస్థీకరణ అంటే?
ఒక ప్రాంతంలో వెలువడే కర్బన ఉద్గారాల స్థాయి, అక్కడ ఆ ఉద్గారాలను తిరిగి శోషించుకోగల సామర్థ్యం సమానంగా ఉండటాన్ని ‘కర్బన తటస్థీకరణ’గా పిలుస్తారు. పొలం విషయంలో దాన్ని సాధించాలంటే కేవలం సేంద్రియ సాగుకు కట్టుబడి ఉంటే సరిపోదు. మరికొన్ని శాస్త్రీయ విధానాలనూ అనుసరించాల్సిందే.
ఎలా సాధించారు?
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేఎస్‌ఎస్‌ఎఫ్‌లో బాతులను పెంచుతున్నారు. అవి పొలాల్లో ఆహారాన్వేషణ సాగిస్తూ చీడపురుగుల బెడదను తగ్గిస్తున్నాయి. ఇక్కడ పెంచుతున్న ఆవుల నుంచే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. స్థానికంగా అమర్చిన సౌరఫలకాలతో విద్యుత్ అవసరాలు తీరుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో 76 శాతానికి రిజర్వేషన్ బిల్లులను ఆమోదించిన అసెంబ్లీ
ఛత్తీస్‌గఢ్‌లో రిజర్వేషన్ల కోటాను 76 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం భూపేశ్ బఘేల్ ప్రవేశపెట్టారు. వీటిని సభ ఆమోదించడంతో ఇక నుంచి ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు 76 శాతానికి పెరగనున్నాయి. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ సవరణ బిల్లుల ప్రకారం.. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు 32%, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు 27%, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు 13%, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్)కు 4% కోటా లభించనుంది.
ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటముల్లో ఒకటైన జీ-20 అధ్యక్ష బాధ్యతలను మనదేశం అధికారికంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో మానవాళి మొత్తానికి ప్రయోజనం కోసం ‘ప్రాథమిక ఆలోచనా ధోరణిలో మార్పు’ అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాగే ఇది యుద్ధాల శకం కాదన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ఇతివృత్తం ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. భారత్ జీ-20 ఎజెండా ప్రతిష్ఠాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని తెలిపారు. భారత్ అధ్యక్ష హోదాను వైద్యం, సామరస్యం, ఆశల అధ్యక్షతగా మార్చేందుకు కలిసి పనిచేద్దామన్నారు. మానవ-కేంద్రీకృతంగా ప్రపంచీకరణకు కొత్త నమూనా రూపొందించడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
అమెరికా, ఫ్రాన్స్ మద్దతు..
జీ20 అధ్యక్ష పదవిని భారత్ అధికారికంగా చేపట్టిన సందర్భంగా అమెరికాతో పాటు ఫ్రాన్స్ తమ మద్దతును తెలియజేశాయి.
సుప్రీంకోర్టు చరిత్రలో మూడోసారి మహిళా జడ్జీలతో ప్రత్యేక ధర్మాసనం
సుప్రీంకోర్టులో ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రత్యేక బెంచిని ఏర్పాటు చేయడం అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో ఇది మూడోసారి. కోర్ట్ నంబర్ 11లో ఉన్న ఈ ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బేలా ఎం.త్రివేది, వివాహ వివాదాలతో పాటు బెయిలుకు సంబంధించిన బదిలీ పిటిషన్లను విచారించనున్నారు. 2013లో తొలిసారిగా ఇలా మహిళా ధర్మాసనం ఏర్పడింది. సారథ్యం వహించాల్సిన జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం గైర్హాజరు కావడంతో జస్టిస్ జ్ఞాన్ సుధామిశ్ర, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో బెంచి ఏర్పాటు యాదృచ్ఛికంగా సాధ్యమైంది. తర్వాత 2018లో జస్టిస్ ఆర్.బానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన మరో మహిళా బెంచిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన మూడో ధర్మాసనం ముందు 32 పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. ఇందులో వివాహ సంబంధిత వివాదాలపై 10, మరికొన్ని బదిలీ పిటిషన్లతో పాటు 10 బెయిల్ పిటిషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ త్రివేది. 2027 నాటికి సీజేఐ రేసులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్న నియమితులయ్యే అవకాశముంది.
భూకంపాలు వచ్చినా చెక్కుచెదరవు
భూకంపాలు సహా ఇతర ప్రకృతి విపత్తులను సమర్థంగా తట్టుకునేలా గుజరాత్‌లోని అహ్మదాబాద్ కంటోన్మెంట్‌లో సైనికుల కోసం త్రీడీ ముద్రిత ఇళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇందులో భాగంగా తొలి నివాస యూనిట్‌ను ప్రారంభించారు. దాని విస్తీర్ణం 71 చదరపు మీటర్లు.
మికాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఈ ఇంటిని కేవలం 12 వారాల్లో నిర్మించింది.
మిధానిలో వైడ్ ప్లేట్ మిల్ జాతికి అంకితం
దేశంలోనే మొదటిదైన వైడ్ ప్లేట్ మిల్‌ను హైదరాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతికి అంకితం చేశారు.
రూ.600 కోట్ల అంచనా వ్యయంతో 30 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం వైడ్ ప్లేట్ తయారీని రాష్ట్రపతి పరిశీలించారు.
అనంతరం రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి తిలకించారు.
ప్రదర్శనలో మిధాని, బీడీఎల్, హెచ్‌ఏఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, డీఆర్‌డీవోకు చెందిన ఉత్పత్తులతో పాటు ప్రైవేటు అంకుర సంస్థల ఉత్పత్తులను తిలకించారు.
యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటు డ్రోన్ గన్లను ఆసక్తిగా పరిశీలించారు.
ఇదీ వైడ్ ప్లేట్ మిల్ ప్రత్యేకత
వ్యూహాత్మక రంగాల్లో స్వయం సమృద్ధి లక్ష్యంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన మిధాని సాయుధ దళాల ఆయుధాల తయారీకి అవసరమైన ఉక్కు, తక్కువ, ఎక్కువ సామర్థ్యం కల్గిన మిశ్ర ధాతువులు, ప్రత్యేకమైన స్టీల్స్, స్టెయిన్‌లెస్ స్టీల్స్, సూపర్ అలాయ్స్, టైటానియం, టైటానియం అలాయ్స్‌ను వేర్వేరు రూపాల్లో, పరిమాణాల్లో తయారు చేస్తోంది. మెటీరియల్స్‌కు సంబంధించి వేర్వేరు రంగాల అవసరాలను తీరుస్తోంది.
దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేకు అవసరమైర కోచ్‌ల తయారీకి కావాల్సిన వైడ్ ప్లేట్స్‌ను ప్రస్తుతం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
రాష్ట్రపతి ప్రారంభించిన కొత్త ప్లాంట్‌తో 3 మీటర్ల వెడల్పు ఉండే ప్లేట్లను ఇక్కడ తయారు చేసేందుకు వీలు ఏర్పడింది.
స్టెయిన్‌లెస్ ప్లేట్లను ఆయిల్ అండ్ గ్యాస్ పైపులైన్లలో వాడేందుకు అవకాశం ఉంది. వాహనాలు, ట్యాంకుల్లో ఉపయోగిస్తారు.
మెట్రో కోచ్‌లకూ ఉపయోగించవచ్చు. డిఫెన్స్, స్పేస్‌లో వాడతారు. ఈ తరహా ప్లాంట్లు ప్రపంచవ్యాప్తంగా చాలా పరిమితంగా ఉన్నాయి.
మనదేశంలో ఇదే మొదటి ప్లాంట్. ఇందులో దశల వారీగా ఉత్పత్తి చేపట్టనున్నారు.
కర్ణాటకలో మరాఠీ ప్రజలున్న గ్రామాల విలీనంపై మహారాష్ట్ర తీర్మానం
కర్ణాటక సరిహద్దులో మరాఠీ మాట్లాడే ప్రజలున్న 865 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకునే విషయంలో చట్టబద్ధంగా చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఉభయ సభల్లోనూ దీనిని ప్రవేశపెట్టారు. సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మృతవీరులుగా గుర్తించి వారి కుటుంబాలకు నెలకు రూ.20 వేల చొప్పున చెల్లిస్తామని శిందే ప్రకటించారు. మరాఠీ మాట్లాడే ప్రాంతాల వారికి యూపీఎస్సీ పరీక్షల శిక్షణలో 5% సీట్లు కేటాయిస్తామని, విద్యాసంస్థల్లోనూ కొన్ని సీట్లు వారికి ఇస్తామని తెలిపారు. సరిహద్దు వివాదంపై తీర్మానాన్ని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానించారు.
దేశంలోనే తలసరి రుణ భారంలో తెలంగాణకు 5వ స్థానం
తలసరి రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలో తొలి స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు. రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబం మీద రూ.74,121 కోట్ల రుణం ఉండగా, ఏపీ రైతులపై అంతకు మూడు రెట్ల భారముంది. తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంపై రూ.1,52,113 మేర రుణ భారముంది. అత్యధిక అప్పున్న రాష్ట్రాల్లో ఇది 5వ స్థానంలో ఉంది.
ఎఫ్‌డీఐలలో 7వ స్థానంలో తెలంగాణ
ఈ ఏడాది జనవరి - సెప్టెంబరు మధ్యకాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)లో ఆంధ్రప్రదేశ్ 10వ, తెలంగాణ 7వ స్థానాల్లో నిలిచాయి. ఈ తొమ్మిది నెలల్లో దేశంలోకి 42,509 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు 217 మిలియన్ డాలర్లు (0.51%) మాత్రమే దక్కాయి. తెలంగాణకు 1287 మిలియన్ డాలర్లు (3.02%) చేజిక్కాయి. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాశ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
దిల్లీ మెట్రోకు 20 ఏళ్లు
అది 25 డిసెంబరు 2002, దిల్లీ నగరం. ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిన జనాలతో నిండిపోయి ఉంది. మొత్తం 6 స్టేషన్లు, కేవలం 8.2కి.మీ. ఏంటీ సమాచారం అనుకుంటున్నారా, దిల్లీ మెట్రో ప్రస్థానమే ఇది. అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ ఇదే రోజున రెండు దశాబ్దాల క్రితం దిల్లీ మెట్రోను ప్రారంభించారు. మొదట్లో ఈ సర్వీసును ప్రజలు తాత్కాలికమేనని భావించారు. కానీ, ప్రస్తుతం దిల్లీ మెట్రో 392 కి.మీలు విస్తరించింది. 286 స్టేషన్ల మీదుగా రోజూ 16 నుంచి 18 గంటల పాటు రైళ్లు నడుస్తున్నాయి.
శాశ్వత ఎగ్జిబిషన్ ప్రారంభం..
దేశ రాజధానిలోని వెల్‌కం మెట్రో స్టేషన్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జపాన్ రాయబారి హిరోషీ సుజూకీ, దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ పాల్గొన్నారు. దిల్లీ మెట్రో రైలు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కశ్మీరీ గేటు స్టేషన్ నుంచి వెల్‌కం మెట్రో స్టేషన్ వరకు, ఆరు కోచ్‌లతో ఉన్న ప్రత్యేక రైలు సర్వీసును నడిపారు. గత ఏడాది డిసెంబరులో ఓ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మెట్రోకి సంబంధించి అప్పటి అరుదైన ఫోటోలు, వార్తా పత్రిక క్లిప్పింగులను అందులో ప్రదర్శిస్తున్నారు. మెట్రో రెండు దశాబ్దాల ప్రయాణం గుర్తుగా ‘ట్రేసింగ్ దిల్లీ మెట్రో జర్నీ’ పేరిట శాశ్వత ఎగ్జిబిషన్‌గా దీన్ని మార్చారు.
నార్మ్ డైరెక్టరుగా డాక్టర్ సీహెచ్.శ్రీనివాసరావు
జాతీయ వ్యవసాయ పరిశోధన, యాజమాన్య అకాడమీ (నార్మ్) డైరెక్టరుగా డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. తొలి టర్మ్ కింద అయిదేళ్ల ఏడు నెలలు బాధ్యతలు నిర్వహించిన ఆయన మరో అయిదేళ్లు ఆ పోస్టులో కొనసాగనున్నారు. ఈ మేరకు జాతీయ నియామక కమిటీ రెండో సారి శ్రీనివాసరావును ఆ పోస్టుకు ఎంపిక చేసింది.
సముద్రయాన భద్రత బిల్లుకు పార్లమెంటు ఆమోదం
సముద్రయాన మార్గాల్లో దాడులను, దొంగతనాలను నిరోధించి, భద్రత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ తరహా నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే నిబంధనలు దీనిలో ఉన్నాయి. మారిటైమ్ యాంటీ-పైరసీ బిల్లు - 2022ను రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. లోక్‌సభ డిసెంబరు 19న ఈ బిల్లుకు తన సమ్మతిని తెలిపింది. స్థాయీ సంఘం 18 సిఫార్సులు చేయగా వాటిలో నాలుగు మినహా అన్నిటినీ బిల్లులో పొందుపరిచినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తెలిపారు.
దినసరి కూలీల ఆత్మహత్యల్లో తెలంగాణది 4వ స్థానం
తెలంగాణలో దినసరి కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో 2021లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2014 నుంచి 2021 మధ్య 8 ఏళ్ల కాలంలో మొత్తం 23,838 మంది కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2021లో 4,223 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో తమిళనాడు (7,673), మహారాష్ట్ర (5,270), మధ్యప్రదేశ్ (4,657) తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ విషయం చెప్పారు.
మహిళలపై నేరాల్లో హెచ్చుతగ్గులు
గత నాలుగేళ్లలో తెలంగాణలో మహిళలపై నేరాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. రెండేళ్లు తగ్గితే మరో రెండేళ్లలో పెరగడం కనిపిస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్ర లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు.
రైతులపై రుణ భారం 1,91,970 కోట్లు
ఆంధ్ర రాష్ట్రంలో రైతులపై ఈ ఏడాది మార్చి 30 నాటికి రూ.1,91,970.26 కోట్ల రుణ భారం ఉంది. 1,34,05,372 ఖాతాల ద్వారా ఈ రుణాలు తీసుకున్నారు. తమిళనాడు (రూ.2,78,410 కోట్లు) తర్వాత అత్యధిక రుణ భారం రాష్ట్ర రైతులపైనే ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా బ్యాంకులు రూ.17.09 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేయగా, అందులో 46.20% మొత్తాన్ని దక్షిణాది రైతులు తీసుకున్నారు. దక్షిణాదిలో అతి తక్కువ రుణ భారం తెలంగాణ (రూ.82,601 కోట్లు) రైతులపై ఉంది. 2020తో పోలిస్తే 2022 నాటికి ఏపీలో రుణ భారం 40.35% పెరగ్గా, తెలంగాణలో 30.22% వృద్ధి కనిపించింది.
ఆంధ్రాలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయ్
ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2018తో పోలిస్తే 2021 నాటికి అత్యాచారాలు 22%, దాడులు 15%, ఆత్మగౌరవానికి భంగం కల్గించిన కేసులు 31% మేర పెరిగాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్ర లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. మంత్రి సమాధానం ప్రకారం.. ఏపీలో 2018 నుంచి 2021 మధ్యకాలంలో మహిళలపై 4,340 అత్యాచారాలు, 8,406 ఆత్మగౌరవానికి భంగం కల్గించే ఉదంతాలు, 18,883 సాధారణ దాడులు చోటు చేసుకున్నాయి. ఆత్మగౌరవానికి భంగం కల్గించడంలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.
ఏపీలో కూలీల ఆత్మహత్యలూ ఎక్కువే
ఆంధ్ర రాష్ట్రంలో రోజువారీ కూలీల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. 2021లో 3,014 మంది కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2014తో పోలిస్తే 2021 నాటికి ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2014 నుంచి 2018 వరకు అయిదేళ్లలో 6,475 మంది ఆత్మహత్య చేసుకోగా, 2019 - 21 మధ్య మూడేళ్లలోనే 7,682 మంది బలవన్మరణం పొందారు. రాష్ట్రం విడిపోయిన తొలి అయిదేళ్లతో పోలిస్తే గత మూడేళ్లలో కూలీల ఆత్మహత్యలు దాదాపు 19% పెరిగాయి. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
సముద్ర జలాల్లో దోపిడీలకు మరణ శిక్ష
సముద్ర జలాల్లో దోపిడీలకు పాల్పడే వారికి యావజ్జీవ కారాగార శిక్ష, లేదా మరణ శిక్ష విధించేలా చట్టంలో సవరణలు చేయడానికి ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభ్యుల డిమాండ్ల మేరకు చట్టం పేరును ‘ది మారిటైం యాంటీ పైరసీ యాక్ట్’గా మార్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మహా సముద్రాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) సహా ఏ దేశానికీ చెందని జలాలకూ ఈ చట్టంలోని నిబంధనలు వర్తించేలా ఒక సవరణ చేశారు.
‣ కర్ణాటకలోని బెట్టా-కరుబ సామాజిక వర్గాన్ని ఎస్టీల జాబితాలో చేర్చడానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో ఏటా పెరుగుతున్న ఆత్మహత్యలు
నిరుద్యోగాది కారణాలతో తెలంగాణలో ఏటా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్‌సభలో తెలిపారు. రాష్ట్రంలో 2019లో 7,675 మంది, 2020లో 8,058 మంది, 2021లో 10,171 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు. 2021లో మహారాష్ట్ర (22,207), తమిళనాడు (18,925) మధ్యప్రదేశ్ ((14,965), పశ్చిమబెంగాల్ (13,500), కర్ణాటక (13,056) తర్వాత అత్యధిక ఆత్మహత్యలు తెలంగాణలో చోటు చేసుకున్నట్లు వివరించారు.
ఏపీ హైకోర్టులో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్
దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 25 హైకోర్టుల్లో కలిపి 28,469 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా, ఒక్క ఏపీలోనే 11,348 (39.86) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పట్నా (6,554), తెలంగాణ (6,236)లలో ఉన్నాయి. లోక్‌సభలో ఓ లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది.
సరిహద్దుల్లో భారత వాయుసేన (ఐఏఎఫ్) యుద్ధ విన్యాసాలు
అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత వాయుసేన (ఐఏఎఫ్) రఫేల్ జెట్లతో యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. రెండు రోజుల పాటు సాగే ఈ విన్యాసాల్లో భాగంగా ఈశాన్య ప్రాంతంలో ఫైటర్ జెట్లు, రవాణా, మానవ రహిత విమానాలను మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు రఫేల్ విమానాల్లో చివరిదైన 36వ యుద్ధ విమానం భారత అమ్ముల పొదిలో చేరిందని ఐఏఎఫ్ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
జాతీయ ఉత్తమ సంఘంగా కామారెడ్డి సహకార సమాఖ్య
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కార్యక్రమం మొదలై మూడు దశాబ్దాలు అవుతున్న సందర్భంగా నాబార్డు, డీజీఆర్‌వీ జర్మనీ సహకారంతో ఏపీ మాస్, ఎనేబుల్ నెట్‌వర్క్ కలిసి జాతీయ, రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా సంఘాలకు అవార్డులు ప్రదానం చేయనుంది. వివిధ రీజియన్ల పరిధిలో 2022 ఏడాదికిగాను అవార్డులకు ఎంపికైన మహిళా సంఘాల వివరాలను ఏపీ మాస్ సంస్థ ప్రకటించింది. కామారెడ్డికి చెందిన కామారెడ్డి మండల సహకార సమాఖ్య క్రెడిట్ సొసైటీ జాతీయ స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపికైంది. రెండో స్థానంలో ఏపీలోని విశాఖపట్నం పద్మనాభం బ్లాకుకు చెందిన పద్మనాభం మండల మాక్ట్స్ సహకార సమాఖ్య నిలిచింది. దక్షిణాది రీజియన్ పరిధిలో కేరళకు చెందిన మహిళా సంఘం తొలి స్థానం, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన భారతమాత మండల సహకార క్రెడిట్ కో-ఆపరేటివ్ విలేజెస్ సొసైటీ రెండో స్థానం సాధించింది. డిసెంబరు 17న హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి అవార్డులను అందజేయనున్నట్లు ఏపీ మాస్ సంస్థ తెలిపింది.
మధ్యవర్తిత్వ కేంద్రం పేరు మార్పు
ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలకు మన దేశం ముఖ్య స్థావరంగా మారనుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ‘న్యూ దిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్’ పేరును ‘ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్’గా మార్చే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ బిల్లును లోక్‌సభ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించగా, ఎగువసభ సమ్మతి తెలిపింది. చిన్న చిన్న దేశాలు కూడా మధ్యవర్తిత్వ పరిష్కార వేదికల ఏర్పాటులో ఎంతో ముందున్నాయని మంత్రి తెలిపారు.
దేశ రాజధానిలో భారాస జాతీయ కార్యాలయం ప్రారంభం
జాతీయ రాజకీయాల దిశగా భారత్ రాష్ట్ర సమితి (భారాస) తొలి అడుగు వేసింది. దేశ రాజధాని దిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సర్దార్ పటేల్ మార్గ్‌లోని కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయాన్ని రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. భారాస జాతీయ అధ్యక్షుడిగా లెటర్‌హెడ్‌పై తొలి సంతకం చేశారు. పార్టీ అనుబంధ రైతు సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితిని ప్రకటించారు. దానికి అధ్యక్షునిగా హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లా జట్టాన్ గ్రామానికి చెందిన రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చడూనీ, కార్యాలయ కార్యదర్శిగా రవి కొహాడ్‌లను నియమిస్తూ కేసీఆర్ వారిద్దరికీ పత్రాలు అందజేశారు.
ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవాలు ప్రారంభం
స్వామినారాయణ్ సంప్రదాయ పరంపరలో అయిదవ ఆధ్యాత్మిక గురువు, ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవాలను ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించారు. స్వామీజీతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆయన ఆధ్వర్యంలో అక్షర్‌ధామ్ ఆలయాలు నిర్మాణమయ్యాయని తెలిపారు. రాజ్‌కోట్ నుంచి తొలిసారి తాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పుడు నామినేషన్ పత్రాలపై సంతకం చేయడానికి ఆయన ఒక కలం పంపించారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సిన ప్రతిసారీ స్వామీజీ తనకు ప్రత్యేకంగా కలాలను పంపించారని వెల్లడించారు. శతాబ్ది మహోత్సవాలను అహ్మదాబాద్‌లోని 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రముఖ్ స్వామి మహరాజ్ నగర్‌లో నెల రోజుల పాటు నిర్వహిస్తారు. స్వామి నారాయణ్ మందిర్ ఆధ్వర్యంలో ఇవి కొనసాగుతాయి.