సర్వేలు

మానవ అక్రమ రవాణాలో తెలంగాణకు మొదటి స్థానం

తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు చొప్పున బాధితులు అక్రమ రవాణా ముఠాల బారిన పడుతున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా కేసులు రెండున్నర రెట్లకుపైగా పెరిగాయి. 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేరగణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ తరహా కేసుల నమోదులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం మహారాష్ట్రది.

‣ 2021లో నమోదైన 347 మానవ అక్రమ రవాణా కేసుల్లో బాధితుల సంఖ్య 796. వీరిలో మహిళలు 659 కాగా పురుషుల సంఖ్య 137. మొత్తం బాధితుల్లో 777 మంది భారత్‌కు చెందిన వారే. మొత్తం బాధితుల్లో 584 మందిని వ్యభిచార కూపాల్లోకి, 202 మందిని వెట్టిచాకిరీ వ్యవస్థలోకి దింపినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. 18లోపు వయసు బాధితుల్లో బాలురు 137 మంది, బాలికలు 85 మంది ఉన్నారు. 18 ఏళ్ల వయసు పైబడిన బాధితులు 574 మంది ఉన్నారు. వీరంతా అమ్మాయిలే. కొందరిని మాత్రం గల్ఫ్‌ దేశాల్లో ఇళ్లలో పని మనుషులుగా తరలిస్తున్నారు.


మహారాష్ట్రలో అత్యధికంగా బలవన్మరణాలు

దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తమ తాజా నివేదికలో వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2021లో దేశంలో బలవన్మరణాలు 7.2% మేర పెరిగినట్లు తెలిపింది. గత ఏడాది అత్యధికంగా మహారాష్ట్రలో 22,207 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (18,925), మధ్యప్రదేశ్‌ (14,965), పశ్చిమ బెంగాల్‌ (13,500), కర్ణాటక (13,056) ఉన్నాయని పేర్కొంది.

ముఖ్యాంశాలు:-
‣ 2020లో దేశవ్యాప్తంగా 1,53,052 బలవన్మరణాలు చోటు చేసుకోగా, 2021లో ఆ సంఖ్య 7.2% మేర పెరిగింది.

‣ 2021లో చోటు చేసుకున్న ఆత్మహత్యల్లో మహారాష్ట్ర (13.5%), తమిళనాడు (11.5%), మధ్యప్రదేశ్‌ (9.1%), పశ్చిమ బెంగాల్‌ (8.2%), కర్ణాటక (8%) వాటా ఎక్కువగా ఉంది.

‣ మొత్తంగా భారత్‌లో ఆత్మహత్యల రేటు 2021లో 12%గా ఉంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఈ రేటు అత్యధికంగా 39.7%గా ఉండగా, సిక్కిం (39.2%), పుదుచ్చేరి (31.8%), తెలంగాణ (26.9%), కేరళ (26.9%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


సైబర్‌ నేరాలు తెలంగాణలోనే ఎక్కువ

సైబర్‌ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లో తొలి స్థానం. ఆర్థిక నేరాల్లో రెండు. వృద్ధులపై దాడుల్లో మూడు. రైతు ఆత్మహత్యల్లో నాలుగో స్థానం. ఇదీ దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. 2021 సంవత్సరంలో నమోదైన కేసులకు సంబంధించిన గణాంకాల్ని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసింది. రాష్ట్రంలో 2019లో 1,18,338, 2020లో 1,35,885 కేసులుంటే 2021లో 1,46,131 నమోదయ్యాయి.

‣ దేశవ్యాప్తంగా 52,430 కేసులు వెలుగు చూస్తే దాదాపు 20 శాతం తెలంగాణలోనివే. రెండో స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ (8,829) ఉంది.

‣ ఏటీఎం (443), ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలు (2180), ఓటీపీ మోసాలు (1377), మార్ఫింగ్‌ (18), ఫేక్‌ ప్రొఫైల్‌ తయారీ (37) ఇలా పలు నేరాలు తెలంగాణలోనే అధికం.

‣ ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్‌ నేరాలు కూడా తెలంగాణ (8690)లోనే ఎక్కువగా నమోదయ్యాయి.


వృద్ధులపై దాడుల్లో మూడో స్థానం
వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో అత్యధికంగా 6190 కేసులు నమోదు కాగా మధ్యప్రదేశ్‌లో 5273, తెలంగాణలో 1952, తమిళనాడులో 1841, ఆంధ్రప్రదేశ్‌లో 1818 నమోదయ్యాయి.

‣ వృద్ధుల ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడిన కేసుల్లో తెలంగాణది అగ్రస్థానం. దేశవ్యాప్తంగా 999 కేసులు నమోదైతే తెలంగాణలోనే 40 శాతం (403) కేసులున్నాయి.

‣ వృద్ధుల మరణాలకు సంబంధించి 304 ఐపీసీ సెక్షన్‌ కింద నమోదైన మరణాలు తెలంగాణలోనే అధికం (21).


దళిత మహిళలకు అవమానాలు :-
దళిత మహిళలను అవమానించిన కేసులు తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఈ కేసులు 151 ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 104 (68 శాతం) నమోదయ్యాయి. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 83, తెలంగాణలో 21 కేసులున్నాయి.

‣ దళిత మహిళలపై అత్యాచారం కేసుల్లో తెలంగాణది అయిదో స్థానం. రాజస్థాన్‌లో అత్యధికంగా 566 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌ (564), ఉత్తర్‌ప్రదేశ్‌ (559), మహారాష్ట్ర (395), తెలంగాణ (256) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో నమోదైన అత్యాచార బాధితురాళ్లలో 118 మంది బాలికలే. గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారం కేసుల్లో తెలంగాణ 103 కేసులతో ఆరో స్థానంలో ఉంది.

‣ దళితులపై జరిగిన నేరాల్లో రాష్ట్రం ఎనిమిదో స్థానంలో, గిరిజనులపై జరిగిన నేరాల్లో అయిదో స్థానంలో ఉంది.

‣ దళితులపై జరిగిన నేరాల్లో శిక్షల శాతం తెలంగాణలో 8.2 శాతం మాత్రమే. ఈ విషయంలో దేశ సగటు 36 శాతం. తెలంగాణ కంటే పది రాష్ట్రాలు ముందున్నాయి.


ఆర్థిక నేరాలూ అధికమే:-
తెలంగాణలో ఆర్థిక నేరాలు ఏటా దూసుకెళ్తున్నాయి. 2019లో 11,465, 2020లో 12,985 కేసులు నమోదైతే, 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి.
‣ 2021లో దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో రాష్ట్రానిది రెండో స్థానం. రాజస్థాన్‌ 23,757 కేసులతో అగ్రస్థానంలో ఉంది.
‣ ఆర్థిక నేరాల కేసులు వీగిపోవడంలోనూ తెలంగాణది అగ్రస్థానమే. 1832 కేసులు ఇలా వీగిపోయాయి. నిందితులకు శిక్షలు పడిన కేసుల సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌ (2068) అగ్రభాగాన ఉండగా, తర్వాతి స్థానంలో తెలంగాణ (853) ఉండటం విశేషం.

‣ రాష్ట్రంలో ఫోర్జరీ, నమ్మకద్రోహం, మోసం కేసులు 20,065 నమోదయ్యాయి. ఇవి రాజస్థాన్‌లో 23,348 కాగా, తెలంగాణది రెండో స్థానం.

‣ క్రెడిట్, డెబిట్‌ కార్డు మోసాల్లో తెలంగాణది తొలిస్థానం. దేశవ్యాప్తంగా 3275 కేసులుంటే తెలంగాణలోనే 1092 నమోదయ్యాయి. మోసం, నమ్మకద్రోహం జాబితాలో 5,770 కేసులతో తెలంగాణ టాప్‌లో ఉంది.

‣ చీటింగ్‌ కేసుల్లో (420 సెక్షన్‌) 12,426 కేసులతో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. 14,911 కేసులతో రాజస్థాన్‌ది తొలిస్థానం. ఆస్తులు, పత్రాల కేసుల్లోనూ తెలంగాణది రెండో స్థానం.

‣ భూములు, స్థలాల్ని నేరపూరితంగా ఆక్రమించడంలో 7886 ఘటనలతో తెలంగాణది తొలిస్థానం.

‣ అవినీతి నిరోధక చట్టం కింద కేసుల నమోదులో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర (773), రాజస్థాన్‌ (423) తర్వాత తెలంగాణలో 423 కేసులు నమోదయ్యాయి.

‣ ఆహారం, ఔషధ కల్తీ కేసులలో తెలుగు రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో మొత్తం కేసులు 8320 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 6,575, తెలంగాణలో 1,326 నమోదయ్యాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఈ స్థాయి కేసులు లేవు.

దేశవ్యాప్తంగా 2083 లైంగిక (మానవ) అక్రమ రవాణా కేసులు నమోదు కాగా తెలంగాణలో అధికంగా 347 కేసులున్నాయి. ఈ కేసుల్లో 584 మంది బాధితురాళ్లను వ్యభిచార గృహాలకు తరలించారు. ఈ విషయంలో మహారాష్ట్ర తర్వాత స్థానం తెలంగాణదే. అక్రమ రవాణా కేసుల్లో 1050 మంది నిందితుల అరెస్టుతో తెలంగాణ తొలిస్థానంలో ఉంది.

రోడ్డు ప్రమాదాల్లో 10.8 శాతం పెరుగుదల

రోడ్డు ప్రమాదాల్లో సింహభాగం తమిళనాడులో జరుగుతున్నాయి. 2020తో పోల్చితే 2021లో 58 శాతం అక్కడ పెరిగాయి. యూపీ (15.2 శాతం), తెలంగాణ (10.8 శాతం), ఏపీ (9.5 శాతం), పంజాబ్‌ (9.1 శాతం) అధికమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.


రైతు ఆత్మహత్యల్లో నాలుగో స్థానం

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 బలవన్మరణాలు సంభవించాయి. వీటిలో 4806 మంది రైతులు, మరో 5121 మంది కౌలురైతులు, 5563 మంది రైతుకూలీలు.


పెరిగిన బలవన్మరణాలు:-
దేశంలో 2020తో పోల్చితే 2021లో బలవన్మరణాలు పెరిగాయి. 2021లో అధికంగా 33.2 శాతం ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు కారణంగా నిలిచాయి. వివాహ ఇబ్బందులు 4.8 శాతం, అనారోగ్య సమస్యలతో 18.6 శాతం కారణాలుగా ఉన్నాయి.


గుర్తు తెలియని వర్గాల నుంచి జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్లు

జాతీయ పార్టీలు 2004 - 05 నుంచి 2020 - 21 మధ్య గుర్తు తెలియని వర్గాల నుంచి రూ.15,077 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) విశ్లేషించింది. ఇదే వర్గాల నుంచి 2020 - 21లో జాతీయ, ప్రాంతీయ పార్టీలు రూ.690.67 కోట్లను పొందినట్లు నివేదికలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో ఎనిమిది జాతీయ పార్టీలను, 27 ప్రాంతీయ పార్టీను ఏడీఆర్‌ పరిగణనలోకి తీసుకుంది. జాతీయ పార్టీల్లో భాజపా, కాంగ్రెస్, ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో ఆప్, ఏజీపీ, ఎమ్‌ఎన్‌ఎస్, ఏఐఏడీఎంకే, డీఎండీకే, డీఎంకే, జేడీఎస్, జేడీయూ, జేఎంఎం, శివసేన, తెదేపా, తెరాస, వైకాపా తదితర పార్టీలు ఉన్నాయి. పార్టీల ఆదాయపు పన్ను రిటర్న్‌లు, భారత ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన విరాళాల వివరాల ఆధారంగా రూ.15,077 కోట్లకు పైగా వాటికి నిధులు వచ్చినట్లు వెల్లడైంది.


‣ 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.178.782 కోట్లు గుర్తుతెలియని వర్గాల ద్వారా వచ్చినట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇది జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 41.89% (అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.426.742 కోట్లు). అదేవిధంగా రూ.100.502 కోట్లను పొందినట్లు భాజపా తెలిపింది. ఇదే తరహాలో అత్యధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీల్లో వైకాపా (రూ.96.25 కోట్లు), డీఎంకే (రూ.80.02 కోట్లు), బీజేడీ (రూ.67 కోట్లు), ఎమ్‌ఎన్‌ఎస్‌ (రూ.5.77 కోట్లు), ఆప్‌ (రూ.5.4 కోట్లు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నట్లు వెల్లడైంది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏడు రాజకీయ పార్టీల ఆడిట్, కంట్రిబ్యూషన్‌ నివేదికల్లో తేడాలు ఉన్నట్లు విశ్లేషణలో తేలింది.


క్యాన్సర్‌ కారక మరణాలపై లాన్సెట్‌ అధ్యయనం

ధూమపానం, మద్యపానం, అధిక బరువు కారణంగా 2019లో ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల మంది మరణించినట్లు ప్రముఖ జర్నల్‌ ‘ద లాన్సెట్‌’ వెల్లడించింది. క్యాన్సర్‌ కారక మరణాలపై చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలిపింది. క్యాన్సర్‌ కారణంగా అదే సంవత్సరంలో 28 లక్షల మంది పురుషులు, 16 లక్షల మంది మహిళలు మరణించినట్టు విశ్లేషించింది. 2010తో పోల్చితే 2019లో క్యాన్సర్‌ కారక మరణాలు 20.40%, పీడితుల సంఖ్య 16.80% పెరిగినట్టు విశ్లేషించింది.

‣ క్యాన్సర్‌ మహమ్మారి ప్రజారోగ్యానికి భారీ సవాలు విసురుతోందన్నది తమ అధ్యయనం ద్వారా స్పష్టమైందని పరిశోధనకర్త, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవొల్యూషన్‌ (ఐహెచ్‌ఎంఈ) డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ ముర్రే పేర్కొన్నారు. పర్యావరణ, వృత్తిపర పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తన, జీవక్రియలు వంటి 34 కారణాలు 23 రకాల క్యాన్సర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది పరిశోధకులు విశ్లేషించారు. ధూమపానం, మద్యపానం కారణంగా అధికంగా క్యాన్సర్లు తలెత్తి మరణాలు సంభవిస్తున్నట్టు తేల్చారు.


బానిసత్వపు ఛాయలు ఇంకా తొలగిపోలేదు : ఐరాస తాజా నివేదిక

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బానిసత్వపు ఛాయలు ఇంకా తొలగిపోలేదని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక స్పష్టం చేసింది. వివిధ రూపాల్లో ఆ జాఢ్యం కొనసాగుతూనే ఉందని తెలిపింది. దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో బాలకార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పేర్కొంది.


‣ ‘బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి కారణాలు, ప్రభావాలు’ అనే అంశంపై ఐరాస మానవహక్కుల మండలి ప్రత్యేక ప్రతినిధి తొమోయా ఒబొకటా తన నివేదికను తాజాగా సమర్పించారు. బానిసత్వం, సామ్రాజ్యవాద భావన, ప్రభుత్వ ప్రాయోజిత వివక్ష వంటివాటితో ప్రపంచవ్యాప్తంగా మైనారిటీ వర్గాలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయని అందులో పేర్కొన్నారు. భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, సోమాలియా, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, కజఖ్‌స్థాన్‌ వంటి దేశాల్లో మహిళలు, బాలికల బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు.


2030లో 60 లక్షల మంది కోటీశ్వరులు: హెచ్‌ఎస్‌బీసీ

2030 నాటికి భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 60 లక్షలకు చేరే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌ పీఎల్‌సీ పేర్కొంది. దేశ వయోజనుల్లో ఈ సంఖ్య 1 శాతానికి సమానమవుతుందని పేర్కొంది. అప్పటికి చైనాలో వీరి సంఖ్య 5 కోట్లకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఆసియాలో అత్యధిక సంపన్నులు ఉండే దేశాల్లో ఆస్ట్రేలియాను సింగపూర్‌ అధిగమించొచ్చని అంచనా వేసింది. 2030 నాటికి మొదటి నాలుగు స్థానాల్లో సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, తైవాన్‌ నిలవనున్నాయి. ఈ నాలుగు దేశాల్లో సంపన్నుల నిష్పత్తి, అమెరికా కంటే అధికంగా ఉండొచ్చని పేర్కొంది. 2021లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, సింగపూర్‌ రెండో స్థానంలో నిలిచింది. కనీసం 2,50,000 డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉండే వారిని కోటీశ్వరులుగా సంస్థ పేర్కొంది.