ఆర్ధిక రంగం

అంతర్జాతీయ సాస్‌ రాజధానిగా భారత్‌

భారత ఐటీ రంగం వృద్ధి జోరును కొనసాగించడంలో సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) తదుపరి కీలకపాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు ఈవై-సీఐఐ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో వివిధ రంగాలకు చెందిన 100కు పైగా యూనికార్న్‌లు ఉన్నాయని, ఔత్సాహిక వేత్తలు వేగంగా పుట్టుకొస్తున్నారని, భారత్‌ సాస్‌ అంకుర సంస్థలకు కేంద్రంగా ఎదుగుతున్నట్లు తెలిపాయి. ‘ఇండియా: ది నెక్ట్స్‌ గ్లోబల్‌ సాస్‌ క్యాపిటల్‌’ పేరిట ఈవై, సీఐఐలు నివేదికను వెలువరించాయి.

జాతీయాదాయంలో ప్రభుత్వ రంగ వాటా 20 శాతమే

జాతీయాదాయంలో ప్రభుత్వ రంగ వాటా 20 శాతం మాత్రమేనని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. అయితే మొత్తం వేతనాల్లో ఈ విభాగ వాటా సుమారు 40 శాతమని తెలిపింది. 2020 - 21 ఆర్థిక సంవత్సరంతో ముగిసిన పదేళ్ల కాలానికి ప్రభుత్వ రంగం స్థూల విలువ జోడింపు (జీవీఏ) 19.2 శాతం కాగా, వేతనాల వాటా 39.2 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన జీవీఏ గణాంకాలను విశ్లేషించి ఇండియా రేటింగ్స్‌ ఈ నివేదిక రూపొందించింది.
‣ జీవీఏ, వేతనాల్లో ప్రైవేటు రంగ వాటా మాత్రం సమతౌల్యంగా ఉన్నట్లు తెలిపింది. వేతనాల వాటా 35.2 శాతంగా ఉందని, జీవీఏలో 36.3 శాతం వాటా కలిగి ఉందని వివరించింది. 2011 - 12 నుంచి 2020 - 21 మధ్య కాలంలో నామమాత్రపు వేతనాలు 10.4 శాతం సంచిత వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్‌) పెరిగాయని, ఇదే సమయంలో మూలధనంపై ప్రతిఫలం (ఆర్‌ఓసీ) 8.8 శాతంగా ఉందని తెలిపింది. ప్రైవేటు రంగంలో వేతనాలు వేగంగా 13.2 శాతం సీఏజీఆర్‌తో పెరిగాయని పేర్కొంది.

ఆసియా పసిఫిక్‌ టెక్‌ హబ్‌లలో హైదరాబాద్‌కు స్థానం

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని టెక్నాలజీ హబ్‌లలో బెంగళూరు రెండో స్థానాన్ని సాధించింది. బీజింగ్‌ తర్వాత మన దేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, దిల్లీ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. స్థిరాస్తి సేవల సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ విడుదల చేసిన ‘టెక్‌ సిటీస్‌: గ్లోబల్‌ ఇంటర్‌సెక్షన్‌ ఆఫ్‌ టాలెంట్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌’ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దాదాపు 14 అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ జాబితాను రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. నైపుణ్యాలు, స్థిరాస్తి, వ్యాపార నిర్వహణ పరిస్థితుల వంటి అంశాలను పరిశీలించారు. భారత వృద్ధిలో ఐటీ, టెక్నాలజీ ఆధారిత రంగాలు కీలకంగా మారాయని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా, ఆగ్నేయాసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్షూల్‌ జైన్‌ తెలిపారు.

తెలంగాణ జీస్‌డీపీలో 19.37% వృద్ధిరేటు

తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ప్రస్తుత ధరల ప్రకారం 19.37 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో 19.19 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,48,115 కోట్లు, తలసరి ఆదాయం రూ.2,75,443గా తేలింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం సవరించిన అంచనాలను ప్రస్తుత, స్థిర ధరల ఆధారంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) విడుదల చేసింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో కరోనా నేపథ్యంలో తక్కువ వృద్ధిరేటు నమోదు కాగా.. 2021-22లో వృద్ధిరేటు పెరిగింది.

ముఖ్యాంశాలు:-
‣ జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల్లో.. ఒడిశా 20.55% వృద్ధిరేటుతో మొదటి స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌ 19.74%, తెలంగాణ 19.37% వృద్ధిరేటుతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తర్వాత స్థానాల్లో త్రిపుర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు ఉన్నాయి.

‣ జీఎస్‌డీపీ స్థిర ధరల్లో.. 11.43 శాతం వృద్ధిరేటుతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్‌ 11.04 శాతంతో రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో బిహార్, తెలంగాణ, ఒడిశా, దిల్లీ, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి

‣ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో.. ఒడిశా 22.82% వృద్ధిరేటుతో ముందుంది. తెలంగాణ 19.19 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, త్రిపుర ఉన్నాయి. ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం సిక్కింలో రూ.4,72,543, కర్ణాటకలో రూ.2,78,786, తెలంగాణలో రూ.2,75,443 నమోదైంది. తర్వాత స్థానాల్లో హరియాణా, దిల్లీ, తమిళనాడు, ఏపీ ఉన్నాయి.

‣ తలసరి ఆదాయం స్థిర ధరల్లో.. రూ.2,63,477తో దిల్లీ మొదటి స్థానంలో, రూ.2,56,507తో సిక్కిం రెండో స్థానంలో, తర్వాత స్థానాల్లో హరియాణా (రూ.1,79,267), కర్ణాటక (రూ.1,68,050), తెలంగాణ (రూ.1,58,561), తమిళనాడు (రూ.1,54,427) ఉన్నాయి.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 470-480 బి.డాలర్లకు ఎగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశీయ ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 470- 480 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.37-38 లక్షల కోట్ల)కు చేరొచ్చని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రమణ్యం పేర్కొన్నారు. 2021-22లో దేశ ఎగుమతులు 420 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే దిగుమతుల జోరు వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వాణిజ్య లోటు 100 బిలియన్‌ డాలర్ల కంటే అధికంగా నమోదైనా, ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఇబ్బంది పెట్టే స్థాయిని దాటకపోవచ్చని తెలిపారు.

‣ ప్రస్తుత ఆర్థికానికి వాణిజ్య లోటు లక్ష్యాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. 2021-22 ఏప్రిల్‌-మార్చి మధ్య భారత్‌ మొత్తం ఎగుమతులు (ఉత్పత్తులు+సేవలు) 34.50 శాతం పెరిగి జీవనకాల గరిష్ఠమైన 669.55 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ విపణిలో చమురు సహా ఇతర కమొడిటీల ధరలు తగ్గడంతో రాబోయే నెలల్లో వాణిజ్య లోటు నెమ్మదించే అవకాశం ఉందని సుబ్రమణ్యం తెలిపారు. ఈ ఏడాది జులైలో వాణిజ్య లోటు 31.02 బిలియన్‌ డాలర్లకు చేరింది.


జూన్‌ త్రైమాసికంలో 13-15.7% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో, దేశ ఆర్థిక వ్యవస్థ 13-15.7 శాతం వృద్ధిని నమోదు చేసి ఉండొచ్చని పలువురు దిగ్గజ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ జీడీపీ వృద్ధి 15.7 శాతంగా అంచనా వేయడంతో పాటు, తుది గణాంకాలు ఇంకా ఎక్కువగానే నమోదు కావొచ్చని పేర్కొన్నారు. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ జూన్‌ త్రైమాసికంలో 13 శాతం వృద్ధిని అంచనా వేశారు. కొవిడ్‌ తొలిదశలో పూర్తి లాక్‌డౌన్‌ అమలైన 2020 జూన్‌ త్రైమాసికంలో 23.9 శాతం క్షీణించిన జీడీపీ, 2021 జూన్‌ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.


విదేశీ పెట్టుబడులకు సెబీ కొత్త మార్గదర్శకాలు

ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్‌లు), వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లు (వీసీఎఫ్‌లు) విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇకపై విదేశీ పెట్టుబడి సంస్థలకు భారత్‌తో సంబంధం ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

‣ కొత్త నిబంధనల ప్రకారం.. భారత్‌ వెలుపల నమోదుకాని కంపెనీల షేర్లలో కూడా ఏఐఎఫ్‌లు పెట్టుబడులు పెట్టొచ్చు. ఆఫ్‌షోర్‌ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల్లో పెట్టుబడులకు వీసీఎఫ్‌లను అనుమతిస్తారు. అయితే భారత్‌తో సంబంధం ఉన్న కంపెనీల్లోనే ఇటువంటి పెట్టుబడులకు అనుమతి ఉంటుందన్న నిబంధన పెట్టారు. ప్రధాన కార్యాలయం విదేశాల్లో ఉన్నా, భారత్‌లో కార్యకలాపాలు ఉంటే సరిపోతుంది.