మన చరిత్రను వక్రీకరించారు: ప్రధాని మోదీ

భారతదేశంలో చరిత్రను బోధించే తీరు మారాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

ధైర్యం, ఆత్మవిశ్వాసం నూరిపోయకుండా, న్యూనతాభావం కలిగేలా మన గత చరిత్రను నింపారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన తొలి ‘వీర్‌ బాల్‌ దివస్‌’లో పాల్గొన్నారు.

తమ మతాన్ని రక్షించుకోవడానికి ప్రాణాలు విడిచిన సిక్కు మత గురువు గురుగోబింద్‌ సింగ్‌ తనయులైన జొరావర్‌సింగ్, ఫతేసింగ్‌లకు నివాళులు అర్పించారు.

‘‘ఈ ఇద్దరు చిన్నారులు ఎన్నో తరాలకు స్ఫూర్తి. ఆత్మవిశ్వాసాన్నిచ్చే ఇలాంటి వారి కథలతో మన చరిత్రను నింపి ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అందుకు వ్యతిరేకంగా జరిగింది.

అందుకే మన చరిత్ర.. ప్రజల్లో ఆత్మన్యూనతా భావానికి దారి తీస్తోంది. కొత్త విజయశిఖరాలకు భారత్‌ చేరుకోవాలంటే ఈ సంకుచిత అభిప్రాయాల నుంచి విముక్తి పొందాలి’’ అని మోదీ పేర్కొన్నారు.


మరో పాతికేళ్లలో విశ్వగురువుగా భారత్‌

దేశ ప్రజల్లో మహత్తర శక్తి ఉందని, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి విశ్వగురువుగా భారత్‌ మారుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. విశాఖలోని సాగరతీరంలో నిర్వహించిన నౌకాదళ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నౌకాదళ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలను తిలకించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 1971 యుద్ధంలో భారత్‌ సాధించిన విజయానికి చిహ్నంగా నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే సముద్రాలను రక్షించే బాధ్యతను భారత నౌకాదళం సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు.

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా నిర్వహించారు. ‘డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ల్యాబరేటరీ’ కర్నూలులో స్థాపించిన ‘నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌’ దేశానికి గొప్ప ఆస్తి అని కొనియాడారు. ముదిగుబ్బ - పుట్టపర్తి రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారు. రాయచోటి నుంచి అంగల్లు వరకు నిర్మించిన జాతీయ రహదారి, కర్నూలులో నాలుగు వరుసల రహదారి పైవంతెన, ఆరు వరుసల గ్రేడ్‌ సపరేటర్‌ (పైవంతెన), బుట్టాయగూడెం, చింతూరు, రాజవొమ్మంగి, గుమ్మలక్ష్మీపురంలలో నిర్మించిన నాలుగు ఏకలవ్య పాఠశాలలను రాష్ట్రపతి ప్రారంభించారు. నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ మాట్లాడుతూ 1971 యుద్ధ సమయంలో తూర్పు నౌకాదళం కీలకపాత్ర పోషించిందని, విశాఖ అప్పుడు కేంద్ర స్థానంగా మారిందన్నారు.