సదస్సులు

కెనడాలోని హాలిఫాక్స్‌లో జరిగిన 65వ కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్సు

ప్రజాస్వామ్య సంస్థలు, ప్రజల మధ్య ఉన్న అగాధాన్ని సాంకేతికత పూడుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఐటీ విప్లవం కీలకపాత్ర పోషిస్తోందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కెనడాలోని హాలిఫాక్స్‌లో జరిగిన 65వ కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్సులో భారత పార్లమెంటరీ బృందం తరఫున ఆయన మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చే సాధనంగా పార్లమెంటును చూస్తున్నారు. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని ఆయన పేర్కొన్నారు. కామన్‌వెల్త్‌ దేశాలు తరచూ సమావేశమవుతూ ఒక దేశంలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను మరొకరితో పంచుకుంటూ పరస్పర అభివృద్ధికి సహకరించుకోవాలని సూచించారు.

కాలం చెల్లిన కార్మిక చట్టాల రద్దు

బ్రిటిష్‌ కాలంలో తెచ్చిన పలు చట్టాలను గత ఎనిమిదేళ్లలో రద్దు చేశామని, అవన్నీ బానిస మనస్తత్వానికి అద్దంపట్టే చట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి పలు కార్మిక చట్టాల్ని ప్రస్తుతం మారుస్తున్నాం. సంస్కరిస్తున్నాం. 29 కార్మిక చట్టాల్ని కేవలం నాలుగు తేలికైన లేబర్‌ కోడ్‌లుగా మార్పు చేశాం. దాంతో కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక, ఆరోగ్య భద్రత వంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఆయన వివరించారు. తిరుపతిలో రెండు రోజుల పాటు జరుగుతున్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల సదస్సును ఉద్దేశించి ప్రధాని దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. అనువైన చోట పనిచేసే విధానం (ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేసెస్‌), ఇంటి నుంచే పనిచేసే వాతావరణం (వర్క్‌ ఫ్రం హోం ఎకోసిస్టమ్‌), అనువైన సమయంలో పనిచేసే సౌలభ్యం (ఫ్లెక్సిబుల్‌ వర్క్‌అవర్స్‌) భవిష్యత్‌ అవసరాలని మోదీ పేర్కొన్నారు.