క్రీడలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు నాలుగో స్థానం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఈ సారి 61 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. 2010లో సొంతగడ్డపై జరిగిన క్రీడల్లో 38 స్వర్ణాలు సహా 101 పతకాలతో పట్టికలో మన దేశానికి రెండో స్థానం దక్కింది. 2002లో 30 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించడం తర్వాతి ఉత్తమ ప్రదర్శన. 2018 నాటి ప్రదర్శన (26 స్వర్ణాలు సహా 66 పతకాలు) మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఉత్తమ ప్రదర్శన అంటే ప్రస్తుత క్రీడల్లోనే. ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత క్రీడల్లో 67 స్వర్ణాలు సహా 178 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌ (57 స్వర్ణాలు సహా 176 పతకాలు), కెనడా (26 స్వర్ణాలు సహా 92 పతకాలు) తర్వాతి రెండు స్థానాలు సాధించాయి. ముగింపు వేడుకల్లో శరత్‌ కమల్, నిఖత్‌ జరీన్‌ పతాకధారులుగా వ్యవహరించారు. ‣ చివరి రోజు భారత్‌ నాలుగు స్వర్ణాలు సాధించింది. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే. అగ్రశ్రేణి షట్లర్, ప్రపంచ ఏడో ర్యాంకర్‌ పి.వి.సింధు మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 21-15, 21-13తో 13వ ర్యాంకు క్రీడాకారిణి మిచెలీ లి (కెనడా)ను ఓడించి స్వర్ణం సాధించింది. లక్ష్యసేన్‌ బ్యాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ సాధించాడు. ప్రపంచ పదో ర్యాంకర్‌ లక్ష్య ఫైనల్లో 19-21, 21-9, 21-16తో 42వ ర్యాంకు క్రీడాకారుడు జి యాంగ్‌ (మలేసియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజు.. చిరాగ్‌ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్‌ స్వర్ణం సాధించాడు. ఈ జోడీ 21-15, 21-13తో బెన్‌ లేన్‌-సీన్‌ మెండీ (ఇంగ్లండ్‌) జంటను ఓడించింది.

పాత ఫార్మాట్లోకి దులీప్‌ ట్రోఫీ

దులీప్‌ ట్రోఫీ మూడేళ్ల తర్వాత తిరిగి పాత జోనల్‌ ఫార్మాట్లోకి వెళ్లింది. సెప్టెంబరు 8న ఆరంభమయ్యే సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. వివిధ వయో విభాగాల్లో మొత్తం 1500 మ్యాచ్‌లు ఉంటాయి. ఆరు నెలలకు పైగా నడిచే ఈ సీజన్‌ దులీప్‌ ట్రోఫీతో మొదలవుతుంది. ముస్తాక్‌ అలీ ట్రోఫీ అక్టోబరు 11 నుంచి నవంబరు 5 వరకు, విజయ్‌ హజారే ట్రోఫీ నవంబరు 12 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతాయి. ‣ రంజీ ట్రోఫీని కూడా పాత ఫార్మాట్లోకి మార్చారు. డిసెంబరు 13 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరిగే రంజీ ట్రోఫీలో గతంలోలా ఎలైట్, ప్లేట్‌ గ్రూపులు ఉంటాయి. ఎలైట్‌లో 32 (నాలుగు గ్రూపులు) జట్లు పోటీపడతాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్లేట్‌ గ్రూపులో ఆరు జట్లు మొత్తం 15 మ్యాచ్‌లు ఆడతాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ప్రవేశిస్తాయి. బీసీసీఐ మొదటిసారి బాలికల అండర్‌-16 వన్డే టోర్నమెంట్‌ను నిర్వహించనుంది.

600 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా డ్వేన్‌ బ్రావో

టీ20 క్రికెట్లో 600 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు డ్వేన్‌ బ్రావో ఘనత సాధించాడు. ‘ది హండ్రడ్‌’ టోర్నీలో నార్తన్‌ సూపర్‌ఛార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్‌ ఇన్విన్స్‌బుల్స్‌తో మ్యాచ్‌లో సామ్‌ కరన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. డ్వేన్‌ 516 ఇన్నింగ్స్‌ల్లో 600 వికెట్లు మార్క్‌ అందుకున్నాడు. సామ్‌ కరన్‌ను ఔట్‌ చేసి 600 వికెట్లు సాధించిన తర్వాత కాళ్లు, చేతులు చిత్రంగా ఆడిస్తూ బ్రావో సంబరాలు చేసుకున్నాడు.

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండు కంచు పతకాలు

44వ చెస్‌ ఒలింపియాడ్‌ను భారత్‌ రెండు కంచు పతకాలతో ముగించింది. మహిళల-1, పురుషుల-2 జట్లు పోడియంపై నిలిచాయి. చివరిదైన 11వ రౌండ్లో మహిళల-1 జట్టు కంచు పతకం సాధించింది. పదో రౌండ్‌ వరకు అగ్రస్థానంలో ఉన్న భారత మహిళల-1 జట్టు చివరిదైన 11వ రౌండ్లో 1-3తో అమెరికా చేతిలో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుంది. తొఖిర్‌జొనోవాతో గేమ్‌ను హంపి, ఇరినా కృష్‌తో గేమ్‌ను వైశాలి డ్రాగా ముగించారు. పురుషుల-2 జట్టు విజమూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.
‣ చెస్‌ ఒలింపియాడ్‌ మహిళల విభాగంలో పతకం సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి. భారత్‌-2 ఎనిమిదో స్థానం సాధించగా.. భారత్‌-3 (ఈషా, నందిద, సాహితి, ప్రత్యూష) 17వ స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌ స్వర్ణం గెలుచుకుంది. ఆఖరి రౌండ్లో ఆ జట్టు 3-1తో పోలెండ్‌పై విజయం సాధించింది. జార్జియా రజతం గెలుచుకుంది. ఓపెన్‌ విభాగంలో భారత్‌-2 మూడో స్థానంలో నిలిచింది. గుకేశ్, నిహాల్‌ సరీన్, ప్రజ్ఞానంద, రౌనక్‌ సధ్వానిలతో కూడి ఈ జట్టు ఆఖరి రౌండ్లో 3-1తో జర్మనీపై విజయం సాధించింది.
‣ అమెరికాతో తమ చివరి రౌండ్‌ గేమ్‌ను డ్రాగా ముగించిన భారత్‌-1 (హరికృష్ణ, విదిత్, అర్జున్‌ నారాయణన్‌).. నాలుగో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్థాన్‌ స్వర్ణం ఎగరేసుకుపోయింది. చెస్‌ ఒలింయాడ్‌లో భారత్‌ 2014లో తొలిసారి పతకం (ఓపెన్‌లో కాంస్యం) గెలుచుకుంది. వ్యక్తిగత ప్రదర్శనలకుగాను గుకేశ్, సరీన్‌ స్వర్ణాలు.. అర్జున్‌ రజతం గెలుచుకున్నారు. ప్రజ్ఞానంద, వైశాలి, తానియా సచ్‌దేవ్, దివ్య దేశ్‌ముఖ్‌ కాంస్యాలు సాధించారు.

బంగ్లా కోచ్‌గా శ్రీరామ్‌

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ బంగ్లాదేశ్‌ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లకు శ్రీధర్‌ను కోచ్‌గా నియమిస్తూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) నిర్ణయం తీసుకుంది. రసెల్‌ డొమినిగో (దక్షిణాఫ్రికా) టెస్టు జట్టు కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ పేర్కొంది. 2000 నుంచి 2004 వరకు 8 వన్డేల్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీరామ్‌.. ఆస్ట్రేలియా జట్టుకు సహాయ, బౌలింగ్‌ కోచ్‌గా సుదీర్ఘ కాలం పాటు సేవలందించాడు.

ప్రజ్ఞానంద హ్యాట్రిక్‌

అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌లో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించాడు. మూడో రౌండ్లో హన్స్‌ నీమన్‌ (అమెరికా)పై 2.5-1.5తో విజయం సాధించాడు. నాలుగు గేమ్‌ల ఈ పోరులో తొలి గేమ్‌లో ఓడిన ప్రజ్ఞానంద.. రెండు, నాలుగు గేమ్‌లలో నెగ్గి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌ డ్రాగా ముగిసింది. ఈ విజయంతో తొమ్మిది పాయింట్లతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో సంయుక్తంగా ప్రజ్ఞానంద అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో తొలి రౌండ్లో అలీరెజాపై, రెండో రౌండ్లో అనీష్‌ గిరిపై ప్రజ్ఞానంద గెలిచాడు.

ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌లో వీఏఆర్‌ టెక్నాలజీ

వచ్చే అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌లో వీడియో అసిస్టెంట్‌ రిఫరీ (వీఏఆర్‌) టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఈ వయో విభాగం ప్రపంచకప్‌లో వీఏఆర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో రిఫరీకి వీఏఆర్‌ ఉపయోగపడుతుంది. అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ అక్టోబరు 11 నుంచి 30 వరకు భారత్‌లో జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో క్రీడాకారులు సత్తాచాటారు. ఆగస్టు 26 నుంచి 28 వరకు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన పోటీల్లో 44 స్వర్ణాలు, 45 రజతాలు, 32 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలు కైవసం చేసుకున్నారు. విజయవాడ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనంతపురం, విశాఖపట్నం, కడప, హీల్‌ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్న ‘లక్ష్య’ క్రీడాకారులు పోటీల్లో జోరు చూపించారు. అండర్‌-14 బాలికల విభాగంలో డింపుల్‌ మహశ్రీ (స్వర్ణం - ట్రయథ్లాన్, స్వర్ణం - 60 మీటర్లు; పశ్చిమ గోదావరి) ఉత్తమ అథ్లెట్‌గా నిలిచింది.
‣ అండర్‌-18 బాలికల్లో నాగ విహారిక (స్వర్ణం - 100 మీ., స్వర్ణం - 100 మీ. హర్డిల్స్‌; గుంటూరు), అండర్‌-18 బాలురలో సుధీర్‌రెడ్డి (స్వర్ణం - 100 మీ; అనంతపురం) ఉత్తమ అథ్లెట్లుగా అవార్డులు అందుకున్నారు.
‣ అండర్‌-20 బాలికల్లో ప్రత్యూష (స్వర్ణం - 100 మీ.; అనంతపురం), అండర్‌-20 బాలురలో భాను శ్రీనివాస్‌ (స్వర్ణం - 100 మీ హర్డిల్స్‌; గుంటూరు) ఉత్తమ అథ్లెట్లుగా నిలిచారు. విజయవాడకు చెందిన కరుణశ్రీ (స్వర్ణం - 800 మీ., రజతం - మిక్స్‌డ్‌ రిలే, రజతం - 4×400 మీ. రిలే) మూడు పతకాలతో మెరిసింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహాలక్ష్మి (స్వర్ణం - లాంగ్‌జంప్, స్వర్ణం - 400 మీ.), మనీషా (స్వర్ణం - జావెలిన్‌ త్రో, స్వర్ణం - డిస్కస్‌ త్రో), వికాస్‌ (స్వర్ణం - షాట్‌పుట్, స్వర్ణం - డిస్కస్‌ త్రో), కావ్యాంజలి (స్వర్ణం - 1500 మీ., కాంస్యం - 800 మీ.) రెండేసి పతకాలతో సత్తాచాటారు. చిత్తూరు జిల్లా క్రీడాకారులు సాత్విక్‌ (స్వర్ణం - డిస్కస్‌ త్రో, రజతం - షాట్‌పుట్‌), గణేశ్‌ (స్వర్ణం - డిస్కస్‌ త్రో, కాంస్యం - షాట్‌పుట్‌), గుంటూరు అథ్లెట్‌ సంజయ్‌ బాబు (స్వర్ణం - షాట్‌పుట్, కాంస్యం - డిస్కస్‌ త్రో), శ్రీకాకుళం అమ్మాయి చేతన (స్వర్ణం - 200 మీ., రజతం - 100 మీ.); విజయనగరానికి చెందిన అశోక్‌ (స్వర్ణం - 3000 మీ. స్టీపుల్‌ ఛేజ్, రజతం - 1500 మీ.); విశాఖపట్నం అథ్లెట్లు కావ్య (స్వర్ణం - ట్రిపుల్‌ జంప్, స్వర్ణం - హైజంప్‌), లోహిత్‌కుమార్‌ (స్వర్ణం - 400 మీ., రజతం - 200 మీ.) రెండేసి పతకాలు సాధించారు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌) ఛాంపియన్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అతడు 21-5, 21-16తో కున్లావత్‌ విదిత్‌సరన్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అక్సెల్‌సెన్‌కు ఇది మూడో పతకం. 2017లో గ్లాస్గో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అతడు, 2014లో కాంస్యం సాధించాడు. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో ఈ డెన్మార్క్‌ స్టార్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో అకానె యమగూచి (జపాన్‌) టైటిల్‌ నిలబెట్టుకుంది. తుది సమరంలో టాప్‌సీడ్‌ యమగూచి 21-12, 10-21, 21-14తో చెన్‌ యుఫియ్‌ (చైనా)ను ఓడించింది. 2021లోనూ యమగూచి ప్రపంచ ఛాంపియన్‌ అయింది. మొత్తం మీద ఆమెకు ఇది మూడో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకం. 2018లో ఈ జపాన్‌ అమ్మాయి కాంస్యం నెగ్గింది.

బెల్జియన్‌ గ్రాండ్‌ ప్రి విజేతగా వెర్‌స్టాపెన్‌

ఫార్ములా వన్‌లో బెల్జియం రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. బెల్జియన్‌ గ్రాండ్‌ ప్రిలో 14వ స్థానంలో రేసు మొదలెట్టిన ఈ రెడ్‌బుల్‌ రేసర్‌ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో అతనికిది తొమ్మిదో రేసు విజయం. గంటా 25 నిమిషాల 52.894 సెకన్లలో అతను రేసు ముగించాడు. సెర్గియో (రెడ్‌బుల్‌), కార్లోస్‌ (ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ విజయంతో వెర్‌స్టాపెన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పాయింట్లలో అగ్రస్థానాన్ని (284) మరింత పదిలపర్చుకున్నాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో సాత్విక్‌ - చిరాగ్‌కు కాంస్యం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌ పురుషుల డబుల్స్‌లో సెమీస్‌ చేరి, ఈ విభాగంలో దేశానికి తొలి పతకం ఖాయం చేసి చరిత్ర సృష్టించిన సాత్విక్‌ సాయిరాజ్‌ - చిరాగ్‌ శెట్టి జోడీ కాంస్యంతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సెమీస్‌లో సాత్విక్‌ - చిరాగ్‌ ద్వయం 22-20, 18-21, 16-21 తేడాతో ఆరోన్‌ చియా - సో వూయి (మలేసియా) చేతిలో పోరాడి ఓడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇది 13వ పతకం. పురుషుల డబుల్స్‌లో మొదటిది. 2011 నుంచి ప్రతిసారి ఈ టోర్నీలో కనీసం ఒక్క పతకమైనా గెలిచే ఆనవాయితీని ఈ సారి కూడా భారత్‌ కొనసాగించినట్లయింది.

చరిత్ర సృష్టించిన సాత్విక్‌ - చిరాగ్‌

భారత నంబర్‌వన్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు - చిరాగ్‌ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గి, అంతకుముందు థామస్‌ కప్‌లో భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సాత్విక్‌ - చిరాగ్‌ జోడీ మరో ఘనత అందుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత పురుషుల జోడీగా రికార్డు నెలకొల్పింది. క్వార్టర్‌ఫైనల్లో ఏడో సీడ్‌ సాత్విక్‌ - చిరాగ్‌ జోడీ 24-22, 15-21, 21-14తో ప్రపంచ మాజీ ఛాంపియన్స్, రెండో ర్యాంకర్‌ తకురొ హొకి - యుగొ కొబయాషి (జపాన్‌) జంటపై జయభేరి మోగించింది. ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించి కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ డబుల్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. పురుషుల విభాగంలో మొదటిది. ‣ 2011లో గుత్తా జ్వాల - అశ్విని పొన్నప్ప జోడీ కాంస్య పతకం సాధించింది. మొత్తంగా ఇది 13వ పతకం. 1983లో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్‌ పదుకొణె కాంస్యం నెగ్గాడు. స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు అత్యధికంగా అయిదు పతకాలు గెలుచుకుంది. 2013, 2014లలో రెండు కాంస్యాలు, 2017, 2018లలో 2 రజతాలు, 2019లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ 2015లో రజతం, 2017లో కాంస్య పతకాలు గెలుచుకుంది. 2019లో భమిడిపాటి సాయి ప్రణీత్‌ కాంస్యం, 2021లో కిదాంబి శ్రీకాంత్‌ రజతం, లక్ష్యసేన్‌ కాంస్య పతకాలు సాధించారు.

డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో నీరజ్‌కు స్వర్ణం

డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా సత్తా చాటాడు. లుసానె అంచెలో అతడు అగ్రస్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అంతే కాదు జ్యూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బెర్తు సైతం దక్కించుకున్నాడు. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత అథ్లెట్‌ నీరజే కావడం విశేషం. ఈ పోటీ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచిన నీరజ్, ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు.

ప్రపంచ జూడోలో లింతోయ్‌కు స్వర్ణం

లింతోయ్‌ చనాంబమ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచ యూత్‌ క్యాడెట్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లో ఛాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత జుడోకాగా రికార్డులకెక్కింది. పురుషులు, మహిళలు ఏ విభాగంలోనైనా భారత్‌కు దక్కిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో లింతోయ్‌ 1-0తో బినాకా రీస్‌ (బ్రెజిల్‌)పై గెలిచింది. 2018లో జాతీయ సబ్‌ జూనియర్‌ టోర్నీలో స్వర్ణంతో వెలుగులోకి వచ్చిన లింతోయ్, నెల క్రితం బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్యాడెట్‌ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత జపాన్, జార్జియాలో మూడు వారాల శిక్షణ పొంది ఇప్పుడు ప్రపంచ వేదికపై సత్తా చాటింది.

అబుదాబి మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ

తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి మరో అంతర్జాతీయ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఈ 18 ఏళ్ల కుర్రాడు అబుదాబి మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో డేవిడ్‌ గుజ్జారో (స్పెయిన్‌)పై అతను విజయం సాధించాడు. దీంతో మొత్తం 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతను అజేయంగా నిలిచాడు. సహచర ఆటగాళ్లు రోహిత్‌ కృష్ణ, దీప్‌ సేన్‌గుప్తా, రౌనక్‌ సాధ్వానితో పాటు టాప్‌ సీడ్‌ వాంగ్‌ హావో (చైనా), అలెగ్జాండర్‌ ఇంజిక్‌ (సెర్బియా), గుజ్జారోపై అతను గెలిచాడు. ఈ టోర్నీలో 16 ఏళ్ల ఉజ్బెకిస్థాన్‌ టీనేజీ గ్రాండ్‌మాస్టర్‌ సిందరోవ్‌ (7) రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

అంకితకు వైల్డ్‌కార్డ్‌

భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అంకిత రైనాకు చెన్నై ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌ లభించింది. సెప్టెంబరు 12 నుంచి 18 వరకు చెన్నైలో ఈ టోర్నీ జరగనుంది. 29 ఏళ్ల అంకితతో పాటు 2014 వింబుల్డన్‌ ఫైనలిస్టు యూజెనీ బౌచర్డ్‌ (కెనడా)కు కూడా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ దక్కింది. ‘‘32 మంది సింగిల్స్‌ క్రీడాకారిణుల డ్రాలో యూజెనీ, అంకితలకు వైల్డ్‌కార్డ్‌లు లభించాయి. మహిళల డబుల్స్‌లో శర్మద బాలు- రియా భాటియాల జోడీకి వైల్డ్‌కార్డ్‌ లభించింది.

సిన్సినాటి టైటిల్‌ గార్సియా సొంతం

సిన్సినాటి టెన్నిస్‌ టైటిల్‌ను కరోలిన్‌ గార్సియా సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో గార్సియా (ఫ్రాన్స్‌) 6-2, 6-4తో చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ పెట్రా క్విటోవాను ఓడించింది. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే క్విటోవా సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆపై 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది గార్సియా. ఆ తర్వాత సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్లోనూ గార్సియాదే జోరు కొనసాగింది. పురుషుల సింగిల్స్‌లో అన్‌సీడెడ్‌ కొరిచ్‌ (క్రొయేషియా) టైటిల్‌ నెగ్గాడు. ఫైనల్లో అతడు 7-6 (7-0), 6-2తో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు.

ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ కార్ల్‌సన్‌ సొంతం

ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరిగిన ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ చివరి రౌండ్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద 4-2 తేడాతో ప్రపంచ నంబర్‌వన్, అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) ను ఓడించాడు. అయినప్పటికీ మొత్తం ఏడు రౌండ్లు ముగిసే సరికి 15 పాయింట్లతో అతను రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 పాయింట్లతో కార్ల్‌సన్‌ వరుసగా రెండో ఏడాదీ టైటిల్‌ గెలుచుకున్నాడు.

ఆసియా అండర్‌-18 వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌: భారత్‌కు కాంస్యం

ఆసియా అండర్‌-18 వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత్‌ 25-20, 25-21, 26-28, 19-25, 15-12తో కొరియాను ఓడించింది. ఆశిష్, ఆర్యన్, కుష్‌సింగ్, కార్తీక్‌శర్మ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ టోర్నీలో గత పద్నాలుగేళ్లలో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే. ఈ టోర్నీలో జపాన్‌ విజేతగా నిలిచింది.

ఏఐఎఫ్‌ఎఫ్‌ సీఓఏను రద్దు చేసిన సుప్రీంకోర్టు

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) వ్యవహారాలు చూసుకునేందుకు దాదాపు రెండు నెలల కింద తాను నియమించిన పాలకుల కమిటీ (సీఓఏ)ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌పై పిఫా విధించిన నిషేధం తొలగేలా, భారత్‌లో అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ జరిగేలా చేసేందుకు తన ఆదేశాల్లో మార్పులు చేస్తున్నట్లు న్యాయస్థానం చెప్పింది. ‣ ఆగస్టు 28న జరగాల్సిన ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలను కూడా వారం రోజులు వాయిదా వేసింది. ఇక ఏఐఎఫ్‌ఎఫ్‌ కార్యకలాపాలను తాత్కాలిక కార్యదర్శి నేతృత్వంలోని పాలకులు నిర్వహిస్తారని కోర్టు పేర్కొంది. సమాఖ్య వ్యవహారాల్లో బయటి వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారన్న కారణంతో ఏఐఎఫ్‌ఎఫ్‌పై పిఫా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో సీఓఏ పాలనకు ముగింపు పలకాలని సుప్రీంకోర్టును క్రీడా మంత్రిత్వశాఖ అభ్యర్థించింది. అండర్‌-17 ప్రపంచకప్‌ భారత్‌లో అక్టోబరు 11 నుంచి 30 వరకు జరగాల్సివుంది.

హాఫ్‌ మారథాన్‌ విజేత కవిత

ముంబయి హాఫ్‌ మారథాన్‌లో మహిళల టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్‌ రన్నర్‌ కవితారెడ్డి గెలుచుకుంది. ఈ రేసులో మహిళల విభాగంలో గంట 37.03 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచింది. తన్మయ కర్మాకర్‌ (గంట 40.18 నిమిషాలు), కేతకి (గంట 44.55 నిమిషాలు) రెండు, మూడు స్థానాలు సాధించారు. పురుషుల్లో చగన్‌ (మహారాష్ట్ర) స్వర్ణం గెలిచాడు. అతడు గంట 16.11 నిమిషాల్లో రేసు పూర్తి చేశాడు. భగత్‌సింగ్‌ (గంట 17.51 నిమిషాలు) రజతం, అనిల్‌ జిందాల్‌ (గంట 18.20 నిమిషాలు) కాంస్యం సాధించారు.

ప్రపంచ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ టైటిల్‌ అలెగ్జాండర్‌ సొంతం

ఉక్రెయిన్‌ బాక్సర్‌ అలెగ్జాండర్‌ ఉసెక్‌ ప్రపంచ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో ఆంథోని జాషువాపై అలెగ్జాండర్‌ విజయం సాధించాడు. గతేడాది కూడా ఆంథోనిపైనే గెలిచి అతడు టైటిల్‌ నెగ్గాడు. 35 ఏళ్ల అలెగ్జాండర్‌ ఈ విజయంతో డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీవో, ఐబీఎఫ్‌ టైటిళ్లు నిలబెట్టుకున్నాడు. ప్రొఫెషనల్‌ బాక్సర్‌ కాక ముందు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అలెగ్జాండర్‌.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2011లో పసిడి, 2009 కాంస్యం సాధించాడు.

యోధాస్‌కు మూడో విజయం

అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. యోధాస్‌ 85-45తో రాజస్థాన్‌ వారియర్స్‌ను ఓడించింది. సచిన్‌ బార్గో (11) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన యోధాస్‌కు ఇది మూడో విజయం. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల్లో 9 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. ఒడిషా జాగర్‌నట్స్‌ 50-47తో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది.

జాతీయ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో లలితకు రెండు పతకాలు

ఇండియన్‌ ఓపెన్‌ జాతీయ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో లలిత రెండు పతకాలతో మెరిసింది. చినజీయర్‌ అంధుల పాఠశాలకు చెందిన ఆమె అమ్మాయిల 100 మీటర్ల పరుగు (టీ11, టీ12, టీ13)లో రజతం సాధించింది. 15.10 సెకన్లలో రేసు ముగించిన ఆమె రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు ఒక్క నిమిషం 14 సెకన్ల టైమింగ్‌తో 400మీ. పరుగులో కాంస్యం దక్కించుకుంది. పురుషుల జావెలిన్‌ త్రోలో తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి విద్యా సంస్థలకు చెందిన రవికిరణ్‌ కంచు పతకం గెలిచాడు. 31.17 మీటర్ల దూరం ఈటెను విసిరి అతను మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌లో అంతిమ్‌కు స్వర్ణం

యువ రెజ్లర్‌ అంతిమ్‌ ఫంగాల్‌ అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి గెలిచి, ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. 53 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 8-0 తేడాతో అట్లీన్‌ (కజకిస్తాన్‌)పై విజయం సాధించింది. 18 ఏళ్ల అంతిమ్‌ హరియాణా అమ్మాయి. ‣ 62 కేజీల విభాగంలో సోనమ్‌ మలిక్, 65 కేజీల విభాగంలో ప్రియాంక, 76 కేజీల విభాగంలో ప్రియ రజతాలు దక్కించుకున్నారు. పసిడి పోరులో ఒజాకి (జపాన్‌) చేతిలో సోనమ్, యొషితాకె (జపాన్‌) చేతిలో ప్రియాంక, అయానో (జపాన్‌) చేతిలో ప్రియ ఓడారు. ప్రియాన్షి (50 కేజీలు), రీతిక (72) కాంస్యాలు సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో భారత్‌కు ఓ రజతం, ఆరు కాంస్యాలు దక్కాయి.

ఛాంపియన్స్‌ లీగ్‌ చెస్‌ టూర్‌: నాలుగో రౌండ్లో ప్రజ్ఞానంద విజయం

అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ లీగ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ టోర్నమెంట్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. నాలుగో రౌండ్లో ప్రజ్ఞానంద 3-1తో లెవోన్‌ అరోనియన్‌పై విజయం సాధించాడు. నాలుగు గేమ్‌ల ఈ పోరులో తొలి రెండు గేమ్‌లను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. మూడు, నాలుగు గేమ్‌లలో పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నాడు. దీంతో మొత్తం 12 పాయింట్లతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో పాటు ఉమ్మడిగా అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సుమిత్, యోగేశ్‌ ప్రపంచ రికార్డులు

పారా అథ్లెట్లు సుమిత్‌ అంటిల్, యోగేశ్‌ కతూనియా ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. స్థానిక శ్రీ కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌త్రో ఎఫ్‌-64 విభాగంలో 68.62 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన సుమిత్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న 68.55 మీటర్ల రికార్డును అధిగమించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకం సాధించే క్రమంలో సుమిత్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. డిస్కస్‌త్రోలో యోగేశ్‌ 48.34 మీటర్లు డిస్క్‌ను విసిరి రికార్డును సృష్టించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో యోగేశ్‌ రజతం గెలిచాడు.

చరిత్ర సృష్టించిన మనీషా

భారత ఫుట్‌బాల్‌లో యువ స్ట్రైకర్‌ మనీషా కల్యాణ్‌ సరిచరిత్ర సృష్టించింది. యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్‌లో బరిలో దిగిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా రికార్డు నెలకొల్పింది. సైప్రస్‌లో జరుగుతున్న ఐరోపా క్లబ్‌ పోటీల్లో అపోలాన్‌ లేడీస్‌ ఎఫ్‌సీ తరఫున మనీషా బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో అపోలాన్‌ ఎఫ్‌సీ 3-0తో ఎస్‌ఎఫ్‌కే రిగాపై విజయం సాధించింది. 60వ నిమిషంలో మరిలెనా జార్జియో స్థానంలో 20 ఏళ్ల మనీషా మైదానంలో అడుగుపెట్టింది. విదేశీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత నాలుగో మహిళా ఫుట్‌బాలర్‌ మనీషా. భారత జట్టు, ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న మనీషాకు విదేశీ క్లబ్‌కు ఆడే అవకాశం లభించింది.

కోల్‌కతా కోచ్‌గా చంద్రకాంత్‌ పండిత్‌

రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను విజేతగా నిలిపిన భారత స్టార్‌ దేశవాళీ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ ఐపీఎల్‌లో కనిపించనున్నాడు. వచ్చే సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చంద్రకాంత్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లాండ్‌ టెస్టు జట్టుకు ప్రధాన కోచ్‌గా వెళ్లిన బ్రెండన్‌ మెక్‌కలమ్‌ స్థానంలో పండిత్‌ను నియమించినట్లు కోల్‌కతా ఫ్రాంచైజీ ప్రకటించింది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను ఛాంపియన్‌గా నిలిపిన అతడు.. గతంలో ముంబయి, విదర్భలకు పలుమార్లు టైటిళ్లు అందించాడు.

ముగిసిన చెస్‌ ఒలింపియాడ్‌

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి ఆతిథ్యమిచ్చిన చెస్‌ ఒలింపియాడ్‌ ముగిసింది. ఓపెన్, మహిళల విభాగాల్లో మన జట్లకు కాంస్యాలు దక్కాయి. 187 దేశాల నుంచి ఈ రెండు విభాగాల్లో కలిపి దాదాపు 350 జట్లు బరిలో దిగాయి. తీవ్ర పోటీని తట్టుకుని.. అగ్రశ్రేణి జట్లను వెనక్కినెట్టి పతకాలు సాధించడమంటే చిన్న విషయం కాదు. పైగా సొంతగడ్డపై అనుకూలత ఉండేందుకు ఇది మైదానంలో ఆడే ఆట కాదు. వాతావరణ పరిస్థితులూ ఎలాంటి ప్రభావం చూపవు. పైగా స్వదేశంలో ఆడుతున్నామనే ఒత్తిడీ ఉంటుంది. 64 గళ్లపై ఎత్తులు వేయడం.. వ్యూహాలు రచించడం.. ప్రత్యర్థిని చదవడం.. ఇలా ప్లేయర్లకు అసలైన సవాలు ఎదురయ్యేది బోర్డు ముందే. కాబట్టి ఈ పోటీల్లో భారత ప్రదర్శన గొప్పదే. బోర్డుపై ప్రత్యక్షంగా జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లను చూసుకుంటే ఓపెన్‌లో ఇది భారత్‌కు రెండో కాంస్యం. 2014లో తొలి పతకం దక్కింది. ఇక 1978లో ఒలింపియాడ్‌లో మహిళల విభాగంలో అడుగుపెట్టిన భారత్‌.. ఇప్పుడే మొదటి పతకం అందుకుంది.