అవార్డులు

శశి థరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ను ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘షువలియె డి లా లిజియన్‌ హానర్‌’ వరించింది. థరూర్‌ రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ప్రకటించినట్లు భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనియన్‌ తెలిపారు.

రేఖారెడ్డికి జపాన్‌ ప్రభుత్వ పురస్కారం

హైదరాబాద్‌కు చెందిన జపాన్‌ పూలఅలంకరణ (ఒహరా ఇకెబానా) కళానిపుణురాలు గవ్వా రేఖారెడ్డి జపాన్‌ విదేశాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యారు. తమ కళ ద్వారా భారత్‌-జపాన్‌ల మధ్య సాంస్కృతిక మార్పిడి, సుహృద్భావ, స్నేహ సంబంధాలకు దోహదపడినందుకు ఆమెను ఈ పురస్కానికి ఎంపిక చేసినట్లు చెన్నైలోని కాన్సులేట్‌ కార్యాలయం వెల్లడించింది. జపాన్‌ ప్రభుత్వం తమ దేశానికి అనుబంధ కళలు, సేవలు అందించే వారిని గుర్తించి ప్రతీయేటా పురస్కారాలు అందిస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫుడ్, న్యూట్రిషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన రేఖారెడ్డి తన తల్లి శ్యామల, నిపుణుడైన మీనా అనంతనారాయణ్‌ వద్ద జపాన్‌ పూల అలంకరణ కళను నేర్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఆమె దాదాపు పదివేల మందికి శిక్షణ ఇచ్చారు. ఒహరా ఇకెబానా హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఫిÆక్కీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ రవీంద్రరావుకు వాయుసేన శౌర్య పతకం

భారత వాయుసేనకు చెందిన ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ డి.రవీంద్రరావుకు ప్రభుత్వం ‘వాయుసేవ శౌర్య పతకం’ ప్రకటించింది. ప్రమాదంలో చిక్కుకున్న తోటి పైలట్‌ ప్రాణాలను అత్యంత ధైర్యసాహసాలతో రక్షించినందుకు దీనికి ఎంపికయ్యారు. ‘‘2021 నవంబరు 6న లెఫ్టినెంట్‌ రవీంద్రరావు జాగ్వార్‌ యుద్ధవిమానంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

1,082 మందికి శౌర్య పురస్కారాలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్రాల పోలీసు విభాగాలకు చెందిన 1,082 మందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింది. విధి నిర్వహణలో అసమాన ప్రతిభ కనబరిచినవారికి, సాహసోపేతంగా వ్యవహరించినవారికి ఇచ్చే సేవా పతకాలూ ఇందులో ఉన్నాయి. 347 మందికి పోలీసు శౌర్య పతకాలు, 87 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 648 మందికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శౌర్య పతకాలు అందుకునే 347 మందిలో 204 మంది జమ్మూ-కశ్మీర్‌లో సేవలు అందించినవారే. మొత్తంమీద అత్యధికంగా 109 పతకాలు ‘కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం’ (సీఆర్పీఎఫ్‌) సిబ్బంది పొందారు. ఐటీబీపీకి చెందిన 20 మందికి వివిధ పతకాలు లభించాయి.

మహేశ్‌ భగవత్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ఏటా ఇచ్చే పురస్కారాలను ప్రకటించారు. తెలంగాణకు 2 రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం), 17 పోలీసు పతకాలు (పీఎం) లభించాయి. పోలీసుశాఖలో విశేష సేవలందించినందుకు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ మురళీధర్‌ భగవత్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ సెల్‌) ఎస్పీ దేవేందర్‌సింగ్‌ రాష్ట్రపతి పతకాలకు ఎంపికయ్యారు. 1995 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహేశ్‌ భగవత్‌కు ఇది మూడో అత్యుత్తమ పురస్కారం. 2004లో ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్యపతకం, 2011లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. గతంలో ఆయన పలు అంతర్జాతీయ పతకాలను సాధించారు. 2004లో ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ‘పోలీస్‌ మీకోసం’ ప్రాజెక్టు చేపట్టినందుకు ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ పోలీసింగ్‌ అవార్డు సొంతమైంది. ‣ ఉమ్మడి నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు 2006లో ‘ప్రాజెక్టు ఆసరా’ నిర్వహించినందుకు ‘వెబర్‌ సావీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ సివిల్‌ రైట్స్‌ అవార్డు’ మహేశ్‌ భగవత్‌కు దక్కింది. 2017లో ‘ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్స్‌ రిపోర్ట్‌ హీరో’ అవార్డు.. అదే ఏడాది ‘టాప్‌ 100 హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అండ్‌ స్లేవరీ ఇన్‌ఫ్లుయన్స్‌ లీడర్స్‌’ అవార్డు.. 2018లో ‘ఐఏసీపీ లీడర్‌షిప్‌ ఇన్‌ హ్యూమన్‌ అండ్‌ సివిల్‌రైట్స్‌ ఇండివిడ్యువల్‌’ అవార్డులు ఆయనకు లభించాయి. 1500 మంది వరకు సివిల్స్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో మెలకువలను నేర్పించారు.

పిచ్చేశ్వర్‌ గద్దెకు యూఎన్‌ పురస్కారం

దిల్లీలోని లింగయస్‌ విద్యా సంస్థల అధిపతి, ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ పిచ్చేశ్వర్‌ గద్దె ఐక్యరాజ్యసమితి ‘రియల్‌ సూపర్‌ హీరో’ పురస్కారాన్ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) మానవతా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొవిడ్‌ నేపథ్యంలో తోటివారికి సహాయపడిన వ్యక్తులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. భారతదేశం నుంచి మొత్తం 50 మందిని ఎంపిక చేయగా అందులో తెలుగువారైన పిచ్చేశ్వర్‌ గద్దె ఒకరు. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగో రాయబార కార్యాలయంలోని మినిస్టర్‌ కౌన్సెలర్‌ సిరియాక్‌ గన్‌వెల్ల ఆయనకు ఈ పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

ఈ-ఓటింగు ప్రాజెక్టుకు అవార్డు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌ చెయిన్‌ విధానం కింద చేపట్టిన కృత్రిమ మేధ ఆధారిత ఈ-ఓటింగు ప్రాజెక్టుకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అత్యుత్తమ ప్రాజెక్టు పురస్కారం లభించింది. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో సాంకేతిక విభాగం జేడీ రమాదేవి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇది దేశంలోనే తొలి సారిగా స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత ఓటింగ్‌కు సంబంధించి విజయవంతమైన ప్రదర్శన అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

‘సులభతర వాణిజ్యం’లో తెలంగాణకు అవార్డు

సులభతర వాణిజ్య నిర్వహణ (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. దిల్లీలో నిర్వహించిన ‘డిజిటెక్‌ కాంక్లేవ్‌ 2022’లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఈ అవార్డును అందుకున్నారు. సులభతర వాణిజ్యానికి అమలు చేస్తున్న సంస్కరణలతో పాటు ‘మీ సేవ’ పోర్టల్‌తో ప్రజలకు మెరుగైన డిజిటల్‌ సేవలను అందిస్తున్నందుకు రాష్ట్రానికి పురస్కారం అందజేశారు.

పోగొట్టుకున్న ఫోన్‌ను వెతికిపెట్టే ‘చాట్‌ బాట్‌’

సెల్‌ఫోన్‌ పోతే తిరిగి దక్కించుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను వెతికిపెట్టేందుకు అనంతపురం జిల్లా పోలీసులు ‘చాట్‌ బాట్‌’ పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నవారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లక్కర్లేకుండా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన పని లేకుండా కేవలం వాట్సప్‌ మెసేజ్‌ చేస్తే చాలు, పోగొట్టుకున్న ఫోన్‌ను రికవరీ చేసి, బాధితులకు అందజేస్తున్నారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ‘చాట్ బాట్‌’ సాంకేతికను జూన్‌ 27న అందుబాటులోకి తీసుకొచ్చారు. ‣ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌’ ఈ సేవలను గుర్తించి ‘టెక్నాలజీ సభ 2022’ అవార్డుకు ఎంపిక చేసింది.

హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌లో ఏపీకి అవార్డు

వ్యాపారాన్ని సులభతరం చేయడంలో (ఈవోడీబీ) సంస్కరణల అమలు, హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌లో నాయకత్వ స్థానంలో ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్‌కు బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు దిల్లీలో నిర్వహించిన ‘డిజిటెక్‌ కాంక్లేవ్‌ 2022’లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అవార్డు స్వీకరించారు.

ప్రొఫెసర్‌ ముద్దుకృష్ణారెడ్డికి ‘సంస్కృతి పురస్కారం’

మండలి వెంకట కృష్ణారావు ‘సంస్కృతి పురస్కారాన్ని’ ఈ ఏడాది ప్రొఫెసర్‌ చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డి(చెన్నై)కి ప్రదానం చేయనున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ భట్టు రమేష్‌ తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల వ్యాప్తికి ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు, సంస్థలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. పురస్కారంతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ సౌజన్యంతో రూ.25 వేల నగదు అందజేస్తారు.

పూర్ణచందుకు జానమద్ది సాహితీపీఠం పురస్కారం

జానమద్ది సాహితీ పీఠం దశమ సాహిత్య సేవ పురస్కారానికి విజయవాడకు చెందిన సాహితీవేత్త, ఆయుర్వేద వైద్యులు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్‌ జి.వి.పూర్ణచందును ఎంపిక చేశారు. ప్రఖ్యాత సాహితీవేత్త, బ్రౌన్‌ స్మారక గ్రంథాలయ రూపశిల్పి జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్‌శాస్త్రి) స్మారకంగా ఈ పీఠాన్ని నెలకొల్పారు. ‣ జానమద్ది జయంతి సందర్భంగా అక్టోబరు 16న వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలోని బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో జరగనున్న సభలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు మేనేజింగ్‌ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్‌ తెలిపారు. సాహిత్యం, గ్రంథాలయ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు జానమద్ది సాహితీ పీఠం పురస్కారాలను అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు.

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ఏఎన్‌యూ గౌరవ డాక్టరేట్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్లు వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ తెలిపారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన ఆయనను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కులపతి హోదాలో గవర్నర్‌ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఆగస్టు 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామన్నారు.

కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ సెల్‌) ఎస్పీ దేవేందర్‌సింగ్‌

1992లో ఎస్సైగా పోలీస్‌శాఖలో చేరిన దేవేందర్‌సింగ్‌ ప్రస్తుతం కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం(సీఐసెల్‌)లో నాన్‌కేడర్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. 1997 దాకా హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేసిన అనంతరం 2003దాకా బేగంపేట విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారిగా పనిచేశారు. యూఎన్‌ పీస్‌ మిషన్‌లో భాగంగా తైమూర్‌ లెస్టే, సౌత్‌ సుడాన్‌లలో రెండేళ్లపాటు పనిచేశారు. ఐ సెల్‌లో పనిచేస్తూ సిమి, జేఈఎం, లష్కరేతోయిబా, పీఎఫ్‌ఐ, ఐసిస్‌ మాడ్యూళ్ల కుట్రల్ని భగ్నం చేశారు. సైబర్‌నేరాల కట్టడి కోసం టీ4సీ ఏర్పాటు, సీడాట్, సైక్యాప్స్, డోపమ్స్, దర్పణ్, సత్యపాన్‌ అండ్‌ ఐవెరిఫై, నిఘాయాప్స్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. మరో 17 మందికి పోలీసు పతకాలు యోగ్యమైన సేవలందించినందుకు ఐజీ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌(హైదరాబాద్‌ నేరవిభాగం), అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ (సీఐడీ), అదనపు ఎస్పీ పైళ్ల శ్రీనివాస్‌ (ఎస్‌ఐబీ), ఏసీపీ సాయిని శ్రీనివాసరావు (హైదరాబాద్‌ సెంట్రల్‌జోన్‌), డీఎస్పీలు వెంకటరమణమూర్తి (ఏసీబీ), చెరుకు వాసుదేవరెడ్డి (ఐఎస్‌డబ్ల్యూ), గంగిశెట్టి గురు రాఘవేంద్ర (టీఎస్‌పీఏ), ఎస్సై చిప్ప రాజమౌళి (రామగుండం ఎస్బీ), ఏఎస్‌ఐ కాట్రగడ్డ శ్రీనివాస్‌(రాచకొండ ఎస్బీ), ఏఆర్‌ఎస్సైలు జంగన్నగారి నీలంరెడ్డి (కామారెడ్డి డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌), సలేంద్ర సుధాకర్‌ (టీఎస్‌ఎస్‌పీ 4వ బెటాలియన్‌), హెడ్‌కానిస్టేబుల్‌ ఉండింటి శ్రీనివాస్‌ (కరీంనగర్‌ ఇంటెలిజెన్స్‌) పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. ఇదే విభాగంలో అగ్నిమాపకశాఖ నుంచి లీడింగ్‌ ఫైర్‌మన్లు వెంకటేశ్వరరావు ఎర్రగుంట వెంకటేశ్వరరావు, ఫరీద్‌ షేక్‌ ఫైర్‌ సర్వీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ కింద ఎంపికయ్యారు. హోంగార్డులు చల్ల అశోక్‌రెడ్డి, చందా సురేశ్, అబ్దుల్‌షుకూర్‌బేగ్‌కు పురస్కారాలు దక్కాయి.

ముగ్గురు ద.మ.రైల్వే ఉద్యోగులకు పోలీస్‌ మెడల్‌

జోన్‌ పరిధిలోని రైల్వే రక్షణ దళాని(ఆర్పీఎఫ్‌)కి చెందిన ముగ్గురు ఉద్యోగులు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహబూబ్‌నగర్‌ ఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదా తహసీన్, మౌలాలి శిక్షణ కేంద్రం అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాటకం సుబ్బారావు, మౌలాలి శిక్షణ కేంద్రం హెడ్‌కానిస్టేబుల్‌ బండి విజయసారథి వీరిలో ఉన్నారు.

రిటైల్‌ జువెలర్‌ ఇండియా అవార్డ్స్‌ 2022

పసిడి ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌కు ప్రతిష్ఠాత్మక 17వ రిటైల్‌ జువెలర్‌ ఇండియా అవార్డ్స్‌ 2022లో పలు పురస్కారాలు లభించాయి. బెస్ట్‌ బ్రైడల్‌ డైమండ్‌ జువెలరీ ఆఫ్‌ ది ఇయర్, బెస్ట్‌ టీవీ క్యాంపైన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డులను జోయాలుక్కాస్‌ దక్కించుకుంది. 20 విభాగాల్లో 1000కు పైగా డిజైన్లకు గాను ఈ అవార్డులు పొందింది. 400కు పైగా ప్రత్యేకమైన డిజైన్‌లను పరిశీలించిన జ్యూరీ ఈ అవార్డులు ప్రకటించింది.

కేశవులుకు స్వామినాథన్‌ ఫౌండేషన్‌ పురస్కారం

తెలంగాణ‌ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులుకు అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవసాయం, ఆహారభద్రత రంగంలో పనిచేసేవారికి ఇచ్చే ‘ఎం.ఎస్‌.స్వామినాథన్‌ అవార్డు-2022’కు కేశవులును ఎంపిక చేసింది. చెన్నైలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఈ పురస్కారాన్ని కేశవులుకు అందజేశారు. ‣ ఇప్పటివరకూ ఈ అవార్డును అందుకున్న 8 మందిలో కేశవులు, ఆర్‌.ఎస్‌.పరోడా మాత్రమే భారతీయులు. విత్తన శాస్త్రవేత్తగా విత్తనరంగ అభివృద్ధికి కేశవులు చేసిన అపార కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపికచేసినట్లు స్వామినాథన్‌ ఫౌండేషన్‌ తెలిపింది. అంతర్జాతీయ విత్తన పరీక్షల ఏజెన్సీ(ఇస్టా)కి తొలిసారి అధ్యక్షుడిగా ఇటీవల కేశవులు ఎంపికయ్యారు. ఈ పదవికి ఎంపికైనా తొలి ఆసియా దేశాల ప్రతినిధి కూడా ఆయనే.