ఆంధ్ర ప్రాంత, ఆంధ్ర జాతి తొలి ప్రస్తావనలు

ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ పదవీ బాధ్యతల స్వీకరణ

దేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా సేవలందించిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని మార్గరెట్‌ ఆళ్వాపై ఘన విజయం సాధించారు. 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. న్యాయవాద వృత్తిలోంచి రాజకీయాల్లోకి :- ‣ రాజస్థాన్‌ ఓబీసీ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌.. మూడు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశంలోనే రెండో అత్యున్నత స్థానానికి ఎదిగారు. 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కిథనా గ్రామంలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ జన్మించారు. ఎల్‌ఎల్‌బీ కోర్సు తర్వాత 1979 నవంబరులో రాజస్థాన్‌ బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ‣ 1989లో జనతాదళ్‌ తరఫున ఝున్‌ఝును లోక్‌సభ స్థానం నుంచి ధన్‌ఖడ్‌ గెలిచారు. 1990లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌ కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా స్వల్పకాలం పనిచేశారు. 1993-98 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2008 తర్వాత భాజపా గూటికి చేరిన ధన్‌ఖడ్‌... 2019లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.

నూతన సీజేఐగా జస్టిస్‌ యు.యు.లలిత్‌

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124(2) కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆగస్టు 27వ తేదీ నుంచి జస్టిస్‌ లలిత్‌ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీకాలం ఆగస్టు 26వ తేదీతో ముగుస్తుండటంతో 27 నుంచి ఆ స్థానంలో జస్టిస్‌ లలిత్‌ బాధ్యతలు చేపడతారు. ఈ ఏడాది నవంబరు 8వ తేదీ వరకు ఆయన పదవిలో ఉంటారు. 1957 నవంబరు 9న జన్మించిన యు.యు.లలిత్‌ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా సేవలందించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌ ప్రమాణం

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ ఉమేశ్‌ రంగనాథ్‌ లలిత్‌ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.
సీనియర్‌ న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా..
1957 నవంబరు 9న ముంబయిలో జన్మించిన జస్టిస్‌ లలిత్‌ 1983 జూన్‌లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సీనియర్‌ న్యాయవాది అయిన ఆయన హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేయకుండానే 2014 ఆగస్టు 13న నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1971 జనవరిలో భారత 13వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ తర్వాత ఇలా న్యాయవాదుల నుంచి నేరుగా పదోన్నతి పొంది ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరిన రెండో వ్యక్తిగా జస్టిస్‌ లలిత్‌ చరిత్ర పుటలకెక్కారు. జస్టిస్‌ సిక్రీ 1964 మార్చిలో తొలుత సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి అయి, తర్వాత సీజేఐ అయ్యారు.
74 రోజులే..
నూతన సీజేఐ జస్టిస్‌ లలిత్‌ 74 రోజుల స్వల్పకాలం మాత్రమే కొనసాగి, నవంబరు 8న పదవీ విరమణ చేస్తారు. వంద రోజుల కంటే తక్కువ కాలం సీజేఐగా ఉన్నవారిలో ఆయన ఆరోవారు అవుతారు.

డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా సమీర్‌ వి.కామత్‌

కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఛైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సమీర్‌ వి.కామత్‌ నియమితులయ్యారు.
ఇదే సమయంలో ఆయన్ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగానూ నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈయనకు 60 ఏళ్లు వచ్చే వరకూ ఈ పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొంది.
ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న జి.సతీష్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు శాస్త్ర సలహాదారుగా నియమించింది. కామత్‌ 1989లో సైంటిస్ట్‌-సి హోదాలో హైదరాబాద్‌లో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. గత మూడు దశాబ్దాల్లో ఆయన రక్షణ రంగానికి బహుముఖ సేవలు అందించారు. ఈయన ఐఐటీ ఖరగ్‌పుర్‌ పూర్వ విద్యార్థి. ప్రస్తుతం నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్, ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా ఫెలో, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటల్స్, మెటీరియల్స్‌ రీసెర్చ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, మాగ్నెటిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా జీవిత కాల సభ్యుడిగా ఉన్నారు. సొసైటీ ఫర్‌ ఫెయిల్యూర్‌ అనాలిసిస్‌ హైదరాబాద్‌ ఛాప్టర్‌కు అధ్యక్షుడిగా పని చేశారు. 4 పీహెచ్‌డీలు చేశారు. 180 పరిశోధన పత్రాలు వివిధ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 35 సాంకేతిక నివేదికలు రూపొందించారు.
సతీష్‌రెడ్డి 2018 ఆగస్టు 25న డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా నియమితులై ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చారు.

ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కృష్ణమూర్తి సుబ్రమణియన్‌

కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రమణియన్, మనదేశం నుంచి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
కేంద్ర ప్రభుత్వంలోని నియామకాల సంఘం ఈ నియామకాన్ని ఖరారు చేసింది.
ఈ ఏడాది నవంబరు 1 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం మన దేశం నుంచి ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ సుర్జీత్‌ ఎస్‌.భల్లా వ్యవహరిస్తున్నారు.
ఆయన స్థానంలో కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆచార్యులుగా సుబ్రమణియన్‌ ఉన్నారు.

జాతీయ పాఠశాలల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా తులసీప్రసాద్‌


జాతీయ పాఠశాలల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన తులసీప్రసాద్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.
లఖ్‌నవూలో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నారు.
హరియాణాకు చెందిన కులభూషణ్‌శర్మ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా పదవీకాలం పొడిగింపు

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2023 ఆగస్టు 22 వరకు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది.
ఆయన పదవీకాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి. 1984 బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన భల్లా 2019 ఆగస్టులో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రకృతి వ్యవసాయంపై జాతీయ సలహా మండలి సభ్యుడిగా విజయ్‌కుమార్‌

ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన జాతీయ సలహా మండలిలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్‌ ఛైర్మన్‌ టి.విజయకుమార్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖలో ప్రకృతి వ్యవసాయాన్ని పర్యవేక్షించే డైరెక్టర్‌ స్థాయి అధికారి సభ్య కార్యదర్శిగా మొత్తం 14 మంది సభ్యులతో ఈ మండలి ఏర్పాటైంది. రెండేళ్లపాటు కొనసాగే ఈ మండలి.. తొలుత గంగా పరివాహక పరిధిలో అయిదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తుందని రైతు సాధికార సంస్థ తెలిపింది.

నాబార్డ్‌ ఛైర్మన్‌గా మహమ్మద్‌ ముస్తఫా

నాబార్డ్‌ ఛైర్మన్‌గా మహమ్మద్‌ ముస్తఫాను నియమించాలని ‘ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫార్సు చేసింది. ముస్తఫా యూపీ కేడర్‌కు చెందిన 1995 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. గతంలో భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు, జాతీయ హౌసింగ్‌ బ్యాంకుకు సీఎండీగా పనిచేశారు. ఈ సిఫార్సుపై కేబినెట్‌ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. పదవీ కాలం ముగియనున్న ప్రస్తుత ఛైర్మన్‌ గోవిందరాజులు స్థానంలో ముస్తఫాను నియమించనున్నారు.