రాష్ట్రీయం-ఆంధ్ర ప్రదేశ్

జాంధానీ చీరకు జాతీయ పురస్కారం

ఉప్పాడ జాంధానీ చేనేత చీరలను జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేసి విశేష ప్రతిభ కనబరిచిన కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పకు చెందిన వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్‌ సంస్థకు జాతీయ పురస్కారం లభించింది. సంస్థ అధినేత లొల్ల సత్యనారాయణ దిల్లీలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో పురస్కారం అందుకున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా పురస్కార ప్రదానం జరగలేదు.

ఉన్నత విద్యా రంగంపై గోవా ప్రతినిధుల అధ్యయనం

ఉన్నత విద్యా రంగంలో రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను గోవా ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం అధ్యయనం చేసింది. జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, పునర్నిర్మాణం, సాధారణ ప్రవేశ పరీక్షల నిర్వహణ, డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ తదితర అంశాలను పరిశీలించింది. ఎన్‌ఏఏసీ, ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్‌బీఏ ర్యాంకులు సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో కూడా బృందం తెలుసుకుంది. గోవా ప్రతినిధుల బృందంలో ఆచార్య నియాన్‌ మార్కోన్, ఎఫ్‌ఎం నదాఫ్, వందనా నాయక్, సందేశ్‌ గాంకర్, సిద్ధి బండాంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేర దర్యాప్తులో ప్రతిభకు కేంద్ర హోంశాఖ పతకాలు

నేరాల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 2022 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. సీతారామయ్య (డీఎస్పీ), కన్నుజు వాసు (ఇన్‌స్పెక్టర్‌), షేక్‌ ఖాదర్‌ బాషా (ఎస్సై), కొల్లి శ్రీనివాసరావు (ఏసీపీ), ముత్యాల సత్యనారాయణ (ఇన్‌స్పెక్టర్‌)లకు ఈ పతకాలు లభించాయి. ‘‘యూనియన్‌ హోమ్‌ మినిస్టర్స్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌’’ పేరిట ఈ పతకాల్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 151 మంది పోలీసు సిబ్బందికి ఈ పతకాలు లభించగా.. వారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పైన పేర్కొన్న అయిదుగురు అధికారులు ఉన్నారు.

ఏపీ పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీకి జిల్లా విశ్రాంత న్యాయమూర్తి ఛైర్మన్‌గా ఉంటారని తెలిపింది. రాష్ట్ర, జిల్లా అథారిటీలు రెండింటిలోనూ ముగ్గురు లేదా అయిదుగురు సభ్యులు ఉంటారని వివరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, జిల్లా స్థాయి ఫిర్యాదుల అథారిటీ నియమావళిని ఖరారు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర స్థాయి అథారిటీ సభ్యులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించే ప్యానల్‌ జాబితాలో నుంచి కొంతమందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుందని నియమావళిలో పేర్కొన్నారు.