సర్వేలు



భారత వృద్ధి 8.2%: ఐఎమ్‌ఎఫ్‌ అంచనా

→ఈ ఏడాది భారత్‌ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు అవ్వొచ్చని ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసింది. గత అంచనా 9% కంటే ఇది 0.8% తక్కువ.
→ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద దేశంగా భారత్‌ కొనసాగనుంది. చైనా వృద్ధి రేటు అంచనా 4.4 శాతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు 2023లో భారత వృద్ధి 6.9 శాతం కావొచ్చని పేర్కొంది.
→2022లో అంతర్జాతీయ వృద్ధి 3.6 శాతానికి చేరొచ్చని తన వార్షిక ‘ప్రపంచ ఆర్థిక అంచనా’ నివేదికలో ఐఎమ్‌ఎఫ్‌ పేర్కొంది.


భారత్‌లో తొమ్మిదేళ్లలో 12.3% తగ్గిన పేదరికం

→భారత్‌లో 2011తో పోలిస్తే 2019 నాటికి పేదరికం భారీగా తగ్గినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది.
→తొమ్మిదేళ్లలో ఏకంగా 12.3 శాతం మేర పేదలు తగ్గినట్లు పేర్కొంది. 2011లో 22.5 శాతంగా ఉన్న పేదరికం 2019కి వచ్చేసరికి 10.2 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.
→ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని పరిశోధన నివేదికలో ప్రపంచబ్యాంకు పేర్కొంది. గ్రామాల్లో 26.3 శాతం నుంచి 11.6 శాతానికి పేదరికం తగ్గింది.
→అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది. భారత్‌లో చిన్న కమతాలున్న రైతులు అధిక లాభాలు గడించారని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
→2013, 2019లలో చేసిన రెండు సర్వేల ప్రకారం పెద్ద కమతాలున్న రైతుల వార్షిక ఆదాయం 2 శాతం మేర పెరిగితే, చిన్న రైతుల ఆదాయం పది శాతం మేర వృద్ధి చెందినట్లు వివరించింది.
→ఆర్థికవేత్తలు సుతీర్థసిన్హా రాయ్, రాయ్‌ వాన్‌ డెర్‌ మీల్‌లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు.


సైనిక వ్యయంలో భారత్‌కు మూడో స్థానం

→కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలు క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ రక్షణ వ్యయాలను పెంచుతున్నాయి.
→గత ఏడాది అంతర్జాతీయ సైనిక వ్యయం కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగి, 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
→చైనా, భారత్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మేధోమథన సంస్థ ‘స్టాక్‌హోమ్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (సిప్రీ) ఈ వివరాలను వెల్లడించింది.
→2020తో పోలిస్తే ప్రపంచ రక్షణ వ్యయం 0.7 శాతం మేర పెరిగినట్లు వివరించింది.
→ఈ సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది భారత సైనిక వ్యయం 7,660 కోట్ల డాలర్లకు చేరింది. 2020 నాటితో పోలిస్తే ఇది 0.9 శాతం మేర పెరిగింది.
→ఇదే సమయంలో చైనా 29,300 కోట్ల డాలర్లు కేటాయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 4.7 శాతం అధికం.


ధాన్యం సేకరణలో మొదటి స్థానంలో పంజాబ్, మూడులో తెలంగాణ

→తెలంగాణ నుంచి 2021 - 22 ఖరీఫ్‌ మార్కెట్‌ సీజన్‌లో ఏప్రిల్‌ 25 నాటికి 68.66 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
→ఇందుకోసం 10,62,428 మంది రైతులకు కనీస మద్దతు ధర కింద రూ.13,457.36 కోట్లు చెల్లించినట్లు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
→మొత్తం మీద సేకరించిన ధాన్యంలో తెలంగాణ వాటా 9.06%, ఏపీ వాటా 5.62% ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది.
→అత్యధిక వాటా పంజాబ్‌ (24.73%), ఛత్తీస్‌గఢ్‌ (12.15%) చేజిక్కించుకున్నాయి. మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది.
→ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటివరకు 42.62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపింది.

దేశంలో వృద్ధ జనాభా వృద్ధి

→దేశవ్యాప్తంగా వయో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో వీరే 14.2 శాతానికి చేరవచ్చని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.
→2011 జనాభా లెక్కల ప్రకారం.. అత్యధిక మంది వయో వృద్ధులు (60 ఏళ్ల పైబడినవారు) ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది.
→ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత వీరి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ. దేశవ్యాప్తంగా వయోవృద్ధులు 10.38 కోట్లు (మొత్తం జనాభాలో 8.57%) మంది ఉండగా, 2026 నాటికి ఆ సంఖ్య 17.32 కోట్ల (13.1%)కు చేరుతుందని నివేదిక అంచనా.
→దీని వల్ల 15-59 ఏళ్ల వారిపై (ప్రతి 100 మంది) ఆధారపడే వయో వృద్ధుల సంఖ్య భారీగా పెరగనున్నట్లు పేర్కొంది.
→ఆంధ్రప్రదేశ్‌లో 82,78,241 మంది వయో వృద్ధులు ఉండగా అందులో 73.78% మంది గ్రామీణ ప్రాంతాల్లో, 26.21% మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు.
→60 ఏళ్లపైబడిన వారు జాతీయ స్థాయిలో సగటున 70.57% మంది గ్రామీణ ప్రాంతాల్లో, 29.43% పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు.

దేశంలో 17 లక్షల మందికి హెచ్‌ఐవీ

→అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా భారత్‌లో గత పదేళ్లలో 17 లక్షల మందికిపైగా హెచ్‌ఐవీ బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 3.18 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
→ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌ ఉన్నాయి. జాతీయ ఎయిడ్స్‌ నివారణ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.
→వాటి ప్రకారం.. భారత్‌లో 2011 - 21 మధ్య 17,08,777 మందికి హెచ్‌ఐవీ సోకింది. అయితే గత దశాబ్దకాలంలో ఎయిడ్స్‌ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
→అరక్షిత సంపర్కం కారణంగా 2011 - 12లో 2.4 లక్షల మందికి హెచ్‌ఐవీ సోకగా, 2020 - 21లో ఆ సంఖ్య 85,268గా ఉంది.
→రక్తం, రక్త సంబంధిత కణాల మార్పిడి ద్వారా గత పదేళ్లలో 15,782 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు. అదే వ్యవధిలో 4,423 మంది చిన్నారులకు తల్లుల నుంచి హెచ్‌ఐవీ సోకింది.
→అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హెచ్‌ఐవీ కేసులు స్థిరంగా తగ్గుతున్నాయి. 2020 నాటికి దేశంలో 23,18,737 మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నారు.
→వీరిలో 81,430 మంది చిన్నారులు ఉన్నారు.

ప్రయారిటీ వాచ్‌లిస్ట్‌లోనే భారత్, రష్యా, చైనా

→మేధో సంపత్తి (ఐపీ) హక్కుల పరిరక్షణ, అమలుకు సంబంధించి అమెరికా మరోసారి భారత్, చైనా, రష్యా సహా 7 దేశాలను తన ‘ప్రాధాన్యత పరిశీలన జాబితా (ప్రయారిటీ వాచ్‌లిస్ట్‌)’లోనే ఉంచింది.
→ ఈ మేరకు అమెరికా ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) కార్యాలయం వార్షిక ‘స్పెషల్‌ 301 రిపోర్ట్‌’ను విడుదల చేసింది.
→ అర్జెంటినా, చిలీ, ఇండొనేసియా, వెనెజువెలాతో కలిపి ఈ 7 దేశాలూ గత ఏడాది కూడా ఇదే జాబితాలో ఉన్నాయి.
→ మేధో హక్కుల పరిరక్షణ, అమలుకు సంబంధించి ప్రపంచవ్యాప్త పరిస్థితిపై యూఎస్‌టీఆర్‌ ఈ నివేదికను రూపొందిస్తుంది.
→ ఈ మేరకు 100కు పైగా అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాల పరిస్థితులను సమీక్షించినట్లు యూఎస్‌టీఆర్‌ తెలిపింది.
→ తగినంతగా ఐపీ హక్కుల రక్షణ, అమలు లేనట్లు భావించే దేశాలను ఈ జాబితాలో ఉంచుతుంది.
→ కాగా తాజా నివేదికలో పాకిస్థాన్, కెనడా, బ్రెజిల్, ఈజిప్ట్, మెక్సికో సహా 20 వాణిజ్య భాగస్వామ్య దేశాలను ‘పరిశీలన జాబితా (వాచ్‌లిస్ట్‌)’లో ఉంచింది.

అనారోగ్యకర ఆహార పొట్లాలపై రెడ్‌ హెచ్చరికలు ఉండాలి

→అధిక స్థాయిలో కొవ్వు, చక్కెర, ఉప్పుతో కూడిన అనారోగ్యకర ఆహార పొట్లాలపై ఎరుపు రంగులో హెచ్చరిక సంకేతం ఉండాలని 70% మంది భారతీయులు కోరుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది.
→సామాజిక మాధ్యమ వేదిక ‘లోకల్‌ సర్కిల్స్‌’ దీన్ని చేపట్టింది. మొత్తం 11,439 మంది ఈ సర్వేలో పాల్గొనగా ఆహార పొట్లాలపై ఎరుపు రంగు హెచ్చరిక సంకేతం ఉండాలని 31% మంది, హెచ్చరికగా ఎరుపు రంగుతో పాటు ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులపై ఆకుపచ్చ లేదా కాషాయ రంగు ఉండాలని మరో 39% మంది అభిప్రాయపడ్డారు.
→మరో 20% మంది మాత్రం ఆహార పదార్థాలను బట్టి ప్రతి పొట్లంపైనా స్టార్‌ రేటింగ్‌ ఉండాలని సూచించారు.
→8% మంది మాత్రం ఎలాంటి హెచ్చరికలు, సంకేతాలు లేకుండానే ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులను విక్రయించాలని పేర్కొన్నారు.

యువ ప్రపంచ నేతల జాబితాలో రాఘవ్‌ చద్దా, రాధికా గుప్తా, ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఫెదొరోవ్‌

→ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఈ ఏడాది రూపొందించిన యువ ప్రపంచ నేతల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్‌ చద్దా, ఈడెల్‌వీస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ సీఈవో రాధిక గుప్తాలతో పాటు ఉక్రెయిన్‌ ఉప ప్రధాని, ఆ దేశ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ శాఖ మంత్రి మైఖెయిలో ఫెదొరోవ్‌కు స్థానం లభించింది. రాఘవ్‌ చద్దా ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. మే 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించనున్న డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సమావేశాన్ని పురస్కరించుకొని యువ ప్రపంచ నేతల జాబితా విడుదలైంది. 42 దేశాలకు చెందిన మొత్తం 109 మందితో కూడిన జాబితాలో శుద్ధ ఇంధనం, ఆరోగ్య సమానత్వం, కాందీశీకుల హక్కులు, విద్యా సంస్కరణల కోసం కృషి చేసిన వారున్నారు. తాజా జాబితాలో మన దేశానికి చెందిన క్రీడాకారిణి మానసి జోషి, ఇన్నోవ్‌-8 కోవర్కింగ్‌ ఫౌండర్‌ రితేశ్‌ మాలిక్, భారత్‌పే సీఈవో సుహైల్‌ సమీర్, సుగర్‌ కాస్మొటిక్స్‌ సీఈవో వినీతా సింగ్, గ్లోబల్‌ హిమాలయన్‌ ఎక్స్‌పెడిషన్‌ సీఈవో జైదీప్‌ బన్సల్‌ కూడా ఉన్నారు.

యూపీఐదే అగ్రస్థానం: పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక

→రిటైల్‌ ఆన్‌లైన్‌ లావాదేవీల ప్లాట్‌ఫామ్‌ యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) దేశంలో జరుగుతున్న డిజిటల్‌ చెల్లింపుల్లో ఆధిపత్యం కొనసాగిస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది.
→బై నౌ పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌), సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలు కూడా వచ్చే 5 ఏళ్లలో డిజిటల్‌ చెల్లింపుల్లో గణనీయ వృద్ధికి కీలకంగా మారనున్నాయని అందులో పేర్కొంది.
→భారత డిజిటల్‌ చెల్లింపుల విపణి 23 శాతం (పరిమాణ పరంగా) స్థిర వార్షిక సంచిత వృద్ధి రేటును (సీఏజీఆర్‌) నమోదు చేస్తోందని తెలిపింది.
→2025 - 26 నాటికి రూ.21,700 కోట్ల లావాదేవీలు డిజిటల్‌గానే జరుగుతాయని అభిప్రాయపడింది.
→గత ఆర్థిక సంవత్సరంలో ఈ లావాదేవీలు రూ.5,900 కోట్లుగా నమోదయ్యాయని ‘ది ఇండియన్‌ పేమెంట్స్‌ హ్యాండ్‌బుక్‌ - 2021 - 26’ పేరుతో రూపొందించిన నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా వివరించింది.

దేశంలోని 87 శాతం మంది ప్రజలపై అధిక ధరల భారం: ‘లోకల్‌ సర్కిల్స్‌’ సర్వే

→దేశంలో నిత్యావసరాల ధరల మంట మండుతోంది. పెట్రోలు, డీజిల్‌తో పోటీగా కూరగాయలు, వంట నూనెల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
→ఈ ధరా భారం నిరుపేదలనే కాకుండా మధ్య తరగతి, ఆపై వర్గాల వారినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని ప్రభావం వారి ఆరోగ్యాలపైనా పడుతోంది.
→దేశంలోని 87 శాతం మంది అధిక ధరల సమస్యను ఎదుర్కొంటున్నారు. ‘లోకల్‌ సర్కిల్స్‌’ సర్వేలో పలు అసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
→కాయగూరల ధరలపై ‘లోకల్‌ సర్కిల్స్‌’ దేశ వ్యాప్తంగా 311 జిల్లాల పరిధిలోని 11,800 మంది అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపంలో ఆ వివరాలను బహిర్గతం చేసింది.
→గత నెల రోజులుగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయని సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో 9 మంది తెలిపారు.
→దీని వల్ల తమ రోజువారీ ఖర్చులు 25 శాతం మేర అధికమయ్యాయని 37 శాతం మంది వెల్లడించారు. మరో 36 శాతం మంది కూరగాయల కోసం చేసే వ్యయం 10 నుంచి 25 శాతం పెరిగిందన్నారు.
→ఈ భారాన్ని తగ్గించుకునేందుకు మధ్యతరగతి కుటుంబాల వారు కూడా ధర తక్కువగా ఉండే నాణ్యతలేని నూనెల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది.

భారత్‌లో మానవ హక్కులపై అమెరికా నివేదిక

→కీలకమైన మీడియా సంస్థలను బెదిరించడంలో భారత్‌లో ప్రభుత్వ అధికారుల ప్రమేయం స్థానిక, జాతీయ స్థాయుల్లో ఉంటోందని అమెరికాలో ఒక వార్షిక అధ్యయన నివేదిక చెబుతోంది.
→దాడులకు పాల్పడడం, భౌతికంగా వేధించడంలోనూ వీరి పాత్ర ఉంటోందని నివేదిక తెలిపింది. దీన్ని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసింది
→ 2021లో ప్రపంచంలో మానవ హక్కులను ఆచరణలో పెట్టిన తీరుపై దీనిలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత్‌ సహా వివిధ దేశాల్లో పరిస్థితుల్ని ఇది వివరించింది.
→‘స్వతంత్ర మీడియా ఎంతో చురుగ్గా ఉంటూ అనేక అంశాలను వెలుగులోకి తీసుకు వస్తుంటుంది.
→ తమపై వేధింపులకు, దాడులకు పాల్పడడమే కాకుండా నిస్సారమైన అంశాల్లోనూ వ్యాజ్యాలు పడేలా చూడడంలో, మొబైల్‌ సేవలు, ఇంటర్నెట్‌ స్తంభింపజేయడంలో, స్వేచ్ఛగా తిరుగాడనివ్వకుండా అడ్డుకోవడంలో కొందరు అధికారులు భాగస్వాములు అవుతున్నట్లు పాత్రికేయులు, ఎన్జీవో సంఘాలవారు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించే పాత్రికేయులపై క్రిమినల్‌ కేసులు పెడుతున్నట్లు ఎన్జీవోలు తెలిపాయి’ అని నివేదిక పేర్కొంది. చట్టవ్యతిరేక/ఏకపక్ష హత్యలు, పోలీసు వేధింపులు/అమానవీయ చర్యలు, జైళ్లలో చిత్రహింసలు వంటి పరిస్థితులపై నివేదికలో ప్రస్తావించారు. గోప్యత విషయంలో చట్ట విరుద్ధంగా చొరబడడం, మీడియా స్వతంత్రతపై ఆంక్షలు విధించడం, అక్రమ అరెస్టులు వంటివాటిని గుర్తుచేశారు. జమ్మూ - కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు, ఈశాన్య రాష్ట్రాలు/మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికార దుర్వినియోగం/సాయుధ బలగాలను చిత్రహింసల పాల్జేయడం వంటివాటినీ నివేదికలో ప్రస్తావించారు.

విద్యుత్‌ లభ్యత, ధరలలో తెలంగాణకు రెండో స్థానం

→ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్‌ తాజా నివేదిక ప్రకారం.. విద్యుత్‌ లభ్యత, ధర, విశ్వసనీయతల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు.
→ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్, పర్యావరణ సూచిక రౌండ్‌-1 ర్యాంకింగులో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
→ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యుత్‌రంగంపై ఉన్న ముందుచూపు, పనితీరుకు నీతి ఆయోగ్‌ నివేదిక అద్దం పడుతోందని వినోద్‌ వివరించారు.


విద్యుత్తు రంగంలో తెలంగాణకు 17, ఏపీకి 18వ ర్యాంకు

→రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్తు, పర్యావరణ సూచిక (స్టేట్‌ ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ ఇండెక్స్‌) రౌండ్‌-1 ర్యాంకుల్లో ఓవరాల్‌ కేటగిరీలో తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్‌ 18వ స్థానాల్లో నిలిచాయి. 20 పెద్ద రాష్ట్రాల విభాగంలో గుజరాత్‌ తొలి స్థానంలో నిలవగా తెలంగాణ 11, ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానానికి పరిమితమయ్యాయి. విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు, విద్యుత్తు లభ్యత, ధర, విశ్వసనీయత, స్వచ్ఛ ఇంధన సరఫరా, విద్యుత్తు సామర్థ్యం, పర్యావరణ సుస్థిరత, వినూత్న విధానాలు అనే ఆరు కొలమానాల ఆధారంగా 2019-20 సమాచారం మేరకు నీతి ఆయోగ్‌ ఈ ర్యాంకులు ప్రకటించింది. ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 7, 12, 13 విద్యుత్తు రంగానికి సంబంధించినవి. దాన్ని అనుసరించి రాష్ట్రాలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అంచనావేయడానికి ఈ ర్యాంకులు ఇచ్చాం’’ అని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. 1990 నుంచి 2019 మధ్య ఆర్థిక వ్యవస్థ 6 రెట్లు పెరిగితే విద్యుత్తు వినియోగం 2.5 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. మన తలసరి విద్యుత్తు వినియోగం ప్రపంచ సగటులో 1/3 వంతుకు మాత్రమే పరిమితమైందన్నారు.
→మొదటి మూడు స్థానాల్లో..
→పెద్ద రాష్ట్రాల్లో: గుజరాత్, కేరళ, పంజాబ్‌
→చిన్న రాష్ట్రాల్లో: గోవా, త్రిపుర, మణిపుర్‌
→కేంద్రపాలిత ప్రాంతాల్లో: ఛండీగడ్, దిల్లీ, దయ్యూదామన్, దాద్రానగర్‌హవేలీ
→ఓవరాల్‌ ర్యాంకులు: చండీగఢ్, దిల్లీ, డయ్యూడామన్‌ - దాద్రానగర్‌ హవేలీ

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నివేదిక

→ దేశంలో కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతంగా నెలకొన్న 2020లో అత్యంత బీదరికాన్ని కనిష్ఠ స్థాయిలో ఉంచేందుకు ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేఏవై) ఇతోధికంగా దోహదపడిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. ఈ మేరకు ‘మహమ్మారి, పేదరికం, అసమానత: భారతదేశ రుజువులు’ పేరున ఓ నివేదికను వెల్లడించింది. 2004 - 05 నుంచి 2020 - 21 వరకు దేశంలో నెలకొన్న పేదరికం, వినియోగ అసమానతలను ఐఎంఎఫ్‌ ఇందులో వివరించింది. పేదలకు ఆహార ధాన్యాలను ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో పీఎంజీకేఏవైను ప్రారంభించింది. మహమ్మారి తలెత్తడానికి ముందు, 2019లో దేశంలోని అత్యంత పేదరికం 0.8%గా ఉందని, ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేయడం వల్ల ఆ మరుసటి ఏడాది కూడా అత్యంత పేదరికం అదే స్థాయిలో ఉండటం విశేషమని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక

→దేశం మొత్తం మీద రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్సలు (ఐపీ) పొందడంలో తెలంగాణ అగ్రస్థానంలో (79 శాతం) నిలిచింది. దీన్ని బట్టి రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి సంఖ్య అధికంగా ఉందని అర్థమవుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (78 శాతం), ఉత్తర్‌ప్రదేశ్‌ (73 శాతం), కర్ణాటక (73 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (72 శాతం), పంజాబ్‌ (71 శాతం) ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌ (9 శాతం), హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ప్రజలు అధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. మరోపక్క దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జనరల్‌ సర్జన్లు, గైనకాలజిస్ట్‌ల వంటి నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెద్ద రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో 51 శాతం, తమిళనాడులో 36 శాతం, చత్తీస్‌గఢ్‌లో 26 శాతం, రాజస్థాన్‌లో 25 శాతం, కర్ణాటకలో 14 శాతం, తెలంగాణలో 13 శాతం, గుజరాత్‌లో 12 శాతం చొప్పున ఉంది. అలాగే అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ వైద్యులతో పాటు ఇతర మానవ వనరుల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు 2018 గణాంకాల ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయుల్లో వైద్యులు 5 శాతం, ల్యాబ్‌ టెక్నీషియన్‌ 33 శాతం, ఫార్మాసిస్ట్‌ 15 శాతం కొరత ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ‘భారత ఆరోగ్య వ్యవస్థపై సమీక్ష’ పేరిట ఆసియా పసిఫిక్‌ అబ్జర్వేటరీ ఆన్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అండ్‌ పాలసీస్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు:-
→ రోగిని ప్రాథమిక స్థాయి నుంచి మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్‌ ఆసుపత్రికి పంపించినందుకు (రిఫరల్‌) ఆ హాస్పిటల్‌ నుంచి కొంత మొత్తం పంపినవారికి తిరిగి అందజేసే (కిక్‌బ్యాక్‌) ధోరణి పెచ్చుమీరుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక అధ్యయనంలో కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు వైద్యుల నుంచి ఆర్‌ఎంపీ, పీఎంపీలకు సుమారు 40 శాతం వరకు బహుమతులు (వైద్యపరికరాలు) అందుతున్నట్లు తేటతెల్లమైంది.
→ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో 529 వైద్య కళాశాలలుండగా వీటిలో 92,250 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వీటి అనుబంధ ఆసుపత్రుల్లో 4.55 లక్షల పడకలున్నాయి. మొత్తం సీట్లలో 54 శాతం ఎంబీబీఎస్‌ సీట్లు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్నాయి.
→ 1980 నుంచి 2004 మధ్య కాలంలో ప్రైవేటు వైద్యరంగం గణనీయమైన పురోగతి సాధించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 8 రెట్లు పెరగ్గా.. ప్రభుత్వ వైద్యంలో రెట్టింపు మాత్రమే అయింది. ప్రైవేటు వైద్యంలో నర్సింగ్‌ హోంలో సగటున 14 పడకలుండగా కార్పొరేట్‌ హాస్పిటల్‌లో సగటున 177 పడకలున్నాయని నివేదిక వెల్లడించింది. దేశం మొత్తంమీద ఉన్న పడకల్లో 46 శాతం 50 లక్షలు మించి జనాభా గల అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణె లాంటి నగరాల్లోనే ఉన్నాయి.


రోడ్డు ప్రమాదాల మరణాలు భారత్‌లోనే అత్యధికం

→దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య ప్రపంచంలో కెల్లా మన దేశంలోనే అత్యధికంగా ఉంటోందని తెలిపారు. ప్రపంచ రోడ్డు గణాంకాలు (డబ్ల్యూఆర్‌ఎస్‌) - 2018 ప్రకారం మన దేశం రహదారుల ప్రమాదాల సంఖ్యలో మూడో స్థానంలో, మృతుల సంఖ్యలో ప్రథమ స్థానంలో, గాయపడిన వారిలో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. జెనీవాకు చెందిన ఇంటర్నేషనల్‌ రోడ్‌ ఫెడరేషన్‌ తాజాగా ఈ గణాంకాలను విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదాలకు గురవుతున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు 69.80 శాతంగా ఉన్నట్లు వివరించారు.

47.7 నుంచి 69.6 ఏళ్లకు పెరిగిన సగటు జీవితకాలం

→దేశంలో మానవుల సగటు జీవితకాలం పెరిగింది. 1970లో 47.7 ఏళ్లు ఉండగా 2020నాటికి ఇది 69.6 ఏళ్లకు చేరుకుంది.
→ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ విషయంలో విశేష పురోగతి కనిపిస్తోంది.
→జీవితకాలం పెరిగిన రాష్ట్రాల జాబితాలో తొలుత ఉత్తరప్రదేశ్‌.. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, బిహార్, అస్సాం, ఏపీ వరుస స్థానాల్లో ఉన్నాయి.
→ఏషియా పసిఫిక్‌ అబ్జర్వేటరీ ఆన్‌హెల్త్‌ సిస్టమ్స్‌ అండ్‌ పాలసీస్‌ విడుదల చేసిన ‘భారత్‌లో ఆరోగ్య రంగం - సమీక్ష’ నివేదిక దీన్ని వెల్లడించింది.
→1970 నుంచి ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ఆయా శాఖల నివేదికను ‘డబ్ల్యూహెచ్‌వో’ తాజాగా విడుదల చేసింది.
→పబ్లిక్‌హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, సెంటర్‌ఫర్‌ జెండర్‌ ఈక్వాలిటీ అండ్‌ హెల్త్, జిందాల్‌ విశ్వవిద్యాలయం, మెడికల్‌ ఫ్యాకల్టీ అండ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ (జర్మనీ) నిపుణులు ఈ నివేదిక రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

2030 కల్లా కర్బన ఉద్గారాలను సగానికి తగ్గించవచ్చు

→ఇంధన రంగంలో భారీ మార్పులు చేపట్టడం ద్వారా శిలాజ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రపంచ ఉద్గారాలను 2030 కల్లా సగానికి తగ్గించవచ్చని విడుదలైన ఐపీసీసీ నివేదిక పేర్కొంది. భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి ప్రస్తుతం ఉపశమన చర్యలు చేపట్టాలన్న అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ‘క్లైమేట్‌ చేంజ్‌-2022: మిటిగేషన్‌ ఆఫ్‌ క్లైమేట్‌ చేంజ్‌’ పేరుతో ది ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఐపీసీసీ) వర్కింగ్‌ గ్రూప్‌-3 రిపోర్ట్‌ నివేదిక సోమవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 2010-19 మధ్యకాలంలో సగటు వార్షిక అంతర్జాతీయ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అందులో పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలకు భారీగా కోతపెట్టి హైడ్రోజెన్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని పెంచితే ఇప్పటి కర్బన ఉద్గారాలను 2030కల్లా సగానికి తగ్గించవచ్చని స్పష్టంచేశారు.
→విద్యుదీకరణను విస్తరించడం, ఇంధనాన్ని మరింత సమర్థంగా వాడుకోవడం ద్వారా భూతాపాన్ని కట్టడి చేయవచ్చన్నారు.
→అన్ని రంగాల్లో ఉద్గారాలను గణనీయంగా తగ్గించకుండా భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోలేమని నివేదిక స్పష్టంచేసింది.
→మార్చి నెలలో జరిగిన వర్చువల్‌ సమావేశంలో 195 దేశాలు ఈ నివేదికను ఆమోదించాయి.

ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పునకు అదనపు ఖర్చు రూ.3,846

→ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం ఉచితమైనా ఒక్కో ప్రసవానికి 2019 - 20 గణాంకాల ప్రకారం అదనపు ఖర్చు సగటున రూ.3,846 ఖర్చవుతోందని సామాజిక అభివృద్ధి మండలి (సీఎస్‌డీ) స్పష్టం చేసింది. ఇది 2014 - 15లో రూ.4,218 కావడం గమనార్హం. అతితక్కువగా మహబూబ్‌నగర్‌లో ఒక్కో ప్రసవానికి రూ.2,369 ఖర్చు కాగా అత్యధికంగా మెదక్‌ జిల్లాలో రూ.6,139 వ్యయమైంది. ఖర్చు ఎక్కువైన జిల్లాల జాబితాలో మెదక్‌ తర్వాత స్థానంలో జయశంకర్‌ భూపాలపల్లిలో రూ.5,993.. కామారెడ్డిలో రూ.5,957గా నమోదైంది. రాష్ట్రంలో ఆరోగ్య రంగం స్థితిగతులపై సామాజిక అభివృద్ధి మండలి (సీఎస్‌డీ) రూపొందించిన నివేదికను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పుస్తక రూపంలో ఆవిష్కరించారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-4) 2014 - 15కు (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5) 2019 - 20కి మధ్య గణాంకాలను పోల్చుతూ నివేదికను రూపొందించారు.
→ 20-24 ఏళ్ల వయస్సుండి 18 ఏళ్లలోపు పెళ్లైన యువతులు 2014 - 15లో 26.2 శాతం మంది, 2019 - 20లో 23.5 శాతం మంది ఉన్నారు.
→ 15-19 ఏళ్ల వయస్సు గర్భిణులు 10.6 నుంచి 5.8 శాతానికి తగ్గారు.

హైదరాబాద్‌లో అత్యధిక క్షయ బాధితులు

→కరోనా వంటి కొత్త వైరస్‌లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నా క్షయ (టీబీ) వ్యాధి మాత్రం ప్రజల్ని పట్టి పీడిస్తూనే ఉంది. టీబీ కోరల్లో ఏటా వేలమంది కొత్తగా చిక్కుకుంటూనే ఉన్నారు.
→చిరకాలంగా వ్యాధి నిర్మూలనపై దృష్టిపెడుతున్నా గతేడాది (2021) కొత్తగా 60,599 క్షయ కేసులు నమోదవటం ఆందోళనకర అంశమే.
→ 2019తో పోల్చితే 2020లో సుమారు 7 వేల కేసులు, 2020తో పోల్చితే 2021లో సుమారు 3 వేల కేసులు తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నా వాస్తవానికి క్షయ కేసుల నమోదులో నిర్దేశిత లక్ష్యాన్ని ఆరోగ్య శాఖ అందుకోలేదు. 2019లో 100 శాతం లక్ష్యం సాధించగా 2020లో 77, 2021లో 74 శాతమే లక్ష్యాన్ని నమోదు చేసుకున్నట్లుగా ఆరోగ్య శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
→ గత రెండేళ్లలో లక్ష్యాన్ని చేరలేకపోవడానికి కొవిడ్‌ ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ చెబుతోంది.
→గతేడాది గణాంకాలు పరిశీలిస్తే :-
→రాష్ట్రం మొత్తమ్మీద హైదరాబాద్‌లో అత్యధికంగా 11,639 టీబీ కేసులు కొత్తగా నమోదయ్యాయి. 2 వేలకు పైగా కేసులు నమోదైన జిల్లాల జాబితాలో రంగారెడ్డి (4,356), మేడ్చల్‌ (4,096), ఖమ్మం (2,284), భద్రాద్రి (2,193), సిద్దిపేట (2,121), నిజామాబాద్‌ (2,024) చేరాయి. హెచ్‌ఐవీ బాధితులు, మధుమేహులు, దీర్ఘకాల మూత్రపిండాల రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా కీమోథెరపీ పొందుతున్నవారు, స్టెరాయిడ్స్‌ వాడుతున్నవారు, పొగాకు వాడకందారులు, పౌష్ఠికాహార లోపం ఉన్నవారిలో టీబీ ముప్పు అధికంగా కనిపిస్తోంది. అంటువ్యాధి అయిన క్షయ జుట్టు, గోళ్లు మినహా.. శరీరంలోని అన్ని అవయవాలకూ వ్యాపించే అవకాశాలున్నాయి. ఆధునిక ఔషధాల ద్వారా క్షయను పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

చైనాలో తగ్గిపోతున్న వివాహాలు

→ చైనాలో రానురానూ పెళ్లిళ్లు తగ్గిపోతున్నాయి. అనేక కారణాల వల్ల యువత పరిణయానికి మొగ్గు చూపడం లేదు.
→ 2021లో గత 36 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో దేశంలో జననాల రేటు మరింత పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
→ చైనాలో గత ఐదేళ్లుగా జననాలు తగ్గిపోతున్నాయని.. గత ఏడాది దేశ జనాభా కేవలం 4,80,000 మేర పెరిగిందని జాతీయ గణాంక బ్యూరో (ఎన్‌బీఎస్‌) వెల్లడించింది.
→ దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడినవారి సంఖ్య పెరిగిపోతూ పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో మున్ముందు పనిచేసే వయోజనులకు కొరత ఎదురై, అది దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుందన్న ఆందోళన పెరుగుతోంది. గత మూడేళ్లుగా చైనాలో పెళ్లి చేసుకోవడానికి పలువురు అంతగా ఆసక్తి చూపడం లేదు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్నిచోట్లా పెళ్లి ఖర్చులు, కన్యాశుల్కాలు పెరిగిపోతున్నాయి.
→ పిల్లలను పెంచడానికి, వారిని చదివించడానికి బోలెడు డబ్బు పోయాల్సి వస్తోంది. అందువల్ల చైనాలో యువకులు, యువతులు పెళ్లిని వాయిదా వేసుకొంటున్నారు.
→ అలాగే యువతులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ, మంచి ఉపాధిని వెతుక్కుంటూ పెళ్లిని వాయిదా వేస్తున్నారు. రోజురోజుకీ యువతీయువకుల సగటు వివాహ వయసు పెరిగిపోతోంది.
→ ఉదాహరణకు వెనుకబడిన అన్‌హుయీ రాష్ట్రంలో 2008లో సగటున 26 ఏళ్లకే యువతీ యువకులు పెళ్లి చేసుకోగా ప్రస్తుతం 33 ఏళ్లు దాటితే గానీ పెళ్లవడం లేదు.
→ బీజింగ్, షాంఘై వంటి మహా నగరాల్లో సగటు వివాహ వయసు మరింత ఎక్కువే ఉంటుందని అంచనా. జపాన్, దక్షిణ కొరియాలలోనూ ఇంత ఆలస్యపు పెళ్లిళ్లు లేవు.