వార్తల్లో ప్రాంతాలు

చండీగఢ్‌ విమానాశ్రయానికి భగత్‌సింగ్‌ పేరు

పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలు చండీగఢ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరు పెట్టేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్, హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌటాలా నడుమ జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. చండీగఢ్‌ విమానాశ్రయానికి ‘షహీద్‌ భగత్‌సింగ్‌’ పేరు పెడుతున్నట్లు హరియాణా ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో హరియాణాకు సమాన భాగమున్నందున పంచకులా నగరం పేరు కూడా దీనికి చేర్చుతున్నట్లు వెల్లడించారు.

సింగపూర్‌లో జాతీయ స్మారకంగా నేతాజీ ‘దిల్లీ చలో’ మైదానం

రెండు శతాబ్దాలుగా పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచి.. సింగపూర్‌ నగర నడిబొడ్డున 11 ఎకరాల్లో వెలసిన పచ్చిక మైదానాన్ని 75వ జాతీయ స్మారకంగా ఆ దేశం ప్రకటించింది. 1943 జులై 5న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ కవాతు అనంతరం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇదే మైదానం నుంచి ‘దిల్లీ చలో’ నినాదమిచ్చారు. స్థానికులకు క్రీడామైదానంగానూ ఇది ఉపయోగపడుతోంది. 57వ జాతీయ దినోత్సవం సందర్భంగా సింగపూర్‌ ఈ స్మారక ప్రకటన చేసింది. స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం కింద ఇకపై ఈ మైదానానికి అత్యున్నత స్థాయి రక్షణ కల్పిస్తామని సింగపూర్‌ జాతీయ వారసత్వ మండలి (ఎన్‌హెచ్‌బీ) తెలిపింది.

మానవజాతిలో అరుదైన ఓ ఆదిమవాసి తెగ అంతం

అమెజాన్‌ అడవుల్లోని మానవజాతిలో అరుదైన ఓ ఆదిమవాసి తెగలో మిగిలిన చివరి వ్యక్తి అంతరించిపోయాడు.
‣ దక్షిణ అమెరికాలో ఉండే ఈ అడవులు ప్రపంచంలోనే అత్యంత దట్టమైనవి. దాదాపు 70 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, తొమ్మిది దేశాలలో సువిశాలంగా విస్తరించి, భూగోళానికి ఆత్యధిక స్థాయిలో ఆక్సిజన్‌ అందించే ఈ సతతహరిత అరణ్యాలను ప్రపంచానికి ‘ఊపిరితిత్తులు’ అని కూడా అంటుంటారు. ఆమెజాన్‌ పరిధిలో మూడు కోట్ల మంది జనాభా జీవిస్తుండగా, అందులో 350 రకాల జాతుల వాళ్లు ఉన్నారు. వారిలో 60 రకాలు ప్రపంచంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ భూమండలం మీద ఇప్పటికీ తమ మూలాలను మరచిపోని మూలవాసులన్న మాట.
‣ నాగరికులమని చెప్పుకొనే జనంతో కలవడానికి ఇష్టంలేక ఆటవికులుగానే మిగిలిపోయిన ఆదిమ జాతులవి. అలాంటి ఆదిమవాసులకు చెందిన ఓ జాతిలోని చివరి మనిషి తన పోరాటంలో అలసిపోయి మరణించాడని బాహ్య ప్రపంచం గుర్తించింది.
‣ బొలీవియా’ సరిహద్దులో ఉండే రోండోనియా రాష్ట్రంలోని టనారు అనే ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి తెలియని ఆదిమవాసులు జీవించేవారు. 1970 దశకంలో ఈ అటవీ ప్రాంత ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్న భూస్వాముల చేతిలో ఈ జాతికి చెందినవారు చాలా మంది హతమైపోయారు. ఏడుగురు మాత్రం మిగలగా, 1995లో గనుల మాఫియా దాడి చేసి ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. పచ్చటి అడవుల్లో ఆకులో ఆకులై, ప్రకృతితో మమేకమై బతుకుతున్న ఆ గుంపు మొత్తం అంతరించిపోగా ఒకే ఒక్క వ్యక్తి మాత్రం మిగిలాడు. 26 ఏళ్లుగా అంతపెద్ద అడవిలో ఒక్కడంటే ఒక్కడే బతుకుతున్నాడు.
‣ బ్రెజిల్‌కు చెందిన ‘ఫ్యునాయ్‌’ అనే ఆదిమవాసుల పరిరక్షణ విభాగం అక్కడ నిఘా కెమెరాలు పెట్టి అతడి సంరక్షణపై దృష్టి పెట్టింది. 2018లో ఒకసారి ఒక కెమెరా కంటికి అతడు చిక్కాడు. మళ్లీ అతడి ఆనవాళ్లు కనిపించలేదు. వారం క్రితం ఆగస్టు 23న అతడి మృతదేహం కెమెరాలో రికార్డు కావడం విషాదకరం. ఆ సువిశాలమైన అడవుల్లో ఒంటరిగా నిర్మించుకున్న చిన్న పూరి గుడిసెకు దగ్గరలో అడవిలో దొరికే అందమైన పక్షి ఈకల మధ్య సేద తీరుతున్నట్లుగా ప్రాణంలేని అతడి దేహం కనిపించింది.
అడవిపై వారికే హక్కులు :-
బ్రెజిల్‌ దేశ రాజ్యాంగం ప్రకారం ఆదిమవాసులకు అడవులపై పూర్తి హక్కులు ఉంటాయి. ఆ ప్రాంతంలోకి ఇతరులు అడుగుపెట్టడం నిషేధం. 1998 నుంచి ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.

13వ శతాబ్దం నాటి అతిచిన్న గణేశ్‌ శిల్పం గుర్తింపు

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామంలో 13వ శతాబ్దం నాటి అతిచిన్న గణేశ్‌ శిల్పాన్ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు రాగి మురళి తెలిపారు. కాకతీయుల కాలం నాటి ఇంత చిన్న గణేశుని బొమ్మ తెలంగాణలో బయటపడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. పరడ గుట్ట మీద ఉన్న ఇనుప రాతియుగం ఆనవాళ్లు, కొండ దిగువన బౌద్ధ స్తూప శిథిలాలను పరిశీలిస్తుండగా 4 సెం.మీ. ఎత్తు, 3 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంతో చిన్న గణేశ్‌ శిల్పాన్ని గుర్తించినట్లు వివరించారు. ‘శిల్పం తలపై కాకతీయ శైలి జటామకుటం, పెద్ద బొజ్జపైన నాగయజ్ఞోపవీతం, లలితాసనంలో కూర్చుని ఉన్న గణేశుని పీఠంపై చిన్న మూషిక వాహనం ఉంది’ అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.

చేర్యాలలో శాతవాహనుల కాలం నాటి వస్తువులు, బొమ్మలు

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రం సమీపంలో పాటిగడ్డ (పాతవూరు దిబ్బ) మీద శాతవాహనులు, అంతకుముందు కాలం ప్రజలు ఉపయోగించిన అపురూపమైన టెర్రకోట వస్తువులు, శిల్పాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. వీటి ఆధారంగా దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో నాగరిక సమాజం, వాటి నివాసాలు ఉండేవని అభిప్రాయపడింది. బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ వీటిని గుర్తించగా, అక్కడి వస్తు, శిల్పాల గురించి కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ వెల్లడించారు. బౌద్ధహారీతి టెర్రకోట శిల్పం క్రీ.పూ.2వ శతాబ్దం నాటిదని, మిగతా టెర్రకోట బొమ్మలు క్రీ.శ.ఒకటి, రెండో శతాబ్దాల నాటివిగా ఆయన పేర్కొన్నారు. తలపై కిరీటం, చెవులకు పెద్ద కుండలాలతో అమ్మ విగ్రహం, అరచేతిలో ఇమిడే చిన్న మట్టి కదురు, బంగారం, వెండి, రాగి వంటి లోహాలు కరిగించే మూస, సాంబ్రాణి, అగరు ధూపం వేసే మట్టి పాత్ర, మట్టికంచుడు, ఎరుపురంగు కోటింగ్‌ వేసిన వెడల్పైన పాత్ర, చనుముక్కు గొట్టం (నీరు చల్లే పాత్ర గొట్టం), ఆకుల డిజైన్‌తో కుండపెంకు, సాంబ్రాణి పాత్ర అడుగు, నీరు చల్లే పాత్ర గొట్టం, కుండపెంకు తదితర పాత్రలు అక్కడ లభించాయని వివరించారు. గతంలో కొండాపూర్, పెదబొంకూర్, కోటిలింగాల వంటి శాతవాహన ప్రదేశాల్లో దొరికిన కంచు, టెర్రకోట బొమ్మలతో ఈ అమ్మ దేవత బౌద్ధహారీతి టెర్రకోట శిల్పం పోలి ఉందన్నారు.

ఆంధ్రాలో ఆదిమ మానవుని అడుగుజాడలు

ఆధునిక మానవులు (హోమో సెపియన్స్‌) ఆఫ్రికా నుంచి భారత్‌కి సుమారు 1.22 లక్షల సంవత్సరాల క్రితం వలస వచ్చారని, వారితోపాటు మధ్యపాతరాతియుగపు పనిముట్లు తీసుకొచ్చారని ఇప్పటి వరకు పురావస్తు శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు తారుమారయ్యాయి. ఆ భావన తప్పని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 2018లో దొరికిన రాతి పనిముట్లు ఏకంగా 2.47 లక్షల సంవత్సరాలనాటివని తేలింది. వడోదరలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ (ఎంఎస్‌యు) ఆర్కియాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేవర అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది. హºమోసెపియన్స్‌ కంటే 1.25 లక్షల సంవత్సరాలకుముందే ఈ ప్రాంతంలో నివసించిన ఆదిమ మానవులు ఆ పనిముట్లు తయారు చేసినట్టుగా తేలింది. ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పాలేటి ఒడ్డునగల హనుమంతునిపాడులో అనిల్‌కుమార్‌ తన పీహెచ్‌డీ ప్రాజెక్టులో భాగంగా 2018లో జరిపిన తవ్వకాల్లో మధ్యపాత రాతియుగం నాటి పనిముట్లు దొరికాయి. అహ్మదాబాద్‌లో ఫిజికల్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ (పీఆర్‌ఎల్‌)లోని ల్యుమినిసెన్స్‌ ప్రయోగశాలలో ‘సైంటిఫిక్‌ డేటింగ్‌’ పరీక్షల ద్వారా అవి 2.47 లక్షల సంవత్సరాలనాటివని నిర్ధారించారు.