కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న నాగరాజు
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని కవి పల్లిపట్టు నాగరాజు అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ ఉపాధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా నాగరాజు అవార్డును అందుకున్నారు. అణగారిన, బడుగు రైతుల కష్టాలపై నాగరాజు రచించిన యాలై పూడ్చింది కవితా సంకలనం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైంది. యువ పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ.50 వేల నగదు, జ్ఞాపికను అందజేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన నాగరాజు తెలుగు సాహిత్యంలో పీజీ చేశారు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న నాగరాజు గతంలో పలు సాహిత్య సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నారు.
ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ పురస్కారం
→ఆస్కార్ పురస్కారాల్లో ఫేవరేట్‌గా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికిగానూ, ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్.వై.ఎఫ్.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు.
→ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసింది సదరు సంస్థ. ఈ పురస్కారాన్ని అందుకున్న ఎక్కువ మంది దర్శకులు ఆస్కార్ విజేతలుగా నిలిచినట్టు హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
శ్రీశ్రీ రవిశంకర్‌కు శాంతిదూత అవార్డు ప్రదానం
→భారత ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌కు ఆమెరికాలోని మెంఫిస్‌లో నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియం ప్రతిష్ఠాత్మక ‘ది ఎమిసరీ ఆఫ్ పీస్’ (శాంతిదూత) అవార్డును ప్రదానం చేసింది.
→ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను స్థాపించిన రవిశంకర్ దాని ద్వారా ప్రాణాయామం, ఒత్తిడి నివారణ, యోగా, ధ్యానంపై స్వచ్ఛందంగా బోధిస్తున్నారు.
→అవార్డు ప్రదానం సందర్భంగా నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియం బోర్డు డైరెక్టర్ శైలా కర్కెరా మాట్లాడుతూ.. ‘ది ఎమిసరీ ఆఫ్ పీస్’ పురస్కారాన్ని శ్రీశ్రీ రవిశంకర్‌కు అందించడాన్ని గౌరవప్రదంగా, ఆనందంగా భావిస్తున్నామని అన్నారు.
ముగ్గురు తెలుగువారికి జాతీయ పురస్కారాలు
→దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
→అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు.
→ఇందులో సర్వశ్రేష్ఠ్ దివ్యాంగ్‌జన్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ కోటాబత్తిని పద్మావతి, శ్రేష్ఠ్ దివ్యాంగ బాలికగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన చిన్నారి శ్రేయా మిశ్ర, దివ్యాంగులకు ఉత్తమ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నందుకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తరఫున కె.సతీశ్‌రెడ్డి అవార్డులు అందుకున్నారు.
→కోటాబత్తిని పద్మావతి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి దివ్యాంగులకు గానం, అభినయం, నృత్యం, కంప్యూటర్, కుట్టుపని, కొవ్వొత్తులు, సాఫ్ట్ టాయ్స్ తయారీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
→శ్రేయా మిశ్రకు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ 2020 - 21లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో జరిగిన నృత్య ప్రదర్శనలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
→దివ్యాంగులకు ఉత్తమ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న ఏజెన్సీగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌ను గుర్తించి సంస్థ ఛైర్మన్ కె.సతీశ్‌రెడ్డికి పురస్కారం అందించారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రదానం
→ఎక్కడ అయినా భారతీయతనే ప్రతిబింబిస్తానని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
→భారత ప్రభుత్వం 2022 ఏడాదికి ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మభూషణ్‌ని అమెరికాలో భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్ సంధూ చేతుల మీదుగా సుందర్ పిచాయ్ స్వీకరించారు.
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు ‘జాతీయ అవార్డు’
→దివ్యాంగులకు విశిష్ఠమైన సేవలు అందిస్తున్నందుకు గాను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు జాతీయ అవార్డు లభించింది.
→అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీశ్ రెడ్డి జాతీయ అవార్డును అందుకున్నారు.
→దివ్యాంగుల సంక్షేమం కోసం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
→డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ 1999లో లైవ్లీహుడ్ అడ్వాన్స్‌మెంట్ బిజినెస్ స్కూల్ (ల్యాబ్స్) ద్వారా నైపుణ్యాల శిక్షణ, ఇతర కార్యక్రమాలను ప్రారంభించింది.
→ఇందులో భాగంగా దివ్యాంగుల ప్రయోజనాలకు చర్యలు చేపట్టింది. 2030 నాటికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌లోని సిబ్బందిలో 3% మంది దివ్యాంగులకు అవకాశం కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
→ఈ కార్యక్రమాలను ఇంకా పట్టుదలతో ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన స్ఫూర్తిని ఈ జాతీయ అవార్డు ఇస్తుందని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది.
వీఎస్‌ఆర్ నాయుడికి పీఆర్ జాతీయ ఉత్తమ పురస్కారం
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) మొదటిసారి ప్రకటించిన ప్రజాసంబంధాల (పీఆర్) జాతీయ అత్యుత్తమ సేవా పురస్కారం ఉమ్మడి ఏపీ విద్యుత్ బోర్డు విశ్రాంత ఉద్యోగి వీఎస్‌ఆర్ నాయుడికి లభించింది. భోపాల్‌లో జరిగిన 44వ అఖిల భారత ప్రజాసంబంధాల సదస్సులో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్‌కి ఆయన 1994 - 95లో ఛైర్మన్‌గా పనిచేశారు. కొత్తగా ఏర్పడిన ఏపీ అమరావతి శాఖకు 2018 నుంచి వ్యవస్థాపక ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ శాఖకు సలహాదారుడిగా ఉన్నారు.
మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. మరో రచయిత, కవి వారాల ఆనంద్‌కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు లభించింది. దక్షిణ భారతదేశంలో వందేళ్లకు పూర్వం ఉన్న దేవదాసీల వ్యవస్థ, ఆ వ్యవస్థ పెరుగుదల, క్షీణత, దేవదాసీలుగా ఉండి ప్రముఖులైన మహిళల జీవితాలపై విశ్లేషణాత్మకంగా నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’ నవల 2022 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది.
‣ ప్రకృతి వర్ణనలతో ప్రముఖ కవి గుల్జార్ హిందీలో రచించిన ‘గ్రీన్ పోయెమ్స్’ను వారాల ఆనంద్ ‘ఆకుపచ్చ కవితలు’గా అనువదించారు. దీనికి అనువాద పురస్కారం దక్కింది. మొత్తం 23 భాషల సాహితీకారులను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు దిల్లీలో ప్రకటించారు. హిందీలో ‘తుమ్‌డీ కీ శబ్ద్’ కవితా సంకలనానికి బద్రీ నారాయణ్, ‘ఆల్ ది లైవ్స్ వియ్ లివ్‌డ్’ ఆంగ్ల నవలకు గాను అనూరాధ రాయ్, ‘ఖ్వాబ్ సరబ్’ ఉర్దూ నవలా రచయిత అనిస్ అష్ఫఖ్, తమిళ నవల ‘కాలాపానీ’ రచయిత ఎం.రాజేంద్రన్‌లు కూడా పురస్కారాలకు ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్ర ఫలకం, శాలువా, జ్ఞాపిక ప్రదానం చేస్తారు. అనువాద పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్ర ఫలకం, శాలువా, జ్ఞాపిక బహూకరిస్తారు. సాహిత్య అకాడమీ పురస్కారానికి జ్యూరీ సభ్యులుగా డాక్టర్ సి.ఎల్.ఎల్.జయప్రద, డాక్టర్ నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ పి.కుసుమ కుమారి, అనువాద పురస్కారం జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్ అల్లాడి ఉమ, డాక్టర్ ఎల్.ఆర్.స్వామి, నలిమెల భాస్కర్ వ్యవహరించారు.
ఏపీకి 3 ఎనర్టియా అవార్డులు
ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ సంస్థలకు మూడు ఎనర్టియా అవార్డులు దక్కాయని ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దిల్లీలో నిర్వహించిన 15వ ఎనర్టియా అవార్డుల సమ్మిట్‌లో రాష్ట్రం తరఫున ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్‌కో వీసీఎండీ బి.శ్రీధర్ అవార్డులను అందుకున్నారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, విద్యుత్ పంపిణీ రంగంలో అత్యుత్తమంగా నిలిచిన ఏపీ ట్రాన్స్‌కో అవార్డులు దక్కించుకుంది. ఆంధ్ర రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, రాజస్థాన్‌కు చెందిన సంస్థతో సంయుక్తంగా ఉత్తమ పునరుత్పాదక సంస్థ అవార్డుకు ఎంపికైంది.
ఇద్దరు హెచ్‌సీయూ ఆచార్యులకు రాష్ట్రపతి అవార్డులు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాని (హెచ్‌సీయూ)కి చెందిన ఇద్దరు ఆచార్యులను 2021 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి అవార్డులు వరించాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నూతన సాంకేతికత అభివృద్ధిలో అత్యుత్తమ పరిశోధన చేసిన ఆచార్యులకు ఏటా రాష్ట్రపతి విజిటర్ అవార్డులు అందిస్తుంటారు. ఇలా ఏడో విజిటర్ అవార్డులను భౌతికశాస్త్ర విభాగంలో హెచ్‌సీయూ ఆచార్యులు కేసీ జేమ్స్ రాజు, సురజిత్ ధారాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు. ఒకే ఏడాది ఇద్దరు హెచ్‌సీయూ ఆచార్యులకు ఈ పురస్కారం లభించడం ఇదే తొలిసారి. గతంలో 2018, 2020లోనూ ఇక్కడి ఆచార్యులకు అవార్డులు దక్కాయి.
5జీ, రక్షణ రంగాలకు ఊతమిచ్చేలా..
జేమ్స్ రాజు 1996లో హెచ్‌సీయూలో ఆచార్యుడిగా చేరారు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అనుసంధానంగా పరిశోధనలు చేశారు. 5జీ, రక్షణ రంగాలకు అవసరమైన మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఎలక్ట్రికల్లీ ట్యూనబుల్ మైక్రోవేవ్ డివైజెస్ పేరిట వేరాక్టర్స్, రెసోనేటర్స్ పరికరాలు రూపుదిద్దారు. ఇవి ఒక రకమైన సెమీ కండక్టర్లు. ఫెర్రో ఎలక్ట్రిక్ థిన్ ఫిల్మ్స్‌తో రూపొందించారు. సాఫ్ట్‌వేర్ సాయంతో వీటి ధర్మాలను నియంత్రించే వీలుంది. 5జీ సాంకేతికతలో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బ్యాండ్‌కు జేమ్స్ రాజు అభివృద్ధి చేసిన మైక్రోవేవ్ పరికరాలు ఉపయుక్తంగా ఉంటాయి. 2013లో ప్రారంభించిన ఈ పరిశోధనకు డీఆర్డీవో, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారం అందించాయి. గతంలో ప్రతిష్ఠాత్మక అబ్దుల్ కలామ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్‌ను జేమ్స్ రాజు దక్కించుకున్నారు.
డిస్‌ప్లేలో సరికొత్త సాంకేతికత
సురజిత్ ధారా 2006 నుంచి హెచ్‌సీయూ ఆచార్యుడిగా ఉన్నారు. లిక్విడ్ క్రిస్టల్స్‌లో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ డిస్‌ప్లేలలో దీన్ని వినియోగిస్తుంటారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్రిస్టల్ డిస్‌ప్లేతో పోల్చితే ఇది ఎంతో వేగం, మన్నిక కలిగి ఉంటుంది. వీటితో పాటు లిక్విడ్ క్రిస్టల్ డ్రాప్లెట్ ఆధారిత ట్యూనబుల్ మైక్రోరెసోనేటర్స్, మైక్రో లేజర్స్‌ను ధారా అభివృద్ధి చేశారు. 2020 సంవత్సరానికి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందుకున్నారు.
భారత వైద్య సమాజానికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి
కరోనా వైరస్ సోకిన కోట్ల మంది ప్రజలకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, అవిశ్రాంతంగా విశేష సేవలందించి, కొవిడ్ యోధులుగా నిలిచిన భారతీయ వైద్య సమాజానికి ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి - 2022 అవార్డు దక్కింది. దేశంలోని వైద్యులు, నర్సులందరి తరఫున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్ (టీఎన్‌ఏ)లకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రకటించింది. కొవిడ్ విజృంభించిన 2020, 2021లలో వైద్యులు, నర్సులు నిరుపమానమైన సేవలను రోగులకు అందించారని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత సీజేఐ జస్టిస్ టి.ఎస్.ఠాకుర్ పేర్కొన్నారు. వైద్య సమాజానికి దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ మన దేశంలో లేనందున ఇందిరా గాంధీ శాంతి బహుమతిని స్వీకరించాల్సిందిగా ఐఎంఏ, టీఎన్‌ఏ సంస్థలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఐఎంఏ దేశంలో 1700 శాఖలతో 3.50 లక్షల మంది వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. టీఎన్‌ఏలో 3.80 లక్షల మంది నర్సులు సభ్యత్వం కలిగి ఉన్నారు. అవార్డు కింద రూ.కోటితో పాటు ట్రోఫీ, ప్రశంసాపత్రాన్ని పురస్కార గ్రహీతలకు అందజేస్తారు.
ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు నోరీకి శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానం
క్యాన్సర్ చికిత్సలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అందిస్తున్న సేవలు అభినందనీయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని టివోలీ గార్డెన్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు నోరీ దత్తాత్రేయుడికి శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆయనకు అవార్డు అందజేశారు.
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు 5 స్కోచ్ అవార్డులు
ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్), డీఆర్‌డీఏ విభాగాలకు 5 స్కోచ్ అవార్డులు వచ్చాయి. దిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వీటిని అందుకున్నారు. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు మంజూరుకు, స్త్రీనిధి సంస్థకు రెండు గోల్డెన్ అవార్డులు అందుకున్నారు.
మాడభూషి సంపత్‌కుమార్‌కు ‘అనువాద పురస్కారం’
తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ అనువాదకులకు ఇచ్చే పురస్కారాన్ని 2021 సంవత్సరానికిగాను ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌కు ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ.2 లక్షల నగదు, జ్ఞాపిక ప్రదానం చేయనున్నారు. 21వ తేదీన ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి ఆయన పురస్కారాన్ని స్వీకరించనున్నారు. భారతీయార్, పట్టుకోట్టై కల్యాణ సుందరం కవితలు, కనిమొళి రాసిన కరువరై వాసనై, మానావరి మనిదర్‌గళ్, సామాజిక శాస్త్రవేత్త తదితర గ్రంథాలను సంపత్‌కుమార్ తెలుగులోకి అనువదించారు. తమిళ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు తమిళ భాషాభివృద్ధి సంస్థ సంచాలకులు ప్రకటించారు. తమిళంలోని జానపద కళలు, 20వ శతాబ్దపు కవిత గ్రంథాలు, తిరుక్కురళ్ విశిష్టత గురించి అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగాలతో పాటు తమిళ, తెలుగు తులనాత్మక పరిశీలనపై వ్యాసాలు రాయడం ద్వారా ఆయన చేసిన కృషిని సంస్థ అభినందించింది.
ఇక్రిశాట్ ఇంటర్నీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం
అమెరికాలోని అట్లాంటాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాస్త్ర, సాంకేతిక సదస్సులో హైదరాబాద్‌కు చెందిన ఇక్రిశాట్ ఇంటర్నీ సర్వేశ్ ప్రభు (17)కు ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. బయోకెమిస్ట్రీ విభాగంలో చేసిన పరిశోధనల్లో భాగంగా ఆయన సీతాఫలం చెట్టు ఆకుల ద్వారా చవగ్గా లభించే జీవ వైవిధ్య పురుగుమందును ఆవిష్కరించారు. దీనికి సదస్సులో మూడో స్థానం లభించింది. ఇందుకు గాను 1000 అమెరికా డాలర్లను బహుమానంగా అందజేశారు. హైదరాబాద్‌లోని ఫిట్‌జీ విద్యా సంస్థలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సర్వేశ్ అట్లాంటాలో నిర్వహించిన ప్రి కాలేజ్ సైన్స్ ఫెయిర్‌లో ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. సర్వేశ్ ప్రభు ప్రతిభకు మెచ్చిన భారత శాస్త్ర సాంకేతిక శాఖ కూడా రూ.లక్ష మొదటి బహుమతిగా ప్రకటించింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) ఏటా పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాల్లో భాగంగా మొదటి బహుమతిగా దీన్ని అందజేసినట్లు భారత శాస్త్ర సాంకేతిక శాఖ వెల్లడించింది.
ఇంధన పరిరక్షణలో ద.మ.రైల్వేకు ఆరు పురస్కారాలు
ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే ఆరు అవార్డులను అందుకుంది. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. రైల్వేస్టేషన్ల విభాగంలో ఇంధన పరిరక్షణ చర్యలకు కాచిగూడ స్టేషన్‌కు ప్రథమ బహుమతి లభించగా హైదరాబాద్ డీఆర్‌ఎం శరత్ చంద్రయాన్‌తో పాటు జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పి.డి.మిశ్రా రాష్ట్రపతి నుంచి పురస్కారాలు అందుకున్నారు. గుంతకల్లు స్టేషన్‌కు ద్వితీయ బహుమతి రాగా గుంతకల్లు డీఆర్‌ఎం కె.వెంకటరమణారెడ్డితో పాటు పి.డి.మిశ్రా అందుకున్నారు.
ఏపీఎస్‌ఈసీఎంకు పురస్కారం
‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు - 2022’ల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల (ఎస్‌డీఏ) విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ప్రథమ పురస్కారం సాధించింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర విద్యుత్తు శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్, మిషన్ సీఈవో కె.చంద్రశేఖర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు.
రెడ్కోకు జాతీయ పురస్కారం
ఇంధన పొదుపు కార్యక్రమాల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)కు జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ రాష్ట్రానికి ఈ అవార్డు ప్రకటించిందని సంస్థ ఛైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా రెడ్కో ఎండీ జానయ్యతో కలసి సతీష్‌రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల వాడకాన్ని తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌ను మున్సిపల్ చట్టంలో చేర్చిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందన్నారు.
మాతా శిశు సంరక్షణలో తెలంగాణకు రెండు అవార్డులు
మాతా శిశు సంరక్షణలో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్రం ప్రశంసించింది. ఈ మేరకు ‘జాతీయ ప్రసూతి ఆరోగ్య సదస్సు’లో రాష్ట్రానికి 2 అవార్డులు వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థకు ప్రత్యేక అవార్డు లభించగా, హైరిస్క్ గర్భిణుల్ని గుర్తించి చికిత్స అందించడంలో రెండో స్థానం దక్కింది. దిల్లీలో ఈ అవార్డుల్ని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్.పద్మజ అందుకున్నారు.
వెంకయ్యనాయుడికి ఎస్‌ఐఈఎస్ అవార్డు
ప్రజా నాయకుడిగా అందించిన సేవలకు గాను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రతిష్ఠాత్మక ఎస్‌ఐఈఎస్ (సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ) చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే వివిధ రంగాల్లో జాతికి అందించిన సేవలకు గాను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, ప్రఖ్యాత కార్డియాలజిస్టు మార్తాండ వర్మ శంకరన్ వాలియనాథన్, భారత ప్రభుత్వ శాస్త్ర సలహాదారు అజయ్ సూద్, పేరుగాంచిన హరికథా విద్వాంసుడు విశాఖ హరిలు పురస్కారాలు అందుకున్నారు.
టెలీ కన్సల్టెన్సీ సేవల్లో తెలంగాణకు మూడో స్థానం
→టెలీ కన్సల్టెన్సీ సేవల అమలులో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
→యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేను పురస్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి డా.టి.గంగాధర్‌కు ఈ అవార్డును అందజేశారు.
→ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి డిసెంబరు 8 వరకు నిర్వహించిన టెలీ కన్సల్టేషన్ క్యాంపెయిన్‌లో తెలంగాణ సత్తా చాటింది. రెండు నెలల్లో 17.47 లక్షల కన్సల్టేషన్లను పూర్తిచేసింది.
బుద్ధవనానికి టూరిజం మిత్ర అవార్డు
→నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్ట్‌కు టూరిజం మిత్ర అవార్డు లభించింది.
→కోల్‌కతాలో జరిగిన బౌద్ధ సదస్సులో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఈ అవార్డును స్వీకరించారు.
→‘భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ (బీబీఐఎన్) బుద్ధిస్టు టూరిజం ఆపరేటర్లు టూరిజం మిత్ర అవార్డు - 2022లను ప్రదానం చేశారు.
కృష్ణ వావిలాలకు యూఎస్ ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం
→భారతీయ అమెరికన్ కృష్ణ వావిలాలను అమెరికాలోనే అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం (పీఎల్‌ఏ) వరించింది.
→హ్యూస్టన్‌కు చెందిన ఆయన ప్రవాస భారతీయ సమాజానికి, అమెరికాకు పెద్దఎత్తున చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
→అమెరికా ప్రభుత్వానికి చెందిన అమెరికా కోర్ నేతృత్వంలో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిలో అత్యుత్తమ అంకితభావం ప్రదర్శించిన వారిని ఏటా పీఎల్‌ఏ పురస్కారం వరిస్తుంది.
→ఈ సంస్థ కింద 50 లక్షల మంది అమెరికా పౌరులు వివిధ కార్యక్రమాల క్రింద అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు.
→ఈ మేరకు జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అమెరికా కోర్ సర్టిఫయర్ డాక్టర్ సోనియా ఆర్ వైట్ వావిలాలకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.
→ఇందులో శ్వేతసౌధం నుంచి అధ్యక్షుడు బైడెన్ సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, మెడల్ ఉన్నాయి. 2006లో హ్యూస్టన్ వర్సిటీలో ఇండియా స్టడీస్ పోగ్రామ్‌ను వావిలాల స్థాపించారు.
→ఈ ఏడాది ప్రారంభంలో టెక్సాస్‌లోని సదరన్ యూనివర్సిటీలోనూ ఇండియా స్టడీస్ ప్రోగ్రామ్ ప్రారంభించడంలో ఆయనదే ముఖ్య పాత్ర.
ఇంధన పరిరక్షణలో ద.మ.రైల్వేకు ఏడు అవార్డులు
→ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే ఏడు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికైంది. రైల్వేస్టేషన్ల విభాగంలో కాచిగూడ మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. ఈ అవార్డులను 2022 సంవత్సరంలో ఇంధన పొదుపులో అవలంబించిన విధానాలకు ప్రకటించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ, కేంద్ర విద్యుత్ శాఖ ఏటా వీటిని అందజేస్తున్నాయి. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా డిసెంబరు 14న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తారని ద.మ.రైల్వే వర్గాలు తెలిపాయి.
→ రైల్వేస్టేషన్ల విభాగంలో కాచిగూడ మొదటి బహుమతి, గుంతకల్లు రెండో బహుమతి సాధించాయి.
→ విజయవాడ డివిజన్‌లోని విజయవాడ, రాజమండ్రి, తెనాలి రైల్వేస్టేషన్లు ప్రతిభ పురస్కారాలకు ఎంపికయ్యాయి.
→ ప్రభుత్వ భవనాల విభాగంలో గుంతకల్లు రైల్వే ఆసుపత్రి, విజయవాడలోని ఎలక్ట్రిక్ర్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీటీసీ)లను అవార్డులు వరించాయి.
డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పురస్కారం
→‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్’ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్యనిపుణుడు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పురస్కారాన్ని అందజేశారు.
→సంస్థ 8వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా పాల్గొని డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ఈ పురస్కారాన్ని అందజేశారు.
తెలంగాణ స్టార్టప్ ఖేతికి ప్రతిష్ఠాత్మక ‘ఎర్త్‌షాట్’ బహుమతి
→తెలంగాణకు చెందిన ఖేతి స్టార్టప్ ప్రతిష్ఠాత్మకమైన ఎర్త్‌షాట్ ప్రైజ్‌ను గెలుచుకుంది.
→పర్యావరణహితంగా, చిన్న రైతులు తక్కువ పెట్టుబడితో సుస్థిర ఆదాయం పొందేలా ఈ సంస్థ రూపొందించిన ‘గ్రీన్‌హౌస్-ఇన్-ఏ-బాక్స్’ విధానం ఈ బహుమతిని తెచ్చిపెట్టింది.
→అంతర్జాతీయంగా ‘పర్యావరణ ఆస్కార్’గా గుర్తింపు పొందిన ఈ పురస్కారాన్ని బ్రిటన్ యువరాజు విలియమ్ ఏర్పాటు చేశారు.
→అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన పురస్కారాల ఉత్సవంలో తుది అయిదుగురు విజేతల్లో ఖేతి స్టార్టప్ ఒకటిగా నిలిచింది.
→ఈ బహుమతి కింద ఖేతికి 1 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ.పది కోట్లు) నగదు అందనుంది.
→ఈ పోటీకి మొత్తం వెయ్యి ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోగా ప్రకృతి రక్షణ-పునరుద్ధరణ (ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్) విభాగంలో తెలంగాణ స్టార్టప్ ఈ ప్రైజ్‌ను గెలుచుకుంది.
→ ఈ అవార్డుల జాబితాలో తొలి 15 స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంకిత్ అగర్వాల్ రూపొందించిన ‘పూల్’ ప్రాజెక్టు కూడా ఉంది.
→గంగానదిలో వేసే పుష్పాలను సేకరించి శాకాహార తోలుగా (ఫ్లెదర్)గా మార్చే సాంకేతికతను అంకిత్ అభివృద్ధి చేశారు.