అంతర్జాతీయం

డిజిటల్‌ కరెన్సీలో భారత్‌కు 7వ స్థానం

→భారత జనాభాలో 7 శాతానికి పైగా ప్రజలు డిజిటల్‌ కరెన్సీ కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించింది.
→కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని తెలిపింది.
→యూఎన్‌ వాణిజ్యం, అభివృద్ధి సమాఖ్య యూఎన్‌సీటీఏడీ ప్రకారం, 2021లో అభివృద్ధి చెందిన 20 ఆర్థిక వ్యవస్థల్లో 15 దేశాల జనాభా క్రిప్టో కరెన్సీలు కలిగి ఉన్నారు.
→ఉక్రెయిన్‌ జాబితాలో 12.7 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. రష్యా (11.9 శాతం), వెనెజువెలా (10.3 శాతం), సింగపూర్‌ (9.4 శాతం), కెన్యా (8.5 శాతం), యూఎస్‌ (8.3 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
→మన దేశంలో 7.3 శాతం మంది ప్రజలు డిజిటల్‌ కరెన్సీ కలిగి ఉన్నారు.
→అంతర్జాతీయంగా 20 ఆర్థిక వ్యవస్థల్లో డిజటల్‌ కరెన్సీ వాటా కలిగి ఉన్న జనాభాలో భారత దేశానికి ఏడో స్థానం లభించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

చైనాలో మరో కొత్త వైరస్‌ ‘హెనిపా’

→చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్‌ మనుషులకు సోకడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది.
→జంతువుల నుంచి వ్యాపించే హెనిపా వైరస్‌.. ఇటీవల షాంగ్‌డాంగ్, హెనాన్‌ ప్రావిన్సుల్లో కొందరికి సోకినట్లు తేలింది.
→జ్వరంతో బాధపడుతున్న రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. దీనికి నోవెల్‌ లాంగ్యా హెనిపా వైరస్‌గా పేరుపెట్టారు.
ఈ వైరస్‌ సోకిన 35 మందిలో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఎలుకలు, ఇతర జంతువుల నుంచి ఇది మనుషులకు సోకుతుందని నిపుణులు భావిస్తున్నారు.
→ గొర్రెలు, కుక్కలు వంటి జంతువుల్లోనూ హెనిపా వైరస్‌ను గుర్తించారు. దీన్ని లాంగ్యా హెనిపా వైరస్‌ అని కూడా పిలుస్తారు. ఇది బయోసేఫ్టీ లెవల్‌-4 వైరస్‌గా చెబుతున్నారు.
→ మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తుందని పేర్కొంటున్నారు. హెనిపా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు.
→ కేవలం లక్షణాలను బట్టి బాధితులకు ఉపశమనం కల్పించే చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

మరమ్మతుల కోసం చెన్నై చేరిన అమెరికా యుద్ధనౌక

→మరమ్మతుల కోసం అమెరికాకు చెందిన యుద్ధనౌక ‘చార్లెస్‌ డ్రూ’ చెన్నై కాటుపల్లిలోని ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన షిప్‌యార్డ్‌కు చేరింది.
→మరమ్మతులు, ఇతర సేవల కోసం అమెరికా నౌక మన దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి.

300 ఏళ్లలోనే అత్యంత కనిష్ఠానికి బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ

బ్రిటన్‌ దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2020 సంవత్సరంలో 11 శాతం క్షీణించినట్లు ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌(ఓఎన్‌ఎస్‌) పేర్కొంది. ఇతర ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థతో పోల్చినా ఇదే ఎక్కువ కుంగుబాటు అని సవరించిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 1709 తర్వాత ఇదే అత్యధిక క్షీణత అని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వద్ద ఉన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

- ఎక్కువ సమాచారం అందుబాటులోకి వచ్చిన ప్రతిసారీ బ్రిటిష్‌ గణాంక అధికారులు జీడీపీ అంచనాలను సవరిస్తుంటారు. ప్రాథమికంగా ఓఎన్‌ఎస్‌ అందించిన అంచనాలు సైతం 2020లో బ్రిటన్‌ అప్పటి ‘గ్రేట్‌ ఫ్రాస్ట్‌ ఆఫ్‌ 1709’ కంటే ఎక్కువగానే క్షీణించింది. తదుపరి ఆ గణాంకాలను సవరిస్తూ 9.3 శాతానికి పరిమితం చేసింది. ఇది ఒకటో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యధిక క్షీణత అని అప్పట్లో తెలిపింది. తాజా గణాంకాలతో మళ్లీ 300 ఏళ్లకు పైగా కనిష్ఠస్థాయికి చేరినట్లయింది.

భారత్‌లో పర్యటించిన చైనా ప్రత్యేక దూత షియోంగ్‌

అఫ్గానిస్థాన్‌లో చైనా ప్రత్యేక దూత యూ షియోంగ్‌ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అఫ్గానిస్థాన్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు వీలున్న అవకాశాలపై భారత సీనియర్‌ అధికారులతో చర్చించారు. విదేశీ వ్యవహారాల శాఖలో అఫ్గానిస్థాన్‌కు సంబంధించి పాయింట్‌ పర్సన్‌గా ఉన్న జేపీ సింగ్‌తో షియోంగ్‌ చర్చలు జరిపారు. ఇది షియోంగ్‌ భారత తొలి పర్యటన.

తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు

మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్‌ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్‌కూ భారత్‌ గైర్హాజరైంది. ఉక్రెయిన్‌ 31వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు అక్కడ యుద్ధం గురించి సమీక్షించడానికి భద్రతా మండలి సమావేశమైనప్పుడు రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిని ఉద్దేశించి వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మండలి కోరగా రష్యా అభ్యంతరం తెలిపింది. దీంతో ప్రొసీజరల్‌ ఓటింగ్‌లో భారత్‌ సహా 13 సభ్యదేశాలు జెలెన్‌స్కీ వర్చువల్‌ ప్రసంగానికి అనుకూలంగా, రష్యా ఒక్కటే వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ ఓటింగ్‌లో చైనా పాల్గొనలేదు.

భారత్‌ మా కీలక భాగస్వామి: అమెరికా

భారత్‌ను కీలక భాగస్వామిగా తాము చూస్తున్నామని అమెరికా ప్రకటించింది. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ను ముందుకు తీసుకెళ్లడం ఈ వ్యూహాత్మక బంధం నిర్మితమైంది. ఇది రానున్న సంవత్సరాల్లోనూ కొనసాగుతుంది. అంతర్జాతీయ చట్టాల అమలుకు, శాంతి, సుసంపన్నతకు, ప్రజల భద్రతకు మేం కలిసి పనిచేస్తాం, సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటామని శ్వేతసౌధ పత్రికా కార్యదర్శి కరీన్‌ జిన్‌పియర్‌ తెలిపారు.

అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అత్యాధునిక డ్రోన్లు

రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌కు భారీగా సైనిక సాయం అందిస్తూ వచ్చిన అమెరికా.. తాజాగా మరో విడత ప్యాకేజీని ప్రకటించింది. ఈ సైనిక సాయం విలువ 77.5 కోట్ల డాలర్లు. ఇందులో భాగంగా అత్యాధునిక స్కాన్‌ ఈగిల్స్‌ నిఘా డ్రోన్లు, మైన్‌ రెసిస్టెంట్‌ వెహికల్స్, యాంటీ ఆర్మోర్‌ రౌండ్స్, హోవిట్జర్‌ ఆయుధాలను సరఫరా చేయనుంది.

అనావృష్టి కారణంగా చైనాలో తగ్గిన వృద్ధిరేటు

చైనాలో వర్షపాతం గడచిన 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత అతి తక్కువ స్థాయికి పడిపోయింది. ఆసియాలోని అతిపెద్ద నదుల్లో ఒకటైన యాంగ్జే సగానికి సగం అయ్యింది. అనావృష్టితో నదులు ఎండిపోవడం జలవిద్యుదుత్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. కర్మాగారాలకు కరెంటు సరఫరా నిలిచిపోయి, పారిశ్రామికోత్పత్తి దెబ్బతింటోంది. తాగునీటికి, సాగునీటికి కటకట ఏర్పడింది. 2022లో 5.5% వృద్ధిరేటును సాధించాలనుకున్నడ్రాగన్‌ ఈ ఏడాది ప్రథమార్ధంలో అందులో సగం రేటుతోనే సరిపెట్టుకుంది. వర్షాభావం వల్ల ఇక్కడున్న 51 చిన్న నదులు, 24 రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఫలితంగా కరెంటు కొరత ఏర్పడి సిచువాన్, చోంగ్‌ కింగ్‌లలో సౌరఫలకాలు, ప్రాసెసర్‌ చిప్‌లు, ఆటో విడిభాగాలు తయారుచేసే వేల కర్మాగారాలను ఆరు రోజులపాటు మూసివేశారు. షాపింగ్‌ మాల్స్, కార్యాలయాలు, ఇళ్లకు కరెంటు కోతలు విధించారు. షాంఘై నగరంలో టెస్లాతోపాటు ఓ పెద్ద చైనా కార్ల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేశాయి.

-1961 తరవాత ఇంతటి ప్రచండమైన ఎండలు నమోదవుతుండటం ఇదే తొలిసారి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇప్పటికే 138 నగరాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, మరో 373 నగరాల్లో ఆరంజ్‌ అలర్ట్‌ విధించారు. 262 వాతావరణ కేంద్రాల్లో 40 డిగ్రీలకుపైగా, 8 చోట్ల 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

‘మదర్‌ హీరోయిన్‌’లకు పుతిన్‌ నజరానా

జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోవియట్‌ కాలం నాటి పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు. ఇలాంటి వారిని ‘మదర్‌ హీరోయిన్‌’గా గుర్తించి, 10 లక్షల రూబుళ్లను (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకుపైన) పురస్కారంగా ఇస్తారని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెల్లడించింది. ఈ మొత్తాన్ని 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజునాడు చెల్లిస్తారు.
- 1944లో అప్పటి సోవియట్‌ అధినేత జోసెఫ్‌ స్టాలిన్‌ ఈ అవార్డును ప్రవేశపెట్టారు. దాదాపు 4 లక్షల మందికి దీన్ని అందజేశారు. 1991లో సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలాక పథకం రద్దయింది. అప్పట్లో రష్యా జనాభా 14.82 కోట్లు. 2021 నాటికి అది 14.61 కోట్లకు తగ్గిపోయింది. సంతాన సాఫల్యత తగ్గడం, మరణాలు పెరగడం, వలసలు పెరిగిపోవడంలాంటివి దీనికి దారితీశాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టిన నాటినుంచి ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది రష్యా సైనికులు మృతిచెంది ఉంటారని అంచనా.

హంబన్‌టోటకు చేరిన చైనా నిఘా నౌక

భారత్, శ్రీలంక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్న పరిణామమొకటి చోటుచేసుకుంది. మన దేశంతో పాటు అమెరికా వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనాకు చెందిన అత్యాధునిక నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌ 5’ లంకలోని హంబన్‌టోట ఓడరేవుకు చేరుకుంది. ఆగస్టు 22 వరకు అది అక్కడే ఉంటుంది. ‘యువాన్‌ వాంగ్‌ 5’పై రెండు వేల మందికి పైగా సిబ్బంది ఉంటారు. 750 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై సైతం గగనతల నిఘా ఉంచగల సామర్థ్యం దాని సొంతం. ప్రధానంగా ఉపగ్రహాలు, బాలిస్టిక్‌ క్షిపణుల కదలికలను అది పసిగట్టగలదు. ఇంధనాన్ని నింపుకోవడం సహా మరికొన్ని సాధారణ కార్యకలాపాల కోసమే ఆ ఓడరేవుకు తరలిస్తున్నట్లు చైనా పేర్కొంది.

ఈజిప్టు చర్చిలో భారీ అగ్నిప్రమాదం

ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో ఉదయం ప్రార్థనలు జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయపడ్డారు. ఇంబాబా ప్రాంతంలోని అబు సెఫిన్‌ చర్చిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

అవయవ దానం ప్రోత్సాహానికి 43 దేశాల సంయుక్త కృషి

కామన్వెల్త్‌ క్రీడా వారసత్వం కింద 43 దేశాలు, 19 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి కలసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించాయి. బ్రిటిష్‌ జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్‌.హెచ్‌.ఎస్‌) రూపొందించిన కామన్వెల్త్‌ ట్రిబ్యూట్‌ టు లైఫ్‌ ప్రాజెక్టు కింద అవయవదానం, అవయవ మార్పిడిలో అనుభవాన్నీ, ప్రావీణ్యాన్ని పరస్పరం పంచుకుని ప్రపంచవ్యాప్తంగా పలువురి ప్రాణాలు కాపాడాలని తీర్మానించాయి. 2018లో ప్రపంచవ్యాప్తంగా 1,46,000 అవయవాల మార్పిడి జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 40,000 మంది సజీవ దాతలు, 39,000 మంది మృత దాతలు వీటిని దానం చేశారు. ఆస్ట్రేలియా, కెనడా, మాల్టా, బ్రిటన్‌లలో ప్రతి 10 లక్షల జనాభాలో 20 మంది అవయవదానం చేస్తుంది.