సైన్స్ అండ్ టెక్నాలజీ

వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌ పరీక్ష విజయవంతం

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే వర్టికల్‌ లాంచ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఒక యుద్ధనౌక నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నౌకాదళం నిర్వహించాయి. వేగంగా దూసుకెళుతున్న ఒక మానవరహిత విమానాన్ని ఈ అస్త్రానికి లక్ష్యంగా నిర్దేశించారు. దాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. నిట్టనిలువుగా ఈ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఉందని రుజువు చేసేందుకు ఈ పరీక్షను నిర్వహించారు. - వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌ను దేశీయంగా డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి లేబొరేటరీ (డీఆర్‌డీఎల్‌), రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. ఈ అస్త్రంలో స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ ఉంది. ప్రయోగ సమయంలో క్షిపణి పనితీరును రాడార్‌లు, ఎలక్ట్రో ఆప్టికల్, టెలిమెట్రీ వ్యవస్థలు నిశితంగా గమనించాయి.

మనిషిని మోసుకెళ్లే డ్రోన్‌

మనిషిని మోసుకెళ్లగల అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్‌ను తయారుచేసింది. ఇది వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదు. ‣ ఈ డ్రోన్‌ 130 కిలోల బరువు మోయగలదు. నౌకల మధ్య సరకులను రవాణా చేయగలదు. రక్షణ దళాలకు ఉపయోగపడుతుంది. మనుషుల రవాణాకూ ఈ డ్రోన్‌ను వాడొచ్చు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆసుపత్రికి తరలించవచ్చు.

చంద్రుడి ఎగువ వాతావరణంలో దట్టమైన ప్లాస్మా

చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-2 కీలక ఆవిష్కారణ చేసింది. జాబిల్లి ఎగువ వాతావరణమైన అయనోస్పియర్‌లో అధిక సాంద్రతతో కూడిన ప్లాస్మా ఉన్నట్లు కనుగొంది. అక్కడి వేక్‌ ప్రాంతంలో ఇది వెలుగు చూసింది. చంద్రుడి వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. అక్కడి అయనోస్పియర్‌లో ప్లాస్మా సాంద్రత క్యూబిక్‌ సెంటీమీటరుకు కొన్ని వందల అయాన్ల మేర మాత్రమే ఉండొచ్చని మొదట అంచనా వేశారు. చంద్రయాన్‌-2లోని డీఎఫ్‌ఆర్‌ఎస్‌ సేకరించిన డేటా దీనిపై స్పష్టత ఇచ్చింది. వేక్‌ ప్రాంతంలోని ప్లాస్మా సాంద్రత చంద్రుని పగటి భాగంలో కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది.

జాబిల్లి కక్ష్యలోకి దక్షిణ కొరియా తొలి వ్యోమనౌక ప్రయోగం

దక్షిణ కొరియా జాబిల్లి కక్ష్యలోకి ఒక ఆర్బిటర్‌ను పంపింది. భవిష్యత్‌లో చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌకలను దించడానికి అనువైన ప్రదేశాలను ఇది గుర్తిస్తుంది. ‘దనురి’ అనే ఈ ఆర్బిటర్‌ను స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన రాకెట్‌ ద్వారా అమెరికాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి ప్రయోగించారు. ఇది డిసెంబరులో జాబిల్లిని చేరుతుంది. 18 కోట్ల డాలర్లతో దక్షిణ కొరియా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దనురి.. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుతుంది. ఏడాది పాటు చందమామను శోధిస్తుంది. ప్రస్తుతం చంద్రుడిని భారత్, అమెరికా, చైనాల వ్యోమనౌకలు శోధిస్తున్నాయి.

గురుగ్రహ అద్భుత చిత్రాలు

విశ్వంలోని కొత్త విషయాలను కళ్లకు కడుతున్న జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు గురుగ్రహాన్ని స్పష్టతతో చిత్రీకరించింది. అక్కడి ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఏర్పడుతున్న ప్రకాశవంతమైన అరోరాలను వెలుగులోకి తెచ్చింది. భూమికంటే పెద్దగా ఉండే ‘గ్రేట్‌ రెడ్‌ స్పాట్‌’ అనే భారీ తుపాన్‌ను కూడా చిత్రీకరించింది. పక్కనే ఉన్న అనేక చిన్నపాటి తుపాన్లనూ చూపింది. ‣ జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు అందించిన ఒక వైడ్‌ ఫీల్డ్‌ చిత్రం అద్భుతంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గురు గ్రహం చుట్టూ పలుచటి వలయాలు అందులో కనిపించాయి. రెండు చిన్న చందమామలూ దర్శనమిచ్చాయి. వెయ్యి కోట్ల డాలర్లతో అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు రూపొందించిన ఈ టెలిస్కోపును గత ఏడాది చివరిలో రోదసిలోకి ప్రయోగించారు.

నౌకాదళంలోకి విమానవాహక నౌక విక్రాంత్‌

దేశీయ పరిజ్ఞానంతో తొలిసారిగా భారత్‌ రూపొందించిన విమానవాహక నౌక విక్రాంత్‌ 2022 సెప్టెంబరు 2న లాంఛనంగా భారత నౌకాదళంలో చేరనుంది. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రూ.20వేల కోట్లతో ఈ నౌకా నిర్మాణ కేంద్రంలోనే ఇది తయారైంది. చివరిదశ సముద్ర పరీక్షలు పూర్తి చేసుకున్న విక్రాంత్‌ను జులై 28న భారత నౌకాదళానికి అప్పగించారు. ‣ 1971లో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన మన తొలి విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పేరును ఈ యుద్ధనౌకకు ఖరారు చేశారు. ఈ విమానవాహక నౌకపై మిగ్‌-29కె యుద్ధవిమానాలు, కామోవ్‌-31, ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాప్టర్లను మోహరిస్తారు. 2300 కంపార్ట్‌మెంట్లతో కూడిన ఈ యుద్ధనౌకలో 1700 మంది సిబ్బంది పనిచేస్తారు. మహిళల వసతి కోసం ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశారు. గరిష్ఠంగా ఈ యుద్ధనౌక గంటకు 51 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. ఏకబిగిన 7,500 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించగలదు.

భూమిని పోలిన గ్రహంలో ఎక్కడ చూసినా జలం!

విశ్వాంతరాల్లోని సుదూర తీరాల్లో మనకు కనిపించని అద్భుతాలెన్నో. వీటిని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రిల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలు వృథా కాలేదు. మన గ్రహానికి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్రాగన్‌ నక్షత్ర కూటమిలోని బైనరీ వ్యవస్థలో సరిగ్గా భూమిని పోలిన ఓ గ్రహం వారి కంట పడింది. భూమి కంటే సుమారు 70% పెద్దదని, ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ‘టాయ్‌-1452బి’గా దీనికి పేరు పెట్టారు. ఇదో బుల్లి నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, ఈ రెండింటి మధ్య దూరం కారణంగా ఈ గ్రహంపై నీళ్లు చాలా చల్లగా, లేదంటే చాలా వెచ్చగా ఉండవన్నారు. దీన్ని ‘సముద్ర గ్రహం’గా పేర్కొనడం సముచితమని పరిశోధన సాగించిన ఛార్లెస్‌ కాడియక్స్‌ బృందం వ్యాఖ్యానించింది. కెనడాలోని మాంట్‌-మెగాంటిక్‌ అబ్జర్వేటరీలో అత్యంత కచ్చితమైన కొలతల కోసం రూపొందించిన స్పిరౌ పరికరాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని కనుగొన్నట్టు ఆస్ట్రోనామికల్‌ జర్నల్‌ తెలిపింది.

3డీ మ్యాపింగ్‌తో.. మెదడు శస్త్ర చికిత్స

మెదడులో కణితితో ఇబ్బంది పడుతున్న 39 ఏళ్ల యువకుడికి సరికొత్త సాంకేతిక విధానంతో కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స పూర్తిచేశారు. దేశంలో తొలిసారి ఈ తరహా టెక్నాలజీ వినియోగించామని వైద్యులు ప్రకటించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో 3డీ ఆధారిత మ్యాపింగ్‌ టెక్నాలజీని ఈ సర్జరీలో వాడినట్లు తెలిపారు. ఓమ్ని సియంట్‌ టెక్నాలజీ సంస్థ ఈ కొత్త సాంకేతికతను కిమ్స్‌కు అందజేసింది. ఈ సరికొత్త క్విక్‌టోమ్‌ బ్రెయిన్‌ మ్యాపింగ్‌ టెక్నాలజీతో మెదడు శస్త్రచికిత్సల్లో సంక్లిష్టతలను ఇబ్బందులను అధిగమించవచ్చు. జయపూర్‌కు చెందిన ప్రవీణ్‌ ఓస్వాల్‌ అనే వ్యక్తికి తరచూ మతిమరపు రావడం, చదివేటప్పుడు పదాలు మిస్‌ కావడం, కంటిచూపు తగ్గడంవంటి ఇబ్బందులు తలెత్తాయి. ఈ కొత్త టెక్నాలజీతో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.


ఏమిటీ ఈ బ్రెయిన్‌ మ్యాపింగ్‌?
శస్త్ర చికిత్సకు ముందు ఈ ఏఐ ఆధారిత 3డీ మ్యాపింగ్‌ ద్వారా బ్రెయిన్‌ లోపల పరిస్థితిని కచ్చితంగా అంచనా వేస్తారు. కంప్యూటర్‌ తెరపైనే బ్రెయిన్‌ భాగాలను స్పష్టంగా చూసే వీలు ఏర్పడుతుంది. ఎక్కడ గడ్డ ఉంది...ఏ పరిమాణంలో ఉంది...అక్కడ ఎలాంటి నాడులు ఉన్నాయి...సూక్ష్మమైన న్యూరాన్ల వివరాలు ఇందులో పరిశీలించవచ్చు. దీనివల్ల శరీర భాగాల కదలికలు, మాటలు, చూపు నియంత్రించే మెదడు భాగాలను శస్త్ర చికిత్సలో ముట్టుకోకుండా సమస్య ఉన్న భాగంలోనే శస్త్రచికిత్స చేస్తామని న్యూరో సర్జన్‌ డాక్టర్‌ మానస పాణిగ్రహి తెలిపారు.

జాబిల్లిని చేరేందుకు భారీ రాకెట్‌

జాబిల్లిపైకి యాత్రలు చేపట్టేందుకు ఆర్టెమిస్‌ మిషన్‌ను తలపెట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ భారీ రాకెట్‌- ‘స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌)’ను ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో 39బి ప్యాడ్‌కు చేర్చింది. ఆగస్టు 29న దాన్ని తొలిసారి ప్రయోగించనున్నారు (మానవరహితంగా). భవిష్యత్తులో చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపేందుకు ఈ రాకెట్‌ను వినియోగించనున్నారు. ఎస్‌ఎల్‌ఎస్‌ పొడవు 100 మీటర్లు. ఇందులో వ్యోమగాములను తీసుకెళ్లేందుకు పొందుపర్చిన ‘ఒరాయన్‌’ క్యాప్సుల్‌ 5 మీటర్ల వెడల్పు ఉంటుంది.

పేగు క్యాన్సర్‌కు ‘నానో’ చికిత్స

పేగు క్యాన్సర్‌ చికిత్సకు స్మార్ట్‌ నానో రేణువులను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న ఐఐటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. క్యాన్సర్‌ కణాలను పసిగట్టి, ఔషధాన్ని విడుదల చేయడం ఈ రేణువుల ప్రత్యేకత. మిగతా సమయంలో అవి స్థిరంగా ఉంటాయి. సహజసిద్ధ పాలిమర్‌ పదార్థాలతో వీటిని తయారు చేశారు.

అధిక చక్కెరతో పేగు బ్యాక్టీరియా అస్తవ్యస్తం

ఆహారంలో తీసుకునే అధిక చక్కెర వల్ల పేగుల్లోని ప్రయోజనకర బ్యాక్టీరియా తీరుతెన్నులు మారిపోతాయని తాజా పరిశోధన పేర్కొంది. ఫలితంగా మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. చక్కెర, కొవ్వు అధికంగా ఉండే పాశ్చాత్య ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవుల్లో బరువు పెరగడం, ఇన్సులిన్‌ నిరోధకత వంటి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ లక్షణాలు ఉత్పన్నమయ్యాయి. వాటి పేగుల్లోని సూక్ష్మజీవుల సమతౌల్యంలోనూ మార్పులు వచ్చాయి. సెగ్మెంటెడ్‌ ఫిలమెంటస్‌ బ్యాక్టీరియా పరిమాణం బాగా తగ్గింది. టీహెచ్‌17 కణాలు క్షీణించాయి. జీవక్రియ వ్యాధులు, మధుమేహం, స్థూలకాయం నుంచి రక్షణకు ఈ కణాలు అవసరం.

కరోనా తరహా రేణువు సృష్టి

కరోనా వైరస్‌ తరహా రేణువును బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కొత్త టీకాల అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుంది. సాధారణంగా కరోనాపై పరిశోధనలు చేయాలంటే తొలుత నమూనాల నుంచి వైరస్‌ను వేరు చేయాలి. ఆ సంఖ్యను పెంచాలి. ఆ తర్వాత.. దాని సాంక్రమిక శక్తి వంటి అంశాలను శోధించాలి. అయితే ఉద్ధృతంగా వ్యాప్తి చెందే సామర్థ్యమున్న ఇలాంటి వైరస్‌లపై పరిశోధనలకు బయోసేఫ్టీ లెవల్‌-3 ల్యాబ్‌ అవసరం. ఈ ఇబ్బందిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు వైరస్‌ లాంటి రేణువును తయారు చేశారు. అసలైన కరోనా తరహాలో దీని ఉపరితలంపై స్పైక్‌తో పాటు నాలుగు రకాల ప్రొటీన్లు ఉంటాయి. జన్యుపదార్థం మాత్రం ఉండదు. అందువల్ల అది ఇన్‌ఫెక్షన్‌ కలిగించలేదు.

గ్రీన్‌లాండ్‌ ‘జాంబీ ఐస్‌’తో సముద్ర మట్టాల పెరుగుద‌ల‌

గ్రీన్‌లాండ్‌లో వేగంగా కరుగుతున్న హిమఫలకం వల్ల ప్రపంచ సముద్ర మట్టాలు కనీసం 27 సెంటీమీటర్ల మేర పెరుగుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలో వేసిన అంచనాల కన్నా ఇది రెట్టింపు అని వారు తెలిపారు. దీనికి ‘జాంబీ ఐస్‌’ కారణమని వివరించారు. హిమఫలకంలో క్షీణించిన భాగాలను ఇలా పిలుస్తారు. హిమానీనదాల నుంచి ఐస్‌ అందకపోవడం వల్ల అవి అలా తయారయ్యాయి.

రెండు నెలల పాటు తాజాగా పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలను రెండు నెలల పాటు తాజాగా ఉంచే సరికొత్త పూతను గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది తినదగిన పదార్థమేనని వారు తెలిపారు. బంగాళాదుంప, టమోటా, పచ్చిమిర్చి, పైనాపిల్, కివి, స్ట్రాబెర్రీ, ఖాసి మాండరిన్‌ రకం ఆరంజ్, ఆపిల్స్‌పై దీని సత్తా రుజువైంది. రైతులకు ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఆహార ఉత్పత్తి, సరఫరాలో వృథాను తగ్గించాలన్న ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ పరిశోధన తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‣ సముద్రంలో లభించే దునాలియెల్లా టెర్టియోలెక్టా అనే మైక్రో ఆల్గేతో ఈ పూతను తయారు చేశారు. ఈ ఆల్గేలో యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నాయి. ఆల్గాల్‌ ఆయిల్‌కూ ఇది వనరు. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఈ మైక్రో ఆల్గే నుంచి ఆయిల్‌ను సేకరించాక మిగిలిపోయే పదార్థాన్ని పడేస్తారు. ఈ వ్యర్థ పదార్థానికి చిటొసన్‌ అనే కార్బోహైడ్రేట్‌తో కలిపి తాజా పూతను పరిశోధకులు రూపొందించారు. 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వరకు ఇది స్థిరంగా ఉంటుంది. దీనివల్ల పళ్లు, కూరగాయల రంగు, రూపం, రుచి, పోషక విలువలు కొన్ని వారాల పాటు యథాతథంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

బాక్సింగ్‌లో పతకాలు పెంచేలా ఐఐటీ మద్రాస్‌ ‘సాంకేతికత’

ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు, బళ్లారిలోని ఇన్‌స్పైర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఐఐఎస్‌) కలిసి వినూత్న ఆవిష్కరణ తెచ్చారు. బాక్సింగ్‌ క్రీడాకారుల ఆట తీరును మెరుగుపరిచేలా అధునాతన సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చారు. దీని సాయంతో బాక్సర్లు 2024 ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో దేశానికి అధిక పతకాలు సాధించేందుకు వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ‣ ఐఐటీ మద్రాస్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ ‘స్మార్ట్‌ బాక్సర్‌’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. ఇందులోని సెన్సర్లతో ఉన్న ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, అధునాతన వీడియో కెమెరాలు బాక్సర్‌ కదలికలు, వారిలోని లోపాలను లోతుగా విశ్లేషించి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. కోచ్‌లు, క్రీడాకారులకు ఇది ఎంతో మేలు చేసేలా రూపొందించామని ఐఐటీ మద్రాస్‌ కేంద్రం హెడ్‌ ప్రొఫెసర్‌ రంగనాథన్‌ శ్రీనివాసన్, ఐఐఎస్‌కు చెందిన యూత్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ జాన్‌ వార్‌బర్టన్‌ తెలిపారు. జూన్‌లో హరియాణాలో జరిగిన సదస్సు నేపథ్యంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)తో దీనిపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐఐటీ మద్రాస్‌ అప్లైడ్‌ మెకానిక్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బాబ్జీ శ్రీనివాసన్‌ తెలిపారు.

మెదడు విశ్లేషణతో స్థూలకాయ సమస్యకు పరిష్కారం

రకరకాల ఆహార పదార్థాలను తింటున్నప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంది. అయితే, మంచి అనుభూతి కలిగిస్తున్న పదార్థాలను అదే పనిగా, అతిగా తినడం వల్లే చాలా మంది అధిక బరువు, స్థూలకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఈ అంశాన్ని ఆధారం చేసుకునే స్థూలకాయ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల వైవిధ్య పరిశోధన సాగించారు. తిన్న ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు దాని పరిమాణం, లక్షణాలు, సంతృప్తి స్థాయికి సంబంధించిన సంకేతాలు మెదడులోని ‘హైండ్‌బ్రెయిన్‌’గా పిలిచే భాగానికి చేరతాయి. వీటి ఆధారంగానే అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల్లో వేటిని తినాలి? వేటిని వదిలిపెట్టాలి? ఇంకా ఎంత తినాలి? తినడం ఎప్పుడు ముగించాలి? అన్న నిర్ణయం జరుగుతుంది. ఈ హైండ్‌మ్రెయిన్‌ను ‘మ్యాపింగ్‌’ సాంకేతికతతో విశ్లేషించడం ద్వారా స్థూలకాయుల ఆహార అనుభూతిలో మార్పులు తీసుకురావచ్చని, తద్వారా ఇష్టమైన వాటిని కూడా తక్కువగా తినేలా చేసి వారిని అధిక బరువు సమస్య నుంచి కాపాడవచ్చని పరిశోధకులు వివరించారు.

కర్ణ కఠోర ధ్వని చేయని సూపర్‌సోనిక్‌ విమానాలు

సూపర్‌సోనిక్‌ వేగంతో పయనించే ప్రయాణికుల విమానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఎక్స్‌-59 అనే ప్రయోగాత్మక లోహవిహంగంతో పరీక్షలు నిర్వహిస్తోంది. ధ్వని వేగం గంటకు 1,225 కిలోమీటర్లు. అంతకంటే వేగంగా దూసుకెళ్లడాన్ని సూపర్‌సోనిక్‌ వేగంగా పేర్కొంటారు. ప్రకంపన తరంగాలు ఒక్కటిగా కలవకుండా ఎక్స్‌-59 డిజైన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇవి కర్ణ కఠోర ధ్వనిని చేయవు. సూపర్‌సోనిక్‌ విమానాలు ,ఎక్స్‌59

మానవ కణజాలంతో త్రీడీ ప్రింటెడ్‌ కార్నియా అభివృద్ధి

దేశంలోనే మొట్టమొదటిసారిగా మానవ కణజాలం ఆధారంగా 3డి-ప్రింటెడ్‌ కార్నియాను అభివృద్ధి చేసినట్లు ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ (ఎల్‌వీపీఇఐ) ప్రకటించింది.ఈ కార్నియాను కుందేలు కంటిలోకి విజయవంతంగా మార్పిడి చేసినట్లు వెల్లడించారు. ఇది కార్నియల్‌ స్కార్రింగ్‌ (కార్నియా పారదర్శకంగా లేకుండా మారడం) లేదా కెరటోకోనస్‌ (కార్నియా క్రమంగా సన్నగా మారడం) వంటి వ్యాధుల చికిత్సలో చవకగా అందించగలిగే ఆవిష్కరణ అని పేర్కొన్నారు. ప్రభుత్వం, దాతృత్వ నిధుల ద్వారా దీన్ని తయారు చేశారని సింథటిక్‌ భాగాలు, జంతువుల అవశేషాలు లేనందున రోగులకు ఉపయోగించడానికి ఇది సురక్షితమైందని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ప్రధాన పరిశోధకులు డా.సయన్‌ బసు, డా.వివేక్‌ సింగ్‌ వివరించారు.

పశువుల్లో ‘లంపీ’ కట్టడికి టీకా అభివృద్ధి చేసిన ఐసీఏఆర్‌

గత కొద్ది నెలలుగా వివిధ రాష్ట్రాల్లో పశువుల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న లంపీ చర్మవ్యాధికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)కు చెందిన రెండు సంస్థలు స్వదేశీ టీకాను అభివృద్ధి చేశాయి. ఈ టీకాను వీలయినంత త్వరలో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇంతవరకు దేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ వ్యాధి సోకి పశువులు మృత్యువాత పడ్డాయి. అత్యధికంగా రాజస్థాన్‌లో 2,111 మూగజీవాలు చనిపోగా గుజరాత్‌ (1,679), పంజాబ్‌ (672), హిమాచల్‌ప్రదేశ్‌ (38), అండమాన్‌ నికోబార్‌ (29) ఉత్తరాఖండ్‌ (26)లలోనూ పశు మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఐసీఏఆర్‌ పరిధిలోని జాతీయ అశ్వ పరిశోధన కేంద్రం (హిసార్, హరియాణా), భారత పశువైద్య పరిశోధన సంస్థ (ఇజ్జత్‌నగర్, ఉత్తర్‌ప్రదేశ్‌)లు ‘లంపీ-ప్రోవాక్‌ఇండ్‌’ టీకాను అభివృద్ధి చేశాయి. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంబంధిత సాంకేతికతను కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, పురుషోత్తం రూపాలాలు విడుదల చేశారు.

బూస్టర్‌ డోసుగా కొవాగ్జిన్‌కు జపాన్‌ గుర్తింపు

కొవాగ్జిన్‌ టీకాకు మరొక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ టీకాను ప్రయాణికులు బూస్టర్‌ డోసుగా తీసుకోవడానికి జపాన్‌ అనుమతించినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఫైజర్, మొడెర్నా, నొవావ్యాక్స్, ఆస్ట్రజెనెకా, జాన్సన్‌ కంపెనీలకు చెందిన కొవిడ్‌ టీకాలకు కొంతకాలంగా జపాన్‌లో ఇటువంటి అనుమతి ఉంది.