రాష్ట్రీయం - ఆంధ్ర ప్రదేశ్
అక్రమ మైనింగ్ కేసుల్లో మూడో స్థానంలో ఏపీ
అక్రమ మైనింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. 2019 - 20 నుంచి 2021 - 22 మధ్య మూడేళ్ల కాలంలో వరుసగా 8,354, 10,736, 9,351 కేసులు నమోదయ్యాయి. 3,396 వాహనాలను సీజ్ చేశారు. జరిమానాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.420.91 కోట్లు వసూలు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాత అత్యధిక కేసులు రాష్ట్రంలోనే నమోదయ్యాయి. కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది.
జాతీయ రహదారిపై విమానాల ట్రయల్ రన్ విజయవంతం
బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై 33 మీటర్ల వెడల్పు, 4.1 కిలోమీటర్ల పొడవున కాంక్రీట్‌తో నిర్మించిన రన్‌వేపై భారత వాయుసేన అధికారులు విమానాలతో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. అయిదు అడుగుల ఎత్తులో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరడంతో వాయుసేన అధికారులు ప్రక్రియను ముగించారు.