వార్తల్లో వ్యక్తులు

ఉత్తరాఖండ్‌ ప్రచారకర్తగా పంత్‌

టీమ్‌ ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌.. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రచారకర్తగా నియమితుడయ్యాడు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చినా.. పట్టుదలతో ప్రపంచ క్రికెట్లో అతడు సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అన్నారు. పంత్‌.. తన రాష్ట్రం, దేశం గర్వపడేలా చేశాడని చెప్పారు. హరిద్వార్‌ జిల్లా (ఉత్తరాఖండ్‌) రూర్కీలో పంత్‌ జన్మించాడు.

ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మోదీ టాప్‌

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75 శాతం ప్రజామోదం ఉందని ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే సర్వే సంస్థ వెల్లడించింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేతగా మోదీనే ముందున్నారని స్పష్టం చేసింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో మోదీ అత్యధిక రేటింగ్‌ సంపాదించుకున్నారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ చేపట్టిన సర్వేలో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ 41 శాతం అప్రూవల్‌ రేటింగ్‌తో 5వ స్థానంలో నిలిచారు. 63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రాడార్‌ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో 39 శాతం, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో అమెరికా అధ్యక్షుడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని అంచనా వేస్తుంటుంది. ఇంటెలిజెన్స్‌ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్‌ వంటి దేశాల్లోనూ ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

ప్రపంచ కుబేరుల్లో అదానీకి మూడో స్థానం

గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి చేరారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందు ఎలాన్‌ మస్క్‌ (టెస్లా), జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌) ఉన్నారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. మొత్తం ఆయన నికర సంపద విలువ 137.4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10.92 లక్షల కోట్లు)గా తెలిపింది. ప్రపంచ అగ్రగామి ముగ్గురు సంపన్నుల్లో నిలిచిన తొలి ఆసియా వ్యక్తి కూడా అదానీయే. ఈ జాబితాలో బిల్‌ గేట్స్‌ 5, బఫెట్‌ 6వ స్థానాలకు పరిమితం అయ్యారు.

వజ్రాల వ్యాపారిగా మొదలుపెట్టి..
కళాశాల చదువును మధ్యలోనే ఆపేసిన అదానీ, తొలుత వజ్రాల ట్రేడింగ్‌ చేశారు. బొగ్గు వ్యాపారిగా మారాకే ఆయన దశ తిరిగింది. బొగ్గు గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, డేటా కేంద్రాలు, విద్యుదుత్పత్తి, సిటీగ్యాస్‌ పంపిణీ, సిమెంటు తయారీ రంగాలకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.


డిసెంబరులో ఫౌచీ పదవీ విరమణ

అమెరికాకు చెందిన అగ్రశ్రేణి అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ 2022 డిసెంబరులో పదవీ విరమణ పొందనున్నారు. ఆ తర్వాత తన వృత్తి జీవితంలో తదుపరి అంకం మొదలవుతుందని ఆయన చెప్పారు. 81 ఏళ్ల ఫౌచీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐఏఐడీ)కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 1984 నుంచి అదే పదవిలో ఆయన కొనసాగుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ముఖ్య వైద్య సలహాదారుగా కూడా ఫౌచీ వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి కట్టడికి ఆయన కృషి చేశారు.

మలేసియాలో జైలు శిక్ష పడిన తొలి మాజీ ప్రధానిగా నజీబ్‌

‘1 మలేసియా అభివృద్ధి సంస్థ (1ఎండీబీ)’ నిధుల కుంభకోణం కేసులో తనకు హైకోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించడాన్ని (2020లో) దేశ అత్యున్నత న్యాయస్థానమైన ఫెడరల్‌ కోర్టులో సవాలు చేసిన మాజీ ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌ అప్పీలును ఫెడరల్‌ న్యాయస్థానం కొట్టివేసింది. ‘‘ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే. నజీబ్‌ అప్పీలుకు ఏ అర్హతా లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి మైమన్‌ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న నజీబ్‌ తక్షణం లొంగిపోవాలని ఆదేశించారు. దీంతో మలేసియాలో జైలు శిక్ష పడిన తొలి మాజీ ప్రధానిగా నజీబ్‌ నిలిచిపోనున్నారు.

ఇమ్రాన్‌కు ‘ఉగ్రవాద’ కేసులో బెయిల్‌

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఉగ్రవాద కేసులో మూడు రోజుల బెయిల్‌ లభించింది. ఓ ర్యాలీలో చేసిన ప్రసంగంలో న్యాయమూర్తులను, కొందరు పోలీసు అధికారులను బెదిరించారంటూ ఇమ్రాన్‌పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఆగస్టు 21న పోలీసులు ఆయనకు అరెస్టు వారెంటు జారీ చేశారు. దీనిపై ఇమ్రాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా ఆగస్టు 25 వరకు బెయిల్‌ మంజూరు చేసింది.

గేట్స్‌ ఫౌండేషన్‌ ట్రస్టీగా ఆశీష్‌ ధవన్‌

ప్రఖ్యాత బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ధర్మకర్తల మండలి సభ్యుడిగా (ట్రస్టీ) భారత్‌కు చెందిన మానవతావాది ఆశీష్‌ ధవన్‌ నియమితులయ్యారు. భారత ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన కన్వర్జెన్స్‌ ఫౌండేషన్‌కు ధవన్‌ ప్రస్తుతం సీఈవోగా ఉన్నారు. దాని వ్యవస్థాపకుడూ ఆయనే. అశోక యూనివర్సిటీకి, సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థకు ఛైర్‌పర్సన్‌గా కూడా ధవన్‌ ఉన్నారు.

ప్రఖ్యాత జర్నల్‌లో తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం

క్లిష్టమైన వినికిడి సమస్య (స్టెపిడాటమీ)కు శస్త్రచికిత్స ద్వారా పరిష్కారం చూపిన తెలుగు వైద్యునికి అరుదైన గౌరవం దక్కింది. కేర్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్‌ ఎన్‌.విష్ణు స్వరూప్‌రెడ్డి ఈ ఘనత సాధించారు. ఆయన దాదాపు 1100 శస్త్రచికిత్సలను 99 శాతం విజయవంతంగా పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ‣ ఈ అధ్యయన వివరాలు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి వెలువడే ప్రఖ్యాత జర్నల్‌ ‘లారింగోలజీ అండ్‌ ఓటోలజీ’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ ఘనత సాధించిన వైద్యుల్లో ప్రపంచంలో డాక్టర్‌ విష్ణు స్వరూప్‌రెడ్డి రెండో వ్యక్తి కావడం విశేషం. చెవి కర్ణభేరి వెనుక ఉండే మూడు ఎముకలు కదులుతూ.. బయట నుంచి వచ్చే శబ్దాలను లోపలకు పంపుతాయి. అక్కడి నుంచి శబ్ద తరంగాలు మెదడుకు చేరతాయి. ఈ మూడు ఎముకల్లో చివరిది కొన్ని కారణాలతో బిగుసుకుపోయి.. వినికిడి లోపం తలెత్తుతుంది. జన్యుపరంగా 8-80 ఏళ్లవారిలో ఎవరికైనా ఈ సమస్య రావచ్చని డాక్టర్‌ విష్ణు స్వరూప్‌రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్సతో దీన్ని నయం చేయవచ్చని చెప్పారు.

మౌంట్‌ ఎల్‌బ్రస్‌ను అధిరోహించిన 13 ఏళ్ల బాలుడు

హైదరాబాద్‌కు చెందిన పడకంటి విశ్వనాథ్‌ కార్తికేయ (13) ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ పర్వతం తూర్పు, పడమర శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధిరోహించాడు. ఎల్‌బ్రస్‌ పర్వతం పశ్చిమభాగం 5,642 మీటర్లు, తూర్పు శిఖరం 5,621 మీటర్ల ఎత్తు ఉంటాయి.

ఎల్‌బ్రస్‌ శిఖరాగ్రంపై మంచిర్యాల చిన్నారి

తెలంగాణకు చెందిన చిన్నారి హస్వి(14) అరుదైన ఘనతను సాధించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరోపాలోని అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ను అధిరోహించింది. 24 గంటల వ్యవధిలో రెండువైపుల (తూర్పు, పడమర) నుంచి ఈ శిఖరాగ్రాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్‌బ్రస్‌ శిఖరాగ్రాన్ని పశ్చిమాన; తూర్పు నుంచి కూడా (5,621 మీటర్ల ఎత్తు) ఆగస్టు 16 ఉదయానికి పూర్తి చేసుకుంది.

మిస్‌ ఇండియా యూఎస్‌ఏగా ఆర్యా వాల్వేకర్‌

భారతీయ అమెరికన్‌ యువతి ఆర్యా వాల్వేకర్‌ (18) ‘మిస్‌ ఇండియా యూఎస్‌ఏ’గా ఎంపికయ్యారు. న్యూజెర్సీలో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచారు. మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీలకు 30 రాష్ట్రాల నుంచి 74 మంది హాజరయ్యారు. ఈ పోటీలో వర్జీనియా విశ్వవిద్యాలయం వైద్య విద్యార్థిని సౌమ్యా శర్మ తొలి రన్నరప్‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన్‌ చేకూరి రెండో రన్నరప్‌గా నిలిచారు. మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏగా అక్షి జైన్‌ (వాషింగ్టన్‌), మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్‌ఏగా తన్వీ గ్రోవర్‌ (న్యూయార్క్‌) ఎంపికయ్యారు.

అమెరికాలో అగ్రశ్రేణి కోర్టు జడ్జిగా రూపాలీ దేశాయ్‌

అమెరికాలోని ఓ అగ్రశ్రేణి న్యాయస్థానం జడ్జిగా భారతీయ అమెరికన్‌ రూపాలీ హెచ్‌.దేశాయ్‌ నియమితులు కానున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా)లోని నైన్త్‌ సర్క్యూట్‌ ‘యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్స్‌’ న్యాయమూర్తిగా ఆమెను నియమించేందుకు సెనేట్‌ 67-29 ఓట్లతో ఆమోదం తెలిపింది. అమెరికాలోని 13 అపీల్‌ కోర్టుల్లోకెల్లా ఇది పెద్దది. ఆరిజోనాలోని అగ్రశ్రేణి ఎలక్షన్‌ లాయర్లలో రూపాలీ ఒకరు. నైన్త్‌ సర్క్యూట్‌ కోర్టుకు దక్షిణాసియాకు చెందిన తొలి జడ్జిగా ఆమె గుర్తింపు పొందనున్నారు.

ఆరు గంటల్లో ఎల్బ్రస్‌ శిఖరాగ్రం అధిరోహించిన దంపతులు

ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్‌ ఎల్బ్రస్‌ను నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన చాపల వెంకట్‌రెడ్డి (52), విజయలక్ష్మి (50) దంపతులు అధిరోహించారు. త్రిపురారం మండలం కంపసాగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న విజయలక్ష్మికి పర్వాతారోహణపై ఉన్న మక్కువతో ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని రుథుగైరా, ఆఫ్రికాఖండంలోని ఖిలిమంజారో పర్వతాలను అధిరోహించారు. ఈ సారి భర్త వెంకట్‌రెడ్డితో కలిసి ఏకంగా 5,642 మీటర్ల ఎత్తున్న మౌంట్‌ ఎల్బ్రస్‌ను ఆరు గంటల వ్యవధిలోనే అధిరోహించారు.

కత్తుల విన్యాసాలతో గిన్నిస్‌ రికార్డ్‌

అయిదు వేలమంది రాజ్‌పుత్‌ యువకులు కత్తులతో విన్యాసాలు చేసి సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. చరిత్రాత్మక భూచర్‌ మోరీ మైదాన్‌ యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం అఖిల గుజరాత్‌ రాజ్‌పుత్‌ యువసంఘ్‌తోపాటు షహీద్‌ స్మారక ట్రస్ట్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 430 ఏళ్ల క్రితం జామ్‌నగర్‌ జిల్లాలోని ధ్రోల్‌ నగర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో భూచర్‌ మోరీ మైదానంలో మొగల్‌ సేనతో అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో వేలాది ప్రజలు ప్రాణాలు అర్పించారు.

స్వాతంత్య్ర వేడుకలకు అమెరికా గాయని మిల్బెన్‌

ఓం జయ జగదీశ హరే, జనగణమన గీతాలను ఆలపించి భారత్, అమెరికాల మధ్య స్నేహవారధిగా నిలిచిన నల్లజాతి అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి దిల్లీ వస్తున్నారు. భారత సాంస్కృతిక సంబంధాల మండలి ఆహ్వానంపై ఆమె అమెరికా అధికార ప్రతినిధిగా వస్తున్నారు. ఆగస్టు 10న ఇండియాస్పోరా గ్లోబల్‌ ఫోరమ్‌లో మేరీ భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. చెన్నైకు చెందిన పియానో కళాకారుడు లిడియన్‌తో కలసి ప్రదర్శన ఇస్తారు.