ఆంధ్ర ప్రాంత, ఆంధ్ర జాతి తొలి ప్రస్తావనలు

జాతీయ క్రీడా దినోత్స‌వం 2022

భారత దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ 'ధ్యాన్ చంద్' జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌ చంద్‌‌దే. ఆయ‌న నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలు గెలిచింది. దేశానికి చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు భారత్‌ పేరు ప్రపంచ పటంలో మార్మోగి పోవడంలో ఆయ‌న కీల‌క పాత్ర‌ పోషించారు.

‣ దేశ‌వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌, క్రికెటేతర క్రీడా సంఘాలు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి వేడుక‌ల‌ను ఘనం‍గా నిర్వహించాయి. ధ్యాన్‌చంద్ 117వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాకీ పితామహుడికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. 2012 నుంచి ఆయ‌న జ‌న్మ‌దినాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది.


తెలుగు భాషా దినోత్స‌వం 2022

అమ్మతో కష్టసుఖాలు పంచుకునే భాష ప్రస్తుత కాలంలో బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సంద‌ర్భంగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది.

‣ గ్రాంధీక భాషలోని తెలుగు వచనాన్ని వాడుకలోకి తీసుకొచ్చి భాష గురించి తెలియజేసిన మహానీయుడు గిడుగు రామ్మూర్తి. ఈయన శ్రీకాకుళానికి 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం సమీపంలో ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు.

‣ ఆ రోజుల్లోనే ఆయ‌న అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని నేర్చుకున్నారు. సవర భాషలో పుస్తకాలు రాసి సొంత డబ్బుతో పాఠశాలలు ఏర్పాటు చేశారు. మద్రాసు ప్రభుత్వం వారు ఈయ‌న‌ కృషికి మెచ్చి 1913 లో ‘రావు బహదూర్‌’ బిరుదు ఇచ్చారు. భాషా శాస్త్రంలో వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. 35 ఏళ్ల కృషితో 1931లో ఇంగ్లీషులో సవర భాషా వ్యాకరణాన్ని, 1936లో సవర - ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు.


ఏనుగుల సంరక్షణలో భారత్‌ అగ్రగామి

‘ప్రపంచ ఏనుగుల దినోత్సవం’ సందర్భంగా కేరళలోని ఇడుక్కిలో పెరియార్‌ జాతీయ పార్కు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనరుల కోసం పోటీ వల్లే మనుషులు-ఏనుగుల మధ్య సంఘర్షణలు చోటుచేసుకుంటున్నట్లు చెప్పారు. ఫలితంగా దేశంలో ఏటా 500 మంది ప్రజలు (ఏనుగుల దాడుల్లో), 100 గజరాజులు (ప్రజల చేతుల్లో) చనిపోతున్నట్లు తెలిపారు. ఏనుగుల సంరక్షణలో భారత్‌ అగ్రగామిగా ఉందన్నారు. 2017 లెక్కల ప్రకారం దేశంలో 29,964 ఏనుగులున్నట్లు చెప్పారు.

‣ ‘వరల్డ్‌ ఎలిఫెంట్‌ డే’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేస్తూ 60 శాతానికి పైగా ఆసియన్‌ ఏనుగులు భారత్‌లోనే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో గజరాజుల అభయారణ్యాల సంఖ్య గత ఎనిమిదేళ్లలో పెరిగినట్లు పేర్కొన్నారు.