రాష్ట్రీయం -తెలంగాణ

6,916 ఎకరాల్లో ప్రత్యామ్నాయ అటవీ పెంపకం

→రాష్ట్రంలో ఈ ఏడాది 6,916 ఎకరాల సాధారణ భూముల్లో ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ అటవీకరణ(కంపా) నిధులు రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులతో అటవీ ప్రాంతాల సరిహద్దుల పరిరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ, అటవీభూముల రక్షణకు కందకాల తవ్వకం, భూమి-తేమ పరిరక్షణ, అడవుల్లో వన్యప్రాణులకు గడ్డి, నీటి ఏర్పాట్లు, ఆవాసాలు మెరుగుపరచడం వంటివి కూడా చేపడతారు. 2022-23 వార్షిక ప్రణాళికకు రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం తెలపగా తుది అనుమతులు జాతీయస్థాయి కంపా కమిటీ నుంచి రావాల్సి ఉంది. మొక్కలు నాటిన 42,213 ఎకరాల్లో పచ్చదనం నిర్వహణ కోసం ఈ ఏడాది ఖర్చు చేయనున్నట్లు వార్షిక ప్రణాళికలో అటవీశాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి ఇచ్చిన ‘జంగల్‌ బచావో..జంగల్‌ బడావో’ నినాదం స్ఫూర్తిగా దీన్ని చేపడతారు.

ప్లాస్టిక్‌ రహిత జోన్లుగా అటవీ ప్రాంతాలు

→తెలంగాణలో అడవులు, రక్షిత ప్రాంతాలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు అటవీ శాఖ తెలిపింది. శ్రీశైలం దారిలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌) ప్రాంతంలో చెత్తను సేకరించి, ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌కు పంపే విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. ఇది విజయవంతంగా కొనసాగుతుండడం, అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం, రహదారికి ఇరువైపులా పరిశ్రుభంగా మారడంతో ఇదే విధానాన్ని రాష్ట్రంలºని మిగతా ప్రాంతాల్లో కూడా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. సుమారు వెయ్యి కేజీల ప్లాస్టిక్, ఇతర చెత్తను అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. దీంతో రాష్ట్రంలో వీలున్న అన్ని అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్, చెత్త సేకరణకు ప్రత్యేక బృందాలు, రీ సైకిల్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రెండు టైగర్‌ రిజర్వులు (అమ్రాబాద్, కవ్వాల్‌), మూడు జాతీయ ఉద్యాన వనాలు (కేబీఆర్, మృగవని, హరిణి వనస్థలి), నాలుగు అభయారణ్యాలు (పాకాల, కిన్నెరసాని, పోచారం, ఏటూరునాగారం)తో పాటు 109 అటవీ అర్బన్‌ పార్కులు, జూ పార్కుల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం.డోబ్రియల్‌ ఆదేశాలు జారీ చేశారు.

"ఇయ‌ర్ ఆఫ్ పాజిటివిటీ" పుస్త‌కావిష్క‌ర‌ణ‌

తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా తమిళిసై తన ప్రస్థానం గురించి రాసిన "ఇయ‌ర్ ఆఫ్ పాజిటివిటీ" పుస్తకాన్ని చెన్నైలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలనాదక్షత అనేది సాధారణ విషయం కాదని, ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు.

తెలంగాణలో ‘ప్రాజెక్టు సంజీవని’ ప్రారంభం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలోని వైద్యోపకరణాల పార్కులో సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ అందుబాటులోకి తెచ్చిన ‘ప్రాజెక్టు సంజీవని’ తొలిదశ యూనిట్‌ను పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచే 70 దేశాలకు స్టెంట్లను ఎగుమతి చేయనున్నామని వివరించారు.

దేశంలో టాప్‌-10 ఆదర్శ గ్రామాలు తెలంగాణవే!

→సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన వెబ్‌సైట్‌లో పేర్కొన్న దేశంలోని టాప్‌-10 ఆదర్శ గ్రామాలన్నీ తెలంగాణవే. మొదటి 20 గ్రామాల్లో 19 రాష్ట్రానికే చెందినవని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన 19 అవార్డులకు అదనంగా వచ్చిన ప్రశంస అని తెలిపారు.
→పార్లమెంట్‌ సభ్యులు తమ నియోజకవర్గాల్లోని లేదా దేశంలోని ఏవైనా గ్రామాలను ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసేందుకు రూపొందించిన పథకమే సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన. అభివృద్ధిని మదింపు చేసి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తుంది.
→ యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి (స్కోర్‌ - 92.17 శాతం), కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌ (91.7), నిజామాబాద్‌ జిల్లా పాల్దా (90.95), కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్‌ (90.94), యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలం కొలనుపాక (90.57), నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం వెల్మల్‌ (90.49), జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూల రాంపూర్‌ (90.47), నిజామాబాద్‌ జిల్లా తానాకుర్దు (90.3), నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కుక్‌నూర్‌ (90.28), కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి (90.25).


జీనోమ్‌వ్యాలీలో ఫెర్రింగ్‌ ఔషధ పరిశ్రమ ప్రారంభం

జీవశాస్త్రాల రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడుతోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 2030 కల్లా ఈ రంగంలో పెట్టుబడులు రూ.7.50 లక్షల కోట్లకు చేరనున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీ ఈ రంగానికి గమ్యస్థానంగా నిలుస్తోందని తెలిపారు. ఇక్కడి టీఎస్‌ఐఐసీ బయోటెక్‌ పార్కులో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఫార్మాసూటికల్స్‌ సంస్థ రూ.250 కోట్లతో ఏర్పాటు చేసిన ఔషధ పరిశ్రమను ఆయన ప్రారంభించారు.

కొత్తగా 61 రక్తశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 61 రక్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. వీటి ద్వారా రాష్ట్రంలో మరో 515 డయాలసిస్‌ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అత్యధికంగా ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్‌ సేవలు లభ్యమవుతుండగా నూతనంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలకూ ఈ సేవలను విస్తరించారు. కొత్తగా మంజూరు చేసిన సెంటర్లలో తొలుత ఐదింటిని యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇందులో ఒక్కో దాంట్లో 5 డయాలసిస్‌ పరికరాల చొప్పున నెలకొల్పనున్నారు. అవి.. 1. కమలానెహ్రూ ప్రాంతీయ ఆసుపత్రి (నాగార్జునసాగర్‌) 2. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి (సిద్దిపేట), 3. హుస్నాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం (సిద్దిపేట) 4. ధర్మపురి ప్రాంతీయ ఆసుపత్రి (జగిత్యాల) 5. షాద్‌నగర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం (రంగారెడ్డి)ల్లో త్వరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌కు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీకి ఆదేశాలిస్తూ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ వైద్యంలో కేవలం 3 డయాలసిస్‌ కేంద్రాలుండగా వీటి సంఖ్య గత ఏడేళ్లలో 45కు పెరిగింది.

తెలంగాణలో రూ.200 కోట్లతో భారత్‌ సిరమ్స్, వ్యాక్సిన్‌ పరిశ్రమ

తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యతతో రాష్ట్రానికి నిరంతరం పెట్టుబడులు తరలివస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. పరిశ్రమలకు పెద్దఎత్తున భరోసా కల్పించేందుకు అన్ని విధాలా ప్రోత్సాహకాలను అందజేస్తున్నామన్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ జీవశాస్త్రాల సంస్థ భారత్‌ సిరమ్స్, వ్యాక్సిన్స్‌ సంస్థ తెలంగాణలోని జీనోమ్‌వ్యాలీలో రూ.200 కోట్లతో టీకాలు, ఇంజక్షబుల్స్‌ తయారీ పరిశ్రమ స్థాపించేందుకు నిర్ణయించింది. సంస్థ ఎండీ, సీఈవో సంజీవ్‌ నవంగుల్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దేశంలోని మొదటి పది బయోటెక్‌ కంపెనీల్లో బీఎస్వీ ఒకటని, 145 బ్రాండ్ల ఉత్పత్తులు తయారుచేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశ్రమ ద్వారా మహిళలకు సంబంధించిన ఆరోగ్య ఉత్పత్తులు, రేబిస్‌ వ్యాధి వ్యాక్సిన్లు ఇతర హార్మోన్‌ ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ, థాయ్‌లాండ్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, థాయ్‌లాండ్‌ ప్రభుత్వాల మధ్య పారిశ్రామిక రంగంలో పరస్పర సహాయసహకారాలపై హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆహారశుద్ధి, కలప ప్రాసెసింగ్, కలప ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనతో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, అంకురాల అభివృద్ధి, పెట్టుబడుల సాధన కోసం కృషి చేయాలని నిర్ణయించాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, థాయ్‌లాండ్‌ రాయబారి సుచిత్ర దురైలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ దిల్లీ నుంచి దృశ్యమాధ్యమంలో మాట్లాడుతూ ఒప్పందాన్ని స్వాగతించారు. దీని ద్వారా తెలంగాణ, థాయ్‌లాండ్‌లు లబ్ధి పొందుతాయని తెలిపారు.

ఏఐజీలో దేశంలోనే ప్రపంచస్థాయి మొదటి వెల్‌నెస్‌ కేంద్రం ప్రారంభం

గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆయన ప్రారంభించారు. వైద్య, పర్యాటక హబ్‌గా హైదరాబాద్‌ మారుతోందని, ఈ రంగాల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉండటం గర్వకారణమని మంత్రి అన్నారు.

తెలంగాణలో హెచ్‌సీసీబీ సంస్థ పెట్టుబడులు

హిందుస్థాన్‌ కోకకోలా బెవరేజెస్‌(హెచ్‌సీసీబీ) సంస్థ తెలంగాణలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో సిద్దిపేట సమీపంలోని బండ తిమ్మాపూర్‌లో శీతలపానీయాలు, పండ్లరసాలు, శుద్ధి చేసిన నీటి ప్యాకెట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు ఘన వ్యర్థాలు, వృథా జలాల నిర్వహణ, నైపుణ్య శిక్షణలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించింది. హైదరాబాద్‌లో మంత్రి కేటీ రామారావు సమక్షంలో అవగాహన ఒప్పందం జరిగింది. హెచ్‌సీసీబీ ఛైర్మన్‌ సీఈవో నీరజ్‌ గర్గ్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ దీనిపై సంతకాలు చేశారు.

వైద్యశాఖలో 104 మందికి ప్రతిభా పురస్కారాలు

వైద్య ఆరోగ్యశాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 104 మందికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. బోధనాసుపత్రులు మొదలుకొని ఆశాల వరకూ అన్ని స్థాయుల్లోనూ వివిధ కేటగిరీల్లో వీటిని అందజేయనున్నారు. కొవిడ్‌ చికిత్సలు అందించిన ఉత్తమ ఆసుపత్రుల విభాగంలో గాంధీ ఆసుపత్రి నుంచి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్, టిమ్స్‌ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్‌ విమలా థామస్‌ ఎంపికయ్యారు. గాంధీ ఆసుపత్రి నుంచే ఉత్తమ ప్రసూతి సేవలకు డాక్టర్‌ సంగీతా షాను, మూత్రపిండాల రోగులకు అందించిన సేవలకు డాక్టర్‌ మంజూషలను ఎంపిక చేశారు. కొవిడ్‌ సేవల్లో ఉత్తమ పనితీరుకు హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ వెంకటిని పురస్కారం వరించింది. ఉత్తమ ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన వారిలో ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, జనగామ, వనపర్తి జిల్లా ఆరోగ్య అధికారులున్నారు. ఉత్తమ జిల్లా ప్రోగ్రాం అధికారి విభాగంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన రవీందర్‌ ఎంపికయ్యారు.

టీవీవీపీ కమిషనర్‌గా డాక్టర్‌ అజయ్‌కుమార్‌

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) కమిషనర్‌గా డాక్టర్‌ జె.అజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. కామారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన్ను రెండు వారాల కిందట వైద్య విధాన పరిషత్‌ ఇన్‌ఛార్జి సంయుక్త కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ పదవీలో కొనసాగుతుండగానే కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఉన్న డాక్టర్‌ రమేశ్‌రెడ్డిని వెంటనే అజయ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తెలంగాణలో థర్మోఫిషర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సెంటర్‌ ప్రారంభం

పరిశోధనల రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికా సంస్థ థర్మోఫిషర్‌ సైంటిఫిక్‌ హైదరాబాద్‌లో రూ.115 కోట్ల పెట్టుబడితో మొదలుపెట్టిన ‘ఇండియా ఇంజినీరింగ్‌ సెంటర్‌’ను మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కొత్త కేంద్రం ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉంటుంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రోడ్ల అభివృద్ధి

→జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమంలో 12 జాతీయ రహదారుల విస్తరణ పనులకు, కేంద్ర రహదారి సదుపాయాల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) కింద చేపట్టిన 7 ప్రాజెక్టుల పనులను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. →నిర్మాణం పూర్తయిన రెండు జాతీయ రహదారుల్ని జాతికి అంకితం చేశారు.
→ రాష్ట్రంలో 460 కి.మీ పొడవైన, రూ.ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. → రాంసాన్‌పల్లె - మంగళూరు సెక్షన్‌ నాలుగు వరుసల రహదారి (47 కి.మీ), మంగళూరు - తెలంగాణ సరిహద్దు నాలుగు వరుసల రహదారు (49 కి.మీ)లను జాతికి అంకితం చేశారు.
శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు:-
జాతీయ రహదారులు: కళ్లకల్‌ - గుండ్లపోచంపల్లి (17 కి.మీ), గుండ్లపోచంపల్లి - బోయిన్‌పల్లి (10 కి.మీ), తొండుపల్లి - కొత్తూరు (46 కి.మీ), ఓఆర్‌ఆర్‌ టీఎస్‌పీఏ జంక్షన్‌ - మన్నెగూడ 46 కి.మీ, దుద్దెడ - జనగామ (40 కి.మీ), వలిగొండ - తొర్రూర్‌ 69 కి.మీ, ఎల్‌బీనగర్‌ - మల్కాపూర్‌ 23 కి.మీ, హనుమకొండ - ములుగు 30 కి.మీ, హైదరాబాద్‌ - భూపాలపట్నం మార్గంలో పేవ్డ్‌ సెక్షన్‌ (4 కి.మీ), బీహెచ్‌ఈఎల్‌ కూడలి వద్ద ఫ్లై ఓవర్‌ (2 కి.మీ) సీఆర్‌ఐఎఫ్‌ ప్రాజెక్టులు (106 కి.మీ): సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల్లో సీఆర్‌ఐఎఫ్‌ కింద ఏడు పనులు.

గూగుల్‌ రెండో అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు

→దిగ్గజ సాంకేతిక సంస్థ గూగుల్‌ తమ రెండో అతి పెద్ద కార్యాలయ ప్రాంగణాన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్మించనుంది.
→7.3 ఎకరాల్లో 30.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే కార్యాలయ ప్రాంగణ సముదాయం నిర్మాణానికి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు.
→ఈ సందర్భంగా భవనం నమూనాను విడుదల చేశారు. అమెరికాలోని మౌంటెన్‌ వ్యూ తర్వాత గూగుల్‌ అతిపెద్ద కార్యాలయం ఇదేనని వెల్లడించారు.