రాష్ట్రీయం-తెలంగాణ

ఓడీఎఫ్‌ ప్లస్‌లో తెలంగాణ టాప్‌

బహిరంగ మల విసర్జనను పూర్తిగా పరిహరించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ) ప్లస్‌ స్థాయి పొందిన టాప్‌ 5 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లు ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ దేశంలోని 1,01,462 గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ స్థాయిని పొందగా, అందులో అత్యధిక గ్రామాలు ఈ అయిదు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిపింది. 2024-25నాటికల్లా సంపూర్ణ స్వచ్ఛభారత్‌ సాధించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.

‣ గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు తాగునీరు అందించే టాప్‌-3 రాష్ట్రాల్లోనూ తెలంగాణ నిలిచినట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ పేర్కొంది. రాష్ట్రాలపరంగా చూస్తే.. గోవా, తెలంగాణ, హరియాణ, కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి, దాద్రానగర్‌హవేలీ దయ్యూదామన్, అండమాన్‌నికోబార్‌ దీవులు 100% ఇళ్లకు నల్లా నీరు అందిస్తున్నట్లు వెల్లడించింది.

‣ దేశవ్యాప్తంగా 117 ఆకాంక్షిత(వెనుకబడిన) జిల్లాల్లో తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పంజాబ్‌లోని మోగా, హరియాణాలోని మేవాట్, హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలు 100% గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు అందిస్తున్నట్లు వెల్లడించింది.


హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

హైకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన ఆరుగురితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన ఇ.వి.వేణుగోపాల్, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్, కాజ శరత్‌లతోపాటు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన జె.శ్రీనివాసరావు, ఎన్‌.రాజేశ్వరరావులతో వరుస క్రమంలో ప్రమాణం చేయించారు.

టీ-హబ్, హైదరాబాద్‌ ఏంజెల్స్‌ భాగస్వామ్యం

అంకుర సంస్థల మూలధన అవసరాలు తీర్చడానికి, పరిశోధనలు- ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి టీ-హబ్, హైదరాబాద్‌ ఏంజెల్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌ ఏంజెల్స్, మనదేశం నుంచి మాత్రమే కాకుండా యూఎస్, సింగపూర్, యూకే, దుబాయ్, యూఏఈ తదతర దేశాల నుంచి మన అంకుర సంస్థలకు నిధులు సమీకరించే యత్నాలు చేస్తుంది. దీనివల్ల అంకుర సంస్థలకు నిధులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనుభవంతో కూడిన మార్గ దర్శకత్వం లభిస్తుందని టీ-హబ్‌ సీఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్‌లో అంకుర సంస్థలకు అనువైన పరిస్థితులున్నందున, వాటికి అండగా నిలిచేందుకు తాము సిద్ధపడినట్లు హైదరాబాద్‌ ఏంజెల్స్‌ ఛైర్మన్‌ రాజేష్‌ మంతెన పేర్కొన్నారు.

ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ

సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైంది. ఆగస్టు 25న దిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖలతో పాటు ఇజ్రాయెల్, స్వీడన్‌ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా నిర్వహించే ‘ది డిజీ టెక్‌ కాన్‌క్లేవ్‌- 2022’లో ఈ పురస్కారం అందజేయనున్నారు.

‣ కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో పరిశోధన, అధ్యయనం తరువాతే తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ ఎడిటర్‌ టి.రాధాకృష్ణ చెప్పారు. సరళతర వ్యాపార నిర్వహణ, సంస్కరణల కోసం అమలుచేస్తున్న కార్యాచరణతో పాటు మీసేవ పోర్టల్‌తో ప్రజలకు అందిస్తున్న మెరుగైన డిజిటల్‌ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు.


జాతీయ చేనేత పురస్కారాల ప్రదానం

చేనేత కళను నమ్ముకుని కొన్ని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక చేనేత కళాకారులు కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌లు జాతీయ హస్తకళల పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, జౌళి శాఖ సహాయ మంత్రి దర్శనావిక్రమ్‌ జర్దోష్‌ల చేతుల మీదుగా స్వీకరించారు. వీరిద్దరూ కలిసి పది నెలల పాటు శ్రమించి మగ్గంపై నేసిన ‘తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర’ను చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో 2018 సంవత్సరానికి చేనేత కళాకారుల విభాగంలో పురస్కారానికి ఎంపిక చేసింది.

‣ ‘మార్కెటింగ్‌ విభాగం’లో పుట్టపాకకు చెందిన చేనేత వస్త్ర వ్యాపారి గజం భగవాన్‌ పీయూష్‌ గోయల్, దర్శనా జర్దోష్‌ నుంచి జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు. మార్కెటింగ్‌ విభాగంలో ప్రవేశపెట్టిన పురస్కారానికి 2018 సంవత్సరానికి ఎంపికైన భగవాన్‌ ‘నీహారిక సిల్క్‌ శారీస్‌’ పేరుతో హైదరాబాద్‌లో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

రుణవిముక్తి కమిషన్‌ ఛైర్మన్‌గా మరోసారి నాగూర్ల

రాష్ట్ర సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ వృత్తిదారుల రుణ విముక్తి కమిషన్‌ ఛైర్మన్‌గా నాగూర్ల వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా ఈ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. మరోసారి ఆయనను ఇదే పదవిలో నియమించాలని తాజాగా సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా సంజయ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ (టీఎస్‌పీసీ) అధ్యక్షుడిగా ఆకుల సంజయ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ నుంచి ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో కౌన్సిల్‌ సభ్యులు సంజయ్‌రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.