క్రీడలు

ఆసీస్‌కు ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఏడోసారి ప్రపంచకప్‌ను గెలుపొందింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలీసా హీలీ (170; 138 బంతుల్లో 26×4) ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుతో చెలరేగిన వేళ.. ఆసీస్‌ 71 పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మొదట ఆసీస్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్‌ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. ఈ ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ (లీగ్‌ దశలో 7, సెమీస్, ఫైనల్‌) నెగ్గిన ఆసీస్‌ అజేయంగా టోర్నీని ముగించింది. ‣ మహిళల ప్రపంచకప్‌లలో ఏడుసార్లు ఫైనల్స్‌ చేరుకున్న ఆసీస్‌ విజేతగా నిలవడమిది ఆరోసారి (1982, 1988, 1997, 2005, 2013, 2022). 1978లో పాయింట్ల ఆధారంగా ఆ జట్టు టైటిల్‌ గెలిచింది.

ప్రపంచకప్‌ ఫైనల్‌ రిఫరీగా లక్ష్మి

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరలేదు. కానీ టైటిల్‌ పోరులో భారత్‌కు చెందిన జీఎస్‌ లక్ష్మి కీలక పాత్ర పోషించనుంది. ఈ ఆంధ్రప్రదేశ్‌ మహిళ..ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తుదిపోరుకు మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరిస్తుంది. ఐసీసీ మ్యాచ్‌ రిఫరీల అంతర్జాతీయ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న తొలి మహిళగానూ ఆమె చరిత్ర సృష్టించింది. 2020లో ప్రపంచకప్‌ లీగ్‌-2 మ్యాచ్‌కు రిఫరీగా పని చేసిన లక్ష్మి పురుషుల వన్డేల్లో ఆ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ ఫైనల్లో రిఫరీగా కర్తవ్యాన్ని కొనసాగించనుంది. క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా ఈ పోరుకు లక్ష్మితో సహా నలుగురు ఆడవాళ్లు మ్యాచ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. లారెన్‌ (దక్షిణాఫ్రికా), కిమ్‌ కాటన్‌ (న్యూజిలాండ్‌) మైదాన అంపైర్లుగా.. జాక్వెలిన్‌ (వెస్టిండీస్‌) టీవీ అంపైర్‌. 2020 మహిళల టీ20 ప్రపంచకప్‌లో కాటన్‌ మైదాన అంపైర్‌గా పని చేసింది. 2020లో పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌కు మూడో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జాక్వెలిన్‌.. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచింది.

విక్టోరియాలో 2026 కామన్వెల్త్‌ క్రీడలు

2026 కామన్వెల్త్‌ క్రీడలకు విక్టోరియా ఆతిథ్యమివ్వనుంది. ఈ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో క్రీడలు జరుగుతాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద క్రీడా ఈవెంట్లు ఒక్క నగరంలోనే జరుగుతాయి. కానీ కామన్వెల్త్‌ క్రీడలు అందుకు భిన్నం. 2026 మార్చిలో జరిగే ఈ క్రీడలకు మెల్‌బోర్న్, గీలాంగ్, బెండిగో, బెండిగో, బల్లార్ట్‌ తదితర నగరాలు ఆతిథ్యమిస్తాయి. అన్ని చోట్లా క్రీడా గ్రామాలు ఉంటాయి. లక్ష మంది ప్రేక్షక సామర్థ్యం గల మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో ప్రారంభోత్సవం జరుగుతుందని కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) ప్రకటించింది. ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో ఏ ఆటలుండాలన్న దానికి సంబంధించి ప్రాథమికంగా 16 క్రీడలతో ఓ జాబితాను సిద్ధం చేశారు. ఇందులో టీ20 క్రికెట్‌ ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ జాబితాలో మరికొన్ని క్రీడలను చేరుస్తారు. ప్రస్తుతానికి షూటింగ్, రెజ్లింగ్, ఆర్చరీ ఈ జాబితాలో లేవు.

ఆసియా బ్యాడ్మింటన్‌లో సింధుకి కాంస్యం

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్టార్‌ షట్లర్‌ సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ సింధు 21-13, 19-21, 16-21తో టాప్‌ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌) చేతిలో ఓడింది. తన శైలిలో స్మాష్‌లు, క్రాస్‌ కోర్టు షాట్లతో పాయింట్లు విరుచుకుపడి ప్రత్యర్థి అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ ఆమెదే జోరు. 11-6తో విరామానికి వెళ్లిన సింధు బ్రేక్‌ తర్వాతా జోరు కొనసాగించింది. 14-11 ఆధిక్యంలో ఉన్న దశలో సర్వీస్‌ ఆలస్యం చేస్తుందన్న కారణంతో రిఫరీ సింధుకు ఒక పాయింట్‌ పెనాల్టీ విధించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో యమగూచి ఆధిపత్యం ప్రదర్శించింది. సింధు ఓటమితో ఈ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.

ఆర్మ్‌స్ట్రాంగ్‌ ప్రపంచ రికార్డు

అమెరికా యువ స్విమ్మర్‌ హంటర్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నార్త్‌కరోలినా వేదికగా జరిగిన అంతర్జాతీయ టామ్‌ ట్రయల్స్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్‌ సత్తాచాటాడు. బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం జరిగిన ఈ సన్నాహక పోటీల్లో 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ రేసును ఆర్మ్‌స్ట్రాంగ్‌ రికార్డు స్థాయిలో 23.71 సెకన్లలో ముగించాడు. ఈ క్రమంలో రష్యా స్విమ్మర్‌ క్లిమెంట్‌ కొలెస్నికోవ్‌ (23.80సె) రికార్డు హంటర్‌ తిరగరాశాడు. గతంలో జరిగిన ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌తో 100 మీటర్ల మెడ్లె రేసులోనూ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పసిడి పతకంతో మెరిశాడు.

భారత జట్టుకు 12వ స్థానం

ఇటలీలోని లొనాటోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచకప్‌లో భారత స్కీట్‌ జట్టుకు 12వ స్థానం లభించింది. పురుషుల స్కీట్‌ టీమ్‌ క్వాలిఫికేషన్లో మైరాజ్‌ అహ్మద్‌ఖాన్, గుర్‌జ్యోత్, పరమ్‌పాల్‌ సింగ్‌లతో కూడిన భారత్‌ 225 పాయింట్లకు 203 పాయింట్లే సాధించి పన్నెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్‌ ఒక్క పతకమే గెలిచింది.

మరియా జాతీయ రికార్డు

ఖేలో ఇండియా క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్‌ ఆన్‌ మరియా మంగళూర్‌ విశ్వవిద్యాలయం తరపున బరిలో దిగిన ఆమె +87 కేజీల విభాగం క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 129 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో మన్‌ప్రీత్‌ కౌర్‌ నమోదు చేసిన రికార్డు (128)ను ఆమె తిరగరాసింది. స్నాచ్‌లో 101 కేజీలు ఎత్తిన మరియా మొత్తం 230 కేజీల ప్రదర్శనతో పసిడి సొంతం చేసుకుంది. స్నాచ్, క్లీన్‌ అండ్‌ జర్క్‌ కలిపి ఓవరాల్‌ ప్రదర్శనలో జాతీయ రికార్డు (231 కేజీలు) మరియా పేరు మీదే ఉంది. బ్యాడ్మింటన్‌ పురుషుల, మహిళల టీమ్‌ విభాగాల్లో స్వర్ణాలను జైన్‌ విశ్వవిద్యాలయం సొంతం చేసుకుంది. మహిళల బాస్కెట్‌బాల్‌ తుదిపోరులో మద్రాస్‌ విశ్వవిద్యాలయం 65-48 తేడాతో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంపై విజయం సాధించింది. ప్రస్తుతానికి 10 స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో పతకాల పట్టికలో జైన్‌ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో కొనసాగుతోంది.

2022 అతి పిన్న వయసు ఆటగాడిగా కార్లోస్‌ అల్కారజ్‌ రికార్డు

17 ఏళ్ల క్రితం 2005లో 18 ఏళ్ల వయసులో నాదల్‌ తొలిసారి బార్సిలోనా ఓపెన్‌ నెగ్గి మొదటిసారి ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. తొలి పది స్థానాల్లోపు చోటు దక్కించుకున్న పిన్న వయసు ఆటగాడిగా అప్పుడు రికార్డు సృష్టించాడు. ఇప్పుడు 2022లో సరిగ్గా 18 ఏళ్ల వయసులోనే స్పెయిన్‌కే చెందిన కార్లోస్‌ అల్కారజ్‌ తాజాగా తొలిసారి బార్సిలోనా ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న అతను మొదటి సారి తొలి పది ర్యాంకుల్లోపు స్థానం సాధించాడు. నాదల్‌ తర్వాత ఆ ఘనత సాధించిన అతి పిన్న వయసు ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫైనల్లో 6-3, 6-2 తేడాతో తన దేశానికే చెందిన పాబ్లోపై గెలిచిన కార్లోస్‌ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతనికి ఈ సీజన్లో ఇది మూడో టైటిల్‌.

జాతీయ సీనియర్, అంతర్‌ రాష్ట్ర టీటీ ఛాంపియన్‌గా శ్రీజ

తెలంగాణ యువ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. 23 ఏళ్ల శ్రీజ జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. రాష్ట్రం నుంచి ఆ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నమోదు చేసింది. మహిళల సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ టైటిల్‌నూ ఖాతాలో వేసుకుంది. జాతీయ సీనియర్, అంతర్‌ రాష్ట్ర టీటీ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆమె 4-1 (11-8, 11-13, 12-10, 11-8, 11-6) తేడాతో మౌమా దాస్‌ (పీఎస్‌పీబీ)పై గెలిచింది. ‣ పురుషుల సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ రికార్డు స్థాయిలో పదోసారి జాతీయ టైటిల్‌ దక్కించుకున్నాడు. ఫైనల్లో 39 ఏళ్ల అతను 4-3 (7-11, 12-10, 9-11, 7-11, 12-10, 11-9, 11-6)తో సత్యన్‌పై గెలిచాడు. పురుషుల డబుల్స్‌ ట్రోఫీని సౌరవ్‌ - వెస్లీ ద్వయం కైవసం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆకాø Â- ప్రాప్తి జోడీ విజేతగా నిలిచింది.

ఖేలో ఇండియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో వరుణ్‌కు స్వర్ణం, గణేష్‌కు రజతం

ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో తెలుగు కుర్రాళ్లు వరుణ్‌ రాగాల, శ్రీనివాస్‌ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరపున బరిలో దిగిన వరుణ్‌ 81 కేజీల విభాగంలో పసిడి గెలిచాడు. స్నాచ్‌లో 127, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 150.. మొత్తం 277 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పోటీపడ్డ శ్రీనివాస్‌ అదే విభాగంలో రజతం అందుకున్నాడు. 275 కేజీల (స్నాచ్‌లో 120, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 155) ప్రదర్శనతో అతను రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా వెర్‌స్టాపెన్‌

ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్, ఒలింపిక్‌ స్ప్రింట్‌ క్వీన్‌ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా 2022 లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో అత్యుత్తమ పురస్కారాలు పొందారు. వెర్‌స్టాపెన్‌ ‘వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెలుచుకున్నాడు. హెరా ‘వరల్డ్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును సొంతం చేసుకుంది. టెన్నిస్‌ స్టార్‌ రదుకాను ‘బ్రేక్‌త్రూ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని అందుకుంది. ఇటలీ పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ‘వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైంది.

సెర్బియా ఓపెన్‌లో రుబ్లెవ్‌కు టైటిల్‌

రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్‌ సెర్బియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్‌ రుబ్లెవ్‌ 6-2, 6-7 (4), 6-0తో జొకోవిచ్‌పై విజయం సాధించాడు. ఈ సీజన్‌లో రుబ్లెవ్‌కు ఇది మూడో టైటిల్‌.

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

భారత ఆర్చర్లు తరుణ్‌దీప్‌ రాయ్, రిధి ఫార్‌ ప్రపంచకప్‌ స్టేజ్‌- 1 పోటీల్లో దేశానికి మరో స్వర్ణాన్ని అందించారు. తొలిసారి జతకట్టి మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో బరిలో దిగిన తరుణ్‌దీప్‌ - రిధి జోడీ ఫైనల్లో షూటాఫ్‌లో గ్రేట్‌ బ్రిటన్‌పై విజయం సాధించింది. పసిడి పోరులో రెండు సార్లు వెనకబడ్డప్పటికీ అద్భుతంగా పుంజుకున్న ఈ భారత జంట 5-4 (35-37, 36-33, 39-40, 38-37, షూటాఫ్‌లో 18-17) తేడాతో పిట్‌మన్‌ - అలెక్స్‌పై నెగ్గి తమ తొలి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 38 ఏళ్ల తరుణ్‌దీప్‌కు ఇదే మొదటి ప్రపంచకప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణం. మరోవైపు 17 ఏళ్ల రిధికి ఇదే తొలి ప్రపంచకప్‌ పసిడి. మొత్తానికి ఈ ప్రపంచకప్‌ పోటీలను భారత్‌ రెండు స్వర్ణాలతో ముగించింది. ఇప్పటికే కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ శర్మ, రజత్, అమన్‌ సైని త్రయం బంగారు పతకం సాధించారు.

దీపక్‌ పునియాకు రజతం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు దీపక్‌ పునియా రజతం నెగ్గాడు. 86 కేజీల ఫైనల్లో దీపక్‌ 1-6తో అజ్మత్‌ దౌలెత్‌ బెకోవ్‌ (కజకిస్తాన్‌) చేతిలో పరాజయం పొందాడు. ఆసియా టోర్నీలో దీపక్‌కు ఇది నాలుగో పతకం. 2021లో రజతం, 2019, 2020లలో రెండు కాంస్యాలు సాధించాడు. 92 కేజీలలో విక్కీ చాహర్‌ కాంస్యం నెగ్గాడు. కాంస్య పతక పోరులో విక్కీ 5-3తో అజినియాజ్‌ సపర్నియజోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో భారత్‌ మొత్తం 17 పతకాలు సాధించింది. రవి దహియా ఒక్కడే స్వర్ణం సాధించాడు.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రవి దహియాకు మూడో స్వర్ణం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రవి దహియా 57 కిలోల విభాగంలో వరుసగా మూడో ఏడాది పసిడిని సాధించాడు. ఈ క్రీడల్లో హ్యాట్రిక్‌ స్వర్ణం సాధించిన భారత తొలి రెజ్లర్‌గా రవి రికార్డు సృష్టించాడు. ఈ స్టార్‌ రెజ్లర్‌ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో రఖత్‌ కాల్‌జాన్‌ (కజకిస్థాన్‌)పై 12-2తో విజయం సాధించాడు. 2020లో దిల్లీలో తొలిసారి పసిడి గెలిచిన రవి గతేడాది ఆల్మాటిలోనూ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన దహియాకు ఈ సీజన్లో ఇది రెండో పతకం. ఫిబ్రవరిలో డాన్‌ కొలోవ్‌ టోర్నీలో అతడు రజతం నెగ్గాడు. బజ్‌రంగ్‌ పునియా రహ్మాన్‌ ముసా (ఇరాన్‌)తో ఫైనల్లో 1-3తో ఓడాడు. దీంతో అతను రజతం నెగ్గాడు. ఈ టోర్నీలో పతకం గెలవడం అతడికి ఇది ఎనిమిదోసారి. మరోవైపు గౌరవ్‌ బలియాన్‌ (79 కేజీలు) రజతం గెలవగా, నవీన్‌ (70 కేజీలు), సత్యవర్త్‌ కడియన్‌ (97 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు.

ప్రపంచకప్‌ ఆర్చరీలో భారత కాంపౌండ్‌ జట్టుకు స్వర్ణం

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-1 టోర్నమెంట్లో భారత కాంపౌండ్‌ జట్టు స్వర్ణంతో మెరిసింది. తుదిపోరులో అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, అమన్‌ సైనిలతో కూడా భారత జట్టు 232-231తో ఫ్రాన్స్‌ (క్వింటిన్, జీన్‌ ఫిలిప్, అడ్రియన్‌)పై విజయం సాధించింది. 2017 షాంఘైలో పసిడి గెలిచిన తర్వాత ప్రపంచకప్‌లో పురుషుల కాంపౌండ్‌ జట్టు స్వర్ణం గెలవడం ఇదే తొలిసారి.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అన్షు మలిక్‌ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) చెరో రజతం నెగ్గారు. మనీష (62 కేజీలు) కాంస్యం సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన 20 ఏళ్ల అన్షు తుదిపోరులో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఫైనల్లో ఆమె సుగుమి సకురాయ్‌ (జపాన్‌) చేతిలో ఓడింది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆమెకిది మూడో పతకం. 2020లో కాంస్యం గెలిచిన తను గతేడాది పసిడి నెగ్గింది. మరోవైపు నాలుగు బౌట్లకు గాను మూడింట్లో జయకేతనం ఎగరేసిన రాధిక వెండి పతకం దక్కించుకుంది. ముగ్గురిని చిత్తుచేసిన తను స్వర్ణ విజేత మొరికావా (జపాన్‌) చేతిలో ఓడింది. ఇక కాంస్య పతక పోరులో మనీష హన్‌బిట్‌ లీ (కొరియా)ని ఓడించింది.

ఐసీసీ జీఎంగా వసీంఖాన్‌

ఐసీసీ కొత్త క్రికెట్‌ జనరల్‌ మేనేజర్‌గా పాకిస్థాన్‌కు చెందిన వసీం ఖాన్‌ నియమితుడయ్యాడు. జెఫ్‌ అలార్‌డైస్‌ స్థానంలో వసీం ఈ పదవిని చేపట్టనున్నాడు. గతంలో అతడు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ముఖ్య కార్య నిర్వాహణాధికారిగా సేవలందించాడు. మేలో జీఎంగా పదవి బాధ్యతలు చేపట్టనున్న ఖాన్, లీసెస్టర్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌కు సీఈవో కూడా విధులు నిర్వర్తించాడు.

అత్యంత పిన్న వయసు షట్లర్‌గా ఉన్నతి హుడా రికార్డు

బ్యాడ్మింటన్‌ టీనేజీ సంచలనం ఉన్నతి హుడా ఈ ఏడాది ఆసియా క్రీడలకు ఎంపికైంది. 14 ఏళ్ల ఈ రోహ్‌తక్‌ బాలిక ఆసియా క్రీడల బృందంలో అత్యంత పిన్న వయసు కలిగిన భారత షట్లర్‌గా నిలిచింది. ఆసియా, కామన్వెల్త్‌ క్రీడలు, థామస్‌ అండ్‌ ఉబర్‌ కప్‌లో పాల్గొనే షట్లర్ల ఎంపిక కోసం భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఆరు రోజుల సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో ప్రదర్శన ఆధారంగా పైన పేర్కొన్న మూడు టోర్నీలకు జట్లను ప్రకటించింది. మహిళల సింగిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన ఉన్నతి ఆసియా క్రీడలతో పాటు ఉబర్‌ కప్‌నకు ఎంపికైంది. అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్‌ జట్లను నడిపించనున్నారు. మరోవైపు గాయత్రి పుల్లెల - ట్రీసా జోడీ ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి ఈ మూడు టోర్నీల్లో పోటీపడే జట్లలో చోటు దక్కించుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-15 లోపు ఉన్న సింధు, లక్ష్యసేన్, శ్రీకాంత్, సాత్విక్‌ - చిరాగ్‌ జోడీ నేరుగా పోటీపడే అవకాశం కలిగింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 23వ ర్యాంకులో ఉన్నప్పటికీ ఇటీవల అతని ఉత్తమ ప్రదర్శన కారణంగా ట్రయల్స్‌తో సంబంధం లేకుండా తననూ తీసుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సైనా కూడా 23వ ర్యాంకులోనే ఉంది. మరోవైపు 40 మంది (20 చొప్పున మహిళలు, పురుషులు) షట్లర్లను సీనియర్‌ జాతీయ శిక్షణ శిబిరానికి, 2024 ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేలా ప్రధాన బృందంగా ఎంపిక చేశారు. ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడలు (జులై 28 - ఆగస్టు 8) బర్మింగ్‌హామ్‌లో, ఆసియా క్రీడలు (సెప్టెంబర్‌ 10 - 25) చైనాలో, థామస్‌ అండ్‌ ఉబర్‌ కప్‌ (మే 8 - 15) బ్యాంకాక్‌లో జరగబోతున్నాయి.

విజ్డెన్‌ మేటి క్రికెటర్లుగా రోహిత్, బుమ్రా

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ బుమ్రా 2022కి గాను విజ్డెన్‌ ప్రకటించిన ఈ ఏటి మేటి క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతేడాది ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని విజ్డెన్‌ అయిదుగురు క్రికెటర్లను ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది. అందులో రోహిత్, బుమ్రాతో పాటు డెవాన్‌ కాన్వే (న్యూజిలాండ్‌), ఇంగ్లాండ్‌ పేసర్‌ రాబిన్సన్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్‌ వాన్‌ నీకెర్క్‌ ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ ప్రపంచంలోనే మేటి క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ లిజెల్లీ లీ మేటి మహిళా క్రికెటర్‌గా, పాకిస్థాన్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ మేటి టీ20 క్రికెటర్‌గా నిలిచారు.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సుష్మా, సరితలకు కాంస్యం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సరిత మోర్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. 59 కేజీల విభాగంలో మరోసారి స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో బరిలో దిగిన ఆమె చివరకు కాంస్యం నెగ్గింది. అయిదుగురు రెజ్లర్లు మాత్రమే పోటీపడ్డ ఈ విభాగంలో రెండు బౌట్లలో ఓడి, మరో రెండింట్లో గెలిచిన ఆమె మూడో స్థానంలో నిలిచింది. షూవ్‌దార్‌ (మంగోలియా), సారా (జపాన్‌) చేతుల్లో ఆమె పరాజయం పాలైంది. ఆ తర్వాత పుంజుకుని వరుసగా డిల్ఫుజా (ఉజ్బెకిస్థాన్‌), డయనా (కజకిస్థాన్‌)పై విజయాలు సాధించింది. 55 కేజీల విభాగంలో సుష్మా కూడా కంచు పతకం సొంతం చేసుకుంది.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు కాంస్యాలు చేరాయి. గ్రీకో రోమన్‌ విభాగంలో సచిన్‌ (67 కేజీలు), హర్‌ప్రీత్‌ సింగ్‌ (82) చెరో కంచు పతకం సొంతం చేసుకున్నారు. కాంస్య పతక పోరులో భక్షిలోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)పై సచిన్‌ గెలిచాడు. ప్రత్యర్థిని మ్యాట్‌పై పడేసి పైకి లేవకుండా గట్టిగా అదిమి పట్టి అతను విజయం సాధించాడు. మరోవైపు గాయం కారణంగా జాఫర్‌ ఖాన్‌ (ఖతార్‌) బరిలో దిగకపోవడంతో హర్‌ప్రీత్‌కు పతకం దక్కింది. 60 కేజీల విభాగం కాంస్య పతక పోరులో జ్ఞానేంద్ర, అయాట సుజుకి (జపాన్‌) చేతిలో ఓడాడు. ఈ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో దేశం తరపున రెండో అత్యుత్తమ ప్రదర్శన చేశారు.

కరాటెలో కార్తీక్‌కు స్వర్ణం

యుఎస్‌ఏ ఓపెన్‌ కరాటె ఛాంపియన్‌షిప్‌లో ఏపీ బాలుడు కార్తీక్‌ రెడ్డి మెరిశాడు. దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన అతను 12-13 ఏళ్ల బాలుర టీమ్‌ కుమితె విభాగంలో పసిడి అందుకున్నాడు. కార్తీక్‌తో పాటు మరో ఇద్దరితో కూడిన జట్టు ఉత్తమ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో క్రొయేషియాలో జరిగే ప్రపంచ యూత్‌ లీగ్‌ క్రీడల్లో పోటీ పడే అవకాశం కార్తీక్‌ దక్కించుకున్నాడు. 18-34 ఏళ్ల పురుషుల ఖాటాలో అపూర్వ్‌ పసిడి నెగ్గాడు. మహిళల ఎలైట్‌ ఓపెన్‌ కుమితె (18-34 ఏళ్ల), 68 కేజీల విభాగాల్లో కలిపి భువనేశ్వరి రెండు కాంస్యాలు ఖాతాలో వేసుకుంది. 18-34 ఏళ్ల టీమ్‌ ఖాటా విభాగంలో స్వర్ణం గెలిచిన భారత్‌ 8-9 ఏళ్ల బాలుర టీమ్‌ కుమితె, 16+ పురుషుల ఎలైట్‌ టీమ్‌ ఖాటాలో కాంస్యాలు సాధించింది. పారా క్రీడాకారుడు కార్తీకేయ రెండు స్వర్ణాలు, ఓ రజతం సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు పొలార్డ్‌ వీడ్కోలు

వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌ లాంటి లీగ్‌ల్ల్లో మాత్రం అతడు ఆడతాడు. 2007లో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ తన చివరి సిరీస్‌ను ఇటీవల భారత్‌తో ఆడాడు. టీ20ల్లో భీకర బ్యాట్స్‌మన్‌గా పేరున్నా వెస్టిండీస్‌ తరఫున అతడి రికార్డు మాత్రం గొప్పగా లేదు. 34 ఏళ్ల పొలార్డ్‌ 123 వన్డేల్లో 26.01 సగటుతో 2706 పరుగులు చేశాడు. 55 వికెట్లు పడగొట్టాడు. 101 టీ20ల్లో 25.30 సగటుతో 1569 పరుగులు సాధించిన అతడు 42 వికెట్లు చేజిక్కించుకున్నాడు. పొలార్డ్‌ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2012లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. పొలార్డ్‌ ఎప్పుడూ టెస్టు క్రికెట్‌ ఆడలేదు.

రష్యా క్రీడాకారులపై వింబుల్డన్‌ నిషేధం

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది వింబుల్డన్‌లో రష్యా, బెలారస్‌ క్రీడాకారులను అనుమతించమని ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ ప్రకటించింది. దీంతో ప్రపంచ నంబర్‌-2 మెద్వెదెవ్‌ సహా అనేక మంది రష్యా క్రీడాకారులు వింబుల్డన్‌కు దూరం కానున్నారు. అలాగే బెలారస్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా కూడా ఈ టోర్నీలో ఆడలేని పరిస్థితి. ఇప్పటికే అనేక క్రీడా సంఘాలు రష్యా అథ్లెట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. యుద్ధంలో రష్యాకు బెలారస్‌ సహకరిస్తోంది. వింబుల్డన్‌ జూన్‌ 27న మొదలువుతుంది.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. గ్రీకో రోమన్‌ రెజ్లర్లు సునీల్‌కుమార్, అర్జున్‌ హళకుర్కి, నీరజ్‌ కాంస్య పతకాలు సాధించారు. 87 కేజీలలో సునీల్‌ 5-0తో బత్బయార్‌ లుత్బయార్‌ (మంగోలియా)పై, 55 కేజీలలో అర్జున్‌ 10-7తో ముంఖ్‌ ఎర్డెన్‌ (మంగోలియా)పై, 63 కేజీలలో నీరజ్‌ 7-4తో బఖ్రమోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచి కాంస్యాలు నెగ్గారు.

బెంగళూరు మారథాన్‌ ప్రచారకర్తగా గాట్లిన్‌

ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణ పతక విజేత జస్టిన్‌ గాట్లిన్‌ ప్రపంచ 10కె బెంగళూరు మారథాన్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. మే 15న ఈ రేసు జరగనుంది. ఈ అమెరికా స్టార్‌ స్ప్రింటర్‌ భారత్‌కు రాబోతుండడం ఇదే తొలిసారి. రూ.కోటి 60 లక్షల ప్రైజ్‌మనీతో భారీగా నిర్వహిస్తున్న ఈ రేసులో ప్రపంచ స్థాయి రన్నర్లతో పాటు భారత్‌ నుంచి భారీగా అథ్లెట్లు పాల్గొనే అవకాశం ఉంది. 2004 ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో పసిడి గెలిచిన గాట్లిన్‌ నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచాడు. ఒలింపిక్స్‌ (5), ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ (12)లలో కలిపి అతడు 17 పతకాలు నెగ్గాడు.

ఆసియా వెయిట్‌లిప్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జిలీకి స్వర్ణం

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్‌ జిలీ దలాబెహరా స్వర్ణం సాధించింది. మహిళల 45 కేజీల విభాగం పోటీలో పాల్గొన్న ఆమె స్నాచ్‌లో 69 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 88 కేజీలు కలిపి మొత్తం 157 కేజీలు లిఫ్ట్‌ చేసి అగ్రస్థానంలో నిలిచింది. 2019 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో జిలి రజతం గెలిచింది. మరో భారత లిఫ్టర్‌ స్నేహ సోరెన్‌ (55 కేజీలు) కాంస్య పతాకాన్ని సాధించింది. స్నాచ్‌లో 71 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 93 కేజీలు కలిపి మొత్తం 164 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మీరాబాయి చాను (49 కేజీలు) క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ కాంస్యం గెలుచుకుంది.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో దీపక్‌కు రజతం

భారత యువ ఆటగాడు దీపక్‌ పునియా ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. పురుషుల 86 కేజీల విభాగంలో ఫైనల్లో ఇరాన్‌ దిగ్గజ రెజ్లర్‌ హసన్‌ యజ్దనిచరాతి చేతిలో ఓడిపోయాడు. 92 కేజీల విభాగంలో సంజీత్‌ కాంస్యం గెలిచాడు. కాంస్య పోరులో 11-8తో రుస్తమ్‌ షోదీవ్‌పై నెగ్గాడు.

రొమాగ్నా గ్రాండ్‌ప్రి టైటిల్‌ విజేత వెర్‌స్టాపెన్‌

రొమాగ్నా గ్రాండ్‌ప్రి పోటీలో రెడ్‌బుల్‌ స్టార్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. పోల్‌ పొజిషన్‌లో జోరు మీదున్న హామిల్టన్‌ (మెర్సిడెజ్‌)ను వెర్‌స్టాపెన్‌ వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. వెర్‌స్టాపెన్‌ 63 ల్యాప్స్‌లో 25 పాయింట్లు, హామిల్టన్‌ 19 పాయింట్లు సాధించారు. ఈ సీజన్లో మ్యాక్స్‌కు ఇదే తొలి టైటిల్‌. ఓవరాల్‌గా ఇది 11వ ట్రోఫీ. ఈ రేసులో లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) మూడో స్థానంలో నిలిచాడు.

డానిష్‌ స్విమ్మింగ్‌ ఓపెన్లో వేదాంత్‌కు పసిడి

డానిష్‌ స్విమ్మింగ్‌ ఓపెన్లో రజతంతో సత్తా చాటిన సినీ నటుడు మాధవన్‌ తనయుడు వేదాంత్, అదే టోర్నీలో పసిడి పతకంతో మెరిశాడు. డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హెగెన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రేసులో వేదాంత్‌ 8 నిమిషాల 17.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో స్థానిక ఆటగాడు అలెగ్జాండర్‌ను 0.10 సెకన్ల తేడాతో వేదాంత్‌ వెనక్కి నెట్టాడు. ఇదే టోర్నీలో 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో 16 ఏళ్ల వేదాంత్‌ రజతం గెలిచాడు. 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో భారత స్టార్‌ సాజన్‌ ప్రకాశ్‌ 54.24 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అయిదో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న 28 ఏళ్ల సాజన్‌.. డానిష్‌ ఓపెన్లో 200 మీటర్ల బటర్‌ఫ్లైలో స్వర్ణం గెలిచాడు.

డానిష్‌ ఓపెన్‌లో వేదాంత్‌ మాధవన్‌కు రజతం

సినీ నటుడు మాధవన్‌ తనయుడు వేదాంత్‌ మాధవన్‌ స్విమ్మింగ్‌లో మరోసారి సత్తా చాటాడు. డానిష్‌ ఓపెన్‌లో అతడు రజతం గెలుచుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో 15 నిమిషాల 57.86 సెకన్లలో లక్ష్యాన్ని చేరి వేదాంత్‌ రెండో స్థానంలో నిలిచాడు. పదహారేళ్ల వేదాంత్‌ గతేడాది మార్చిలో లాత్వియా ఓపెన్లో కాంస్యంతో మెరిశాడు. మరోవైపు 200 మీటర్ల బటర్‌ఫ్లైలో సాజన్‌ ప్రకాశ్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. అతడు ఒక నిమిషం 59.27 సెకన్లలో రేసు పూర్తి చేశాడు.

జపాన్‌పై భారత్‌ విజయం

భారత జట్టు జూనియర్‌ డేవిస్‌ కప్‌ ఆసియా/ఓసియానియా ఫైనల్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ విజేతగా నిలిచింది.ఫైనల్లో 2-1తో జపాన్‌ను ఓడించింది. సింగిల్స్‌లో భూషణ్‌ ఓడడంతో 0-1తో వెనుకబడ్డ భారత్‌.. ఆ తర్వాత పుంజుకుంది. రుషిల్‌ 6-3, 3-6, 6-0తో యుతాపై నెగ్గగా.. డబుల్స్‌లో రుషిల్, భూషణ్‌ 6-3, 6-4తో జపాన్‌ జోడీని ఓడించారు.

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ హాకీ లీగ్‌

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ హాకీ లీగ్‌లో స్వదేశీ అంచె పోటీలను భారత్‌ విజయంతో ముగించింది. రెండు మ్యాచ్‌ల సమరంలో భాగంగా జర్మనీతో రెండో మ్యాచ్‌లో భారత్‌ 3-1 గోల్స్‌తో నెగ్గింది. ఈ విజయంతో 12 మ్యాచ్‌ల్లో 27 పాయింట్లతో ప్రొ లీగ్‌లో అగ్రస్థానాన్ని భారత్‌ పటిష్టం చేసుకుంది. జర్మనీ (10 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది.

హాకీ ప్రపంచకప్‌ లోగో ఆవిష్కరణ

ఎఫ్‌ఐహెచ్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌ లోగోను ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆవిష్కరించారు. 2023 జనవరి 13 నుంచి 29 వరకు ఈ ప్రపంచకప్‌ జరుగుతుంది. హాకీ ఇండియా, దాని అధికారిక భాగస్వామి ఒడిషా రాష్ట్రం ఈ ప్రపంచకప్‌నకు వరుసగా రెండోసారి ఆతిథ్యమిస్తున్నాయి. 2018 ప్రపంచకప్‌ కూడా భారత్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. 2023లో భువనేశ్వర్‌తో పాటు దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఉన్న రూర్కేలాలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 20 వేల మంది ప్రేక్షక సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో మ్యాచ్‌లు జరుగుతాయి.

టీ20ల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన భారత రెండో ఆటగాడిగా రోహిత్‌ శర్మ ఘనత

టీ20ల్లో పది వేల పరుగులు పూర్తి చేసిన భారత రెండో ఆటగాడిగా రోహిత్‌ శర్మ ఘనత సాధించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు ఈ మైలురాయి చేరుకున్నాడు. విరాట్‌ కోహ్లి ముందే పది వేల మార్క్‌ అందుకున్నాడు. క్రిస్‌ గేల్, షోయబ్‌ మాలిక్, పొలార్డ్, ఆరోన్‌ ఫించ్, డేవిడ్‌ వార్నర్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

జాతీయ టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో రిత్విక్‌కు స్వర్ణం

జాతీయ టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏడు రౌండ్ల నుంచి 6.5 పాయింట్లు సాధించిన అతను వ్యక్తిగత స్వర్ణం గెలవడంతో పాటు తన జట్టు (ఏయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో ఓటమే ఎరుగని అతను ఆరు గేమ్‌ల్లో గెలిచి మరో గేమ్‌ డ్రాగా ముగించాడు. మరో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరత్‌కోటి కూడా ఈ జట్టు టైటిల్‌ సొంతం చేసుకోవడంలో తోడ్పడ్డాడు. రిత్విక్, హర్షతో పాటు మరో ముగ్గురితో కూడిన ఈ జట్టు.. టోర్నీ సాంతం నిలకడగా రాణించి ఛాంపియన్‌గా నిలిచింది.

అర్జున్‌కు రెండో స్థానం

జాతీయ అండర్‌-12 ఓపెన్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలుడు ఆదిరెడ్డి అర్జున్‌ రెండో స్థానంలో నిలిచాడు. 11 రౌండ్ల నుంచి తొమ్మిది పాయింట్లు సాధించిన అతను రన్నరప్‌ ట్రోఫీని అందుకున్నాడు. టోర్నీలో ఎనిమిది గేమ్‌ల్లో గెలిచిన అతను మరో రెండు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. ఒకదాంట్లో ఓటమి పాలయ్యాడు. గౌతమ్‌ కృష్ణ (కేరళ- 9.5) ఛాంపియన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు.

ఈ సీజన్‌తో పరుగు ఆపేస్తా: యుఎస్‌ అథ్లెట్‌ ఫెలిక్స్‌

ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన యుఎస్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన అలీసన్‌ ఫెలిక్స్‌ తన పరుగు ఆపనుంది. ఈ సీజన్‌తోనే ట్రాక్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు, తన కెరీర్‌కు 2022 చివరిదని ఆమె ప్రకటించింది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 400మీ. పరుగులో కాంస్యం, 4×400మీ. రిలేలో స్వర్ణం నెగ్గిన ఆమె.. తన ఒలింపిక్స్‌ పతకాల సంఖ్యను 11కు పెంచుకుంది. దీంతో ఆమె కార్ల్‌ లూయిస్‌ను వెనక్కినెట్టి అత్యధిక ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన అమెరికా రన్నర్‌గా రికార్డు నమోదు చేసింది. మొత్తం మీద ఆమె ఫిన్లాండ్‌ అథ్లెట్‌ పావో నుర్మి (12) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఫెలిక్స్‌ ఇప్పటివరకూ 13 స్వర్ణాలు సహా మొత్తం 18 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది యుఎస్‌ ఛాంపియన్‌షిప్స్‌ (జూన్‌), ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ (జులై) ఆమె పాల్గొనే చివరి ప్రధాన టోర్నీలు కానున్నాయి.

రెయిక్‌జావిక్‌ ఓపెన్‌ చెస్‌

భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ప్రతిష్ఠాత్మక రెయిక్‌జావిక్‌ ఓపెన్‌ చెస్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 9 రౌండ్ల నుంచి 7.5 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. చివరి రౌండ్లో అతడు సహచర ఆటగాడు గుకేశ్‌పై విజయం సాధించాడు. ఇది కాకుండా టోర్నీలో అతడు మరో అయిదు విజయాలు సాధించాడు. ప్రజ్ఞానంద ఒక్క గేమ్‌లోనూ ఓడిపోలేదు. అభిమన్యు మిశ్రా (7 పాయింట్లు) అయిదో స్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియా కోచ్‌గా మెక్‌డొనాల్డ్‌

ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ నియమితుడయ్యాడు. నాలుగేళ్ల కాలానికి అతడికి బాధ్యతలు అప్పగించారు. మెక్‌డొనాల్డ్‌ ఇప్పటివరకు ఆసీస్‌ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా పని చేశాడు. ఫిబ్రవరిలో జస్టిన్‌ లాంగర్‌ స్వల్పకాలానికి కాంట్రాక్ట్‌ పునురద్ధరణకు తిరస్కరించినప్పటి నుంచి మెక్‌డొనాల్డ్‌ తాత్కాలిక కోచ్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. మాజీ టెస్టు ఆల్‌రౌండర్‌ అయిన అతడికి ఐపీఎల్, ఇంగ్లిష్‌ కౌంటీ క్రికెట్లో ప్రధాన కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. లాంగర్‌ హయాంలో మెక్‌డొనాల్డ్‌ సీనియర్‌ సహాయ కోచ్‌గా ఉన్నాడు.

జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌

జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్‌ నాలుగో స్థానంతో ముగించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్‌ పెనాల్టీ షూటౌట్లో 0-3తో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి భారత్, ఇంగ్లాండ్‌ రెండేసి గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. భారత్‌ తరఫున ముంతాజ్‌ఖాన్‌ 21, 47 నిమిషాల్లో గోల్స్‌ కొట్టగా ఇంగ్లాండ్‌ జట్టులో గిగిలో (18వ ని), క్లాడియా (58వ ని) గోల్స్‌ చేశారు. పెనాల్టీ షూటౌట్లో సీనియర్లు షర్మిలా, కెప్టెన్‌ సలీమా టెట్, సంగీత కుమారి గోల్‌ చేయడంలో విఫలం కాగా ఇంగ్లాండ్‌ తరఫున కేట్‌ కర్టీస్, స్వెయిన్, మిడిల్‌ ఆక్స్‌ఫర్డ్‌ గోల్స్‌ చేసి జట్టును గెలిపించారు. మరోవైపు ప్రపంచకప్‌ టైటిల్‌ను నెదర్లాండ్స్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో నెదర్లాండ్స్‌ 3-1తో జర్మనీపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో భారత్, నెదర్లాండ్స్‌ చేతిలోనే ఓడింది.

ప్రపంచ జూనియర్‌ మహిళల హాకీ

ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శనతో సెమీస్‌ వరకు వచ్చిన భాతర జట్టు మూడుసార్లు ఛాంపియన్‌ నెదర్లాండ్స్‌ ముందు నిలవలేకపోయింది. సెమీస్‌లో భారత్‌ 0-3తో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలతో సెమీస్‌ చేరిన భారత్‌ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన నెదర్లాండ్స్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. 12వ నిమిషంలోనే టెసా బీట్స్‌మా గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన డచ్‌ జట్టును తర్వాతి రెండు క్వార్టర్లలో భారత్‌ నిలువరించినా చివరి క్వార్టర్లో రెండు నిమిషాల్లో రెండు గోల్స్‌ కొట్టిన ప్రత్యర్థి అలవోకగా విజయం సాధించింది. 53వ నిమిషంలో లూనా ఫోక్, 54వ నిమిషంలో జిప్‌ డికి గోల్స్‌ సాధించారు. ఈ మ్యాచ్‌ ఓడినప్పటికీ 2013 తర్వాత టోర్నీలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన.

ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌లో రెండు టైటిళ్లు

భారత స్క్వాష్‌ స్టార్‌ దీపికా పల్లికల్‌ తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. డబ్ల్యూఎస్‌ఎఫ్‌ ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు టైటిళ్లు గెలిచి అబ్బురపరిచింది. ఆమె మహిళల డబుల్స్‌లో జోష్న చిన్నప్పతో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సౌరభ్‌ ఘోషల్‌తో కలిసి విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో దీపిక - జోష్న జోడీ 11-9, 4-11, 11-8తో సారా జేన్‌ పెర్రీ - అలిసన్‌వాటర్స్‌ (ఇంగ్లాండ్‌) జంటపై విజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తుది పోరులో దీపిక - సౌరభ్‌ ద్వయం 11-6, 11-8తో అడ్రియన్‌ వాలర్‌ - అలిసన్‌ వాటర్స్‌ (ఇంగ్లాండ్‌) జోడీని ఓడించింది. 2018 అక్టోబరు తర్వాత దీపిక పాల్గొన్న పోటీ ఈవెంట్‌ ఇదే కావడం విశేషం. ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి.

ఐపీఎల్‌కు తగ్గిన వీక్షకుల సంఖ్య

ఐపీఎల్‌ 2023 - 2027 ప్రసార హక్కుల టెండర్‌కు ముందు బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోల్చుకుంటే మొదటి వారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్‌ నివేదిక ప్రకారం.. నిరుడు తొలి 8 మ్యాచ్‌లకు 3.75 టీవీ రేటింగ్‌ లభించగా ఈసారి ఆ సంఖ్య 2.52కే పరిమితమైంది. 2020 ఐపీఎల్‌లో తొలి వారం మ్యాచ్‌లకు 3.85 టీవీ రేటింగ్‌ వచ్చింది.

కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌: క్వార్టర్‌ ఫైనల్లో పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌

కొరియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించగా.. లక్ష్యసేన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఏప్రిల్‌ 7న జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ సింధు 21-15, 21-10తో అయా ఒహొరి (జపాన్‌)పై విజయం సాధించింది. మాళవిక బాన్సోద్‌ 8-21, 14-21తో పోర్న్‌పావీ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. ‣ పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అయిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21-18, 21-6తో మిషా జిల్బర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)పై నెగ్గాడు. ఆరో సీడ్‌ లక్ష్యసేన్‌ 20-22, 9-21తో షెసర్‌ హిరెన్‌ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. భారత నంబర్‌వన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. ‣ పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 21-15, 21-19తో యాంగ్‌ టెర్రీ- కీన్‌ హీన్‌ (సింగపూర్‌) జంటపై గెలిచింది. ‣ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప జంట 20-22, 21-18, 14-21తో షువాన్‌ యి- హువాంగ్‌ యా (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. ‣ ఏప్రిల్‌ 8న జరిగే క్వార్టర్స్‌లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు, సన్‌ వాన్‌హో (కొరియా)తో శ్రీకాంత్, మిన్యుక్‌- సూంగ్‌జే (కొరియా)తో సాత్విక్‌- చిరాగ్‌ తలపడతారు. సింధుకు 16-1తో బుసానన్‌పై మెరుగైన గెలుపోటముల రికార్డు ఉంది.

జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌లో ముంతాజ్‌ హ్యాట్రిక్‌

జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత్‌ పూల్‌ దశను ఘన విజయంతో ముగించింది. ఏకపక్షంగా సాగిన పూల్‌-డి ఆఖరి పోరులో భారత్‌ 4-0తో మలేసియాను చిత్తు చేసింది. ముంతాజ్‌ హ్యాట్రిక్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ముంతాజ్‌ కొట్టిన మూడు గోల్సూ ఫీల్డ్‌ గోల్సే కావడం విశేషం. మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పూల్‌లో భారత్‌ (9 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ 8న జరిగే క్వార్టర్‌ఫైనల్లో కొరియాతో మన జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో వేల్స్‌ను 5-1తో ఓడించిన భారత్‌ రెండో మ్యాచ్‌లో బలమైన జర్మనీకి 2-1తో షాకిచ్చింది.

డిస్కస్‌ త్రోలో 22 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టి ఘ‌న‌త‌ సాధించిన‌ కృపాల్‌

జాతీయ ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో కృపాల్‌ సింగ్‌ బాత్‌ డిస్కస్‌త్రోలో మీట్‌ రికార్డు నెలకొల్పుతూ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. పురుషుల డిస్కస్‌త్రో ఫైనల్లో కృపాల్‌ డిస్క్‌ను 61.83 మీటర్ల దూరం విసిరి 22 ఏళ్ల క్రితం అనిల్‌కుమార్‌ (59.55 మీ) నెలకొల్పిన మీట్‌ రికార్డును బద్దలు కొట్టాడు. తాను విసిరిన నాలుగు త్రోల్లోనూ అతడు 60 మీటర్ల మార్కు దాటడం విశేషం. పోల్‌వాల్ట్‌లో నలుగురు అథ్లెట్లు 4.90 మీటర్ల ఎత్తు ఎగరగా వీరిలో కౌంట్‌బ్యాక్‌లో శివ, గోకుల్‌ ఇద్దరికి స్వర్ణాన్ని పంచారు. జ్ఞాన సోన్‌ కాంస్యం నెగ్గగా దీపక్‌ యాదవ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.

ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతికి స్వర్ణం

ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి పసిడితో సత్తాచాటింది. మహిళల 100మీ. హార్డిల్స్‌ను 13.08 సెకన్లలో పూర్తి చేసిన 22 ఏళ్ల ఈ ఏపీ అథ్లెట్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2020 జనవరిలో అంతర్‌ విశ్వవిద్యాలయాల ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె 13.03 సెకన్ల ప్రదర్శన నమోదు చేసింది కానీ అప్పుడు తను డోపింగ్‌ పరీక్ష చేయించుకోనందుకు రికార్డు దక్కలేదు. మహిళల 3000 మీ. ‣ స్టీపుల్‌ఛేజ్‌లో తెలంగాణ అథ్లెట్‌ మహేశ్వరి కాంస్యం పతకం దక్కించుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో ఆమె రేసు పూర్తి చేసింది. కోమల్‌ (మహారాష్ట్ర - 9:47.86సె), రిచా (ఉత్తర్‌ప్రదేశ్‌ - 10:14.53సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. కోమల్‌ తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని అందుకుంది. మరోవైపు జావెలిన్‌ త్రోలో అన్ను రాణి (61.15మీ) పసిడి ప్రదర్శనతో కామన్వెల్త్, ఆసియా క్రీడల అర్హత మార్కును సాధించింది. షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్‌ (19.12మీ), హైజంప్‌లో సర్వేశ్‌ (2.25మీ) సైతం ఆ క్రీడలకు అర్హత పొందే ప్రదర్శన చేశారు.

షాట్‌ గన్‌ ప్రపంచకప్‌లో భారత జట్టుకు కాంస్యం

షాట్‌ గన్‌ ప్రపంచకప్‌లో భారత్‌ ఖాతా తెరిచింది. పురుషుల టాప్‌ టీమ్‌ ఈవెంట్లో కైనన్‌ చెనాయ్, మానవాదిత్య సింగ్, శపథ్‌ భరద్వాజ్‌లతో కూడిన భారత త్రయం కాంస్యం గెలుచుకుంది. ఈ జట్టు కాంస్య పతక పోరులో షూటాఫ్‌లో బ్రెజిల్‌ జట్టును ఓడించింది. 5-5తో రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో షూటాఫ్‌ ద్వారా విజేతను నిర్ణయించారు. అమెరికా ఫైనల్లో స్పెయిన్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కైనన్‌ చెనాయ్, రాజేశ్వరి కుమారి కాంస్య పోరుకు అర్హత పొందింది. అయితే పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో 2-6తో ఓడింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు టేలర్‌ వీడ్కోలు

మూడు ఫార్మాట్లలోనూ మంచి ప్రదర్శనతో సాగిన బ్యాటర్‌గా న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడిగా ఎదిగిన రాస్‌ టేలర్‌ తన చివరి ఇన్నింగ్స్‌ ఆడాడు. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు అతను వీడ్కోలు పలికాడు. నెదర్లాండ్స్‌తో వన్డే మ్యాచ్‌ అతనికి చివరిది. కివీస్‌ తరపున ఇది అతనికి 450వ (అన్ని ఫార్మాట్లలో కలిపి) మ్యాచ్‌ కావడం విశేషం. 2006లో వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన టేలర్‌.. తక్కువ కాలంలోనే నమ్మకమైన ఆటగాడిగా మారాడు. 2007లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టిన అతను.. 112 టెస్టుల్లో 7,683 పరుగులు చేశాడు. 236 వన్డేల్లో 21 శతకాల సాయంతో 8,607 పరుగులు సాధించాడు. 102 అంతర్జాతీయ టీ20ల్లో 1,909 పరుగులు చేశాడు.

ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ విజేత అర్జున్‌

సూపర్‌ ఫామ్‌లో ఉన్న తెలంగాణ యువ క్రీడాకారుడు, గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి ఇండియన్‌ చెస్‌ టూర్‌ తొలి అంచె పోటీల్లో విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 15 రౌండ్లలో మొత్తం 30 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీల్లో ఎనిమిది గేమ్‌ల్లో గెలిచిన అతను.. మరో ఆరు గేమ్‌లు డ్రాగా ముగించాడు. హారిక, గుకేశ్, లలిత్‌ బాబు లాంటి గ్రాండ్‌మాస్టర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. హారిక (19) పదో, లలిత్‌ బాబు (18) 12వ స్థానాల్లో నిలిచారు. ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు.. ప్రపంచ టూర్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు.

ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతికకు కాంస్యం

ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి దండి జ్యోతిక (ఆంధ్రప్రదేశ్‌) కాంస్య పతకంతో సత్తాచాటింది. మహిళల 400 మీటర్ల పరుగులో జ్యోతిక (53.90 సెకన్లు) మూడో స్థానంలో నిలిచింది. మహిళల 100 మీటర్ల పరుగులో ద్యుతి చంద్‌ (ఒడిషా) స్వర్ణం పతకం కైవసం చేసుకుంది. ద్యుతి 11.49 సెకన్లలో పరుగును ముగించి ప్రథమ స్థానం సాధించింది.

జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌ ప్రారంభం

దక్షిణాఫ్రికాలోని పొచెఫ్‌స్ట్రూమ్‌లో ప్రారంభ‌మైన‌ జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. ఏప్రిల్‌ 2న ప్రారంభమైన ఆటలొ గ్రూప్‌-డి మ్యాచ్‌లో సలీమా బృందం 5-1 గోల్స్‌తో వేల్స్‌ను చిత్తు చేసింది. లాల్‌రిండికి (32వ ని, 57వ ని) రెండుసార్లు బంతిని లక్ష్యానికి చేర్చగా.. ముంతాజ్‌ ఖాన్‌ (41వ ని), దీపిక (58వ ని) చెరో గోల్‌ సాధించారు. ఏప్రిల్‌ 3న జర్మనీతో భారత్‌ తలపడనుంది.

ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌: ఫైనల్లో ద్యుతిచంద్‌

స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌ ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగులో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం హీట్స్‌-1లో పోటీపడిన ద్యుతి 11.51 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. 10 వేల మీటర్ల పరుగు పురుషుల్లో కార్తీక్‌ కుమార్, మహిళల్లో సంజీవని జాదవ్‌ విజేతలుగా నిలిచారు. మహిళల పోల్‌వాల్ట్‌లో రోజీ మీనా (తమిళనాడు) పసిడి గెలిచింది. స్టార్‌ లాంగ్‌జంపర్‌ శ్రీశంకర్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్లో 8.09 మీటర్ల దూరం దూకి ఫైనల్లోకి ప్రవేశించాడు.

సాహితి @ 3

ఇటీవల మహిళా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా నిలిచిన ఏపీ అమ్మాయి సాహితి వర్షిణి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మెరుగైంది. తాజాగా ఫిడే ప్రకటించిన అండర్‌-15 బాలికల విభాగంలో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్టాండర్డ్‌ ఎలో రేటింగ్‌ను ఆమె 2312 పాయింట్లకు పెంచుకుంది. అలైస్‌ లీ (అమెరికా - 2334), సోకా గాల్‌ (హంగేరీ - 2319) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే మహిళల ఓపెన్‌ విభాగంలో 14 ఏళ్ల సాహితి తొమ్మిదో ర్యాంకులో నిలిచింది. మరోవైపు ప్రపంచ జూనియర్‌ బాలుర విభాగంలో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అర్జున్‌ ఖాతాలో 2675 రేటింగ్‌ పాయింట్లున్నాయి.

భారత్‌కు అధికారికంగా ఒలింపియాడ్‌ హక్కులు

ప్రతిష్ఠాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్య హక్కులను భారత్‌ అధికారికంగా అందుకుంది. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ వోర్కోవిచ్‌.. ఈ ఒలింపియాడ్‌ ఆతిథ్య హక్కులను భారత్‌కు కట్టబెట్టాడు. సుమారు 180కి పైగా దేశాల నుంచి 2000 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీ ఈ ఏడాది జులై 28న చెన్నైలో ఆరంభమవుతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రష్యాలో జులై 26న ఈ ఒలింపియాడ్‌ ప్రారంభం కావాల్సింది.