వార్తల్లో ప్రాంతాలు



1857 నాటి అమరవీరుల సామూహిక అస్థి పంజరాల గుట్టు విప్పిన సీసీఎంబీ

→పంజాబ్‌లోని అజ్నాలాలో ఓ పాడుబడిన బావిలో 2014లో బయటపడిన సామూహిక అస్థిపంజరాల గుట్టును అణు, కణ పరిశోధన సంస్థ (సీసీఎంబీ) ఛేదించింది.
→ఇవి గంగా నది మైదాన ప్రాంతాలైన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, బెంగాల్‌కు చెందిన అమరవీరులవని తెలిపింది.
→ చారిత్రక ఆధారాల ప్రకారం ఈ అస్థి పంజరాలు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్‌ సైన్యం చేతిలో మరణించిన భారతీయ సైనికులవి.
→ శాస్త్రీయ ఆధారాల కోసం పంజాబ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్‌ జె.ఎస్‌.సెహ్రావత్, సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్, లఖ్‌నవూలోని బీర్బల్‌ సాహ్ని ఇన్‌స్టిట్యూట్, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి.
→ డీఎన్‌ఏ విశ్లేషణకు 50 నమూనాలను, ఐసోటోప్‌ విశ్లేషణకు 85 నమూనాలను పరిశోధించారు. రెండు పద్ధతుల్లోనూ విశ్లేషించగా అస్థి పంజరాలు పంజాబ్‌ లేదా పాకిస్థాన్‌లో నివసిస్తున్నవారివి కాదని తేలింది.
→ వాటి డీఎన్‌ఏ ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, బెంగాల్‌కు చెందిన పూర్వీకులతో సరిపోలాయని డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు. ఈ పరిశోధన పత్రం ఫ్రంటియర్స్‌ ఇన్‌ జనటిక్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

అరుదైన జైన మహాపాదం గుర్తింపు

→యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని పురావస్తు మ్యూజియంలో అరుదైన జైన మహాపాదాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు.
→మ్యూజియంలో కొనసాగుతున్న జీర్ణోద్ధరణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. గతంలో గ్రామ శివారులో లభ్యమైన ఈ జైన కుడి పాదం 4 అడుగుల పొడవు, అడుగున్నర వెడల్పుతో ఉందని, దానిపైన నూపురం, కాలివేళ్లకు అలంకారాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
→దీన్ని పోలిన రెండు జతల పాదాలు మహబూబ్‌నగర్‌ జిల్లా అల్వాన్‌పల్లి గొల్లత్తగుడి వెనక, మూడు పెద్ద పాదాలు నిర్మల్‌ జిల్లా భైంసాలో ఉన్నాయని వివరించారు.
పురాతన వస్తువులు లభ్యం :-
→యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలోని శ్రీకోదండ రామస్వామి ఆలయం వద్ద పురాతన వస్తువులు లభ్యమయ్యాయి.
→ శ్రీరామనవమి సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను చదును చేస్తుండగా రెండు రాగి బిందెలు, పూజా సామగ్రితో సహా 43 వస్తువులు లభించినట్లు ఆలయ ఛైర్మన్‌ శంకర్‌నాయక్, కమిటీ సభ్యులు తెలిపారు.
→ ఈ పురాతన వస్తువులను పురావస్తు శాఖకు అందజేస్తామని తహసీల్దార్‌ పద్మసుందరి తెలిపారు.


సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో లఖ్‌నవూ ఆదర్శం

→యువతులు, మహిళలు, చిన్నారులు సురక్షితంగా జీవించే నగరాల జాబితాలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా స్త్రీ వ్యతిరేక హింసను కట్టడి చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌ సహా ఎనిమిది నగరాల్లో ‘సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. నిర్భయ నిధి కింద 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. కేంద్రం ఎంపిక చేసిన ఎనిమిది నగరాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ దూసుకెళ్తుండగా హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రాజెక్టు కింద నగరానికి రూ.272 కోట్లు కేటాయించారు. పథకం కింద వివిధ చర్యల్ని మరింత వేగంగా చేపడితే హైదరాబాద్‌ సురక్షిత నగరాల్లో జాబితాలో సగర్వంగా నిలిచే అవకాశం ఉంది.
లఖ్‌నవూ ఆదర్శం :-
→లఖ్‌నవూలో వేధింపులు ఎదుర్కొంటున్నవారు ఫోన్లు చేయాల్సిన అవసరం లేకుండా హాట్‌స్పాట్‌లలో కృత్రిమ మేధతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి మహిళల ముఖ కవళికల్లో మార్పులను గుర్తించి సమీప పోలీస్‌ ఠాణాలకు సమాచారమిస్తాయి. ‘పింక్‌ ఆర్మీ’ పేరుతో 100 బైక్‌లు, 20 పెట్రోకార్లు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయి.
→ ముంబయిలో 5,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఠాణాలో మహిళల సహాయ కేంద్రాలను తెరిచారు. 356 హాట్‌స్పాట్‌లను గుర్తించి.. ఈవ్‌టీజర్లు, ఆకతాయిలను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు.
→ బెంగళూరు నలుమూలలా 7 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
→ చెన్నెలో బీచ్‌లు, జనసమ్మర్ద ప్రాంతాల్లో వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎనిమిది నగరాలు ఇవీ..
→లఖ్‌నవూ, బెంగళూరు, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్‌

హిమాచల్‌-లద్దాఖ్‌ అనుసంధానానికి ప్రపంచంలోనే ఎత్తయిన సొరంగం!

→ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగం.. భారత్‌లో నిర్మితం కానుంది. 16,580 అడుగుల ఎత్తులో ఉన్న షింకు లా పాస్‌లో దీన్ని నిర్మించనున్నారు.
→ఈ సొరంగం ద్వారా హిమాచల్‌ ప్రదేశ్‌ను లద్దాఖ్‌తో అనుసంధానం చేస్తామని సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ చౌధరి పేర్కొన్నారు.
→వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన జన్‌స్కర్‌కు రోడ్డును ఆయన ప్రారంభించారు. హిమాచల్‌ను లద్దాఖ్‌తో అనుసంధానించే సొరంగం పనులను ఈ ఏడాది జులై లోగా మొదలుపెడతామన్నారు.
→ 2025 కల్లా పూర్తిచేస్తామని చెప్పారు. ఇది జన్‌స్కర్‌ లోయ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని తెలిపారు.

చింతలపాలెంలో అపూర్వ శిల్పాల గుర్తింపు

→సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో అపూర్వ శిల్పాలను, శిథిల త్రికూటాలయాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.
→ (చాళుక్య శైలిలో కన్పించే ఆలయంలో) బ్రహ్మ, కేశవమూర్తి, ఆదిత్యుడు, భైరవ శిల్పాలు ప్రధానమైనవని బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ తెలిపారు. ఈ శిల్పాలలో త్రికూటాలయంలోని ప్రధాన దైవం శివలింగం కనిపించలేదని పేర్కొన్నారు.
→ బృంద సభ్యులు అహోబిలం కరుణాకర్, ఏలేటి చంటి క్షేత్రస్థాయిలో పరిశీలించారని ఆయన చెప్పారు.

రుద్రమకోటలో ఆదిమానవుల ఆవాసాలు!

→చారిత్రక సంపద పరిరక్షణలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం ముంపు ప్రాంతమైన వేలేరుపాడు మండలం రుద్రమకోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది.
→ఇందులో భాగంగా పూసలు, కుండలు క్రీస్తు పూర్వం నాటివని గుర్తించారు. అలంకరణకు వినియోగించిన తెలుపు, ఎరువు, పచ్చని రాతి పూసలు, మట్టిపాత్రలు, ఆయుధాలు లభ్యమయ్యాయని సహాయ సంచాలకులు కె.తిమ్మరాజు తెలిపారు.
→ఆదిమానవులు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకునే వారని, మరణానంతరం వారు వినియోగించిన వస్తువులను ఇలా సమాధుల్లో పూడ్చిపెట్టేవారనితెలిపారు.

350 ఏళ్ల నాటి మెట్ల బావి పునరుద్ధరణ

→కుతుబ్‌షాహీల పాలన చివరి రోజుల్లో సుమారు 350 ఏళ్ల క్రితం నిర్మించిన మెట్ల బావి అది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే అబ్బురపరిచే నిర్మాణశైలితో నిర్మితమైనా దశాబ్దాలుగా నిరాదరణకు గురై రూపురేఖలు కోల్పోయింది.
→తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఈమని శివనాగిరెడ్డి చొరవతో తిరిగి జీవం పోసుకుంది.
→యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి పక్కన చౌటుప్పల్‌ పురపాలక సంఘం పరిధిలోని లింగోజిగూడెంలో మూడున్నర శతాబ్దాల క్రితమే అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన దిగుడు బావిని హెచ్‌ఏండీఏ అభివృద్ధి చేసింది.
→ 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతులో నిర్మించిన ఈ దిగుడుబావిలో 60 అడుగుల మేర మెట్లు నిర్మించారు. దీనిని పూర్తిగా గ్రానైట్‌ రాయితో నిర్మించారు.
→ అప్పట్లో ఆ ప్రాంతంలోని దాదాపు 15 గ్రామాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు, బాటసారులకూ నీడనిచ్చేది ఈ బావి.
→ ఒకప్పుడు గోసాయిమఠంగా పిలిచిన ఈ ప్రాంతంలో అప్పటి పాలకులు ఇక్కడ విశ్రాంతి, విడిది కేంద్రాన్ని నిర్మించుకున్నారు.
→దాదాపు ఐదు అంతస్థులతో నిర్మించిన ఈ బావిలో భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా ఆర్చీలతో గదులను సైతం నిర్మించారు.
→ఫిబ్రవరిలో ఈ బావిని సందర్శించిన ప్లీచ్‌ ఇండియా ఛైర్మన్‌ ఈమని శివనాగిరెడ్డి బావి పునరుద్ధరణ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకొని బావిని అభివృద్ధి చేశారు.

161 అడుగుల పంచముఖి ఆంజనేయుడు

→కర్ణాటకలోని తుమకూరు జిల్లా బిదనగెరెలో ప్రపంచంలోనే ఎత్తయిన 161 అడుగుల పంచముఖి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం బసవరాజ బొమ్మై ఆవిష్కరించారు.
→బెంగళూరు - హాసన రహదారిలోని శనేశ్వరుడి సన్నిధిలో నిర్మించిన పంచముఖి ఆంజనేయుడి విగ్రహాన్ని ఇకపై ప్రజలు వీక్షించవచ్చు. 2014 నుంచి ఈ విగ్రహం తయారీ ప్రక్రియ ప్రారంభమైంది.