జాతీయం

దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌

దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఘన విజయం సాధించారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాపై ఆయన 346 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్‌ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌ సింగ్‌ ప్రకటించారు.
రాజస్థాన్‌కు చెందిన ధన్‌ఖడ్‌కు న్యాయవాదిగా, చట్టసభల సభ్యునిగా, గవర్నర్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది.
ఓటింగ్‌ సరళి ఇలా..
మొత్తం ఓట్లు: 780
పోలైనవి: 725 (92.94)
చెల్లినవి: 710 (97.93)
ధన్‌ఖడ్‌కు దక్కినవి: 528 (74.36%)
మార్గరెట్‌ ఆళ్వాకు వచ్చినవి: 182 (25.63%)

తొలిసారి సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం

చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణను పురస్కరించుకొని ప్రత్యేకంగా సమావేశమైన సెరిమోనియల్‌ ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా వెబ్‌ కాస్టింగ్‌ చేశారు.

బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా అవధ్‌ బిహారి చౌధరి

రాష్ట్రీయ జనతాదళ్‌ సీనియర్‌ నాయకుడు అవధ్‌ బిహారి చౌధరి బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో భాజపా సభ్యుడు విజయ్‌కుమార్‌ సిన్హా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. భాజపా తమ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తోందంటూ జేడీ(యూ) నేత, సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్డీయే నుంచి ఇటీవల బయటకు వచ్చి ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు ఉన్నాయి.

బయోఆసియా సదస్సు థీమ్‌ పోస్టర్‌ విడుదల

బయోఆసియా 20వ అంతర్జాతీయ సదస్సు-2023 వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం’ నినాదంతో ఈ సదస్సును నిర్వహించబోతున్నామని, ఈసారి 120 దేశాల నుంచి ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, నోబెల్‌ పురస్కార విజేతలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆయన ప్రగతిభవన్‌లో 20వ బయోఆసియా సదస్సు నిర్వహణ తేదీలను ప్రకటించారు. లోగో, థీమ్‌లను విడుదల చేశారు.

నిరుపేద బాలికల ప్రోత్సాహానికే ‘ప్రాజెక్ట్‌ శక్తి’

విద్యతో పాటు వివిధ రంగాల్లో వంద మంది నిరుపేద, ప్రతిభావంతులైన బాలికలను ప్రోత్సహించడమే లక్ష్యంగా తాము ‘‘ప్రాజెక్ట్‌ శక్తి’’ కార్యక్రమాన్ని చేపట్టామని పర్వతారోహకులైన మాలావత్‌ పూర్ణ, కావ్య మన్యపు(నాసా శాస్త్రవేత్త) తెలిపారు. ప్రాజెక్ట్‌ శక్తి పేరుతో లక్ష డాలర్ల (సుమారు రూ.80 లక్షలు) సేకరణే లక్ష్యంగా ఇప్పటి వరకు ఎవరూ ఎక్కని లద్ధాఖ్‌లోని ఓ పర్వతాన్ని తాము అధిరోహించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి విద్య కావాలని తాము చేస్తున్న ప్రయత్నానికి అంతా సహకరించాలని కోరారు. తమలాగే మరో 100 మంది బాలికలను పర్వతారోహకులుగా తయారు చేయాలన్నదే తమ ఆశయమన్నారు.

‘వందే భారత్‌’ ప్రయోగాత్మక పరుగులో గంటకు 180 కి.మీ వేగం నమోదు

దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’ ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తొలి వందే భారత్‌ రైలు 2019లోనే అందుబాటులోకి వచ్చింది. న్యూదిల్లీ - వారణాసి మార్గంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దిల్లీ - వైష్ణోదేవీ (జమ్మూ) మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా కోటా (రాజస్థాన్‌) - నగ్దా (మధ్యప్రదేశ్‌) సెక్షన్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల వేగం నమోదయినట్టు మంత్రి తెలిపారు. రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌చేసి దాన్ని రైలు కిటికీ పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు కొద్ది క్షణాలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంతటి వేగంతో వెళ్తున్నా పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. ఈ తరహా రైళ్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్‌ రైళ్లను తీసుకురానున్నట్లు 2022 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది.

చరఖాతో 7,500 మంది మహిళల రికార్డు

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలవాలన్న కల నెరవేరడానికి, స్వావలంబన సాధించడానికి ఖాదీయే స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా సబర్మతి నదీ తీరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ‘ఖాదీ ఉత్సవ్‌’లో మోదీ ప్రసంగించారు. దీనిలో ఒకేసారి 7,500 మహిళలు చరఖా తిప్పి నూలు వడకడం ద్వారా కొత్త రికార్డు సృష్టించారు. సబర్మతి నదిపై సర్వాంగ సుందరంగా నిర్మించిన ‘అటల్‌ కాలిబాట వంతెన’ను, అహ్మదాబాద్‌లో ఖాదీ గ్రామోద్యోగ్‌ భవన్‌ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

బినామీ చట్టంలోని నిబంధనల కొట్టివేత

బినామీ లావాదేవీల (నిషేధ) చట్టం-1988లోని మూడేళ్ల గరిష్ఠ జైలు శిక్ష లేదా జరిమానా, రెండింటిని కలిపి విధించేందుకు వీలు కల్పించే సెక్షన్‌ 3(2)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బినామీ ఆస్తుల జప్తు, స్వాధీనం, వాటిపై ప్రభుత్వానికి హక్కు కల్పించే సెక్షన్‌ 5 అమలును కూడా నిలిపివేసింది. సరైన రక్షణలు కొరవడిన ఈ నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. 1988 నాటి చట్టంలోని సెక్షన్‌ 3...బినామీ లావాదేవీలను నిషేధిస్తుంది. అదే సెక్షన్‌లోని ఉపనిబంధన (2).. అటువంటి లావాదేవీల్లో భాగస్వాములైన అందరూ కారాగార శిక్షకు అర్హులుగా పేర్కొంటోంది. దీని ప్రకారం అటువంటి వ్యక్తులకు గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించవచ్చు.

సుప్రీం విశ్రాంత న్యాయమూర్తులకు ఏడాదిపాటు సాయుధ భద్రత

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), ఇతర న్యాయమూర్తులకు పదవీ విరమణ చేసిన అనంతరం ఏడాది వరకు సాయుధ భద్రత కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వ్యక్తిగతంగా సదరు న్యాయమూర్తులతోపాటు, వారి నివాసాల వద్ద 24 గంటల భద్రతకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు, పని పరిస్థితుల చట్టం 1958లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ‣ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదవీ విరమణ అనంతరం ఆరు నెలల వరకు దిల్లీలో అద్దె లేని నివాస సౌకర్యం కల్పించడానికి అనుమతి ఇచ్చింది. విమానాశ్రయాల్లోని సెరిమోనియల్‌ లాంజ్‌ల్లో సుప్రీంకోర్టు, హైకోర్టుల విశ్రాంత సీజేలకు ప్రోటోకాల్‌ సౌకర్యం కల్పించేందుకు కేంద్రం అంగీకరించింది. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల వెంట ఉండే డ్రైవర్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌లకు ఏడాదిపాటు పూర్తిస్థాయి జీతభత్యాలు ఇవ్వడానికీ అనుమతి ఇచ్చింది.

కేంద్రం-దిల్లీ ప్రభుత్వ వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం

జాతీయ రాజధాని ప్రాంత(ఎన్‌సీటీ) దిల్లీ ప్రభుత్వం, కేంద్ర సర్కారు మధ్య అధికార పరిధులపై తలెత్తిన న్యాయ వివాదాన్ని పరిష్కరించడం కోసం అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వెల్లడించారు. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను చేపడుతుందని తెలిపారు. ‣ దిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు మే 6న సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2019 ఫిబ్రవరి 14న భిన్నాభిప్రాయ తీర్పును వెెలువరించడంతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు ఆవశ్యకత ఏర్పడింది.

రోదసి శకలాల పరిశీలనకు ఉత్తరాఖండ్‌లో కేంద్రం

భూమి చుట్టూ తిరుగుతున్న చిన్నపాటి శకలాలనూ పరిశీలించేందుకు భారత్‌లో తొలి వాణిజ్య అంతరిక్ష పరిశీలన కేంద్రం (స్పేస్‌ సిచ్యువేషనల్‌ అవేర్‌నెస్‌ అబ్జర్వేటరీ-ఎస్‌ఎస్‌ఏ) ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్‌ ప్రాంతంలో సిద్ధం కానుంది. దిగంతర అనే అంకుర పరిశ్రమ దీన్ని ఏర్పాటు చేయనుంది. ఎస్‌ఎస్‌ఏ అబ్జర్వేటరీ వల్ల అంతరిక్షంలోని 10 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన శకలాలనూ పరిశీలించడానికి భారత్‌కు వీలవుతుంది. వీటితోపాటు మన దేశానికి ఎగువున సైనిక ఉపగ్రహాల కార్యకలాపాలనూ పరిశీలించొచ్చు. ‣ ప్రస్తుతం అంతరిక్ష వ్యర్థాల పరిశీలనలో అమెరికాదే పైచేయి. ఆస్ట్రేలియా నుంచి దక్షిణాఫ్రికా మధ్య ఇలాంటి కేంద్రాలు లేవు. ఇది నాణ్యమైన డేటాను అందిస్తుంది. దీనివల్ల రోదసిలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించడానికి వీలవుతుంది. ఉపగ్రహాలు పరస్పరం ఢీ కొట్టుకోకుండా చూడటానికి ఈ డేటా ఉపయోగపడుతుంది.

ప్రభుత్వ అవార్డుల ఎంపికకు ఒకే వేదిక..‘రాష్ట్రీయ పురస్కార్‌ పోర్టల్‌’

కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించే అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. ఎంపికలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘రాష్ట్రీయ పురస్కార్‌’ పేరిట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ https://awards.gov.in/ పోర్టల్‌ను రూపొందించింది. వివిధ అవార్డుల కోసం వ్యక్తులు, సంస్థల పేర్లను సిఫార్సు చేసేందుకు ప్రజలు ఈ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ‣ ఈ పోర్టల్‌ ద్వారా కేంద్రం ప్రస్తుతం పద్మ అవార్డులు(సెప్టెంబరు 15 చివరి తేదీ), జాతీయ ఉత్తమ అటవీ శాఖ అవార్డులు(సెప్టెంబరు 30), జాతీయ గోపాలరత్న అవార్డులు(సెప్టెంబరు 15), జాతీయ జల అవార్డు(సెప్టెంబరు 15), నారీశక్తి పురస్కార్‌(అక్టోబరు 31), సుభాష్‌ చంద్రబోస్‌ ఆపదా ప్రబంధన్‌ పురస్కార్‌(ఆగస్టు 31 చివరి తేదీ)కు నామినేషన్లు, సిఫార్సులను ఆహ్వానిస్తోంది.

దివ్యాంగుల సౌకర్యాలకు కేంద్రం ముసాయిదా

వివిధ ప్రాంతాల్లో తాగునీటి పాయింట్ల వద్ద దివ్యాంగులు, వృద్ధులు, దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి సులువుగా, సౌకర్యవంతంగా నీళ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం తాజా మార్గదర్శకాలతో ముసాయిదాను రూపొందించింది. కుళాయిలను చేతితో తిప్పాల్సిన అవసరం లేకుండా పాదాలతోనే ఆపరేట్‌ చేయగలిగేలా పెడళ్లను ఏర్పాటు చేయడం.. తాగునీటి పాయింట్ల వద్ద అనుకూలంగా ఉండేలా హ్యాండిళ్లు వంటివాటిని అమర్చడం.. ఆటోమేటిక్‌ సెన్సర్లు, బ్రెయిలీ లిపిలో సూచికలు పెట్టడం వంటివన్నీ ముసాయిదాలో ఉన్నాయి. తాగునీరు, పారిశుధ్య విభాగం ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

దేశంలో విస్తరిస్తున్న లంపీ చర్మ వ్యాధి

పశువులకు సోకే లంపీ చర్మ వ్యాధి మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధితో ఎనిమిది రాష్ట్రాలతోపాటు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 7,300 పశువులు మరణించాయి. ఇది పశువులకు సోకే అంటు వ్యాధి. కొన్ని జాతుల ఈగలు, దోమలు, పేలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. దీనివల్ల పశువుల్లో జ్వరం, చర్మంపై బొబ్బలు ఏర్పడటమేగాక మరణానికి దారితీస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం అత్యధికంగా పంజాబ్‌లో 3,359, రాజస్థాన్‌లో 2,111 పశువులు చనిపోయాయి. ఈ వ్యాధి సోకిన పశువుల్లో మరణాలు 1 నుంచి 2 శాతం మాత్రమే ఉంటాయి. ఇది మనుషులకు సోకదు.

రసాయన, అణు ప్రమాద బాధితుల చికిత్సకు కేంద్రాలు

రసాయన, జీవ, రేడియోధార్మిక, అణు (సీబీఆర్‌ఎన్‌) ప్రమాదాలు లేదా దాడుల బాధితులకు చికిత్స చేయడానికి రెండు సూపర్‌స్పెషాలిటీ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, విశాఖపట్నంలో హెచ్‌పీసీఎల్‌ చమురు శుద్ధి కర్మాగారంలో విస్ఫోటం, తుగ్లకాబాద్‌ గ్యాస్‌ లీక్‌ తదితర పారిశ్రామిక ప్రమాదాలు పునరావృతమైతే తలెత్తే వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోడం దీని ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోని స్టాన్లీ వైద్య కళాశాల, హరియాణాలోని జజర్‌లో ఉన్న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టు నివేదిక సిద్ధమైనట్లు పేర్కొన్నాయి.

అగ్రి ఉడాన్‌ అయిదో దశ ప్రారంభం

జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ(నార్మ్‌)లో అంకుర సంస్థలను మరింతగా ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘అగ్రి ఉడాన్‌’ కార్యక్రమం అయిదో దశను ప్రారంభించినట్లు సంస్థ సంచాలకుడు సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. అంకుర సంస్థల ఏర్పాటు, నిర్వహణ, వాణిజ్యం అభివృద్ధి వరకూ పర్యవేక్షించేందుకు ఈ సంస్థలో ‘ఎ-ఐడియా’ టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌ కేంద్రం పనిచేస్తోందన్నారు.

జమ్మూ-కశ్మీర్‌లో ఓటర్ల జాబితా సవరణ

జమ్మూ-కశ్మీర్‌లో ఓటర్ల జాబితాలను సవరించినప్పుడు కొత్తగా 25 లక్షల మంది చేరుతారన్నది అపోహ మాత్రమేనని పాలనా యంత్రాంగం స్పష్టం చేసింది. 370వ అధికరణాన్ని రద్దుచేసిన తరవాత తొలిసారి జమ్మూ-కశ్మీర్‌లో ఓటర్ల జాబితాలను సవరిస్తున్నారు. 2022 అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండిన జమ్మూ-కశ్మీర్‌ వాసులు మాత్రమే అదనపు ఓటర్లుగా నమోదవుతారని పాలనా యంత్రాంగం వివరించింది. ఓటర్ల జాబితా సవరణ వారికి మాత్రమే వర్తిస్తుందని, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినవారు తపాలా బ్యాలెట్‌ ద్వారా లేదా దిల్లీ, ఉద్ధంపుర్‌లలో ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రాల్లోనో తమ సొంత నియోజకవర్గాలకు సంబంధించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని పేర్కొంది. 2011లో జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రకారం జమ్మూ-కశ్మీర్‌ ఓటర్ల సంఖ్య 66,00,921 కాగా ఇప్పుడది 76,02,397కి చేరినట్లు సమాచార శాఖ తెలిపింది.

గోవాలో 100% గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సరఫరా

గోవా 100% గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటిని సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని అందుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ద్వారా ప్రసంగించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద తమ ప్రభుత్వం గత మూడేళ్లలో ఏకంగా ఏడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సదుపాయాన్ని కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా పల్లెల్లో ఈ తరహా కనెక్షన్ల సంఖ్య 10 కోట్ల మైలురాయికి చేరుకుందని చెప్పారు. 100% కొళాయి కనెక్షన్లు ఉన్న ప్రాంతాల జాబితాలోకి గోవాతో పాటు దాద్రానగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌ చేరాయని పేర్కొన్నారు.

కేరళ న్యాయమూర్తి వివాదాస్పద ఉత్తర్వు

అసభ్యకర దుస్తులు ధరించే మహిళలు వేసే లైంగిక వేధింపుల కేసులు నిలబడవని ఇటీవల పేర్కొన్న కేరళలోని కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి మరో వివాదాస్పద ఉత్తర్వు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిందితుడికి ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తించదని ఆగస్టు 2న జారీ చేసిన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. లైంగిక వేధింపుల కేసులోనూ, ఈ ఎస్సీ ఎస్టీ చట్టం కేసులోనూ నిందితుడు 74 ఏళ్ల సివిక్‌ చంద్రనే కావడం గమనార్హం. ‣ రచయిత, ఉద్యమకారుడైన చంద్రన్‌.. లైంగికంగా వేధించారని ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ మహిళ.. ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తే, మరో మహిళ లైంగికవేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ న్యాయమూర్తి.. నిందితుడు చంద్రన్‌కు సంబంధిత చట్టాలు వర్తించవని తీర్పునిస్తూ ఆగస్టు 2, 12 తేదీల్లో బెయిల్‌ మంజూరు చేశారు.

ఆహారధాన్యాల ఉత్పత్తి 315.72 మి.టన్నులు

కేంద్ర వ్యవసాయశాఖ 2021-22 పంట ఉత్పత్తులకు సంబంధించిన నాలుగో ముందస్తు అంచనాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఆ ఏడాది మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 315.72 మిలియన్‌ టన్నులకు చేరింది. 2020-21తో పోలిస్తే ఇది 4.98 మిలియన్‌ టన్నులు అధికం. 2016-17 నుంచి 2020-21 మధ్యకాలంలో వచ్చిన అయిదేళ్ల సగటు దిగుబడులతో పోలిస్తే 25 మిలియన్‌ టన్నులు ఎక్కువ. బియ్యం, మొక్కజొన్న, శనగ, పప్పుదినుసులు, ఆవాలు, నూనెగింజలు, చెరకు ఉత్పత్తి రికార్డుస్థాయిలో వచ్చినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. 2021-22లో బియ్యం ఉత్పత్తి అంతకుమునుపు అయిదేళ్ల సగటు ఉత్పత్తి 116.44 మిలియన్‌ టన్నుల కంటే 13.85 మిలియన్‌ టన్నులు అధికంగా వచ్చింది. అలాగే అంతకుమునుపు అయిదేళ్ల సగటు కంటే తృణధాన్యాల దిగుబడి 4.32 మిలియన్‌ టన్నులు, పప్పుధాన్యాల దిగుబడి 3.87 మిలియన్‌ టన్నుల మేర అధికంగా వచ్చాయి.

ఐఓఏకు పరిపాలకుల కమిటీ

భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) వ్యవహరాలు చూసుకునేందుకు దిల్లీ హైకోర్టు ముగ్గురు సభ్యుల పాలకుల కమిటీ (సీఓఏ)ని నియమించింది. క్రీడా నియమావళి ప్రకారం నడుచుకోవడానికి ఐఓఏ నిరాకరిస్తున్న కారణంగా సంఘం వ్యవహరాలను సీఓఏకు అప్పగించక తప్పట్లేదని జస్టిన్‌ మన్మోహన్, జస్టిన్‌ నజ్మి వజిరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అనిల్‌ దవె, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఖురేషి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌లు సీఓఎలో సభ్యులు.

సైన్యం చేతికి ఆధునిక సాధన సంపత్తి

స్వీయ పోరాట సామర్థ్యానికి మరింత సానబెట్టే అధునాతన సాధన సంపత్తి భారత సైన్యానికి అందింది. రెండేళ్లుగా చైనాతో సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్‌లో మన బలగాల సత్తాను పెంచే ఆయుధ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీటిని ఆర్మీ చేతికి అందించారు. ఇవన్నీ దేశీయంగానే తయారయ్యాయి.
తాజాగా సైన్యానికి అందిన ఆయుధ వ్యవస్థలివీ..

ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ అసాల్ట్‌ (ఎల్‌సీఏ): తూర్పు లద్దాఖ్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన పాంగాంగ్‌ సరస్సు వద్ద చైనా కదలికలపై కన్నేసి ఉంచేందుకు భారత సైన్యం పడవలను ఉపయోగిస్తోంది.


రక్షిత పదాతిదళ వాహనాలు: పదాతి దళ సైనికులకు ఈ వాహనాలు రక్షణ కల్పిస్తాయి. తూర్పు లద్దాఖ్‌లో మన బలగాలను వేగంగా తరలించడానికి ఇవి ఉపయోగపడతాయి.


ఎఫ్‌-ఇన్సాస్‌: ‘ఫ్యూచర్‌ ఇన్‌ఫ్యాంట్రీ సోల్జర్‌ యాజ్‌ ఏ సిస్టమ్‌’ (ఎఫ్‌-ఇన్సాస్‌) అనే ఈ ప్రాజెక్టు ద్వారా సైనికులకు మూడు ప్రాథమిక ఉపవ్యవస్థలను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో మొదటిది.. రాత్రి, పగలు గురిచూడగలిగే హోలోగ్రఫిక్, రిఫ్లెక్స్‌ సైట్లతో కూడిన ఏకే-203 అసాల్ట్‌ రైఫిల్‌ను సమకూర్చడం. ఈ సైట్లను తుపాకీపైన, సైనికుడి హెల్మెట్‌పైన ఏర్పాటు చేస్తారు. దీనివల్ల 360 డిగ్రీల్లో సైనికుడు వీక్షించగలుగుతాడు. ఇక రెండోది.. సైనికుడి రక్షణకు సంబంధించిన ఉప వ్యవస్థ. ఇందులో ప్రత్యేకంగా రూపొందిన హెల్మెట్, తూటారక్షక కవచం ఉంటాయి. మూడోది.. కమ్యూనికేషన్, నిఘా వ్యవస్థకు సంబంధించింది.



పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు 11 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం

పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు 11 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆమోదముద్ర వేశారు.
ఆగస్టు 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం 13 మంది న్యాయవాదులను ఆ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించడానికి సిఫార్సు చేయగా రాష్ట్రపతి అందులో 11 పేర్లకు ఆమోదం తెలిపారు.

75 శిఖరాలపై మువ్వన్నెల జెండా

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) దళం ఆగస్టు 15న చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న 75 పర్వత శిఖరాలను అధిరోహించనుంది.
‘అమృత్‌రోహణ్‌’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో 75 శిఖరాలపైన జాతీయ జెండాలను ఒకేసారి ఎగురవేసి రికార్డు నెలకొల్పనుంది.
దీంతోపాటు ఎల్‌ఏసీ వెంబడి ఐటీబీపీ సిబ్బంది 75 రోజులపాటు ప్రత్యేక గస్తీ నిర్వహించనున్నారు.
ఆగస్టు 1న లద్దాఖ్‌లోని కారాకోరమ్‌ పాస్‌ వద్ద ఇది మొదలైందని, అక్టోబరు 14న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని జచెప్‌ లా వద్ద ముగుస్తుందని ఐటీబీపీ దళం తెలిపింది.

చీతాల పరిరక్షణకు ఎన్‌టీసీఏతో ఐవోసీ ఒప్పందం

చీతాలను నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తరలించి సంరక్షించేందుకు ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌’ (ఐవోసీ) ముందుకు వచ్చింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ)తో ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఇటీవల సంతకం చేసింది.
ఐదేళ్ల కాలంలో రూ.50.22 కోట్లను ఇండియన్‌ ఆయిల్‌ ఖర్చు చేయనుంది. 15-20 చీతాలను తీసుకురావడం, వాటి ఆవాస ప్రాంతాల పరిరక్షణ, సిబ్బందికి శిక్షణ వంటివాటికి ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని ఐవోసీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఈడీ డాక్టర్‌ భట్టాచార్య తెలిపారు.
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద దీనిని చేపట్టిన తొలి కార్పొరేట్‌ సంస్థగా ఐవోసీ నిలిచిందని చెప్పారు.

పట్టణప్రాంత పీఎంఏవై 2024 వరకు పొడిగింపు

పట్టణ ప్రాంతాల్లో ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ (పీఎంఏవై)ను 2024 డిసెంబరు 31 వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
పట్టణాల్లో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు కల్పించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పథకం వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే ముగిసిపోవాల్సి ఉంది.
రాష్ట్రాల వినతి మేరకు దీనిని పొడిగించాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది మార్చి 31 వరకు మంజూరైన 122.69 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
గృహ నిర్మాణంపై 2004-14 మధ్య రూ.20,000 కోట్లు ఖర్చయితే, 2015 నుంచి ఇప్పటివరకు రూ.2.03 లక్షల కోట్లకు ఆమోదం తెలిపి ఇప్పటికే రూ.1.18 లక్షల కోట్లు విడుదల చేశామని కేంద్రం తెలిపింది.


నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా

ప్రతిష్ఠాత్మక నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) సత్తా చాటింది.
దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మొత్తమ్మీద 16వ స్థానం సాధించింది.
72 పరిశోధనపత్రాల సంఖ్య, 19.46 షేర్‌తో ఆ స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు.
ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తొలిస్థానంలో నిలిచింది.
ఈ సంస్థ ఆచార్యులకు సంబంధించి 194 పరిశోధనపత్రాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి పలు విద్యాసంస్థలూ చోటు దక్కించుకున్నాయి.
ఐఐటీ హైదరాబాద్‌కు 23వ ర్యాంకు, ఐసెర్‌ తిరుపతికి 26వ ర్యాంకు, అమిటీ యూనివర్సిటీకి 54వ ర్యాంకు, నైపర్‌-హైదరాబాద్‌కు 76వ ర్యాంకు, ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌కు 82వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీకి 92వ ర్యాంకు, జేఎన్‌టీయూ కాకినాడకు 108వ ర్యాంకు, ఐఐటీ తిరుపతికి 122వ ర్యాంకు దక్కాయి.
2021 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి.. ఈ ఏడాది మార్చి 31 మధ్య ప్రచురితమైన పరిశోధనపత్రాల ఆధారంగా నేచర్‌ జర్నల్‌ ఆయా ర్యాంకులను కేటాయించింది.
ప్రధానంగా రసాయనశాస్త్రం, లైఫ్‌సైన్సెస్, భౌతికశాస్త్రంలో పరిశోధనలను ఆధారంగా తీసుకుంది.

స్వతంత్ర భారత ముఖ్య ఘట్టాలపై గూగుల్‌ ప్రాజెక్టు

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కింద 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కీలక ఘట్టాలను రచనలు, వర్ణ చిత్రాల రూపంలో ప్రదర్శించే ఆన్‌లైన్‌ ప్రాజెక్టును గూగుల్‌ సంస్థ ప్రారంభించింది.
‘ఇండియా కీ ఉడాన్‌’గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టును కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి సమక్షంలో అధికారికంగా ప్రారంభించారు.
ఇందులో భాగంగా 10 మంది ఉత్తమ కళాకారులు సృజించిన 120 చిత్రాలు, 21 కథనాలను గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచారు.
వీటితోపాటు కేంద్ర పర్యాటక శాఖ, మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ ఫోటోగ్రఫీ, భారతీయ రైల్వే హెరిటేజ్‌ విభాగం, ఇండియన్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్, దస్త్‌ కారీ హాట్‌ సమితికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనలనూ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఆరు ఖండాల్లో మువ్వన్నెల జెండా

భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా దేశ నౌకాదళం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.
అంటార్కిటికా మినహా మిగిలిన ఆరు ఖండాల్లోని పలు దేశాల పోర్టుల్లో భారతీయ యుద్ధనౌకలపై జాతీయ జెండాలు ఎగురవేసేలా ఏర్పాట్లు చేసింది.
ఈ జాబితాలో.. ఆసియా ఖండానికి సంబంధించి మస్కట్‌ (ఒమన్‌) పోర్టులో ఐఎన్‌ఎస్‌ చెన్నై, ఐఎన్‌ఎస్‌ బెత్వా నౌకలపై, సింగపూర్‌లో ఐఎన్‌ఎస్‌ సరయు, ఆఫ్రికా ఖండంలోని మాంబసా(కెన్యా)లో ఐఎన్‌ఎస్‌ త్రిఖండ్, ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఉత్తర అమెరికాలోని శాన్‌డియాగో (అమెరికా)లో ఐఎన్‌ఎస్‌ సాత్పురా, దక్షిణ అమెరికాలోని రియో డి జెనీరో (బ్రెజిల్‌)లో ఐఎన్‌ఎస్‌ తర్క్‌ష, యూరోప్‌లోని లండన్‌ (బ్రిటన్‌)లో ఐఎన్‌ఎస్‌ తరంగిణి నౌకలపై మువ్వన్నెల పతాకాలు ఎగురవేయనుంది.
ఆరు ఖండాలతో పాటు మూడు మహాసముద్రాలు, ఆరు జోన్ల సమయాల్లో జెండా వందనం సమర్పించనుంది.
ముంబయి తీరంలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి.