వార్తల్లో వ్యక్తులు

నలుగురు నాసా వ్యోమగాములతో నింగికి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్‌

→‘స్పేస్‌ ఎక్స్‌’ మరో మైలురాయిని అధిగమించింది. నాసాకు చెందిన నలుగురు వ్యోమగాములతో కెన్నడి స్పేస్‌ సెంటర్‌ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) బయల్దేరింది.
→16 గంటల ప్రయాణం అనంతరం వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌ చేరుకోనున్నారు. ముగ్గురు వ్యాపారవేత్తల అంతరిక్షయానాన్ని పూర్తి చేసిన రెండు రోజుల్లోనే స్పేస్‌ఎక్స్‌ నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకొంది.
→నాసా ఈసారి స్త్రీ, పురుష వ్యోమగాములను సమాన సంఖ్యలో ఐఎస్‌ఎస్‌కు పంపింది. వీరిలో భూ విజ్ఞాన శాస్త్రవేత్త అయిన నల్లజాతి మహిళ జెస్సికా వాట్‌కిన్స్‌ కూడా ఉన్నారు.
→గతంలో ఇద్దరు నల్లజాతి మహిళలు స్పేస్‌స్టేషన్‌కు వెళ్లినా, తక్కువ సమయమే ఉన్నారు. వాట్స్‌కిన్స్‌ మాత్రం ఎక్కువ రోజులే అక్కడ ఉండనున్నారు.
→రాబోయే రోజుల్లో ‘మూన్‌ ల్యాండింగ్‌ మిషన్‌’ కోసం నాసా రూపొందించిన జాబితాలో ఆమె ఇప్పటికే చోటు సంపాదించుకున్నారు.
→నాసా వ్యోమగామి, టెస్ట్‌ పైలట్‌ బాబ్‌ హైన్స్, అమెరికన్‌ వ్యోమగామి లిండ్‌గ్రెన్, ఇటలీ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమాన మాజీ పైలట్‌ సమంతా క్రిస్టొఫోరెటిలు స్పేస్‌ఎక్స్‌లో ప్రయాణిస్తున్నారు.
→తాజా అంతరిక్షయానంతో ఎలాన్‌ మస్క్‌ సంస్థ రెండేళ్ల వ్యవధిలోనే నాసాకు చెందిన ఐదుగురిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడంతో పాటు రెండు ప్రైవేటు ట్రిప్పులను పూర్తిచేసినట్టయింది.

ప్రపంచ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో గౌతమ్‌ అదానీ

→అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ సంపద విలువ మరింత పెరగడంతో, ప్రపంచ కుబేరుల జాబితాలో అయిదో స్థానాన్ని అధిరోహించారని బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ వెల్లడించింది.
→ ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ (91) సంపద విలువ 121.7 బిలియన్‌ డాలర్లు కాగా, అదానీ (59) సంపద విలువ తాజాగా 123.7 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు సంస్థ తెలిపింది.
→ అదానీ గ్రూప్‌లో 7 నమోదిత సంస్థలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ టోటల్‌ గ్యాస్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ విల్మర్‌ ఉన్నాయి.
→ వీటిల్లో ఆరు సంస్థల మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లకు పైగా ఉంది. ప్రపంచ కుబేరుల్లో అదానీ కంటే మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ (130.2 బి.డా.), బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ (167.9 బి.డా.), జెఫ్‌ బెజోస్‌ (170.2 బి.డా.), ఎలాన్‌ మస్క్‌ (269.7 బి.డా.) మాత్రమే ముందున్నారు.

గిన్నిస్‌లో భారత జెండా సరికొత్త రికార్డు

→జాతీయ పతాకానికి సంబంధించి భారత్‌ సరికొత్త రికార్డుకు యత్నించింది. సుమారు 77,700 మంది ప్రజలు భారత జాతీయ పతాకాలను ఏకకాలంలో గాల్లో అటూ ఇటూ ఊపుతూ 18 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టారు. ఈ మేరకు బిహార్‌లోని జగ్దీష్‌పుర్‌లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా 1857 తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరైన అప్పటి జగ్దీష్‌పుర్‌ రాజు వీర్‌కున్వర్‌ సింగ్‌ 164 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలు జాతీయ పతకాలను చేతబూని ఏకకాలంలో 5 నిమిషాల పాటు అటూ ఇటూ ఊపి రికార్డు నెలకొల్పారు. గిన్నిస్‌ సంస్థ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని లెక్కించడానికి ప్రత్యేక కెమెరాలు ఏర్పాటుచేయడంతో పాటు, చేతులకు బ్యాండ్‌లు అమర్చారు.
→2004లో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 56,000 మంది పాకిస్థానీలు తమ దేశ జాతీయ పతాకాన్ని ఏకకాలంలో గాల్లో అటూ ఇటూ ఊపుతూ రికార్డు నెలకొల్పారు.

భారత సంతతి నౌకాదళాధికారి శాంతి సేఠీకి కీలక బాధ్యతలు

→భారతీయ మూలాలు ఉన్న అమెరికా నౌకాదళాధికారి శాంతి సేఠీ, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా కీలక బాధ్యతలు చేపట్టారు.
→ సేఠీ 2010 డిసెంబరు నుంచి 2012 మే నెల వరకు అమెరికన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెస్ట్రాయర్‌ నౌక డికోడర్‌ కమాండరుగా వ్యవహరించారు.
→ ఒక అమెరికన్‌ యుద్ధనౌక అధిపతిగా భారత్‌ను సందర్శించిన తొలి మహిళా కమాండర్‌ కూడా ఈవిడే. 1993లో శాంతి సేఠీ అమెరికా నౌకాదళంలో చేరినప్పుడు మహిళాధికారులకు పరిమిత బాధ్యతలే అప్పగించేవారు.
→ తరవాత సంబంధిత చట్టాన్ని తొలగించడంతో ఆమె కమాండర్‌ హోదాకు ఎదిగారు. శాంతి తల్లి లిన్‌ ఎంగెల్‌బర్ట్‌ కెనడాలో పుట్టి అమెరికాకు వలస వచ్చి పౌరసత్వం తీసుకున్నారు. శాంతి తండ్రి 1960లలో భారత్‌ నుంచి అమెరికా వచ్చి స్థిరపడ్డారు.

75 ఏళ్ల వయసులో కరాటే రెండో బ్లాక్‌బెల్ట్‌

→కేరళ ఇడుక్కికి చెందిన ఎస్‌టీ అగస్టీ 58 ఏళ్లకు కరాటే సాధన ప్రారంభించి 75 ఏళ్ల వయసులో రెండో ర్యాంక్‌ బ్లాక్‌ బెల్ట్‌ సాధించారు.
→గతంలో కామాక్షి గ్రామ సర్పంచ్‌గా గెలిచిన అగస్టీ రోజులో ఎక్కువ సమయాన్ని మార్షల్‌ ఆర్ట్స్‌ సాధనకే వెచ్చిస్తారు. కరాటే నేర్చుకోవటం ప్రారంభించిన నాలుగేళ్లలోనే మొదటి ర్యాంక్‌ బ్లాక్‌ బెల్ట్‌ సాధించారు.
→తన సాధనను మరింత పెంచి ఆ తర్వాత సెకండ్‌ డాన్‌ బ్లాక్‌ బెల్ట్‌నూ సొంతం చేసుకున్నారు.

దేశ సైనికుల కోసం భవ్య జైన్‌ రోబో రూపకల్పన

→పంజాబ్‌లోని లుథియానాకు చెందిన అయిదో తరగతి విద్యార్థి భవ్య జైన్‌ భారత సైన్యానికి ఉపయోగపడే రోబోను తయారు చేశాడు. కేవలం రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశానని చెప్పాడు.
→‘‘నేను తయారు చేసిన రోబో పేరు జార్విస్‌. ఇది శత్రు భూభాగంలో ఏ చిన్న వస్తువునైనా కనిపెట్టగలదు. దీంట్లో 360 డిగ్రీల్లో పనిచేసే కెమెరా ఉంది. ఈ రోబోకు అమర్చిన చెయ్యి, వస్తువులను ఎత్తడానికి, దించడానికి ఉపయోగపడుతుంది. ఈఎస్‌బీ-32 అనే నెట్‌వర్క్‌ ద్వారా ఈ రోబో పనిచేస్తుంది. ఈ నెట్‌వర్క్‌ను ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసి రోబోను నియంత్రించవచ్చు’’ అని భవ్య జైన్‌ వెల్లడించాడు. అతి చిన్న వయసులోనే రోబో తయారు చేయడం వల్ల తనకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది.

పర్యావరణ శాస్త్ర పరిశోధనల్లో వెంకట మోహన్‌కు గుర్తింపు

→తిరుపతి వాసి, హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలోని ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆచార్యులైన డాక్టర్‌ ఎస్‌.వెంకటమోహన్‌ పర్యావరణ శాస్త్ర పరిశోధనల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచారు.
→ ప్రపంచంలో 437వ స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే బయో ఇంజినీరింగ్‌లో కూడా భారత్‌లో మొదటిస్థానంలో, ప్రపంచంలో 43వ స్థానంలో నిలవడం విశేషం.
→ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో దేశంలో ఎనిమిదో స్థానంలో, ఆసియాలో 226, ప్రపంచంలో 1256వ స్థానంలో నిలిచారు. ఈ ర్యాంకులన్నింటినీ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, రీసెర్చ్‌.కామ్‌ (2022), ఎ.డి సైంటిఫిక్‌ ఇండెక్స్‌(2022) వంటి సంస్థలు వెలువరించాయి. ఆచార్య వెంకటమోహన్‌ ఎస్వీయూ పూర్వ వీసీ ఆచార్య ఎస్‌.జయరామరెడ్డి తనయుడు.

వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

→భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అటారీ-వాఘా సరిహద్దును సందర్శించి, బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి సీజేఐ ఆయనే. సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) మ్యూజియాన్ని కూడా తిలకించారు. బైశాఖి పండుగ సందర్భంగా అక్కడకు వెళ్లిన ఆయన గౌరవార్థం ఆలయ వర్గాలు సంప్రదాయ ‘సిరోపా’ను అందజేశాయి.

ఐఎస్‌ఎస్‌కు ముగ్గురు పర్యాటకులు

→అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి ముగ్గురు పర్యాటకులను పంపింది. వీరు దాదాపు 10 రోజుల పాటు ఆ కేంద్రంలో గడపనున్నారు.
→దీంతో ఐఎస్‌ఎస్‌కు పర్యాటక యాత్రలను నిర్వహిస్తున్న రష్యా సరసన అమెరికా కూడా చేరినట్లయింది. తాజాగా బయలుదేరిన పర్యాటకుల్లో అమెరికాకు చెందిన లారీ కన్నోర్, కెనడా వాసి మార్క్‌ పాథీ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎయటేన్‌ స్టైబీ ఉన్నారు.
→ వీరు ఈ యాత్ర కోసం 5.5 కోట్ల డాలర్ల చొప్పున చెల్లించారు. వీరికి సహాయకుడిగా మైఖేల్‌ లోపెజ్‌ - అలెగ్రియా అనే వ్యోమగామి కూడా రోదసిలోకి పయనమయ్యారు.
→ ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా వీరు నింగిలోకి పయనమయ్యారు. కొన్నేళ్లుగా రష్యా ఇలాంటి యాత్రలను నిర్వహిస్తోంది.
→ గత ఏడాది ఒక సినిమా షూటింగ్‌ బృందాన్ని కూడా అక్కడికి తీసుకెళ్లింది. తొలుత దీన్ని వ్యతిరేకించిన అమెరికా, ఇప్పుడు తన మనసు మార్చుకుంది.

రికార్డు స్థాయికి భారత ధనవంతుల సంఖ్య

→భారత్‌లో కుబేరుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఏడాది కిందట 140 మందే ఉండగా ఇపుడు వీరి సంఖ్య 166కి చేరింది. వీరి సంయుక్త సంపద దాదాపు 26 శాతం వృద్ధి చెంది 750 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.56.25 లక్షల కోట్లు)కు చేరుకోవడం విశేషం. ఇక దేశంలో అగ్రగామి తొలి ముగ్గురి స్థానాలు యథాతథంగా కొనసాగాయి.
ఆసియాలోనూ తొలి రెండు స్థానాలు:-
→ముకేశ్‌ అంబానీ ఏడాది వ్యవధిలో కేవలం 7 శాతం వృద్ధినే సాధించినా దేశంలో, ఆసియాలో అగ్రగామి కుబేరుడిగా కొనసాగారు. ప్రపంచ వ్యాప్తంగా పదో స్థానంలో నిలిచిన ఆయన సంపద 90.7 బిలియన్‌ డాలర్ల (రూ.6.8 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఇక గౌతమ్‌ అదానీ ఏడాది వ్యవధిలో ఏకంగా 40 బిలియన్‌ డాలర్లను జత చేసుకుని 90 బి. డాలర్ల (దాదాపు రూ.6.75 లక్షల కోట్లు)తో ఆసియాలో, భారత్‌లో రెండో అత్యంత ధనవంతుడయ్యారు.
‘ఉక్కు’ మహిళ సావిత్రి :-
→ఇక ఉక్కు ధరలు పెరగడంతో సావిత్రి జిందాల్‌ ఈ ఏడాది అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలోకి చేరారు. మొత్తం జాబితాలోని 13 మంది మహిళా కుబేరుల్లో సావిత్రి కూడా ఒకరు. కొత్తగా వచ్చిన 29 మందిలో ఫాల్గుణి నాయర్‌ ఒకరు. నవంబరులో నైకాను లిస్టింగ్‌ చేయడం ద్వారా దేశంలోనే స్వయంశక్తితో ఎదిగిన మహిళల్లో అత్యంత ధనవంతురాలయ్యారు. గతేడాది ఐపీఓలకు బ్లాక్‌బస్టర్‌ ఏడాదిగా నిలిచి 60 కంపెనీలు కలిసి 15.6 బిలయన్‌ డాలర్ల దాకా నిధులను సమీకరించాయని ఫోర్బ్స్‌ గుర్తు చేసింది.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆదిత్యకు స్థానం

→మధ్యప్రదేశ్‌కు చెందిన హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆదిత్య ఒకేసారి 28 కత్తెర్లతో కటింగ్‌ చేస్తూ ఆకట్టుకొంటున్నాడు. ఉజ్జయిని నగరంలోని ఫ్రీగంజ్‌ ప్రాంతంలో తన తండ్రి, సోదరుడితో కలిసి ‘క్రియేషన్‌ వరల్డ్‌ - ది యునిసెక్స్‌ సెలూన్‌’ నడుపుతున్నాడు ఆదిత్య దేవర. యువకులకు తనదైన శైలిలో రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో సాధన చేసి ఒకేసారి 28 కత్తెర్లతో జుట్టును కత్తిరించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఇంతకుముందు ఈ రికార్డు 22 కత్తెర్లతో జుట్టు కత్తిరించిన ఇరాన్‌ యువకుడి పేరిట ఉండేది.

డోలో మందుబిళ్లపై భారతదేశం

→కేరళలోని కాసరగోడ్‌ జిల్లాకు చెందిన భవ్య 1.2 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ‘డోలో’ మాత్రపై భారతదేశ చిత్రపటాన్ని గీసింది. పద్నాలుగేళ్ల వయసులో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది.
→తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ బాలిక ఎనిమిదేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకుంటోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భవ్య తన కళకు మెరుగులు దిద్దుకుంది.
→బాటిళ్లపై సచిన్‌ తెందుల్కర్, మలయాళ నటుడు మమ్ముట్టి తదితరుల బొమ్మలను చిత్రించింది. తల్లిదండ్రుల సహకారం తనకుందని ఈ చిన్నారి అంటోంది.

కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు

→కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు నమోదైంది. బజగోలి జోగిబెట్టు నివాసి నిశాంత్‌ శెట్టి అరుదైన ఘనత సాధించాడు.
→బెల్తంగడి తాలూకా వేనూరులో జరిగిన కంబళ పోటీలో నిశాంత్‌.. 100 మీటర్ల దూరాన్ని 8.36 సెకన్లలోనే చేరుకున్నాడు.
→సీనియర్‌ విభాగంలో 10.44 సెకన్లలోనే 125 మీటర్ల దూరం పరుగెత్తాడు. నిశాంత్‌ శెట్టి గతంలో 100 దూరాన్ని 9.52 సెకన్లలో చేరుకున్నాడు.

అంటార్కిటికా సాహసయాత్రలో సత్తాచాటిన ‘ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ’ మానస గోపాల్‌

→అంటార్కిటికా భూభాగం, అక్కడి వాతావరణంపై పరిశోధనలు చేసేందుకు నిర్వహించిన ‘అంతర్జాతీయ అంటార్కిటికా సాహసయాత్ర - 2022’ను కాట్టాన్‌కులత్తూరు ‘ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ పూర్వ విద్యార్థిని మానస గోపాల్‌ విజయవంతంగా పూర్తి చేశారు.
→‘ఇంటర్నేషనల్‌ క్లైమేట్‌ ఫోర్స్‌ అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్‌ - 2022’లో పేరిట ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్వ్యూలకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
→అందులో ప్రతిభావంతులైన తొలి వందమందిలో మానస నిలిచారు. ఆమె యాత్రలో భాగంగా అంటార్కిటికా భూభాగంపై ‘ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ’ పతాకాన్ని రెపరెపలాడించారు.
→అంటార్కిటికాలోని అంతర్జాతీయ వాతావరణ నిపుణులతో కలిసి పనిచేశారు. మానస 2018లో ఎస్‌ఆర్‌ఎంలో బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారని ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
→తన పరిశోధనలకు ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని మానస తెలిపారు.

ఎలాన్‌ మస్క్‌ సంపద 282 బి.డాలర్లు: ఫోర్బ్స్‌

→టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సంపద 282 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21.15 లక్షల కోట్ల)కు చేరినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది.
→అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 183.6 బి. డాలర్ల (సుమారు రూ.13.77 లక్షల కోట్ల)తో పోలిస్తే దాదాపు 100 బి.డాలర్లు అధికం కావడం గమనార్హం.
→కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ గణనీయంగా పెరిగింది. 2020 ప్రారంభంలో ఈయన సంపద విలువ 2,660 కోట్ల డాలర్లు మాత్రమేనని డెయిలీ మెయిల్‌ పత్రిక తెలిపింది.
→2020లో ఆయన సంపద విలువ 11,000 కోట్ల డాలర్ల మేర పెరిగింది. ఫోర్బ్స్‌ చరిత్రలో ఇలాంటి రికార్డు ఇప్పటివరకు నమోదు కాలేదు. 2021లో మస్క్‌ సంపద మరో 9,000 కోట్ల డాలర్ల మేర పెరిగింది.
→ఫోర్బ్స్‌ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ సీఈఓ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ సంపద 16,740 కోట్ల డాలర్లు కాగా, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ (13,420 కోట్ల డాలర్లు), స్టీవ్‌ బాల్మర్‌ (9,700 కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో అతి చిన్న కూలర్‌

→అతి చిన్న కూలర్‌ రూపొందించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.. కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన పాలిటెక్నిక్‌ విద్యార్థి తిరుమలనీడి సాయి.
→రూ.50తో కేవలం 2.50 నిమిషాల్లో 12.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 17 మి.మీ ఎత్తుతో కూలర్‌ను సిద్ధం చేశారు. 1.8 వోల్టుల బ్యాటరీ, అతి చిన్న మోటారు, చిన్న ప్లాస్టిక్‌ డబ్బా, తీగ, అల్యూమినియం షీటుతో దీన్ని తయారు చేశారు.
→ఆన్‌లైన్‌ వేదికగా ఫిబ్రవరి 23న ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులకు కూలర్‌ తయారు చేసి చూపారు. దీంతో తక్కువ సమయంలో రూపొందించినట్లు గుర్తించి ఏప్రిల్‌ 4న ధ్రువపత్రం ఇచ్చారు.

గ్రామీణ శాస్త్రవేత్త వినూత్న ఆవిష్కరణ

→తెలంగాణ నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి మరో వినూత్న ఆవిష్కరణ చేశారు.
→కరోనా, సార్స్‌ ఒమిక్రాన్, డెల్టా తదితర బ్యాక్టీరియాలు, వైరస్‌లను ఎలక్ట్రాన్ల సాయంతో సంహరించే పరికరాన్ని రూపొందించారు.
→ సీసీఎంబీ, సీడీఎస్‌సీవో, విమ్టా, ఎంటాక్‌ ల్యాబ్‌ తదితర సంస్థలూ దీన్ని ధ్రువీకరించాయని, ఇన్‌స్టాషీల్డ్‌ పేరిట దీన్ని విడుదల చేయనున్నానని చారి తెలిపారు.
→ ఈయన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ సమీప బుద్వేలులో ఉంటు న్నారు. కరోనా మూలాన్ని తెలుసుకొని పలు ప్రయోగాలు చేసి ఈ పరికరం తయారుచేశారు.
→ అత్యల్ప సమయంలోనే ఇది వైరస్‌ను సంహరిస్తుంది. దీనివల్ల దుష్పరిణామాలుండవని సీసీఎంబీ తేల్చింది. ఈ పరిశోధనలకు సీసీఎంబీ, టీఎస్‌ఐసీ సహకరించాయి.

నాసా ఏమ్స్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ డిజైన్‌ కాంటెస్ట్‌లో రవీంద్రభారతి విజయం

→రవీంద్రభారతి గ్రూప్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నాసా ఏమ్స్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ డిజైన్‌ కాంటెస్ట్‌ - 2022లో ప్రపంచ మొదటి బహుమతితో పాటు మూడు గౌరవ పురస్కారాలు పొందినట్లు ఆ పాఠశాలల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది
→22 దేశాల నుంచి 3076 ఎంట్రీలు రాగా మొత్తం 17,000 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వెల్లడించింది. తమ పాఠశాలలు 2009 నుంచి నాసా ఏమ్స్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ డిజైన్‌ కాంటెస్ట్‌కు ప్రసిద్ధి చెందినట్లు వెల్లడించింది.
→ఈ విషయంలో దక్షిణ భారతదేశంలోనే తాము మార్గదర్శకులమని పేర్కొంది.