సదస్సులు

భారత్‌ - నేపాల్‌ ప్రధానుల భేటీ

ఉభయ దేశాల నడుమ నెలకొన్న సరిహద్దు సమస్యను బాధ్యతగా పరిష్కరించుకుందామని నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా... ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. ఇందుకు ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. ఈ సమస్య రాజకీయం కాకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో కలిసి ఏప్రిల్‌ 1న దిల్లీ చేరిన దేవ్‌బా... మోదీతో ఏప్రిల్‌ 2న భేటీ అయ్యారు. నేతలిద్దరూ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. సరిహద్దు సమస్య వీరి మధ్య ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ‣ బిహార్‌లోని జయనగర్, నేపాల్‌లోని కుర్తాల మధ్య తిరిగే తొలి బ్రాడ్‌గేజ్‌ ప్యాసింజర్‌ రైలును ప్రధానులిద్దరూ ప్రారంభించారు. పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్, నేపాల్‌లో భారత రూపే చెల్లింపు కార్డులను కూడా వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం నేతల్దిదరూ మాట్లాడుతూ ఉభయ దేశాల మధ్య సంబంధాలను మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించామనీ; రైల్వే, ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు నాలుగు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.

తుర్క్‌మెనిస్థాన్‌తో భారత్‌ 4 ఒప్పందాలు

మధ్య ఆసియా దేశమైన తుర్క్‌మెనిస్థాన్‌తో ఆర్థిక, విపత్తు నిర్వహణ.. తదితర రంగాల్లో భారత్‌ నాలుగు ఒప్పందాలు కుదుర్చుకుంది. మూడు రోజుల పర్యటనకు తుర్క్‌మెనిస్థాన్‌ చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆ దేశ అధ్యక్షుడు సెర్దార్‌ బర్దీమహామదోవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. ఇరాన్‌లో భారత్‌ నిర్మించిన చాబహార్‌ నౌకాశ్రయాన్ని వాణిజ్య అవసరాలకు మధ్యాసియా దేశాలు వాడుకోవాలని రాష్ట్రపతి సూచించారు. తుర్క్‌మెనిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌-భారత్‌(తాపీ) సహజవాయువు పైప్‌లైన్‌ అంశాన్నీ కోవింద్‌ ప్రస్తావించారు.

ప్రపంచ బ్యాంకు - ఐఎంఎఫ్‌ వార్షిక సమావేశం

కొవిడ్‌ తెచ్చిపెట్టిన నష్టాలను అధిగమించడానికి భారత్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు విజయవంతమయ్యాయనీ, నేడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా తేరుకుని బలమైన అభివృద్ధి రేటును సాధిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) భారతీయ విభాగాధిపతి నాడా చౌయెరీ ప్రశంసించారు. ఉక్రెయిన్‌ యుద్ధం తెచ్చిపెట్టిన సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కోగల స్థితిలో ఉందనీ ప్రకటించారు. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంకు - ఐఎంఎఫ్‌ వార్షిక సమావేశం సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ‣ జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం కూడా ఇక్కడే జరిగింది. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనికి హాజరయ్యారు. కొవిడ్‌ వల్ల 2021లో భారత్‌ జీడీపీ 6.6% కోసుకుపోయినా, 2022లో 8.9% వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసినట్లు చౌయెరీ వివరించారు.

గ్లోబల్‌ ఆయుష్‌ ఇన్వెస్టెమెంట్, ఇన్నోవేషన్‌ సదస్సు

దేశంలో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఇక ప్రత్యేక ఆయుష్‌ ముద్ర వేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీంతో భారత్‌లో తయారైన ఈ ఔషధాల నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో గట్టి నమ్మకం ఏర్పడనుందని అన్నారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా చివరి రోజైన గాంధీనగర్‌లో గ్లోబల్‌ ఆయుష్‌ ఇన్వెస్టెమెంట్, ఇన్నోవేషన్‌ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుష్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో ప్రత్యేక ఆయుష్‌ వీసాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. 2022లో భారత్‌కు చెందిన 14 అంకుర సంస్థలు యూనికార్న్‌ స్థాయి సాధించాయని చెప్పిన మోదీ ఆయుర్వేదంలోనూ ఓ యూనికార్న్‌ రావాలని ఆకాంక్షించారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన దాహోద్‌ జిల్లాలో రూ.20వేల కోట్లతో విద్యుత్‌ రైలింజిన్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అక్కడ జరిగిన ఆదివాసీ సభలో ప్రధాని ప్రకటించారు. టెడ్రోస్‌ కాదు.. తులసీ భాయ్‌ ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేరును మార్చేశారు మోదీ. ఆయన్ను ఇక నుంచి ‘తులసీ భాయ్‌’ అని పిలవాలని అన్నారు. ‘‘ఈ రోజు ఉదయం టెడ్రోస్‌ నాతో మాట్లాడుతూ.. తాను పక్కా గుజరాతీగా మారిపోయానని చెప్పారు ఓ గుజరాతీ పేరు తనకు పెట్టాలని కోరారు. ఈ వేదికపైకి వచ్చే సమయంలోనూ గుర్తు చేశారు. అందుకే నా ప్రియ మిత్రుడైన టెడ్రోస్‌ను ఇక నుంచి తులసీ భాయ్‌గా పిలుస్తాను’’ అని ప్రధాని చెప్పారు. తులసి మొక్కకు భారతీయ జీవన విధానంలో ప్రాముఖ్యత ఉందని, అందుకే ఆ పేరును పెడుతున్నట్లు పేర్కొన్నారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) సదస్సు

మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల సహాయం వంటివి ఆపాలంటే అంతర్జాతీయ స్థాయిలో క్రిప్టో కరెన్సీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) నిర్వహించిన అత్యున్నత స్థాయి చర్చలో ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ఎక్కడో ఉండే వాలెట్ల ద్వారా క్రిప్టో ఆస్తుల కార్యకలాపాలు జరిగినంత కాలం, ఏ ఒక్క దేశమో వాటిని నియంత్రించ లేదని ‘మనీ అట్‌ క్రాస్‌ రోడ్‌: పబ్లిక్‌ ఆర్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ మనీ’ అంశంపై జరిగిన చర్చలో ఆమె అభిప్రాయపడ్డారు. సాంకేతికతను వినియోగించి అంతర్జాతీయంగా క్రిప్టోలపై నియంత్రణ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఐఎమ్‌ఎఫ్‌ అధిపతితో భేటీ ఐఎమ్‌ఎఫ్‌ అధిపతి క్రిస్టాలినా జార్జివాతో పలు అంశాలపై నిర్మలా సీతారామన్‌ చర్చలు జరిపారు. నిర్మాణాత్మక సంస్కరణలు, ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు ధోరణి తదితరాల వల్ల కరోనా అనంతరం రికవరీ సాధ్యమైందని సీతారామన్‌ తెలిపారు. భారత్‌ చేపట్టిన మిశ్రమ విధాన చర్యల వల్లే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, అంతర్జాతీయ సవాళ్ల నేపథ్యంలోనూ వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు జార్జివా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రులు - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 11వ సదస్సు

రాజ్య వ్యవస్థలో మూడు కీలక విభాగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ విధుల నిర్వహణలో ‘లక్ష్మణ రేఖ’లను దృష్టిలో ఉంచుకునే పనిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిలుపునిచ్చారు. కోర్టుల్లో ఉన్న కేసుల్లో 50% ప్రభుత్వాలకు సంబంధించినవేనని, అతిపెద్ద కక్షిదారులు ప్రభుత్వాలేనని అన్నారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రులు - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 11వ సదస్సును ఉద్దేశించి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడారు. చట్టసభలు బిల్లులపై పూర్తిస్థాయిలో చర్చించి, ప్రజాకాంక్షలకు అనుగుణంగా చట్టాలుచేస్తే వివాదాలకు తావుండదని, ప్రజలు కోర్టులకు రావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

నౌకాదళ కమాండర్ల సదస్సు

దిల్లీలో నిర్వహించిన నౌకాదళ కమాండర్ల సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగించారు. తొలి స్వదేశీ నిర్మిత యుద్ధవాహక నౌక ‘విక్రాంత్‌’ను ఈ ఏడాదికల్లా అధికారికంగా అందుబాటులోకి తెచ్చే దిశగా కృషి చేయాలని, ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో అదో మధుర ఘట్టంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 39 నౌకలు, జలాంతర్గాములు భారత్‌ షిప్‌యార్డుల్లో నిర్మితమవుతున్నాయని చెప్పారు.

వాణిజ్య, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సహకారం

వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పరస్పర వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఐరోపా యూనియన్‌ (ఈయూ) తాజాగా తీర్మానించుకున్నాయి. వాటిలో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకుగాను ‘ఈయూ - భారత్‌ వాణిజ్య, సాంకేతిక మండలి’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌ల మధ్య దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. ఈయూ ఏర్పాటు చేయనున్న రెండో వాణిజ్య, సాంకేతిక మండలి ఇది. గతంలో అమెరికాతో ఈ తరహా ఒప్పందాన్ని అది కుదుర్చుకుంది. భారత్‌కు మాత్రం ఇదే మొదటిది.

నీతి ఆయోగ్‌ జాతీయ సదస్సు

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ప్రకÛృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్‌ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. నిధులిచ్చేందుకు ముందుకొచ్చిన జర్మనీ ప్రకృతి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున చేపట్టేందుకు అవసరమైన నిధులిచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ప్రాజెక్టుకు అనుమతులు చివరిదశలో ఉన్నాయని జగన్‌ తెలిపారు. అయిదేళ్లలో 20 మిలియన్‌ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని వివరించారు.

ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశం

కరోనాతో పాటు ఇటీవలి భౌగోళిక - రాజకీయ పరిణామాల కారణంగా తీవ్ర రుణ సంక్షోభంలో కూరుకుపోయిన దేశాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మల్పాస్‌తో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశాల్లో సీతారామన్‌ పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా భారత్‌పై ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధ ప్రభావం; ప్రపంచ బ్యాంకు పాత్ర, భారత జి20 ప్రెసిడెన్సీ తదితర అంశాల పైనా మాట్లాడారు. భారత మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిస్తున్న నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ), గతి శక్తి పథకానికి ప్రపంచ బ్యాంకు తన మద్దతును కొనసాగిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‣ భారత్‌ - అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు వెళ్లాయని, బలంగా మారాయని సీతారామన్‌ అన్నారు. ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు, బైడెన్‌ ప్రభుత్వంలోని పలు అత్యున్నతాధికారులతో ఆమె చర్చించారు. ‣ బోయింగ్‌ డిఫెన్స్‌ సీఈఓ టెడ్‌ కాల్బర్ట్‌తో సీతారామన్‌ సమావేశమయ్యారు. భారత్‌లో నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాలు (ఎమ్‌ఆర్‌ఓ), ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజింగ్‌లో పెట్టుబడుల, వృద్ధి అవకాశాలపై చర్చించారు. మరో వైపు, గుజరాత్‌లోని ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ)లో విదేశీ యూనివర్సిటీలు/సంస్థలను ఏర్పాటు చేయాలని 14 ప్రతిష్ఠాత్మక అమెరికా యూనివర్సిటీల ప్రతినిధులతో జరిగిన సమావేశం సందర్భంగా ఆహ్వానం పలికారు.

నరేంద్ర మోదీ, బోరిస్‌ జాన్సన్‌ ద్వైపాక్షిక సమావేశం

ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచ భౌగోళిక రాజకీయాలు వేడెక్కిన వేళ ద్వైపాక్షిక రక్షణ సహకార బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని భారత్, బ్రిటన్‌ నిర్ణయించుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలనీ తీర్మానించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మధ్య దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ‣ శుద్ధ - పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకోవడంపైనా మోదీ, జాన్సన్‌ చర్చలు జరిపారు. హరిత హైడ్రోజన్‌ను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలు కల్పించే హైడ్రోజన్‌ సైన్స్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ హబ్‌ను వారు వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కాప్‌-26 సదస్సులో ప్రకటించిన గ్రీన్‌ గ్రిడ్‌ల సాకారానికి అవసరమైన ప్రణాళికలను ఆవిష్కరించారు.

సైనిక కమాండర్ల సదస్సు

భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు సహా దేశానికి ఎలాంటి భద్రత సవాళ్లు ఎదురైనా దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యంలోని అగ్రశ్రేణి కమాండర్లకు స్పష్టం చేశారు. దిల్లీలో జరుగుతున్న సైనిక కమాండర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో నెలకొన్న సైనిక ప్రతిష్టంభన అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దుల వద్ద సైన్యం దృఢంగా ఉందని పేర్కొన్న ఆయన, శాంతియుత పరిష్కారం కోసం చైనాతో చర్చలు కొనసాగుతాయని రాజ్‌నాథ్‌ చెప్పారు. సైనిక బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల తొలగింపుతోనే శాంతియుత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.

భద్రతా సవాళ్లపై సైనిక కమాండర్ల చర్చ

సైన్యంలోని అగ్రశ్రేణి కమాండర్ల సదస్సు దిల్లీలో ప్రారంభమైంది. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి భారత్‌కు పొంచి ఉన్న సవాళ్లు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఈ ప్రాంత భద్రతపై పడే ప్రభావాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రధానంగా చర్చించనున్నారు. ఏప్రిల్‌ 22 వరకూ ఈ సదస్సు జరుగుతుంది. జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్లపైనా చర్చ ఉంటుంది. పోరాట సామర్థ్యాన్ని పెంచుకోవడం, సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపైనా అధికారులు దృష్టి సారించనున్నారు. ఏప్రిల్‌ 21న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు.

వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో మోదీ చర్చలు

రక్షణ సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, వియత్నాం తాజాగా నిశ్చయించుకున్నాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి వెన్‌ ఫు చాంగ్‌తో చర్చించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లవుతోంది.

అమెరికా రక్షణ సేవల ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశం

ఆడమ్‌ స్మిత్‌ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటెటివ్స్‌) సాయుధ సేవల కమిటీ (ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ) హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేటును సందర్శించింది. యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మ్యాన్‌ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లు పాల్గొన్నారు. అమెరికా - భారత్‌ రక్షణ రంగానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు కమిటీతో సమావేశమయ్యారు. తెలంగాణలో రక్షణ, వైమానిక రంగానికి సంబంధించిన పరిశ్రమలు, వాటి ఉత్పత్తులు, ఎగుమతుల గురించి కేటీఆర్‌ వివరిస్తూ నివేదికను అందజేశారు.

న్యాయాధికారుల సదస్సు ప్రారంభోత్సవంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

న్యాయవ్యవస్థలో జడ్జీల ఖాళీలు భర్తీ చేసి మౌలిక వసతులు కల్పిస్తేనే అందరికీ న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల కొరత వల్ల ఒక్కసారి కోర్టుకు వెళితే తీర్పు రావడానికి ఎన్నేళ్లు పడుతుందనే ప్రశ్న ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఉండాలంటే ఖాళీల భర్తీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఒక్క ఖాళీ కూడా ఉంచకూడదన్నది తన లక్ష్యమని చెప్పారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ హాలులో న్యాయాధికారుల రెండు రోజుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని పేర్కొన్నారు.

భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి అమెరికా సంపూర్ణ మద్దతు

భారత్‌ కోరుకునే రక్షణ భాగస్వామిగా ఉండేందుకు సిద్ధమని అమెరికా వెల్లడించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం పొందేందుకూ, న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో దిల్లీ చేరేందుకూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ దేశం ప్రకటించింది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో ఒకటైన భారత్‌ గణనీయమైన పాత్ర పోషిస్తోందని కొనియాడింది. భారత్‌ - అమెరికా 2+2 మంత్రుల సమావేశం వాషింగ్టన్‌లో ముగిసింది. భారత్‌ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు పాల్గొనగా అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌లు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లు వీడియో ద్వారా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పాకిస్థాన్‌ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వకూడదని భారత్, అమెరికాలు ఆ దేశానికి విస్పష్టం చేశాయి. ముంబయి, పఠాన్‌కోట్‌ దాడుల నిందితులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాయి.

కామన్వెల్త్‌ పార్లమెంటరీ సదస్సు

అస్సాం రాజధాని గువాహటిలో జరుగుతున్న ఎనిమిదో కామన్వెల్త్‌ పార్లమెంటరీ సంఘం ప్రాంతీయ సదస్సులో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం, గుత్తాలు మాట్లాడుతూ.. ‘‘యువత దేశానికి వెన్నెముక, యువశక్తిని సమర్థంగా వినియోగించుకుంటే సమాజంలో అద్భుత మార్పులతో పాటు దేశం అద్భుత ప్రగతి సాధిస్తుంది’’ అని తెలిపారు.

ఉక్రెయిన్‌పై సమావేశంలో మోదీ - బైడెన్‌ సుదీర్ఘ చర్చలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో పరస్పరం భిన్న వైఖరుల్ని అనుసరిస్తున్న భారత్, అమెరికాలు ఒకే వేదికపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాయి. పోరుతో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరిద్దాం అనే దానిపై మల్లగుల్లాలు పడ్డాయి. ఈ అంశంపై తమ తటస్థ వైఖరిని భారత్‌ పునరుద్ఘాటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య వర్చువల్‌గా కీలక భేటీ జరిగింది. ఇందులో ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించారు. పోరు వ్యవహారంలో భారత్‌ స్పందించిన తీరుపైన, రష్యా నుంచి రాయితీపై చమురు దిగుమతి చేసుకోవడంపైన అమెరికా అసంతృప్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

‘మీడియేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ అంశంపై జాతీయ సదస్సు

కేసుల సత్వర పరిష్కారం కోసం సంప్రదింపులు, మధ్యవర్తిత్వ విధానాన్ని కోర్టులు తప్పనిసరిగా అనుసరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు పెండింగ్‌ కేసులను తగ్గించడంతో పాటు, న్యాయ వ్యవస్థ వనరులను, సమయాన్ని ఆదా చేయడానికి దోహదం చేస్తాయని తెలిపారు. ‘మీడియేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ అన్న అంశంపై గుజరాత్‌లోని కేవడియాలో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సును ఉద్దేశించి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కీలకోపన్యాసం చేశారు.

9వ ఆసియన్‌ మైనింగ్‌ కాంగ్రెస్‌

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో సింగరేణి ఎప్పుడూ ముందుంటుందని సింగరేణి ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన 9వ ఆసియన్‌ మైనింగ్‌ సదస్సులో మైనింగ్‌ రంగంలో సాంకేతిక పురోగతి - ప్రస్తుత స్థితిగతులు - సవాళ్లు అన్న అంశంపై ఆయన మాట్లాడారు. డ్రాగ్‌లైన్, ఎల్‌హెచ్‌డీలు, ఎస్‌డీఎల్‌ తదితర యంత్రాలను విజయవంతంగా గనుల్లో ప్రవేశ పెట్టామన్నారు. ఈ ఏడాది 65 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి సాధించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్‌ టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో రష్యా విదేశాంగ మంత్రి భేటీ

పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావాన్ని తప్పించుకునేందుకు భారత్, ఇతర మిత్ర దేశాలతో వాణిజ్యాన్ని జాతీయ కరెన్సీల్లోనే నిర్వహించే విధానంవైపు అడుగులు వేస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ తెలిపారు. భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. చైనా పర్యటన అనంతరం దిల్లీ చేరుకున్న లవ్రోవ్‌ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, భారత్, రష్యాల సంబంధాలపై అది చూపే ప్రభావం, వాణిజ్యం వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. ద్వైపాక్షిక ఆర్థిక, సాంకేతిక సంబంధాలు స్థిరంగా కొనసాగేలా చూడాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం ప్రధాని మోదీతోనూ లవ్రోవ్‌ భేటీ అయ్యారు. పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రూపాయి-రూబుల్‌ చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించే అంశంపై భారత్, చైనా వంటి దేశాలతో జరుగుతున్న వాణిజ్యంలో చాలాకాలం కిందటే ఇలాంటి ఏర్పాటు జరిగిందని లవ్రోవ్‌ తెలిపారు. ఆ దేశాలతో డాలర్లు, యూరోలు వాడకుండా చాలావరకూ జాతీయ కరెన్సీలనే ఉపయోగిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం మరింత ముమ్మరమవుతుందని, ఇది తప్పదని తెలిపారు. ఉక్రెయిన్‌ ఘర్షణపై భారత్‌ అనుసరించిన వైఖరిని రష్యా విదేశాంగ మంత్రి ప్రశంసించారు. ఈ విషయంలో ఏకపక్షంగా కాకుండా పరిస్థితి మొత్తాన్నీ బేరీజు వేసుకొని వ్యవహరిస్తోందన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా మద్దతు ఇస్తుందని చెప్పారు.