సైన్స్ అండ్ టెక్నాలజీ

నౌకా విధ్వంసక బ్రహ్మోస్‌ పరీక్ష విజయవంతం

సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌కు సంబంధించిన నౌకా విధ్వంసక వెర్షన్‌ను భారత నౌకాదళంతో పాటు త్రివిధ దళ విభాగమైన అండమాన్, నికోబార్‌ కమాండ్‌లు విజయవంతంగా పరీక్షించాయి. ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

గగన్‌ దేశీయ సాంకేతికతను మొదటిసారి వినియోగించిన తొలి సంస్థగా ఇండిగో

ఇస్రో, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన గగన్‌ సాంకేతికతను ఉపయోగించుకుని విమానాన్ని ల్యాండింగ్‌ చేసిన తొలి సంస్థగా ఇండిగో నిలిచింది. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌ విమానాశ్రయంలో ఏటీఆర్‌-72 విమానం సురక్షితంగా దిగడానికి ఈ సాంకేతికతను వినియోగించింది. గగన్‌ వల్ల విమానయానాల్లో ఆలస్యం తగ్గడంతో పాటు ఇంధనం ఆదా అయి, భద్రత మెరుగవుతుందని ఇండిగో తెలిపింది.

సూర్యుడి భారీ జ్వాలలతో ఉపగ్రహ, జీపీఎస్‌ వ్యవస్థలపై ప్రభావం

భానుడు ఒక్క ఉదుటున భగ్గుమన్నాడు. ఒక్కసారిగా భారీ జ్వాలలు కురిపించాడు. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్‌ వ్యవస్థలు దెబ్బతినే స్థాయిలో ఇవి నమోదైనట్టు కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్సెస్‌ ఇండియా (సెస్సీ)’ వెల్లడించింది. సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్‌-12992 నుంచి ఎక్స్‌-2.2 శ్రేణి సౌరజ్వాలలు వెలువడినట్టు వివరించింది. భారత్, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఈ జ్వాలల ప్రభావం స్పష్టంగా కనిపించినట్టు సెస్సీ నిపుణులు గుర్తించారు. వీటి కారణంగా హై-ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు స్తంభించడం, ఉపగ్రహాలు, జీపీఎస్‌ పనితీరులో లోపాలు తలెత్తడంతో పాటు ఎయిర్‌లైన్స్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు కూడా ప్రభావితం కావచ్చని సెస్సీ సమన్వయకర్త, కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ దివ్యేందు నంది పేర్కొన్నారు. ఏంటీ జ్వాలలు? సౌరవ్యవస్థ నుంచి ఒక్కసారిగా శక్తి వెలువడడాన్నే సౌరజ్వాలలు (సోలార్‌ ఫ్లేర్‌) అంటారు. వీటి వల్ల రేడియా, నేవిగేషన్‌ సంకేతాలతో పాటు ఒక్కోసారి విద్యుత్‌ గ్రిడ్‌లు ప్రభావితమవుతాయి. ఫలితంగా విమానాలకూ, వ్యోమగాములకూ ముప్పు ఏర్పడే ఆస్కారముంది. ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని దివ్యేందు బృందం ఏప్రిల్‌ 18నే అంచనా వేసింది. భూకంపాల మాదిరే సౌరజ్వాలల తీవ్రతనూ నాసా వర్గీకరిస్తుంది. ‘ఏ’ నుంచి మొదలుపెట్టి బీ, సీ, ఎం, ఎక్స్‌ వంటి తరగతులుగా వాటిని విభజించింది. ఎక్స్‌ తరగతి సౌరజ్వాలలు అన్నింటికన్నా తీవ్రమైనవి. ఇంకా చెప్పాలంటే ‘ఎం’ తరగతి సౌరజ్వాలల కన్నా పది రెట్లు, ‘సీ’ తరగతి జ్వాలల కన్నా వంద రెట్లు తీవ్రతతో ఇవి ఉంటాయి.

కరోనా చికిత్సకు ప్లాస్మాతో పదార్థాన్ని రూపొందించిన ఐఏఎస్‌ఎస్‌టీ శాస్త్రవేత్తలు

కొవిడ్‌ వ్యాప్తిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు పరిశోధకులు ప్లాస్మా ఆధార క్రిమిసంహారక పదార్థాన్ని తయారు చేశారు. ప్రయోగశాలలో కోల్డ్‌ అట్మాస్‌ఫియరిక్‌ ప్రెజర్‌ (క్యాప్‌) ద్వారా ఉత్పత్తి చేసిన ప్లాస్మాతో తయారైన ఈ పదార్థం కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను సమర్థంగా అచేతనం చేస్తుండటం విశేషం. కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ది అడ్వాన్స్డ్‌ స్టడీ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఏఎస్‌ఎస్‌టీ) దీన్ని అభివృద్ధి చేసింది. ప్రయోగశాలలోని రియాక్షన్‌ ఛాంబర్‌లో ప్లాస్మాను ఉంచి దానిపై హీలియం, ఆర్గాన్, ఆయాన్, పలురకాల వాయువులను పంపించారు. క్యాప్‌ ప్రక్రియ ద్వారా విడుదలైన ఆక్సిజన్, నైట్రోజన్‌లు అత్యంత ప్రతిస్పందన కనబరిచి, కేవలం రెండు నిమిషాల్లోనే వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను సంపూర్ణంగా నాశనం చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. వివిధ రకాల బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లను నివారించేందుకూ ఇదే విధానాన్ని వర్తింపజేసి పరీక్షిస్తామని పరిశోధకులు తెలిపారు. రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ అడ్వాన్సెస్‌ పత్రిక ఈ వివరాలు వెల్లడించింది.

క్యాన్సర్‌ చికిత్సల్లో వెసికిల్స్‌ ద్వారా మెరుగైన ఔషధ సరఫరా

క్యాన్సర్‌పై పోరాటంలో సమర్థమైన ఔషధాలు ఎంత ముఖ్యమో వాటిని బాధితుల శరీరంలోని ప్రభావిత భాగాలకు సురక్షితంగా, ప్రభావవంతంగా చేర్చడమూ అంతే ముఖ్యం. ఈ దిశగా సాగుతున్న పరిశోధనల్లో మేలి మలుపు ఇది. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్, నాన్యాంగ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ, జీనోమ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ల శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధన సాగించారు. శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఒకచోటు నుంచి మరో చోటుకు వ్యాపించకుండా (మెటాస్టాసిస్‌), రొమ్ము క్యాన్సర్‌ ఉద్ధృతం కాకుండా ఇమ్యునోథెరపీని సమర్థంగా అందించేందుకు ఎర్రరక్త కణాలు విడుదలచేసే సూక్ష్మస్థాయి వెసికిల్స్‌ ఉపయోగపడుతున్నట్టు వారు గుర్తించారు. రిబోన్యూక్లియిక్‌ యాసిడ్‌ (ఆర్‌ఎన్‌ఏ) అనేది డీఎన్‌ఏ మాదిరే ఒక అణువు. శరీరంలోని ఆర్‌ఐజీ-ఐ అనే ఇమ్యునో-మాడ్యులేటర్‌ రిసిప్టర్లను ఈ ఆర్‌ఎన్‌ఏలు చైతన్యపరిస్తే, అవి క్యాన్సర్‌ కణాలను అంతం చేస్తాయి. ఆర్‌ఎన్‌ఏ చికిత్సా విధానంలో ఆర్‌ఐజీ-ఐ లక్ష్యంగా ఔషధాన్ని సరఫరా చేస్తారు. కానీ, ఆర్‌ఎన్‌ఏలు అస్థిరంగా, పెళుసుగా ఉంటాయి. దీంతో వాటిని నేరుగా ఆర్‌ఐజీ-ఐలకు చేరవేయడం వైద్య పరిశోధనలకు దీర్ఘకాల సవాలుగా నిలిచింది. సింగపూర్‌ పరిశోధకులు దీన్ని ఛేదించేందుకు సుదీర్ఘ పరిశోధన సాగించారు. ఎర్రరక్త కణాలు విడుదలచేసే ఎక్స్‌ట్రా సెల్యులార్‌ వెసికిల్స్‌ ద్వారా ఆర్‌ఎన్‌ఏలను విజయవంతంగా ఆర్‌ఐజీ-ఐలకు సరఫరా చేయగలిగారు. ఈ విధానం ద్వారా ఆరోగ్యవంతమైన కణాలను కాపాడుకోవచ్చు. తద్వారా రోగి మరింత త్వరగా కోలుకునే అవకాశముందని పరిశోధనకర్త ప్రొఫెసర్‌ మిన్హ్‌ లే వివరించారు.

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ గుట్టు చెప్పే ఐదు బ్యాక్టీరియాలు!

మూత్రంలో ఐదు రకాల బ్యాక్టీరియాల ఉనికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని తాజా పరిశోధనలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా శాస్త్రవేత్త కొలిన్‌ కూపర్‌ దీనికి నేతృత్వం వహించారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో ఎలాంటి బ్యాక్టీరియాలకు సంబంధం ఉంటుందన్న విషయమై పరిశోధకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా 600 మంది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితుల మూత్రాన్ని అనేక విధానాల్లో పరీక్షించగా ఇంతవరకూ తెలియని కొత్తరకం బ్యాక్టీరియాలు కనిపించాయి. ముఖ్యంగా అనెరోకాకస్, పెప్టోనిఫిలస్, పోర్ఫిరోమోనాస్, ఫెనోలారియా, ప్యూసో బ్యాక్టీరియంలు ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్‌ రహితంగానే పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మూత్రంలో ఈ బ్యాక్టీరియాలు తారసపడితే సదరు వ్యక్తికి తీవ్రస్థాయి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలకూ, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ తీరుకూ మధ్య అత్యంత స్పష్టమైన సంబంధం ఉందని నార్విచ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ డానియెల్‌ బ్రేవర్‌ చెప్పారు.

ఆకాశం, సముద్రం నుంచి ‘బ్రహ్మోస్‌’ ప్రయోగాలు

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని భారత్‌ ఒకేరోజు రెండు వేదికల నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ అస్త్రానికి సంబంధించిన నౌకా విధ్వంసక వెర్షన్‌ను నేవీ ప్రయోగించగా, గగనతలం నుంచి గర్జించే బ్రహ్మోస్‌ను వాయుసేన పరీక్షించింది. ‣ నౌకాదళ వెర్షన్‌ను ఐఎన్‌ఎస్‌ దిల్లీ అనే యుద్ధనౌక నుంచి ప్రయోగించినట్లు నేవీ అధికారులు తెలిపారు. ఇందుకోసం ఆధునిక మాడ్యులర్‌ లాంచర్‌ను ఉపయోగించినట్లు చెప్పారు. ఈ పరీక్ష.. సుదూర దాడి సామర్థ్యాన్ని రుజువు చేసిందని వివరించారు. ప్రధాన యుద్ధనౌకల సమీకృత నెట్‌వర్క్‌ ఆధారిత ఆపరేషన్‌ సత్తానూ తేటతెల్లం చేసినట్లు తెలిపారు. గగనతల వెర్షన్‌ను సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి ప్రయోగించినట్లు వాయుసేన తెలిపింది. తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిర్వహించిన ఈ పరీక్షను భారత నౌకాదళంతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించామని పేర్కొంది. ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని వివరించింది. ‣ బ్రహ్మోస్‌కు సంబంధించిన వైమానిక దళ వెర్షన్‌ను సుఖోయ్‌-30 ఎంకేఐతో అనుసంధానించాలని 2016లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 40 యుద్ధ విమానాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. నేల లేదా సముద్రంలోని శత్రు లక్ష్యాలపై చాలా దూరం నుంచే విరుచుకుపడే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. మార్చి 5న భారత నౌకాదళం, ఐఎన్‌ఎస్‌ చెన్నై అనే యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్‌కు సంబంధించిన అధునాతన వెర్షన్‌ను పరీక్షించింది. భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ క్షిపణిని జలాంతర్గాములు, యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, నేలపై నుంచి ప్రయోగించొచ్చు. ఇది ధ్వనితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు వేగంతో దూసుకెళ్లగలదు.

బ్యాక్టీరియా నుంచి బయో సిమెంట్‌

పర్యావరణానికి అనుకూలించేలా, కర్బన ఉద్గారాల్ని తగ్గించేలా బ్యాక్టీరియా ద్వారా బయో సిమెంట్‌ తయారీ ప్రక్రియను అభివృద్ధి చేసినట్టు ఐఐటీ మద్రాస్‌ ప్రకటించింది. మైక్రోబియల్లీ ఇండ్యూస్డ్‌ కాల్సైట్‌ ప్రిసిపిటేషన్‌ (ఎంఐసీపీ) ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియాను ఉపయోగించి ఈ సిమెంటును రూపొందించవచ్చని ఐఐటీ మద్రాస్‌ బయోటెక్నాలజీ విభాగ ప్రొఫెసర్‌ జి.కె.సురేష్‌కుమార్, సహాయ ప్రొఫెసర్‌ నీరవ్‌ భట్, స్కాలర్‌ శుభశ్రీ శ్రీధర్‌ తెలిపారు. గతేడాది గ్లాస్గోలో జరిగిన యూఎన్‌ వాతావరణ మార్పుల సదస్సులో 140 దేశాలు పాల్గొన్నాయి. ఇక్కడ ప్రధానంగా కర్బన ఉద్గారాల్ని జీరో స్థాయికి తేవడంపై చర్చ జరిగింది. ఈ ఉద్గారాలను సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా వదులుతున్నట్లు చర్చకు వచ్చిందని వివరించారు. దీని నియంత్రణ కోసం బయో సిమెంటు ప్రక్రియను వృద్ధి చేసినట్లు ప్రకటించారు. మైక్రోబియల్‌ ప్రక్రియను సమగ్రంగా అర్థం చేసుకుంటే బయో సిమెంట్‌ను తయారు చేసే బయోరియాక్టర్లను కచ్చితంగా రూపొందించే అవకాశముందని ప్రొఫెసర్‌ జి.కె.సురేష్‌కుమార్‌ తెలిపారు. సాధారణ సిమెంటు తయారీలో 900 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు అవసరమని, బయోసిమెంట్‌కు మాత్రం కేవలం 30-40 డిగ్రీల సెల్సియస్‌ సరిపోతుందని అన్నారు. దీని తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. లాక్టోస్‌ మదర్‌ లిక్కర్‌ (ఎల్‌ఎంఎల్‌), కార్న్‌ స్టీప్‌ లిక్కర్‌ (సీఎస్‌ఎల్‌) లాంటివి కూడా బ్యాక్టీరియా కోసం వాడొచ్చని వివరించారు. సాధారణ సిమెంట్‌తో పోలిస్తే తక్కువ సమయంలోనే ఇది తయారవుతుందని తెలిపారు.

ఉల్కల ద్వారా భూమిని చేరిన మూల పదార్థాలు

భూమి మీద జీవం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మానవాళికి అంతుచిక్కని ప్రశ్న! సమస్త జీవరాశికి పునాదుల్లాంటి మూలకాల మూలలపై అస్పష్టత ఉంది. జపాన్‌ శాస్త్రవేత్తలు దాని గుట్టు విప్పారు. ఆ ప్రాథమిక పదార్థాలు విశ్వం నుంచే వచ్చాయనడానికి గట్టి ఆధారాలు సేకరించారు. కర్బనం పుష్కలంగా ఉన్న గ్రహశకలాల నుంచి ఉల్కల రూపంలో వచ్చి ఉండొచ్చని సూత్రీకరించారు.

జపాన్‌లోని హక్కాయిడో విశ్వవిద్యాలయానికి చెందిన యాషుహిరో ఒబా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ద్రవీకృత ఉల్క ధూళిలో స్వల్ప పరిమాణంలో ఉండే భిన్న రసాయనాలను జాగ్రత్తగా సేకరించే అధునాతన విధానాన్ని అభివృద్ధి చేసింది.

‘మర్చిసన్‌ ఉల్క’ అనే అంతరిక్ష శిల నమూనాపై ఈ కొత్త విధానాన్ని ప్రయోగించినప్పుడు ఇన్నేళ్లు ఆచూకీ దొరకని సైటోసిన్, థయామిన్‌లు కనిపించాయి. దీంతో జీవానికి అవసరమైన ఐదు ప్రాథమిక న్యూక్లియో బేస్‌లు ఉల్కల్లో కనిపించినట్లయింది.

టాగిష్‌ లేక్, లేక్‌ ముర్రే అనే ఉల్కలపైనా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ప్రతి శిలలోనూ ఈ ఐదు న్యూక్లియోబేస్‌లు ఉన్నాయని తేల్చారు. అవి రూపొందే ప్రక్రియను వేగవంతం చేసే ఇమిడాజోల్‌ అనే మూలకాన్నీ గుర్తించారు.

భూమిపై పడిన అంతరిక్ష శిలల నుంచి సేకరించిన నమూనాలు కాకుండా విశ్వంలోని గ్రహ శకలాల వద్దకు నేరుగా వ్యోమనౌకలను పంపి, రప్పించిన శాంపిళ్లను విశ్లేషిస్తే దీనిపై స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జపాన్‌కు చెందిన హయబుసా-2 స్పేస్‌క్రాఫ్ట్, రియుగు అనే గ్రహ శకలం నుంచి తెచ్చిన శాంపిళ్లలోని న్యూక్లియో బేస్‌లను విశ్లేషించడానికి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.

శాస్త్రవేత్తలు పరిశోధించిన ఉల్కలు

1. మర్చిసన్‌ (ఆస్ట్రేలియా)

2. టాగిష్‌ లేక్‌ (కెనడా)

3. లేక్‌ ముర్రే (అమెరికా)


బీజింగ్‌ పరిశోధకుల ‘బుల్లి చతుష్పాద మర ఎలుక (స్క్యూరో)’ నమూనా అభివృద్ధి

భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో బాధితుల కోసం అన్వేషించడంలో దోహదపడగల సరికొత్త రోబోటిక్‌ ఎలుకలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాలోని బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్‌ ఖింగ్‌ షి నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ దిశగా కృషిచేస్తోంది. సాధారణంగా ఎలుకలు సన్నని మార్గాల్లోనూ దూసుకెళ్తుంటాయి. వాటి శరీర నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది. అందుకే వాటి తరహాలో ‘బుల్లి చతుష్పాద మర ఎలుక (స్క్యూరో)’ నమూనాను పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. స్క్యూరో బరువు 220 గ్రాములు. 200 గ్రాముల భారాన్ని మోయగలదు. తొలుత దానికి చక్రాలను బిగించామని, కదలికలను మరింత మెరుగుపర్చేందుకుగాను తర్వాత వాటి స్థానంలో కాళ్లను ఏర్పాటు చేశామని పరిశోధకులు తెలిపారు.

వైరస్‌ల సంహారిణి ‘ఇన్‌స్టా షీల్డ్‌’ రూపకల్పన

బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌) పట్టభద్రుడైన తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి (40) రూపొందించిన వైరస్‌ సంహారక పరికరం ‘ఇన్‌స్టా షీల్డ్‌’ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆవిష్కరించారు. గ్రామీణ శాస్త్రవేత్తల్లోని అద్భుత ప్రతిభ, సాంకేతికతకు చారి వినూత్న ఆవిష్కరణ ఇన్‌స్టా షీల్డ్‌ నిదర్శనమని, ఇది తెలంగాణకు గర్వకారణమని అన్నారు.

హైదరాబాద్‌లోని బుద్వేలులో ఉంటూ రెండేళ్ల పాటు పరిశోధనలు చేశా. కంటికి కనిపించని కరోనా ఇతర వైరస్‌ మూలాలను కనుగొని, నెగెటివ్‌ ఎలక్ట్రాన్ల సాయంతో వాటిని అంతమొందించే ఇన్‌స్టా షీల్డ్‌ను రూపొందించా. సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్‌ ల్యాబ్‌ తదితర సంస్థలు దీనిని గుర్తించాయి. ఇది ప్రజారోగ్య పరిరక్షణకు ఉపకరించే పరికరం. ఇళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు హోటళ్లు, ఆసుపత్రులు మొదలైన ప్రదేశాల్లో దీనిని ఉపయోగించవచ్చు. విద్యుత్‌ వినియోగం కూడా తక్కువే. దుష్పరిణామాలు ఉండవని నర్సింహాచారి వివరించారు.


హెచ్‌సీయూ పరిశోధనతో సరికొత్త నానో (అతిసూక్ష్మ) డీఏపీ, నానో పురుగుమందు అభివృద్ధి

వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పునకు నాంది ఇది. రైతులకు ఆర్థికంగా మేలు చేసేలా పంటల్లో రసాయనాల వాడకం తగ్గిస్తూ భూమిలో సారం తగ్గకుండా చేసే సరికొత్త నానో (అతిసూక్ష్మ) డీఏపీ, నానో పురుగుమందును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. నానో డీఏపీ, బయోపెస్టిసైడ్‌ పేరిట తయారైన వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ముందడుగు పడింది. భారీఎత్తున ఉత్పత్తి చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందుకు కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ రూ.5.64 కోట్లు మంజూరు చేసింది.

మొక్కల్లో ఫంగస్‌ కారణంగా రోగ నిరోధకశక్తి తగ్గి తెగుళ్లు సోకుతాయి. కీటకాలు ఆశించి, ఉత్పత్తి పడిపోతుంది. ఈ సమస్యల నివారణకు నానో బయో పెస్టిసైడ్‌ (హర్పిన్‌ లోడెడ్‌ చిటోసెన్‌ నానోపార్టికల్స్‌ - హెచ్‌సీఎస్‌ఎన్‌పీ) అనే సేంద్రియ పురుగుమందును హెచ్‌సీయూ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి గతంలోనే పేటెంట్‌ దక్కింది.

నానో డీఏపీని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఏఆర్‌సీఐ) భాగస్వామ్యంతో హెచ్‌సీయూ గత ఏడాది అభివృద్ధి చేసింది. సంప్రదాయ డీఏపీతో పోల్చితే పరిమాణంలో నానో డైఅమ్మోనియం ఫాస్ఫేట్‌ (ఎన్‌-డీఏపీ) అయిదు వేల రెట్లు చిన్నగా ఉంటుంది. సాధారణ డీఏపీ కంటే 75 శాతం తక్కువ వినియోగిస్తే చాలు. నానో అణువులు భూమిలోకి నేరుగా చొచ్చుకెళ్లడంతో వృథా అనేది ఉండదు.

కేంద్రం ఆమోదం పొందిన ఉత్పత్తి ప్రాజెక్టుకు పరిశోధకుడిగా వర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు, సహ పరిశోధకుడిగా ప్రొ. రాహుల్‌ కుమార్‌ వ్యవహరిస్తారు. ఏఆర్‌సీఐ శాస్త్రవేత్తలు తాతా నర్సింగరావు, శ్రీధర సుధాకర శర్మ భాగస్వాములుగా ఉంటారు. శ్రీ బయోఏస్తెటిక్స్‌ కంపెనీ ఎండీ కేఆర్‌కే రెడ్డి పరిశ్రమ భాగస్వామిగా ఉంటూ పది శాతం ప్రాజెక్టు ఖర్చు భరిస్తారు. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశోధనలు చేసి సదరు కంపెనీతో కలిసి ఉత్పత్తి ప్రారంభిస్తారు. వచ్చే మూడేళ్లలో భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.


‘ఐఎఫ్‌ఏ’తో మహిళల్లో రక్తహీనత నివారణ: ఐసీఎంఆర్‌

గర్భధారణ వయసులోని మహిళల్లో రక్తహీనతను ముందుగానే గుర్తించి ఐరన్‌ - ఫోలిక్‌ యాసిడ్‌ (ఐఎఫ్‌ఏ) మాత్రలను ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో తేలింది. 50 శాతం భారతీయ మహిళలు రక్తహీనత (ఎనీమియా)తో బాధ పడుతున్నారని ఎన్‌ఐఎన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రవి చెప్పారు. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పరీక్షించి, ఐఎఫ్‌ఏ మాత్రలను ఇవ్వడం ద్వారా రక్తహీనతను అధిగమించడానికి కేంద్రం ‘ఎనీమియా ముక్త భారత్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. అధ్యయనంలో భాగంగా 17-21 ఏళ్ల వయసులోని 470 మంది మహిళలకు హైదరాబాద్‌ ఐసీఎంఆర్‌ - ఎన్‌ఐఎన్‌ విభాగం ఈ పథకాన్ని వర్తింపజేసింది. హిమోగ్లోబిన్‌ శాతాన్ని పరీక్షించిన తరవాత 90 రోజుల పాటు ఐఎఫ్‌ఏ మాత్రలు ఇచ్చినపుడు రక్తహీనత 40 శాతం తగ్గిపోయింది. ప్రయోగానికి ముందు 70 శాతం మహిళలకు రక్తహీనత ఉండగా తర్వాత అలాంటివారు 30 శాతానికి తగ్గారు.

మంచి కొలెస్టెరాల్‌తో అల్జీమర్స్‌ దూరం!

తీవ్రమైన మతిమరుపునకు కారణమయ్యే అల్జీమర్స్‌ రుగ్మత బారిన పడకుండా రక్షించడంలో హై డెన్సిటీ లిపోప్రొటీన్‌ (హెచ్‌డీఎల్‌) కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. మస్తిష్క మేరు ద్రవం (సెరెబ్రో స్పైనల్‌ ఫ్లూయిడ్‌)లో ఈ కణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇతరులతో పోలిస్తే మెరుగైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటున్నట్లు నిర్ధారించింది. హెచ్‌డీఎల్‌ను మంచి కొలెస్టెరాల్‌గా పిలుస్తుంటారు. ఆరోగ్యవంతులైన 180 మంది వాలంటీర్లపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారి నుంచి మస్తిష్క మేరు ద్రవం నమూనాలను సేకరించి పరీక్షించారు. ఆ ద్రవంలో బుల్లి హెచ్‌డీఎల్‌ కణాలను అధిక స్థాయిలో కలిగి ఉన్న వ్యక్తులు వృద్ధాప్యంలోనూ జ్ఞాపకశక్తి సంబంధిత పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నట్లు వెల్లడించారు. వారిలో అల్జీమర్స్‌ ముప్పు తక్కువగా ఉంటున్నట్లు నిర్ధారించారు.

శిశు మరణాల నియంత్రణకు స్మార్ట్‌ ఏఆర్‌పీ పరికరాన్ని ఆవిష్కరించిన ఐఐటీ మద్రాస్‌

శిశు మరణాల సంఖ్యను భారీగా తగ్గించడంతో పాటు అప్పుడే పుట్టిన శిశువులకు గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన వైద్య చికిత్సలు అందించేందుకు ఐఐటీ మద్రాస్‌ వినూత్న పరికరాన్ని ‘స్మార్ట్‌ ఏఆర్‌పీ’ పేరుతో ఆవిష్కరించింది. పుట్టిన శిశువులకు అత్యవసర సమయంలో ఏమేం చేయాలనే దానిపై యంత్రాల చెక్‌లిస్టుతో పాటు, పరిష్కారాన్ని గుర్తించే సాంకేతికతను దీనికి అనుసంధానించింది. ఈ ప్రాజెక్టు వివరాల్ని తమిళనాడు జాతీయ ఆరోగ్య మిషన్‌ ఎండీ దరేజ్‌ అహ్మద్‌ వివరించారు. ఐఐటీ మద్రాస్‌లోని ఎక్స్‌పెరిమెంటల్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎక్స్‌టీఐసీ)తో కలిసి ‘బిల్‌డెస్క్‌’ సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు వెల్లడించారు. వర్చువల్‌ రియాలిటీ, గేమింగ్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ను దీనికి అనుసంధానించినట్లు తెలిపారు.

వాతావరణం నుంచి నీటి ఉత్పత్తిని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

2050 నాటికి దాదాపు 87 దేశాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అవసరమే మానవుడిని ఆవిష్కారానికి పురిగొల్పుతుంది. నీటి కొరతను తీర్చే అంశానికీ ఇది వర్తిస్తుంది. మానవ మేధస్సుతో ఈ సమస్యకు ఇప్పటికే పాక్షిక పరిష్కార మార్గం లభించింది. గాలి నుంచి నీటిని ఒడిసిపట్టే అద్భుత పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భవిష్యత్‌లో దాహార్తిని తీర్చడంలో ఇది కీలకమవుతుందని భావిస్తున్నారు.

గాలి నుంచి నీటిని సేకరించే సాధనాలను ‘అట్మాస్పియరిక్‌ వాటర్‌ జనరేటర్లు’ (ఏడబ్ల్యూజీ)గా పేర్కొంటారు. ఇందుకు సంబంధించిన విధానాలు భిన్నరకాలుగా ఉన్నప్పటికీ మొత్తంమీద అవి ‘కండెన్సేషన్‌’ ప్రక్రియ ఆధారంగా పనిచేస్తాయి. ప్రస్తుత ఏడబ్ల్యూజీ పరిజ్ఞానాల్లో అనేకం ఏసీల తరహాలో పనిచేస్తాయి. ఇవి హీటింగ్‌/కూలింగ్‌ కాయిల్స్‌ను ఉపయోగించుకొని గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఈ క్రమంలో గాల్లోని నీటి ఆవిరి.. నీటి బిందువులుగా మారిపోతుంది. ఇంకా పలు విధానాల్లో.. వాతావరణం నుంచి నీటిని ఒడిసిపట్టొచ్చు. చాలావరకూ ఏడబ్ల్యూజీ యంత్రాలు కొద్ది పరిమాణంలోనే నీటిని అందిస్తున్నాయి. అయితే ఇంటికి దరిదాపుల్లో ఎక్కడా గుక్కెడు నీళ్లు దొరకని సందర్భంలో ఇవి ఎంతోకొంత ప్రయోజనకరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గాలి నుంచి నీటిని సంగ్రహించే విధానం పురాతనమైనదే. 15వ శతాబ్దంలో దక్షిణ అమెరికాలో విస్తరించిన ‘ఇంకాస్‌ సామ్రాజ్యం’లో ఈ విధానాన్ని అనుసరించారు. నాడు మంచు బిందువులను ఒడిసిపట్టి, భారీ నీటి తొట్టెల్లోకి మళ్లించేవారు. ఆ తర్వాత వాటిని సన్నటి కాల్వల ద్వారా నగరంలో పంపిణీ చేసేవారు.

‘గాలి బావి’ డిజైన్ల ద్వారా కూడా పురాతన కాలంలో నీటిని ఒడిసిపట్టేవారు. ఇలాంటి ఒక నిర్మాణాన్ని 1900 ప్రాంతంలో రష్యా ఇంజినీరు ఫ్రెడ్రిక్‌ జిబోల్డ్‌.. క్రిమియాలో శిథిలమైన థియోడొసియా నగరానికి సమీపంలో గుర్తించారు. అక్కడ అర్థంకాని రీతిలో రాళ్లు పేర్చి ఉండటాన్ని ఆయన గమనించారు. ఒక్కో రాళ్ల కుప్ప 900 చదరపు మీటర్ల భాగాన్ని ఆక్రమించింది. టెర్రకోట మట్టితో చేసిన గొట్టాలతో వీటిని నగరంలోని బావులు, చెరువులకు అనుసంధానించారు. ఇది నీటిని సేకరించే ఒక పాసివ్‌ విధానమై ఉండొచ్చని జిబోల్డ్‌ సూత్రీకరించారు. దీన్ని పరీక్షించేందుకు ఇదే తరహాలో ఒక ఆధునిక నిర్మాణాన్ని చేపట్టారు. 1912లో ఆ నిర్మాణం పూర్తయింది. అది గాలి నుంచి రోజుకు 360 లీటర్ల నీటిని ఉత్పత్తి చేసిందని కొందరు చెబుతున్నారు. కొన్నేళ్లకు ఆ నిర్మాణం పాక్షికంగా కూలిపోయింది. 1993లో దాన్ని గుర్తించి, మరమ్మతులు చేశారు. కొంతమేర ఇది నీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడైంది.

ఏడబ్ల్యూజీ సాధనాలు రెండు రకాలు..

1. పాసివ్‌ వాటర్‌ ఎక్స్‌ట్రాక్షన్‌.

2. ఫోర్స్డ్‌ లేదా పవర్డ్‌ ఎక్స్‌ట్రాక్షన్‌.

మొదటి విధానంలో సహజసిద్ధ ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలపై ఆధారపడటం ద్వారా గాలి నుంచి నీటిని సేకరిస్తారు. ప్రత్యేకంగా ఇంధన అవసరం ఉండదు.

రెండో ప్రక్రియలో విద్యుత్‌ లేదా పీడనాన్ని ఉపయోగించడం ద్వారా గాలి నుంచి నీటిని ఒడిసిపడతారు.


జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు: చైనా

రోదసిలోని తన కొత్త అంతరిక్ష కేంద్రంలోకి మరో ముగ్గురు వ్యోమగాములను పంపాలని చైనా నిర్ణయించింది. షెంఝౌ-14 వ్యోమనౌక ద్వారా వీరు జూన్‌లో పయనమవుతారని పేర్కొంది. వీరు రోదసి కేంద్రంలో ఆరు నెలలు గడుపుతారని వెల్లడించింది. తియాంగాంగ్‌ పేరుతో అంతరిక్ష కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన కోర్‌ మాడ్యూల్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని ఈ ఏడాది చివర్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగా జులైలో వెంటియాన్‌ మాడ్యుల్‌ను, అక్టోబరులో మెంగ్టియాన్‌ మాడ్యూల్‌ను.. కోర్‌ మాడ్యూల్‌కు జోడించనుంది. జూన్‌లో పయనమయ్యే వ్యోమగాములు భూమికి తిరిగొచ్చేలోగా మరో ముగ్గురిని అక్కడి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా 3-5 రోజుల పాటు ఆ అంతరిక్ష కేంద్రంలో ఆరుగురు సిబ్బంది ఉంటారని చెప్పారు. షెంఝౌ-13 వ్యోమనౌకలో ముగ్గురు వ్యోమగాములు భూమికి తిరిగొచ్చారు. ఇందులోని వాంగ్‌ యాపింగ్‌ అనే వ్యోమగామి.. స్పేస్‌వాక్‌ నిర్వహించిన తొలి చైనా మహిళగా గుర్తింపు పొందారు. ఆమెతో పాటు జాయ్‌ జిగాంగ్, యె గువాంగ్‌ఫులు రోదసి కేంద్రం నుంచి హైస్కూల్‌ విద్యార్థులకు భౌతికశాస్త్ర పాఠాలు బోధించారు. అమెరికా, రష్యా తర్వాత సొంతంగా రోదసిలోకి వ్యోమగాములను పంపే సామర్థ్యం సాధించిన మూడో దేశంగా చైనా గుర్తింపు పొందింది.

గ్రహాంతర జీవి పాదముద్రలా అంగారకుడి బిలం

అంగారకుడిపైనున్న ఒక బిలం చిత్రాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తాజాగా విడుదల చేసింది. ఆ గ్రహ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మార్స్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌లోని హై రిజల్యూషన్‌ ఇమేజింగ్‌ సైన్స్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (హైరైజ్‌) కెమెరా ఈ చిత్రం తీసింది. అక్కడ ఒక భారీ బిలంలో మరో బిలం ఉందని నాసా పేర్కొంది. దీనికి ‘ఎయిరీ క్రేటర్‌’ అని పేరు పెట్టింది.

వేడిని తట్టుకునే కొవిడ్‌ టీకా

శీతలీకరణ అవసరం లేని కొవిడ్‌ టీకాను తయారుచేయబోతున్నట్లు గతంలో ఇచ్చిన మాటను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నిలబెట్టుకొంటోంది. మైన్‌ వ్యాక్స్‌ అనే బయోటెక్‌ అంకుర సంస్థతో కలసి రూపొందిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌.. పేద దేశాలకు పెన్నిధి కానుంది. దీని రూపకల్పనలో ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్‌ శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు కూడా పాలుపంచుకొంటున్నారు. ఐఐఎస్‌సీ-మైన్‌ వ్యాక్స్‌ టీకాను 37 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నాలుగు వారాల పాటు, 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 90 నిమిషాల సేపు నిల్వ చేసినా వినియోగించవచ్చు. ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్‌) టీకాను 2-3 డిగ్రీల సెల్సియస్‌ వద్ద భద్రపరచాల్సి ఉండగా, ఫైజర్‌ టీకాకు మైనస్‌ 70 డిగ్రీల అతిశీతలీకరణ సదుపాయం కావాలి. కరోనా వైరస్‌ మానవ కణాన్ని అతుక్కొని లోనికి ప్రవేశించడానికి ఆ వైరస్‌ కొమ్ములోని ఆర్‌.బి.డి. అనే ప్రొటీన్‌ తోడ్పడుతుంది. ఆ ప్రొటీన్‌లో కొంత భాగాన్ని తీసుకుని ఐఐఎస్‌సీ టీకాను రూపొందిస్తున్నారు.

కొవిడ్‌ వేరియంట్లను హతమార్చే లేపనాన్ని అభివృద్ధిపరిచిన జపాన్‌ శాస్త్రవేత్తలు

కరోనా వైరస్‌కు చెందిన వేరియంట్లను క్రియారహితం చేసే సరికొత్త లేపనాన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. చీకటి ప్రాంతం (గది లోపల), వెలుగు ప్రసరించే చోట కూడా ఈ పూత ప్రభావవంతంగా పనిచేసి వైరస్‌ను నిలువరిస్తుందని వెల్లడైంది. నరా వైద్య విశ్వవిద్యాలయం, కనగవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, టోక్యో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు...టైటానియం డైయాక్సైడ్, కాపర్‌ ఆక్సైడ్‌ మిశ్రమాలను వినియోగించి కొత్తరకం పూతను తయారు చేశారు. కరోనా సోకిన వ్యక్తులు దగ్గినా, తుమ్మినా వారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ గాలిలో ప్రయాణించి ఇతరులకు వ్యాప్తి చెందుతుందనే విషయం తెలిసిందే. అదే సమయంలో గోడలు, గదిలోని పరికరాల ఉపరితలం మీద కూడా వైరస్‌ తిష్టవేస్తుంది. ఆ ఉపరితలాలను శుభ్రం చేసేందుకు ఆల్కాహాల్, హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ వంటి రసాయనాలను వినియోగించాల్సి వస్తోంది. తాము అభివృద్ధిపరిచిన టైటానియం డైఆక్సైడ్, కాపర్‌ ఆక్సైడ్‌ మిశ్రమాల పూత, గోడలు, ఇతర పరికరాల ఉపరితలాలపై చాలా కాలం పాటు నిలిచి ఉండి కరోనాలోని స్పైక్‌ ప్రొటీన్‌ను ధ్వంసం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. లేపనం పూసిన ఉపరితలాలపైకి అతినీలలోహిత (యూపీ) కిరణాలు ప్రసరించినప్పుడు ఆక్సిడేషన్‌ చర్య జరిగి వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ ధ్వంసమవుతుందని తెలిపారు. అందువల్ల ఉపరితలాలను తాకిన వారికి వైరస్‌ వ్యాపించే అవకాశం ఉండదని వివరించారు.

ఉత్పరివర్తనాల మందగమనంతో దీర్ఘాయుష్షు: తేల్చిన బ్రిటన్‌ పరిశోధకులు

పులి, సింహం, జిరాఫీ వంటి పలు జంతువుల కంటే మానవుల సహజ ఆయుర్దాయం ఎక్కువ. వాటితో పోలిస్తే మనిషికి ముసలితనం నెమ్మదిగా వస్తుంది. మరి అందుకు కారణమేంటో తెలుసా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు బ్రిటన్‌లోని వెల్‌కమ్‌ సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తాజాగా సమాధానాన్ని కనుగొన్నారు. జంతువులతో పోలిస్తే జన్యుపరమైన మార్పుల (ఉత్పరివర్తనాలు) వేగం తక్కువగా ఉండటం మానవుల దీర్ఘాయుష్షుకు దోహదపడుతున్నట్లు తేల్చారు. మనిషితో పాటు ఎలుక, పులి, సింహం, జిరాఫీ వంటి 16 జాతులపై వారు తాజా పరిశోధన నిర్వహించారు. శరీర పరిమాణంతో సంబంధం లేకుండా.. వివిధ రకాల జంతువుల సహజ జీవితకాలంలో చోటు చేసుకునే ఉత్పరివర్తనాల సంఖ్య దాదాపు సమానంగా ఉంటున్నట్లు గుర్తించారు. అయితే ఈ జన్యు మార్పులు ఎంత తక్కువ వేగంగా జరిగితే ఆయా జంతువులు అంత ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు నిర్ధారించారు. మానవ కణాల్లో ఏటా దాదాపు 20-50 ఉత్పరివర్తనాలు చోటు చేసుకుంటుంటాయని వాటిలో అత్యధికం హానికరం కానివేనని పరిశోధకులు తెలిపారు.

డీఎన్‌ఏ నిర్మాణాన్ని కోల్పోతున్న చేపలు

మనిషి చేసే నిర్లక్ష్యం ప్రకృతి స్వరూపాన్ని మార్చేస్తుందని బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) అధ్యయనం తేల్చింది. గృహాలు, కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు, ప్టాస్లిక్‌ రేణువులు జలచరాల సహజ నిర్మాణాలను ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఐఐఎస్‌సీలోని ‘కణాల పునరుత్పత్తి, జన్యువుల అభివృద్ధి’ విభాగం ఆచార్యుడు ఉపేంద్ర నాంగ్‌తోంబా నేతృత్వంలోని బృందం కావేరి జలాల కాలుష్యంపై అధ్యయనం చేసింది. అందులో జీవించే చేపల ఆరోగ్యం, వాటి డీఎన్‌ఏ నిర్మాణాలపై కాలుష్యం చూపే ప్రభావాన్ని తేటతెల్లం చేసింది. కావేరి నది నుంచి సేకరించిన చేపలంటే ఎంతో ఇష్టపడే నాంగ్‌తోంబా ఓ సారి వంకర్లు తిరిగిన చేపలను చూసి విస్తుపోయారు. ఒకే జన్యు సంతతికి చెందిన చేపలు వేగంగా ప్రవహించే నీరున్న ప్రాంతంలో ఒకలా, నిదానంగా ప్రవహించే చోట మరోలా, ఆగి ఉన్న జలంలో ఇంకోలా శరీరాకృతి కలిగి ఉండటాన్ని గుర్తించారు. ఇలా వివిధ రకాల నీటిని రామన్‌ స్పెక్ట్రోస్కోపీ ద్వారా పరిశీలిస్తే సాధారణ కళ్లకు కనిపించని పరిమాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్లాస్టిక్‌లో కొన్ని రసాయన రేణువులు కూడా ఉన్నట్లు తేల్చారు. ఇవి ఆమ్లజనిక శ్వాస వ్యవస్థతో జీవించే జీవరాసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ బృందం తేల్చింది. ప్లాస్టిక్‌ సూక్ష్మ రేణువులు చేపలు శ్వాసించే ఆక్సిజన్‌ను అడ్డుకుంటాయని నాంగ్‌తోంబా తెలిపారు.

కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌తో ఔషధాల ఆవిష్కరణ

ఆధునిక సాంకేతికతతో ఔషధాల తయారీకి ఊతమిచ్చే ప్రక్రియలను గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) ఆచార్యులు ఆవిష్కరించారు. పది రకాల మెషిన్‌లెర్నింగ్‌ పద్ధతులను ఉపయోగించి ఔషధాల తయారీ చేపట్టవచ్చని నిరూపించారు. ఐహబ్‌ డాటా సెంటర్‌ అకడమిక్‌ హెడ్‌ ప్రొ.దేవకుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయా పరిశోధనలపై పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. ఔషధాల ఆవిష్కరణలో ఆధునిక పద్ధతులు కనుగొనే లక్ష్యంతో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌ (ఎన్‌ఎం-ఐసీపీఎస్‌) కింద ట్రిపుల్‌ఐటీలో ఐహబ్‌ - డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2020 అక్టోబరు నుంచి పరిశోధకులు ఆ దిశగా దృష్టిపెట్టారు. వాస్తవంగా ఏదైనా ఔషధం తయారు చేయాలంటే 12-15 ఏళ్ల సమయం పడుతుంది. ముందుగా సంబంధిత వ్యాధికి ఏ అణువు (మాలిక్యుల్‌) సమర్థంగా పనిచేస్తుందనేది గుర్తించాలి. అనంతరం దాన్ని ఔషధంగా మార్చాలి. ఈ క్రమంలో ముందస్తు క్లినికల్‌ పరీక్షలు నిర్వహించాలి. ఇందులో భాగంగా జంతువులు, కణజాలంపై పరీక్షలు జరపడం ఇబ్బందికరంగా మారింది. ఆలస్యానికీ కారణమవుతోంది. ఆయా సమస్యలకు చెక్‌ పెట్టేలా పది రకాల పద్ధతులను తాము అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ట్రిపుల్‌ఐటీ ఆచార్యులు వెల్లడించారు. ‘వాస్తవానికి సంప్రదాయ పద్ధతుల్లో ఎన్నో పరిమితులు ఉన్నాయి. సమర్థతను గుర్తించే క్రమంలో ఔషధ మాలిక్యుల్స్‌ను ఎక్కువ సంఖ్యలో వినియోగించేందుకు వీలుండదు. వీటిన్నింటికీ కృత్రిమమేధ, మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలతో అడ్డుకట్టు వేయొచ్చు. అలాగే సంప్రదాయ పద్ధతిలో చేసే క్లినికల్‌ పరీక్షలు, ముందస్తు క్లినికల్‌ పరీక్షలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. కృత్రిమ మేధను ఉపయోగించి ఎక్కువ సంఖ్యలో ప్రయోగాలను తక్కువ ఖర్చుతో చేయొచ్చు’ అని ఐహబ్‌ డాటా పరిశోధక ఇంజినీర్‌ లఘువరపు సిద్ధార్థ, ప్రొఫెసర్‌ దేవప్రియకుమార్‌ వెల్లడించారు.

కర్బన ఉద్గారాలపై కొత్త అస్త్రాన్ని అభివృద్ధి చేసిన గువాహటి ఐఐటీ

థర్మల్‌ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఒడిసిపట్టడానికి ఐఐటీ - గువాహటి పరిశోధకులు సరికొత్త ‘కార్బన్‌ క్యాప్చర్‌’ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో జాతీయ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ (ఎన్‌టీపీసీ‡) భాగస్వామ్యం కూడా ఉంది. బయోగ్యాస్‌ ప్లాంట్లు, పెట్రోలియం శుద్ధి కర్మాగారాల నుంచి పెద్దఎత్తున కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయువు వెలువడుతుంటుంది. ఇది భూ ఉష్ణోగ్రత పెరుగుదలకూ, తద్వారా వాతావరణ మార్పులకు కారణమవుతోంది. థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ఇంధనాన్ని, ఇతర పదార్థాలను మండించడం వల్ల వెలువడే వాయువుల మిశ్రమాన్ని ఫ్లూ గ్యాస్‌ అంటారు. దీనిలో నుంచి కార్బన్‌ డైఆక్సైడ్‌ను వేరుచేయడానికి ఇంతవరకు వాడుతున్న ఎండీఈఏ, ఎంఈఏ సాల్వెంట్లకన్నా తక్కువ విద్యుత్‌ను వాడి ఎక్కువ ఫలితాన్ని సాధించే సరికొత్త యాక్టివేటెడ్‌ ఎమైన్‌ సాల్వెంట్‌ సాంకేతికతను ఐఐటీ-గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. అనంతరం దీన్ని ప్రయోగ పరీక్షల కోసం ఎన్‌టీపీసీకి చెందిన నేత్ర కేంద్రానికి తరలించారు. తమ ప్రాజెక్టు ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడుతుందని ఐఐటీ-గువాహటి కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన విష్ణుపద మండల్‌ వివరించారు. రసాయన పరిశ్రమల్లో వెలువడే కార్బన్‌ డైఆక్సైడ్‌ నుంచి కర్బనాన్ని వేరుచేయడానికి సాల్వెంట్‌ ఆధారిత సాంకేతికతలను వాడుతున్నారు. బొగ్గు, సహజవాయువులను మండించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాల్లో ఈ సాంకేతికత ఆధారంగా ఆహార పరిశ్రమకు అనువైన కార్బన్‌ డైఆక్సైడ్‌ను తక్కువ పరిమాణాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియకు చాలా ఎక్కువ విద్యుత్‌ కావాలి. ఖర్చు కూడా ఎక్కువ కాబట్టి భారీ విద్యుత్కేంద్రాలకు పాత సాల్వెంట్‌ ప్రక్రియలు అనువైనవి కావు. వాటి స్థానంలో తాము రూపొందించిన సరికొత్త ప్రక్రియ అద్భుతంగా ఉపయోగపడుతుందని మండల్‌ చెప్పారు.

రెండోరోజు ‘హెలీనా’ పరీక్ష విజయవంతం

ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణి హెలీనాను భారత్‌ రెండోసారి విజయవంతంగా పరీక్షించింది. ఈ అస్త్రాన్ని తొలిసారిగా ఏప్రిల్‌ 11న పరీక్షించిన సంగతి తెలిసిందే. రెండు సందర్భాల్లోనూ క్షిపణిని ధ్రువ్‌ హెలికాప్టర్‌ నుంచి ప్రయోగించారు. తాజా పరీక్షను భిన్న ప్రమాణాల్లో నిర్వహించినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

హెలీనా క్షిపణి పరీక్ష విజయవంతం

ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణి ‘హెలీనా’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించాయని రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ధ్రువ్‌ హెలికాప్టర్‌ నుంచి దీన్ని ప్రయోగించామని, నిర్దేశిత లక్ష్యాన్ని అది విజయవంతంగా ఛేదించిందని పేర్కొంది.

బ్యాక్టీరియా సాయంతో భూసార రక్షణకు నూతన విధానాన్ని ఆవిష్కరించిన ఐఐటీ మండీ పరిశోధకులు కొండ ప్రాంతాల్లో భూమి కోత నివారణకు ‘ఎస్‌ పాశ్చరి’ అనే నిరపాయకర బ్యాక్టీరియాను వినియోగించే నూతన విధానాన్ని హిమాచల్‌ప్రదేశ్‌లోని ఐఐటీ - మండీ పరిశోధకులు ఆవిష్కరించారు. కుండపోత వర్షాలు, భూకంపాల కారణంగా భూసారం కొట్టుకుపోవడం, మట్టిపెళ్లలు విరిగిపడటం పర్వత ప్రాంతాల్లో సాధారణ పరిణామమే. దీన్ని నివారించడానికి భూ స్థిరీకరణ తోడ్పడుతుంది. భూ స్థిరీకరణకు అంటే మట్టి పొరలను గట్టిగా పట్టినిలపడానికి రసాయనాల బదులు సహజ పద్ధతులను అనుసరించాలని శాస్త్రజ్ఞులు సిఫార్సు చేస్తున్నారు. పటుత్వం తగ్గి వదులుగా ఉన్న నేలల్లో భవనాలను నిర్మించడానికి మట్టిని విపరీతమైన ఒత్తిడితో గట్టిపరుస్తారు. దీన్ని కంప్రెషన్‌ ప్రక్రియ అంటారు. లేదా కొన్ని రసాయనాలను ఇంజెక్ట్‌ చేయడం ద్వారా నేల బిగువును పెంచుతారు. ఇలాంటి కృత్రిమ పద్ధతుల్లో సాధించిన భూ స్థిరీకరణ నేలకు దీర్ఘకాలం పటుత్వాన్ని ఇస్తుంది. కానీ, ఈ కృత్రిమ పద్ధతుల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. అందువల్ల బ్యాక్టీరియా సాయంతో సహజంగా నేల పటుత్వాన్ని పెంచి భూసార క్షయాన్ని నివారించడానికి ఐఐటీ- మండీ పరిశోధకులు నడుం బిగించారు. ఈ పద్ధతిలో మట్టి రేణువుల మధ్య సూక్ష్మ ఖాళీల్లో క్యాల్షియం కార్బొనేట్‌ను ఉత్పత్తి చేసి మట్టిని గట్టిగా పట్టి నిలపడానికి ‘ఎస్‌ పాశ్చరి’ అనే బ్యాక్టీరియాను ఉపయోగించారు. ఇటుకలను సిమెంటు గట్టిగా పట్టి నిలిపినట్లే ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే క్యాల్సైట్‌ మట్టి రేణువులను గట్టిగా బంధిస్తుంది.

అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు పరిశోధనలు

రాకెట్‌ ద్వారా మానవులను అంతరిక్షÛంలోకి పంపేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని, ఇవి ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని ఇస్రో మాజీ ఛైర్మన్‌ డా.కె.శివన్‌ తెలిపారు. ఆయన తమిళనాడులోని నాగర్‌కోవిల్‌లో జీఎస్‌ఎల్వీ-3 రాకెట్‌ ద్వారా మానవులను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడించారు. తొలుత రెండు సార్లు చేపట్టే పరిశోధనల్లో రోబోలను అంతరిక్షంలోకి పంపుతామని, అది విజయవంతమైతే మానవులను పంపుతామన్నారు.

పినాక క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం

శత్రువుపై శరపరంపరగా నిప్పులు కురిపించే బహుళ రాకెట్‌ ప్రయోగ వ్యవస్థ ‘పినాక’కు సంబంధించిన కొత్త వెర్షన్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఇది జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆయుధ వ్యవస్థను పినాక ఎంకే-1 (ఎన్‌హెన్స్‌డ్‌) రాకెట్‌ సిస్టమ్‌ (ఈపీఆర్‌ఎస్‌)గా పేర్కొంటున్నారు. మొత్తం మీద 24 రాకెట్లను పరీక్షించినట్లు అధికారులు వివరించారు. ఇవి గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. ఈ రాకెట్‌ వ్యవస్థకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను జోడించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా వాటి పరిధి పెరిగినట్లు వివరించారు. పినాక ఏరియా డినైల్‌ మునిషన్‌ (ఏడీఎం) రాకెట్‌ వ్యవస్థనూ పరీక్షించినట్లు తెలిపారు. ఈ రాకెట్‌ వ్యవస్థలను పుణెలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ), హై ఎనర్జీ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ (హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌) అభివృద్ధి చేశాయి.

పాక్‌ పరీక్షించిన షహీన్‌-3 క్షిపణి విజయవంతం

ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి షహీన్‌-3ని పాకిస్థాన్‌ సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఇది 2,750 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. భారత్‌లోని అనేక నగరాలు ఈ అస్త్రం పరిధిలోకి వస్తాయి. డిజైన్, సాంకేతికపరమైన అనేక అంశాలపై మదింపు వేయడానికి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇది భారత్‌లోని ఈశాన్య ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులనూ తాకగలదని పాక్‌ మీడియా పేర్కొంది. ‘‘ఇది ఘన ఇంధనంతో నడిచే క్షిపణి. ఇందులో పోస్ట్‌ సెపరేషన్‌ ఆల్టిట్యూడ్‌ కరెక్షన్‌ (పీఎస్‌ఏసీ) వ్యవస్థ ఉంది. దీనివల్ల క్షిపణి గమనాన్ని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయవచ్చు. ఫలితంగా దాని కచ్చితత్వం పెరుగుతుంది. ప్రత్యర్థుల క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలుగుతుంది’’ అని పాక్‌ సైన్యం తెలిపింది. షహీన్‌-3ని తొలిసారిగా 2015 మార్చిలో పరీక్షించారు.

కొలెస్ట్రాల్‌ తగ్గించే ఔషధాలతో దుష్ప్రభావాలు: సీసీఎంబీ

కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలను దీర్ఘకాలం వినియోగించడం కణాల నిర్మాణంలో మార్పులకు దారితీస్తున్నట్లు సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ ఇలాంటివి గుర్తించినప్పటికీ పరమాణు స్థాయిలో ఇప్పటివరకు ఆధారాలు లభ్యం కాలేదని, సీసీఎంబీ ఆచార్యులు చటోపాధ్యాయ బృందం కణ స్థాయిలో మార్పులను గుర్తించిందని సీసీఎంబీ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధాల్లో స్టాటిన్స్‌ ఒకటి. రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి రోగులకు వీటిని అందిస్తుంటారు. కీలక ఎంజైమ్‌ (హెచ్‌ఎంజీ-సీవోఏ)ను నిరోధించేలా ఇవి పనిచేస్తాయి. అయితే వాడకం ఎక్కువైనప్పుడు కణ నిర్మాణంలో మార్పులను అవి ఎలా ప్రేరేపిస్తాయో సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు.

సాధారణంగా కణం ఆక్టిన్‌ల వంటి ప్రోటీన్లతో తయారవుతుంది. ఆక్టిన్‌లు శరీరంలోని ప్రతి కణం చుట్టూ ప్లాస్మా పొర కింద ఉంటాయి. కణాలు ఆకారాన్ని, పరిమాణాన్ని కల్గి ఉండటానికి అవి దోహదం చేస్తాయి. స్టాటిన్‌ ఔషధం రక్తంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు, కణ నిర్మాణానికి కీలకమైన ఆక్టిన్‌ ప్రొటీన్ల పాలిమరైజేషన్‌ను ప్రేరేపిస్తోంది. తద్వారా కణాల పరిమాణం, పనితీరులో మార్పులు జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది అని సీసీఎంబీ వెల్లడించింది. ఈ వివరాలు తాజాగా అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ నుంచి వెలువడే జర్నల్‌ ఆఫ్‌ లిపిడ్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైనట్టు పేర్కొంది.


ప్రపంచంలోనే మొదటి మూడు డోసుల యాంటీ - రేబిస్‌ టీకా

క్యాడిల్లా ఫార్మా మూడు డోసుల యాంటీ - రేబిస్‌ టీకాను అభివృద్ధి చేసింది. రీకాంబినెంట్‌ నానో పార్టికల్‌ ఆధారిత జి ప్రొటీన్‌తో రూపొందించిన ఈ టీకాను ‘థైరెబిస్‌’ అనే పేరుతో ఆవిష్కరించింది. కుక్క కాటుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీ - రేబిస్‌ టీకాలన్నీ అయిదు డోసుల టీకాలు కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ మూడు డోసుల టీకా బాధితులకు అనువైనదిగా ఉంటుందని, ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతుందని క్యాడిల్లా ఫార్మా సీఎండీ రాజీవ్‌ మోదీ పేర్కొన్నారు.

మన దేశంలో ఏటా 1.5 కోట్ల మంది కుక్క కాటుకు గురవుతున్నారు. ఇందులో 20,000 మందికి ప్రాణ హాని కలుగుతోంది. సరైన సమయంలో నిర్ణీత షెడ్యూలు ప్రకారం బాధితులకు టీకా ఇవ్వగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. చాలా మంది అసలు వైద్యులే సంప్రదించకపోవటం, టీకాలు తీసుకోకపోవటం, లేదా ఒకటి- రెండు డోసులు తీసుకొని ఆ తర్వాత డోసులు విస్మరించటం జరుగుతోంది. దీంతో రెబీస్‌ వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది.

మూడు డోసులు యాంటీ - రెబీస్‌ టీకాను అభివృద్ధి చేయటానికి 12 సంవత్సరాల సమయం పట్టినట్లు క్యాడిల్లా ఫార్మా వెల్లడించింది. ఈ టీకా క్లినికల్‌ పరీక్షల్లో ఎంతో ప్రభావాన్ని, భద్రతను కనబరచినట్లు, దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు వివరించింది. తొలిదశలో గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో తమ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు క్యాడిల్లా ఫార్మా సీఎండీ రాజీవ్‌ మోదీ తెలిపారు. ఒక టీకా వయల్‌కు రూ.750 ధర నిర్ణయించినట్లు, మూడు డోసులకు రూ.2,145 ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.


కొలెస్ట్రాల్‌ అసాధారణ స్థాయులతో మధుమేహ ముప్పు: ఐడీఎస్‌ గుర్తింపు

కొత్తగా మధుమేహ వ్యాధి (టైప్‌-2 డయాబెటిస్‌) బారిన పడుతున్నవారిలో 80 శాతం మందిలో కొలెస్ట్రాల్‌ స్థాయులు అసాధారణంగా కనిపిస్తున్నాయని ఇండియన్‌ డయాబెటిస్‌ స్టడీ (ఐడీఎస్‌) గుర్తించింది. ఈ రోగుల్లో అతి తక్కువ హెచ్‌డీఎల్‌ (మంచి కొలెస్ట్రాల్‌)తో పాటు ఎక్కువ ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌) ఉంటున్నట్లు వెల్లడించింది. ఎరీస్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 2020 - 21 మధ్యకాలంలో 5,080 మందిపై ఈ అధ్యయనం చేసినట్లు ఐడీఎస్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ ఏజీ ఉన్నికృష్ణన్, ఎండోక్రైనాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, ఉస్మానియా మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ సహాయ్‌ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కొలెస్ట్రాల్‌ హెచ్చుతగ్గుల వల్ల మధుమేహమే కాకుండా.. కార్డియోవాస్క్యులర్‌ వ్యాధుల (సీవీడీ) ముప్పు పొంచి ఉన్నట్లేనని హెచ్చరించారు. ఇలాంటివారు ప్రధానంగా ఆహార మార్పులతోపాటు శారీరక వ్యాయామాలు, రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. కొలెస్ట్రాల్‌ స్థాయులు సాధారణ స్థితిలో ఉండేలా చికిత్సలు తీసుకోవాలన్నారు. చెడు కొలెస్ట్రాల్‌ వల్ల చిన్న వయసులోనే కొందరు ఆకస్మిక గుండె వైఫల్యాల బారిన పడుతున్నారని వివరించారు.

కొత్తగా టైప్‌-2 మధుమేహ వ్యాధి బారిన పడిన 55.6 శాతం మందిలో హెచ్‌డీఎల్‌-సి (హై డెన్సిటీ లిపిడ్‌-కొలెస్ట్రాల్‌) విలువలు తక్కువగా నమోదయ్యాయి. 82.5 శాతం మంది రోగుల్లో ఏదో ఒక రకమైన కొలెస్ట్రాల్‌ అసాధారణంగా ఉంటోంది.

42 శాతం మంది అధిక రక్తపోటు వ్యాధి ముప్పునకు చేరువలో ఉన్నారు. 37.3 శాతం మంది అప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నారు.

ఈ రోగుల్లో బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 27.2 (అధిక బరువు)గా ఉంది.

11.2 శాతం మందిలో మూత్రపిండాల వైఫల్య సమస్య కనిపిస్తోంది.


ఎస్‌ఎఫ్‌డీఆర్‌ బూస్టర్‌ ప్రయోగం విజయవంతం

సూపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లే దీర్ఘశ్రేణి క్షిపణుల రూపకల్పనలో భారత్‌ మరో ముందడుగు వేసింది. ఈ దిశగా ఒక రాకెట్‌ చోదక వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. ‘సాలిడ్‌ ఫ్యూయెల్‌ డక్టెడ్‌ రామ్‌జెట్‌ (ఎస్‌ఎఫ్‌డీఆర్‌) బూస్టర్‌ను ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌) నుంచి ప్రయోగించారు. గగనతలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే క్షిపణుల పరిధిని పెంచడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఫలితంగా శత్రు యుద్ధవిమానాలు, ఇతర ఆయుధ వ్యవస్థలను చాలా దూరం నుంచే సూపర్‌సోనిక్‌ వేగంతో నేల కూల్చొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. తాజా ప్రయోగాన్ని రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో - ఆప్టికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలతో నిశితంగా పరిశీలించామని వివరించాయి. ఈ సంక్లిష్ట క్షిపణి వ్యవస్థలోని అన్ని కీలక భాగాలు సక్రమంగా పనిచేశాయని పేర్కొన్నాయి. ఎస్‌ఎఫ్‌డీఆర్‌ను హైదరాబాద్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్‌) అభివృద్ధి చేసింది. నగరంలోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ), పుణెలోని హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌ వంటి ప్రయోగశాలలు ఇందులో భాగస్వామ్యం వహించాయి.

దేశీయంగా తయారైన తొలి విమానం... డోర్నియర్‌ 228

దేశీయంగా తయారైన తొలి విమానం డోర్నియర్‌ 228 తమకు చేరినట్లు ప్రభుత్వరంగ అలయన్స్‌ ఎయిర్‌ సంస్థ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించేందుకు ఈ విమానాన్ని వినియోగించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వరంగంలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేస్తున్న 17 సీట్ల డోర్నియర్‌ 228 విమానాలు కొనుగోలు చేసేందుకు గత ఫిబ్రవరిలో అలయన్స్‌ ఎయిర్‌ ఒప్పందం చేసుకుంది. పగలు, రాత్రి ప్రయాణానికి ఈ విమానం అనువైనదని సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు డోర్నియర్‌ విమానాలను సైనికుల అవసరాలకు వినియోగిస్తున్నారు.

హైపర్‌ సోనిక్‌ క్షిపణుల అభివృద్ధికి ఆకస్‌ కూటమి నిర్ణయం

హైపర్‌ సోనిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయాలని ఇటీవల ఏర్పడిన ‘ఆకస్‌’ కూటమి నిర్ణయించిందని, ఈ విషయమై త్వరలోనే ప్రకటన రానుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యంత్రాంగంలోని ఓ అధికారి తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు ‘ఆకస్‌’ భద్రతా కూటమిని గతేడాది సెప్టెంబరు నెలలో ఏర్పాటుచేశారు. హిందూ మహాసముద్రంలో చైనా సైనిక ప్రాబల్యం పెరగడంపై అమెరికా, దాని మిత్రపక్షాల్లో ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఉద్భవించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడానికి తనకు అధికారం లేదని, అందువల్ల తన వివరాలు బహిర్గతం చేయవద్దన్న నిబంధనపై ఆయన మాట్లాడారు. ‣ గతేడాది అక్టోబరు నెలలో అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే మాట్లాడుతూ.. హైపర్‌సోనిక్‌ ఆయుధాలపై పరిశోధన కోసం 4.7 బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని పెంటగాన్‌కు సంబంధించిన 2023 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇందులో వచ్చే ఏడాదికల్లా హైపర్‌సోనిక్‌ క్షిపణి విభాగాన్ని ఏర్పాటుచేయాలని, 2025 నాటికి సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణిని, 2027కల్లా గగనతలం నుంచి ప్రయోగించే క్రూయిజ్‌ క్షిపణిని సిద్ధం చేయాలన్న ప్రణాళికలు ఉన్నాయి.

సరికొత్త ‘డ్రైవ్‌ట్రైన్‌’ల ఆవిష్కరణ

భారతీయ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకూ, వివిధ వాతావరణ పరిస్థితులకూ అనుకూలమైన విద్యుత్‌ వాహనాలను (ఈవీ) తయారు చేసేందుకు వీలుగా ఐఐటీ - గువాహటి శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈవీలు భారతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి కావు. పరిశోధకులు కూడా మన దేశంలో ఈ వాహనాల సామర్థ్యాలను (డ్రైవ్‌ సైకిల్స్‌) ఇంతవరకూ పరిగణనలోకి తీసుకోలేదు. అయితే విద్యుత్‌ వాహనాల్లో వినియోగించే మోటార్లు, బ్యాటరీలకు తాము రూపొందించిన సాంకేతికత రేటింగ్‌ ఇవ్వనుందనీ, భారత వాతావరణానికి అనుకూలమైన ఉత్తమ వాహన భాగాలను వినియోగించేలా పరికరాల తయారీదారులకు ఇది ప్రామాణికం కానుందని పరిశోధకులు చెప్పారు. ‣ బ్యాటరీ/ఇంధన వినియోగాన్ని, ఉద్గారాలను తగ్గించేందుకూ ఇది ఉపకరిస్తుందని వారు వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు. భారత వాతావరణ పరిస్థితులనూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాలనూ వీరు దృష్టిలో పెట్టుకుని వాహనంలో విద్యుత్తును ఉత్పత్తిచేసే పరికరాలను (డ్రైవ్‌ట్రైన్‌లను) రూపొందించాల్సిన విధానాన్ని అభివృద్ధి చేశారు. తద్వారా ఇంజిన్‌తో అనుసంధానమైన చక్రాలకు మరింత శక్తి అందనుంది. ఈవీ రంగంలో స్థిరమైన అభివృద్ధి సాధనకు తాము రూపొందించిన సాంకేతికత ఉపకరిస్తుందని, విద్యుత్‌ వాహనాల సామర్థ్యాన్ని పెంచేందుకూ ఇది దోహదపడుతుందని గువాహటి ఐఐటీ డైరెక్టర్‌ టి.జి.సీతారాం పేర్కొన్నారు.

సాగర ఉష్ణోగ్రతలు చెప్పే చేపలు

గడిచిన కాలంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే విధానాన్ని ఖరగ్‌పుర్‌లోని ఐఐటీ, పుణెలోని డెక్కన్‌ కాలేజీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. చేపల్లో విడుదలయ్యే కాల్షియం కార్బొనేట్‌ ఆధారంగా ఈ వైరుధ్యాలను గుర్తించొచ్చని వారు తేల్చారు. ఈ జీవుల చెవి ఎముకల వద్ద ఈ కార్బొనేట్లు పేరుకుపోతుంటాయి. ‣ సముద్రాల్లో అన్నిచోట్లా పరికరాలతో ఉష్ణోగ్రతలను సేకరించడం సాధ్యం కాకపోవచ్చు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు తమ విధానం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా గడిచిన కొన్నేళ్లలో వారం, నెల వ్యవధిలో సాగర ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ ప్రాంతంలోని చేపల చెవి భాగంలోని ఎముకను కార్బన్‌ డైఆక్సైడ్‌ లేజర్‌ సాయంతో సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తే వాటి ఆక్సిజన్‌ ఐసోటోపుల తీరుతెన్నులను గుర్తించొచ్చని వివరించారు. ఈ చేపలు పెరిగే నీటి ఉష్ణోగ్రతలపై ఈ ఐసోటోపులు ఆధారపడి ఉంటాయి. అందువల్ల వాటి జీవితకాలంలో చోటుచేసుకున్న మార్పులను వీటి ద్వారా గుర్తించొచ్చని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన అనింద్యా సర్కార్‌ తెలిపారు.

కృత్రిమ మేధతో వ్యవ‘సాయానికి’ రోబో ఎక్స్‌ మిషిన్స్‌ అంకుర సంస్థ రూపకల్పన

కూలీల కొరతను అధిగమించే రోబో వచ్చేసింది. పని, ఆర్థిక భారాలను తగ్గించుకునేలా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో దీన్ని రూపొందించింది ఎక్స్‌ మిషిన్స్‌ అంకుర సంస్థ. దీనితో విత్తనాలు నాటడం, కలుపు మొక్కల తొలగింపు, పురుగుమందు పిచికారి వంటి పనులు చేయొచ్చు. జాతీయ సంస్కృతీ మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శనలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పొలంలో వరుసల (సాళ్ల) మధ్య వదిలితే అది ఇతర మొక్కలపై కలుపు నివారణ మందు పిచికారి చేస్తుందని అంకుర సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‣ కూలీలు లేకుండా రిమోట్‌ కంట్రోల్‌తో పొలాల్లో ఈ యంత్రంతో అన్ని పనులు చేయవచ్చు. నిర్దిష్టమైన లోతు, దూరాల్లో విత్తనాలు, మొక్కలు నాటేందుకు అనువుగా ఉంటుంది. మొక్కలు నాటేటప్పుడు దీని సాయంతో రసాయనాలు చల్లి కలుపు నియంత్రించొచ్చు. అతి తక్కువ మోతాదులో రసాయనాల వినియోగం ఉంటుంది. 40 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును ఈ యంత్రంపై అమర్చుతారు. ఇందులో రసాయనాల మిశ్రమాన్ని నింపితే మొక్కకు సరిపడా ద్రావణాన్ని పిచికారి చేస్తుంది. 600 వాల్ట్‌ కలిగిన బ్యాటరీతో 100 కిలోల బరువుతో ఈ మిషన్‌ రూపొందించారు. రోబోటిక్‌ మిషన్‌తో తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయొచ్చు. పెట్టుబడులు, రసాయనాల వినియోగం కూడా తగ్గుతుంది. ఇక్రిశాట్, ఐఐఐటీ ఇంక్యుబేషన్‌లో రూపాంతరం చెందగా ఐఎస్‌బీ సహకారంతో దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు ఎక్స్‌మిషిన్స్‌ సీవోవో మేడిబోయిన ధర్మతేజ తెలిపారు.

అధిక సాంక్రమికశక్తితో ‘ఎక్స్‌ఈ’

కొవిడ్‌-19 ఒమిక్రాన్‌ వేరియంట్‌లో కొత్త రకం.. తొలిసారి బ్రిటన్‌లో గుర్తించిన దీనికి గతంలోని స్ట్రెయిన్‌ల కంటే ఎక్కువ సాంక్రమికశక్తితో ఉన్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఒమిక్రాన్‌ ఉపరకాలైన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ ఉత్పరివర్తన రకమైన దీన్ని ‘ఎక్స్‌ఈ’గా పేర్కొంది. ఈ ఏడాది జనవరి 19న దీన్ని కనుగొన్నట్లు తెలిపింది. అప్పటినుంచి 600కు పైగా జన్యుక్రమాలు నమోదైనట్లు పేర్కొంది. దీనిపై మరింత సమగ్రంగా వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. ఈమేరకు కొవిడ్‌ మహమ్మారి విషయంలో ఎలాంటి ఉదాసీనతకు చోటివ్వొద్దని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ‘ఎక్స్‌ఈ’కి సంబంధించి.. వ్యాధి లక్షణాలు, వ్యాప్తి తీరుతెన్నులు, తీవ్రత వంటివన్నీ తేలేంతవరకూ దీన్ని ఒమిక్రాన్‌కు సంబంధించినదిగానే పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి మిశ్రమ రకాలతో ప్రజారోగ్యానికి ముప్పు, సార్స్‌-కోవ్‌-2 వేరియంట్లు తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, మరిన్ని ఆధారాలు లభ్యం కాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. అనేక దేశాల్లో కొవిడ్‌ పరీక్షలు తగ్గించడం పట్ల ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.

122 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎండలు

ఈ ఏడాది మార్చి నెల దాదాపు అగ్నిగుండాన్ని తలపించిందంటోంది భారత వాతావరణ విభాగం(ఐఎండీ).. గత 122 ఏళ్లలో ఏ మార్చి నెలలోనూ నమోదవ్వని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది రికార్డయ్యాయని పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 33.10 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 122 ఏళ్లలో ఇదే అత్యధికం’’ అని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంత అసాధారణ వేడికి వర్షపాతం తగ్గిపోవడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నెల దేశవ్యాప్త వర్షపాత సుదీర్ఘ సగటు 30.4 మిల్లీమీటర్లు. ఈసారి అది కేవలం 8.9 మిల్లీమీటర్లకే పరిమితమైంది. దాదాపు 71 శాతం తక్కువ. 1908 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతం కూడా.

విద్యుత్‌ బస్‌ ఇ9 ఆవిష్కరణ

వాణిజ్య విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ‘ఎకా’ తన తొలి విద్యుత్‌ బస్‌ అయిన ఇ-9ను తీసుకొచ్చింది. ఎకా, పినాకిల్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ సుధీర్‌ మెహతాతో కలిసి మహారాష్ట్ర పర్యాటకం, పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే ఇ-బస్‌ను ఆవిష్కరించారు. 200 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్‌ మోటార్‌తో ఎక్కువ వేగం, హార్స్‌పవర్‌తో ఎటువంటి రోడ్డుపైన అయినా ఎకా ఇ9 వెళ్తుంది.