ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభం
→ది స్క్వేర్ కిలోమీటర్ అరే (ఎస్‌కేఏ) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది.
→21వ శతాబ్దపు అతిపెద్ద సైన్స్ ప్రాజెక్టుల్లో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 2028 నాటికి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
→దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం బ్రిటన్‌లో ఉంటుంది.
→ఖగోళంలో అంతుచిక్కని అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి దీనిని వినియోగించనున్నారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను ఇది పరీక్షించనుంది.
→భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషించనుంది.
→ఈ ప్రాజెక్టులో భాగంగా ఆస్ట్రేలియాలోని మార్చిసన్ ప్రాంతంలో 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు లక్షకు పైగా యాంటెన్నాలను నిర్మించనున్నారు.
→ఇవి క్రిస్మస్ ట్రీలను పోలి ఉంటాయి. దక్షిణాఫ్రికాలో 197 భారీ డిష్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తాన్ని కలిపితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపు ప్రాజెక్టుగా నిలుస్తుంది.
→ఇందులో 16 దేశాలకు భాగస్వామ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా రేడియో, ఆప్టికల్ టెలిస్కోప్‌లు ఉన్నా ఎస్‌కేఏతో వాటిని పోల్చలేమని అధికారులు పేర్కొన్నారు.
→దీని నిర్మాణానికి సంబంధించిన ఆలోచన 1990ల్లో వచ్చిందన్నారు. 2003లో ఈ ప్రాజెక్టుపై పనిచేయడం మొదలుపెట్టామని వివరించారు.
→విశ్వం ఆవిర్భావానికి కారణమైన ‘బిగ్ బ్యాంగ్’ అనంతరం తొలినాళ్లలో నెలకొన్న పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఈ భారీ టెలిస్కోప్ అవసరమన్నారు.
→దీని నిర్మాణ పనులు వచ్చే ఏడాది నుంచి చురుగ్గా జరుగుతాయని భావిస్తున్నారు. 2028 నాటికి పూర్తవుతాయని అంచనా.
ఆక్స్‌ఫర్డ్ ఈ ఏటి మేటి పదం ‘గాబ్లిన్ మోడ్’
→‘గాబ్లిన్ మోడ్’ ఈ ఏడాది మేటి పదంగా ఎన్నికైనట్లు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువును ప్రచురించే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) ప్రకటించింది.
→గాబ్లిన్ మోడ్ అనే పదం వ్యక్తి ప్రవర్తనను సూచిస్తుంది. ఎంతసేపటికీ తన సుఖాలు, తన కోరికలే తప్ప ఇతరుల గురించి పట్టించుకోని తత్వమది.
→బద్ధకం, అపరిశుభ్రత, దురాశ జీర్ణించిన ధోరణిని గాబ్లిన్ మోడ్ అంటారు. ప్రపంచమంతటా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో అత్యధికంగా 92 శాతం (3,18,956) ఓట్లు ఈ పదానికే వచ్చాయి.
→ప్రస్తుతం జనం నోళ్లలో ఎక్కువగా నానుతున్న కొత్త యాస పదాల్లో మూడింటిని ఎంచుకుని ఈ ఏటి మేటి పదమేదో నిర్ణయించడానికి ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు.
→ గాబ్లిన్ మోడ్‌తో మెటావర్స్, ‘చిఐస్టాండ్ విత్’ పదాలు పోటీపడినా చివరకు గాబ్లిన్ మోడ్‌కే అత్యధిక ఓట్లు లభించాయి.
→ సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్నెట్‌లో ఈ మూడు పదాలను ఈ ఏడాది జనం విస్తృతంగా ఉపయోగించారు.
→ ఫేస్‌బుక్ మెటావర్స్‌గా రూపాంతరం చెందడం, వందలు వేల మైళ్ల దూరంలో జరుగుతున్న ఉద్యమాలకు ‘చిఐస్టాండ్ విత్’ అంటూ నెట్ ద్వారా సంఘీభావం ప్రకటించడం వల్ల ఆ రెండు పదాలకు సర్వేలో చోటు కల్పించారు.
అధునాతన స్టెల్త్ బాంబర్‌ను ఆవిష్కరించిన అమెరికా
→కొన్నేళ్లుగా తెరచాటున అభివృద్ధి చేసిన అధునాతన ఆరో తరం స్టెల్త్ బాంబర్ విమానాన్ని తొలిసారిగా అమెరికా ప్రదర్శించింది.
→చైనాతో ఘర్షణలు జరిగితే ఇది తమకు పైచేయి సాధించి పెడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది.
→బి-21 రైడర్ అనే ఈ లోహ విహంగం, ప్రపంచంలోనే తొలి ‘డిజిటల్ బాంబర్’.
→కాలిఫోర్నియాలోని పామ్‌డేల్ వైమానిక దళ స్థావరంలో ఆయుధ దిగ్గజం నార్త్రాప్ గ్రుమన్ సంస్థ దీన్ని ఆవిష్కరించింది.
→నింగిలోని ఉపగ్రహాల కంట పడకుండా చూసేందుకు ఈ యుద్ధవిమానాన్ని హ్యాంగర్ నుంచి వెలుపలికి తీసుకురాలేదు.
ఎందుకీ బాంబర్? :-
→కొన్నేళ్ల కిందటి వరకూ ఉగ్రవాదంపై పోరులో అమెరికా నిమగ్నమైంది. క్రమంగా తన దృష్టిని చైనా సైనిక ఆధునికీకరణపైకి మళ్లించింది. 2035 నాటికి 1500 అణ్వస్త్రాలను సమకూర్చుకునే విధంగా డ్రాగన్ దేశం అడుగులు వేస్తోంది. హైపర్‌సోనిక్స్, సైబర్ యుద్ధాలు, అంతరిక్ష రంగం వంటి అంశాల్లో అద్భుత పురోగతి సాధించింది. వీటివల్ల తన భద్రతా ప్రయోజనాలకు హాని కలుగుతుందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో సైనిక ఆధునికీకరణలో భాగంగా బి-21 రైడర్ ప్రాజెక్టును చేపట్టింది.
→ అమెరికా అమ్ములపొదిలోని బి-1 లాన్సర్, బి-2 స్పిరిట్ బాంబర్ల స్థానంలో రైడర్లను ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో రైడర్‌ను తొలి డిజిటల్ బాంబర్‌గా అభివర్ణిస్తున్నారు.
→ రైడర్ ఆకృతి అంతటా శక్తిమంతమైన సెన్సర్లు ఉన్నాయి. అవి శత్రువు గురించి నిరంతరం డేటాను అందిస్తుంటాయి. అందువల్ల ఈ యుద్ధవిమానం.. దాడులకే కాకుండా నిఘా సమాచార సేకరణకూ ఉపయోగపడుతుంది.
→ శత్రు దాడులను బి-21 చాలా సమర్థంగా ఎదుర్కోగలదు.
→ అవసరమైతే దీన్ని పైలట్‌రహితంగానూ నడపొచ్చు.
పేరు వెనుక:-
→పెర్ల్ హార్బర్ దాడికి ప్రతిగా 1942లో జపాన్ నగరాలపై అమెరికా యుద్ధవిమానాలతో విరుచుకుపడింది.
→‘డూలిటిల్ రైడ్’ అనే ఆ ఆపరేషన్‌లో 80 మంది పాల్గొన్నారు. బి-25 మిచెల్ బాంబర్లలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి దాడులు చేశారు.
→ ఆ యుద్ధవిమానాల ఇంధన సామర్థ్యం పరిమితమే. అందువల్ల దాడి అనంతరం బాంబర్లలో స్వదేశానికి చేరుకోలేమని తెలిసినా వారు ఈ సాహసానికి సిద్ధపడ్డారు.
→ తిరుగుప్రయాణంలో వారు విమానాలను వదిలేసి పారాచూట్ల సాయంతో చైనా, సోవియట్ రష్యాలో దిగారు. అక్కడి ప్రజల తోడ్పాటుతో స్వదేశానికి తిరిగి వెళ్లారు.
→ నాటి దాడులకు గుర్తుగా బి-21కు ‘రైడర్’ అని నామకరణం చేసింది.
భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్
→ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి డిసెంబరు నెల అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు దక్కాయి.
→ఈ క్రమంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రుచిరా కాంబోజ్ అధ్యక్ష స్థానంలో కూర్చుంటారు.
→15 సభ్య దేశాలు గల మండలిలో ఒక్కో దేశానికి ఒక్కో నెల అధ్యక్ష స్థానాన్ని కట్టబెడతారు.
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు ప్రమాణం
→ఇజ్రాయెల్ నూతన ప్రధానమంత్రిగా బెంజమిన్ నెతన్యాహు (73) ప్రమాణ స్వీకారం చేశారు.
→నెతన్యాహు ఇజ్రాయెల్‌లో ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తి. ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
→నెస్సెట్ (పార్లమెంట్)లోని 120 మంది సభ్యుల్లో నెతన్యాహుకు 64 మంది మద్దతు ఉంది. ఆయనకు సొంత లికుడ్ పార్టీ సహా కొన్ని పార్టీల మద్దతు ఉంది.
→కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు నెతన్యాహు నెస్సెట్‌లో మాట్లాడుతూ.. ఇరాన్ అణుబాట పట్టకుండా నిరోధించడం, దేశం అంతటా నడిచేలా బుల్లెట్ రైలు ఏర్పాటు, మరిన్ని దేశాలను ‘అబ్రహాం ఒప్పందాల’ పరిధిలోకి తీసుకురావడం వంటివి జాతీయ లక్ష్యాలని పేర్కొన్నారు.
నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణం
→సీపీఎన్-మావోయిస్టు సెంటర్ (ఎంసీ) పార్టీ ఛైర్మన్ పుష్పకమల్ దహాల్ ప్రచండ మూడోసారి నేపాల్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు.
→గెరిల్లా ఉద్యమ నేతగా పేరొందిన ఆయనతో దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ప్రమాణం చేయించారు.
→ప్రచండతో పాటు కొత్త సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
→నూతన మంత్రివర్గంలో ముగ్గురు ఉప ప్రధానులు బిష్ణు పౌడల్ (సీపీఎన్-యూఎంఎల్), నారాయణ్ కాజీ శ్రేష్ఠ (సీపీఎన్-ఎంసీ), రబి లామిచానే (ఆర్‌ఎస్‌పీ) ఉన్నారు.
→ప్రధాని పదవి విషయంలో నేపాలీ కాంగ్రెస్‌తో విభేదించిన ప్రచండ, సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మద్దతుతో ఆ పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.
నేపాల్ ప్రధానిగా ప్రచండ
→నేపాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి పీఠం కోసం ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న ఐదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలింది.
→ఆ వెంటనే మాజీ ప్రధాని, సీపీఎన్-మావోయిస్టు సెంటర్ (ఎంసీ) పార్టీ ఛైర్మన్ పుష్పకమల్ దహాల్ ప్రచండను దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ప్రధానమంత్రిగా నియమించారు.
→ప్రచండ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. నేపాల్ ప్రతినిధుల సభకు గత నెలలో ఎన్నికలు జరిగాయి.
→అందులోని మొత్తం స్థానాలు 275. ప్రభుత్వ ఏర్పాటుకు 138 సీట్లు అవసరం కాగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు.
→నేపాలీ కాంగ్రెస్ పార్టీకి 89 సీట్లు రాగా, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ 78, సీపీఎన్-ఎంసీ 32 స్థానాల చొప్పున దక్కించుకున్నాయి.
→నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-ఎంసీ, మరో మూడు పార్టీలతో కూడిన అధికార కూటమి తమ సంకీర్ణ సర్కారును కొనసాగించేందుకు ప్రాథమికంగా అంగీకరించాయి.
→ప్రధాని పదవి (ఐదేళ్ల కాలం)ని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలని ప్రచండ, ఇన్నాళ్లూ ప్రధానమంత్రిగా కొనసాగిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్‌బా మధ్య ఒప్పందం కుదిరింది.
→దాని ప్రకారం తొలి రెండున్నరేళ్లు దేవ్‌బా ఆ పీఠంపై ఉండాలి. అయితే అందుకు విరుద్ధంగా తొలి విడతలో తనను ప్రధానిగా చేయాలని ప్రచండ తాజాగా పట్టుబట్టారు.
→అందుకు దేవ్‌బా నిరాకరించడంతో సంకీర్ణ కూటమి కూలిపోయింది.
ఫిజీ నూతన ప్రధానిగా రబూకా
→ఫిజీ నూతన ప్రధానమంత్రిగా సితవేని రబూకా బాధ్యతలు స్వీకరించారు.
→74 ఏళ్ల ఈ మాజీ సైనిక కమాండర్ పార్లమెంటు సభ్యుల మధ్య జరిగిన రహస్య ఓటింగ్‌లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గి గత 16 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఫ్రాంక్ బైనిమారామాను అధికారానికి దూరం చేశారు.
→ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రబూకాకు చెందిన పీపుల్స్ అలయన్స్ కూటమికి 29, బైనిమారామా కూటమికి 26 స్థానాలు లభించాయి.
→అయినా ప్రతిష్ఠంభన ఏర్పడింది. దీంతో ఓటింగ్ జరిగింది. ఇందులో రబూకా 28-27తో గట్టెక్కారు.
మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు
→భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది.
→ఈ విషయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ప్రకటించింది.
→గుజరాత్‌కు చెందిన అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే మొఢేరా సూర్య దేవాలయం, చారిత్రక నగరం వడ్‌నగర్, ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది.
→ఇందులో వడ్‌నగర్ ప్రధాని మోదీ స్వస్థలం. వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు స్థలాలను ప్రతిపాదిస్తూ భారత ప్రభుత్వం పదిహేను రోజుల క్రితం నామినేషన్లు పంపించగా వాటిని యునెస్కో ఆమోదించింది.
→ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం ఆరు చారిత్రక ప్రదేశాలు భారత్ నుంచి వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
భారీ వ్యయ బిల్లుకు అమెరికా ఆమోదం
→అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఎగువ సభ సెనెట్ 1.70 లక్షల కోట్ల డాలర్ల వ్యయ బిల్లును ఆమోదించింది.
→స్వదేశంలో వివిధ కార్యక్రమాలపై వెచ్చించడానికి 77.25 కోట్ల డాలర్లను, రక్షణ కోసం 85,800 కోట్ల డాలర్లను కేటాయించింది.
→ఉక్రెయిన్‌కు సాయం కింద 4,500 కోట్ల డాలర్లను కేటాయించడం విశేషం.
→ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి వీలుగా బిల్లులో రక్షణ వ్యయాన్ని 10 శాతం పెంచడానికి ప్రతిపక్ష రిపబ్లికన్ నాయకుడు మెకానెల్ మద్దతు తెలిపారు.
→ ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఒకింత మెజారిటీ లభించిన విషయం తెలిసిందే.
→ దీనివల్ల బిల్లుకు అడ్డంకులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ బిల్లు ఆమోద ప్రక్రియను హుటాహుటిన పూర్తిచేశారు.
→ ఎగువ సభ సెనెట్ ఆమోదించిన బిల్లును దిగువ సభలో కూడా త్వరగా ఆమోదించి అధ్యక్షుడు బైడెన్ సమ్మతి కోసం పంపుతున్నారు.
నేపాలీ కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా ప్రధాని దేవ్‌బా
→నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా అధికార నేపాలీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికయ్యారు.
→అయిదు సార్లు ప్రధానిగా సేవలు అందిస్తున్న 76 ఏళ్ల షేర్ బహదూర్, తన ప్రత్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి గగన్ కుమార్ థాపేపై 39 ఓట్ల ఆధిక్యంతో పార్లమెంటరీ నేతగా ఎన్నికైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
→గత నవంబరు 20న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
→వారం రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ రాజకీయ పార్టీలకు సూచించారు.
→ఈ నేపథ్యంలో తమ పార్టీ పార్లమెంటరీ నేత ఎంపిక కోసం నిర్వహించిన అంతర్గత ఎన్నికలో షేర్ బహదూర్ దేవ్‌బా ఎన్నికయ్యారు.
→సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా గెలుపొందిన సభ్యులు ఈ 22న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్లమెంటరీ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు.
భారత సంతతివాసి వరాద్కర్ రెండోసారి ఐర్లాండ్ ప్రధాని బాధ్యతలు స్వీకరణ
→భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
→ఫిన్‌గేల్ పార్టీకి చెందిన ఈయనకు రొటేషన్ పద్ధతిలో అవకాశం వచ్చింది.
→2017లో తొలిసారి ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన 43 ఏళ్ల వరాద్కర్, ప్రపంచంలోని అతి కొద్ది మంది స్వలింగ సంపర్క నేతల్లో ఒకరు.
→ఆయన భాగస్వామి మాథ్యూ బారెట్. మెడికల్ ప్రాక్టీషనర్. వరాద్కర్ కూడా వైద్యుడే. ముంబయిలోని కేఈఎమ్ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు.
→లియో తండ్రి మహారాష్ట్రకు చెందిన అశోక్. తల్లి మిరియం ఐరిష్ వాసి.
భారత్ - అమెరికా రక్షణబంధంలో ముందడుగు
→భారతదేశంతో రక్షణ బంధాన్ని పటిష్ఠపరచుకోవడానికి తోడ్పడే బిల్లును అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయ సభలు ఆమోదించాయి.
→85,800 కోట్ల డాలర్ల కేటాయింపులతో రూపొందించిన ఈ బిల్లు జాతీయ రక్షణ ప్రాధికార చట్టం (ఎన్‌డీఏఏ)గా మారింది.
→దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతకం చేయనున్నారు. రష్యా ఆయుధాలపై భారత్ ఆధారపడవలసిన అవసరాన్ని తప్పించడానికి ఈ చట్టం తోడ్పడుతుంది.
→అత్యాధునిక ఆయుధాల రూపకల్పనకు సంయుక్త పరిశోధనకు, సైబర్ పోరాట సామర్థ్యాలను పెంపొందించడానికీ వీలు కల్పిస్తుంది.
→చైనా, రష్యా నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని సెనెట్ సాయుధ సర్వీసుల కమిటీ అధ్యక్షుడు జాక్ రీడ్ తెలిపారు.
→కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్ సోనిక్ ఆయుధాల రూపకల్పనలో ఆ రెండు దేశాలను అధిగమించడం ఎన్‌డీఏఏ లక్ష్యమనీ, దీని కోసం అమెరికాలో అధునాతన యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలు రూపొందించడానికి ఊతమిస్తుందని వివరించారు.
ఐరాస సంఘం నుంచి ఇరాన్ బహిష్కరణ
→స్త్రీ-పురుష సమానత్వం, మహిళా సాధికారతలను పెంపొందించడానికి అంకితమైన ‘అంతర్జాతీయ అంతర్ ప్రభుత్వ సంఘం’ నుంచి ఇరాన్‌ను బహిష్కరించడానికి సమితి ఆర్థిక, సామాజిక మండలి (ఎకాసోక్)లో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగుకు భారత్ గైర్హాజరైంది.
→పై సంఘాన్ని మహిళల హోదా పరిరక్షక సంఘంగా వ్యవహరిస్తారు. 2022 - 26 మధ్య కాలంలో సంఘ సభ్యత్వం నుంచి ఇరాన్‌ను బహిష్కరించడానికి అమెరికా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం ఎకాసోక్ ఆమోదం పొందింది.
గాంధీ సిద్ధాంతాలతో ప్రపంచ శాంతి
→హింస, సాయుధ ఘర్షణ, ఇతరత్రా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రపంచంలో శాంతి, సుస్థిరత నెలకొనడానికి మహాత్మాగాంధీ సిద్ధాంతాలు దోహదం చేస్తాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు.
→ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో కలిసి ఆయన ఐరాస కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
→దీనిని భారతదేశం ఐరాసకు బహుమతిగా పంపింది. ఐరాస ప్రధాన కార్యాలయంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
→‘అహింస, శాంతి, నిజాయతీలకు ప్రతిరూపం గాంధీ మహాత్ముడు.
→ఐరాసలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా ఈ ఆదర్శాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొంటున్నట్లవుతుంది’ అని జైశంకర్ అన్నారు.
→సామ్రాజ్యవాదంపై మహాత్మా గాంధీకి ఉన్న వ్యతిరేకతే ఐరాసకు పునాది అని గుటెరస్ చెప్పారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత బిల్లుపై బైడెన్ సంతకం
→స్వలింగ సంపర్కుల వివాహాలకు అమెరికాలో చట్టబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన బిల్లు (సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్)పై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.
→దీంతో బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ద్వారా సమానత్వం దిశగా అమెరికా మరో అడుగు వేసిందని జో బైడెన్ పేర్కొన్నారు.
→ స్వేచ్ఛ, న్యాయం కొందరిది కాదని, అందరి సొంతమని చెప్పే విధంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
సిగరెట్లు కొనుగోలు చేయకుండా యువతపై జీవితకాల నిషేధం
→ధూమపానాన్ని దశలవారీగా నిర్మూలించే ప్రత్యేక ప్రణాళికను న్యూజిలాండ్ ఆమోదించింది.
→యువత సిగరెట్లు కొనడంపై జీవితకాల నిషేధం విధించేలా దీన్ని రూపొందించింది.
→ 2009 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టిన వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని నిర్ణయించింది.
→ దీని ప్రకారం సిగరెట్లు కొనుగోలుకు అవసరమైన కనీస వయసు భవిష్యత్తులో పెరుగుతూ ఉంటుంది.
→ 50 ఏళ్ల తర్వాత ఎవరైనా ఓ వ్యక్తి సిగరెట్లు కొనాలనుకుంటే అతడి వయసు కనీసం 63 ఏళ్లు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది.
→ ఈలోపు ధూమపానం నెమ్మదిగా తగ్గిపోతుందని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.
→ 2025 నాటికి ధూమపాన రహిత దేశంగా న్యూజిలాండ్‌ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు వారు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా గతేడాది 24.7 కోట్ల మలేరియా కేసులు
→కరోనా వైరస్ విజృంభణ మలేరియా వ్యాధి నియంత్రణకు అడ్డుతగిలింది.
→ఫలితంగా గత రెండేళ్లలో అదనంగా 63,000 మరణాలు సంభవించాయని, అదనంగా 1.3 కోట్ల మందికి మలేరియా సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
→2020లో బాగా పెరిగిన మలేరియా కేసులు 2021లోనూ వృద్ధి చెందాయి.
→నిరుడు ప్రపంచవ్యాప్తంగా 24.7 కోట్ల మలేరియా కేసులు నమోదై, 6,19,000 మరణాలు సంభవించాయి.
→వాటిలో 95 శాతం ఒక్క ఆఫ్రికా ఖండంలోనే నమోదయ్యాయి. నిజానికి 2019కన్నా ముందే మలేరియాపై పోరాటం మందగించిందని బ్రిటిష్ నిపుణుడు క్రెయిగ్ చెప్పారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో నిర్మలా సీతారామన్‌కు చోటు
→ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో మనదేశం నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు మరో అయిదుగురికి చోటు దక్కింది. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ వార్షిక జాబితాలో బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్, హెచ్‌సీఎల్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్, సెయిల్ ఛైర్ పర్సన్ సోమా మండల్ కూడా చోటు దక్కించుకున్నారు.
→ సీతారామన్ వరుసగా నాలుగో సారి ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. 2019లో 34; 2020లో 41; 2021లో 37 ర్యాంకు సాధించిన ఈమె తాజాగా 36వ స్థానంలో నిలిచారు.
→ జాబితాలో 39 మంది సీఈఓలు; 10 మంది ప్రభుత్వ శాఖల అధిపతులు; 11 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద 115 బిలియన్ డాలర్లుగా ఉంది.
→ ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నాయకత్వం వహించడం; కరోనా మహమ్మారి అదుపునకు చర్యలు తీసుకోవడం వంటి కారణాల రీత్యా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డే రెండో స్థానంలో; అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ జాబితాలో మూడో స్థానం పొందారు.
→ 100వ ర్యాంకులో ఇరాన్‌కు చెందిన జినా ‘మహ్సా’ ఆమిని నిలిచారు. మహిళా హక్కుల కోసం పోరాడిన ఈమె సెప్టెంబరులో మరణించారు.
జీవ వైవిధ్య రక్షణలో వెనుకబడిన ఆసియా
→తమ భూభాగాల్లో 2020కల్లా కనీసం 17 శాతం విస్తీర్ణంలో జీవవైవిధ్యాన్ని కాపాడాలన్న లక్ష్యాన్ని సాధించడంలో అత్యధిక ఆసియా దేశాలు విఫలమయ్యాయి.
→ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు 40 దేశాల్లో జరిపిన అధ్యయనంలో నిగ్గుదేలిన వాస్తవమిది.
→ఈ లెక్కన 2030కల్లా 30 శాతం భూభాగంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలన్న ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య ఒప్పంద లక్ష్యం ఆసియాకు సుదూర గమ్యంగా నిలచిపోనున్నది.
→2010లో కుదిరిన ఈ ఒప్పందం కింద 2030కల్లా గరిష్టంగా 30 శాతం, 2020కల్లా కనీసం 17 శాతం భూభాగంలో పర్యావరణాన్ని సంరక్షిస్తామని 200 దేశాలు వాగ్దానం చేశాయి.
→2020లో ప్రపంచవ్యాప్తంగా సగటున 15.2 శాతం భూభాగాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడగా.. ఆసియాలో 16 దేశాలు మాత్రమే 17 శాతం లక్ష్యాన్ని సాధించాయి.
→ఆసియా ఖండం మొత్తంలో కేవలం 13.2 శాతం భూభాగంలో లక్ష్య సాధన జరిగింది. మిగతా ఖండాల్లో పరిస్థితి ఆసియాకన్నా మెరుగ్గా ఉంది.
→అన్ని ఆసియా దేశాలు జీవ వైవిధ్య రక్షణ ప్రాంతాలను ఆరురెట్లు వేగంగా విస్తరిస్తే తప్ప 2030కల్లా 30 శాతం లక్ష్యాన్ని అందుకోలేవు.
→ప్రస్తుత పరిస్థితిని బట్టి అప్పటికి ఆసియా దేశాలు కేవలం 18 శాతం భూభాగంలో మాత్రమే రక్షిత ప్రాంతాలను ఏర్పాటుచేయగలుగుతాయి.
→దక్షిణాసియాలో ఇది కేవలం 10 శాతంగా ఉండబోతోంది. ఆసియాలో జనసాంద్రత ఎక్కువ, ఆర్థికాభివృద్ధి పుంజుకోవడం వల్ల ఆసియాలో జీవ వైవిధ్య ప్రాంతాల విస్తరణ పెద్ద సవాలు కానుందని ఆక్స్‌ఫర్డ్ పరిశోధక బృంద సారథి మహమ్మద్ ఫర్హాదినియా వివరించారు.
→కెనడాలోని మాంట్రియల్‌లో డిసెంబరు 7-19 తేదీల మధ్య జీవవైవిధ్య సంఘం సమావేశం కానున్న దృష్ట్యా ఈ అధ్యయనం ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నది.
భూమికి చేరిన చైనా వ్యోమగాములు
→భూకక్ష్యలోని తమ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించిన ముగ్గురు చైనా వ్యోమగాములు క్షేమంగా భూమికి తిరిగొచ్చారు.
→షెంఝౌ-14 వ్యోమనౌక ద్వారా వీరు ఉత్తర మంగోలియాలోని డాంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్‌లో కాలుమోపారు.
→జూన్ 5న రోదసిలోకి వెళ్లిన వీరు, అంతరిక్ష కేంద్రంలో 183 రోజులు గడిపారు. ఈ క్రమంలో ఐదు వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియలను, మూడు స్పేస్‌వాక్‌లను నిర్వహించారు.
→అంతరిక్ష కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా సైన్స్‌పై ఉపన్యాసం కూడా ఇచ్చారు.
→అనేక సాంకేతిక ప్రయోగాలను నిర్వహించారు. వీరి స్థానంలో మరో ముగ్గురు వ్యోమగాములు నవంబరు 29న షెంఝౌ-15 వ్యోమనౌక ద్వారా రోదసిలోకి పయనమయ్యారు.
→ దీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో నివసించడం వంటి అంశాలపై వీరు ప్రయోగాలు నిర్వహిస్తారు.
మత స్వేచ్ఛ ఉల్లంఘన దేశాల్లో రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాన్
→మత స్వేచ్ఛను ఆందోళనకర స్థాయిలో అతిక్రమిస్తున్న దేశాల జాబితాను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ విడుదల చేశారు.
→మొత్తం 12 దేశాలతో కూడిన ఆ జాబితాలో చైనా, రష్యా, పాకిస్థాన్, మియన్మార్, సౌదీ అరేబియా, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, నికరాగువా, తుర్క్‌మెనిస్థాన్, తజికిస్థాన్, ఎరిత్రియా దేశాలున్నాయి.
→1998 నాటి అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం నిబంధనలను ఈ దేశాలు ఆందోళనకర స్థాయిలో ఉల్లంఘిస్తున్నాయని బ్లింకెన్ చెప్పారు.
→అల్జీరియా, వియత్నాం, కొమొరోస్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లపై ఈ విషయంలో కన్నేసి ఉంచామన్నారు.
→ఇంకా తాలిబన్, బోకో హరాం, హౌతీలు, ఐసిస్ గ్రేటర్ సహారా, పశ్చిమ ఆఫ్రికా శాఖలు, రష్యన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపుతో పాటు మరికొన్ని తీవ్రవాద సంస్థలను కూడా ఆందోళనకరమైన సంస్థల జాబితాలో చేర్చారు.
→కాగా భారత్‌ను కూడా మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాల జాబితాలో చేర్చాలని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ వంటి గ్రూపులు అమెరికాలో పైరవీలు చేశాయి.
ఉగ్రవాదులకు అణ్వాయుధాల సరఫరా నియంత్రణపై సభ్య దేశాలను కోరుతూ ఐరాస తీర్మానం
→ఉగ్రవాదులు, నిషిద్ధ వ్యాపారుల చేతుల్లోకి అణ్వాయుధాలు, రసాయన, జీవాయుధాలు వెళ్లకుండా అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది.
→సామూహిక జనహనన ఆయుధాలను ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు సేకరించకుండా, సరఫరా చేయకుండా నియంత్రించేందుకు జరిగిన 2004 ఒప్పందాన్ని పర్యవేక్షించే కమిటీని 2032 నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు ఈ తీర్మానం స్పష్టం చేసింది.
→నిషేధిత ఆయుధాల వాడకాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోగపడే అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక విధానాలు సైతం తీవ్రవాదులు, ప్రభుత్వేతర సంస్థలకు అందకుండా చూడాల్సిన అవసరం ఉందంది.
→ కమిటీలోని నిపుణుల బృందానికి తమ సహకారాన్ని కొనసాగిస్తామంది. భద్రతామండలి తీర్మానాన్ని అమెరికా, రష్యాలు స్వాగతించాయి.