మరణాలు

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరణం

స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో ‘బిగ్‌ బుల్‌’గా ప్రసిద్ధిగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) మరణించారు.
ఆయన్ను ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌తో పోల్చుతూ ‘భారత వారెన్‌ బఫెట్‌’గా వ్యవహరించేవారు.
స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్, మదుపరి, వ్యాపారవేత్త అయిన ఝున్‌ఝున్‌వాలా 3 బాలీవుడ్‌ చిత్రాలను రూపొందించారు.
దేశీయంగా ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌కూ ఆయన ప్రధాన పెట్టుబడిదారుడు.
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాసంపద విలువ దాదాపు 5.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.46,000 కోట్లు) అని, భారతీయ సంపన్నుల్లో 22వ స్థానంలో ఉన్నారని కుబేరుల జాబితా వెలువరించే ఫోర్బ్స్‌ పేర్కొంది.

ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్‌ సేన్‌ మరణం

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ (72) మరణించారు.
గ్రామీణ ఆర్థికవ్యవస్థ విషయంలో దేశంలోని అగ్రగామి నిపుణుల్లో సేన్‌ ఒకరు.
ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీల్లో అభిజిత్‌ సేన్‌ దశాబ్దాల పాటు అర్థశాస్త్రాన్ని బోధించారు.
వ్యవసాయ వ్యయం, ధరలపై ఏర్పాటు చేసిన కమిషన్ల అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 2004 నుంచి 2014 వరకూ ప్రణాళికా సంఘం సభ్యుడిగా పని చేశారు. 2010లో పద్మభూషణ్‌ అవార్డు వరించింది. 2014లో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలిక ఆహారధాన్యాల విధాన రూపకల్పనకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కార్యదళం అధ్యక్షుడిగా అభిజిత్‌ సేన్‌ నియమితులయ్యారు.

ఫుట్‌బాల్‌ దిగ్గజం బెనర్జీ మరణం

భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సమర్‌ భద్రు బెనర్జీ మరణించారు. ఆయన వయసు 92 ఏళ్లు. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో చరిత్రాత్మక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టుకు బెనర్జీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫుట్‌బాల్‌ వర్గాలు ‘భద్రు దా’ అని గౌరవంగా పిలుచుకునే బెనర్జీ.. కొంతకాలంగా అల్జీమర్స్, అధిక రక్తపోటు లాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
ఇప్పటివరకు భారత్‌ మూడుసార్లు ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్‌ ఆడగా.. బెనర్జీ సారథ్యం వహించిన జట్టు ప్రదర్శనే ఉత్తమంగా నిలిచింది. రహీం కోచింగ్‌లో భద్రు బెనర్జీతో పాటు పీకే బెనర్జీ, నెవిల్‌ డిసౌజా, కృష్ణస్వామి లాంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దూకుడైన ఆటతో సెమీస్‌ వరకు వెళ్లింది. మోహన్‌ బగాన్‌ కెప్టెన్‌గా బెనర్జీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. సారథిగా డ్యూరాండ్‌ కప్‌ (1953), రోవర్స్‌ కప్‌ (1955)లను గెలిపించిన ఆయన.. సంతోష్‌ ట్రోఫీ (1953, 1955) గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1962లో కోచ్‌గానూ సంతోష్‌ ట్రోఫీలో జట్టును విజయపథంలో నడిపించాడు.

బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్‌ మరణం

బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఝార్ఖండ్‌ రాష్ట్ర క్రికెట్‌ సంఘం (జేఎస్‌సీఏ) మాజీ అధ్యక్షుడు అమితాబ్‌ చౌదరి (62) గుండెపోటుతో మరణించారు. ఝార్ఖండ్‌ పోలీసు శాఖలో ఐజీపీగా బాధ్యతలు నిర్వహించి రిటైరైన ఈ మాజీ ఐపీఎస్‌ అధికారి ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (జేపీఎస్‌సీ)కు ఛైర్మన్‌గానూ పనిచేశారు.

డాయిష్‌ బ్యాంక్‌ అన్షు జైన్‌ మరణం

జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ మాజీ సహ సీఈఓ, భారత సంతతికి చెందిన అన్షు జైన్‌ (59) మరణించారు. అయిదేళ్ల పాటు ఉదర సంబంధిత డ్యూడెనాల్‌ (ఆంత్రమూలం) క్యాన్సర్‌తో పోరాడిన ఆయన మరణించినట్లు డాయిష్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 2017లో ఆయన క్యాన్సర్‌ బారిన పడినట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా లండన్‌లో నివాసం ఉంటున్న అన్షు జైన్‌ అక్కడే మరణించారు. మన దేశంలోని జయపురలో ఆయన జన్మించారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రం హానర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1995లో డాయిష్‌ బ్యాంక్‌లో చేరిన ఆయన 2012లో సహ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

ప్రముఖ శిల్పి సీఎస్‌ఎన్‌ పట్నాయక్‌ మరణం

ప్రముఖ శిల్పి, చిత్రకారుడు సీఎస్‌ఎన్‌ పట్నాయక్‌(97) విశాఖలో మరణించారు. శ్రీకాకుళం జిల్లా బాదాంలో జన్మించిన ఆయన ఫైన్‌ఆర్ట్స్‌ పూర్తిచేసి గుంటూరులోని మహిళా కళాశాలలో చిత్రకళల అధ్యాపకుడిగా చేరి ఆ తర్వాత శిల్పకళలపై దృష్టిసారించారు. 1975లో కాంస్య శిల్పకళపై పరిశోధనలు చేయటానికి యూజీసీ ఫెలోషిప్‌ను అందుకున్నారు. పట్నాయక్‌ ఏపీ లలితకళా అకాడమీ ఉపాధ్యక్షుడిగా, భారత శిల్పుల ఫోరం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కార్, విశిష్ట పురస్కార్, రాష్ట్ర ప్రభుత్వ కళారత్న బిరుదు, కేంద్ర ప్రభుత్వ వయోశ్రేష్ట అవార్డులు అందుకున్నారు.